మబ్బులేమన్న కనిపిస్తున్నాయిర, రాం రెడ్డి అరుగుమీద మోకాళ్ళ మీద కుసుంట అడిగిండు.
ఏది పటేలా కొంచెం చల్లబడ్డేటట్టుంది, బట్ట తడిశే సినుకులన్న పడ్తె మంచిగుండు, నర్సిగాడు నోట్లె నోట్లె గొణిగిండు.
మూడో మనిషికి సరిగ్గా వినపడ కూడదేమో అన్నంత చిన్నగ వున్నయి వాళ్ళ గొంతులు.
జెర గట్ల బైటికల్ల తొంగి చూసి మేకపిల్లను చూరుకింద కట్టెయ్యరాదుర.
కట్టేసి నేను ఇంటిదాక పొయ్యి, పొద్దుగూకినంక వస్త, చెప్పుకుంట నర్సిమ్మ భుజాన టవలు తలకు చుట్టుకుంట లేసి నిలబడ్డడు. తూర్పు దిక్కు చూసి, ఏడనయ్య మబ్బులు ఇందాక వున్నట్టు కూడ లేవు రేడియాల ఏమన్న చెప్తరేమొ ఇనరాదు.
పటేలమ్మ ఈ లోపల వంటింట్లనించి పిలిచింది, నర్సిగాణ్ణి కొద్దిగ వుండమని. ఇంత సల్ల పోసిస్త తీస్కపో ఇంటికాడ వుత్తమనిషికూడ కాదు, వాని పెండ్లం అని చెప్పింది. లోపల్నించి ఒక సత్తు గిన్నెల సల్ల తీసుకొచ్చి ఇచ్చి, అట్లనే చెప్పులేసుకుంటున్న పటేలమ్మని రాం రెడ్డి అడిగిండు, ఎండ నెత్తిమీదికొస్తుంటె గిప్పుడెక్కడికి అని. పిలగాడు బడినించి వొచ్చేలోపల కోమటి సీను దుకాణానికి పొయ్యి రెండు రూపాయిల నూనె, కొంచెం చింతపండు తీసుక రావాలె, ఇంట్ల పిల్లగానికి పచ్చిపులుసన్న చేస్తె రెండు రోజులు వస్తది చెప్పింది, లక్ష్మి. షావుకారు తను పోతె మూడునెల్ల నించి బాకీ వున్న పైసలియ్యమంటడు, తనెక్కడ చిన్నబుచ్చుకుంటడో అని తన బదులు పోతున్న లక్ష్మిని చూసి ఇంకేం మాట్లాడాలో తెల్వలేదు. ఆ కోమటాయన మాత్రం ఏం చేస్తడు, వూరంత తనలాగనే అప్పు పెడితె, ఇంట్ల ఇద్దరు పిల్లలున్నరు, వాళ్ళు కూడ తిండి తినాలె కద, పాపం.
తనకు సంబంధం వచ్చినప్పుడు ఇంటికి లచ్చిమి వస్తదని ఒకటే మురిసిపోయ్యిన నాయినమ్మ గుర్తుకొచ్చింది. రెండు దినాల సంది నాయనమ్మ ఎందుకో బాగ యాదికొస్తున్నది. లక్ష్మి వచ్చింది కని వానలు రాలేదు. ఆ ఏడే కాదు గని అంతకు పదేండ్ల ముందల్నించి కూడ తనకు తెలిసి మంచి వాన పడ్డ రోజు లేదు. ఎప్పుడో చిన్నప్పుడు కుంట నిండేటట్టు పడ్డదట, అది కూడ రాత్రిపూట కాబట్టి తనకసలు తెల్వదు.
కాలం పొయ్యిందని రోజూ అనుకోవడమే కాని చెయ్యగలింది లేక చెర్లకు నీళ్ళొస్తె పొలం అయితదని ప్రతి కారు ఎదురు చూడడమే.
ఏదో ఆలోచనలల్ల వున్న పటేలుకు నర్సిగాడు మేక తీసుకొచ్చి పందిరి కింద కట్టేస్తుంటె ఈ లోకంలకు వచ్చినట్టు అనిపించింది. వాడే మళ్ళ కొన్త దూరంగ కుసుంట అన్నడు, పటేలా, నాలాగ సదువు గిదువు లేనోనికంటె తప్పదు కని, నీకేమైందని గీ వూళ్ళె పడున్నవు, పట్నం పోరాదు అన్నడు.
ఏమోరా, వురికురికి పాలు తాగాలని ఎప్పుడూ లేకుండె నిలబడి నీళ్ళన్న తాగుదామంటె కాలమేమొ గిట్ల పాయె.
రోజుల పదిసార్లన్న ఇన్నేండ్లనించి రాని వర్షాన్ని తల్చుకోకుండ వుండరు ఆ చుట్టు పక్క వూర్లలో ఎవ్వరు కూడ.
సామిగాడు హైద్రాబాదుల వుప్పరి పని చేసుకుంట బాగనే సంపాయించిండట, ఇంటికాడికి కూడ పంపుతున్నడట, తన వాదనకు బలముందని చెప్పక చెప్తున్నట్టు చూసిండు నర్సిమ్మ.
అవునురా నా సదువు కాంగనే అట్లనే పట్నంల ఉండి ఉంటె కొంతైన బాగుబడేటోన్నేమో కని, ఇప్పుడు పెండ్లం పిల్లలతోటి అక్కడికి పోవాలంటె మనకు తెల్వనియి శాన వుంటయిర. తనకు తెలిసి సామి గాడు ఎక్కణ్ణో గవర్నమెంటు భూమిల గుడిసెలల్ల బతుకుతున్నడు, వాని కొడుకుకు వరుసగ పది రోజులు జ్వరం దిగకున్నా గుడిసెల ఒక్కణ్ణే ఒదిలిపెట్టి పాణం పీకుతున్నా మొగుడు పెండ్లాలు పనికి పోతనే వుండేటోల్లు. హైద్రాబాదుల కొత్తగ పొయ్యి నిలదొక్కుకోవాలె అంటె మామూలోనికి మాటలు కాదు. తనకేమో రోజు కూలీ చెయ్యడానికి అభిమానం అనేదొకటి ఏడ్చింది కద.
సరే పటేల, సాయంత్రమొస్త మల్ల అని చల్ల పోసిచ్చిన సత్తు గురిగి తీసుకుని కాలి బాట పట్టిండు, నర్సిగాడు.
ఒక్క నిమిషమాగి తను కూడ అరుగు మీదనించి లేచి ఇంతకంటె మచి టైం దొరకదు అని, లోపలికి పొయ్యి బల్లపీట సొరుగు మూత పైకి లేపిండు. సొరుగుల రెండు రోజుల కింద పక్క పొలం పాలోన్ని ఎలుకల పేరు చెప్పి అడిగి తెచ్చుకున్న ఎండ్రిన్ డబ్బ. ఈ మందులు కూడ నకిలీవి పనికి రానివి వస్తున్నయని తెలుసు అందుకే ఎలుకలు బాగనే సచ్చినయని చెప్తె నమ్మకంగనె తెచ్చుకున్నడు. మూత తీస్తె వాసన ఘాటుగ వచ్చింది. సొరుగు మూస్తుంటె అప్పుడు కనిపించింది, ఎన్నడో నాయినమ్మతోటి దిగిన ఫోటో. చిన్నప్పుడు గిట్లనే ఒకసారి పొలంల ఇత్తనాలకు కూడ గింజలు రాలేదని ఇంట్ల నాయిన, అమ్మ బాధ పడుతుంటె, తననొక్కడిని పట్నంల సినిమా చూపిస్త అని తనెప్పణ్ణీంచో దాసుకున్న చిల్లర పైసలు అన్ని మూట గట్టి సర్వీసుల పట్నం తీసుక పొయ్యి, సినిమాకింక టైముంటె అక్కణ్ణే బజారుల వున్న సరస్వతి స్టూడియోల ఫోటో దిగుతందుకు ఆగిండ్రు . మీ నాయిన దీన్ని చూసన్న కొంచెం సంతోషపడ్తడు అని ఫోటో దింపించింది. అప్పుడు చెప్పిన మాటలు ఎన్నడు మరువలేదు, కశ్హ్ఠాలు మనుసులకే వస్తాయిర, చెట్లకు కాదు, నువ్వుకూడ నీ మనువనితోటి రేపెప్పుడైన వొచ్చి ఫోటో దిగి, అది సూసుకూంట నన్ను గుర్తుకు తెచ్చుకుంటవు కదా, అది చాలు అన్ని కశ్హ్ఠాలు మర్చిపోవచ్చు అన్నది. వారం తర్వాత వొచ్చిన ఫోటో ప్రింటు చూసుకుని ఒకటే మురిసిపోవుడు, నాయిన కండ్లల్ల కూడ ఎన్నడు చూడని నవ్వు.
ఒకసారి చేతిల ఎండ్రిన్ డబ్బా దిక్కు, సొరుగుల వున్న నాయినమ్మ దిక్కు చూసిండు, నాయినమ్మ నవ్వు మొఖం గుర్తొచ్చింది. ఫోటో తీసి బయట పెట్టి, డబ్బా తీసుకుని ఇంటిముందల వున్న పెంటబొంద దాక పొయ్యి ఎండ్రినంత పారబోసి, డబ్బా కూడ బొందలనే పడేసి వెనుకకు వస్తుంటె నాయనమ్మ కండ్లనించి రాలినట్టు మొఖం మీద పడ్డ రెండు చుక్కలతోటి ఆకాశం దిక్కు తిరిగి చూసిండు. తెప్పలాగ వచ్చిన మబ్బులు కనిపించినయి.
చింతపండు పొట్లంతోటి ఇంటికొచ్చిన లక్ష్మికి కొత్తగ గుమ్మంల కనిపించిన ఫోటో అర్ధం కాలేదు. పాత సందుక బయటికి తీసి పట్నం పోతున్నట్టు అన్ని సదురుకుంటున్న భర్త నవ్వు మొఖం ఇంకా అర్ధం కాలేదు.
కండ్లల్లో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతునెంచుకున్న రైతుకు వెన్నెముకై నిలిచే అమ్మలకు, నాయనమ్మలకు ఈ కథ అంకితం.