అటు వైపు మా మేనేజర్ జెఫ్, ఇటు వైపు చిరకాల మిత్రుడు హమీద్ మధ్యలో నేను.
ఇలాంటి చిక్కులో పడతానని నేనెప్పుడూ అనుకోలేదు.
జెఫ్ నాకే కాదు, హమీద్‌కి కూడా మేనేజరే.
ఆఫీసు కేఫెటేరియాలో పెద్దగా జనం లేరు. మూడేళ్ళ క్రితం ఇదే కేఫెటేరియాలో సీట్లు దొరక్క వెయిట్ చేయాల్సి వచ్చేది.
అసలే ఎర్రగా వుండే హమీద్ మొహం, నెత్తురు పొంగినట్లుగా మరింత ఎర్రబడింది.
జెఫ్‌లో కనిపించీ కనిపించని ఉద్వేగం.
మామూలుగా వుండడానికి వాళ్ళిద్దరూ చేస్తున్న ప్రయత్నం నాకర్థమైంది.
వాళ్ళ వైపు సూటిగా చూళ్ళేక పోయాను. అలాగని నా పాటికి నేను ఊరుకోవడం కూడా సబబు కాదనిపించింది.
ఇద్దరూ నా వైపే చూస్తున్నారు.
ఏం చెప్పాలో నాకు పాలుపోలేదు.
కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం!
మౌనంగా తల దించుకుని కూర్చున్నాను. ఏమో తప్పంతా నాదేనేమో?!
…
నేనూ, హమీద్ కేఫెటేరియాలో లంచ్ చేస్తూ-
రేపో మాపో ఇరాక్ మీద అమెరికా చేయబోయే యుద్ధం గురించి, యుద్ధం తర్వాత మళ్ళీ జాబ్ మార్కెట్ పుంజుకుంటుందా…అంటూ మొదలైన మాటలు…
రోజు రోజుకూ ఊడిపోతున్న ఉద్యోగాలు, లేటవుతున్న గ్రీన్ కార్డ్ అప్రూవల్స్ త్వరలో మా కంపెనీలో జరుగుతాయనుకుంటున్న లేఆఫ్‌ల దాకా వెళ్ళాయి.
రెండు నెలల క్రితం మా ఆవిడ పనిచేసే కంపెనీలో లేఆఫ్‌లు జరిగి, తన ఉద్యోగం పోయింది. నా ఒక్కడి జీతంతో ఇల్లు కొనడానికి చేసిన అప్పు వాయిదాలు తీర్చడం కష్టంగా ఉంది. ఇప్పటి పరిస్థితుల్లో నా వుద్యోగం కూడా పోతే, ఇంటిని అమ్మేసి…అయిదేళ్ళ క్రితం అమెరికాకు ఎలా వొచ్చామో అలాగే వెళ్ళిపోవాల్సిన స్థితి. ఆ ఆలోచనే మనసును వికలం చేస్తోంది.
హమీద్ ఏమనుకుంటున్నాడో తెలియదు గానీ, నాకైతే ఈ యుద్ధం జరిగితేనే బాగుంటుందనిపిస్తోంది.
“లేఆఫ్‌లున్నా నీకేమీ కాదులే” అన్నాడు హమీద్.
“ఈ సారి తప్పించుకోవడం కష్టమే” అన్నాన్నేను. ఇప్పటికి మూడు లేఆఫ్‌లు తప్పించుకున్నాను.
“హాయ్ గైస్” అన్న పలకరింపు విని వెనక్కి చూశాను. లంచ్ ప్లేటుతో మా టేబిల్ వైపే వస్తూ కనిపించేడు మా మేనేజర్ జెఫ్. ఈ మధ్యనే ఈ కంపెనీలో చేరాడు.
మేమిద్దరం ‘హాయ్’ చెప్పేక, “మీతో కలిసి కూర్చుంటే అభ్యంతరం లేదుగా?” అడిగేడు.
అభ్యంతరమేమీ లేదని, మాతో కూర్చోవడానికి ఆహ్వానించాం.
నా ప్రక్క కుర్చీలో కూర్చుని, మా ప్లేటుల వైపు చూస్తూ, “ఇండియన్స్ ఎక్కువ మంది శాఖాహారులు కదూ?!” అడిగేడు జెఫ్.
అవుననో, లేక అసలు ప్రశ్న విననట్లో ఊరుకుంటే బావుండేదని, ఇప్పుడనిపిస్తోంది.
“కాదు. ఎక్కువ భాగం మాంసాహారం తింటారు” అని ఊరుకోకుండా, “హిందువుల్లో ఎక్కువ మంది బీఫ్ తినరు” అని చెప్పాను.
“అంటే కొంత మంది తింటారన్న మాట” అని, ” హమీద్ శాకాహారి అనుకుంటా?” అన్నాడు జెఫ్… హమీద్ ప్లేటులోని సాలడ్‌ను చూస్తూ.
“కాదు. ఇంట్లో వండిన నాన్వెజ్ తింటాను” చెప్పాడు హమీద్.
“ఎందుకలా?” ఆశ్చర్యంగా అడిగేడు జెఫ్.
“వాళ్ళ ఆచారం ప్రకారం హలాల్ చేసిన మాంసాన్నే తినాలి” అన్నాన్నేను.
ఆశ్చర్యంగా హమీద్ వైపు చూస్తూ, “నువ్వు మజ్లింవా?” అడిగాడు జెఫ్.
అవునన్నట్లు నిలువుగా తలూపాడు హమీద్. మంత్రం వేసినట్లు అతడి మొహంలో ఉత్సాహం హఠాత్తుగా మాయమైంది.
“మనుషుల్ని మర్డర్ చేసేప్పుడుకూడా హలాల్ చేస్తారా… మీ మతంలో” అని నవ్వుతూ, ఎవరేనా గమనిస్తున్నారా అన్నట్లు, చుట్టూ ఒకసారి కలియజూసాడు.నవ్వులో వ్యంగ్యం ధ్వనించలేదు.
తుపాకి గుండు తగిలినట్లు ఉలిక్కిపడి, మాటలు వెలికి రాకుండా కంపిస్తున్న పెదాలతో ఏదో చెబుదామనుకుని…మళ్ళీ ఆ ఆలోచన విరమించుకున్నట్లు… నిస్సహాయంగా జెఫ్ మొహంలోకి ఒక సారి చూసి, తలదించుకున్నాడు హమీద్.
నాకు ఆశ్చర్యం కంటే భయమే ఎక్కువ వేసింది. వెంటనే తేరుకుని వాతావరణాన్ని తేలిక చేద్దామని “ఆహారం కోసం జంతువుల్ని చంపినప్పుడే…” అంటూ చెప్పబోతున్న నా మాటల్ని పట్టించుకోకుండా
“మూకుమ్మడి హత్యలు చేసేప్పుడు…ఒక్కసారి హలాల్ చేస్తే చాలా? సెప్టెంబర్11న ఎన్ని సార్లు హలాల్ చేసారో ” అన్నాడు జెఫ్. ఈ సారి మాటల చివరన నవ్వును అతికించలేదు. గొంతులో ఆవేశం కూడా పెద్దగా లేదు.
చివ్వున తల ఎత్తి, జెఫ్ వైపొకసారి చూసి, ‘వీడేమిటిలా వాగుతున్నాడు?’ అన్నట్లు నా వైపు చూసాడు హమీద్.
జెఫ్‌లో నాకు మరో మనిషి కనిపిస్తున్నాడు.
సంభాషణ ఎటువైపు వెళుతోందో అర్థమైన నాకు, ఎలా దారి మళ్ళించాలో తెలియలేదు.
హమీద్ మొహం అంత ఎర్రబడ్డం గత ఇరవై ఏళ్ళలో నేనెన్నడూ చూడలేదు.
…
నాకు పదిహేనేళ్ళప్పుడు, పదో తరగతి పరీక్షలయిన తర్వాత, హమీద్‌తో పరిచయమయింది నాకు.
నాన్నకు డబ్బవసరమొచ్చింది. పల్లెలో ఎక్కడా అప్పు పుట్ట లేదు.
ఇప్పుడైతే, పిల్లలం పెద్ద వాళ్ళమై అంతో ఇంతో సంపాదిస్తునాం. వూళ్ళో అమ్మ నాన్నలకు ఒక ఇల్లు కట్టించి, సౌకర్యంగా వుండేందుకు కావలసిన ఏర్పాట్లు చేసాం. కానీ అప్పట్లో, సామాజికంగా ఆర్థికంగా అట్టడుగు తరగతిలో వుండేది మా కుటుంబం.
నా చదువంతా స్కాలర్‌షిప్పుల మీదనే నడిచినా…అప్పుడప్పుడూ డబ్బు అవసరమయ్యేది.
మా పల్లెలో వాళ్ళకు మేమంటే గుర్రుగా వుండేది. ‘అప్పుల కోసం మా ఇళ్ళ చుట్టూ తిరిగే కన్నా, మా లాగా మీ పిల్లల్ని కూడా పనుల్లోకి పంపితే, పావలా బేడా దొరుకుతుంది కదా!’ అనేవాళ్ళే కానీ, అప్పిచ్చి ఆదుకునేవాళ్ళు కాదు.
ఊళ్ళో వాళ్ళ ధోరణి ఇంకా ఘోరంగా ఉండేది. నాన్న పల్లెలో వాళ్ళ మాటలకు ఏదో ఒకటి ఎదురు చెప్పేవాడు కాని, ఊళ్ళో వాళ్ళు ఎన్ని అన్నా తలొంచుకుని మౌనంగా వుండేవాడు.
క్రొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్ కరీం సాబ్ గారు చాలా మంచివారని విని, బ్యాంకులో అప్పేమైనా ఇప్పిస్తారేమో అడగడానికి బయల్దేరుతూ, నన్ను తనతో కూడా తీసుకుని వెళ్ళాడు నాన్న.
మేనేజర్ గారు ఆ రోజు బ్యాంకుకు రాలేదని, ఇంటి దగ్గర దొరకొచ్చని తెలిసింది.
నాకిప్పటికీ గుర్తు…కరీం సాబ్ గారి ఇంటి గుమ్మంలో మేము అడుగు పెడుతున్నప్పుడు, మా ఊరి మసీదు మైకు లోంచీ…”అల్లాహో అక్బర్” ప్రార్ధన వినిపిస్తోంది.
పది నిమిషాల తర్వాత, తెల్లగా మెరిసే పైజమా లాల్చీలో, నవ్వు మొహంతో పందిరి క్రింద వున్న మా దగ్గరకు వస్తున్న పొడవైన నడి వయస్సు మనిషిని చూసి, గుంజకానుకుని కూర్చున్న నాన్న గభాలున లేచి నుంచున్నాడు. దిక్కులు చూస్తూ నుంచున్న నేను, ఒకడుగు ముందుకేసి చేతులు కట్టుకున్నాను.
నాన్న చెప్పిందంతా విని, నన్ను ‘మార్కులెన్నొచ్చాయని’ అడిగారు.
నా మార్కులు చెప్పాక ‘వెరి గుడ్’ అని మెచ్చుకోలుగా చూసి, ‘ఏ గ్రూపులో చేరుతున్నావని’ అడిగారు.
‘ఎంపిసి లో’ అని చెప్పాన్నేను.
వాళ్ళబ్బాయి కి కూడా ‘ఎంపిసి లో సీటొచ్చింద’ని చెప్పారు. అప్పుడే బయటనుంచి వస్తున్న హమీద్‌ను పరిచయం చేసారు.
నాన్నను, అప్పు ఎప్పటికి తీర్చగలమో కనుక్కుని,’ఇంత చిన్న మొత్తానికి బ్యాంకు దాకా ఎందుకు? నేనిస్తాను తీసుకో…నువ్వు చెప్పిన టైముకు తిరిగి ఇచ్చెయ్’ అని ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చిచ్చారు. ఆయన మా ఊళ్ళో మిగిలిన సాయిబూల్లా కాకుండా, మా స్కూల్లో మాష్టారులా స్వచ్చమైన తెలుగులో మాట్లాడ్డం నన్నాశ్చర్య పరిచింది.
అప్పట్నుంచీ ఎప్పుడు డబ్బవసరమొచ్చినా, కరీం గారి దగ్గర తీసుకునేవాళ్ళం. నాన్న ఎన్నిసార్లు వడ్డీ లెక్క కట్టి ఇవ్వబోయినా తీసుకునే వారు కాదు. వాళ్ళ మతంలో వడ్డీ తీసుకోవడం తప్పట!
తండ్రితో పాటు హమీద్, అతడి తమ్ముళ్ళు, చెల్లెలు ప్రతి రోజూ దర్గాకు వెళ్ళి ప్రార్ధనలు చేసే వాళ్ళు.
నాకైతే గుడికి వెళ్ళడానికి జంకుగా వుండేది. మా గుడిసెలో, గుంజకు వ్రేళ్ళాడే దేవుని పటానికే దణ్ణం పెట్టుకునే వాణ్ణి.
ఒకే కాలేజీలో, ఒకే క్లాసులో చేరే వాళ్ళం కావడం, నేను తరచు హమీద్ వాళ్ళ ఇంటి ప్రక్కనున్న లైబ్రరీకి వెళ్తుండడం… మా స్కూల్లో చాలమంది పిల్లల్లా నన్ను అంటీ ముట్టనట్లు ఎడంగా ఉండకపోవడం, నన్ను చక్కగా పేరు పెట్టి పిలవడంతో హమీద్‌తో నా పరిచయం తక్కువ సమయములోనే పెరిగి, స్నేహమైంది.
ఇంటర్ మీడియెట్ పూర్తయ్యాక, నాకు ఇంజనీరింగ్‌లో సీటొచ్చింది. ఊళ్ళోవాళ్ళు మాత్రం, రిజర్వేషన్ల వల్లనే నాకు సీటొచ్చిందనీ, నా లాంటి వాళ్ళ వల్ల ప్రతిభ వున్న వాళ్ళకు అన్యాయం జరుగుతోందని ఎదురుగానే అనేవారు. వాళ్ళకెలా జవాబివ్వాలో తెలిసేది కాదు. నేరం చేసిన వాడిలా తలదించుకుని వాళ్ళకు దూరంగా వెళ్ళే వాణ్ణి. ఆ దగ్గరలో హమీద్ ఉంటే, అలా అన్న వాళ్ళతో తగువుకు దిగేవాడు. నా తెలివి తేటల గురించి, చదువులో నా రేంకుల గురించి వాళ్ళకు చెప్పే వాడు. ఇల్లాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టమనుకునే వాణ్ణి.
హమీద్ కూడా హైదరాబాద్‌లో ఒక మైనారిటీల ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు.
సెలవల్లో ఇంటికొచ్చినప్పుడు ప్రతి రోజూ కలుసుకునే వాళ్ళం.
ఇంజనీరింగ్ ఫైనలియర్‌లో సంక్రాంతి శలవలకు ఊరెళ్ళాను. హమీద్ కూడా అప్పుడు ఏదో పనిమీద ఇంటికి వచ్చాడు.
ఆ రోజుల్లో కువైట్‌ను ఆక్రమించిన ఇరాక్ మీద అమెరికా, దాని మిత్ర పక్ష దేశాలు దాడులు చేస్తున్నాయి.
క్రాఫు చేయించుకోడానికి ఒక చిన్న సెలూన్‌కు వెళ్ళాను నేను. సెలూన్ రేట్లు పెరగడం మీద, షాపతనికి, కష్టమర్‌కు వాదన జరుగుతోంది.
అక్కడెక్కడో యుద్ధంజరుగుతుంటే నువ్విక్కడ రేట్లెందుకు పెంచుతావని అడుగుతున్నాడొక కష్టమర్.
యుద్ధం వల్ల ధరలన్నీ పెరిగాయికదా! మేమూ బతకాలిగా అంటున్నాడు షాపతను.
అప్పుడే రోడ్డు మీద కొంతమంది ముస్లిం పిల్లలు, యువకులు, అట్టల మీద ఇరాక్ పై అమెరికా దాడిని ఖండిస్తూ నినాదాలు వ్రాసుకుని, వాటిని పైకెత్తి పట్టుకుని అరుస్తూ చిన్న ఊరేగింపుగా వెళ్తున్నారు.
అందులో హమీద్ కూడా వుండడం నన్నాశ్చర్య పరిచింది.
చుట్టు ప్రక్కల షాపుల దగ్గరి జనం ఊరేగింపును చూసి, ‘వీళ్ళిక్కడ అరిస్తే…అక్కడ అమెరికా వాడు యుద్ధం ఆపుతాడా’ అని హేళన గా నవ్వుకుంటున్నారు.
‘అక్కడెక్కడో యుద్ధం జరుగుతూ వుంటే ఇక్కడ సెలూన్‌లో రేట్లు పెరగ్గాలేంది, ఇక్కడి ఊరేగింపులు అక్కడి యుద్ధం మీద ఎందుకు ప్రభావం చూపలేవు?!’ అనుకున్నాను నేను. ఇప్పుడాలోచిస్తుంటే, తర్కానికి అందని అలాంటి ప్రశ్నల రోజుల్ని అంత త్వరగా ఎందుకు దాటి వచ్చానా అనిపిస్తోంది.
ఆ సాయంత్రం లైబ్రరీ దగ్గర హమీద్ కలిశాడు.
ప్రొద్దుట ఊరేగింపు గురించి అడిగాన్నేను.
ప్రతి చోట ముస్లింలను మిగిలిన మతాల వాళ్ళు అణగద్రొక్కడానికి ప్రయత్నిస్తున్నారని, ఏదో ఒక రకంగా ప్రతిఘటించకపోతే ముస్లింల మనుగడ కష్టమని…ఏఏ దేశాల్లో ముస్లింలు ఎలాంటి బాధలనుభవిస్తున్నారో…చెప్పుకొచ్చాడు.
ఒక అర్భకున్ని, బలవంతుడు అన్యాయంగా కొడుతూంటే, ఎక్కువమంది సానుభూతి అర్భకుడివైపే వుండాలి. బలవంతుడికంటే, మహా బలవంతుడొచ్చి ధర్మాన్ని రక్షించడానికి అర్భకుని పక్షాన నిలబడి పోరాడితే, మహా బలవంతునికే జనం జేజేలు చెప్పాలి. ఆరోగ్యకరమైన సమాజ స్పందన అలా ఉండాలని అప్పటి నా అభిప్రాయం.
హమీద్‌తో అదే విషయం చెబితే, ఒక నిమిషమాలోచించి “న్యాయం, ధర్మం బలహీనుల కోసమే తయారు చేయబడిన భావాలు. ఇరాక్ కువైట్‌ని ఆక్రమించుకుంటే తప్పు… అదే ఇజ్రాయెల్ పాలస్తీనా లోకి చొరబడి అక్కడి జనాలను తరిమి, సొంత జెండా పాతుకుంటే తప్పు కాదు. పైగా నువ్వు చెప్పిన మహా బలవంతులు అక్కడ అర్భకుల వైపు లేరు. బలవంతుల వైపే వుండి బలహీనుని మాడు మీద మరిన్ని మొట్టికాయలు వేస్తున్నారు”
“దానికీ దీనికి ఎలా ముడి పెడతావ్. ఇజ్రాయెలీలు చేసింది దురాక్రమణ కాదు…వాళ్ళ నేలను వాళ్ళు తీసుకున్నారు”
“నేనీ సారి వచ్చేటప్పుడు హైదరాబాదు నుంచి కొన్ని పుస్తకాలు తెచ్చిస్తాను. అవి చదువు. అప్పుడుగానీ నీకు అసలు విషయం తెలియదు. అయినా పాలస్తీనా వాళ్ళు ఎన్నో శతాబ్దాల నుంచీ వుంటున్న నేలను, ఇజ్రాయెల్ వాళ్ళు ఇప్పుడొచ్చి మాదంటే ఎలా? ఇలా లాభంలేదు. నేను వెళ్ళి జీహాద్‌లో చేరతాను” అన్నాడు హమీద్.
‘జీహాద్’ అన్న పదాన్ని జీవితంలో అప్పుడే మొదటి సారిగా విన్నాను నేను.
అంటే ఏమిటని హమీద్‌నే అడిగాను. అతడు వివరించాక, “బుద్దిగా చదువుకోక, ఆ గొడవలన్నీ మనకెందుకు?”అన్నాన్నేను.
అతడి మాటలు తమాషాగా కొట్టిపడేసేవి కాదనిపించింది అప్పుడే. స్నేహితుడు కాబట్టి కొన్నాళ్ళు హమీద్ గురించి ఆలోచించాను. తర్వాత ఫైనలియర్ పరీక్షల హడావిడి, పై చదువులకోసం ప్రిపేర్ కావడం తో సరిపోయింది.
ఇంజినీరింగ్ అయిపోయాక ఇద్దరం ఎంటెక్ చేయడానికి బరోడాలో సయాజీరావ్ యూనివర్సిటీలో చేరాం.
ఒకే హాస్టల్లో వుండే వాళ్ళం. అప్పట్లో అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువగానే వుండేవాళ్ళు. ఏడెనిమిది మంది ఒక బాచ్‌గా తయారయి మెస్‌కూ, యూనివర్సిటీకి కలిసి వెళ్ళడం, సాయంకాలాలు ఎవరో ఒకరి రూంలో చేరి మాట్లాడుకుంటూనో, పేకాడుకుంటూనో కాలక్షేపం చేయడం జరిగేది. ఎప్పుడూ అందరితో కలుపుగోలుగా నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడే వాడు హమీద్.
మాతోపాటు హమీద్ కూడా అప్పుడప్పుడూ హాస్టల్‌కు దగ్గరలో వున్న దక్షిణా మూర్తి ఆలయానికి వస్తుండేవాడు.
మా బాచ్ అందరం రంజాన్ మాసంలో హమీద్‌కు తోడుగా ఒక రోజు వుపవాసం వున్నాం. అప్పుడప్పుడు దేశ రాజకీయాల గురించి వేడి వేడిగా చర్చలు జరిగినా, ఎప్పుడూ మతాల ప్రస్తావన వచ్చిన గుర్తు లేదు. ఇప్పుడాలోచిస్తుంటే చాలా ఆశ్చర్యమేస్తోంది రాజకీయాలను, మతాలను విడదీసి మాట్లాడుకోగలిగిన ఆ రోజుల్ని తలచుకుంటే!
బాబ్రీ మసీదును కూల్చిన సమయంలో మాత్రం బరోడాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యూనివర్సిటీ కాంపస్‌లోనూ, హాస్టల్స్‌లోనూ, ఇంకా ఊర్లో చాలా చోట్ల ముందు జాగ్రత్తగా పోలీసులు గస్తీ మొదలెట్టారు. కొన్ని ప్రదేశాల్లో కర్ఫ్యూ పెట్టారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో, బరోడాలో పెద్దగా అల్లర్లు జరగలేదు. సూరత్‌లో హింస బాగా చెలరేగింది.
ఆ సమయంలో మాత్రం హమీద్ ఒక వారం రోజుల పాటు మాయమయ్యాడు, ఎవరికీ చెప్పకుండా.
ఏమయ్యాడో తెలియక అందరం కంగారు పడ్డాం. మన దేశంలో మన మనుషుల మధ్య, మనం జాగ్రత్తగా వుండడంలో అర్థం లేకపోయినా ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండడం మంచిదే అనిపించింది.
ఆ తర్వాత, బొంబాయిలో బాంబు ప్రేలుళ్ళు, కాశ్మీరులో కల్లోలాలు…పెచ్చుపెరిగిన ఉగ్రవాదపు అకృత్యాలు…ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి విధ్వంసకర చర్య వెనుక పాకిస్తాన్ ఉందనడం…గొడవలన్నింటికీ అసలు కారణం కేవలం మతమే అన్న భావాన్ని స్వప్రయోజనాల కోసం విపరీతంగా ప్రచారం చెయ్యడం…అంతా చాలా మాములుగా జరిగిపోయింది.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాదులో మతకలహాలు మటుమాయం కావడం, తర్వాత వచ్చిన ఒకరిద్దరు ముఖ్యమంత్రుల హయాంలో మతకలహాలు పెట్రేగి పోవడం గమనించినప్పుడు…’మతకలహాల’కు, స్వార్థ రాజకీయాలకు ఎలాంటి సంబంధముంటుందో తెలిసొచ్చింది.
చదువు అయిన వెంటనే, వుద్యోగం కోసం సౌదీ వెళ్ళి, మూడేళ్ళ క్రితం అమెరికా వచ్చాడు హమీద్. నేను పని చేస్తున్న కంపెనీలోనే అతడికీ ఉద్యోగం వచ్చింది. అప్పట్లో మాతో కలసి చదువుకున్న మరో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా దగ్గర్లోనే ఉండడంతో, అందరం తరచుగా కలుసుకుంటుంటాం.
ఇన్నేళ్ళ పరిచయంలో హమీద్ ఇంతగా ఆవేశపడ్డం నేనేన్నడూ చూడలేదు.
…
“ఆ మధ్య ఇజ్రాయెల్ యూనివర్సిటిలో పేలిన బాంబుల గురించి విన్నారా? మా బ్రదర్‌కు ఒక కాలు పోయింది” అన్నాడు జెఫ్.
హమీద్ మాట్లాడబోయాడు.
“ఇంకెంత మందిని పొట్టన పెట్టుకుంటారో…ఉగ్రవాదుల్ని, వాళ్ళకు మద్దతు నిచ్చే వాళ్ళను నాశనం చేయాలి. నాకేగానీ అధికారం ఉంటే…ఈ దేశంలోని మజ్లింలనందరినీ…”వాక్యాన్ని మధ్యలోనే ఆపేశాడు జెఫ్. మరో సారి చుట్టూ చూశాడు.
వంచిన తల ఎత్తి సూటిగా జెఫ్ మొహంలోకి చూశాడు హమీద్.
నన్ను రక్షించడానికన్నట్లు జెఫ్ సెల్ మ్రోగింది. సెల్‌లో నంబర్ చూసుకుని, “ఎక్స్‌క్యూజ్మీ” అంటూ ఒక మూలకు వెళ్ళి, రెందు నిమిషాల్లో తిరిగి వచ్చి “నేనర్జంటుగా వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం”అని, కోక్ గ్లాసును చేత్తో పుచ్చుకుని కుర్చీ లోంచి పైకి లేచాడు.
కాస్త తెరిపిన పడ్డట్లైంది నా పరిస్థితి.
జెఫ్ అటు వెళ్ళగానే, హమీద్ కూడా బయల్దేరడానికి కుర్చీ లోంచి పైకి లేచాడు.
నా ముందున్న ప్లేటును కాస్త ముందుకు జరిపి, గ్లాసులోని మంచి నీళ్ళను స్ట్రాతో గబగబా తాగేసి, నేనూ లేచాను.
“నేనీ రోజు లంచ్ మానేసుంటే, ఈ గొడవ జరక్కపోను ” అన్నాన్నేను హమీద్ తో.
“ఈ రోజు కాకపోతే మరో రోజు జరిగేది. వీడితో కాకపోతే ఇంకొకడితో…నువ్వేమీ ఫీల్ కాకు” అన్నాడు.
హమీద్ చెప్పింది నిజమే అయివుండొచ్చు. ఈ సన్నివేశానికి, నా వరకు తెర ఓ అరగంట క్రితం లేచింది. గతాన్ని త్రవ్వుకుంటూ పోతే మూలాలు ఎన్నో బయటపడొచ్చు!
“నీకు జమాల్ గుర్తున్నాడా?” అడిగేడు.
“జమాల్…?”
“మేము అపార్మ్టెంటు మారినప్పుడు, ట్రక్కు తీసుకోడానికి వెళ్ళాం…”
గుర్తొచ్చింది నాకు. అతడు పాలస్తీనా నుంచి చదువు కోవడానికి అమెరికాకు వచ్చి, ఇక్కడే సెటిలయ్యాడు. ఒకసారి హమీద్ వాళ్ళ ఇంట్లో కలిశాను.
“గుర్తున్నాడు. అతడికేమయింది?” అడిగాను నేను.
“ఏమీ కాలేదు. ఈ జెఫ్‌గాడు, వాళ్ళ బ్రదర్ కాలిరిగిందని గింజుకుంటున్నాడు. పాలస్తీనా ప్రాంతంలో, ఇజ్రాయెలీల ఆధీనంలో వున్న వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో ప్రతి ఏటా స్కూలు ఫైనల్ పరీక్షలు జరిగేటప్పుడు … స్టూడెంట్స్‌ను అరెస్టులు చేసి, పరీక్షలయిపోయాక వదిలి పెడతారట. వాళ్ళ ఏడాది చదువూ ఏట్లో కలిసినట్లే. ఎలాంటి కారణాలు చూపకుండా అరబ్బులను నిరవధికంగా నిర్బంధిస్తుంటారట! జమాల్ వాళ్ళ ఇద్దరన్నలు అలా నిర్బంధించబడి పదేళ్ళవుతోందట!! ఇప్పుడు వాళ్ళెక్కడున్నారో, అసలు బతికున్నారో లేదో కూడా వీళ్ళకు తెలియదట. అవన్నీ బయటకు కనిపించవ్! యూనివర్సిటీలో పేలిన బాంబులనే టీవీలలో చూపిస్తారు…వాటినే వీళ్ళంతా చూస్తారు” అన్నాడు హమీద్.
“చదువుకునే చోట బాంబులు వేయడం తప్పు. అలాగే పిల్లలను పరీక్షల కెళ్ళకుండా నిర్బంధించడం కూడా తప్పే”
“ఒడ్డున కూర్చుని, అలా తటస్థంగా … లౌకికంగా, ప్రవక్త లాగా మాట్లాడ్డం బాగానే వుంటుంది. రోజూ అనుభవించే వాడికి తెలుస్తుంది అసలు బాధ” అన్నాడు హమీద్. గొంతులో ఆవేశం పెరుగుతోంది.
“అంటే పాలస్తీనా వాళ్ళు చేస్తున్నది మంచి పనంటావా?”అన్నాన్నేను, విసుగ్గా.
“ముప్పై అయిదేళ్ళుగా ఇజ్రాయెల్ దురాగతాలననుభవించి, ఇక భరించలేక ఆత్మాహుతి దళాలుగా మారిన పాలస్తీనా వాళ్ళు ఉగ్రవాదులు…క్రూరులు…నరరూప రాక్షసులు! బలహీనుడు అన్యాయంపై తిరగబడితే…దాన్ని ఉగ్రవాదమంటున్నారు. మరి బలవంతుడు అన్యాయంగా అందరిముందు బలహీనున్ని తన్నడాన్ని ఏమనాలో? ఎప్పుడో ఈ పాము చీమల చేతిలోనే పాఠం నేర్చుకుంటుంది”అన్నాడు హమీద్.
హమీద్ వైపు చూస్తూ ఆలోచిస్తున్నాను.
“నీకింకొకటి తెలుసా… బిన్ లాడెన్, సద్దాం హుస్సేన్ లను ఒకప్పుడు నెత్తినెక్కించుకున్నది వీళ్ళే! మళ్ళీ ఇప్పుడు వాళ్ళను వెంట పడి తరుముతున్నదీ వీళ్ళే!!” అన్నాడు.
మోహినీ భస్మాసురుడి కథ గుర్తొచ్చింది. అయినా మనకి కష్టం, నష్టం జరగనంతవరకు ఎవడెలా చస్తేనేం? ఏ దేశం ఏ వల్లకాట్లో కాలితే నేం!
మళ్ళీ తనే “నీకు తెలుసా 911 తర్వాత నుంచీ మేమెలా బతుకుతున్నామో? అందరిలా స్వేచ్చగా మేము బయటకు వెళ్ళలేకపోతున్నాం. క్రొత్త వాళ్ళను కలిసినప్పుడు, సందర్భం వచ్చినా మేము ముస్లింలమని చెప్పుకోడానికి మా ఆవిడ సొంకోచిస్తోంది…సాధ్యమైనంత వరకు ఇంట్లోంచి బయటకు రాకుండా వుండడానికి ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ 11 జరిగిన క్రొత్తల్లో, ప్రార్ధన చేసుకోడానికి మసీదుకు వెళ్ళడానిక్కూడా భయపడే వాళ్ళం. ఈ ఆఫీసులో నేను ముస్లింనని తెలిసిన వాళ్ళు నాతో ఎలా బిహేవ్ చేస్తున్నారో నీకు తెలియదు…”
911 క్రొత్తల్లో స్థానికులు, మమ్మల్ని కూడా అనుమానంగా చూడ్డం నాకు అనుభవమే!
హమీద్ కళ్ళలో సన్నటి నీటి పొర!
నా మస్తిష్కంలో ఎక్కడో చిన్న కదలిక. హమీద్‌కు ఎలాంటి మాటలు చెప్పి ఓదార్చాలో తెలియలేదు.
“ఇవేమీ పట్టించుకోకు. ఏదో బ్రతుకుదెరువు కోసం ఇంత దూరమొచ్చాం. తలొంచుకుని మన పనేదో మనం చేసుకుంటే సరిపోతుంది. ఎవడేమి అన్నా పట్టించుకోవద్దు” అన్నాన్నేను.
అతడి మొహం చూస్తే బాధా, జాలి!
…
ఆ రోజు సాయంత్రం పని మీద జెఫ్‌ను కలవాల్సి వొచ్చింది.
లక్కీగా నేను వెళ్ళేసరికి జెఫ్ తన ఆఫీసులో వున్నాడు.
విష్‌చేసి, అప్పటి వరకు పూర్తి చేసిన పనిగురించి చెప్పాను. తర్వాత రాబోయే మూడు నెలల్లో నేను చేయ దలచుకున్న పనుల లిస్ట్ చెప్పాను.
ఇదంతా త్వరలో జరగబోతున్న లేఆఫ్‌లో నా పేరు లేకుండా చూసుకోడానికి నేను పడుతున్న పాట్లు.
వున్నట్టుండి హమీద్ ప్రస్తావన తెచ్చాడు జెఫ్.
“ఎందుకతడు అంత ఆవేశపడుతున్నాడు. నేనేమైనా తన ఫీలింగ్స్‌ని హర్ట్ చేసానా?” అడిగాడు జెఫ్.
ఏం చెప్పాలి?
అంతలో జెఫ్ ఫోను మ్రోగింది. నన్ను కూర్చో మని సైగ చేసి ఫోనందుకున్నాడు.
హమీద్‌తో జెఫ్ అలా మాట్లాడకూడదని అంతరాత్మ నివేదన- అదే విషయం జెఫ్‌కి చెబితే, అతడితో సంబంధాలు దెబ్బ తినొచ్చేమోనని వివేకం హచ్చరిక!
హమీద్‌ను వెనకేసుకొచ్చినంత మాత్రాన, జెఫ్ భావాల్లో, జెఫ్‌లాంటి వాళ్ళ భావాల్లో మార్పులు తేగలనన్న నమ్మకం నాకు లేదు. అదీగాక, జెఫ్ ముందు నేను నా స్నేహితుని గురించి తప్పుగా మాట్లాడ్డం లేదు. స్నేహానికి ద్రోహం చేయడం లేదు.
పల్చటి నీటి పొర వెనుక నుంచి నన్ను నిశితంగా గమనిస్తున్న హమీద్ కళ్ళు!
ఇరవైయ్యేళ్ళ స్నేహం, నా చదువుకు వాళ్ళ నాన్న గారు చేసిన సాయం, నా తరఫున ఊళ్ళో వాళ్ళతో దెబ్బలాడిన హమీద్ ధైర్యం, ‘జీహాద్’లో చేరతానన్నప్పటి ఆవేశం… భుజాలపై చేతులేసుకుని కలిసి క్లాసుల కెళ్ళిన రోజులు…ఒక్కసారిగా గుర్తొచ్చి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసాయి.
కేవలం ఉద్యోగాన్ని కొన్నాళ్ళు నిలుపుకోడానికి నేనెంత దిగజారుదామనుకున్నానో…యుద్ధ భూమిలోని శవాల వల్ల కలిగే లాభాల గురించి ఎలా ఆలోచించానో…నో…నో…పెద్దగా అరవాలనిపించింది. నాకు తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి.
జెఫ్ గమనిస్తే బాగోదని, తల వెనక్కి త్రిప్పాను. అటుగా వెళుతున్న హమీద్ కనిపించాడు. అంతే ఇక ఆగలేక పోయాను!
గభాలున కుర్చీ లోంచి లేచి, పరుగులాంటి నడకతో హమీద్ దగ్గరకు వెళ్ళి, అతడి చేయి పట్టుకుని, జెఫ్ రూములోకి తీసుకొచ్చాను.
ఏమిటిదంతా అన్నట్లు చూస్తున్న జెఫ్ తో “సారీ జెఫ్…మధ్యాహ్నం నువ్వు హమీద్‌ను అతడి ఫీలింగ్స్‌ను హర్ట్ చేశావ్. నేనీ విషయాన్ని మేనేజ్‌మెంటుకు రిపోర్ట్ చేయదల్చుకున్నాను. పద హమీద్, హెచ్చార్ వాళ్ళతో మాట్లాడాలి…మంచి లాయర్నీ వెదకాలి…” అంటూ, హమీద్ చేతిని నా చేతితో పుచ్చుకుని, జెఫ్ రూములోంచి బయటకొచ్చాను.