మిత్తవ

ఏం మడిసో! ఇల్లొదిలి బెట్టిపోయి, ఇయ్యాల్టికి పది రోజులైంది. ఒక మంచి లేదూ … చెడూ లేదూ, చచ్చాడో .. బతికేడో … కూడా తెలీదు.

ఇట్టాంటోణ్ణి బెట్టుకోని ఎట్టజేసేది సంసారం. ఇన్నాళ్ళ నుండీ ఇల్లూ బళ్ళు బట్టకుండా లుంగీ పంచె సంకలో బెట్టి, నీటుగా సోకు జేసుకుని తిరుగుతుండే, తిరిగితే తిరిగేళ్ళే! అమ్మా అబ్బా అదుపాజ్ఞలు లేకుండా బెరిగాడు. ఎప్పుడన్నా అవసరమైతే ఒక చెయ్యేస్తాళ్ళే అనుకుని నాపాటికి నేను ఒంటిగానే పాకులాడతంటిని. రొంటినొక బిడ్డని, చేతినొక బిడ్డ నేసుకుని పోరకాడతావుంటే, మగరాయుళ్ళా పనిజేస్తుందిరా అనుకునేవోళ్ళు. పుట్టి బుద్దెరిగినాక ఇంత కటీనమైన మడిసిని నేనెక్కడా చూళ్ళేదు. వొచొచ్చెచ్చె ఈ ఊబిలో పడ్డాన్నేను. ఇయ్యాల్టికియ్యాల చేలోనించి ఒక్క గింజె ఇంటికి రాకపోయినా, ఇన్నాళ్ళూ ఎట్టోకట్ట నెట్టుకొచ్చేనా! చేలో పనుండప్పుడు ఇరగ బొడిసేడా! అయ్యో రామా! లెక్కకు మడిసే గానీ, అబ్బో… అబ్బో కొరివితో తల గోక్కున్నట్టే గదా!

“పోతా పోతా నామానాన నన్నొదిలేస్తే, మళ్ళీ యాడ  బాగుపడి పోతానో నని నిన్నొక దాన్ని పంపకం జెసి పోయేడు. నిన్ను గూడా యెంట యేసకెల్తే, నేనూ నా పిల్లలూ ఏ నుయ్యో గొయ్యో చూచుకునే వాళ్ళం గదా!

ఏ మాటకీ ముగసవు గదా ముసిల్దానా, నా చావు గూడా సక్రమంగా నన్ను చావనియ్యరా! నా యెదాన బడి చస్తుండారు. నెత్తీ నోరు ఎంత గొట్టుకున్నా చెవిటి మేళమైపాయె. మణుసులో మాట బైటికి చెప్పుకుందామన్నా ఒక మడిసి తోడు లేకపోయే.

కళ్ళు నుండి బొటాబొటా కారే కన్నీళ్ళని తుడుచుకుంటూ, “ఏమే! ముసిల్దానా! ఏడి? నీ కొడుకు. పదిహేను రోజులైంది. అర్థంరేత్తిరికాడ లేసిపోయినోడు ఇదే పోవడం. ఇంతవరకు అంతూ దరీ లేకపోయే. అంటూ గోయిందమ్మ అత్త దగ్గిర గంట నుండీ నోరు బోయేటట్టు ఇంతెత్తున అరుస్తానే ఉంది. అయినా ఏం లాభం, చెవిటోడి ముందు శెంకం ఊదినట్టే గదా!

వయసుడిగి పోయి ముఖమంతా ముడతలు బడి, చర్మం వేలాడుతూ కళ్ళు మసకలు కమ్మి, బోటుకర్రతో తిరగే సుబ్బమ్మకి మనసు నిండా గుబులు గుబులుగా ఉంది. మెళ్ళో పసుపుతాడు పడిన్నాటి నుండీ, రెండు కాళ్ళూ ఒక చోట పెట్టిన బాశాలి గాదు. ఎప్పుడూ ఎవుర్నీ పల్లెత్తు మాటన్నదీ గాదు.

అట్టాంటిదీ కాని కాలమొచ్చి, కాలూజెయ్యీ ఆడకుండా జేస్తందే! వాడు ఇల్లు బట్టకుండా తిరిగినా తానే అన్నింటికీ నెట్టుకొచ్చింది. ఎప్పుడూ నోట్లో నాలిక ఆడిన పాపాన పోలేదు. అది మాత్రం ఏం జేస్తది. పాపం కాలూ జెయ్యాడక పోయె. ఎవురి బిడ్డయితేమి? కాలికి బలపం గట్టుకొని తిరిగి తిరిగి చేసింది గదా!

ఇన్నాల్టికీ కాని కాలమొచ్చి దాని చేత ఇష్టమొచ్చినట్టు పిచ్చి పట్టిన దానిలా మాట్టాడిస్తంది. యాభై అరవై సంవత్సరాలుగా ఇట్టాంటి పిండిమేలపు కాలాన్ని చూసెరగను గదా! ఇరవై ముప్పై ఎకరాల ఆసామి గూడా ఊరూ వాడా వొదిలి పెట్టుకోని, ఒకయ్యకాడ చెయ్యి జాపి దేబిరిచ్చాల్సొస్తందే.

సొంతగోళ్ళుమై, గొడ్డులాగ శాకిరీ జెసి సముదాయిచ్చకొస్తంది. కాబట్టి ఇంతకాలం నాటకం సాగింది. ఉండ పొలానికి, ఇంకొంత మగతాకీ, పాలికీ దీసికొని చేస్తంటే దేనికీ దిగుల్లేకుండా తిప్పుతా తిరుగుతా ఉండాము.

సచ్చేడుండాడో ముసిలోడు. “గోయిందా! ఎందుకీ? మనకి ఉండదాంటో చేసుకుని కలోగంజో తాగుదాం గదా! ఎందుకంతా నాదేనని వాటేసుకుని పరిగెత్తుతావు” అని పై మాట కనేవోడు గానీ, కోడల్ని జూసుకోని ఎంతగా మురిసిపోయేవోడో! మొగుడు యెదవతనంగా తిరుగుతున్నా ఆడగూతురైతే మాత్రమేం! అర్థం రేత్తిరికాడ లేసిందంటే మళ్ళీ ఎప్పుడో కునుకుదీసేది.

అట్టాంటిది ఇప్పుడు మొగతాలోళ్ళొచ్చి ఇంటి మీద పడ్డారా! మట్టిలో బోసిన గింజెలు మట్టిలోనే మసైనియ్యా. అప్పులోళ్ళోక తట్టు, కూలోళ్ళొక తట్టు పీక్కతింటా ఉండారా! ఇంట్లో తింటానికి ఇత్తు లేక పాయె.

సాగినన్నాళ్ళూ సాగించుకున్నా, అటొకపుల్లా ఇటొకపుల్లా ఎగదోసి కాలం గడిపినోడయిపోయె. ఇయ్యాల యాడదాడ ముగసకపోయేతలికి వాడు కాలూ జెయాడక యాడ దేశాలు బట్టుకు తిరుగుతున్నాడో!

ఊళ్ళో మాత్రం ఇంకెవురు మిగిలుండారు. వొయిసులో ఉండోల్లందరూ పిల్లా జెల్లని సంకనేసుకుని, ఊరిడిసిపెట్టి నాలుగు వారాలైనా అయుంటది. ఇంకా ఈడికి ఆశచావక ఇంతకాలం గబ్బిలంలా ఇంటినే పట్టుకుని యాలాడేడు. తీరా బోయాక, పోయినోడు పోయినట్టే ఉండాడు. ఒక్క జాబుముక్కయినా రాయలేదు. యాడ అష్టకష్టాలు పడతండాడో బిడ్డ. ఎప్పుడూ ఎవుర్నీ చెయ్యి జాపినోడే కాదు. ముడ్డెనక చేతులు బెట్టుకుని, గోయిందునే అదిరించి బెదిరించి అయిన కాడికి పట్టుకెళ్ళి రాజకీయాలనీ, మీటింగులనీ చెడతిరిగి తగలేసుకొచ్చేవోడు అనుకుంటూ గోయిందమ్మ మొకంలోకి జూసి కళ్ళనీళ్ళు బెట్టుకుంది.

“గోయిందా! నువ్వు మాత్రం ఏ జేస్తావు లేమ్మా. అసిదోడు లేకుండా నెట్టుకొస్తున్నావు. ఇప్పుడన్నీ ముగసకపోయినియ్యి. నన్నేమో ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది. నీకెట్టా తొస్తే అట్నే చెయ్యమ్మా” అంది ముసలమ్మ.
“అది సరేలే! ఎవురికి తప్పినా నాకు తప్పేదేముంది. యాడసచ్చాడో ముదనష్టపు ముండా కొడుకు. నాకు పంపకమైనందుకు అనుకోవాల ఇంటో ఇత్తు లేదా! కల్లంలో గింజెలేదా! బావుల్లో సుక్క నీళ్ళు లేవా!

ఇంక నాకేం పాలు బోవడం లేదు. నువ్వొక పనిజెయ్యి. మనూళ్ళోనే ముసిలీ ముతకలకి గెంజికాసి పోసే కేంద్రాలు బెడతారంట. నువ్వాడకి బోయి కాస్తె గెంజన్నా తాగి ఊపిరి నిలుపుకో! నేనింక దేశం మీద బడతా. ఇట్టాంటప్పుడు గూడా మనిషి అదరువు లేకపోతే ఏం కోసక తింటానికా మొగుడనేవోడు మరీ ఎంత అర్దానం బతుకైపోయింది” అంటూ పిల్లల్ని దీసుకుని గుడ్డల సంచీని సంకన తగిలించుకుని పందిరి నీడ నుండి గోయిందమ్మ బయట పడింది.

తలపైకెత్తి పొద్దుకి చెయ్యడ్డం బెట్టి పైకి బార జూసింది. అయ్యో! పొద్దు నడినెత్తి కొచ్చినట్టుందే. బస్సు పోద్దేమో అనుకుంటా, ఒక్కసారి మళ్ళీ ఇంటిని తేరిపార జూసింది. కళ్ళమ్మిట నీళ్ళు బొట బొటా కారాయి. ఇన్నేళ్ళ శాకిరీలో సంపాయించింది పెద్ద గుండు సున్నా అని తలుచుకునే సరికి ఏడుపాగలేదు. ఆ ఏడుపు జూసి పిల్లలిద్దరూ బిక్కమొహం వేసి, ఎందుకమ్మా ఏడుస్తుండావు. అమ్మా యాడవ బాకమ్మ! నాన కాడికే గదా పోతంది! ఇంకెందుకమ్మా ఏడుస్తావు అంటూ చెరో వైపున చీర పట్టుకుని లాగసాగేరు.

నా ఇల్లూ, నా సంసారమూ నాగ్గాకుండా పోతుందే! అనుకుంటూ దారి బట్టింది. పొలాల్లో నుండి చక్కగా పాపిటి దీసినట్టుండే అడ్దరోడ్డునే నడుస్తుంటే కడుపు తరుక్కుపోతంది. చుట్టూ పొలాలన్నీ యాడలేని నిశ్శబ్దాన్ని దిగమింగి బావురుమంటున్నాయి. ఏ బాయి దగ్గరా పదిమందికి తగ్గకుండా సందడి సందడిగా ఉండే పొలాలు, చూపానినంత దూరం ఎక్కడా పురుగన్నమాట లేకుండా దిబూసి మంటున్నాయి.

2

“పిల్లల్నేసుకోని యాడకెల్తన్నావే కూతరా!” అంటూ వొడివొడిగా అడుగులేసుకుంటూ వెళ్తున్న తులశమ్మను కలుసుకొని “అంత హడావుడి పడుతున్నావు? ఏ వూరు పయాణం తులశమ్మమ్మా” ఊరొదిలి పెట్టేక యాడకెల్తే ఏంది లేమ్మా! ఆగిందే ఊరు, దొరికిందే పనిగదా! కడుపాత్త్రం కోసం గంపెడంత చీకట్ని బుజానేసుకుని పోతా ఉండాము. యాడ తేల్తామో! యాడ మునుగుతామో! అంతూ దరీ లేకుండా ఉంది గదా!” అంటూ నిట్టూర్పు విడిసింది.
“ఇన్ని అగచాట్ల మారి కాలం ఎప్పుడూ రాలేదమ్మా. ఊళ్ళో ఏమూల కెళ్ళినా ఉగ్గిన్నెడు ఉప్పునీళ్ళయినా పుట్టకపోతుండే. ఏ బాయిలోనా గొంతు తడుపుకోడానికి సుక్క నీరు లేదా! బోరింగు పంపులు గలగల మోగి ఎన్నాళ్ళయింది. ఆరుమైళ్ళు నడిస్తే అక్కడా దొరికేది ఉప్పునీళ్ళే గదా! అయ్‌ తాగి తాగి దావాద్రి తీరితే గదా! పైగా వాంతులూ బేదులూ ఒక్క పక్క సంపుతా ఉంటే ఊళ్ళో వుండి చావునేడ కొని తెచ్చుకుంటాము.

పిల్లా జెల్లా నేసుకుని బాబాయెల్లేడమ్మాయ్‌. ఈ పూట ఇల్లూ వాకిలీ సక్కబెట్టుకుని నేనియ్యాల దారి బట్టేను”
“అబ్బా ముక్కులు పగిలిపోతుండయ్యి గదమ్మాయ్‌. యాడేడు సచ్చిన గొడ్లన్నీ దెచ్చి ఈణ్ణీ ఏసేరు లాగుంది. కుక్కలూ, కాకులూ, గద్దలూ ఎట్టా తన్నుకుంటన్నాయో సూడు!” అంటూ గట్టిగా ముక్కు మూసుకుంది తులశమ్మ. “ఎక్కడా పూసగడ్డి లేకపోయె. యాడ జూసినా ఎర్రనగ్గి మండతా ఉంటే సావకేం జేస్తయి”

“మాయ్‌ పరిగెత్తు! పరిగెత్తు! బసొస్తంది పరిగెత్తు! రేయ్‌ నువిట్రా” అంటూ పిల్లోణ్ణి చేత్తో బటుకుని, నువ్వా పిల్లని దీకొని రామ్మా” అంటూ పరుగున రోడ్డు మీద కెళ్ళి నిల్చుంది తులశమ్మ.

గతుకుల రోడ్డుపై బస్సు డగడగ మంటూ పెద్ద శబ్దం చేసుకుంటూ వచ్చి కీసుమని ఆగిపోయింది. దిగేవాళ్ళు దిగుతుండారు. “ఇంతకీ నువ్వేడ కెల్తన్నావో చెప్పనే లేదమ్మాయ్‌” అంది తులశమ్మ గోయిందమ్మ వంక జూస్తా.
“యాడకేముంది! ఈయన సంగతి నీకు తెలవందేముంది. ఎటు బోయాడో ఇంతవరకు అడ్రస్సే లేడు. ఏం జేసేది దరిదోయక బయల్దేరేను. యాడ తేల్తామో ఏందో మరి!” అంది బాధగా గోయిందమ్మ.

యాడెక్కందుకూ సందులేని బస్సులోకి నెట్టుకుంటూ, తోసుకుంటూ ఎక్కుతా వుండారు. పైనా కింద ఎటు జూసినా నిండా మూగిపోయారు. కోళ్ళూ, కుక్కలూ, మూటలూ, మనుషుల్తోటి టాపు గూడా కిక్కిరిసి పోయింది. ఎట్టెక్కేట్టబ్బా అని ఆలోచిస్తండగానే
“రాయే గోయిందా రా! రా!” అంటూ పిల్లోణ్ణి లాక్కోనెళ్ళి కింద మెట్టు మీద కాలు బెట్టి, “ఇదుగో ఈ మెట్టు మీద కాలానించు. ఈ బస్సు పోయిందనుకో! ఇంక పైటేళ దాకా బస్సే లేదు.  ఈ యెండలో బడి సావాల్సిందే! ఎక్కెక్కు” అంటూ తొందర జేసింది.

ఈ పిల్లల్నేసుకుని ఈ సముద్రంలో ఈదాలంటే అయ్యే పనేనా! అని తటపాయించింది. అసలా జనాన్ని చూస్తంటేనే గుండె పగిలి పోతంది. బస్సు బయలు దేరడానికన్నట్టు డ్రైవర్‌ హారన్‌ కొట్టాడు.

తప్పని పరిస్థుతుల్లో గుండె రాయి జేసుకుని, పిల్లని ముందే పైకి నెట్టేసి కింద మెట్టు మీద కాలానించింది. కండక్టర్‌ రైట్‌ చెప్పడంతో బస్సు బయల్దేరింది. గోయిందు నానుకుని ఇంకా నలుగురైదుగురు వేలాడుతున్నారు. బస్సు వేగంగా పరిగెడుతోంది.
“గోయిందా! అటు జూడవే ఆ చేలొక్కసారి అంతా ఎట్ట ఎండి పరిగలయినియ్యో! ఎంత లెక్క జూసినా బొందుబోయిన పైరే గదా! యాడ మోటార్లాడ సచ్చిన మడుసుల్లా ఎట్ట పొర్లాడుతుండయ్యో సూడు” అనింది తులశమ్మ.

గోయిందమ్మకు నోట మాట రాక, గుడ్లప్పగించి చూస్తా ఉండిపోయింది. యాడ చెయ్యి జారితే కింద బడతానేమోనని బిగబట్టుకోని నిలబడుంది.

బస్సు కదిలి అర్థగంట కాలేదు. ఐదారు గొడ్ల లారీలు బస్సుని దాటుకుని ఎల్తుండయ్యి. గోయిందమ్మ వాటిని జూసి నోరిప్పకుండా ఉండలేకపోయింది. “ఏంది? తులశమ్మమ్మ యాడకి ఇన్నిన్ని గొడ్లు బోతండయ్యి” అంది.
“యాడకేందమ్మాయ్‌ కసాయికొట్టుకేగదా! ఆరుగాలం మేపీ మేపీ ఇయ్యాల వొలుకుల్లో కలపాల్సొస్తుండే! దయా దాక్షిణ్యం లేకుండా అమ్మి పార్నూకిన గొడ్డియ్యన్ని మడుసులే తింటానికి ఇత్తులేక అల్లల్లాడుతుంటే ఇంకా గొడ్లని మేపడానికి మేతెక్కడ తేవాలా. ఒక్కో బొద్దొచ్చి పదిరూపాయలుండేది. కరువు కాలంలో నైనా. ఇప్పుడు అరవై డెబ్బయి బెట్టినా దొరికేది అంతంత మాత్రంగానే ఉంది. ఏటికేడు దర బెరగడం అట్టుండనిచ్చి యీ యేడొచ్చినంత కలికాలం నేనెప్పుడూ జూళ్ళేదమ్మా” అంది నిట్టూర్పు విడుస్తూ తులశమ్మ.

దారి పొడుగూతా దిగేవాళ్ళ కంటే, ఎక్కేవాళ్ళే రెట్టింపు కావడం వాళ్ళ చేతుల్లో, నెత్తుల మీద, సంకల్లో మూటలు, చెంబులు, సెరవలు ఉండడంతో తలకేసి, మొహానికేసి గుద్దేస్తా ఉండారు. ఆ దెబ్బకి పిల్లలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతా ఉండారు.

సెగ్గాలి ఈడ్చి కడతంది. ఉక్కపోతకీ, అందరొదిలే వేడి శ్వాసకి బస్సు లోపలంతా చెమట వాసనా జీవితం మీద విరక్తి పుట్టేటంత రోతగా ఉంది. బస్సుల్లో ప్రయాణం జేసి ఎన్నాళ్ళో గావడం వల్ల గోయిందమ్మకి చాలా ఇబ్బందిగా ఉంది.

బస్సు రద్దీకి అందరూ వాకిట్లో నుండి లోపలి కొచ్చి పడ్డారు. మునికాళ్ళ మీద నిలబడి ఇరవైమైళ్ళు రావడంతో కాళ్ళు లాగేస్తున్నాయి. ముందూ వెనకా కదేసి వొత్తడంతో వొళ్ళంతా పుండైంది. “అమ్మా! ఆకలే ఆకలే” అంటూ పిల్లలు గొడవ మొదలు బెట్టారు.

పిల్లల్ని జూస్తంటే కడుపు తరుక్కుపోతుంది. డొక్కల్లోకి లాక్కుపోయిన కడుపు, పుల్లల్లా ఎండిపోయిన కాళ్ళూ చేతులూ పరిక్కంప లాగా ఎండిపోయిన నెత్తీ, పీక్కుపోయిన ముకం, పుట్టిన కాడికి పోయారు. పిల్లలకి కడుపు నిండా ఇన్ని మెతుకులు పెట్టలేక పోయానన్న దిగులు యెంటాడతానే ఉంది.

పిల్లల మొకం జూసేతలికి కడుపులో దేవినట్టుగా ఉంది. ఇద్దరూ తోడకూర కాడల్లా యాలబడి పోతుండారు. కడుపు నిండా కూడు దిని ఎన్ని రోజులైందో గదా!

ఇంటి నొదిలి పెట్టి రొండు గంటలే అయినా ఏడు పొచ్చేస్తంది. ఎంత కొంపలు మునిగే పనొచ్చినా సరే ఇల్లొదిలి పెట్టింది లేదు. ఒక్క పూటెప్పుడైనా ఇల్లొదిలి పెడితే మళ్ళీ ఇల్లు చేరిందాకా ప్రాణం గుటగుట లాడిపోయేది. ఇల్లెట్టుందో, గొడ్లని మేతకి తోలేరో లేదో! బర్రెల కాడ పాలు దీశారో లేదో, పైరులో కలుపు పెరిగిపోతందే, కందికంప మేడమీదేశారో లేదో, వానొస్తే తడిసి పోతయ్యేమో … ఇట్టా మనిషేడకి పోయినా మనసంతా ఇంటి మీద, పొలం మీదే ఉండిపోయేది.

ఇంత కాలానికి ఇట్టా కానికాలమొచ్చి, ఇల్లిడిసి పెట్టి, ఊళ్ళ మీద పడాల్సొచ్చింది.

3
బస్సు కనిగిరి జేరింది. కుదుపుకు ముందుకు పడబోయి, తమాయించుకుని, ఆలోచనల్లో నుండి ఈ లోకం లోకొచ్చింది.

ఈయన జాడేమన్నా తెలిసిద్దేమోనని, తెలిసిన వాళ్ళెవరన్నా కనబడతారేమో నని డిపో అంతా బార జూసింది.

ఆ వూరివాడే రాంకోటు బజారుకెళతా కనిపించాడు. “అన్నా! మా ఇంటాయనేమన్నా తగిల్నాడా నీకు” అంది గోయిందమ్మ ఆత్రంగా.
“లేదే గోయిందా! నేనీడ కొచ్చి వారం రోజుల పైనైంది. ఈడేడన్నా పనీ అదీ దొరుకుతుందేమో నని. కాలికి బలపం గట్టుకుని తిరుగుతుండాను. ఎక్కడా తగల్లేదే గోయిందా! తగిల్తే చెప్పనంటగనీ! ఎవురైనా ఈడేమైనా పనీ అదీ ఉంటే గదా! ఉండటానికి పనులేమీ లేక ఈణ్ణుండే జనాలందరూ యాడకేడకో ఎగిరి పోతుండారు. అట్టాంటిది ఈడేం పెరక్క తింటానికి ఉంటారే! అవునే నువ్వేడకి పిల్లల్నేసుకోని బయల్దేరావు” అన్నాడు.

“ఏం  జెప్పాలన్నా గంపెడు చీకటిని నెత్తిమీదేసుకుని ఎల్తన్నా యాడకని ఎల్లేటట్టో అంతూ దరీ దొరకడం లేదు. ఇయనన్నా కనబడతాడేమో ముందు … ఆ తరవాత్సంగతి తరవాతనుకుంటే అదీలేదు. ఆయన పాటికాయన తెల్లార్సుకు పోయాడు. ఈ పిల్లల్ని సముదాయిచ్చుకుంటూ తిరగటమే కనాగష్టమైంది. పిల్లలేమో అన్నమో రామచెంద్రా అని అల్లాడు తున్నారు. ఏం జేసేటందుకూ దరి దోచటం లేదు”

చేతిలో ఉన్న నాలుగు రూపాయిలు ఊరికి బోవడానికి బొటాబొటీగా సరిపోయేట్టుంది. అయినా పెద్ద బజాట్లో ఈరాసామి కొట్టుకాడికి బోయి కనుక్కుందాము. ఈ సుట్టుపక్కల యాడ తిరుగుతున్నా అక్కడ తగిలిగాను పోడని, పెద్ద బజారు కొచ్చింది.

“ప్చ్‌! లాబం లేకపోయింది. నాక్కనిపించే మూణ్ణెల్లయ్యిందమ్మా! పైగా వెయ్యి రూపాయలు బాకీ గూడా ఉంది. నువ్వన్నా ఇవ్వరాదంటమ్మా” అన్నాడు ఈరాస్వామి.
“అయ్యో! ఇచ్చినట్టే ఉందయ్యా నా బతుకు” అని నెత్తీ నోరు బాదుకుంటూ నాలుగడుగులు ఇవతలకొచ్చి, నడిసే ఓపికలేక కొట్టు ముంద అరుగుంటే దాని మీద సతికిల బడింది.

“ఇదుగో! అక్కడ లేమ్మాలే! కొట్టుకి అడ్డంగా బారజాపుకోని కూచ్చున్నావు లేసి, ఆవతలికి బో” అని కొట్లోనుండొచ్చి కుర్రాడు కేకేయడంతో అక్కణ్ణుంచి లేసి, ఎంకటాపురం బస్సాగే పూల కొట్ల బజారు కొచ్చింది.

అయినా ఆ వూరు పేరు తల్చుకుంటేనే ఎందుకో ఇబ్బందిగా ఉంది. యాడ జూసినా ఇదే తీరుగా ఉండప్పుడు ఒక సంసారం బోయి, ఇంకో సంసారం మీద బడితే ఎట్టా బరిస్తారు.

ఐనా సూద్దాం! ఆ బగవంతుడే పంపినట్టుగా ఎవురన్నా అగపడి ఈయన పలాన చోటన ఉండాడని సెబితే ఆ తిరుపతి వెంకటేశ్వరసామికి తలనీలాలు జెల్లిచ్చుకుంటాను గదా! అనుకుంటూ అరటిపళ్ళమ్మే బళ్ళెనక బండలుంటే వాటి మీద కూర్చుంది.

గంటా … రెండు గంటలూ … మూడు గంటలూ కాలం గడిసిపోయింది. ఎంకటాపురమెల్లే బస్సులు ఒకటి రెండెల్లి పోయాయి గానీ కదలకుండా చూస్తా ఉంది. ఏం లాబం లేదు. అదీ దింపుడు కల్లాం ఆశే అయింది. ఇంకీణ్ణీ ఉంటే అందరిమీ సోషొచ్చి పడిపోవడం కామమనిపించి
“అమ్మా దప్పికవతందే” అంటూ పిల్లలు ఏడవడం మొదలు బెట్టేరు. “ఇదుగో అన్నా! గుక్కెడు నీళ్ళుంటే ఇప్పిచ్చన్నా పిల్లలకి గొంతెండి పోతుంది” అనడిగింది అరిటికాయల బండాయన్ని. ఆయనొకసారి పైకీ కిందకీ తేరపార జూసి “యావూరు తల్లా మంది?”

నీళ్ళకెంత అరసక సత్తన్నారో తెలవదు లాగుందే! అదుగో ఆ టిపిన్‌ కేరియర్లో పొద్దుననంగా తెచ్చుకున్నా. ఏందీ అదీ ఉప్పునీళ్ళు. ఉగ్గిన్నుడు బోసుకోని గొంతు తడుపుకుంటూ, పేణం నిలుపుకుంటన్నా! నీళ్ళకెంత పిరింగా ఉందో తెలవదు లాంగుందే” అన్నాడాయన.

పిల్లల పేణం గుటగుట లాడతంటే అయ్యో! ఏం గాశార మొచ్చి పడింది. రా నాయనా ఒక సోడా అన్నా గొట్టిచ్చి తాపుదా మంటే ఎక్కడా కనుచూపు మేరలలో సోడా బండి కనబళ్ళేదు. ఇంతకుముందు యాడ జూసినా కయ్యి కయ్యిమని మోత వినిపిస్తుండేది. ఏమైపోయారబ్బా ఈళ్ళింతా అనుకుంది. ఓహో ఇప్పుడంతా ఎటు జూసిన రంగునీళ్ళ మయమై పోయింది గదా! అనుకుని ముందుకు సాగింది. ఏ బంకులో అడిగినా సోడా లేదన్నారు. ఇంక విసుగెత్తి పోయి, ఒక రూపాయి బెట్టి పాలథిన్‌ సంచీ నీళ్ళు కొనింది.

ఉంటానికియ్యి పిల్లుచ్చల మాదిరి సల్లంగా ఉండయ్యి గానీ, నిండా ఒకటే నలుసులు” అద్దీసకెళ్ళ పిల్లలిద్దరికీ చెరో రవ్వన్ని తావించింది. ఐనా పిల్లలిద్దరికీ దప్పిక తీరినట్టు అగపళ్ళేదు. ఐనా చేసేదేమీ లేనట్టు తెలియనట్టే తల పక్కకి దిప్పుకోని గమ్మున ఊరుకుంది.

4

ఆ! పెదపొందూరు, సింగిరెడ్డిపల్లె, అప్పికట్ల, ఈరేపల్లి, ఎంకటాపురం అని క్లీనరు అరుస్తా ఉండగా సిటీ బస్సొకటొచ్చి బస్టాండ్లో ఆగింది. అప్పటిగ్గూడా గోయిందమ్మకు బస్సెక్కాలనిపించలేదు. ఎన్నిసార్లు కబురుజేసినా, నా పిల్లలూ, నా సంసారమూ, నాగొడ్డూ, గోదా అంటూ పోకుండా నీలుక్కోని కూసుండేదాన్ని ఇయ్యాల అవటానికి అమ్మాగిరిలయినా ఏ మొకం బెట్టుకోని బోవాలో అర్థమై చావడం లేదు.

బస్సొచ్చిన పదీ పదిహేను నిమిషాల్లోనే నిండిపోయింది. బస్సు కదలబోయిందాకా ఎక్కాలా! వొద్దా! అని తటపటాయిస్తానే ఉంది.

ఇంక చీకటి పడిపోతంది. ఇంక తప్పదన్నట్టు గమ్మున బస్సెక్కి ఓ మూల బిక్కుబిక్కు మంటూ పిల్లల్తోపాటుగా కూర్చుంది. ఎదురుగా కూర్చున్నొకామె తేరిపార జూస్తందని కొంగు మొకానికి కప్పుకుంది. కొంతసేపయినాక “గోయిందూ! నువ్వేనంటే ఎన్నాళ్ళయిందే నిన్ను జూసి. ఏందీ అవతారమూ నువ్వూ. ఎట్టుండే దానివి ఎట్టయిపోయావు. వాళ్ళు నీ పిల్లలేనా! చిక్కెంటి కలికి పప్పరమెంట్లు అమ్మేవాళ్ళు పిల్లల్లాగ తయారుజేసేవు గదే!” అంటూ తిట్టడం మొదలు బెట్టింది సామ్రాజ్జెం.

గోయిందమ్మా, సామ్రాజ్జెం అమ్మోళ్ళ ఇళ్ళు ఒకదాని వెనుక ఒకటి ఉండేవి. చిన్నప్పట్నుండీ ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఎక్కడికి పోయినా ఇద్దరూ కలిసి పోవాల్సిందే! ఏ పనైనా కలిసి చెయ్యాల్సిందే! పెళ్ళయిందాకా అట్టనే కలిసి మెలిసి తిరిగారు.
“ఏమే గోయిందా! అమ్మ కాడికేనా! మరీ నల్లపూసవై పోయావుగదే. మెళ్ళో పసుపుతాడు పడిందో లేదో ఆణ్ణించి కనబడటమే మానేశావు గదే!
అప్పుడెప్పుడో ముసలోడు పోయినప్పుడొచ్చావు. మళ్ళీ ఇప్పుడే నిన్ను జూడ్డం. అబ్బో ఇయ్యాల నాకు తిరుపతి కొండ నడిచెక్కినంత పుణ్యం వొచ్చినట్టే. అయినా ఎంతిదైన దానివి కాకుంటే నా సంసారమో, నా సంసారమో అని అంత లావున ఎగరగొట్టు గోడానికి ఎవురికి లేని జంజాటమమ్మా. పాపం మీ అమ్మ వారం రోజులు మూసిన కన్ను తెరవకుండా ఆస్పత్రిలో ఉంది.
ఒక్కసారి రమ్మనండి చూసిపోద్దని ఎన్నిసార్లు చెప్పిపంపిందే! అట్నే ఎగ్గొట్టేవు గదా!” అంటూ దెప్పి పొడిచింది.

“ఇంకాపవే నీ నిష్టూరాలు. ఆయనే ఉంటే ఇంకోడితో పనేందనీ, ఇంట్లో మొగుడు పనోడైతే నాకెందుకే ఈ తిప్పలన్నీ. ఇప్పుడు పెళ్ళాం, పిల్లలూ, తల్లీ అనుకోకుండా ఎటెల్లాడో అంటూ పొంతూ లేదు. యెంట బడి యెతక లేక చస్తున్నా. నీకేం నువ్వెన్నయినా చెబుతావమ్మా. దేశం గాని దేశం, ఉత్తరాది మొగుడు. ఊరూవాడా యెల్లో కొల్లలుగా నీళ్ళూ. దేనికి తక్కువే నీకు అందరికీ నీలాగా కుదురుద్దా ఏమైన మాట్టాడతావు” అంది గోయిందమ్మా.
“ఇంతకీ ఊర్నుండేనన్న మాట రాక! అయినా ఏందే! లంకణాలు జేసిన దాన్లాగా అయిపోయావు. పిల్లల్కి మొకాలెక్కడికో పీక్కుపోయుండయ్యి. ఏందే ..? …!”
“ఆ! ఏం జెప్పమంటావే! నీకు తెలియని బాగోతమా ఏంది? రాజ్జెమంతా ఎట్టావుందో తెలుసుగదా నీకి. గుక్కెడు గెంజి తాగే మార్గమే కనబడ్డం లేదు. కడుపాత్రం జూసుకుంటూ ఊళ్ళన్నీ ఖాళీ అయిపోయినయ్యి. తలో దిక్కు పారిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే మాపక్క ఊళ్ళన్నీ ఎడారులై పోయాయనుకో! ఇంతకీ నువ్వెట్టుండావే? పిల్లలెట్టుండారు? మీ ఆయన ఇప్పుడైనా కాస్త వొళ్ళు జేశాడా? అట్నే ఉండాడా? ఇంతకీ నువ్వెప్పు డొచ్చావు? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించింది. ఆడ అందరూ బాగానే ఉండారు గానీ, ఈణ్ణే ఊళ్ళో అందరికీ జెరాలు. అమ్మా నాన్నా లేవడం లేదు. అందుకే! మొన్నొచ్చేను. చూసి పోదామని మీ ఇంట్లో గూడా అందరూ మంచాలు కరుసుకోని పడుకోనుండారు. ఊరంతా జెరాలు వాంతులూ బేదులూ కాస్తె వానలూ అయ్యి బడి చల్లబడిందాకా అమ్మనీ నాన్నీ మా ఊరు దీసకపోదామనుకుంటుండానే! ఇక్కడ తాగడానికి నీళ్ళగ్గూడా బలే కష్టంగుంది. అబ్బో! పగోడి గ్గూడా వొద్దమ్మా ఈ కష్టాలు. మన కాలంలో ఎప్పుడు జూశామమ్మా! ఇన్ని వింతలూ విడ్డూరాలు”. అంటూ ఇద్దరూ మాటల్లో పడి ఎంకటాపురం వొచ్చింది కూడా గమనించలేదు.

5

“ఆ! ఎంకటాపురం. ఎంకటాపురం” అని క్లీనర్‌ అరవడంతో ఈ లోకంలోకొచ్చారు ఇద్దరూ. చెరొకర్ని పిల్లల్ని బట్టుకొని దిగేరు.
“చూడే ఊరెట్టా వుందో! ఎక్కడా పచ్చదనమన్న మాట లేకుండా చేలు జూడు పరిగలేరు కుంటన్నాయి. ఇట్టాంటి రోజులొస్తయ్యని కల్లో గూడా అనుకోలేదు గదా!”
“సరే వస్తానే రాజ్జెం. ఆనిక్కొస్తాలేవే మీ ఇంటికి” అంటూ పిల్లల్ని దీసుకోని గోయిందమ్మ ఇంట్లో కెళ్ళింది.
సందడి సందడిగా ఉండే ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అమ్మా నాన్నా పంచలోనే పడుకోనుండారు. ఇళ్ళంతా చిందర వందరగా ఉంది. అమ్మ పక్కలో చిన్నోడు పడుకుని మూలుగుతున్నాడు. తడిపిన గుడ్డ నుదుట మీద వేసి ఉంది.
“అ…మ్మా!” అంది గోయిందమ్మ చిన్నగా. గొంతులో నుండి చిన్నగా వొచ్చిన ఆ మాట తనకే వినిపించలేదు. మళ్ళీ “అమ్మా” అని కొంచెం పెద్దగనే పిల్చింది.

కళ్ళు మూసుకొని పడుకున్న మాలక్షుమ్మ కళ్ళు తెరిసి చూసి, “ఎవరూ గోయిందేమా! ఏమే ఎన్నాళ్ళకొచ్చేవే! మేముండామా పోయామాని చూసి పోదామనొచ్చావా! అమ్మా అయ్యా!” అంటూ పైకి చేసి కూర్చుని “ఇట్రాండ్రా” అంటూ పిల్లల్ని దగ్గరికి పిల్చింది. “ఏందే! ఇట్టా పీనిగె రూపం పడిపోయారు. ఏందే! ఆ పక్క ఊళ్ళన్నీ దివాలా దీసినట్టుండయ్యంటనే. అదంతా మిమ్మల్ని జూస్తంటే మీ మొకాల్లో కనిపిస్తంది గదే! పిల్లల్ని ఈడకన్నా పంపియ్య గొడుతంటే! సరేలే పో! ఆ సంచీ ఎత్తకెల్లి ఇంటోబెట్టి మీ వొదిన బడుకోనుంది పలకరిచ్చిరా పో!” అంది.

ఇంట్లోకి బోయి సంచీ వంకెకి తగిలించింది. అలికిడి విని కళ్ళు తెరిసింది పద్మ. “ఏందొదినా ఇట్టా మంచాని కొకరు అతుక్కుపోయుండారు. ఎన్నాళ్ళనుంచి జెరం” అంటూ పలకరించింది.
“వారం రోజుల్నుంచమ్మా! ఈ మాయదారి జెరం. ఇదేనా రావడం? ఎంతకాలమైంది మిమ్మల్ని కూసి! అమ్మా, అయ్యా” అంటూ పైకి లేవబోయింది. “లేవొద్దులే పడుకో వొదినా!” అంటూ మంచం పట్టె మీద కూర్చుంది.

“పిల్లలేరి? ఎట్టుండారు? ఏంది నువ్విట్ట బోయావు?” అంది పద్మ. “వాళ్ళమ్మమ్మ దగ్గరుండారు పిల్లలు. అయినా ఏంది? ఊరంతా ఇట్నే ఉందంట గదా! బుజ్జిగాడిగ్గూడా బాగలేదంటనే సగమై పోయాడు. నాయినేడి కొష్టం దగ్గర పడుకోనున్నాడా! పిల్లోణ్ణి కాస్త మంచి డాక్టరుకి చూపించకపోయారా” అంది గోయిందమ్మ

“యాడ చద్దాము. ఒకరా ఇద్దరా అందరికందరిమీ ఇట్నే ఉండాం కదా! మొన్నటి దాకా మీ అన్న గూడా మంచంలోనే ఉండాడు. ఇదుగో ఇట్టా … ఆయన చేశాడు నేనూ మీ యమ్మా పడుకున్నాము. బుజ్జిగోడికి పదిరోజుల్నుండి అట్నే ఉంది. మూసిన కన్ను తెరలేదు. మనూర్లో సూర్నారాయణే చూస్తుండాడు. మొన్నొకరోజు సెలైన్‌ కూడా కట్టిపోయేడు. రోజూ ఊరంతా తిరుగుతాడు గదా! మనింటి గ్గూడా వొచ్చి రోజొక వరస చూసి పోతా ఉంటాడు” అనింది పద్మ.
“మ్మాయ్‌ గోయిందా! ఎప్పుడు తినొచ్చారో పిల్లలు. ఎండునక్కల్లా నకనక లాడుతుండారు. ఆ పొయ్యి మీద కాసిని బియ్యం కడిగెయ్యమ్మా!” అంటూ మూలుగుతూ పడుకుంది మాలక్షుమ్మ.

ఆమాట కోసమే ఎదురు చూస్తున్నట్టుగా దిగ్గున లేచి, బియ్యం నానేసి ఎసురు బెట్టి పొయ్యి ముట్టిచ్చింది. ఎసుట్లో బియ్యం బోసి, మూలన జాడీలో చింతకాయ పచ్చడి తీసి రోట్లో ఏసి నూరింది.
అన్నం ఉడగ్గానే ఉడుకుడుగ్గా పిల్లలిద్దరికీ పెడతా మధ్యమధ్యలో తానూ ఒక ముద్ద నోట్లో ఏసుకుంది. పిల్లలూ ఆబగా ఎన్నో లంకణాల తరువాత తిన్నట్టుగా ఆవురావురుమంటూ తిన్నారు.

6

“ఆ! ఏంది మాలక్షుమ్మా ఎట్టుంది? మనమడేమంటున్నాడు. ఇయ్యాలెన్నిసార్లు విరోశనానికెళ్ళాడు. వాంతులు కట్టుకున్నట్టేనా!” అంటూ బ్యాగ్‌ సంకన బెట్టుకుని సూర్యనారాయణొచ్చేడు.
“ఏంది? గోవిందమ్మే! అబ్బో ఎప్పుడొచ్చింది. ఏం? గోయిందమ్మో! బాగుండారా, మీ దేశమంటా బాగుందా! ఎన్నాల్టికి జూశా నమ్మాయ్‌ నిన్ను. కాసిని యేణ్ణీళ్ళు దీసుకుని రామ్మా ఇంజెక్షన్‌ చెయ్యాల” అంటూ మందు బుడ్డి పగలగొట్టి మందు సిరెంజిలోకి తీసుకుని ఇంజెక్షన్‌ జేశాడు.
“పిల్లోడికి నీళ్ళు బాగా తాగిస్తున్నారా? ఒక్కసారి గాకుండా అప్పుడు కాసిని అప్పుడు కాసిని తాపియ్యండి అన్నట్టు బాగా మరగ్గాసి చల్లార్చిన నీళ్ళనే తాగించాల” అంటూ సిరంజిని వేన్నీళ్ళలో ముంచి నీడిల్‌తో నీళ్ళని పైకిలాగి పక్కకి చిమ్మి, మందు సిరెంజిలోకి తీసుకుని ఇంజెక్షన్‌ చేశాడు.

“అది కాదు సూర్నారాయణా నాకు తెలవకడుగుతాను బుంగ సిల్లి తీసినట్టు ఇరోశనాలు అవుతుండయ్యి గదా! మరింకా నీళ్ళు తాగిస్తే ఇంకా ఎక్కువవతయ్యి గనీ, ఎట్టా తగ్గుతయ్యి!” ప్రశ్నించింది మాలక్షుమ్మ.
“అదీ పాయింటే గాని, మాలక్షమ్మా రేడియోల్లో, టీవీల్లో గూడా అట్నే చెబుతుంటారు గదా మరీ నలుగురుతో పాటు మనమూ బోవాల. ఊరంతా ఒకదారి ఉలిపికట్టె దొకదారి అంటే ఎట్ట మరి” అన్నాడు సూర్యనారాయణ.
“ఇంతకీ ఈడికి తగ్గిద్దా లేకుంటే పెద్ద డాక్టర్‌ దగ్గిరికేమన్నా తీసక పోవాల్సొచ్చుద్దా” అన్నది గోయిందమ్మ
“అమ్మా ఇదేం పెద్దమ్మ వారేం గాదు కదా! తగ్గకపోవడానికి, ఊళ్ళో అందరికీ నేనే గదా వైద్యం జేస్తుంది. నా బాధ్యతగా నేను జెప్పాను. ఆ తరువాత మీ ఇష్టం” అన్నాడు బేగ్‌ సర్దుకుంటూ.
“ఏమోనయ్యా! పది రోజుల్నుండీ ఎట్టున్నోడు అట్నే ఉండాడు గానీ మార్పేం కానరావడం లేదు” అని గొణిగింది మాలక్షుమ్మ.
“ఏం వైదగాలో ఏమో! వాంతులూ బేదులౌతుంటే ఇంకా ఎక్కువ నీళ్ళు తాగిచ్చాలంటారు. ఏం వానాకాలం సదువులో, మందులో” అంటూ నిట్టూర్చింది మాలక్షుమ్మ.
“డాక్టర్‌ చెప్పినట్టు చెయ్యమ్మా. మజ్జెలో నీ వైద్దెమేంది?” అంది గోయిందమ్మ.
“ఊరుకోయే మిమ్ముల్నందర్నీ కనీ పెంచీ, పెద్ద జేసినప్పుడు యాడుండారే ఈ డాక్టర్లు. గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చి నట్టుంది మీరు జెప్పడం” అంటూ కసిరింది.
“సరే పిల్లలకీ, మీ అన్నకీ నాలుగు మెతుకులు బెట్టి నువ్వు గూడా తిని పడుకోమ్మా! కుండా జట్టీ మూసేసి” అంటూ మాలక్షుమ్మ మేను వాల్చింది.
“మీకేందమ్మా పత్తెం. మిమ్మల్నేం దినమన్నాడు అడగడానికి మర్చి పోయాను” అంది గోవిందమ్మ.
మాదేముంది లేమ్మా మజ్జిగ, టెంకాయ నీళ్ళే గదా! అంతా నీళ్ళాహారమే. పేణం శోషొచ్చి చస్తంది” అంటూ మూలిగింది మాలక్షుమ్మ.

పేషంట్లందరికీ ఎవరికి కావల్సిన ఆహారం వాళ్ళ కందించి నడుం వాల్చింది గోయిందమ్మ.

7

అర్థరాత్రి చంద్రుడు మబ్బుచాటు నుండి రాయిమని పరిగెత్తుతున్నాడు. ఊరు మాటు మనిగింది. జనసంచారము జాడేలేదు. ఎక్కడో ఒక కుక్క భౌభౌ మంటూ మొరుగుతుంది. కీచురాళ్ళ రొద మిన్నంటుతా వుంది.
“ఛేయ్‌ ఛేయ్‌” అంటూ మాలక్షుమ్మ మంచం దగ్గరకొచ్చి కుయ్‌కుయ్‌ మంటున్న కుక్కపిల్లని అదిలించింది. అది తోక ఊపుకుంటూ వెళ్ళిపోయింది.
దీపం వెలుగులో ఒకసారి పిల్లోడి వైపు జూసింది. ఒళ్ళంతా చెమటలు పట్టుకొచ్చినయ్యి. ఎగశ్వాసగా దిగశ్వాసగ ఉండి గాలి పీల్చడాని క్కూడా తెగ ఆయాస పడుతున్నాడు.
“బ్బాయ్‌! రేయ్‌ బుజ్జిగా లేరా! లే!” అంటూ పిల్లోణ్ణి లేపటం విని పద్మ లేసింది. సీనూ లేశాడు. ఈ సందడికి గోయిందమ్మ, పిల్లలు అందరూ లేశారు. మంచం చుట్టూ అందరూ మూగేరు. “కదిలియ్యండి, నోరు దెరిసి చూడండి, నీళ్ళుజల్లండి” అంటూ గాబరా గాబరాగా తలొక మాట చెప్పారు.

“ఒరే సీనూ పిల్లోడి కేందో! మైకం కమ్మింది గాని పోయి సూర్నారాయణ్ణి పిల్చుకురా పో” అనడంతో సీను చొక్కాకూడా వేసుకోకుండా, కాళ్ళకు చెప్పులైనా లేకుండా హడావిడిగా వెళ్ళేడు.
“ఏందమ్మా! ఏందిదే! మీరేమో వాణ్ణి పెద్ద డాక్టరుకి చూయించమంటే అదే తగ్గుద్ది అదే తగ్గుద్దాని కూచ్చునుండారు. వొచ్చినప్పట్నుంచీ వాణ్ణి జూస్తే నాకెందుకో అనుమానంగా ఉంది. యాడ నా మాట …” అంటూ డాక్టర్ని జూసి ఆగిపోయింది గోయిందమ్మ.

“లేవండి, తప్పుకోండి సూర్నాయణొస్తన్నాడు” అన్నాడు సీను. “రాయ్యా! రా! ఈడేందో ఉలకడం లేదు పలకడం లేదు” అంది మాలక్షుమ్మ దుఃఖం ఎగదన్నుకొస్తుండగా.
“పక్కకు తప్పుకోండి” అంటూ చెయ్యి పట్టుకొని నాడి చాశాడు. ఎక్కడో బలహీనంగా కొట్టుకుంటుంది. రెప్పలు కిందకి లాగి చూశాడు. వొళ్ళు పట్టుకు చూశాడు. చల్లగా ఉంది. హడావుడిగా బేగ్గులో నుండి మందు బుడ్డి తీసి ఇంజెక్షన్‌ చేశాడు. అయినా చలనం రాలేదు.
కాసేపటికి నాడి కూడా కొట్టుకోవడం ఆగిపోయింది.
“ప్చ్‌! లాభం లే”దని పెదవి విరిచాడు సూర్యనారాయణ. “ఏందమ్మా మేం జెప్పిన మాట వినరు. మీకు తోసిన వైద్యం మీరు జేస్తారు. ఇయ్యేమన్నా సత్తెకాలపు రోజులా? మీ వైద్యానికి జబ్బులు తగ్గడానికి” అనుకుంటూ విసురుగా వెళ్ళిపోయాడు.

“అయ్యో! అప్పుడే నూరేళ్ళు నిండేయిరా నాయనా! నిన్ను మా సేతుల మీదుగానే సాగనంపితిమి గదరా తండ్రీ!” అంటూ శోకాలు మొదలు బెట్టేరు.
“ఇప్పుడేడిసి ఏమి లాబమే? ముందుండాల. మొదట్నించీ ఉండాల. ఇయ్యి సత్తెకాలపు రోజులు గాదే! సొంత వైదగాలు జెయ్యబాకండే జెయ్యబాకండే అంటే ఇంటారా! ఇప్పుడు జూశారుగా థూ! నీయమ్మ మీ పొట్టన బెట్టుకున్నారు గదే” అంటూ ఏడుపుతో కళ్ళు తుడుచుకుంటూ విసురుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు శీనయ్య.
ఏడ్చుకోని ఏడ్చుకోని అందరూ సొమ్మసిల్లి పోయారు. పిల్లలిద్దరూ బిక్కమొహాలేశారు. ఇంక ఏడవడానికి ఓపిక లేక తలలు వేలాడదీసి చిన్నగా మూలుగులతో రోదనలు బెట్టడంతో చిన్నగా మూలుగులు మాత్రం వినిపిస్తున్నాయి.
తెల్లగా తెల్లవారింది. ఇరుగూ పొరుగూ అందరూ చేరారు. “ఇంకెందుకు బుగ్గి చెయ్యాల్సినోణ్ణి ఎదురుగా బెట్టుకోని!
పోయినోడు రాడు గదా!” అంటూ పెద్దాయనొకాయన అనడంతో మళ్ళీ ఏడుపులు మిన్నుముట్టాయి.
ఒలుకుల్లో గుంట దియ్యడానికి మనిషిని పంపించారు.

“ఇంతకాలం పెంచింది గుంటలో పెట్టి గంట వాయించడానికా! వామ్మో! వాయ్యో! ఓరి దేవుడో” అంటూ గుర్తొచ్చినప్పుడల్లా ఎవురో ఒకరు అరుస్తానే ఉండారు. వీళ్ళందర్ని తప్పించి పక్కకు లాగి తెల్లగుడ్డలో పిల్లోణ్ణి జుట్టి సీను చేతుల్లో బెట్టేరు. ఏడుపు మోహంతోనే సీను రెండు చేతుల్తో ఎత్తుకొని పోయి శ్మశానంలోకి తీసుకెళ్ళి పూడ్చేశారు.

బుజ్జిగాడి చావు అందర్నీ కోలుకోకుండా జేసింది. ఎవురికి వాళ్ళు మంచాలు బట్టుకుని అలాగే ఉండిపోయారు. ఇంట్లో అందరి మొహాల్లోనూ ఒక నెలరోజుల పాటు శోకదేవత తాండవించింది.
ఈ  చావు ఎవరి వల్ల జరిగిందో ఏమో గాని, మాలక్షుమ్మ మనసు నిండా మాత్రం అపరాధభావం నిండిపోయింది.

ఎవ్వరూ సరిగ్గా తిండి తినడమే మానేశారు. పిల్లల కోసం గోయిందమ్మకు లేవక తప్పడం లేదు. ముసలాయన కూడా ఆకలికి ఉండలేదు. అందుకని రోజూ పొయ్యి రాజెయ్యడం, వంట చెయ్యడం, అందర్నీ వొక వరస బతిమలాడడం గోయిందమ్మ వంతయింది.
ఎవురికి వాళ్ళే ఇట్నే మంచాలు బట్టుకు కూసుంటే పరమట సేలో కందెండి పోయింది. పొద్దు దిరుగుడు, ఆముదం, అట్నే ఉండయ్యి. వాటినట్నే వొదిలేస్తే అయ్యేడ నేల పాలవుతయ్యి. అప్పులోళ్ళు చుట్టు ముడతారు. అప్పుడొక డబ్బా మందు దెచ్చుకుని తలొక గుక్క దాగి కట్టగట్టుకు చావడమే అంటూ ముసలాయన సతాయించడం మొదలుబెట్టేడు.

“పోయినోళ్ళతో మనమూ పోలేం గదా! లేసి కాస్తె ఎంగిలి పడండి. పనులు తరువాత సంగతి. ఇప్పటికీ ఇంట్లో తిండి గింజలు కూడా అయిపోవొచ్చినయ్యి. ఆ నాలుగిత్తులు కూడా అయిపోతే అప్పుడేద్దురు గానీ నాటకం” అంటూ పొలాని కెళ్ళాడు ముసలాయన.

గోయిందమ్మకు చాలా ఇబ్బంది కరంగా వుంది. అటు పనిచేద్దామని పైకిలేస్తే చూడమ్మా పోయింది తన బిడ్డ కాదనేగా! హాయిగా వొండుకొని తిని దర్జాగా తిరుగుతుంది. దానికేం దిగులా ఇశారమా! అంటారని అదోక బాధ.
లేవకుండా అట్నే పడుకుంటే బాగలేదు కదా! ఇంట్లో అందరూ పుట్టెడు దుఖ్ఖంలో ఉండారు కదా ఒక పనన్నా ఎగదొయ్య కుండా ఎట్టా పడుకునుందో అని అటుగూడా అంటారని సతమతమై పోతంది.
ఇక్కడ గూడా ఏం పండించి పోసినయ్యి పెద్దగా ఏంలేవు? అట్టని ఉన్న పళంగా ఎల్లిపోవడానికి ఏం శికాశాపం లేకపాయె. కట్టుకున్నోడేమో కాలికొద్ది యెటెల్లిపోయేడో పోయేడు. రోజూ ఒకొరస ఊరంతా దిరిగి విచారిస్తానే ఉంటే. ఎవరూ జాడ చెప్పినవాళ్ళు లేకపోయే.

వొచ్చి నెలరోజులు దాటింది. మంచీ సెబ్బరా మాట్లాడుకోవడానికి అస్సలు సందేలేకుండా పోయింది. వాళ్ళే పుట్టెడు దుఃఖంలో మునిగి పోయుండంగా ఇంక నన్ను విచారించేదెవరు. రోగాలు, రొష్టులు, పిల్లోడి చావుతో నెలరోజులు ఒక ముద్ద ఉడకెయ్యడం, పిల్లలకీ, అయ్యకీ పెట్టడంతో సరిపోయింది.
“ఆ! ఇంకా ఏదైతే అదవుతుందిలే అనుకుంటే అనుకున్నారనుకుని చొరవ దీసుకుని వొదినాలే! అమ్మాలే! అన్నాలే!” అంటూ సతపోరగా ఒక్కొక్కరే లేచి యెంగిలిపడడం మొదలుబెట్టేరు.

అందరితో పాటు గోయిందమ్మ కూడా పొలం వెళ్ళి పనులు ఎగదోస్తుంది. ఇంటికొచ్చి ఇంటెడు చాకిరీ తనే చేస్తుంది. అయినా ఎవురూ ఎవరితో మనసు విప్పి మాట్లాడుకోవడం లేదు. ఏదో పనిచెయ్యాలి కాబట్టి యాంత్రికంగా చేసుకుంటూ పోతున్నారు.
వర్సాలు సరిగ్గా పడక, పంటలు పండీ పండక యేటా వచ్చే రాబడిలో కనీసం సగానికి సగం ఆదాయం గూడా రాకుండా దిగిబడి వచ్చింది. మొన్నటి దాకా పిల్లోడిది దిగులైతే, ఇప్పుడు కొత్త దిగులొచ్చి పడింది. ఈ వొచ్చిన పంట తోటి అప్పులోళ్ళ కెట్టా సమాధానం చప్పాలోనని అందరూ సతమత మౌతుండారు. పొలాల్లో పనులన్నీ అయిపోయాయి. అయిన కాడికి గింజలు కూడా ఇంటికి రావడంతో, బస్తాల్తోటి ఇల్లంతా కిక్కిరిసి పోయింది. ఇంట్లో అటూ ఇటూ మెసల్డాని గ్గూడా చాలా ఇబ్బందిగా ఉంది.
ఇన్ని రోజులూ పొలంలో పనులుంటే, ఆ పనులు జేస్తూ ఇంటి దగ్గర అన్ని పనులూ ఎగదోస్తా ఉంటే ఎవురికీ ఏమీ అనిపించలేదు. పైగా ఒక మనిషి అనుకోకుండా ఆదరువు దొరికినట్టుగా కూడా అనిపించింది. ఎటొచ్చి ఇప్పుడూ! అన్నీ పనులూ అయిపోయి ఇల్లంతా ఇరుకిరుకు అయిపోయి అందరూ విశ్రాంతిగా ఉండటంతో గోయిందమ్మ, పిల్లలూ ఇబ్బందిగా కనిపించడం మొదలయ్యింది.
అన్న చూసీచూడనట్లు, పలికీ పలకనట్టు అంటీ ముట్టకుండా ఉంటున్నాడు. వొదిన పలకడమే మానేసింది. పైగా ఏవేళా విశేషమో ఇంటికి ఏదో శని దాపురించింది. అందుకే ఒకదాని వెంట ఒకటిగా అన్ని చెడుగానే జరుగుతున్నాయి అంటూ మొదలుపెట్టింది. ఇక అమ్మా నాన్నల్దేముంది ఎంతైనా చెట్టుకి కాయలు బరువవుతయ్యా!

అయినా ఎందుకో మాలక్షుమ్మ కూడా అసహనంగా కన్పించడం గోయిందమ్మ గమనిస్తూనే ఉంది. ఏదో చెప్పాలనుకుంటది.
నోటి దాకా వొచ్చినట్టే వొచ్చి చెప్పలేక ఆగిపోతంది. అంతా అర్థమయీ కానట్టు అర్థమౌతానే ఉంది. వొచ్చినప్పట్నుండీ మంచేందీ సెబ్బరేందీ అని అడగడానికి ఎప్పటికప్పుడు అందరూ హడావుడిలోనే ఉండిపోయేరు. అయితే ఇప్పుడంతా మూతులు ముడుసుకోని ఎందుకుండారో అర్థమైతానే ఉంది. వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళుండారు. తను వాళ్ళకిప్పుడు బరువుగా అనిపిస్తంది.
అంతే గదా మరి! గడపదాటి పోయినాక, యాడుండీవోళ్ళు ఆడనే ఉంటే మర్యాద. ఒక పూటా, అరపూటా అయితే వొచ్చే వమ్మా పోయేవమ్మా, ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అంటూ గుంపులు పోగులు బడి ముచ్చట్లాడుకుంటారు.
ఇప్పుడు తతంగమంతా పనుల్లేక, తిండిలేక, నీళ్ళులేక అల్లాడిపోతుండారు. అట్టాంటిది ఒక మడిసి అదనంగా వొచ్చి ఇంకో ఇంటి మీద పడి తింటం గూడా బారమే. అయినా ఏం జెయ్యడానికి పాలు పోకుండా ఉందే అంటూ గోయిందమ్మా సతమతమై పోతా ఉంది. ఏందంట! చెల్లెలు గారు. ఈణ్ణే ఉంటానికి వొచ్చిందా ఏంది! అంతకు ముందెప్పుడూ ఎన్నిసార్లు చెప్పినా రావడం కుదర్లేదు. ఈడ పనుల్తోటి తెగ ఇదైపోతన్నా అనేదిగా! ఇప్పుడెందుకొచ్చింది. ఈణ్ణే తిష్టేసేటట్టుందే! ఈడేమన్నా పుట్లు పుట్లు పండించి పోసుండయ్యా! మనమే మూడు మూసి ఆరు అతుకుతుండాము. ఇన్ని రోజులంటే పనులుండబట్టి చే అదరువుగా ఉండింది. ఇంకా ఎంతకాలం తెచ్చి పెడతామంట అంటూ పద్మ సణగడం మొదలుపెట్టింది.

“ఏయ్‌ ఊరక ముండమోపి మాటలు మాట్టాడబాక. ఇన్ని రోజులూ అది లేకపోతే ఎవురు జేశారే! ఇన్ని రోజులైంది అదొచ్చి ఎవురిమన్నా దాని దిగులూ ఇశారమేందో ఆలోచించామా! ఊరక నోరుందని నోరు బారేసుకోగూడదు”
“ఆ అంత సొతంత్రం లేని మణిసైతేనా ఇన్ని రోజులుండి పోయింది! తినే సొతంత్రమేనా! పనిజేసే సొతంత్రం ఉండదా ఏంది పుట్టింటికాడ”
“బాగా చెప్పొచ్చేవు లేవే! పెద్ద మడిసివి. ఇన్ని రోజులుందంటే ఏం కారణం లేకుండా ఉండదు. ఆ ఊళ్ళల్లో అసలు పంటలే పండ లేదంట. బావ కూడా ఇల్లూ వాకిలీ పట్టిచ్చుకునే రకం గాదు. అసలే దానికి రోషమెక్కువ అనవసరంగా మాట్లాడి గొడవ చెయ్యొద్దు. పుల్లిరుపు మాటలు మాట్లాడి దాని మనుసు ఇరిసెయ్యొద్దు”
“అవున్లే అందరూ రోసం కేసం లేకుండా పడుండారు. ఇంటోనే ఉంచుకుని ఆప్తెద్దుని మేపినట్టు మేపు నామాటొక లెక్కా జమా నీకు” అంటూ కళ్ళు వొత్తుకుంటూ, ముక్కు చీదుకుంటూ బయటి కొచ్చింది.

పంచలో గోయిందమ్మ వుండడంతో కంగుతినింది. తమాయించుకొని తలొంచుకునే కొష్టంలో కెళ్ళింది.
ఏదో పనుండి బైటికి బోయిన గోయిందమ్మ పందిట్లో అడుగు బెట్టడం, వీళ్ళ మాటలు చెవున బడడంతో బయటే ఆగిపోయింది. మా లక్షుమ్మ కూడా అక్కడే పంచలో కూచ్చొని వాళ్ళ సంభాషణ అంతా వింటూనే ఉంది.
“చూడమ్మా వొదినెట్టా మాట్టాడతుందో! మాకాడ గతిలేకే గదా! ఈడ కొచ్చి ఇన్ని రోజులుంది. ఎప్పుడన్నా ఒక్క పూట కంటే ఎక్కువుండానా మీ ఇంటి కాడ. కాని కాలమొచ్చి చెట్టు కొకరు పుట్ట కొకరు పరారయిపోతేనే గదా ఇన్ని రోజు లిక్కడ నిలబడింది.
ఇల్లు దాటి పోయినాక మీ ఇంటికొచ్చి అమ్మా ఇదిగో నాకిది గావాలని ఎప్పుడన్నా అడిగానా! ఇప్పుడు కట్టుకున్నోడు గూడా పట్టించుకోకుంటేనే గదా ఈడకొచ్చింది”
“అమ్మా వూరుకోమ్మా! ఇయ్యాల నీ సెవున బడిందమ్మా! పది రోజుల్నుంచి ఇదే గోల! వాణ్ణి తెగ సతాయిస్తావుంది. వాడేమో ఎటూ పాలుపోక సతమతమవుతా ఉండాడు”
“ఆడ జేసినన్నాళ్ళు తిన్నావా! లేదా! అన్న పాపాన బోయినోడులేదు. సరే లేకపోతే పోయిందిలే అనుకోని ఆడదాన్నీ మొగోణ్ణీ నేనే అయ్యి జేశాను. ఇప్పుడు ఇంటిచుట్టూ అప్పులు, ఆయనెటు బోయాడో తెలియదు. ఇల్లు జరగటం కష్టంగా ఉంది. ఎటూ పాలుపోక ఈడ కొచ్చేను గానీ, ఈడ ముల్లెంతా ఏసుకోని పోదామని రాలేదు. పిల్లలొక తగలాటకమయ్యేరు గానీ, వాళ్ళే లేకుంటే ఎప్పుడో ఇంత విషం మింగి చచ్చేదాన్ని” అంటూ మాలక్షుమ్మని బట్టుకోని బోరుమని ఏడ్చింది.
“యాడవబాకమ్మ అసరసందేళ యాడవగూడదు. నిన్నల్లాడిచ్చడానికి నీ యెదాన బడ్డాడు. వాడు సరీగుంటే నీ కియ్యేల ఇన్ని కష్టాలెందుకొస్తయ్యి. ఊరుకో ఊరుకో మొహానెట్ట రాసుంటే అట్నే జరుగుద్ది ” అని సముదాయించింది మాలక్షుమ్మ.

9

ఆ రాత్రి ముసలోడూ, పిల్లలూ తప్ప ఎవరూ ఎంగిలి పళ్ళేదు. దీపం వెలుగుతూనే ఉంది. ఎక్కడ తలుపులు అక్కడ బార్లాగా తీసున్నారు. ఎక్కడి వాళ్ళక్కడ బడి నిదురబోయారు. గోయిందమ్మకు కంటి మీద కునుకు లేదు. కళ్ళు మూసినా తెరిసినా వాళ్ళ మాటలే గుర్తొస్తున్నాయి. ఏం జెయ్యాలో ఎటూ పాలుపోవడం లేదు. ఏ దిక్కూ దరీ దోచడం లేదు. పక్కకి జూసింది. పిల్లలు ఆదమరచి నిద్రబోతున్నారు. ఎంత బతుకు బతికేను. అంత సంసారాన్ని ఒంటి చేత్తో ఈదేను. ఊళ్ళో పలానా ఆడదిరా ఉండాల్సింది భాంఛత్‌ మొగోడు పనికిమాలినోడైనా నిలబడి చేస్తుందిరా! అనిపిచ్చు కున్నానా, ఇంటికొచ్చిన ఏ పనోన్నీ అడిగింది లేదనకుండా బెట్టేదాన్నే! నాలాగా అందరూ సుకంగా ఉండాలనుకునే ఎర్రిబాగుల్దాన్ని. ఎవురు కష్టాలు పడుతున్నా చూస్తా ఊరుకోలేకపోయేదాన్ని. చేతనైనంతలో ఎవురికైనా సాయపడే దాన్నే! యాడకిబోయింది ఆ పుణ్యమంతా! ఓడలు బళ్ళవుతుంటాయంటే ఇదే గామాల!

“బగవంతుడా ఎంత అగ్నిపరీక్ష పెట్టేవయ్యా! పోయి పోయి ఇక్కడకొచ్చి ఓడిపోయాను. ఇంత కానికాలంలో ఆదుకునే మనసు గూడా లేనోళ్ళా తన పుట్టింటోళ్ళు అనుకుంటేనే గుండె తరుక్కుపోతంది. ఎప్పుడో బతుకులో ఒక మలుపుంటది ఆ మలుపు ఏ దిక్కుగా బోతే ఆ దిక్కుగా తిరుగుతుంది జీవితం. సరైన దిక్కుగా పోకపోతే జీవితం బిగ్గిపాలు కాకుండా ఎట్ట ఉంటది. సరైన దిక్కు తిరిగితే పట్టిందల్లా బంగారమే కదా! ఇప్పుడు ఏంజూసుకు బతకాలో అర్థం కావడం లేదు. ఈ రోజులిట్టా ఉంటే పిల్లల్నేసుకుని ఎక్కడికని పొయేటట్టు, అన్నీ సక్కరంగా అమిరేదాకా యాడుండాలి. ఇక్కడుండటం కంటే అగమానం ఇంకోటి లేదు. రత్నాలు లాంటి బిడ్డలు వాళ్ళ మొకం చూస్తుంటే పాపమనిపిస్తుంది. వాళ్ళనొదిలి యాడకన్నా బోయినా పీక్కుతినేటట్టుంటది రాక్షసి అని ఆలోచించుకుంటూ ఆకాశం వంక జూస్తా చుక్కలు లెక్క బెడతంటే ఎంతకీ చుక్కల్లెక్క తెగడం లేదు.

…………

ఆరోజు కూడా తూరుపు నంగనాచిలా తెలతెల వారింది. అందరిళ్ళలోనూ ఎలాంటి ఉపద్రవం లేకుండా. ఏ వేళా విశేషము లేకుండా మామూలుగానే తెల్లారిపోయింది.
రాత్రి తినకుండా పడుకోవడంతో పొద్దున్నే ఎవ్వురూ సమయానికి నిద్ర లేవలేదు. మాలక్షుమ్మకి మెలకువొచ్చేసరికి వొళ్ళంతా నొప్పులు అనిపిస్తా ఉంది. అలాగే ఆవులిస్తా వొళ్ళిరుసుకుంటా లేసింది. గోయిందమ్మ మంచం వైపుజూసింది.
గోయిందమ్మ కనబళ్ళేదు. అనుమానమేసి కళ్ళు నుములుకొని పక్కన జూసింది. తన పక్కలో పడుకున్న పిల్లోడు లేడు.
పిల్లా లేదు. మనసెందుకో కీడు శంకించింది.

“ఒరే సీనూ లేరా! లే లేసిట్రా మంచమ్మీద గోయిందు కనబడ్డం లేదు లే! లే! లేసిరా” అంది.
“ఆ! పొద్దున్నే యాడకి పోద్దిలేమ్మా! చెంబట్టుకు పోయుంటదిలే” అన్నాడు కళ్ళు తెరవకుండా
“పిల్లలు కూడా లేర్రా! పిల్లల్ని దీసుకోని ఎటో ఎల్లినట్టుందిరా! లేసిరారా” అంది గాభరాగా.
“ఏంది పిల్లలు కూడా లేరా!” అంటూ దిగ్గున మంచమ్మీద నుండి పైకి లేశాడు. తలొక దిక్కు బోయి చూడండనుకుని,
అందరూ తలొక దిక్కుని బట్టుకొని వెదకడానికి వెళ్ళేరు.
బంగారు రంగు కిరణాలు వంగి భూమికి పాదాభివందనం జేస్తున్నాయి. ఆ వెలుతురు కిరణాల కోసం ఆగకుండా చీకట్లోనే పనులు మొదలు బెట్టే రైతులు ఎవురి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉండారు.
వెంకాయమ్మ నీళ్ళ బిందె భుజాన బెట్టుకుని తలొంచుకుని పోతుంది. మాలక్షుమ్మ ఉరుకుల పరుగులతో బాయి దగ్గర కొస్తా ఎదురైంది. “యేందీ నీళ్ళున్నయ్యంటే బాయిలో” అంది మాలక్షుమ్మ.
ఎవరన్నట్టు తల పైకెత్తి చూసి “ఆ! అయ్యే ఉగ్గిన్నెడు ఉగ్గిన్నెడు దోర్సుకోవడమే. యేందప్పా అంత హడావుడి గుండావు” అన్నది వెంకాయమ్మ.
“గోయిందే! రాత్రి పడుకునేటప్పుడు అందరిమీ మామూలుగానే మాట్లాడుకోని పడుకున్నాము. చీకటితో లేచి చూస్తే లేదు”
“ఏంది గొడవేమన్నా పడ్డారా ఏందింట్లో” అంది.
“అబ్బే! గొడవేం లేదుగానీ వారం రోజుల్నుంచి బాగ దిగులు దిగులుగా కనిపిస్తుంది” అన్నది మాలక్షుమ్మ.
“ఏమి లచ్చుమ్మత్తా ఎతుకుతుండావు” అన్నాడు నారాయణ కావిడి భుజాన బెట్టుకుని వొస్తూ.
“ఆ! గోయిందమ్మ కనబడట్లేద్రా” అంది మాలక్షుమ్మ.
“ఏందోనప్ప! శానామంది అటు పాడితోటల్లో ఉప్పునీళ్ళ బాయి వైపు పోతుండారు. అక్కడెవరో సచ్చిపోయుండారు అనుకుంటున్నా రప్పా” అన్నాడు.
“అమ్మా! అమ్మా! గోరం జరిగిపోయిందే! గోరం…జ…రి…గి…పో…యి…ం…దే…! గోయిందు … గో…యిం…దు..” అంటూ ఏడుపు అడ్డంపడి మాట మింగేశాడు శీనయ్య.
“ఏందిరా! ఏంది? ఏమైంది గోయిందుకి?” కళ్ళలో ఆశ్చర్యం, భయం తొంగి చూశాయి.
“అమ్మా! అమ్మా!” అంటూ మాలక్షుమ్మని తీసుకోని ఉప్పునీళ్ళ బాయి వైపు బయల్దేరాడు.
“ఏందిరా! ఏమైందంట!” అన్నట్టు ఇంకా అర్థం గాక అడిగింది మాలక్షుమ్మ.
“గోయిందింక లేదమ్మా! పిల్లల్తో కూడా ఈ లోకాన్నొదిలిపెట్టి వెళ్ళిపోయింది.”
“ఏందిరా! నువ్వు చెప్పేది” రెట్టించింది మాలక్షుమ్మ.
“అదుగోమ్మా అక్కడ” అంటూ ఉప్పునీళ్ళ బాయివైపు చెయ్యి చూపి ఏడుపందుకున్నాడు.
గుంపులు పోగులుగా ఆడామగా, పిల్లా జెల్లా అందరూ బాయి వైపు పరుగులు దీస్తున్నారు.
ఎప్పుడో ఊరు పాటి దిబ్బల్లో ఉండప్పుడు ఉప్పునీళ్ళు వాడిక్కని తొవ్విచ్చిన బాయిది. అక్కడెవురికీ కలసి రావడం లేదని ఇళ్ళన్నీ వొదిలేసి పై యెత్తుగా పోయి కట్టుకోవడం వల్ల ఆ బాయి పూర్తిగా తుప్పల్తో, ముళ్ళతో మురుగునీరుగా మారి పాడుపడి పోయింది.
ఎప్పుడూ ఎండిపోని బాయి, ఈ యేడు వానలు బడక పోవడం వల్ల అన్నీ బావుల్తోపాటు ఈ బాయి కూడా ఎండిపోయింది.
“ముందు పిల్లల్ని బాయిలోకి దోసి ఆ తరువాత చీర యిప్పదీసుకోని చీరతో పాటే ఆ చెట్టు కొమ్మకి ఉరేసుకుంది.
అబ్బా! ఎంత గోరమైన సావురా! ఎప్పుడూ చూళ్ళేదు ఇట్టాంటి చావులు” ఎవురో గుంపులో నుండి అంటున్నారు.
అప్పటికే మంచం దెప్పించేరు. నాలుగు కాళ్ళకి తాళ్ళతో కట్టి డోలీ కట్టి బాయిలోకి దించారు.
అప్పటికే బాయిలో ఉన్న ఒకాయన ఇద్దరి పిల్లల్ని మంచం మీద వేస్తే, మంచాన్ని పైకి లాగేరు.
ఒకాయన చెట్టెక్కి చీరవిప్పదీసి గోయిందమ్మని కిందకి దించేడు.
“ఆ! పిల్లల్ని నిదరమంకులోనే బలవంతంగా తోసుంటది. పాపం చూడు మొకాలెంత అమాయకంగా ఉండయ్యో!” పిల్లలకి తలొకడికి, ముక్కుదూలా మొకరికి పగిలిపోయింది. నోట్లో పళ్ళు కూడా రాలిపోయాయి. నోట్నిండా నెత్తురు బొక్కుతున్నట్టుగా వొంటిమీద కంతా నెత్తురు కారి చారికలు కట్టి ఉంది. రాయేదో తగిలి పొట్ట దగ్గర పెద్ద లొట్ట పడ్డట్టుగా ఉంది.

“ఇదింత పిరికిముండనుకో లేదురా! తండ్రీ, వొంటికి కట్టుకున్న చీరదీసుకోని చెట్టుకు ఉరేసుకుందే! అబ్బా! ఆ నాలిక లోపలికి నెట్టండ్రా సూడ్డానికే దడుసుకునేట్టుందే! గుడ్లు జూడు పైకి ఎల్లకొచ్చినయ్యి”
“ఎట్టా బతికింది. ఎట్ట పోయిందిరా! గోరమైన సావు జచ్చింది. సావుల్తోనే ఇయ్యేడు తెల్లారినట్టుంది గదరా! మనింటో అయ్యో! దేవుడా!” అంటూ శీనయ్యని పట్టుకోని ఏడుస్తావుంది. కాసేపు కూర్చుంది. మళ్ళీ పైకి లేచింది.

శవాల వైపు జూసి నిన్నుంచి నన్నన్నా యెత్తకపోకబోయె గదే! రాకరాక ఇంటికొచ్చినందుకు మిత్తవ నిన్ను దీసకెళ్ళింది గదే! వాడి గుళ్ళో నిప్పులు బొయ్య. బగవంతుడనే వోడుంటే నువ్వు జేసిన తేగానికి నిన్నెత్తక పోతాడా! యాడేడ బోగిబడియ్యన్నీ బాగానే ఉండయ్యి. నీకే గదంటే నూరేళ్ళు నిండిపోయింది వామ్మో ఓర్నాయనో! ఆ పిల్లోణ్ణి గూడా అన్యాయం జేశావు గదే!
ఓరి దేముడో, ఓరి రాముడో అంటూ .. కిందికీ మీదకీ గింజుకుంటా ఉంది. దుమ్మెత్తి పోసింది. ఎవురు పట్టుకున్నా ఆగడం లేదు. కూర్చుంటదీ, లేస్తదీ, శవాల్దగ్గిరికి పోయిద్ది.
“వామ్మో నేజూళ్ళేనురా ఆ పిల్లముండలేం జేశార్రా! దీని తల్లి ముండమొయ్య! ఒరే శీనాయ్‌ నేం బతకన్రా! నేంగూడా ఆ బాయిలో పడతాన్రా! ఒక్క ఆడముండ, రాకరాక ఇంటికొస్తే మన మొకాన బెట్టుకున్నాం గదరా! దానిక్కాస్త దైర్నం జెప్పాల్సింది బోయి దాన్నే యాపక దిన్నాం గదరా! దాంతో పాటు నేంగూడా పోతేగానీ మీ అందరి కళ్ళూ సల్లంగుండవు” అంటూ సీను చేతుల్లో నుండి జారబీక్కుని బాయివైపు పరుగెత్తుతూ రాయి తట్టుకొని బోర్లా పడిపోయింది. పరుగెత్తుకొచ్చిన సీను పైకి లేవదీశాడు. మాలక్షుమ్మ తల ఒరిగిపోయింది.