“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం !
తానా వారి ద్వైవార్షిక కథల పోటీలో విజేతలైన ఆరు కథల్ని ఈ సంచికలో ప్రచురిస్తున్నాం. అందుకు సంతోషంగా అంగీకరించి అన్ని సదుపాయాలు కల్పించిన శ్రీ జంపాల చౌదరి గారికి కృతజ్ఞతలు. ఇంతకు ముందు 2001 లోనూ, 1999 లోనూ ఇలాగే అప్పటి కథావిజేతల్ని “ఈమాట” ప్రచురించిందని మా పాఠకులకు గుర్తుండే వుంటుంది. మళ్ళీ ఓ మారు వాటిని చదవదలుచుకున్న వారు జులై 2001, జూన్ 1999 సంచికలను సంప్రదించండి.
ఈ కథల గురించి తానా కథల పోటీ న్యాయనిర్ణేతలు రాసిన అభిప్రాయాలే కాకుండా మరొక పాఠకుడి అభిప్రాయాల్ని కూడ అందిస్తున్నాం. మిగిలిన పాఠకులు వారి అభిప్రాయాల్ని కూడ అందరితోనూ పంచుకుంటారని ఆశిస్తున్నాం.
ఈ సంచిక అనుబంధ రచనా విభాగంలో జాషువా గబ్బిలము రెండవభాగం, ఇస్మాయిల్ కావ్యాలు చెట్టు నా ఆదర్శం, మృత్యువృక్షం ఇస్తున్నాం. ఇస్మాయిల్ గారి కావ్యాల్ని టైప్ చేసి ఇచ్చిన గట్టు వినీల్ గారికి మా కృతజ్ఞతలు. ఇలా ఇతర కావ్యాల్ని, రచనల్ని టైప్ చేసి పంపే ఉత్సాహం ఉన్నవారు మమ్మల్ని సంప్రదించండి. ప్రస్తుతం మేము తిలక్ అమృతం కురిసిన రాత్రి, నగ్నముని కొయ్యగుర్రం, దిగంబర కవుల కవిత్వం మొదలైన కావ్యాల కోసం చూస్తున్నాం. వీటిని టైప్ చేసి ఇవ్వగలిగిన వారికి మా ఆహ్వానం. అలాగే సంప్రదాయ సాహిత్యం నుంచి కూడ వసుచరిత్ర, శృంగారనైషథం వంటి కావ్యాల్ని టైప్ చెయ్యదలిచిన వారు కూడ ఆహ్వానితులే!
తానా కథలతో బాటు నేరుగా “ఈమాట” కు వచ్చిన వాటిలో ప్రచురణార్హమైన కథల్ని యథాప్రకారంగా ప్రచురిస్తున్నాం. అలాగే కవితలు, వ్యాసాలు కూడ. పాఠకుల అభిప్రాయాల్ని, రచయిత్రు(త)ల సహకారాన్ని ఆహ్వానిస్తున్నాం.
వచ్చే సంచిక నుంచి చిత్రకారుల చిత్రాల్ని కూడ “ఈమాట”లో ప్రచురించబోతున్నాం. చిత్రకారులు, ఛాయాచిత్రకారులు కూడ వారి వారి “రచన”ల్ని “ఈమాట”లో ప్రచురణ కోసం పంపవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.