నందిని

పండగ, సంబరం,  ఆనందం. పట్టలేని విజయోత్సాహం.  ఒకళ్ళ నొకళ్ళు కౌగిలించుకుంటున్నారు, అభినందించుకుంటున్నారు.  కోలాహలం. కోల్పోయిన సాయంత్రాలూ, నిద్రలేని రాత్రులూ ఎన్నని?  రెండున్నరేళ్ళ గొడ్డుచాకిరీకి గుర్తింపు,ప్రతిఫలం.

తన ఆఫీసు గదిలో కుర్చీలో జారగిలబడి ఉంది నందిని.  ఆమె చేతుల్లో అటూ ఇటూ మారుతూ ఎర్రటి మెత్తటి బంతి.   బల్లమీద కంప్యూటర్లు రెండూ పనిలేక సోమరుల్లా స్క్రీన్‌ సేవర్లని ఎగరేస్తున్నాయి.  మారుతున్న బంతి మీద అందమైన కంపెనీ పేరు, లోగో! ఆ లోగో మరింత అందంగా కనపడింది నందినికి.  చిన్న చిరునవ్వు.
“హే మిలియనీర్‌..” అంటూ వచ్చాడు మార్క్‌
“రెండు వందల మంది మిలియనీర్లం మనం తెలుసా ఇప్పుడు” అన్నాడు  ఎదురుగా కుర్చీలో కూలబడుతూ.
అతడి నెత్తిన అంతా కలిసి షాంపేన్‌  గుమ్మరించారు పొద్దున.  వెళ్ళి స్నానం చేసివచ్చాడు. అయినా ఇంకా షాంపేన్‌  వాసన పూర్తిగా పోలేదు.
“నా కింకా నమ్మకం కలగట్లేదు” అంది నందిని.
“అందరి పరిస్థితీ అలానే ఉంది…  అవునూ, సాయంత్రం పార్టీకి నీ కార్లో వస్తాను, మరిచేపోకు.  వెనక్కి వచ్చేటప్పుడు నేను స్పృహలో ఉండనేమో!” అన్నాడు.
“అలాగే.  అయితే ఇప్పుడే పద, ఇంక ఆఫీసు వదిలేద్దాం.  ఇంటికి వెళ్ళి ఇండియాకి ఫోన్‌  చెయ్యాలి. అలాగే  స్నానం కూడా చేసి అక్కణ్ణించే పార్టీకి పోవచ్చు” అంది నందిని.
“ఒక్క అయిదు నిముషాలు” అంటు వెళ్ళాడు మార్క్‌ , తన బ్యాగ్‌  తెచ్చుకోడానికి.
అరగంటలో నందిని ఇంట్లో ఉన్నారిద్దరూను.  అదో సింగిల్‌ బెడ్రూం అపార్టుమెంట్‌ .నందిని ఒంటరి జీవితానికి స్థావరం.
ఆఫీసుకి వెళ్ళినట్టే ఉంటుంది మార్క్‌ కి నందిని ఇంటికి రావటం. ఎన్నో ప్రాజెక్ట్‌  నిర్ణయాలు కూడా ఆ ఇంట్లోనే తీసుకున్నారు. ఎన్నో సార్లు తెల్లవారుఝామున నాలుగింటికి ఆఫీసు నించి నందినితోపాటు ఈ ఇంటికి వచ్చి  సోఫాలో పడుకుని పొద్దున్నే లేచి మళ్ళీ ఆఫీసుకి వెళ్ళడం అతగాడికింకా గుర్తే.
“మిలియనీర్‌ ఇంక నువ్వు మంచి ఇల్లు కొనాలి” అన్నాడు మార్క్‌  అలవాటు ప్రకారం సోఫాలో కూలబడి, టివీ రిమోట్‌ చేతిలోకి తీసుకుంటూ.
“తప్పకుండా. కాపోతే, ఒంటరిగా బోరు కొడ్తుందేమో ఇంతకంటే పెద్ద ఇంట్లో” అంటూ సమాధానం కోసం ఎదురుచూడకుండా లోపలికి నడిచింది.
ఫోన్‌  చేతిలోకి తీసుకుని ఓ నిమిషం ఆలోచించింది. మాటలకోసమో, మరిదేనికోసమో తడువుకుంటున్నట్టుంది.  ఏం  చెప్పాలనో, ఏ వినాల్సొస్తుందనో ?

ఇంటి నంబర్‌  డయల్‌  చేసింది.
“హల్లో” తండ్రి గొంతు.
“నాన్నా నేను”
“నందూ! చెప్పమ్మా”  తండ్రి గొంతులో రెండు ఫోన్ల మధ్య ఉన్న దూరం తెలుస్తోంది.
“నాన్నా, గుడ్‌  న్యూస్‌ ! చివరికి మా కంపెనీ పబ్లిక్‌  కి వెళ్ళింది. రెండుసార్లు వాయిదా పడింది ఇప్పటికి.  ఈ సారి మాత్రం నిజంగా ఓపెన్‌  అయ్యింది.   ఇవ్వాళ చూడాలి, ఓపెన్‌  అవటంతోనే ఎట్లా అంకెలు మారాయనుకున్నావ్‌.. అందరం అలా టీవీ చూస్తూ కూర్చుండి పోయాం.  ముందునించీ అనుకుంటూనే ఉన్నాం కానీ, మరీ ఇంతలా మార్కెట్‌ రియాక్ట్‌  అవుతుందనుకోలేదు.  ఆఫీసులో మా మొహాలు చూడాలి.  ఎందుకూ, ఎప్పటికీపనికిరావేమో ననుకున్న ఆప్షన్లన్నీ ఇప్పుడు బంగారం ముక్కలు తెలుసా…. హల్లో నాన్నా వింటున్నావా?”… గుక్క తిప్పుకోకుండా చెపుతోంది నందిని.
“వింటున్నానే, మొత్తానికి సాధించావు.  నాకేం పెద్ద ఆశ్చర్యంగా లేదు.  నీకేమన్నా అనుమానంగా ఉండిందేమో గానీ, నేనయితే అనుకుంటూనే ఉన్నాను.  మీరు పడుతున్నకష్టం తెలిసినవాణ్ణి కాబట్టి, ఫలితం లేకుండా ఉండదని అనుకుంటూనే ఉన్నాను. బద్ధకస్తులూ, పిరికివాళ్ళూ ఓడిపోతారు కానీ , కష్టపడే వాళ్ళూ, సాహసవంతులూ గెలిచే దాకా పనిచేస్తూనే ఉంటారు”

“చాల్లే నాన్నా నీ థియరీలు….  ఇప్పుడు నా ఆప్షన్లెంత విలువ చేస్తాయో తెలుసా?
అమ్మో! లెక్కెయ్యడానికి కూడా భయమేస్తోంది.  బహుశా నేనిప్పుడు ఉద్యోగం మానేసినా మరో రెండు తరాలు కూర్చుని తినచ్చు”
“సరే ఓ ఏసీ కారు కొనివ్వు నాకు” నందిని తండ్రి..
“ఎన్ని కావాలో చెప్పు, కొనేద్దాం! సరే అమ్మేం చేస్తోంది?”
నందినికి తెలుసు, ఏసీ కార్లూ, బంగళాలూ ఏవీ తండ్రిని అంతగా ఆనందపరచలేవని.
“ఇదిగో పక్కనే ఉంది.  నువ్వేదో ఘనకార్యం చేశావని అప్పుడే అర్థమయినట్టుంది. లాక్కుంటోంది ఫోను” తండ్రి.
“నందూ, నందూ”… తల్లి గొంతు.
“అమ్మా నీకేం కావాలే”
“నాకేం కావాలే? ఇంతకీ ఎంత వెనకేశావ్‌ ? ఇకనన్నా తిండీ తిప్పలూ లేకుండా ఆ గొడ్డు చాకిరీ తప్పుతుందా?”
“అమ్మా ఏ కష్టం పడకుండా అన్నీ కావాలంటే ఎట్లాగే?”
“ఏమోనమ్మా! ఏవో కావాలని కష్టపడ్డావటే నువ్వు?”
నందిని అలోచనలోపడింది, “ఒక్క డబ్బు కోసమే ఇంత కష్టపడ్డానా?” అని.
కంపెనీలో చేరిన మొదటిపదిమందిలో ఆమె ఒకర్తి.  తానూ, మార్క్‌  డెవలప్మెంట్‌  లీడ్‌ తీసుకున్నప్పట్నించీ మొత్తం డెవలప్మెంట్‌  పద్ధతి మార్చేసి ఇక్కడిదాకా పట్టుకొచ్చారన్న గుర్తింపు ఉందనీ ఆమెకి తెలుసు.  అడగక్కర్లేకుండానే ఆమె ఖాతాలో కుప్పలు కుప్పలుగా ఆప్షన్లని పోశారు.  ఆగి చూసుకునే అవసరం కానీ, సమయం కానీ ఆమెకు లేకపోయినయి.  ఆమె దృష్టంతా ఒక్కదానిమీదే ఉండింది, సంవత్సరం లోపు కంపెనీ పబ్లిక్‌ కి వెళ్ళకపోతే ఏదో ఓ పెద్దచేప మింగేస్తుంది.. లేదా పూర్తిగా మూతబడుతుంది.

“ఏవో కావాలని కాకపోయినా, ఏవీలేవంటే కష్టపడతామా?” నందిని ఆలోచిస్తున్నట్టుగా అంది.
“ఇంక ఆ ఒక్కటీ మిగిలిపోయింది. అదిగూడా ఎలాగోలా అయిపోతే ఇక నీగురించి దిగులుండదు”
“ఏ ఒక్కటీ?”   మామూలు రోజుల్లో అయితే నందినికి అర్థమయే ఉండేది, ఆ ఒక్కటీ ఏమిటో.
“ఇంకేమిటి… ఏదో ఓ సంబంధం చూసుకుని పెళ్ళి చేసుకుంటే సరి” కొంత సంశయిస్తూనే అంది.
“అమ్మా!” అరిచినట్టుగా అంది నందిని.
“నూటికి 99 మంది ఇండియానించి వచ్చే ఇంజనీర్లు సాధించాలనుకుని సాధించలేనిది నేను సాధించానని చెప్పటానికి ఫోన్‌ చేశాను.  నా పెళ్ళి సంగతి ఇప్పుడెందుకు ఎత్తుతావు?  అదొక్కటీ నేనేదో సాధించలేక పోయినట్టు”
“సాధించటం ఏంటే… అదికూడా ఓ అవసరమే కదటే”
“నా మూడంతా పాడు చేశావు.  మళ్ళీ ఫోన్‌ చేస్తా.  ఆఫీసు పార్టీ, పెద్ద హోటల్లో, పెద్ద సెలబ్రేషన్‌.. బై”  సమాధానం కోసం ఎదురుచూడకుండా ఫోన్‌  పెట్టేసింది నందిని.
వచ్చిన కోపాన్ని అదుపు చేసుకోడానికి ఓ నిమిషం  అలాగే కదలకుండా కూర్చుంది. మెల్లగా లేచి, ముందుగదిలో మార్క్‌ కి వినబడేలా అరిచింది, “టీవీ చూస్తుండు, త్వరగా స్నానం చేసొస్తా” నంటూ.
వంటిమీద వేణ్ణీళ్ళు పడటంతో పొద్దుట్నించీ ఉన్న ఉద్వేగం, ఇప్పుడే వచ్చిన కోపం అన్నీ తగ్గి విశ్రాంతి దొరికినట్టనిపించింది.   కానీ ఆలోచనలు ఆగుతాయా?

2

నందినికి బాగా గుర్తు. తన జీవితానికి ఓ ఇదమిద్ధమయిన ఆలోచన ఏర్పడిన రోజది.  ఫైనల్‌  సెమిస్టర్‌  ప్రాజెక్ట్‌  రోజులు.  చదువుకంటే, చదువు తర్వాత ఏమిటని  ఎక్కువగా ఆలోచించే రోజులు.  క్యాంపస్‌   ఇంటర్వ్యూలూ, అప్లికేషన్లూ,జి.ఆర్‌ .యీలూ, టోఫెళ్ళూ, ప్రేమలూ, ప్రపో़జళ్ళూ, పెళ్ళిచూపులూ, ముహూర్తాలూ…

లాబ్‌  నించి కాంటీన్‌  కి నడుస్తోంది నందిని.
“నందూ.. నీకో సర్ప్రయిజ్‌  న్యూస్‌ ..”  అంటూ ఎదురయ్యింది క్లాస్‌ మేట్‌  మాధవి.
“ఏమిటే అంత పెద్ద సర్ప్రయిజ్‌  ?” అంది నందిని
” ఇది చూడు” అంటూ బ్యాగ్‌ లోంచి ఓ రెండు పిన్‌  చేసిన పేపర్లు తీసి,  దగ్గర్లో ఎవరూ లేరని నిర్థారించుకుని నందిని చేతిలో పెట్టింది.
ఆశ్చర్యంగా చూసింది నందిని.  ఆ రెండు పేజీల పైన ఆమెదే కలర్‌ ఫొటో, ఆకుపచ్చ పట్టుచీరలో. “ఎంత అసహజంగా ఉంటాను చీరలో” అనుకుంది.  రాధా వాళ్ళ అక్క పెళ్ళికి క్లాస్స్మేట్స్‌  అందరూ పట్టుచీరలు కట్టుకు వెళ్ళాలని సరదాపడి వెళ్ళినప్పుడు రాధ తీయించి ఇచ్చిన ఫొటో అది.  పెళ్ళి ఫొటో గ్రాఫర్తో క్లాస్స్మేట్స్‌ అందరికీ విడివిడిగా ఫొటోలు తీయించింది రాధ.  ఆందరికీ ఫొటో నెగెటివ్‌  కూడా ఇచ్చి,  పెళ్ళిచూపులకి వాడుకోండని చెప్పింది.

ఆ ఫొటో పైకెత్తి చూసింది నందిని.  అదో పెళ్ళి రెస్యూమే.  మొదటి పేజీలో ఆమె ఎత్తు, రంగు, చదువు, ఇంజనీరింగు రాంకు, వచ్చిన స్కాలర్షిప్పులూ అన్నీవివరంగా ఉన్నాయి.  “దీనికిది ఇలాగే TCS  కి పంపించొచ్చు” అనుకుంది.  రెండో పేజీలో ఆమె జాతక చక్రం.  అదెక్కణ్ణించి వచ్చిందో ఎవరు తయారు చేశారో ఆమెకి తెలీదు.
“ఇదెక్కడిది నీకు” అంది నందిని ఇంకా నమ్మలేనట్టుగా.
“మా అన్నయ్యకి వచ్చిన సంబంధాల్లో ఇదొకటి.  నిన్న మధ్యాహ్నం పోస్టులో వచ్చింది.  అన్నీ నేనే తీసి ఫైల్‌  చేసి మా నాన్న కిస్తాను.  ఇది చూడగానే మతిపోయింది నాకు” మాధవి.
“ఇది నిజంగానే పెద్ద సర్ప్రయిజ్‌ . నాన్న సంబంధాలు చూడనా అంటే సరేనన్నాను. ఎవరయినా సరిపడిన పెళ్ళికొడుకు దొరికితే అలాగేనన్నాను.  ఇదంతా ఎప్పుడో నాలుగునెల్ల క్రితం సంగతి.   మళ్ళా మా నాన్న ఏమ్మాట్లేదు, నేనూ ఏమడగలేదు. సంబంధాలు చూడ్డం అంటే ఇలా బయోడేటాలు ఊరంతా పంచుతారనుకోలేదు”
“లేదే… ఇదేదో మారేజ్‌ బ్యూరో నించి వచ్చింది.  బహుశా మీ వాళ్ళు అందులో రిజిస్టర్‌ చేసి ఉంటారు”
“అయ్యుండాలి”  అంది నందిని ఆలోచిస్తూ…
“నందూ, ఏమనుకోకు నిజం చెప్పేస్తాను.  మా అన్నయ్య సంబంధం మాత్రం మర్చిపో” చెప్పలేనట్టుగా కొంచెం కష్టపడుతూ చెప్పింది.
నందిని ఒక్కసారిగా నవ్వింది.
“ఎందుకే నువ్వంత భయపడతావు? నేనేమీ మీ అన్నతో పెళ్ళిని ఊహించుకుని కలలు కనెయ్యట్లేదు.  ఇలాటి రెస్యూమే ఒకటి తిరుగుతోందనే నాకు తెలీదు.  ఇక మీ అన్నగురించి నాకు తెలిసింది సున్నా”
“అది కాదే.  నీతో స్నేహం చెడటం ఇష్టం లేదు.  అందుకే నేను హడావిడిగా మన మధ్యనించి దీన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నాను.  మా అన్న  మగాడు! అంటే తెలుసుగా ఇంజినీరింగ్‌  చేసి, పెసరట్టుప్మా చేసే ఐశ్వర్యా రాయి కావాలి” అంది మాధవి.
నందిని పడీ పడీ నవ్వింది, మాధవి చెప్పిన తీరుకి.
కానీ నందినికి తెలుసు. తను ఇంజనీరింగు చేస్తోంది, పెసరట్టుప్మా కూడా చేయగలదు.  కానిదల్లా తాను ఐశ్వర్యా రాయి!

ఇద్దరూ పెళ్ళిళ్ళూ సంబంధాల గురించి మాట్లాడుకుంటూ కాంటీన్‌ చేరారు.  మాధవి ఇద్దరికీ చాయ్‌  తీసుకొచ్చింది.
“ఓ మాట చెప్తాను ఏం అనుకోవుగా” అంది
నందినితో తనకున్న  స్నేహానికి అలా అడగక్కర్లా.  అలా అడిగిందంటే ఆమెకే తెలుసునన్నమాట, నందినికి నచ్చని విషయమే చెప్పబోతున్నానని.  అలాంటప్పుడు చెప్పడం ఎందుకు?
నందిని తలెత్తి చూసింది.
“నీకు సరయిన సంబంధం, నువ్వు కోరుకున్నట్టుగా ప్రొఫెషనల్తో కావాలంటే ఇలా లాభం లేదు.  నువ్వు నా మాట విని సర్జరీ చేయించుకో. మొహమ్మీద మచ్చలు ఈ:జీగా తీసేయొచ్చు.”
నందిని ఏదో అనబోయి తమాయించుకుంది.
మాధవి తన శ్రేయోభిలాషి అని ఆమెకి తెలుసు. నిజాన్ని చెప్పిందే తప్ప అవమానించే ఉద్దేశం లేదని సమాధానపడింది.
కోపాన్నీ ఆవేశాన్నీ మింగేయడానికి కాస్త టైం పట్టింది నందినికి. మెల్లిగా అంది…
” మొహమ్మీద మచ్చలకి ప్లాస్టిక్‌  సర్జరీ. తర్వాత? బ్రెస్ట్‌  ఇంప్లాంట్‌ చేయించుకోవాలా… ఇవి సరిపోతాయా? దాంతర్వాత నడుం సన్నగా… ఇంకా ఏమేం చేయించుకోవాలే పెళ్ళికోసం? కాని నాకు తెలిసిన పెళ్ళికొడుకులెవరూ పెళ్ళికోసం ఇన్ని తంటాలు పడ్డం చూళ్ళేదు.   సరే విషయం వచ్చిందికాబట్టి ఇక నేనేదో ఓ నిర్ణయం తీసుకోవాలి.   అందం గురించి నాకు తెలీదు.  నా మట్టుకు నాకు ఆరోగ్యమే ఆందం.  నా ఆరోగ్యానికేమీ ఢోకా లేదు”.
“నందూ, కోపం తెచ్చుకోకు, బాధ పడకు.  నీకేం కావాలో నిర్ణయించుకోమని చెపుతున్నాను.  నీకు కనీసం చదువన్నా వుంది. నీ సంపాదన చూసయినా చేసుకునే వాళ్ళుంటారు.  గవర్నమెంట్‌  ఉద్యోగస్తులో, బ్యాంకు  ఉద్యోగాలు చేసే వాళ్ళో పర్లేదంటే నీ యిష్టం.  ప్రొఫెషనల్‌  కావాలీ , అమెరికా ఆస్ట్రేలియాలూ కావాలంటే మాత్రం నువ్వూ అందరిలానే నడవాలి.   పెళ్ళీ పెటాకులూ అక్కర్లేదనుకుంటే నీ యిష్టం.  ప్రాక్టికల్గా ఉండమంటున్నాను.  రెస్యూమే దాకా వచ్చింది కాబట్టి చెపుతున్నాను… ఈ ఆటలో రూల్స్‌”  అంది మాధవి.  నందినికీ తెలుసు మాధవి
మాట్లాడిందంతా నిజమేనని.
“మధూ, నిజం చెప్పాలంటే పెళ్ళిగురించి ఇంతవరకూ నేను కూడా ఇంతలా ఆలోచించలేదు.  నువ్వు చెప్పింది కూడా నిజమే.  ఏ ఉద్యోగం చేసే వాణ్ణయినా చేసుకోవడానికి నాకభ్యంతరం లేదు గానీ,  ఆ పెళ్ళీ, ఆ మనిషి ఉద్యోగం నా గమ్యానికీ, జీవితానికీ అడ్డంకులు కావడం నాకిష్టం లేదు. వాటన్నిటికన్నా ముందు… ఇలాంటి పెళ్ళి తంతు నాకు మరీ అన్యాయంగా తోస్తోంది. పెళ్ళికోసం మరీ ఇంత రాజీ పడాలా… అదిలేకుండా బతకడమే సుఖంలా ఉంది… బతగ్గలిగితే!!”
మిగతా మితృలంతా రావటంతో ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయింది.  నిజానికి ఆ తర్వాత మరెప్పుడూ కూడా వాళ్ళ మధ్య ఆ సంభాషణ రాలేదు!

ఆ రోజు సాయంత్రం నందిని ఇంటికి వెళ్ళేసరికి తల్లీ తండ్రీ టీవీ ముందు కూర్చుని వున్నారు.  నందిని నేరుగా వెళ్ళి టీవీ ఆపేసింది. తల్లీ తండ్రీ ఏమిటన్నట్టుగా చూశారు.
నందిని మాట్లాడకుండా బేగ్‌ లోంచి పెళ్ళి రెస్యూమే తీసి తండ్రికిచ్చింది.
“ఏమిటిది” అడిగింది ఆవేశాన్ని, కోపాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూ.
“సంబంధాలు చూస్తున్నామని తెలుసుగా”  అన్నాడు తండ్రి.
“సంబంధాలు చూట్టం అంటే ఇలాగా?  నాకింత వరకూ ఏ పెళ్ళికొడుకు రెస్యూమే నువ్వు చూపించలేదు”   అంది నందిని.
“నందూ!  నీకు తెలిసి మాట్లాడతావో తెలియక మాట్లాడతావో ఒక్కోసారి అర్థం కాదు. నిన్ను అడిగి నీ ఇష్టం తోనే సంబంధాలు చూస్తున్నాను.  అమ్మాయిలవి ఇలా రెస్యూమేలు పంపడం, పెళ్ళికొడుకులు షార్ట్‌ లిస్ట్‌  చేసి పెళ్ళిచూపులు చూడ్డం ఇప్పటి పద్ధతి. ఈ సంగతి నీకు తెలీదంటే నేన్నమ్మను” అన్నాడు తండ్రి
“సరే నాన్నా ఆ సంగతి నాకు తెలుసు నిజమే.. ఎందుకో నాదాకా వస్తుందనుకోలేదు. ఇలాటి పెళ్ళి నాకక్కర్లేదు.   ఎవరో ముక్కూ మొహం తెలీని వాళ్ళు నా ఫోటోనీ ఇంకో ఫొటోనీ పక్కన పెట్టి లెక్కలు వేసుకోవటం, లొట్టలు వేసుకోవటం నేను భరించలేను.   అది కూడా అలాటి అవకాశం నాక్కూడా లేకుండా.  ఎలాగూ నా అందానికి ఏ రాకుమారుడూ దిగిరాడు.   ఈ ప్రయత్నాలు ఆపేసి,  ప్రస్తుతానికి  నన్ను చదువు మీదా ఉద్యోగం మీదా మనసు పెట్టనీ.  ప్లీజ్‌ ,  పెళ్ళి అంత అత్యవసరమైన విషయంగా అనిపిస్తే అప్పుడాలోచిద్దాం” చెప్పింది నందిని
“అదేమిటే  ఏ ప్రయత్నం లేకుండా పెళ్ళెట్టా ఔతుంది.   ఒకళ్ళ గురించి ఒకళ్ళకి  తెలియకుండా  సంబంధాలెట్టా కలుస్తాయి?   పాతకాలంలో  ఉత్తరాలు రాసేవాళ్ళు. మా నాన్న పదిహేను పైసల కార్డు  ముక్కలు రాయటం నాకిప్పటికీ గుర్తు.   కాలం కాస్త మారిందంతే… అలా గింజుకుంటే ఎలాగే” అంది తల్లి నచ్చ చెబుతున్నట్టుగా.

నందిని నోరు విప్పేలోగానే అన్నాడు తండ్రి..
“అది మారిన కాలం గురించి కాదు అడుగుతోంది,  మారని కాలం గురించి.  నీ  యిష్టం నందూ.  పద్ధతి ప్రకారం తండ్రిలా నా బాధ్యత నెరవేర్చ మంటే  అన్నీ చేస్తాను.  నేను పెద్దదాన్నయ్యానూ నా మంచి చెడ్డలు నాకు తెలుసు అనంటే..  అది కూడా నే నొప్పుకుంటాను”   అని బయటకెళ్ళపోతూ ఆగి వెనక్కి తిరిగి…
“నందూ మర్చి పోకు. చలం పుట్టింది మీ తరంలో కాదు. మా తరంలో.  నీకు ఏ తేడా లేకుండా చదువు చెప్పించడంతోనూ, నీ కాళ్ళమీద నువ్వు నిలబడేట్టుగా చెయ్యడంతోనూ నా పని అయిపోయింది.  నువ్వు లోకంతో కల్సి పోతావో, నచ్చని వాటికి ఎదురు తిరుగుతావో నువ్వే నిర్ణయించుకోవాలి.  నీ తరపున ఆ యుద్ధం చెయ్యాల్సిన పని నాది కాదు” పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటు వెళ్ళిన తండ్రి వైపు విస్మయంగా చూసింది నందిని.
నందినికి తెలుసు తండ్రి ఎంత ఆవేశపరుడో.  తన ధైర్యానికీ వ్యక్తిత్వానికీ ఆదీ అంతం అన్నీ తన తండ్రిలోనే అని ఆమెకి తెలుసు.
” పర్యవసానం ఆలోచించకుండా ఏమీటా దూకుడు….  ఈ దారిన వెళితే ఏం
జరగ్గలదో ఆలోచించడానికే నాకు భయం వేస్తోంది? మీకిద్దరికీ అసలు ముందాలోచనే ఉన్నట్టు లేదే” అంది తల్లి, భర్తకి వినిపించదని తెలిసీ.
“నువ్వున్నావు కదే అన్నీ అలోచించడానికి” కొంత నిర్లక్ష్యంగా కొంత ఏడిపిస్తున్నట్టుగా అంటూ తల్లి పక్కనే కూర్చుని గారాబంగా చేతుల్తో చుట్టేసింది నందిని.
“హు.. తెలుస్తుందే… అమ్మ కూడా ఆలోచించగలదని. విషయం వచ్చినప్పుడు నీకే తెలిసొస్తుంది, అమ్మ విలువేమిటో”  అంది కూతురి తలమీద ప్రేమగా చేయివేసి.

3

ఆలోచనల్లోంచి ప్రయత్నం మీద బయటపడి, స్నానం ముగించి త్వర త్వరగా తయారయింది నందిని.
ఇద్దరూ కలిసి బయటికి నడిచారు. కారు బయల్దేరిందాకా ఎవరూ మాట్లాడలేదు. ఆలోచనల బరువు లోంచి నందిని ఇంకా బయట పడలేదని మార్క్‌ కి తెలుస్తోంది. ఆమెని అలానే వదిలేయాలో లేక మాట్లాడించాలో ఓ నిమిషం అర్థం కాలేదు. మెల్లగా అన్నాడు.
“ఇంట్లో అంతా బానే ఉందిగా. నువ్వు ఫోన్లో మాట్లాడినప్పట్నించీ చూస్తున్నా.. ఏదో అప్సెట్‌  అయినట్టు కనపడుతున్నావు… ఏమైనా…”  కొంత సందేహిస్తూనే అడిగాడు. నందినికి అర్థమయింది. ఫోన్లో గొంతు పెంచి మాట్లాడ్డం వినపడి ఉంటుంది. తన ప్రవర్తన అంత సులభంగా అర్థమయేలా ఉంటుందా అని ఆశ్చర్యపడింది.
“వెల్‌ !  పాత సంగతే.  నా పెళ్ళి కాలేదని మా అమ్మ దిగులు.  అది సమస్యే కాదు, నేను హాయిగా ఉన్నానన్నా వినదు.   అది మా పద్ధతి… ఎంతయినా రాజీ పడాలి… అమ్మాయి అంటే ఎవడూ ఎలాటి వాడూ అన్నది అనవసరం, ఎవడో ఒకడితో పెళ్ళి అయిపోవాలంతే.  అలా కాని అమ్మాయి ఇంట్లోనూ ఊళ్ళోనూ అందరికీ సమస్యే”

మార్క్‌  వెంటనే మాట్లాడలేదు. తనకి ఇంతకు ముందే ఈ విషయాలు కొంతవరకూ తెలియడం వల్ల  పెద్ద ఆశ్చర్య పోలా.  సంవత్సరం క్రితం ఇలాంటివి మొదటిసారి వింటున్నపుడు ఉన్న కుతూహలం, విస్మయం కూడా పోయాయి మనిషిలో.
“కమాన్‌  నందూ! సుధాకర్‌  వాళ్ళమ్మ కూడా అతన్ని తొందరగా పెళ్ళి చేసుకోమని గొడవ పెడ్తోందిట.  ఇండియా వెళ్ళటమే వాయిదా వేసుకుందామనుకుంటున్నాడు, ఆ గోల భరించలేక.   నువ్వనవసరంగా మీ అమ్మని అనుమానిస్తున్నావేమో. నువ్వు అబ్బాయివయినా మీ అమ్మ ఇలాగే అడిగి ఉండేదేమో”
మార్క్‌  వైపు ఆశ్చర్యంగా చూసింది నందిని.  ఎంత త్వరగా అలోచించ గలడు ఈ మనిషి అని. మెల్లగా అంది…
“బయట నించి చూస్తే అలాగే ఉంటుంది మార్క్‌ .   మా దేశపు మధ్యతరగతి బతుకుల్లో ఉండే కాంప్లెక్సిటీ అంత సులభంగా అర్థమయేది కాదు.   ఆ రెంటికీ తేడా ఏమిటంటే…   సుధాకర్‌  పెళ్ళి ఆలస్యమయితే అతడు చేసుకోలేదు అని అర్థం.
నా పెళ్ళి ఆలస్యం అయితే  నాకు పెళ్ళి కాలేదూ అని అర్థం. ఈ రెంటికీ తేడా అర్థమయితే మిగతావి అర్థమవుతాయి”
“నిజమే !  నేనివి అర్థం చేసుకునే ప్రయత్నమే చేయకూడదు” అంటూ సంభాషణలోంచి బయట పడటానికి కారు రేడియో ట్యూన్‌  చెయ్యడం మొదలుపెట్టాడు.
నందిని కూడా ఓ నిమిషం ఏమీ మాట్లాడకుండా డ్రైవ్‌  చేసింది. సడన్‌  గా అడిగింది.
“కాథీ ఎలా ఉందో తెలుసా ఏమన్నా”
అకస్మాత్తుగా కాథీ ఎందుకు గుర్తుకు వచ్చిందో అర్థం కాలేదు మార్క్‌ కి.  కాథీ ఆర్నెల్ల క్రితం దాకా మార్క్‌  గర్ల్‌ ఫ్రెండ్‌
నందిని కొంచెం సర్దుకుంటున్నట్టుగా  “పక్క కార్లో అమ్మాయి కాథీలా కనపడితే గుర్తొచ్చి అడిగాను” అంది.
“ఏమో నాకేం తెలీదు.  చికాగో వెళ్ళింది నాలుగు నెల్లక్రితం.  స్కూల్లో చేరినట్టుంది. వెళ్ళే ముందు ఇమెయిల్‌  పంపింది. తర్వాత తెలీదు” అన్నాడు ముక్తసరిగా.

వాళ్ళిద్దరి స్నేహం, సంబంధం,  చివరికి విడిపోవడం అన్నీ వింతగా తోస్తాయి నందినికి ఇప్పటికీ.  ఆమె దృష్టిలో వాళ్ళిద్దరిలో ఎక్కడా పొంతన లేదు.  మార్క్‌ తెలివితేటలకీ, కష్టపడే తత్వానికీ… కాథీ  అల్లరి చిల్లర తనానికీ లంకె ఎలా కుదిరిందో ఆమెకి ఇప్పటికీ అర్థం కాదు.  “ఆడది అందంగా ఉంటే చాలా ఏ మగాడికయినా? అయ్యుండాలి” అనుకుంది…   ఆఫీసులో పని జీవన్మరణ సమస్యగా మారి తిండీ తిప్పలు మానేసి  అందరూ పనిచేస్తున్నప్పుడు మార్క్‌  తోటి కాథీ విడిపోయింది.   “వారాంతాలూ, సాయంత్రాలూ కూడా కలవలేని బాయ్‌  ఫ్రెండ్‌ ఎందుకు, ఫొటో ఫ్రేములో చూసుకోడానికా?” అని అంటూ.
“ఒంటరి తనం కొంచెం కష్టమయినదే.  ఎంత రాజీ పడ్డా, దేంట్లో రాజీ పడ్డా తోడు దొరుకుతుందంటే తప్పులేదనుకుంటా” అనద్దనుకుంటూనే అన్నాడు మార్క్‌ .
పెద్దగా ఆశ్చర్యపోలేదు నందిని.  మార్క్‌  ఎలా పెరిగాడో నందినికి తెలుసు.  అతను చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు.  ఆయన రోడ్డు మీద నడుస్తూ, ఎవరో ఎవర్నో కాలిస్తే రేగిన తూటాలకి అన్యాయంగా బలయి పోయాడు.   తెలిసీ తెలియని వయసులో జరిగిన ఆ దుర్ఘటన ఇప్పటిదాకా మార్క్‌ ని వెంటాడుతూనే ఉంది.  తల్లి అతికష్టం మీద పెంచింది మార్క్‌  నీ అతని చెల్లెల్నీ.  మార్క్‌ కి పదేళ్ళ వయసున్నప్పుడు వాళ్ళమ్మ రెండో పెళ్ళి చేసుకుంది.   సవతి తండ్రి మంచివాడే అయినా మార్క్‌  అతడితో కలవలేకపోయాడు.  అవసరానికి మించిన ఒంటరితనాన్ని చిన్నప్పట్నించీ మోసిన అనుభవం అతనిది.    అవకాశం దొరగ్గానే ఇంట్లోంచి బయటపడి సొంత సంపాదనతో చదువుపూర్తి చేసి ఇంతవాడయ్యాడు.

నందిని ఆలోచనలో పడింది.  ఎంత తేడా ఇద్దరిలో! రాజీ పడ్డం ఇష్టం లేక, తనని తాను గుర్తించుకోవడం కోసం ఒంటరితనాన్ని మోస్తున్నది ఒకళ్ళు.  ఒంటరి తనాన్ని భరించలేక ఏ రాజీ అయినా పడ్డానికి సిద్ధంగా మరొకరు!
“రాజీ పడ్డానికి కూడా ఓ  హద్దుంటుంది మార్క్‌ .   సాహచర్యం వేరు, బానిసత్వం వేరు.  తోడు కోసం నిన్ను నువ్వే మర్చిపోయి బతుకంతా ఈడ్వాలంటే  ఒక్క మా దేశపు ఆడజాతికి తప్పా ఎవరివల్లా అవదు.   అక్కడ కూడా వాళ్ళు తోడు కోరుకుని కాపురాలు చేస్తున్నారా అన్నది నాకనుమానమే.  అంతకన్నా ముఖ్యమయిన నిత్యావసరాలు వాళ్ళని నడుపుతున్నాయని నా అనుమానం. పెళ్ళి తప్ప బతకడానికి మరో ఆధారం  లేకపోవడం వల్లనే” అనకుండా ఉండలేక పోయింది నందిని.
ఎంతవరకూ అర్థమయిందో తెలీదు కానీ, మార్క్‌ కి ఇంక ఆ విషయం గురించి మాట్లాడ్డం ఇష్టం లేక పోయింది.  ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు.

కారు మెల్లగా హోటల్‌  చేరింది.  ఇద్దరూ దిగి పార్టీ జరిగే కాన్ఫరెన్స్‌  హాల్‌ కి చేరారు.  మధ్యాహ్నం దాకా ఉన్న ఉత్సాహం  మళ్ళీ నిండుకుని ఉంది.  కొలీగ్స్‌ తో మాట్లాడుతూ, జోకులు వేస్తూ హుషారుగా ఉన్న వాతావరణంలో ఇద్దరూ తమని తాము మరిచే పోయారు.కంపెనీ చైర్మన్‌  మాట్లాడాడు.  రాబోయే రోజులు ఇంకా కష్టమవుతాయనీ, ఇంకా చాలామందిని కంపెనీలో చేర్చుకోవాలనీ, చిన్న కంపెనీ పెద్దదిగా మారే క్రమంలో కొన్ని సరదాలు కోల్పోవాల్సొస్తుందనీ అన్నాడు.

నందినికి పొద్దున్నే చెప్పారు.  త్వరలో ఆమెని డెవెలప్మెంట్‌ కి డైరెక్టర్‌ చేస్తారనీ, ఎవర్ని టీం లోకి తీసుకోవాలో ఎలా మానేజ్‌ చేయాలో అంతా ఆమె చేతిలోనే ఉంటుందనీను.  చిన్న కంపెనీలో అందరూ ఇంతకాలం స్నేహితుల్లా చేసిన పనికీ రాబోయే కాలంలో చేయబోయే పనికీ చాలా తేడా ఉండబోతోందని అర్థమయింది నందినికి.  ఇప్పట్నించీ గిరిగీసిన అధికారాలూ, ఖచ్చితమైన బాధ్యతలూ ఉండబోతున్నాయన్నమాట అనుకుంది.

నందిని మిగతా గ్రూప్‌ తో కలిసి మాట్లాడ్డం మొదలు పెట్టింది. పార్టీ మొదలయ్యాక ఎప్పుడూ ఒక చోట ఉండడు మార్క్‌ .  మనుషులు కనపడితే చాలు ఒళ్ళు మరిచే పోతాడు.
చేతిలో బీర్‌  బాటిల్‌ , ఎదురుగా వినేందుకు ఓ మనిషీ ఉంటే చాలు ఎంతసేపయినా మాట్లాడుతూనే ఉండగలడు. మెల్లగా పార్టీ చివరి దశకి వచ్చింది.  ఒక్కొక్కళ్ళూ వెనుతిరగడం మొదలు పెట్టారు. నందినికి కూడా ఇక కదిల్తే బాగుణ్ణనిపించింది.  మార్క్‌ ని వెతికి పట్టుకుంది. ఇంటికి వెళ్దామా అంటే సరేనన్నాడు. ఇద్దరూ లేచి అందరికీ బై చెప్పి హోటల్‌ బయటకి నడిచారు.

ఇల్లు చేరేటప్పటికి మరో గంట గడిచింది.  మార్క్‌  ఇవ్వాళ అక్కడే సోఫాలో పడుకుని పొద్దునే వెళ్తాడనేది ఇద్దరికీ తెలిసిన సంగతే.  ఇద్దరూ మాట్లాడకుండా అపార్మ్టెంట్‌  తలుపు తీసుకుని లోపలికి నడిచారు.

మార్క్‌  నేరుగా వెళ్ళి సోఫాలో కూలబడ్డాడు.  నందిని బట్టలు మార్చుకోడానికి లోపలికి వెళ్ళాలనుకుంది.
“నందూ! నీకో సంగతి తెలుసా” అన్నాడు మార్క్‌
“ఏమిటి”
“నీ కళ్ళల్లో అసలు భయమనేదే కనపడదేం? నీకు దేనిగురించీ దిగులు ఉండదా?  ఎప్పుడన్నా కనపడితే కోపం కనపడుతుంది తప్పా దిగులు కనపడదు.  ఆ నిశ్చింతే ఎంత అందంగా కనపడుతుందనుకున్నావ్‌ ” అన్నాడు.
“ఎంత తాగావ్‌  ఇవ్వాళ” అంది వస్తున్న నవ్వుని ఆపుకుంటూ.
మార్క్‌  సోఫాలోంచి లేచాడు.  నేరుగా నందిని దగ్గరగా వచ్చి, ఆమె తేరుకునేలోగా ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి, దగ్గరికి లాక్కుని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు.

నందిని విస్తుపోయింది.  మొదటి అనుభవం అయినా ఆమెకి అసహజంగా అనిపించలేదు.  ఆతడి పరిచయంలో ఆమెకి తెలియకుండానే ఏర్పడిన నమ్మకమో, సాన్నిహిత్యమో, మోహమో, దాహమో… ఆమె అడ్డుచెప్పలేదు.
ముందు ఓ అడుగువెనక్కి వేసి, అంతలోనే మళ్ళీ ముందుకు వచ్చి, అతణ్ణి గట్టిగా కౌగిలించుకుని, గుండెల మీద తలపెట్టి కళ్ళు మూసుకుంది.

4

ఆకాశం మబ్బు పట్టి ఉంది. సన్నగా తుంపర కూడా పడుతోంది. ఫ్రీవే అంతా నిండిపోయి కదలట్లేదు.  ఈ ట్రాఫిక్‌  లో ఎయిర్‌ పోర్ట్‌  చేరడానికి గంట పైగా పట్టేట్టుగా ఉందనిపించింది నందినికి.  ఇంటర్నేషనల్‌  టర్మినల్‌  నుంచి బయట పడ్డానికి చాలా టైం పడుతుంది కాబట్టి పర్లేదులే  కానీ, గంట పైగా ఇంకా ఈ టెన్షన్‌  అనుభవించాలా అనుకుంది.  తాను చెప్పబోయే వార్తకి తల్లీ తండ్రీ   ఎలా స్పందిస్తారో అంచనా వేయలేని సతమతం.   ముందుగా అన్ని సంగతులూ చెప్పి రమ్మనక పోవడం తప్పేమో ననిపించింది ఒక్క క్షణం ఆమెకి. అప్రయత్నంగా కుడిచెయ్యి స్టీరింగ్‌  మీద నించి తీసి పొట్ట తడువుకుంది.  అర్థం చేసుకోగలదనుకున్న మాధవే జీర్ణం చేసుకోలేకపోయింది.

నెలరోజులక్రితం వచ్చివెళ్ళింది ఒకసారి.  నందిని కొన్న కొత్త పెద్ద ఇల్లు, కార్లు అన్నీ చూసి శభాష్‌  అంది.  ఓ రెండు రోజుల తర్వాత అడిగింది, “నువ్వు మార్క్‌ ని పెళ్ళి చేసుకోలేదు కదా” అని.
“చేసుకుంటే నీకు చెప్పనా అంది” నందిని.
“నిజం నందూ…  నువ్వెవరో తెల్లతనితో కలిసి ఉంటున్నావంటే ఏదో పుకారేమో అనుకున్నాను.  నిన్నిలా చూసిందాకా నమ్మలేదు నేను” అంది మాధవి.
“నీకో సంగతి ఇంకా చెప్పలేదు నేను…. నా కిప్పుడు మూడో నెల… తల్లిని కాబోతున్నాను” నువ్వనుకున్న దానికంటే ఎక్కువ దూరమే వెళ్ళాను అన్నట్టు ధ్వనించేలా తిక్కగా చెప్పింది నందిని.
“నిజమా… కంగ్రాట్స్‌ ” అని ఆగి “కంగ్రాట్స్‌  చెప్పొచ్చా.. ఇదంతా  కావాలని తెలిసే చేస్తున్నావో… మరోటో తెలీకుండా ఉంది” అంది మాధవి.
“మధూ రిలాక్స్‌ !    పెళ్ళి మీద నాకేనాడో నమ్మకం పోయింది.  అవసరమంటావా అదీ లేదు నాకు.  ఇప్పుడు బిడ్డ కావాలనుకున్నాను… కంటున్నాను.   నా సంగతి తెలిసికూడా ఎందుకే అంత కంగారు పడతావ్‌  ” అంది నందిని.

“కంగారు కాదు… నీ తర్కం అర్థం కాక.   పెళ్ళిని అవసరాల జాబితాలో చేర్చేశాక ఇంకేదయినా సాధ్యమేలే.  తింటానికి తిండి ఉంది, ఉంటానికి ఇల్లు ఉంది, పడుకోడానికి మగాడున్నాడు… ఇంకెందుకులే పెళ్ళి” కాస్త కటువుగానే అంది మాధవి.
ఒక్క క్షణం ఆగింది నందిని.
“మధూ.. నీతో కాబట్టి ఈ సంభాషణ ఇంత దూరమన్నా రానిచ్చాను.  పెళ్ళిని అలా అవసరాల జాబితాలో చేర్చింది నేను కాదు, జాగ్రత్తగా ఆలోచించు.  పెళ్ళిని ఓ వ్యవస్థ అనుకుంటే, వున్న వ్యవస్థని నేనంగీకరించలేను. అవసరం అనుకుంటే… ఆ అవసరాలన్నీ నేను సమకూర్చుకున్నాను.  అవును, ఆకలి, దాహం లాగానే సెక్స్‌ కూడా నాకు అవసరమే… దీనికి ఎవరేం పేరు పెట్టుకున్నా నా కభ్యంతరం లేదు” గుక్క తిప్పుకోకుండా చెప్పింది.
మాధవి ఇంకేం మాట్లాడలేదు… సంభాషణ పెంచడం ఇష్టం లేకనో ఏమో!
నందినే అంది.
“మాధవీ, నేను ఈ సిస్టం నించి ఏమీ ఆశించట్లేదు. ఈ సిస్టంని ఎదిరించాలనో, మార్చాలనో కూడా నా ప్రయత్నం కాదు.  నా కంత ఓపికా తీరికా లేవు.   నన్ను పట్టుకుని కట్టి పడేసి నా జీవితాన్నీ, శరీరాన్నీ, ఆలోచనల్నీ అన్నింటినీ ఎవరిష్టం కోసమో ఆడించమంటే మాత్రం కుదరని పని.   నా మానాన నేను బతుకుతాను.  ఆకలేస్తే తింటా, ఇష్టపడితే ఎవడితో కావాలంటే వాడితో పడుకుంటా, కావాలనుకుంటే పిల్లల్ని కంటా, లేకపోతే లేదు.  నా ఒళ్ళు, నా జీవితం, నా ఇష్టం.”

“నువ్వింతకన్నా తెలివయిన దాని వనుకున్నాను.  నీవాదం, నువ్వు చేసే పని నేనంగీకరించలేక పోయినా పర్లేదు, నీకంటూ ఏదో ఓ వాదం ఉందనీ, నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలవనీ నమ్మాలని నా ప్రయత్నం. టీనేజి పిల్లలా నా యిష్టం నాది అనడం వాదం కాదు మూర్ఖత్వం.  ఆ క్షణం లో  ఆకలి తీర్చుకోవటమే ముఖ్యం అనుకోవటం  జంతు లక్షణమన్నా అవుతుంది, చిన్నపిల్లల మనస్తత్వమన్నా అవుతుంది”  అని ఒక్క క్షణం ఆగింది మాధవి. అనవసరంగా పెద్ద మాటలు మాట్లాడానేమో అని అనిపించి, అనునయంగా అంది.
“నందూ, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళుండే దాన్ని సిస్టం అనరు.  అలాంటి చోట ఎవరికీ ఏ భద్రతా ఉండదు.  నీకు నాకన్నా ఎక్కువే తెలుసు.  నా నమ్మకం అనుకో, బలహీనతే అనుకో, మూర్ఖత్వమే అనుకో… మన దేశీ మధ్య తరగతి కుటుంబాల్లో అమ్మాయిలకి పెళ్ళి వల్ల ఒక సాంఘిక భద్రత ఏర్పడింది.  దాన్ని కూడా ధ్వంసం చేసేస్తే.. ఇంకేమవుతుందోనని నా భయం.  నువ్వు దేశం సరిహద్దులూ దాటేశావ్‌  మధ్యతరగతి సరిహద్దులూ దాటేశావ్‌.. ఇవన్నీ మాట్లాడ్డం నీకు చాలా సులభం”

కొంతసేపు మౌనంగా ఉండి పోయింది నందిని. ఇద్దరి ఆవేశాలూ చల్లబడ్డాయని అనిపించాక ఆలోచనల్ని పేర్చుకుంటూ సమాధానం చెప్పింది.
“మాధవీ, నేను మొదట చెప్పిన సమాధానం నిన్ను ఉద్దేశించీ కాదు, నా జీవితం మీద నాకు ఇదమిద్ధమయిన ఆలోచన లేకా కాదు.  ఆడదెలా బతకాలనుకున్నా ముందు ఊరందర్నీ సమాధాన పరచాలనుకునే మనస్తత్వాలకి అదీ నా సమాధానం. నువ్వు అందరి తరపునా వకాల్తా పుచ్చుకున్నట్టు అడిగావు కాబట్టి దానికదే సమాధానం, నేనెవరికీ జవాబుదారీ కాదనేదే.  ఇక నాకున్న సమాధానమంటే అదీ చెపుతాను, అదీ నీక్కాబట్టి..” ఒక్క క్షణం ఆగి మళ్ళీ మొదలు పెట్టింది.
“నువ్వు చెప్పిందే ఆలోచించు. మధ్యతరగతి ఆడపిల్లలకి పెళ్ళి వల్ల రక్షణ ఏర్పడిందన్నావు.  అదలా కనపడుతుంది కానీ అది పచ్చి మోసం.  ఆడదానికి పెళ్ళినే పరమావధిగా చేసే కుట్ర. ఏం చదివినా చదవక పోయినా అమ్మా నాన్నా తంటాలు పడి ఎవణ్ణో ఒకణ్ణి తెచ్చి కట్టి పడేస్తారు అనటం రక్షణ  కాదు… నీచమయిన అవమానం.  తలవంచుకుని పెళ్ళి చూపుల్లో కూర్చోవాల్సి రావటం రక్షణ కాదు, దౌర్భాగ్యం, బతకడానికి మరో గతి లేక పోవటం.  ఆడదానికి ఆర్థిక స్వాతంత్య్రం కావాలి. తాను స్వంతంగా బతగ్గల శక్తి సామర్య్థాలు కావాలి. అందుకు కావాల్సిన చదువూ సంధ్యలు కావాలి.  అప్పుడు పెళ్ళి కూడా తనిష్టప్రకారం తలెత్తుకుని చేసుకునే రోజొస్తుంది.”
ఇంకేదో అనేలోపు అందుకుంది మాధవి
“కాదని నేనన లేదు. కాపోతే నువ్వన్నంత అన్యాయంగా కూడా ఏమీ లేదు.  నువ్వన్న మార్పులు మెల్లగా నయినా వస్తూనే ఉన్నాయి.  ఇవ్వాళ్టి రోజున ఇంజనీరింగ్‌  కాలేజీల్లో చూశావా ఎంతమంది అమ్మాయిలో? ఏ చదువుకూ నోచుకోని పేదవాళ్ళ సంగతి వదిలేయి. మన స్థాయి మధ్యతరగతి కుటుంబాల్లో ఆడా, మగా అంతా చదువుకుంటూనే ఉన్నారు, ఉద్యోగాలు కూడా చేస్తూనే ఉన్నారు.”

ఈ సారి నందిని  అడ్డుకుంది.
“అక్కడే ఉంది మోసం.  ఆడదానికి ఇవ్వాళ దొరుకుతున్న చదువు కూడా స్వావలంబన కోసం కాదు, పెళ్ళి కోసమే.  ఓ తరం ముందు నువ్విలా మాట్లాడు, సంగీతం పాడు, గిన్నెలు తోము పెళ్ళవుతుంది అన్నారు.  మన అమ్మలూ, అమ్మమ్మలూ అలా తంటాలు పడ్డారు. ఇప్పుడు ఎలెక్ట్రానిక్స్‌ , కంప్యూటర్‌  సైన్స్‌  చేస్తే అమెరికా పెళ్ళి కొడుకు, బ్యాంకు టెస్టులు పాసయితే  గవర్నమెంటుద్యోగి పెళ్ళి కొడుకు అని తేల్చారు.   ఈ పెళ్ళి మాత్రం ఆడదాని ఏకైక గమ్యం, లక్ష్యం, మోక్షం… అప్పుడూ ఇప్పుడూ కూడా. ఆడపిల్లని పెంచడం అంటే పెళ్ళికూతుర్ని తయారు చేయడమే అప్పుడయినా  ఇప్పుడయినా… అందులే ఏ మార్పూ లేదు”
“సరే నందినీ, కొంత నిజమేనని ఒప్పుకుంటాను.  కాని ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చేస్తే, వచ్చేస్తే సమస్యలన్నీ పరిష్కారమై పోతాయని నేన్నమ్మను.  ఎంతమంది నందినీ లని తయారు చేయగలం?  చేసినా, నీ బతుకు గాడి తప్పిన బండి లానే కనపడుతుంది గానీ సమస్యకి పరిష్కారంగా తోచదు నాకు” అంది మాధవి.
“నీకు ముందే చెప్పాను.  ఎవర్నో ఉద్ధరించే ఉద్దేశం నాకు లేదు.  నా వాదమల్లా నన్ను గుర్తించని, నాకు విలువనివ్వని వ్యవస్థ పట్ల నాకు సానుభూతి, సంబంధాలు ఎందుకుండాలీ అని. అవకాశం ఉన్నవాళ్ళు కూడా బేలగా తలవంచుకుని రాజీ పడి పోవటమే  ఎందుకో నాకు అర్థం కావట్లేదు” అంది నందిని.
“నేన్చెపుతాను ఎందుకో.  నువ్వు తెగించి వ్యవస్థని ధిక్కరించేసి వచ్చేశాననుకుంటున్నావు.   అది నువ్వు చెప్పిన ఆర్థిక స్వాతంత్య్రం ద్వారా నువ్వు సాధించిన విముక్తి, నీ దృష్టిలో.   దాని తర్వాత ఏమిటి?  నువ్వు పూర్తిగా తెగతెంపులు చేసుకో గలిగావా, గలవా? ఇంకా నీకు మాధవి కావాలి, అమ్మా కావాలి, నాన్నా కావాలి, స్నేహితులూ , బంధువులూ… అందర్నీ తెంచేసుకోగలవా?  ఇండియాకి ఫోన్‌  చెయ్యకుండా ఒక్క నెల పూర్తిగా గడప గలవా?  వీళ్ళందరితో నువ్వు సంబంధాలు అలానే ఉంచుకోవాలంటే నువ్వు ఎంతో కొంత వీళ్ళందర్నీ సమాధాన పరిచి తీరాల్సిందే.  ఇదే మధ్యతరగతి మనస్తత్వమంటే.  దీన్ని దాటటం నీవల్ల కాదు.  నువ్వొప్పుకున్నా ఒప్పుకోక పోయినా ఇంకా వాళ్ళంతా నిన్ను అంగీకరించాలనే నీ తాపత్రయం.   ఎంత నేనెవరికీ సమాధానం చెప్పనూ అని బిగదీసుకు కూర్చున్నా, అన్నీ తెంచేసుకోవటం నీ వల్ల కావట్లేదు”
…మాటల కోసం వెతుక్కుంటూ ఆగింది  మాధవి.  మాధవి మొహంలోకి చూడకుండా వింటోంది నందిని.   తన ధ్యాసలో తాను మళ్ళీ మొదలు పెట్టింది మాధవి.
“అందుకే నేననేదేమిటంటే, నువ్వు చెప్పినట్టుగా నీ బతుకు నువ్వు బతగ్గలగడంతో సమస్య తీరిపోలేదు, పోదు.  అది అవసరమయిన మొదటి మెట్టు. అది సాధించాక పారిపోవద్దు.  అక్కడే నిలబడి మనుషుల మనస్తత్వాలని ఎదిరించాలి.  ఆలోచనల మీద దాడి చెయ్యాలి. అదీ విప్లవమంటే, సమాజాన్ని మార్చడమంటే.   నువ్వు చేస్తున్నదేమిటి?   చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చి పోవడానికి, దాన్ని పట్టించుకోకుండా ఉంటానికీ ప్రయత్నం చేస్తున్నావు.  నా మాట నమ్ము, అదెప్పటికీ నీవల్ల కాదు.   ఒకవేళ అది పరిష్కారమే అనుకున్నా, అది  ఎంతమందికి వర్తిస్తుంది అనేది ఇంకో ప్రశ్న” సాలోచనగా అంది మాధవి.

“మాధవీ, నువ్వు చెప్పిందంతా నిజమే.  మొదటి సంగతి నాకు ఈ రాత్రికి రాత్రి విప్లవం తెచ్చేసి, ఈ సమాజాన్ని మార్చేద్దామనే ఉద్దేశమేమీ లేదు.  ఆలాంటిది సాధ్యం కూడా కాదు.  సమాజం వ్యక్తులతో ఏర్పడింది.  తమ కాళ్ళమీద తాము నిలబడగల అమ్మాయిలంతా పెళ్ళికోసం తామేమీ రాజీ పడమని చెప్పాలి. పెళ్ళి తర్వాత తాము ఎలా బతకాలనుకుంటున్నారో చెప్పగలిగే ధైర్యం రావాలి.  అప్పుడు చూడు నువ్వు చెప్పిన ఆలోచనలు వాటంతటవే మారతాయి.  అది మెల్లిగా జరిగే మార్పు.  దాని మీదే నా నమ్మకం” దృఢంగా అంది నందిని
“సరే నందూ… కానీ వేరే ఇల్లు చూసుకోకుండా ఉన్న ఇల్లు కూల్చుకోవడం తెలివయిన పనేనంటావా?” ఆలోచిస్తూ అంది మాధవి..
“ఖచ్చితంగా… రోడ్డుమీద నిలబెడితే తప్పా కొత్త ఇల్లు కోసం ప్రయత్నం చేయరు ఈ జనాలు… ఉన్నదాన్ని కూల్చడమే మొదటి పని” చివరి మాట అంటూ నవ్వేసింది నందిని… వంత కలిపింది మాధవి

ఆ తర్వాత చాలాసేపు ఇద్దరూ మౌనంగా ఉండి పోయారు.  మాధవి వెళ్ళి పోయేటప్పుడు మాత్రం ప్రెగ్నెన్సీ గురించిన పుస్తకాలు కొనిచ్చి, తనకి తెలిసిన జాగ్రత్తలన్నీ చెప్పి వెళ్ళింది.  మాధవి లాంటి స్నేహితురాలుండటం ఎంతో గర్వంగా ఉంటుంది నందినికి.  తనన్న మాట కల్లా తలలూపే స్నేహితులున్నా, మాధవి అంటేనే నమ్మకం, గౌరవం నందినికి.  వెన్నెముక లేని వాళ్ళతో కలవలేదు నందిని. ట్రాఫిక్‌  పలచబడి కారు వేగం అందుకుంది.  నందిని ఆలోచనల్లోంచి బయట పడి ఎయిర్‌ పోర్ట్‌  లోకి అడుగుపెట్టింది.

* * *

ఎయిర్‌ పోర్ట్‌  లో ఏమీ చెప్పకుండానే తీసుకొచ్చింది తల్లి దండ్రులని ఇంటికి.   మార్క్‌ ఊళ్ళో లేడు.  కావాలనే మార్క్‌  ఉండడని తెలిసిన రోజుకు వచ్చేట్టుగా ప్లాన్‌   చేసింది.

ఓ రెండ్రోజులు విశ్రాంతి నిచ్చి మెల్లిగా చెప్పొచ్చులే అనుకుంది.  మూడొంతుల జీవితాన్ని మోసేసిన తల్లికి ఎక్కువసేపు పట్టలేదు… సూటిగా అడిగింది, వచ్చిన మూడు గంటల్లో…
“నందూ.. ఇది నీ ఇల్లేనా, లేక నువ్వెవరితోనన్నా ఉంటున్నావా” అని.
ఇంక నాన్చడం మంచిదికాదనిపించింది నందినికి.   తల్లి చెయ్యి పట్టుకుని తండ్రి కూర్చుని ఉన్న ముందు గదిలోకి తీసుకెళ్ళింది.
“ఇక్కడి నా జీవితం గురించి మీకు పూర్తిగా చెప్పలేదు.  అది ఫోన్లో మీకు అర్థమయ్యేలా చెప్పలేనేమోనని భయం వేసి మీకు సూటిగా చెప్పాలనే ఇప్పటిదాకా ఆగాను…  మీరు అంగీకరిస్తారో లేదో కూడా తెలీదు.  ఏదైనా కానీ మీకు ఎదురుగా కూర్చుని చెప్పాలనే ఇక్కడికి రమ్మన్నాను.” మెల్లగా మొదలు పెట్టింది నందిని
“ఎవరే అతను… నీతో ఉంటున్నది” తండ్రి ఇక విషయానికి రమ్మన్నట్టూ, తను అప్పటికే గ్రహించేసినట్టూ.
“మార్క్‌  అని… నా కొలీగ్‌ … అమెరికన్‌ !    సంవత్సరన్నర నించీ కలిసే ఉంటున్నాము… ఈ ఇల్లు కొన్నప్పట్నించీ…  నిజానికి ఈ ఇల్లు కూడా ఇద్దరం కలిసే కొన్నాము.” తలవంచుకుని అంది నందిని.
“అంటే పెళ్ళి చేసేసుకున్నారా ” కలిసే ఉండటం అంటే  అర్థం కాకో, నమ్మటం ఇష్టం లేకో… తల్లి.
“లేదు… పెళ్ళి చేసుకోలేదు.  ఆ మాటే ఇంతవరకూ రాలేదు మామధ్య” నందిని
“ఏమిటి ఈ బతుకు నందినీ… ఎంత నిన్ను అర్థం చేసుకుందామని ప్రయత్నం చేసినా నా వల్ల కావట్లేదు. మీ నాన్న కూడా అది ఆనందంగా ఉంటే చాలదా… దాని మంచి దానికే తెలుసు అని వాదం.  అందరిలా పెళ్ళి చేసుకుని కాపురం చేసుకునే ఆడపిల్ల నాకెందుకు లేదో”
“నా కిప్పుడు  నాలుగో నెల… తల్లిని కాబోతున్నాను” తల్లి మాట పూర్తికాక ముందే వంచిన తల ఎత్తకుండా చెప్పింది నందిని. ఏదో చెప్పబోయిన తల్లి ఆగి పోయింది.  భర్త వంక గాభరాగా చూసింది.  భర్త మొహంలో కూడా మొదటిసారి ఆందోళన కనపడింది ఆమెకి.  కూర్చున్న చోటనించి లేచి మెల్లగా నందిని దగ్గరికి నడిచింది. నందిని తలమీద చేయి వేసి దగ్గరికి తీసుకుంది.
తల్లినించి పెద్ద అరుపులూ, ఏడుపూ ఊహించిన నందినికి ఆ స్పర్శతో చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది.   ఎప్పట్నించో ఎదురుచూస్తున్నట్టుగా తల్లిని కౌగిలించుకుంది పసి పిల్లలా.
“పిచ్చి తల్లీ, నీ పక్కనే ఉన్నాగా.. ” అంది తల్లి గొంతు పెగుల్చుకుని. వెచ్చటి తల్లి ఒడిలో ఇంకా ఇంకా ఒదిగిపోతూ అనుకుంది నందిని, ఇంతకు మించిన కవచం ఏముంటుంది ఎవరికైనా అని.
తన ఆలోచనల్ని తానే అర్థం చేసుకోలేక సతమత మవుతూ ఒక్క మాటకూడా మాట్లాడకుండా ఆ తల్లీ కూతుళ్ళని చూస్తూ ఉండిపోయాడు ఆ తండ్రి.

5

ప్రపంచంలో ఉన్న ప్రశాంతత అంతా వీడి మొహంలోనే ఉన్నట్టుంది అనుకుంది నందిని.  ఎన్నిగంటలు చూసుకున్నా ఆమెకి తనివితీరట్లేదు.  నల్లటి జుట్టు, తెల్లటి ఒళ్ళు, చిట్టి చిట్టి కాళ్ళూ చేతులూ.. అతి సుకుమారంగా  చిన్న మొగ్గలా ఉన్నాడు.  వాడి కళ్ళని పరీక్షగా చూసి ఇవి పిల్లి కళ్ళే అని తేల్చింది నందిని తల్లి.

తల్లి పక్కనే కుర్చీలో కూర్చుని కాలక్షేపానికి ఏదో పుస్తకం తిరగేస్తోంది.

నందిని తండ్రి, మార్క్‌  ఇద్దరూ ఇంటికి వెళ్ళారు లంచ్‌  తేవడానికి.  మొదట్లో ఉన్న సంశయం పోయింది ఇద్దరికీ మార్క్‌ తో కలిసి మెలగడానికి. మార్క్‌ , నందిని తండ్రి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడ్డం కష్టంగా ఉన్నా ఎలాగో తంటాలు పడుతున్నారు . తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంట్లో ఇన్ని నెలలు ఉంటానికి మార్క్‌  ఒప్పుకోడేమో నని పడ్డ భయం ఇప్పుడు లేదు నందినికి.  కొన్ని వీకెండ్లలో బయటెక్కడో ఒంటరిగా తిరిగిరావడం, వంటగది శుభ్రంగా లేదని ఒకటి రెండు సార్లు విసుక్కోవడం తప్పా మిగతా అంతా తన పని తాను చేసుకుంటూ, సాధ్యమయినంత కలిసే మెలిగాడు. డెలివరీకి వాళ్ళిక్కడే ఉంటారని నందిని చెప్పినా “నీ యిష్టం” అన్నాడు. డెలివరీకి చేరిన రెండ్రోజుల్నించీ ముగ్గురూ కలిసే చూస్తున్నారు నందినిని. నందిని  ఆలోచనలో పడింది.

బహుశా మంచి అల్లుడవటానికి అన్ని లక్షణాలూ ఉన్నాయి మార్క్‌  లో.  నిజానికి ఆ ఆలోచన కూడా చేసింది తల్లి.   ఓ రోజు సాయంత్రం పార్కు లో కూర్చున్నప్పుడు కదిపాడు తండ్రి.
“నందూ, ఈ పని చెయ్యి అని చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు.  మీ అమ్మ పోరు పళ్ళేక అడుగుతున్నాను.  నేవెళ్ళి మార్క్‌  తో మాట్లాడనా మీ పెళ్ళి గురించి?”
సమాధానం మెల్లిగా పేర్చుకుని అంది నందిని
“వద్దు నాన్నా.  అడిగితే నేనడుగుతాను.  లేదా తనడుగుతాడు.  మధ్యలో మీరు కల్పించుకోవద్దు. అసహ్యంగా ఉంటుంది”
“తనడిగితే నువ్వు చేసుకుంటావా” అమ్మ  ఆశగా అడిగింది.
“అవ్వన్నీ ఆలోచించకమ్మా ప్లీజ్‌ .  పెళ్ళి ఆలోచన ఇంత వరకూ లేదు. పిల్లాణ్ణి కనాలనే నిర్ణయం కూడా పూర్తిగా నాదే.  తనకి నేను చెప్పనుకూడా లేదు ఆ విషయం తెలిసిందాకా.  నిజంగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా అని అడిగాడు విషయం తెలిశాక.  ఇప్పుడు పెళ్ళి మాట ఎత్తితే ఇదంతా నేనేదో కావాలని చేసినట్టుగా ఉంటుంది.  నాకు తోడు కావాలి. అందుకోసం ఓ పిల్లో పిల్లాడో ఉంటే బాగుంటుందనుకున్నాను అంతే… పెళ్ళి ఆలోచన లేనే లేదు”
“అతను కూడా అదే అనుకోవచ్చు గదా… అడిగి చూడచ్చు కదా” తల్లి పొడిగించింది.
“నాకు అవసరం లేదని చెప్తున్నాను. అయినా ఇప్పుడు నేను పెళ్ళి చేసుకోవడం అంటే  ఏమిటి?  తనెలాగూ పీటలమీద కూర్చుని తాళి కడతాడనుకోను. పోనీ అదే జరిగినా… ఇప్పుడున్నట్టే ఉంటుంది లైఫ్‌  అప్పుడుకూడా.   తన మనసు మారినా నా మనసు మారినా విడాకులు తప్పవు.   ఈ లైఫ్‌ కీ ఆ లైఫ్‌ కి తేడా ఏమిటో నాకు తెలీదు.  మధ్యలో డైవోర్స్‌  లాయర్లని పోషించడం తప్ప”
“నువ్వు అమెరికా సిస్టం ని కూడా దాటిపోయావ్‌ ”  తండ్రి సంధించాడు వ్యంగ్యాస్త్రం.
“అదికాదు నాన్నా… పెళ్ళి అనేదాంట్లో లైఫ్‌  లాంగ్‌  కమిట్మెంట్‌ , సెక్యూరిటీ లాంటి వాటి కోసం మీరు కనక చూస్తుంటే అలాటివేమీ ఇక్కడ లేవని చెప్తున్నానంతే” నందిని
“సరే నీ యిష్టం తల్లీ.  చెప్పాగా..  మీ అమ్మ పోరు పళ్ళేక మొదలెట్టానంతే. నీ అలోచనల్ని మార్చగలనన్న నమ్మకం నాకేమీ లేదు”

ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయినా నందిని దాచిన విషయం ఒకటుంది.  నందిని తన బిడ్డని కంటూందని తెలిశాక “పెళ్ళి చేసుకుందామా” అని అడిగాడు మార్క్‌ . ముందుగా ఆశ్చర్య పోయినా నందిని అనుమానించింది.  ఆఫీసులో ఎవరన్నా దేశీలు మార్క్‌ తో చెప్పారేమోనని.. పెళ్ళికాకుండా  పిల్లల్ని కనటం అనేది ఓ బ్రహ్మప్రళయం రాగలంత విషయం భారతావనిలో అని.
“నువ్వు జాలిపడో, అతిమంచితనం తోటో నన్ను పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు మార్క్‌ !  అలాంటి పెళ్ళి కావాలనుకుంటే ఎప్పుడో చేసుకుని వచ్చుండే దాన్ని ఇక్కడికి. ముందుగా ఈ డెలివరీ నించి బయట పడదాం.  ఆ తర్వాత నిజంగా మనం ఒకళ్ళకొకళ్ళం కమిట్‌  అవగలం, మనకి ఒకళ్ళ తోడు ఒకళ్ళకి జీవితాంతం అవసరం అని నమ్మకం కలిగితే అప్పుడు చూద్దాం”  అని తెగేసి చెప్పింది నందిని.

మార్క్‌  చిన్నబుచ్చుకున్నాడు బయటకి తెలిసిపోయేలా. అది తాను కాదన్నందుకు బాధపడ్డాడో, అహం దెబ్బతిన్నదో సరిగ్గా అర్థం కాలేదు నందినికి.   ఓ రెండ్రోజుల పాటు ముభావంగా ఎక్కువ మాట్లాడకుండా ఉండి పోయాడు. తల్లీ తండ్రీ ఈ విషయం తెలిస్తే మళ్ళీ కథ మొదటికి వచ్చి, మార్క్‌ ని విసిగిస్తారేమోనని కావాలనే చెప్పలేదు నందిని.
పిల్లాడు లేవడంతో ఆలోచనల్లోంచి బయటపడింది నందిని.  వాణ్ణి మెల్లగా లేవదీసి “ఆకలేస్తోందా” అంటూ స్థనాన్ని నోటికందించింది.  ఆబగా తాగుతున్న వాణ్ణి పొదివి పట్టుకుని గర్వంగా చూసుకుంది.
వాడు తాగుతుండగానే వచ్చారు, తండ్రీ, మార్క్‌ .  అందరికీ బ్రెడ్‌  టోస్టులు చేసి తెచ్చారు.  ఆలుగడ్డ కూరతో కొన్ని, బట్టర్‌  చీజ్‌ లతో కొన్ని.  అందరి భోజనాలు అయిపోయాక క్యాబ్‌  తీసుకుని ఇంటికి వెళ్ళి పోయారు తల్లీ తండ్రీ.

అన్నీ శుభ్రం చేసి వచ్చి కూర్చున్నాడు మార్క్‌ .  కొడుకుని సుతారంగా తీసుకుని వళ్ళో పడుకోబెట్టుకున్నాడు.  నందిని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. “ఎంత ముద్దుగా ఉన్నాడో చూడు వీడు” అన్నాడు.
“నిద్ర కూడా ఎక్కువే… నీలాగే!” ఎక్కిరించినట్టుగా అంది నందిని
ఇద్దరూ నవ్వుకున్నారు.
పిల్లాణ్ణి చూస్తూనే మెల్లిగా అన్నాడు మార్క్‌ .
“నందూ! ఎలా చెప్తే నమ్ముతావు నువ్వు!  నువ్వు లేకుండా నేను బతకలేనని చెప్పి బతిమిలాడు కోవాలా?  నేన్నిన్ను నిజంగానే పెళ్ళి చేసుకోవాలనుకున్నాను.  వీడు పుట్టడం మూలంగానే కాదు. నీకు నీ మీదే నమ్మకం లేదు.  నిన్నెవరూ నిన్ను నిన్నుగానే పెళ్ళి చేసుకుంటానని అడుగుతారన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. నిజమే.  నువ్వులేకపోయినా, నిన్నూ, ఈ చంటాణ్ణీ ఇలాగే వదిలేసి వెళ్ళిపోయినా నేను బతగ్గలను.  కాపోతే, కలిసే బతకాలని అనుకుంటున్నాను. ఇక నిర్ణయం నీది. మీ కుటుంబాన్ని చూశాక, పెళ్ళిచేసుకోకుండా మాత్రం నేను నీతో ఇక ఉండదల్చుకోలేదు… ఇక నీ యిష్టం” అంటూ కుర్చీలోంచి లేచి,  బిడ్డని జాగ్రత్తగా నందిని పక్కన పడుకోబెట్టి, జేబులోంచి చిన్న పొట్లాం తీసి నందినికి అందేట్టుగా మంచం మీద వదిలి బయటికి వెళ్ళిపోయాడు.

నందిని కూర్చున్న చోట అలాగే రాయిలా ఉండిపోయింది.  ఓ నిముషం తర్వాత మెల్లిగా మార్క్‌  వదిలి వెళ్ళిన పాకెట్‌  తెరిచి చూసింది.  అందులో చిన్న డబ్బా, ఆ డబ్బాలో చక్కటి డైమండ్‌  రింగ్‌  ఉన్నాయి. ఆ ఉంగరాన్ని చేతిలోకి తీసుకుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆమెకి తనకి తనే అర్థం కాకుండా పోతున్నాననిపించింది.  తన పంతం ఎవరితోనో దేనిగురించో కూడా తెలీట్లేదు చివరికి.  అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. ఇంతలో ఫోన్‌ మోగింది. ఇంటినించి తండ్రి.
“నందూ! ఈ పాటికి మార్క్‌  నీకు రింగ్‌  ఇచ్చేసి ఉంటాడు.  నాకెప్పుడో చెప్పాడు, మీ మధ్య జరిగిందంతా.  నన్ను సలహా అడిగాడు.  నన్నేమీ అడగద్దని చెప్పాను. తనే చెప్పాడు, నీకు మరోసారి ప్రపోజ్‌  చేసి చూస్తానని.   నువ్వు మళ్ళీ మేమేదో అతన్ని బతిమిలాడి పంపించామని అనుమానంతో కాదంటావేమోనని చెప్తున్నాను.  ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు.  నీ నిర్ణయం నువ్వు తీసుకో.  జరుగుతున్న దానికి మేము నిశ్శబ్ద సాక్షులం మాత్రమే”  తండ్రి గొంతులో కొంత విసుగూ, అసహనమూ ధ్వనించాయి.
మరో మాట మాట్లాడకుండా ఫోన్‌  పెట్టేశాడు తండ్రి.

నిశ్శబ్దంగా, ఒంటరిగా హాస్పిటల్‌  గదిలో… తాను వలచిన వంటరితనం…  తన కొడుకుతో సహా.  ఎవ్వర్నీ తన తరపున ఆలోచించనివ్వని, ఓ సలహాకూడా ఇవ్వలేనంతగా దూరం చేసుకున్న తన నైజాన్నీ, వ్యక్తిత్వాన్నీ తానే నెమరు వేసుకుంది.
తానిప్పుడు గెలుస్తున్నట్టా, ఓడిపోతున్నట్టా?  మాధవి ఏమనేదో ఇప్పుడుంటే అని ఆలోచించకుండా ఉండలేక పోయింది.
అయినా గెలుపు ఓటములు ఆటల్లోనో, పోటీల్లోనో గానీ జీవితంలోనా?  జీవితంలో జీవించడం తప్ప మిగతావన్నీ ఎందుకు?
అప్పటిదాకా చేతుల్లో అటూ ఇటూ మారుతున్న ఉంగరాన్ని అపురూపంగా వేలికి తొడుక్కుంది.  పక్కన నిద్రపోతున్న కొడుకుని ముద్దుపెట్టుకుని చెప్పింది…
“ఎన్ని చెలియలి కట్టలు దాటాక దొరికిందో తెలుసా ఈ వజ్రం నాకు” అని.

అక్కిరాజు భట్టిప్రోలు

రచయిత అక్కిరాజు భట్టిప్రోలు గురించి: జననం, బాల్యం ఖమ్మం జిల్లాలో. కేలిఫోర్నియా బే ఏరియాలో కొంతకాలం పనిచేసి ఇండియా తిరిగివెళ్ళిన అక్కిరాజు ప్రస్తుత నివాసం హైదరాబాదు లో. రాసిన కొన్ని కథలతోనే తెలుగు ఉత్తమ కథకుల జాబితాలో చేరిన ఈ రచయిత, కథకునికి నిబద్ధత ముఖ్యం అని నమ్ముతారు. ...