చలివేంద్రం

పొడుపు చుక్క యింకా పొడవనే లేదు.

చీకటి దట్టంగా ముదరకాలిన కుండ తీరున్నది.

ఊరుఊరంతా పోలీసొళ్ళకు భయపడి నక్కిన బుడతల తీరున గుట్టు చప్పుడు కాకుండా ఉంది.

వసారాలో కునుకేసిన కుమ్మరెంకన్న ఉలికిపాటుతో ముసుగు తంతూ దిగ్గున లేచాడు. కళ్ళు చిట్లిస్తూ బయటకు చూశాడు. వాకిలిలో సారెకు కట్టేసి వున్న మేకపిల్ల కళ్ళు పసుపు రంగు రేడియంలా మెరుస్తున్నాయి.

అతను వాకిలిలో కొచ్చి, మబ్బుకేసి చూశాడు. “గురకోళ్ళు సుతకనబట్టంలే..శాన పొద్దున్నట్టుంది”. అనుకుంటూ చుట్టూ పారజూశాడు. కొద్ది దూరంలో కుండల బట్టీ నుంచి పచ్చని మంట తన్నుకొస్తూంది. “కుండ కాలినట్టుంది రేపన్నా బట్టీ దియ్యాల. దీని సిగదరగ, యెంత జేసినా తరగదీ కుమ్మరి పని” లోలో గొణుక్కున్నాడు.

చీకటిలో తచ్చాడుతూ చుట్టు గుడిసె మొగదలలో ఉన్న గోడ గూటిని తాకి, అందులో సగం తాగి దాచుకున్న మోదుగాకుల చుట్ట అందుకుని పెదాలపై ఉంచుకున్నాడు. ఆ ప్రక్కనే దీపం దగ్గరున్న అగ్గిపెట్టెతో దీపాన్ని వెలిగించి, అదే పుల్లతో చుట్ట కాల్చుకున్నాడు. నాలుగయిదు దమ్ములు లాగి, నోటిలో ఊరిన ఉమ్మిని దడికేసి ఉమ్మేసి, గుడిసెలోకి చూశాడు. నిట్టాడు దాపులో చాప మీద పడుకొన్న పిల్లల మొహాల మీద దీపం వెలుగు తారాడుతుంది.

నలుగురు పిల్లలు. తిండికే తప్ప  పనికి లెక్కొచ్చే వయసు కాదు. జంగిలి గొడ్లోళ్ళతో కలిసి, పెద్దోడు యిప్పుడిప్పుడే పనికి అలవాటు పడుతున్నాడు. నడిపి పిల్లలిద్దర్నీ “సార్లు” బళ్ళోకి లాక్కుపోతున్నారు. చంటిదాని వల్ల భార్య ఇల్లు కదల్లేకపోవడం, అతనికి ఓ చెయ్యి విరిగినట్టుగా ఉంది. “యింటిది కూడా యే కూలి నాలికో పోకపోతే బతుకుసాగేట్టు లేదు” అనుకున్నాడు కుమ్మరెంకన్న.

“యేమేవ్‌.”

చాప మీద నలుగురు పిల్లల మధ్య తానూ ఓ పిల్ల దానిలా ముడుచుకున్న ముత్తమ్మకు భర్త పిలుపుతో తెలివొచ్చింది గాని, కన్ను విప్పలేకపోయింది.

రాత్రి సందేళ చంటిది జ్వరంతో చేసిన తొందర వల్ల ఆమెకు నడి ఝాము దాకా కన్ను మలగలేదు. మాత్తర్లిచ్చే ఖాదర్సాయిబు యింటి పట్టున లేకపోవడంతో, బిడ్డ కేమయిందో తెలీక కాలు గాలిన పిల్లిలా తిరిగింది.అప్పటికీ వాము నూరి తులిసాకు రసంతో కలిపి తాపించినా, పిల్ల యేడుపు గోస ఆపలేదు. యేం చెయ్యనూ తోచక పిల్లదాన్ని బుజం మీదేసుకుని యింటి ముందు నిల్చుంటే సాముల కోటమ్మత్త కస్తూరి మాత్ర  తెచ్చిచ్చి చనుబాలతో రంగరించి తాపించమంది.

మాత్ర పడిన కూసేపటికే పిల్లది కునుకు తీసింది. ముత్తమ్మకు కూడా అలసటనిపించింది. ఆకలేసినా పెట్టుక తినేంత ఓపిక లేక, ముంతెడు నీళ్ళు తాగి పిల్ల పక్కనే వొరిగింది.

“కోడన్న కూత కూయలె…..ఏందా తొందర. యీ సీకట్ల బడి యాడ బోతవ్‌” కళ్ళు తెరవకుండానే అన్నది ముత్తమ్మ.

“ఆరు కోసులు నడవొద్దానె?..పొద్దక్కితే సంతల సోటు సుత దొరకదు. జెనానికి పనుల్లేక అడివిన దిరిగి దొరికిందేదో తేటం, అమ్ముకోటం యెవుడు జూడు… యేదో వొక బేరం..” అన్నాడు కుమ్మరెంకన్న.

ముత్తమ్మ మారు మాటెత్తలే.

అతను తడిక మీదున్న కావిడి తీసి, తాళ్ళు లాగి చూసుకొన్నాడు. గట్టిగానే ఉన్నాయి. దాన్నో పక్కనుంచి, పొయ్యిలో కెలికి ఓ బొగ్గు ముక్కందుకొని నోట్లో వేసుకొని నములుతూ గాబు దగ్గరి కెళ్ళాడు.

యెదురింటి ముక్కయ్య తాత   ముదిరిన దగ్గు రోగపు బాధలో పేగులు కదిలేలా దగ్గుతున్నాడు. కూత వేటు దూరంలో కుంట పొంటె కోయోళ్ళ గుంపు లోంచి సినిమా పాట వినిపిస్తూంది. “కోయోళ్ళ రేలపాట లేవఁయినయో….కోలాటాలెటుబోయినయో…యిటయి పోయినయేంది రోజులు?” అనుకుంటూ నోరు కడుక్కొని తల గుడ్డతో మొహం తుడుచుకొంటూ వసారాలో కొచ్చాడు.

అప్పటికే నిద్ర లేచిన ముత్తమ్మ దీపం వెలుగులో గుడిసెలో ఉన్న కుండలు ఒక్కొక్కటే తెచ్చి వసారాలో వరసగా పెడుతోంది.

“అవ్‌ పచ్చికుండ సరవడ మయిందానె?” అన్నాడు కుమ్మరెంకన్న.

“ఇంకా సగం దాకున్నయి. యాడ… పిల్లది సంకొదిలితేనా?”

“కానియ్‌ యెండలు ముదురుతున్నయి.”

“ఊకున్ననా, కుండని యెండకీ నీడకీ తిప్పటం, మద్దె మద్దెన సరవడం.. ఇటు పిల్దాన్ని అర్సుకోవటం, నాకు తెల్వదా?” ముత్తమ్మ నీళ్ళ కుండను వరసలో ఉంచుతూ అన్నది.

“అగ్గో… అన్నీ నీళ్ళ కుండలేనా… బువ్వ కుండలూ, కూర పిడతలూ, ముంతలూ, మూకుళ్ళు సుత బయట పెట్టు” అన్నాడు.

“యెండాకాలవాఁయె! నీళ్ళ కుండలు నాలుగెక్కువ కొంచక పోరాదూ?”

“నేనేం లంబోడోళ్ళ తండక్కాదు పోయ్యేది. కొత్తగూడె సంతకి” చిరుకోపంతో అన్నాడు కుమ్మరెంకన్న.

“యేం, కొత్తగూడెపోళ్ళు నీల్తాగరా?” అంది ముత్తమ్మ.

“నీకు తిరగజెప్పటం నా వల్ల గాదె తల్లా….ఇయ్యాల్రేపూ బస్తీలోళ్ళు కుండల నీళ్ళేడ తాగుతున్రు…? మిషన్నీళ్ళే..నేనోపాలి తాగిన, నీ తల్లి, నరాలు జివ్వుమన్నయనుకో…మంచు తీర్న ఉన్నయ్‌ ” అన్నాడు.

“ఇగాగు ….అందరయ్యే తాగుతరాయేంది? కుండ గిరాకీ కుండ కుంటది” అని, వరసలో ఉన్న కుండల్ని లెక్కేసి, “యిగ చాల్లే” అంది ముత్తమ్మ.

కుమ్మరెంకన్న కావిడిని భూమి కుదురుగా ఉన్నచోట ఉంచి, చిలక్కొయ్యకున్న పగ్గాన్ని అందుకొన్నాడు. భార్య ఒక్కొక్క కుండనీ అందిస్తుంటే, కుండ మూతికి పగ్గంతో ఉచ్చేసి బిగిస్తూ, కావిడి రెండు ప్రక్కలా బరువు సరిపోను కట్టుకొన్నాడు.

“పాయె, పొద్దుసుక్క సుత పొడిసె! ఆరు కోసులు…నా దుంపదెగుద్ది” లోలో అనుకొని, భార్య కేసి చూస్తూ, “సద్ది బువ్వెం లేదా? యెండలాయె. ఓ ముద్ద తింటే గాబరెత్తదు” అన్నాడు నెమ్మదిగా.

రాత్రి తను అన్నం తినకపోవడమే మేలయిందనిపించిందామెకు. “ఉంది. చెయి కడుక్కో పెడత” అంటూ ఉట్టి మీద నుంచి అన్నం కుండ దింపి, ఓ పట్టెడన్నం కంచంలో ఉంచింది. మిగతాది పిల్లల కోసమని, మళ్ళీ కుండను ఉట్టిలో ఉంచింది. పిడతలో అడుగంటిని గోంగూర పచ్చడిని వ్రేలితో తుడిచి పల్లెంలో వేసి, అందించి, ముంతలో నీళ్ళు పట్టుకొని దగ్గరగా కూచుంది.

“రేత్రి నువ్‌ తిననట్టుగుంది” ముద్ద కలుపుతూ అన్నాడు కుమ్మరెంకన్న.

“మా తిన్నలే, నువ్‌ కానియ్‌ ” అంది ముత్తమ్మ.

“అవ్‌ పెద్దోడ్ని బోదగుట్ట కెళ్ళి పోనియ్యమాక, ఇటు కుంటపొంటె పొమ్మను. పోలీసోళ్ళూ గుట్ట సుట్టు ముట్టిన్రంట” అన్నాడు.

“ఏవఁయింది?”

“ఏవఁయితే మనకెందుకే?… నువ్వాడ్ని పోనియ్యమాక. నిన్నంత తుపాకుల మోతేనాయె! నువ్‌ సుత యింటివి. యింగా అడుగుండేంది” అన్నాడు.

“అట్టనే, పెద్దోడ్ని నే నర్సుకుంటలేగాని, కస్తూరి మాత్రలు మరవబాక”

“ఊఁ..నువ్వట్ట పిల్దాన్ని సంకనేసుకొని మిల్లు కెళ్ళి పోరాదూ? నీడ పట్టున పని. మానెడు నూకలు దొరికినా మా బాగె” అన్నాడు.

“యాడ?..మిల్లేడ నడుస్తంది. యీ యేడు కాలవేఁడయింది? పొలాలున్నోళ్ళే ఊర్ల పొంటె పనులకి పోతన్రు గాదూ…నీకు తెల్వదా?”

“ప్చ్‌..జెనవెఁట్టనో, యేవోఁ… పంటల్లేక, పనుల్లేక, తిండి కరువై తల్లడిల్లుతున్రు. మనకి నల్లమట్టి తోలే కాపోళ్ళ బసవయ్య లేడూ?..బండెద్దులకి మేత లేక, పోయిన సంతల ఎద్దుల్ని బేరానికి బెట్టిండు. సంతల నన్ను వాటేసుకొని, బోరు నేడ్సిండు. నా సిన్నప్పటి నుంచి మనకి మట్టి తోలిండాయె! “యింకెవుర్నన్న జూసుకోరా ఎంకన్నా” అనే సరికి నాకు సుత కళ్ళ నీళ్ళాగలె” కుమ్మరెంకన్న బాధగా అన్నాడు.

“కాలమిట్టనే వుంటే..రాన్రాను డొక్కల కరువొస్తదేవోఁ” ముత్తమ్మ.

“అట్ట సచ్చినా మాబాగె. ఈ శెరలు పడలేక దినాం సస్తన్నం…”అంటూ, ముంతందుకొని నీళ్ళు తాగి, “సర్లె. ఇంటి పట్టు నుండి కుండల పని కానియ్‌ ” అంటూ కంచాన్ని భార్య కందించి, లేచి కావిడి బద్ద బుజానేసుకుంటూ, “పొయ్యొస్త, పిలగాళ్ళు భద్రం” అని వీధిలో కొచ్చాడు.

కోళ్ళు కూస్తున్నాయి. నిన్నటి శ్రమను మర్చిపోయిన పల్లె కొత్త ఆశల ఆరాటంతో మేల్కొంటూంది. ఎవరైనా తోడు దొరుకుతారేమోనని, కొద్దిసేపు అటూ ఇటూ చూసాడు. ఎవరూ కనపడలేదు. ఆలస్యమైతే సంతలో చోటు దొరకదనే తలంపుతో పరుగు లాంటి నడకందుకున్నాడు కుమ్మరెంకన్న.

ఇలా వెళ్ళడం అతనికి కొత్తేం కాదు. వారానికోసారి ఆదివారం కొత్తగూడెం సంతలో అయిన కాడికి కుండలమ్ముకొని, వారానికి సరిపడా సరుకులు తెచ్చుకోవడం అలవాటే! అదీ… నిన్నామొన్నటి అలవాటేం కాదు. తాతల కాలం నుంచీ ఉన్నదే. ఇప్పటిలా ఆ రోజుల్లో బొగ్గు బావి కార్మికులకు నెలవారీ జీతాలుండేవి కాదు. వారానికోసారి శనివారం భట్వాడా, ఆదివారం సెలవు. అదే రోజు సంత. కార్మికులు వారానికి సరిపడా సరుకులు సంతలోనే కొనేవారు. నగదు బేరం. సరుకు నాణ్యత తప్ప మరొకటి చూసేవాళ్ళు కాదు. చదువు రాకపోయినా , లెక్కల్లో తేడాలుండేవి కాదు. కూలీ నాలీ లంటే జాలుండేది. మాట మీద బతికిన రోజులవి. కుండ ధర చెపితే, “బతకనీ, పనోడు…” అని దయ చూపారే తప్ప, ఇప్పటిలా గీసి గీసి కొసరేవాళ్ళు కాదు. మాయదారి కాలమయింది. మనిషి కంటే పైసాకే గిరాకెక్కువయింది.

తన చిన్నతనం రోజుల్లో కుంట కెళ్ళి ఎంత మట్టి తెచ్చుకున్నా ఎవరూ కాదనేవాళ్ళు కాదు. ఇప్పుడు! మట్టి కూడా మండిపోయే రేటు. అప్పట్లో గుట్టకు పోతే కావాల్సినన్ని కట్టెలు! ఇప్పుడవీ కొనటవేఁ…కాదనుకోలేక చెయ్యడమే తప్ప కులం పనికి రోజులు కావివి. ధరలెంత పెరుగుతున్నా కుండ దగ్గరకొచ్చేసరికి “స్టీలుదా, ఇత్తడిదా?..” అని వెక్కిరిస్తారు. “పావలా కిస్తావా, పరక్కిస్తవా?” అంటరు తప్ప కుండ జెయ్యడానికి కుమ్మరోడి కాల్చేతులెంత శెరబడతయో ఎవరూ చూడరు. మనిషి పనితనానికి నూకలు పుట్టని రోజులయినై!

కుమ్మరెంకన్న ఆగాడు. కావిడి బుజం మార్చుకున్నాడు. అటూ, ఇటూ చూశాడు. అటు తార్రోడ్డు. ఇటు బండ్ల బాట. తార్రోడ్డున పోతే దూరమెక్కువయినా కాలు బాగా సాగుద్ది. తేలికగా నడవొచ్చు. బండ్ల బాటయితే ముర్రేడు వాగులోంచి పోవాల. యిసుక కోసం లారీలూ, ట్రాక్టర్లు తిరగడం వల్ల బాట బాగా నలిగింది. రోడ్డు కంటే ఓ కోసెడు దూరం తక్కువేగాని, యిసుకలో కాలు సాగదు. పైగా కావిడి బరువు. అయినా అతను బండ్ల బాటకే తిరిగాడు. రోడ్డున పోతే పాల్వంచ కోయగూడెం తిరిగే బొగ్గు లారీలు గుద్దితే కుండే పగులుద్దో, గుండే పగులుద్దో ఎవడి కెరుక?

ఇసుకలో కాళ్ళు దిగబడి పోతున్నాయి. బాట కిరుపక్కలా వున్న ముళ్ళ పొదల్లోంచి కీచురాళ్ళు గీ పెడుతున్నాయి.

“కూటికి రానిది కుమ్మరోడి బతుకని పెద్దలు ఊరికే అనలె! కుంట నుంచి మట్టి కొనక్కొచ్చిన లగాయితు యింటిల్లాదులు చెమటోడిస్తే ఇరవై దినాలపైగా శెరబడితే, కుండ చేతి కొస్తది. ఇంతా జేసి అమ్మకానికి కొంచక పోతే ఖర్సట్టబోనీ…దినం కూలి బడదు. దీని సిగదరగ. కుమ్మరి పని కంటే కూలోడి పనే సుకం. పొద్దుగూకితే అంతో యింతో చేతిల పడుద్ది. ఆ పూటకి బెంగుండదు” అనుకొన్నాడు.

ముర్రేడు వాగొడ్డుకొచ్చి కావిడి బుజం మార్చుకుంటూ ఆగి, వాగు కేసి చూశాడు. చాలా వెడల్పుగా వుంది. ఓ పక్క నుంచి లారీ లోతున ఇసుక తోడుకుంటూ వస్తున్నారు. “ఇసుక తోడకండిరా…జెనానికి నీళ్ళ కరువొస్తది. అసలే బొగ్గు బాయిల పున్నేన బావుల్ల నీళ్ళూ, బోరింగుల్లో ఊటలూ దారి తప్పి వొట్టిపోతన్నయి. ఈ వాగు నీళ్ళయినా దరక్కుంటే ఎండాకాలం..జెనం, అంతకు ముందు నోరులేని జీవాలు చస్తయిరా..”అని ఊరి జనం ఎంత మొత్తుకున్నా పంచాయితీ వాళ్ళు ఇసుక వేలం పాట ఆపలేదు. గవర్నమెంటు ఆర్డరిచ్చిందంట. పంచాయితీకి డబ్బు కావాలట. చుట్టు పక్కల కట్టుబడులన్నిటికీ ఇక్కడిదే ఇసుక! తెల్లవారితే లారీలు, ట్రాక్టర్లు…ఇసుక ఎత్తే కూలీలతో సందడిగా ఉంటూంది. ఆ సందడిని చూసే కులవృత్తి మానేసిన కంసాలి వీరాచారి వాగొడ్డున కానుగ చెట్టు నీడలో పందిరేసి టీ కొట్టు పెట్టుకున్నాడు. ఆ సందడి మీద నమ్మకంతోనే ఎకరం పొలముండీ ఎందుకూ కొరగాక, వాంక్‌డోత్‌ భీమ కొంచెం దూరంలో పొదల మరుగున దొంగ గుడుంబా అమ్ముకుంటున్నాడు.

కుమ్మరెంకన్న వాగు మధ్యలో కొచ్చాడు. పగలంతా రొదతో దద్దరిల్లే వాగు అలసటతో కన్ను మలిగినట్టుగా ఉంది. అల్లంత దూరంలో బ్రిడ్జి మీద దీపాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి.

“ఠయిరో”

వాగు లోతట్టు నుంచి వినిపించిన స్వరానికి కుమ్మరెంకన్న ఉలికిపాటుతో అటు చూశాడు. రెండు నల్లని ఆకారాలు…పోల్చుకునేలా లేవు, తన కేసి వస్తూ కనిపించాయి. అతని గుండెలు దడదడ లాడాయి. కాళ్ళలో వణుకు ఆరంభమైంది.

ఆకారాలు దగ్గరగా వచ్చాయి. పోలీసులు! యిద్దరి చేతుల్లోనూ తుపాకులున్నాయి. తలకు యినుప టోపీలున్నాయి.

“ఏ ఊర్రా?” అన్నాడో పోలీస్‌

కుమ్మరెంకన్నకు వెంటనే గొంతు పెగిలింది కాదు. భయంగా చూస్తుంటే దూరాన్నుంచి, “చల్నేదో…” అంటూ కంచు కంఠం వినిపించింది.

అతను అయోమయంగా కంచు కంఠం విన్పించిన వైపు చూశాడు. చాలామంది యిసుకలో కూర్చొని ఉన్నారు.

“పోరా…పో” అంటూ పోలీసులిద్దరూ వెనుదిరిగారు.

అతను వణుకుతున్న కాళ్ళను అదుపులోకి తెచ్చుకుంటూ, “బతికేన్రా భగవంతుడా” అను కుంటూ సత్తువ కొద్దీ పరిగెడుతూ వాగు దాటాడు. గొల్లగూడెం చేరెంతవరకు అతని నడక వేగంతో గుండె వేగమూ పోటీ పడింది.

పూర్తిగా తెల్లవారింది. ఎండ కరకరలాడేందుకు సిద్ధంగా ఉంది. నీటి కరువుతో, మందుల బరువుతో పొలాలెండి, గతి లేక, పస్తులుండలేక ఊరి జనాలు కూలి పనులు కోసం కొత్తగూడెం మొహాన పరుగులు తీస్తున్నారు.

“వామ్మో…పొద్దెక్కింది. సంతల సోటుంటదో, లేదో” అంటూ మళ్ళీ నడక వేగం పెంచాడు.

చిన్న బజారు దాటి, మెయిన్‌ రోడ్‌ దాపుకొచ్చేసరికి పోలీస్‌ స్టేషన్‌ ముందు స్థంభానికి కట్టిన మైక్‌ నుండి పాటలు వినిపిస్తున్నాయి. టీ స్టాల్‌ ముందు సందడిగా ఉంది. జనాన్ని తప్పించుకొంటూ, ఎదురొచ్చే ఆటోలను గమనిస్తూ అతను సూపర్‌ బజార్‌ దాకా వచ్చాడు.

“ఏయ్‌ కుమ్మరోడా…”

కుమ్మరెంకన్న ఆగి వెనుదిరిగి చూశాడు. పోలీసతను ఆగమని చేతి నాడిస్తూ దగ్గరిగా వచ్చాడు. “ఆగవేంద్రా..చెవుడా?” అన్నాడు.

“యినపలేదు, బాంచన్‌ ”

“సర్‌ సర్లే… స్టేషన్కి పద” అన్నాడు పోలీసతను.

కుమ్మరెంకన్న ఉలికిపాటుతో భయంగా చూశాడు.

“టేసన్కా నేనందుకు బాంచన్‌ ” ఎద కరిగించే దైన్యం అతని స్వరంలో కదిలాడింది.

కుమ్మరెంకన్న ముఖంలో కన్పించిన భయానికీ, స్వరంలో విన్పించిన దైన్యానికీ మామూలు మనిషయితే సిగ్గుతోనో, బాధతోనో తలొంచుకునే వాడే! కాని అతను పొలీస్‌ ! ఆ భయం, ఆ దైన్యం చూస్తుంటే అతని అంతరాల్లో దాగున్న గర్వం గంతులేసింది. గలగలా నవ్వుతూ…”చలివేంద్రానికి కుండలు కావాలి, పద….యస్సయిగారు పిలిస్తున్రు” అన్నాడు.

కుమ్మరెంకన్న నరాలన్నీ చచ్చుబడిన వానిలా, బేలగా చూస్తూ, కావిడినో ప్రక్కగా దించి, “గరీబోన్ని, పిల్లల్లుగలోన్ని, నన్నొదిలెయ్‌..బాంచన్‌ మీ కాళ్ళు మొక్కుత” అంటూ పోలీసతని కాళ్ళు పట్టుకోబోయాడు.

“రేయ్‌ దిమాకేవఁన్న చెడిందార!….కుండలమ్మేటందుకు కాదా?…యస్సయి సాబ్‌ పైసలిస్తడురా….” అన్నాడు పోలీసతను కాళ్ళను వెనక్కి తీసుకుంటూ.

కుమ్మరెంకన్న నమ్మనట్టుగా చూశాడు. “వద్దులే బాంచన్‌ నన్ను పోనియ్‌.” వంగి కాళ్ళు మొక్కుతూ అన్నాడు.

“దెహె….వొల్లేమన్న బలిసిందార…అరే, డబ్బులిస్తమంటుంటే వినవేం, పేదోడివి…పొద్దున్నే నీనోరు కొడ్తాంరా! పద, నడువ్‌ ” అంటూ స్టేషన్‌ కేసి దారి తీశాడు.

“ఇదెక్కడి పితలాటకంరా భగవంతుడా!….” అనుకొంటూ కావిడెత్తుకొని పోలీసతన్ని అనుసరించాడతను.

మారిన భద్రతా పరిస్థితులను బట్టి యీ మధ్యనే మూడు అంచెలుగా పటిష్టంగా నిర్మించిన భవనమది. ముందు పెద్ద యినుప గేటు. గేటు కీవల రోడ్‌ సగం ఆక్రమిస్తూ టెంట్లో కుర్చీలు బారులు తీర్చి ఉన్నాయి. టెంట్‌కు కుడి పక్కన గాంధీ విగ్రహముంది. దాని పక్కగా వెదురు తడికలతో కట్టిన పందిరి ఉంది. పందిరి ముందు “చలివేంద్రం, నిర్వహణ మైత్రీ సంఘం” అని రాసిన బేనర్‌ కట్టబడి వుంది. దాని ముందు రంగు కాయితాలంటిస్తూ యిద్దరు పోలీసులున్నారు.

కుమ్మరెంకన్న గేటు  దాపు కొస్తూనే సెంట్రీ లోనికెళ్ళమన్నట్టు సైగ చేస్తూ గేటు తెరిచాడు.

సింహాల బోనులోకి బలవంతంగా నెట్టబడే గొర్రెపిల్లలా బితుకు బితుకు మంటూ అతను లోనికి అడుగు పెట్టాడు.

స్టేషన్‌ ఆవరణలో పోలీసులతో పాటు పెద్ద పెద్దల్లు కూడా కొందరున్నారు. అందరి మొహాల్లోనూ ఆనందమూ, దాంతోపాటు హడావుడీ ఉంది.

“అటు నిల్చో….” లోనికొచ్చిన కుమ్మరెంకన్నను చూస్తూ మొరటుగా అన్నాడో పోలీస్‌

కుమ్మరెంకన్న ప్రహరీ గోడ ప్రక్కగా కావిడి దించి, చేతులు కట్టుక నిల్చున్నాడు.

“క్యా, సాబ్‌..ఎనిమిద్దాటింది. యస్‌పిగారొస్తరా, లేదా…నాకు పనులున్నాయి, ఖమ్మం పోవాల” ఖద్దరు కండువా మెడ చుట్టూ తిప్పుకున్నతను యస్సయి దగ్గరగా వస్తూ అన్నాడు.

ఆ వెంటనే, ఆ ప్రక్కనే వున్న ఓ రంగు చొక్కా మనిషి, “సెల్‌ కొట్టండి సార్‌ అవతల పార్టీ మీటింగుంది. వెళ్ళాల” అన్నాడు.

“వస్తున్నారండీ, ఏన్కూర్‌ దాటారు. ప్రజల కోసం అన్ని స్టేషన్ల ముందు చలివేంద్రాలు పెట్టాలని ఆర్డర్స్‌ వచ్చాయి. ప్రారంభోత్సవాలన్నీ యీ రోజే…కాస్త వోపిక పట్టండి. ఏయ్‌ చలపతీ….సార్లకి మళ్ళోసారి స్ట్రాంగ్‌ టీ జెప్పు” అన్నాడు యస్సయి.

” మీ రూల్స్‌ బాగా మారినయ్‌ సాబ్‌ వైద్య శిబిరాలు బెడుతున్నారు. మైత్రీ సంఘాలు పెట్టారు. కేసు పెడితే రశీదిస్తున్నారు. స్టేషన్‌ కొస్తే కుర్చీ చూపిస్తున్నారు” అన్నాడో రంగుటద్దాల మనిషి.

“అయినా జనానికి భయం పోలె” మరొకతను నెమ్మదిగా అన్నాడు.

ఆ మాటలేవీ కుమ్మరెంకన్నకు పట్టడం లేదు. వాళ్ళ హడావుడీ నచ్చడం లేదు. “ఇక్కడకొచ్చి ఇరుక్కున్ననేద్రా భగవంతుడా….” అనుకుంటూ తల పట్టుకొని ముంగాళ్ళ మీద కూచుంటుంటే….

“రేయ్‌ పది కుండలు తియ్రా…” అన్నాడు యస్సయి. అతని స్వరం సాఫీగా కాకుండా బొంగురు పోయినట్టుగా ఉంది. అతని మొహం సాదాగా కాకుండా నల్లగా, చెదలు పట్టినట్టుగా ఉంది. అతని చూపు సీదాగా కాకుండా దొంగదెబ్బ తీసే “వాడి” చూపులా వుంది. అతని నడుమున వ్రేలాడే పిస్తోలు పుట్టలోంచి తల బయటపెట్టిన నల్లత్రాచులా వుంది.

“సిత్తం, బాంచను” టక్కున అని, పగ్గాన్ని విప్పి చిన్న చిన్న కుండల్ని పక్కనుంచి పది పెద్ద కుండలు ఎదురుగా వుంచి, చేతులు కట్టుక నిలుచున్నాడు కుమ్మరెంకన్న.

“ఏయ్‌, ట్వంటీ సెవెన్‌, యివి లోన పెట్టు” కుండల్ని చూస్తూ అన్నాడు యస్సయి.

“ట్వంటీ సెవెన్‌” కుండల్ని తీసుకెళుతుంటే, తనకే వినపడనంత చిన్నగా, “పైసలిస్తరా  బాంచను” అన్నాడు. అదీ భయం, భయంగా కుమ్మరెంకన్న.

అది “ట్వంటీ సెవెన్‌ “కి వినపడిందో, లేదో గాని అతను బదులేమీ ఇవ్వలేదు. కుండలన్నీ లోపల పెట్టుకొన్నాడు.

కుండలు అడిగిన యస్సయి గానీ, లోన పెట్టుకొన్నతను గానీ తనకేసి చూడటంలేదు. అతనికేం చెయ్యాలో తెలీక తల గోక్కున్నాడు. అందర్నీ మార్చి మార్చి చూడసాగేడు.

యస్సయిగారి చేతిలో వున్న “సెల్‌ ” మ్రోగింది. చెవి దగ్గరుంచుకుని, అవతలి నుంచి చెప్పేదంతా విని, “యస్సర్‌ ” అంటూ సెల్‌ ఆపుజేశాడు. కంగారుతో, “సాబ్‌ ఐదు నిముషాల్లో వస్తారు. పదండి, కూర్చోండి” అంటూ అటూ, ఇటూ తిరగసాగాడు.

“కుండల పైసలు బాంచన్‌ ”

యస్సయి తల తిప్పి చూశాడు. “ఊఁ…మీటింగయినంక ఇస్తరులే, నోర్ముయ్‌” అన్నాడు.

“సంతకు బోవాల…పొద్దెక్కింది బాంచన్‌”అన్నాడు కుమ్మరెంకన్న.

యస్సయి వినలేదు. అతని వెనుకనున్న పోలీసతను విన్నాడు.”రేయ్‌, కుమ్మరోడా…నీ పైసలెటూ పోవుగాని, ఇప్పుడు పెద్ద దొరస్తుండు. చలివేంద్రం మీటింగుంది. నువ్‌ సంతల కుండలమ్ముకొని గమ్మునొచ్చెయ్‌. ఎంతన్నవ్‌” అన్నాడు.

“పది కుండలు, తవరి దయ బాంచన్‌, గరీబోన్ని.”

“సర్లే, నువ్‌ గమ్మునొచ్చెయ్‌.పో…పో…. ” పోలీసతను అంటూ లోనికెళ్ళాడు.

కుమ్మరెంకన్నకు కూడా కుండలమ్ముకొని వస్తేనే మేలనిపించింది. మిగిలిన కుండలన్నీ పగ్గంతో బిగించి కావిడి నెత్తుకొని బయట పడ్డాడు.

ఎండ చుర్రుమంటూంది. తారు రోడ్డు అప్పుడే కాకెక్కింది. “సోటుందో ఎవురన్నా కొట్టేసిన్రో…” అనుకుంటూ పరుగులా నడక సాగించాడు.

సంత దగ్గర కొచ్చేసరికి దమ్మొచ్చింది. చెమట పట్టింది. తను కుండలు పెట్టుకునే చోటు ఖాళీగా కన్పించడంతో కొండెక్కినంత సంబరమేసింది. కావిడి దించి, కండువాతో మొహం  తుడుచుకొంటుంటే, “ఆలిసెవయిందేరా తమ్మీ” అంది కుడి పక్కన అడివి ఉసిరికాయలమ్ముకొంటున్న పడిగె సమ్మక్క.

“టేసన్ల బేరవయిందక్కా” అని, పగ్గం విప్పి కుండలన్నీ వరసన పేర్చి చుట్టూ చూశాడు.

జనం అప్పటికే కిక్కిరిసి ఉన్నారు. ఎండాకాలం అయినందున పొద్దుటి పూటే ఎక్కువ సందడిగా ఉంటుంది. కేకలు, అరుపులు, పరుగులు, పలుకరింపులతో సంత సంతలా ఉంది.

కుమ్మరెంకన్న కుండల వెనుక గుండురాయి మీద కూచున్నాడు. తన కుండల కేసి ఎవరైనా చూస్తుంటే అతనిలో ఆశ మిణుక్కుమంటూంది. కాని కుండ కొనమని ఎవర్నీ అడగడు. మొదట్లో అడిగేవాడే. “కుండలోయ్‌, కుండలు…కొనండమ్మా…అయ్యా, కొనండి…” అంటూ గొంతు చించుకునేవాడు. ఒకరిద్దరు అడ్డం తిరిగేసరికి చెంపలేసుకొన్నాడు.

“కుండలు కనబడుతున్నయిగా, మళ్ళీ, “కుండల కొనమ్మా”ని నీ అడుగుడేంది?….అడిగినంతలో కొంటారా….కావాల్సొస్తే ఊకొంటారా?…నువ్వేం అడగమాక” అంది సమ్మక్క. అప్పట్నుంచీ గమ్మునుంటూ వచ్చేపొయ్యేవాళ్ళను ఆశగా చూడడం అలవాటు చేసుకొన్నాడు.

“నీళ్ళ కుండలున్నాయా?” కూరగాయలతో వచ్చినతను కుండల్ని చూస్తూ అన్నాడు.

“ఆఁ….ఉన్నయి” అంటూ ముందుకొచ్చి, ఓ కుండ అందుకొని, మరో చేత్తో కొట్టి చూయించాడు. కుండ పగులుడుంటే వచ్చే శబ్దానికీ, లేకుంటే వచ్చే శబ్దానికీ భేదం అతనికి తెలుసు.

“మీకు ఫ్రిజ్‌ వుందిగా” కూరగాయలతని ప్రక్కనున్నతను అన్నాడు.

“ఆఁ…వుంది. తొమ్మిది గంటల కరెంట్‌ కట్‌ కూడా ఉంది”తేలికగా నవ్వి, “జనానికి ఎండాకాలం కుండలే గతి…” అన్నాడు కూరగాయలతను.

“ఆ నీళ్ళయినా మూడ్రోజులకోసారి వస్తున్నయి” ప్రక్కనున్నతను.
కూరగాయలతను తలూపుతూ, కుమ్మరెంకన్న చేతిలోని కుండనందుకొని, “ఎంత?”అన్నాడు.
“ముప్పయి”
“మట్టి కుండ బాబూ, మైనంతో చేసిందేం కాదు.  ఏందా రేటు?”వెక్కిరింతగా అన్నాడు ప్రక్కనున్నతను.
“కాదన్నానా బాంచన్‌, ధరలెట్ట మండుతున్నయో…చదువుకొన్న సాములు, తవఁరికి తెల్వదా? ….పోనీ పాతికియ్యండి” అన్నాడు కుమ్మరెంకన్న.
“పదిహేను చేసుకో…”
“ఇంకో అయిదు….ఇరవయ్యన్నా యియ్యండి. మట్టి రేటు మండిపోతంది బాంచన్‌” అన్నాడు.

“నీళ్ళు కారితే వాపసిస్త” అని ఇరవై రూపాయలిచ్చాడు కూరగాయలతను. ఆ ప్రక్కనున్నతనూ అదే ధరకు మరొకటి తీసుకొన్నాడు.

* * *

పొద్దు తిరిగింది. ఎండ మొహం మీద పడుతూంది. కుండలు చాలావరకు అమ్ముడు పోయాయి. బేరం బాగా సాగినందుకు అతనికి సంతోషంగా ఉంది. గుండురాయి మీద కూచొని, బొడ్లో దోపుకున్న గుడ్డ సంచీలోని డబ్బులన్నీ కండువాలో పోసి లెక్క పెట్టుకున్నాడు. మళ్ళీ సంచీలో ఉంచి జాగ్రత్తగా దోపుకున్నాడు.

“బోనీ బేరం మంచిదేరబ్బీ…” తన ఇంటి పెరటిలో కాసిన బొప్పాయి కాయల్ని తన పిల్లలు తినేందుకు అడిగినా ఇవ్వకుండా సంతకు తెచ్చి అమ్ముకుంటున్న పరుపులు కుట్టే దూదేకుల అన్వర్‌ నవ్వుతో అన్నాడు. సమ్మక్క సుత నవ్వింది.

“పోలీసాయన బోణీ…. మారాజు సల్లగుండాల. ఇగబోతనక్కా….టేసన్ల పైసలడుక్కునేసరికి ఏ యాళయిద్దో…పిల్దానికి మాతర్లు సుత కొంచక పోవాల. మీ మర్దలసలే కంగారు మన్సి” అంటూ లేచి, పగ్గంతో మిగిలిన కుండల్ని కావిడికి కట్టుకొని, మరోసారి చెప్పి వెనుదిరిగాడు కుమ్మరెంకన్న.

పోలీస్‌ స్టేషన్‌ దాపుకొచ్చేసరికి పొద్దు పూర్తిగా వాలిపోయింది. పొద్దున వేసిన టెంట్‌ తీసివేశారు. చలివేంద్రంలో ఒకతను నీళ్ళు పోస్తూ కనిపించాడు. తానిచ్చిన కుండలు వరసలో నిలుచున్న మైసమ్మ తల్లుల్లా కనిపించాయి. దగ్గరగా వెళ్ళి, గ్లాసందుకొని నీళ్ళు పడుతూ, “నీళ్ళు సల్లగుండయి గదూ, కుండలు నేనే ఇచ్చిన” అంటూ నీళ్ళు తాగి, స్టేషన్‌లోకి నడిచాడు.

ఆవరణలో నలుగురైదుగురు పోలీసులు మాట్లాడుకుంటున్నారు. లోపల ఎవరో బాధతో అరుస్తున్నారు. ఎవర్నో కొడుతున్నట్టుగా ఉంది.

“కాల్మొక్త బాంచన్‌” అంటూ కావిడి నో ప్రక్కగా ఉంచి, తల గుడ్డ తీసినడుముకు బిగించి, చేతులు కట్టుక నిలుచున్నాడు కుమ్మరెంకన్న.

“ఏంట్రా…ఎందుకొచ్చినవ్‌?”  ఓ పోలీసతను చూస్తూ అన్నాడు.
“పొద్గాల కుండలిచ్చిన బాంచన్‌”

స్టేషన్‌ ముందు గదిలో బల్ల ముందు కూచొని రాసుకునే రైటర్‌ తలెత్తి చూశాడు. “రేయ్‌, కుమ్మరోరోడా… ఇటురా” అంటూ సైగ చేశాడు.

కుమ్మరెంకన్న ఆశగా లోనికెళ్ళి ప్రక్కగా నిలుచున్నాడు. రైటర్‌ ఎదురుగా పొడుగాటి బెంచీ ఉంది. దానిపై కూచున్న నలుగురు పోలీసులు ముచ్చట్లాడుకుంటున్నారు. బల్ల మీదున్న టేప్‌ రికార్డర్‌లోంచి, ఉదయం చలివేంద్రం ప్రారంభోత్సవంలో యస్‌.పి.గారు చేసిన ఉపన్యాసం వినిపిస్తూంది.

“…….పోలీస్‌ ఒక చలివేంద్రం లాంటి వాడు. దాహం తీర్చే నీటి చెలమ. ప్రజాక్షేమమే అతని ఉద్యోగ ధర్మం. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు ఫణంగా పెడుతున్నవాడు. న్యాయాన్ని తన రెక్కల నీడలో….” రైటర్‌ టేప్‌రికార్డర్‌ ఆపుచేసి, కుమ్మరెంకన్న కేసి చూస్తూ కనుబొమ్మలెగరేశాడు.

“కుమ్మరోన్ని బాంచన్‌. పొద్గాల కుండలిచ్చిన.”

“ఎంతరా?…”

“పది పెద్ద కుండలు. బయటైతే మూడొందలొస్తయి. తవరి దయ బాంచన్‌.”

రైటర్‌ బల్ల సొరుగు లాగి, కాగితం తీసి రశీదు రాసి, “పైసలు ముట్టినట్టు ముద్రేయరా….” అంటూ రశీదు బల్ల మీదుంచి, తానే కుమ్మరెంకన్న వేలందుకొని ముద్రేయించాడు.

“పేరేందిరా?”

“కుమ్మరెంకన్న అంటరు , బాంచన్‌.”

రైటర్‌ రశీదు మీద పేరు రాసి, “ఏ ఊరు?” అన్నాడు.

చెప్పాడు.

ఆ ఊరి పేరు వింటూనే అక్కడున్న పోలీసులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాస్తున్న రైటర్‌ చేతిలోని కలం ఆగిపోయింది. బెదురుగా కుమ్మరెంకన్న కేసి దొంగ చూపులు చూశారు. వ్రేలి కంటిన సిరా మరకను తుడుచుకుంటూ కుమ్మరెంకన్న అదేమీ గమనించలేదు.

“బయట కూర్చో, పిలుస్తా” అన్నాడు రైటర్‌.

“సిత్తం బాంచన్‌, సీకటి పడతాంది” అన్నాడు కుమ్మరెంకన్న.

“దెహె పో…బయటుండమనలె. యస్సయి సాబొచ్చినంక పైసలిస్త. పో…” కోపంగా చూస్తూ కసిరాడు రైటర్‌.

కుమ్మరెంకన్న అమాయకంగా, భయంగా చూశాడు. ఇప్పటి వరకూ చల్లగా మాట్లాడినతను ఇప్పటికిప్పుడే ఎందుకు కోపగించుకుంటున్నాడో తెలీక, దీనంగా చూస్తూ,”అట్టనే బాంచన్‌” అంటూ ఆవరణలో కొచ్చి కావిడి దాపున నిల్చున్నాడు.

పొద్దున తిన్న పట్టెడు మెతుకులు. అతనికి నీరసంగా వుంది. ఖాళీ కడుపున నాలుగైదుసార్లు నీళ్ళు తాగడం వల్ల కడుపులో తెములుతోంది. డోకొచ్చినట్టుగా ఉంది. ఎంత త్వరగా డబ్బులిస్తే,  అంత త్వరగా ఆ చోటు నుంచి దాటుకోవాలని తప్ప, మరో ఆలోచన అతనిలో లేదు. కొద్ది సేపాగి, మనసాగక, దాపు నుంచి వెళ్తోన్న పోలీసతని కేసి చేతులు జోడించి, “దొరెప్పుడొస్తడు, బాంచన్‌” అన్నాడు.

పోలీసతను అదోలా, కాటేసేలా చూసి, “నీకూ, నాకూ చెప్పొస్తాడ్రా సాబ్‌? కూచోమంటే మా గీర్మానం పోతున్నవేంది? ఆఁ….ఏంది?…” కరిచేలా అన్నాడు.

కుమ్మరెంకన్నకు వెన్నులో వణుకొచ్చింది. “ఎవర్ని మెదిపినా కరుస్తున్న్రేంది?” లోలోనే గొణుక్కొని గేటు కేసి చూస్తుంటే జీప్‌ వచ్చి గేటు ముందాగింది.

జీప్‌లోంచి దిగిన యస్సైని చూసేసరికి కమ్మరెంకన్నకు ప్రాణం లేచి వచ్చినట్టనిపించింది. మనసు కుదుట పడింది. పైసలు చేతిలో పడినంత సంతోషమేసింది.

యస్సయి సెంట్రీ సెల్యూట్‌ అందుకుని, గదిలోకి నడిచాడు. ఆ వెంట ఇద్దరు పోలీసులు లోనికెళ్ళారు. కొద్దిసేపటికే వారిద్దరితో పాటు యస్సయి బయటి కొచ్చాడు.

“దొరా, బాంచన్‌” కుమ్మరెంకన్న ఓ అడుగు ముందుకేసి, వంగి, చేతులు జోడిస్తూ అన్నాడు.

“ఎవడ్రా…ఆఁ….ఏమిటి?” యస్సయి

“కుమ్మరోడ్ని బాంచన్‌…కుండల….”

“పైసలివ్వలేదా?….ఏయ్‌ ఖాసిం….వీడి పైసలివ్వలేదా?…ఇచ్చెయ్‌….” యస్సయి అంటుంటే ఖాసిం అనబడే రైటర్‌ పరుగుల వచ్చి యస్సయి చెవిలో ఏదో చెప్పాడు.

ఆ మరుక్షణమే, యస్సయి మొహంలో రంగులు మారాయి. ఓ మాదిరిగా వున్న అతని కళ్ళలోకి రక్తపు జీరలొచ్చాయి.

“రేయ్‌, కుమ్మరోడా…ఏ ఊర్రా నీది?” అన్నాడు యస్సయి.

చెప్పాడు కుమ్మరెంకన్న.

“ఏయ్‌, సెవెంటీటూ….వీణ్ణి లోపల పడెయ్‌” అన్నాడు యస్సయి.

కుమ్మరెంకన్న ఉలిక్కిపడ్డాడు. బెదురు గొడ్డులా చూసాడు. కాళ్ళ క్రింద భూమి క్రుంగిపోతున్న రీతి….దడ….వణుకు….”బాంచన్‌, నేను…నేను….పొద్గాల కుండలు…కుండలిచ్చిన కుమ్మరోణ్ణి…కాల్మొక్త” తడారి పోతున్న గొంతుతో తడబడుతూ అన్నాడతను.

“ఏయ్‌….చుప్‌….” అని కసిరి లోనికెళ్ళాడు యస్సయి.

కుమ్మరెంకన్న వొళ్ళు ఝల్లుమంది. రాయిలా, చలనరహితంగా నిలుచుండి పోయాడు. చూపులు ఎక్కడో శూన్యంలోకి….శూన్యంలా….

అతన్ని చూసేసరికి, “సెవెంటీటూ”కి జాలేసింది. దగ్గరగా వచ్చి, “రేయ్‌….” అంటూ రెక్క పట్టుకొన్నాడు. అయినా కుమ్మరెంకన్న శూన్యావస్థలోంచి బయటకు రాలేదు. పోలీసతను మరోసారి పిల్చి, కదల్చి, చిరాకేసి, చెంప “చెళ్‌” మనిపించేసరికి కుమ్మరెంకన్న ఉలిక్కిపడి తెలివిన బడ్డాడు.

“సెవెంటీటూ” కుమ్మరెంకన్న రెక్క పట్టుకుని, “ఏంద్రా, ఏందట్టయినవ్‌?….ప్రాణం బాగుందా?…భయమేసిందా?….గుండె చెదరకు” అంటూ, భూమ్మీదున్న కావిడిని తీసి కుమ్మరెంకన్న భుజం మీద పెడుతూ, “ఇగ్గో, పొద్దున మీ ఊరి బోడగట్టున కాల్పులైనయి. సాబ్‌ కోపం మీదున్నడు. మీ ఊరోళ్ళు దొరికితే బొక్కలేసి, కుళ్ళబొడవమని ఆర్డరొచ్చింది. పో…..పో….బలుసాకు తినైనా బతకొచ్చు….పో,…. సి.ఐ.సాబొస్తే చావగొడతడు. నే సర్దిచెపుత….నువ్‌…జల్దెల్లు….యీ చుట్టు పక్కల ఉండబాకు, పో…ఉరుకు” అంటూ గేటు కేసి నెట్టేశాడు. అలా నెట్టేస్తూనే కుమ్మరెంకన్న బొడ్లో జాగర్తగా దోపుకొన్న గుడ్డ సంచీ వడుపుగా లాగేశాడు.

ఆ నెట్టుడుకు తూలిపడే వాడల్లా గేటు పట్టుక నిలదొక్కుకొని, మిరిగుడ్లేసుకొని స్టేషన్‌కేసి చూస్తూ, “బాంచను, బాంచను…నా పైసలు…” అంటుంటే…

గేటులో ఉన్న సెంట్రీకి లోనుంచి ఓ కనుసైగ అందింది.

అంతే!

గేటు పట్టుక నిల్చున్న కుమ్మరెంకన్న రెక్క పట్టుక లాగి , రోడ్‌కేసి యీడ్చి గిరాటేశాడు సెంట్రీ!