సెప్టెంబర్ 2003

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం !

రామాయణ కథకు ఒక విశిష్టమైన చరిత్ర వుంది. మనకిప్పుడు అందుబాటులో ఉన్న రామాయణాలన్నిటినీ చూస్తే తేలేది ఇది “ఒక కథ” కాదనేది. ఈ విషయం ఆరుద్ర కూడ “రాముడికి సీత ఏమౌతుంది?” అనే పుస్తకంలో కొంత చర్చించాడు. ఐతే రామాయణ కథా పరిణామం, దాని వెనుక ఉన్న సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక శక్తుల గురించి విపులంగా చర్చిస్తూ కూలంకషమైన పరిశోధన చేసి వెల్చేరు నారాయణరావు గారు 2001 లో ఒక వ్యాసం ప్రచురించారు. ఇది ఆంగ్లంలో, ఒక వ్యాససంకలనంలో వుంది. కనుక అందరికీ అందుబాటులో లేదు. ఈ వ్యాసానికి తెలుగు అనువాదాన్ని “తెలుగు రామాయణాల రాజకీయాలు బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు” పేరుతో ఈ సంచికలో ప్రచురిస్తున్నాం. తెలుగు సాంఘిక పరిణామాల గురించి ఆలోచించే వారెవరికైనా ఈ వ్యాసం అవశ్యపఠనీయం అని మా అభిప్రాయం. ఈ వ్యాసాన్ని అనువదించి ప్రచురించటానికి అనుమతి ఇచ్చిన శ్రీ నారాయణరావు గారికి కృతజ్ఞతలు.

ఈ సంచికలో మరొక ప్రత్యేకాంశాన్ని అందిస్తున్నాం. ఇది కూచిమంచి జగ్గకవి రాసిన “చంద్రరేఖా విలాపం” అనే కావ్యం. ఇది చాలా విలక్షణమైన కావ్యం. ఒక వంక దీన్లో చాలా పచ్చి బూతులు వున్నాయి. కొందరికి అసభ్యంగానూ, అసహ్యంగానూ, కొన్ని చోట్ల జుగుప్సాకరంగానూ కూడా ఉండే అవకాశం పుష్కలం. మరో వంక సాహిత్య దృష్టితో చూస్తే అద్భుతమైన భాషా ప్రయోగాలు, విశృంఖల కవితా ధార కనిపిస్తాయి. ఈ కావ్యాన్ని 1920 ప్రాంతాల్లో ప్రభుత్వం బహిష్కరించింది దీని ప్రచురణని నిషేధించింది. ఈ నిషేధం మాకు తెలిసినంతవరకు ఇప్పటికీ రద్దు కాలేదు. అందువల్ల దీన్ని 1922లో పుదుచ్చేరి నుంచి చివరి సారిగా పుస్తక రూపంలో ప్రచురించారు. ఆ తర్వాత మళ్ళీ ఇది పుస్తకరూపంలో రాలేదు. కాలం అప్పటినుంచి ఇప్పటికి ఎంతో మారింది. సమాజం ఆలోచనా ధోరణిలో, ప్రవర్తన నియమాల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఈ కావ్యం మళ్ళీ వెలుగు చూడటానికి ఇది సరైన సమయమని, “ఈమాట” వంటి పత్రిక దీనికి సరైన రంగమని మా విశ్వాసం. అందుకే ఈ సంచికలో “చంద్రరేఖా విలాపం” మూలం చూడబోతున్నారు. దీన్లోని వస్తువు దృష్య్టా పద్దెనిమిదేళ్ళ లోపు వయసు వాళ్ళు దీనిని చదవకూడదు.

ఇక మీ అభిరుచులకు అనుగుణంగా కథలు, కవితలు, వ్యాసాలు అందిస్తున్నాం. అన్నిటినీ చదివి మీ అభిప్రాయాల్ని తెలియజేస్తే ఆనందిస్తాం.