జస్ట్ బిజినెస్

నేను ఈరోజు త్వరగా యింటికి వెళ్ళాలి
నువ్వు కూడా ఈ పనంతా కానిచ్చేసి
మీ యింటికి త్వరగా వెళ్ళిపో ..
నేను రేపు అదిరిపోయేట్లు మాట్లాడాలి,
నువ్వు ఆ ప్రెజెంటేషన్‌ మెటీరియల్‌ అంతా
చకచకా తయారుచేసెయ్‌!

మనం మన క్లయింట్లని
ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి!!
నీ టేలెంటూ, ఎఫ్ఫర్టూ డెబిట్‌ చేసి,
మన గ్రూపుకి ఎప్పటికన్నా ఎక్కువగా
గుర్తింపూ క్రెడిటూ తీసుకురా ..

కొంచెం ప్రెషరెక్కువగా ఉన్నా,
అంతా కలిసి సర్దుకుపోదాం,
నువ్వసలే చాకు లాంటి వాడివి,
మైల్‌స్టోన్‌ హర్డిల్సన్నీ
టైముకి ముందే దాటుకురా ..

మన ప్రాజెక్టు పూర్తి కావచ్చింది,
నిన్ననే బోనసు కబురొచ్చింది,
“ప్రమోషను” నాకొచ్చింది
నీకు “బ్రైట్‌ ఫ్యూచర్‌” వుంది ..

నీ పెరిగే అవసరాలు నాకు బాగా తెలుసు,
కానీ, మనం తెచ్చే లాభాలన్నీ,
అవతలి ప్రాజెక్టులు ఆబగా తినేస్తున్నాయి,
ఇంకెక్కడినుండి జీతాలు పెంచమంటావు ..?

అవునూ,
బయటంతా లేఆఫ్‌ల కాలం
రిసెషన్‌గన్‌ ప్రేలుడు మారు మ్రోగుతోంది కదా,
మన కంపెనీ వాళ్ళూ
మనలో పదిమందిని పీకేసి
ఆ పని అంతా మనపై వేసి
“ఎకానమీ పుంజుకోవడానికి”
తమ వంతు ఉడతసాయం చేస్తున్నారట ..

ఫరవాలేదు,
నువ్వు ధైర్యంగా ఉండు,
నీకు మాత్రం,
నీ ఉద్యోగాన్ని దక్కించుకోవడానికి,
నిన్ను నీవు నిరూపించుకోవడానికి
మరో గొప్ప సువర్ణావకాశం
వెతుక్కుంటూ మళ్ళీ వచ్చింది ..

నథింగ్‌ పెర్సనల్‌! జస్ట్‌ బిజినెస్‌!!