నల్ల బెలూన్

పాప చేతిలో బెలూన్, సరికొత్తది, మెరిసిపోతోంది. గాలికి అటు ఇటు ఊగుతూ అల్లరిగా అప్పుడప్పుడు పాప చిన్ని తలను ఢీ కొడుతోంది కూడా. అయినా పాప మొఖంలో రవంతైనా సంతోషపు ఆనవాళ్ళు లేవు. అమ్మ కోప్పడుతుందేమోనని గట్టిగా పట్టుకుందే కానీ తనకు బెలూన్‌ను వదిలిపెట్టేయాలనే వుంది. అమ్మ ఎప్పుడూ తనకు ఇష్టమైన రంగు బెలూన్ కొనిపిస్తుంది. కానీ ఈసారి తనకు నచ్చింది కాక వేరే రంగుది కొనిచ్చింది. పాపకు ఉక్రోషంగా వుంది.


గ్రోసరీలు ఇంట్లో పెట్టేసి పాపను కమ్యూనిటీ ప్లేగ్రౌండ్ దగ్గరకు తీసుకువెళ్ళింది అమ్మ. పాప బెలూన్‌తో పాటు అలకను కూడా ఇంట్లోనే వదిలిపెట్టింది.

ప్లేగ్రౌండ్‌లో పిల్లలు ఆడుకుంటుంటే, పెద్దవాళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటారు. రాజకీయాల నుంచి వంటల దాకా అన్ని రకాల సంభాషణలు నడుస్తాయి వాళ్ళ మధ్య. పిల్లల గురించి, వాళ్ళ చదువుల గురించే ఎక్కువ మాటలు దొర్లుతాయి. తెలుగుతో పాటూ అన్ని రకాల భారతీయ భాషలు వినిపిస్తాయక్కడ. అమెరికాలో వున్నా ఇండియాలో వున్నట్లుంటుంది. ఎప్పుడైనా వేరే దేశస్తులు వచ్చినప్పుడు మాత్రమే ఇంగ్లీషు పదాలు వినిపిస్తాయి. అందరూ కలుపుగోలుగా వుంటారు.

చీకటి ముసురుతోంది చిన్నగా. ఒక్కొక్కరే వాళ్ళ పిల్లలను తీసుకుని ఇంటి మొఖం పడుతున్నారు.

ఇంటి పని, పాపను నిద్రపుచ్చిన తరువాత చెయ్యాల్సిన ఆఫీసు పని గుర్తొచ్చి పాపను కూడా ఇక వెళ్దామని అడిగింది అమ్మ. చలికాలమంతా ఇంట్లో ఒక్కతే ఆడుకుని ఇప్పుడిప్పుడే చలి తగ్గడంతో బయట తన స్నేహితులతో ఎంత ఆడినా తనివి తీరట్లేదు పాపకు. ఇంకో ఐదు నిమిషాలు ఇంకో ఐదు నిమిషాలంటూ ఓ ఐదు ఐదు నిమిషాలను దాటేసింది.

ఇంతలో మిగిలిన పిల్లల గుంపుకి కాస్త దూరంగా మెల్లగా వెళ్ళింది ఒక నల్ల పిల్లి.

“అబ్బబ్బ! ఎంత నల్లగా, అసహ్యంగా వుందో!” చీదరించుకుంది పాప స్నేహితురాలు.

“ఊహూఁ, బొద్దుగా, ముద్దుగా ఉంది!?” గొణిగింది పాప తన స్నేహితురాలి మాటకు అడ్డొచ్చి ఆట పాడు చేసుకోవద్దనుకుంటూనే. పాప మాట పట్టించుకోలేదు స్నేహితురాలు. పాప కూడా ఏమీ అనలేదు. కానీ ఆటపై కాస్త ఆసక్తి తగ్గింది పాపకు.

“ఇక ఇంటికి వెళ్ళకపోతే బూచాడొస్తాడు,” పాపపై ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించింది అమ్మ.

“నల్లగా, భయంకరంగా ఉంటాడు!” అమ్మ స్నేహితురాలు అమ్మకు సాయం వచ్చింది. ఈ పాప ఇంటివైపు తిరిగితే తన పాప కూడా మారాం చెయ్యకుండా వచ్చేస్తుందని ఆమె ఆశ. అదృశ్య హస్తమేదో ఆపినట్లు ఆగిపోయింది పాప.

“బూచాడెప్పుడూ నల్లగానే ఉంటాడా అత్తా?” ఒక క్షణమాగి అడిగింది.

“చాలావరకు…” మెల్లగా అంది అత్త, తమ మాటలు ఎవరూ వినట్లేదు కదా అన్నట్టు చుట్టు పక్కల చూస్తూ.

“చాలావరకు అంటే, బూచి తెల్లగానో, లేకపోతే మనలా బ్రౌన్ కలర్లో ఉండదని హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ థర్టీ త్రీ పర్సెంట్ ష్యూరా?”

“మరే! లెక్కల ముక్కలు సరిగ్గా రావు గానీ, మాటలు కోటలు దాటుతున్నాయి. ఒక్క మాటలో జెండర్ ప్రెజుడిస్, రేస్ ప్రెజుడిస్ రెండూ నాకు అంటగట్టేస్తోంది.” నవ్వుతూ ప్రేమగా పాప తల తట్టింది అత్త.

పిల్లలు మళ్ళీ ఆటలో పడేలోపు వాళ్ళను ఇళ్ళవైపు నడిపించారు అమ్మలు. ఇంటికెళ్ళేప్పుడు జింక పిల్లలా ఎగురుతూ అమ్మ కాళ్ళకు అడ్డం వచ్చేది పాప. ఈరోజు మాత్రం మౌనంగా అమ్మ చెయ్యి పట్టుకుని ఇంటివైపు నడిచింది. వంట్లో నలతగా ఉందేమోనని భయపడింది అమ్మ.


ఆ రాత్రి అమ్మ పక్కనే దుప్పట్లో పాప అమ్మ చెప్తున్న కథ వినకుండా కిటికీలోంచి చుక్కలు నిండిన ఆకాశాన్ని చూస్తుండిపోయింది.

మామూలుగా అయితే తను చెప్పే కథకు అడుగడుగునా కొత్త కొత్త ఊహలు కలుపుతుంది పాప. కథను ఎన్నో మలుపులు తిప్పి మాట్లాడుతూనే మగతగా నిద్రలోకి జారిపోతుంది. ఈరోజు అంత మౌనంగా ఉందేమిటా అని, నిద్ర పోయిందేమోనని పాప వైపు చూసింది అమ్మ. ఒక చుక్క నుంచి మరో చుక్కవైపు కదులుతున్న ఆ చిన్ని కళ్ళవైపు కాసేపు చూస్తుండిపోయింది. పాప అరిచేతులు, అరికాళ్ళు పట్టుకుని చూసి అవి చల్లగా ఉండడం గమనించి నిమ్మళంగా ఊపిరి పీల్చుకుంది.

“హేయ్, ఈరోజు చుక్కలతో బొమ్మలు చేద్దామారా బంగారు తల్లీ?” ఉత్సాహంగా అడిగింది.

“అమ్మా, ఆకాశం నల్లగా వుంటేనే కదా చుక్కలు ఇంత బ్యూటిఫుల్‌గా కనిపించేది?” మెల్లగా అడిగింది పాప.

“నిజమే కన్నమ్మా.” అమ్మ కూడా సాలోచనగా ఆకాశంలోకి చూసింది. నలుపు కాక వేరే రంగులో వున్న రాత్రి ఆకాశంలో చుక్కలు ఇలాగే మిణుకుమిణుకుమంటాయా?

“నల్లపిల్లిని ఎందుకు ఎవరూ లైక్ చెయ్యరు?”

చుక్కలు నిండిన ఆకాశానికి, నల్లపిల్లికి లంకె ఏమిటో అర్థం కాలేదు అమ్మకు.

“నీకు భయమేయదా ఆ నల్లపిల్లిని చూస్తే?” అమ్మ ఆశ్చర్యంగా అడిగింది. అవును, ఆ పిల్లి అంటే పిల్లలందరికీ భయమే.

“కొత్తలో భయమేసేది కరుస్తుందేమో అని. ఇప్పుడది క్యూట్‌గా అనిపిస్తుంది. ఆ పిల్లి కళ్ళు భలే ఉంటాయి కదమ్మా?” ఉత్సాహంగా గొంతు పెంచింది పాప. “రోజూ బడికెళ్ళేముందు ఆ పిల్లి కనిపిస్తుందేమోనని చూస్తాను తెలుసా? పొద్దున్నే దాన్ని చూస్తే హ్యాపీగా వుంటుంది. అది నా పెట్ కాని పెట్.”

ఎక్కడికైనా వెళ్ళేప్పుడు నల్లపిల్లి ఎదురొస్తే ఇంట్లోకి వెళ్ళమని పెద్దవాళ్ళు చెప్తారని, బడికెళ్ళేముందు నల్లపిల్లి ఎదురు రావాలని కోరుకోవడం గుర్తొచ్చి నవ్వింది అమ్మ.

“అమ్మా, అమ్మా! నల్ల బెలూన్ కూడా నాకు చాలా చాలా చాలా ఇష్టం. నల్ల బెలూన్ మీద మెరుపు భలే వుంటుంది తెలుసా?” మరింత ఉత్సాహంగా చెప్పింది పాప.

“నిద్ర పొయ్యేముందు అరిస్తే నిద్రాదేవి పారిపోతుంది. నీకు ఇష్టం లేకపోయినా, మొండిగా అడిగావనుకున్నానురా. నల్ల బెలూన్ కావాలని పేచీ పెట్టిన పిల్లలెవరూ నాకు తెలీదురా.”

“నీకు ఎంత మంది పిల్లలు తెలుసు?” గుసగుసగా అడిగింది పాప.

“నిజమేరోయ్. పది మంది తెలిసినా, నాకు తెలీని పదకొండో పాపకు నల్ల బెలూన్ ఇష్టమై ఉండొచ్చు,” పాప తల నిమురుతూ అంది అమ్మ, “కానీ, అన్ని రంగులుండగా విచిత్రంగా నలుపే ఎందుకు?”

“నలుపూ ఒక కలరే కదా? అందులో విచిత్రమేముంది?”

పాప రెండేళ్ళప్పుడు తన డే కేర్ టీచరుతో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది అమ్మకు. పిల్లలకు రంగు కాగితాలిస్తున్నప్పుడు, పాప వంతుకు నల్ల కాగితం వచ్చిందట. వేరే రంగుది ఇస్తానన్నా, అదే కావాలని, లైట్ కలర్ పెన్సిళ్ళతో గీతాలు గీసిందట. నల్ల కాగితంపై గీసిన గీతలు వింత మెరుపుతో మిగతా పిల్లల్ని కూడా ఆకట్టుకున్నాయట. రంగు కాగితాలను పిల్లలకు పంచేముందే నల్ల కాగితాన్ని పక్కన పెట్టేదాన్నని, ఇక అలా చెయ్యడం మానేశానని చెప్పిందా టీచర్: “పెద్దయ్యేకొద్దీ మన చూపు మందగిస్తుంది. ఒక్కోసారి ప్రెజుడిస్ లేదనే అనుకుంటాం కానీ, లోపలెక్కడో ఆ మచ్చ నాటుకు పోయుంటుంది. పిల్లలను గమనిస్తే వాళ్ళు మనకు మళ్ళీ చూపు ప్రసాదిస్తారు. మనలో కాస్త మాలిన్యాన్ని కడిగేస్తారు. రంగు కాగితాలిచ్చినప్పుడు చాలా కొద్ది మంది పిల్లలు నల్లరంగు వద్దన్నారు. నల్ల రంగైనందుకు కాదు, వాళ్ళకు ఆ క్షణంలో కావాల్సిన రంగు కానందుకు.”

పాప కుదుపుకి జ్ఞాపకాల్లోంచి బయటపడింది అమ్మ.

“ఏమ్మా, నాకు రేపు నల్ల బెలూన్ కొనిస్తావా?”

“ఈ బెలూన్ ఏం చేద్దాం? పది రోజులకో బెలూన్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ బెలూన్‌తో ఆడుకో. పది రోజుల తరువాత నల్ల బెలూన్ కొందాం.” పాపకు పొదుపు నేర్పించాలని అమ్మ ప్రయత్నం.

“ఇదొక్కసారి అమ్మా, ప్లీజ్! నల్ల బెలూన్ మీద నా దగ్గరున్న గ్లిట్టర్ గ్లూతో మంచు పడుతున్నట్లు బొమ్మ వెయ్యాలనుకున్నా.”

“మరి షాపులో ఉన్నప్పుడే ఇంత గట్టిగా ఎందుకు అడగలేదు?”

“నువ్వే కదా షాపులో గొడవ చెయ్యద్దని చెప్పింది? అయినా చాలాసార్లు ఏదడిగితే అది కొనిస్తావ్ కదా? మరి ఈ బెలూన్ నీకోసం కొనుక్కున్నావ్. అందుకే నాకు రేపు నల్ల బెలూన్ కావాలి. ప్లేగ్రౌండ్‌కి తీస్కెల్తే మర్చిపోతాననుకున్నావా?”

“లాయరమ్మా, నువ్వు బతికిపోతావురోయ్! ఇంటికొచ్చి దాన్ని పక్కన పడేస్తావనుకున్నా. నువ్వు ఆర్టిస్టువని మర్చిపొయ్యాన్రా. రేపు షాప్‌కి వెళ్ళి నల్ల బెలూన్ కొందాంలే. ఇక నిద్రపో తల్లీ.”

పాపకు బుగ్గ మీద ముద్దిచ్చి, దుప్పటి సరిగా సర్దింది అమ్మ.


బడికి తయారవుతూ అమ్మతో కథలు చెప్పించుకోవడం అలవాటు పాపకు. ఆరోజు పొద్దుటినుండి మాత్రం నలుపు గురించి ఒకటే మాట్లాడుతోంది. పక్షుల గురించి, గ్రహాల గురించి, పాపకు ఇష్టమైన నెంబర్ 80 గురించి చెప్తున్న కథలను ఏదో విధంగా నలుపు రంగులోకి లాక్కెళుతోంది. కొద్దిసేపు చూసి అమ్మకు అనుమానం వచ్చింది.

“సాయంత్రం షాప్‌కి వెళ్ళి నల్ల బెలూన్ కొందామని చెప్పాను కదా? దాని గురించి మరీ అంతలా ఆలోచించొద్దు.”

“అది కాదమ్మా. బెలూన్ కాదు. ఐ లైక్ బ్లాక్ కలర్,” అనేసి ఆలోచనల్లో పడిపోయింది. ‘పాప పెద్దదవుతోంది’ మురిపెంగా అనుకుంది అమ్మ. కొన్ని నెలల క్రితం వరకు తన మనసులో ఏదో గింగిరాలు తిరుగుతున్నప్పుడు చెప్పలేక బాగా ఏడ్చేది. ఇప్పుడు ఏడుపు బదులు ఆలోచనల్లో మునిగిపోతోంది. పాప మనసులో ఇంకేదో తిరుగుతోందనిపించింది అమ్మకు.

“సరే, నీకు నల్ల పిల్లి అంటే ఇష్టం, నల్ల బెలూన్ అంటే ఇష్టం, నల్ల కాగితమంటే ఇష్టం. నలుపువి ఇంకేమిష్టం?” పాప రెండు జడలు సరిగ్గా వున్నాయో లేదో చూస్తూ అంది అమ్మ.

“మా బస్ డ్రైవర్ అంటే ఇష్టం, మార్గరెట్ అంటే ఇష్టం. వాళ్ళు బూచాళ్ళు కాదమ్మా,” చట్టుక్కున వెనక్కి తిరిగి అమ్మ కళ్ళల్ల్లోకి చూస్తూ అంది, “మా డ్రైవర్ అత్త చెప్పినట్టుంటాడు. కానీ నాకు భయమెయ్యదు.”

“నాకు అర్థం కాలేదురా. వాళ్ళని చూసి ఎందుకు భయపడాలసలు?” పాప మనసును తొలుస్తున్నదేదో అమ్మకు లీలగా అర్థమవుతున్నట్లు అనిపించింది. “నల్లగా ఉన్నందుకే వాళ్ళంటే ఇష్టమా?”

“కాదు. నిన్న అత్త చెప్పింది కదా బూచాడు నల్లగా వుంటాడని. ఒకసారి ప్లే గ్రౌండ్‌లో లిలీ వాళ్ళమ్మ కూడా ఇట్లాగే అంది. ఎవరో ఒకతను రోడ్డు మీద వెళ్తుంటే అతన్ని చూపించి ఆ నల్లతను జాగ్రత్త అని అంది. వేరే వాళ్ళనెప్పుడు అలా చూపించలేదు. మొన్న క్లాసులో మా టీచర్ సెగ్రిగేషన్ గురించి చెప్పింది. అప్పుడు లిలీ అంది ఇంకెప్పుడూ అలా అనొద్దని వాళ్ళమ్మకు చెప్తానని. మరి అత్తకు ఎవరు చెప్తారు. నువ్వు ఎందుకు చెప్పలేదు? నీకూ ఇష్టం లేదా బ్లాక్ కలర్ అంటే? నువ్వు కూడా అందుకేనా నల్ల బెలూన్ కొనివ్వలేదు? నల్లపిల్లి ఎవ్వరికి ఇష్టం లేదు అందుకే కదా? బూచాడు నల్లగానే ఎందుకుండాలి?”

పాపను గట్టిగా గుండెలకు అదుముకుని, “లేదమ్మా, నాకు నలుపన్నా ఇష్టమే,” అని మాత్రం అనగలిగింది అమ్మ.

తన స్నేహితురాలు అన్న మాటకు అభ్యంతరం చెప్పకపోగా, నవ్వడం గుర్తొచ్చి సిగ్గుపడింది అమ్మ. తన స్నేహితురాలు బిగట్ కాదు. ప్రెజుడిస్ వున్న వాళ్ళంటే తనకూ చిరాకే. ఆమె అన్న మాటలు పిల్లలను ఆటల్నుంచి మళ్ళించడానికి చేసిన ఒక కామెంటు మాత్రమేనని అమ్మకు తెలుసు. కానీ పిల్లల ముందు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో కదా. పిల్లలకు నేర్పుతాం సరే, మరి పెద్దల సంగతో అనుకుంది అమ్మ.

వీళ్ళున్న కమ్యూనిటీ వెనకాలంతా ఎవరికీ చెందని స్థలం వుంది. దాని తరువాత మూడు వైపుల అవతల ఏముందో కనిపించకుండా కొన్ని వరసల మేపుల్ చెట్లు వుంటాయి, ఇంకో వైపు దూరంగా తక్కువ ఇన్‌కమ్ వాళ్ళ కోసం కొత్తగా కట్టిన అపార్ట్‌మెంట్లు వుంటాయి. అఫర్డబుల్ లివింగ్ అంటే ఇక నల్లవాళ్ళే వస్తారని, జాగ్రత్తగా వుండాలని కమ్యూనిటీలో అనుకుంటుంటారు. అలా కొంతమంది అన్నప్పుడు తనలోనే విసుక్కుంది కానీ, పైకేమీ అనలేదు.

అంతలో తనకు రోజు వచ్చే ఊహ గుర్తొచ్చింది. ప్రతి రాత్రి ఇల్లంతా లైట్లార్పేసి, సెక్యూరిటీ అలారం ఆన్ చేస్తున్నప్పుడు ప్రతిసారీ ఒకే దృశ్యం గోచరిస్తుందామెకు. అర్థరాత్రి ఒక నల్లని బలిష్టుడైన వ్యక్తి ఇంట్లో దూరినట్లు. అలాంటిదే జరిగితే పాపను ఎలా రక్షించుకోవాలో ఊహిస్తూ బెడ్ రూమ్ తలుపుకి పాప పాత క్రిబ్ అడ్డం పెట్టేది. ఇప్పుడు పాప మాటలకు ఆ ఊహ మనసులో మెదలి అమ్మ తనను తాను తిట్టుకుంది. అసలు తను అలా ఆలోచిస్తోందని కూడా తట్టలేదు. ఇంట్లోకి ఏ తెల్లవాడో, ఇంకో జాతివాడో దూరడం ఎప్పుడూ ఊహించుకోలేదామె. తన లాంటి వాళ్ళకు కూడా లోపల మారుమూలెక్కడో ఇంత సంకుచితత్వం మిగిలే వుండడం కనిపించింది. ఇకపై పిల్లల ముందు జాగ్రత్తగా వుండాలని తన స్నేహితురాలితో చెప్పాలి.

పాపను స్కూల్ బస్ స్టాప్ దగ్గరికి తీసుకెళుతూ చెప్పింది అమ్మ, “తెలీని మనిషి ఎవ్వరైనా చాలా జాగ్రత్తగా వుండాలి తల్లీ. తెలీని వాళ్ళు దగ్గరికి వచ్చినా, నీతో మాట్లాడాలని ప్రయత్నించినా ఏం మాట్లాడకుండా పరిగెత్తి వెళ్ళిపో.” పాప తన కళ్ళ ముందుండని ఆ ఎనిమిది గంటలంటే అమ్మకు భయం. ఎవరినీ తక్కువ, ఎక్కువ అంచనా వెయ్యకుండా జాగ్రత్తగా ఉండాలని పాపకు సరిగ్గా అర్థమ్మయ్యేట్లు చెప్పాలని అమ్మ తాపత్రయం.

పాప బస్ ఎక్కుతూ బస్ డ్రైవర్‌కు గుడ్ మార్నింగ్ చెప్పింది.

“గుడ్ మార్నింగ్ హనీ. డోంట్ ఫర్గెట్ టు సే బై టూ మామా.” ఎప్పట్లాగే నవ్వుతూ చెప్పాడతను.


బడి నుంచి రాగానే స్నాక్ తినిపించి పాపను షాప్‌కు తీసుకెళ్ళింది అమ్మ. వాళ్ళ ఇళ్ళ వెనకాల నుంచి అఫర్డబుల్ లివింగ్ అపార్ట్‌మెంట్ల మధ్య నుంచి నడిచే వెళ్ళొచ్చు. ఆ దారిలో జన సంచారం ఎక్కువ ఉండదు. అమ్మ ఇంతకు ముందులాగే పరిసరాలను గమనిస్తూ నడిచింది కానీ, ఈసారి ఆమె మనసులోని రూపాలకు రంగుల్లేవు.

బెలూన్ సెక్షన్ వెళ్ళారు. బెలూన్లు అమ్మే అతను పాపను గుర్తు పట్టాడు. “మై ఫేవరెట్ రెగ్యులర్ కస్టమర్ వచ్చింది. వాంట్ ఎనదర్ బలూన్ స్వీటీ? ఎనీథింగ్ స్పెషల్?”

“నిన్న నేను బెలూన్ కొనుక్కున్నాను కదా, ఈ రోజు పాపకు కొనిద్దామని…” అమ్మ మాటలకు కిసుక్కున నవ్వింది పాప.

“ఓహో! లిటిల్ ప్రిన్సెస్‌కు ఏ రంగు బెలూన్ కావాలి మరి?”

“నల్ల బెలూన్!” ఉత్సాహంగా చెప్పింది పాప.

“నల్లదా?” ఆశ్చర్యంగా అన్నాడు, “ఆర్యూ ష్యూర్ హనీ, ఆడుకోవడానికి అంత బాగోదేమో?…”

“ఏం కాదు!” పాప ఎమోషనల్ అయింది.

నల్లబెలూన్ పాపకు ఇస్తూ, “సారీ సారీ స్వీటీ, మై బ్యాడ్. ఈ నల్లబెలూన్ నీకు నా గిఫ్ట్. నలుపును ఇంకెప్పుడూ తక్కువ చేసి మాట్లాడను, సరేనా?” చిన్న పిల్లల్లా గుండె మీద వేళ్ళతో క్రాస్ గీసుకుంటూ ప్రామిస్ చేశాడు.

“నేను కూడా!” పాపను ముద్దు పెట్టుకుంటూ అంది అమ్మ.

నల్ల బెలూన్ పట్టుకున్న పాప ముఖం వెలిగిపోయింది.