తీర్థంలో రంగరించి పోసిన మత్తుని
ఇంకో మతం మీద సందేహాన్ని పిడిగుద్దుని
తిరగబడ్డ చక్రాలకి వేళ్ళాడిన మాంసం ముద్దని
ఉపగ్రహం చూపించిన భూచక్రాన్ని
విరిగిపడ్డ అలని – పెనుగాలికి ఎగిరిపోయిన రేకుని

పదునైన దృశ్యాలు
పాముల్లా పడగవిప్పి
బుసకొడుతున్న గగుర్పాటు
వికృత శబ్దాలకు
గుండెనదిలో పెరుగుతున్న
భయపు నీటిమట్టం

నేను వంద మాటలు మాట్లాడితే
నువ్వు ఒక్క నవ్వు నవ్వుతావు.
నేను మౌనంగా ఉంటే
కలవరంతో
ఎలా ఉన్నావు, జాగ్రత్త అంటావు.
ఇక, ఆ మాటతో
నేను నదినై గలగలమంటానా

మాటా మాటా పేర్చుకుని
ఒక వంతెన కట్టుకోవడం కష్టం కానీ
ఏదో అనుమానమో
అసంతృప్తో
గాలి బుడగలా పగిలిపోవడం
ఏమంత కష్టం కాదు

ఫాదరిన్లాస్ గిఫ్ట్ అని
రాయని మోటారుసైకిలెక్కి
సైకిల్ తొక్కేవాడిని చూసి జాలిపడుతూ
కారులో వెళ్ళేవాడిని చూసి ఈర్ష్యపడుతూ
భాను’డి’ విటమిను ఒంట పట్టించుకుంటూ
రాచ కార్యాలయానికి తగలడి

‘ఆ మెడకి చుట్టుకున్నదేవిటి?’
ఎవరిదో నిశ్శబ్దం

‘ఆ పిడికిలిలో ఏమిటి?’
అడగలేని ప్రశ్నలు.

‘ఆ కప్పుకున్నదేవిటి?’
పెంచుకున్న ఆశలు.

ఇది
మిణుగురు గుండెలోని
ఉదయపు వేడీ
రాత్రుల చీకటీ
ఊగే చెట్లూ, పారే వ్యర్ధాలూ
ఊపిరాడనివ్వని కమరుతో పాటు
తనకంటూ దాచుకున్న గుప్పెడు గాలి.

బజాట్లో ఊతకర్ర నేల పొడుస్తూ
అడుగులు లెక్కపెడుతూ
చెట్టు కొమ్మలంతున్న
బుర్ర మీసాల సందున
చిరునవ్వు పిట్టల్ని ఎగరేస్తూ
ముతక తాత వెళ్తూ ఉంటాడు

ఉన్నట్టుండి
పరిమళాలపారిజాతాలై కురిసిపోవాలి

గతపుజాతరలో తప్పిపోయి
పరధ్యానంగా కూర్చున్నపుడు
దాచుకున్న బ్రతుకు పానకపు రుచి
గుర్తు రావాలి

మామూలుతనపు రోడ్డులెంబడి
నొప్పి సూది గుచ్చుతూ
అంబులెన్సు
కుట్లేసి పోయినట్టు
సాల్ గిరా తేదీల్లోనో మరి
ఎక్కడ నక్కిందో
ఎనెన్ని భూముల కింద పారుతుందో

లైబ్రరీ మెట్లమీద
మనం
చేజార్చుకున్న ఊహలన్నీ
ఏ నిద్ర పట్టని రాత్రో
నా వెంటబడి తరుముతాయి
తీరంలో మనం
అల్లుకున్న కవితలన్నీ
కెరటాల్లా హోరెత్తుతాయి

నీ మాటలతో నన్ను కాల్చివేయచ్చు
నీ చూపులతో నన్ను ముక్కలు చేయచ్చు
నీ విద్వేషంతో నన్ను చంపివేయచ్చు
కానీ మళ్ళీ,
నేను గాలిలా
ఇంకా పైకి లేస్తాను.

నా కాంక్షాపటుత్వం నిన్ను కలవరపరుస్తుందా?

నేను పలకరించలేదని అలిగి ముఖం తిప్పుకున్న పెరట్లో నిన్న పూచిన పువ్వు
తలుపు చప్పుడు చేసి ఎప్పట్లా నేను తెరిచేలోపే మాయమయ్యే వీధిలో పిల్లలు
నాకు చిరునవ్వుల్ని మాత్రమే బట్వాడా చేసే పోస్ట్‌మన్‌గారు
రెండ్రోజులుగా మబ్బుల్ని తోడుగా పెట్టి ఏ ఊరో వెళ్ళిన ఎండ

ఒక్క వాక్యం కనికరించదే
మునుపు
ఎలా కుంభవృష్టి కురిసింది
నదిలా ఉరకలేస్తూ
లోయలగుండా
ఎలా ప్రవహించింది
మనసెందుకిలా ఎడారైంది?

అనుకోకుండా పాదాల మీద
చిన్న స్పర్శ
పక్కమీద చిన్న ముడత
గాలి కెరటాల హోరు
ఎక్కడో కాంతి రొద
ఇంక ఈ రాత్రి
నిరీక్షణే

తెల్లారి లేస్తే
ఎక్కడెక్కడి చెత్తనో తెచ్చి
నీ ముంగిట్లో గుమ్మరించేస్తారు

కొద్దిపాటి మంచిని
చెత్తకుప్ప నుంచి
వేరు చేసుకోవడం
చెప్పనలవికానంత కష్టం

మట్టిపొద్దులు మౌనంగా నిర్మించిన
సుగంధాల పడవలు
మట్టికొలనులో మునిగిపోవడానికి
పెద్ద పెద్ద అలలతో పనిలేదు
గాలి తరగల తాకిడి
సుతారంగా సోకితే చాలు!

నది ఒడ్డునే నువ్వు పరిగెత్తి పరిగెత్తి
రొప్పుతూ ఆగిపోతావు
ప్రాణం కడగట్టుతుంది
అందీ అందకుండా అది సాగిపోతుంది

దాహం తీరదు
తపన ఆగదు