ఇదీ నన్నయ్యగారి దేవయాని! తెలుగు భారతంలో ఆమె అసాధ్యురాలు, గొప్ప గడసరి కూడా! అందుకే మొదలుపెడుతూనే నిష్ఠూరాలు! తప్పంతా యయాతిపై తోసేసింది. ఆ రోజు నన్ను బావినుండి బయటకు తీసే సందర్భంలో సూర్యుని సాక్షిగా నీ ఉన్నతమైన దక్షిణహస్తంతో నా దక్షిణహస్తాన్ని పట్టుకున్నావు. కాబట్టి ముందే నన్ను పాణిగ్రహణం చేశావు. అది నువ్వు మరచిపోవడం న్యాయమా? అని యయాతిని నిలదీసింది!

గౌరీదేవి బొటనవేలిపై నిలబడి, బాహువులను పైకెత్తి, నాలుగగ్నుల మధ్యన నిలుచుండి, మార్తాండుని కేసి చూస్తూ, ప్రాణాయామాది నియమాలను పాటిస్తూ, నిరంతరం పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఘోరతపోదీక్షలో ఉంది. ఇలా ఉన్న ఆ నారీమణి శరీరం నుంచి ఆమె సహజసౌందర్యం — ముంగురుల అందాన్ని తుమ్మెదలలోను, మందగమనాన్ని హంసలలోను, ముఖకాంతిని తామరలలోను, శరీరకోమలత్వాన్ని తీగెలలోను, చంచలమైన చూపులను లేళ్ళలోను, దాచి పెట్టిందా అన్నట్టుగా తొలగిపోతోంది.

రాజకుమారి యామిని ఉంది చూడు. ఆ అమ్మాయి ఒక కాశ్మీరకవీంద్రుని వద్ద సంస్కృతం నేర్చుకుంటున్నదని నీకింతకు ముందు చెప్పినాను కదా! ఆయనను నేను చూచినాను. ఆయన మహాపండితుడు, గొప్పకవి అంటే విన్నాను. అంతే కాదు. ఆయనంతటి స్ఫురద్రూపిని నేనెన్నడూ చూడలేదు. నీలవర్ణం బదులు బంగారు రంగుతో మెఱిసే శ్రీకృష్ణమూర్తిలాగ ఆయనుంటాడు. అంతేకాక ఆయన యువకుడు గూడ.

చీకటి మరింత చిక్కబడింది. మన్మథుడు వచ్చాడు కాబట్టి వారవనితలూ జారవనితలూ కూడా వచ్చి చేరారు! కవిగారి చమత్కారం చూడండి. ‘వృద్ధ వారవిలాసినీ విసరమునకు అపలితంకరణ ఔషధంబు అనగ’ ఉందట చీకటి. పలితకేశం అంటే నెరిసిన జుట్టు. పలితంకరణం అంటే జుట్టు పండిపోవడం. అపలితంకరణం అంటే కేశాలకు నల్లదనం రావడం. అపలితంకరణ ఔషధం అంటే, అలా నల్లబడేందుకు వాడే మందు, అంటే ఇప్పటి భాషలో hair dye.

ఒకప్పుడైతే విద్యాగోష్ఠులలో –-

కమలాకరకమలాకర
కమలాకర కమల కమల కమలాకరమై
కమలాకర కమలాకర
కమలాకరమైన కొలను గని రా సుదతుల్.

— వంటి పద్యాలనిచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పరీక్ష్యులకూ ఒక కేళీవినోదంకరణగా ఉండేదట.

అనగనగా ఒక భీముడు. పేరుకు తగ్గట్టుగానే అరివీర భయంకరుడు. తన కత్తితో పిడుగును సైతం నరికిన పరాక్రమం అతనిది. అది ఆషామాషీ కత్తి కాదు! కాలకూటవిషపు ముద్దని తన మూడవకన్ను అనే కొలిమిలో కాల్చిపెట్టి, వాసుకి కోరలనే పట్టకార్లతో పట్టి, ఒక దిగ్దంతి తలపై పెట్టి, పిడుగుల సమూహమనే సమ్మెటతో కొట్టి, స్వయంగా ఆ లయకారుడైన శివుడే కమ్మరిగా తయారుచేసినదేమో అన్నంత భయంకరంగా ఉండే ఖడ్గం అది.

రదము అంటే దంతము. నాయిక పలువరుసతో అప్పుడు ‘కోరకము’ పోటీకి దిగింది. కోరకము అంటే పూవుమొగ్గ. ఆ కోరకము రదముతో సాటి కాలేకపోయింది. ఓటమి మూలాన ‘అరగతి’ని పొందింది. అరగతి అంటే ఛిన్నాభిన్నమైన దన్నమాట. అరగతి అంటే అ’ర’గతి. ర అన్న అక్షరం లేకుండా పోయిందన్నమాట. రేఫలోపం వల్ల ‘కోరకము’ అప్పుడు ‘కోకము’ అయింది.

ఆ పిల్లవాడేమో అల్లరివాడు, ఎప్పుడూ ఇటూ అటూ ఆడుతూనే ఉంటాడు. కానీ వసంతానికి అతడు ముద్దులబాలుడు. అందుకే వాడిని మురిపెంగా జోలపాడి బజ్జో పెట్టాలన్న తాపత్రయం. ఆ సన్నివేశాన్ని చాలా అందంగా మన ముందుంచాడు భట్టుమూర్తి. వసంతశోభ అంతా పచ్చదనంతో మిసమిసలాడే చెట్లలోనే కనిపిస్తుంది.

ఆమె ముఖపద్మం వాడిపోయింది. తెల్లని నిడుదైన కన్నులు చిన్నబోయి ఉన్నాయి. చెలులతో చేరి ఆమె సరసులోకి దిగి ఆడటం లేదు. ఒక చేయి నుదుటన పెట్టుకుని అలా ఒడ్డునే కూర్చొని ఉంది. నెచ్చెలులు తనని ఆడడానికి రమ్మని పిలుస్తున్నారు. వాళ్ళకి రెండో చేత్తో, ఒంటి చేత్తోనే, నమస్కారం పెట్టి, దయచేసి మీ దోవన మీరు ఆడుకోండని చెపుతోంది. నలుదిక్కులా పరికిస్తోంది. ఏమిటి చూస్తోంది? ఏమీ లేదు! అది ‘చూడక చూచు చూడ్కి.’ వట్టి చూపులన్న మాట.

ఇక పద్యంలోని కవిత్వలోతుల వైపు దృష్టి సారిస్తే, తిక్కన కవిత్వంలో ప్రధానంగా కనిపించే గుణం ధ్వని. కవిత్వంలో ధ్వనిని రకరకాల మార్గాల ద్వారా వ్యక్తం చేయవచ్చు. శబ్దం ద్వారా, అలంకారాల ద్వారా, వర్ణనల ద్వారా, కథాకథనం ద్వారా, యిలా అనేక మార్గాలు. ఒకో కవిది ఒకొక్క ప్రత్యేక మార్గం.

ఆ దంపతులు పెళ్ళి యేర్పాట్ల సన్నాహంలో తలమునకలుగా ఉన్నారట. విశ్వనాథ సత్యనారాయణ గారిచేత పెళ్ళికి ఆశీర్వాద పద్యాలను చెప్పించుకొంటే పెళ్ళి నూరేళ్ళ పంట అవుతుందని, మౌక్తికోపమానంగా వంశవర్ధకమైన సంతానం కలుగుతుందని వాళ్ళ నమ్మకం. ఇంటికి వచ్చి అడిగారట.

శ్రీనాథుని యజ్ఞదత్తుడు, భార్యతో వ్యంగ్యంగా మొదలుపెడతాడు. ఇంటికి వచ్చి, “సోమిదమ్మ! ఏమి చేయుచున్నావు? ఇటు రమ్మ! నీ కొడుకెక్కడం బోయె? బోవగా కేమి? విను మిట్లనియె”, అని పై పద్యం చెపుతాడు. ఎక్కడా తిట్టుపదం లేదు. కానీ పలికే తీరులో ఒలికే వ్యంగ్యమంతా సహృదయులైన పాఠకులు ఊహించుకోవలసిందే!

ఈ రచన ముఖ్యోద్దేశము శ్రీవిష్ణుమూర్తి యెత్తిన దశావతారములను సార్థకనామవృత్తములలో వర్ణన చేయడము. శ్రీజయదేవకవిలా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కల్కి అవతారములను దశావతారములుగా ఎన్నుకొన్నాను.

కవి ఒక మనోజ్ఞ కావ్యాన్ని రచిస్తున్నాడు. ఎక్కడ? దొంతరలైన మబ్బులకు త్రోవలు చూపే కాగడా చెంత కూర్చుని కావ్యాన్ని రచిస్తున్నాడు కవి. అప్పుడతని దగ్గరకు నాగుపాముల్లాంటి భావాలు వచ్చి చేరాయి. అలా ఆ భావనాభుజంగాలు తనను చేరేసరికి కవిలో ఆవేశం పెల్లుబికింది. రుద్రవీణ వాయిస్తూ పడమటి దిక్కు చివళ్ళ నాట్యం చేస్తానంటున్నాడు.

ఇంతకీ జరిగిందేమిటంటే; అంబుధరం వేనలికి సాటి రాలేక ఇరువ్రయ్యలైనపుడు ఆ దేవతలూ, ఆ విద్వాంసులూ, తదంశముల్ పూని అంటే, ఆ పదాల అర్థాంతరాలను గ్రహించి, సమతఁ బోల్చిరి తత్సతి దృక్కుచంబులన్. వాటిని ఆమె చూపులతోనూ, ఆమె వక్షోజములతోనూ సాటి చేసి, ఎంతో కొంత ఊరటను కల్పించారు.

మోహావేశం రావాలంటే పరిసరాలూ ఆహ్లాదకరంగా ఉండాలి కదా. పర్యావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేది వసంతం కాక మరేమిటి? అందుకనే వసంతుణ్ణి వెంటపెట్టుకుని వచ్చాడు మన్మధుడు. వెన్నెల రాత్రుల్లో ఆ పూలూ, పరిమళాలూ లోకాన్ని సౌందర్యంతో ముంచెత్తుతుండగా తను పూల బాణాలు సంధిస్తే — శివుడయ్యేది కాని, మరెవరయ్యేది కాని — ఇక తిరుగేముంది అనుకున్నాడు మన్మధుడు.

మూలభారత కథలో దుష్యంతుడు కొద్ది గడియల సేపు మాత్రమే కణ్వాశ్రమంలో ఉండి శకుంతలను లోబరుచుకొని – కణ్వ మహర్షి వచ్చేలోగా వెళ్ళిపోతాడు. కాళిదాసు నాటకంలో దుష్యంతుడు మున్యాశ్రమంలో కొన్ని రోజులుండి, మునులకు రాక్షస బాధ లేకుండా చేసి, శకుంతలతో ప్రణయ కథ నడిపి వెళ్ళిపోతాడు. పిన వీరన దుష్యంతుణ్ణి చాలా రోజులు అక్కడ వుంచి – ప్రణయానికీ విరహానికీ, చంద్రోదయ వర్ణనకూ, యుద్ధ వర్ణనకూ – అన్నిటికీ అవకాశం ఆ సమయంలో కల్పించుకున్నాడు.

మణికంధరుడేమో గంధర్వుడు. విరాగి కాడు. అందుకని అమ్మాయిలను చూడగానే కొంచెం ముచ్చట పడింది అతని మనస్సు. నారదుడు అతని ముచ్చటకు ముచ్చట పడి, “సెబాశ్, మంచి కవివోయి నువ్వు,” అని మెచ్చుకోవడమే కాకుండా ఆ ఊహకు తన ఉత్సాహాన్ని కొంత జోడించి, “త్రైవిష్టప స్త్రీల యౌదల్ దన్నన్ జనునట్లు మించెననినన్ దప్పేమి, యొప్పేయగున్” అని ముక్తాయించాడు.

స్వతహాగా సత్య వీరనారి. నరకుని లాంటి వీరునితో యుద్ధం చేసే అవకాశం వచ్చింది. ఆ ఉత్సాహం కొంత. తన పరాక్రమం భర్త ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు భర్త ముందు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఆ ఆనందం కొంత. ఇటు శత్రువును చూస్తూ, అటు ప్రియుని చూస్తూ ఏకకాలంలో వీరాన్నీ, శృంగారాన్నీ ప్రదర్శిస్తున్నది.

ఏనుగు అరటి తోటలో పడిందంటే ఒక్కొక్కచెట్టునూ తొండంతో పెళ్ళగించి పారెయ్యకుండా వూరుకోదు. దానికి అరటి చెట్టంటే అంత వైరం ఎందుకో తెలుసుకోవాలని వుందా? వినండి. అందమైన అమ్మాయి తొడలను ఏనుగు తొండంతోనూ, అరటిచెట్టు బోదెతోనూ పోల్చడం మన ప్రాచీనకవులకు అలవాటు. ఇలాంటి అలవాట్లు చాలా వున్నాయి వారికి.