కవి వృత్తిరీత్యా కృషీవలులు. జానపద సౌందర్యాన్నీ, సంప్రదాయాల కమనీయతనూ గుండెల్లో నింపుకున్నవారు. ఆ నేపథ్యం వలన కమ్మటి తెలుగు జాతీయాలూ, పలుకుబడులూ వారి పద్యాల్లో బహుళంగా మెరుస్తుంటాయి. పై పద్యమే చూడండి: తీర్థమాడుట, గాజువారుట, చేయికల్పుట, చిగురుపట్టుట, పసని నిగ్గులు లాంటి పలుకుబడులు ఎంత సొగసుగా ఉన్నాయో!
Category Archive: పద్య సాహిత్యం
తాతగారి కవితలోని పదగుంభనమూ ప్రౌఢత్వమూ యీ మనుమడు పుణికిపుచ్చుకున్నట్టు లేదు. రామభద్రకవి రచనలో ప్రౌఢతకన్నా సారళ్యము, ఓజస్సు కన్నా మాధుర్యమూ ఎక్కువగా కనిపిస్తుంది. తన కవిత గురించి చెప్పుకున్న సందర్భాలలో కూడా ‘మామక నవ్యకావ్యము సమంచిత మాధురి సాధురీతి’ అని, ‘మాధురీగతి ప్రబంధ మొనర్చిన నొప్పుగాక’ అనీ, మాధుర్య గుణాన్ని ప్రధానంగా పేర్కొన్నాడితను. పైన యిచ్చిన రెండు పద్యాలూ ఈ గుణానికి చక్కని మచ్చుతునకలు.
వేదులవారి కవిత్వంలో ఒక గాఢ విషాదపు జీర కనిపిస్తుంది. మహాప్రస్థానానికి పీఠికగా ఇచ్చిన యోగ్యతా పత్రంలో లోకమంతటి బాధా శ్రీశ్రీ బాధైతే, కృష్ణశాస్త్రి బాధ లోకమంతటిదీను అంటాడు చలం. అది కృష్ణశాస్త్రి ఒక్కడిదే అనుకోనక్కరలేదు. దాదాపు భావ కవులందరిలోనూ ఆ లక్షణముంది. వేదులవారి కవిత్వంలో ఐతే మరీను.
ఈ పద్యాలున్న చిరుకబ్బం–కేవలం 122 పద్యాలది, వ్రాసేనాటికి ఏతత్కవి వయస్సు కేవలం 12 సంవత్సరాలేనట! పన్నెండేళ్ళ వయస్సులో ఒకట్రెండు పద్యాలు గిలకడం అంత గొప్ప ఏమీ కాకపోవచ్చుకాని చిరస్థాయి ఐన ఒక చారిత్రక స్మృతికావ్యాన్ని మనోహరంగా శిల్పించడం అసామాన్యులకూ, కారణజన్ములకూ మాత్రమే సాధ్యమయ్యేపని.
ఇటాలియను భాషలో నున్న అత్యంత రసవత్తరమైన ఈ రూపకముయొక్క ఆంగ్లానువాదమును ఆధారముగా చేసికొని, తెలుగులో దీనిని పునర్మించితిని. ఇది ఇంగ్లీషు ప్రతికి అనుకరణయే కాని అనువాదము కాదు, మూలేతివృత్తాధారముగా నిర్మింపబడిన స్వతంత్ర రచన. మూలములో నున్న సన్నివేశములు, పాత్రల పేర్లు భారత సంస్కృతికి తగునట్లుగా మార్చబడినవి.
కేవలం ద్రాక్షాసవపు గిండి మాత్రమే అయితే అది అసంపూర్ణమే. ఆ చషకాన్ని సాకీ ఒయ్యారంగా అందిస్తుంటేనే సందర్భానికి సార్థకత. ‘రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురపు విడెమ్ము’లాగా. అయితే అక్కడ రమణికీ స్వీకర్తకూ మధ్య ప్రియ దూతిక వుంది గాని, సాకీ స్వయంగానే రమణిలాంటిది.
…పరమేశ్వరునితో ఎన్ని రకాలుగా ముచ్చట్లు చెప్పాడో, ఎన్ని చోట్ల ఆశ్చర్యం పొందాడో, ఎంత బ్రతిమలాడాడో, ఎంత అలిగాడో, ఎంత కోపపడ్డాడో, ఎంత భక్తిభావాన్ని వెలార్చాడో, శివుణ్ణి ఎంత పరిహాసం చేశాడో, ఎన్ని వైవిధ్య భావాలను రాశిపోశాడో, ఎన్ని అద్భుతమైన సమాసాలు గుప్పించాడో, ఎన్ని విధాలుగా స్వామిని సంబోధించాడో, ఎంత ఛందస్సుందరంగా పద్యాలను పొదిగాడో…
మన పురాణాల్లోని కొన్నికొన్ని పాత్రలు అన్యాయానికి గురైనాయని మనకు అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. కవి హృదయం సాధారణంగా ఆర్ద్రంగా ఉంటుంది కాబట్టి అలాంటి పాత్రల యెడ సహానుభూతి కలిగి ఉంటుంది. ఒక ఏకలవ్యుడు, ఒక ఊర్మిళ, ఒక అహల్య, ఒక కర్ణుడు లాంటి వారి యెడ ఏంతో అనుకంపనని చూపిస్తుంటారు చాలామంది. వాల్మీకి ఊర్మిళకు అన్యాయం చేశాడని వాల్మీకి రామాయణాన్ని మార్చబూనాడట పుట్టపర్తి నారాయణాచార్యులుగారు.
ఇండ్ల పెరళ్ళలో నాలుగైదు పెద్ద వృక్షాలు– మామిడీ పనసా లాంటివి ఉండటం సర్వసాధారణం. అలాంటి ఒక చెట్టు మీద పొద్దున్నే కాకి ఒకటి వచ్చి వ్రాలి కౌ కౌ అని అరుస్తున్నది. మరో చెట్టు మీద కోకిలలు కూర్చుని వాటి అరుపులను అవి తుహీ తుహీ అని అరుస్తున్నాయి. ఒక కూత వినపడగానే జవాబుగా కూయడం కోకిలలకు అలవాటు.
వలపులు చిందే చూపులలోని అందమే వేరు! అందులోనూ, తొలిచూపుల పలకరింపులు మనసులను గిలింతలు పెడుతూ మరింతగా అలరిస్తాయి. పెళ్ళిపీటల మీద, సిగ్గుబరువుతో రెప్పలు ఎత్తలేక, పక్కనున్నవారిని కంటితుదలతో చూసే ప్రక్కచూపుల నేర్పు, మన్మథుడు నేర్పే ప్రథమ విద్య అంటారు విశ్వనాథ. ప్రేయసీ ప్రియల తొలిచూపులను శృంగార రసోల్లాసంగా తెలుగులో వర్ణించిన మొట్టమొదటి కవి నాకు తెలిసి తిక్కన.
నిందాస్తుతి అంటే పైకి తిడుతున్నట్టు, గేలి చేస్తున్నట్టు, కనిపిస్తూనే స్తుతి చేయడం. నిందాస్తుతిని సమర్థంగా నిర్వహించాలంటే కవికి మంచి చమత్కారం ఉండాలి, భాషపై గొప్ప పట్టు ఉండాలి. భాషపై పట్టు అంటే కేవలం పాండిత్యం కాదు, సజీవమైన వాడుక. మాట్లాడే భాషలో ఉండే కాకువు దీనికి ప్రధానమైన సాధనం. కోపం, వెటకారం, భయం మొదలైన భావాలు స్వరం ద్వారా ధ్వనించే శక్తిని కాకువు అంటారు.
ఆయన అన్నగారు ఇప్పుడెలా అని అడిగితే, కంగారు అవసరం లేదని చెప్పి తన గదిలోకి వెళ్ళి గడియ వేసుకొని శారదాపీఠం ముందు కూర్చొని సరస్వతీ ధ్యాన నిమగ్నుడయ్యాడట పినవీరన. అతను ధ్యానంలో ఉండగా సరస్వతి ప్రత్యక్షమై శతఘంటాలతో కావ్యాన్ని వ్రాయడం మొదలుపెడుతుంది. ఇంచుమించు పూర్తి అవుతోందనగా, ఆ గదినుండి వస్తున్న దివ్యకాంతులను చూసి అన్న తలుపు సందునుండి చూసేసరికి, ‘బావగారు వచ్చారు’ అంటూ సరస్వతి అదృశ్యమవుతుంది.
విష్ణువు అంటాడు కదా, ‘నువ్వు నన్ను వదిలిపోయినప్పటి నుంచీ, ఇదిగో ఈ పుట్టలో నిన్నే తలుచుకుంటూ కూర్చున్నాను. పశులకాపరి నా తల పగలగొట్టినప్పుడు ఆ బాధకు ఓర్చి నేనిలా ఉన్నానంటే అది నీ మహిమే. నీ పాతివ్రత్య నిష్ఠ చేతనే నేనింకా బతికున్నాను. అదలా ఉంటే, ఈ ఆకాశరాజ కన్య నన్ను మోహించి నా వెంటపడింది. అందుకామెను పెళ్ళిచేసుకోవలసి వచ్చింది. అది కూడా నువ్వు ఒప్పుకొంటేనే సుమా! నువ్వు కాదంటే నాకీ పెళ్ళి వద్దు.’ ఇవీ ఆయనగారి మాటలు! అయినా అమ్మవారి దగ్గరా ఆయన మాయలు?
అడవిలో తిరిగే పిశాచాల సాహచర్యంతో పైశాచీ భాష నేర్చుకుంటాడు గుణాఢ్యుడు. నేర్చుకోవడమేమిటి, ఆ భాషలో కవిత్వం అల్లగల పాండిత్యం సంపాదిస్తాడు! దీని కోసమే ఎదురు చూస్తున్న కాణభూతి అనే ఒక పిశాచం వచ్చి మహత్తరమైన కథలను వినిపిస్తాడు. వాటిని పైశాచీ భాషలో ఏడేళ్ళు శ్రమపడి ఏడు లక్షల శ్లోకాలతో ఏడు బృహత్ గ్రంథాలుగా రచిస్తాడు గుణాఢ్యుడు. అయితే, ఆ అడవిలో అతనికి రాసేందుకు సాధనాలు ఎక్కడివి?
చనుబాల కోసం ఏడుస్తున్న పిల్లాడికి ఒక పిండిముద్ద ఇచ్చి మాయ చేసే తల్లిలా నన్ను మాయ చేసి పోదామని అనుకుంటున్నావా. నీకు మూడు కళ్ళు ఉన్నా లేకున్నా, నువ్వు హర రూపంలో వచ్చినా నర రూపంలో వచ్చినా నాకు ఒకటే. అంచేత నీ చమత్కారాలు చాలించి నే పెట్టిన భోజనాన్ని బుద్ధిగా ఆరగించి వెళ్ళు – అని శివుడినే గదమాయిస్తుంది ఆ మహా భక్తురాలు!
ఒక శిల్పాన్ని నిర్మించడమంటే, మనిషి ముక్కు చెవులు తెలిసేట్టు ఏదో చెక్కుకుంటూ పోవడం కాదు. మనసుపెట్టి చూసేవారికి అందులోని ప్రతి వంపులోనూ విశిష్టత కనిపించాలి. ఆ కూర్పులో గొప్ప సౌష్ఠవం తొణికిసలాడాలి. మనసుపెట్టి చూసేవారికి అందులోని ప్రతి వంపులోనూ విశిష్టత కనిపించాలి. ఆ కూర్పులో గొప్ప సౌష్ఠవం తొణికిసలాడాలి. పద్యమైనా అంతే!
పూర్వం మన కథలన్నీ చివరకు కంచికే వెళ్ళేవి. అందుకే వాటి ముగింపుతో మనకి పెద్దగా నిమిత్తం లేదు. ఆ మాటకొస్తే కథతో కూడా లేదు! కథనంలో వచ్చే కల్పనలు, సంభాషణలు, వర్ణనలు, అవి రేకెత్తించే ఆలోచనలు, అనుభూతులు – అవీ మనకు ముఖ్యం. అందుకే మన కావ్యాలలో పురాణాలలో, అవే పాత్రలు అవే కథలు రకరకాలుగా వినిపిస్తాయి. కథ మొదట్లోనే దాని ముగింపు తెలిసిపోతుంది! ఈ కావ్యం కూడా సరిగ్గా అలాగే మొదలవుతుంది.
అంచేత మన్మథుని దండయాత్రకు అనువైన సమయం సాయంత్రమే. ఇక్కడ జైత్రయాత్ర ఎవరిపైన అంటే, పాంథనిచయంబులపైన. అంటే ప్రయాణంలో ఉన్నవాళ్ళపైన. తమ ప్రియతములకు దూరమై విరహంతో వేగుతూ ఉండే వాళ్ళపైనన్న మాట! రాజు ఎక్కడికైనా బయలుదేరాడనగానే పెద్ద సన్నాహమే కదా. అతని ఠీవికి తగ్గట్టుగా ముందు కొంతమంది రాజోచిత లాంఛనాలను పట్టుకొని నడుస్తారు. అలాంటి రాజచిహ్నాలలో సూర్యచంద్రుల బొమ్మలున్న పలకలు అమర్చిన పొడుగాటి కర్రలను సూర్యపాను చంద్రపాను అంటారు. కాని, ఇక్కడ యాత్రకి సన్నద్ధమయినది మామూలు రాజు కాదు కదా!
ఆగమెమ్నాన్ గ్రీకు పురాణాలలో ప్రముఖుడైన రాజు. ట్రోజన్ యుద్ధంలో గ్రీకు సైన్యాలని ఒకటి చేసిన వీరుడు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, హోమర్ చెప్పడం వల్లనే ఆతని పేరు ఇంత కాలం నిలిచున్నదని, ఆగమెమ్నాన్ ముందు ఎంతమంది వీరులు కావ్యానికి ఎక్కకపోవడం వలన కాలగర్భంలో కలిసిపోయారో! అని అంటున్నాడు హోరెస్. హోమర్ని సేక్రెడ్ బార్డ్గా పేర్కొన్నాడు హోరెస్. సరిగ్గా మన పద్యంలో ఉన్న వాల్మీకి కూడా అదే కదా!