శా. అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకూరముల్ లోచనా
పాంగ ప్రాంతమునం దిగుర్ప నొక సయ్యాటంబు గల్పించి నా
యంగుళ్యాభరణంబు బుచ్చుకొనవా! ఆ యుంగరంబిప్పుడే
సింగారింపని చేత బావకునకున్ జేయన్ హవిర్దానమున్
కవి ఒక కావ్యాన్ని నిర్మించేటప్పుడు, కథా గమనంలో ఎన్నో పద్యాలు రచిస్తూ ఉంటాడు. ఆ అన్నిట్లోనూ, కొన్ని కొన్ని పద్యాలు మాత్రం కవి వ్యక్తిత్వాన్నీ, ఆ కవి కవిత్వంలోని ఒక జీవ లక్షణాన్నీ మనకు పట్టిస్తాయి. అలాంటి పద్యాలలో ఒకటి యీ పద్యం. ఇది శ్రీనాథుడు మాత్రమే వ్రాయగల పద్యం. ప్రౌఢ నిర్భరమైన వయస్సు దాటి, ఇంకా ముసలితనం బాగా పైబడక ముందు, అతడు రచించిన కావ్యం కాశీఖండం. అందులో గుణనిధి కథ చాలామందికి తెలిసే ఉంటుంది. గుణనిధి అంటే, కుబేరుని పూర్వజన్మ. సర్వభ్రష్టుడైన గుణనిధి, శివుని దయ వల్ల దిక్పాలకుడై, శివుని సఖునిగా కూడా ఎదిగే కథ! ఆ కథలో పద్యమిది. ప్రతినాయకుడు ఎంత దుర్మార్గుడూ బలవంతుడూ అయితే, నాయకుని గొప్పదనం, వీరత్వం అంతగా పండుతుంది. అలాగే, ఎంత పాపాత్మునికి పుణ్యం ప్రసాదిస్తే ఆ దేవునికి అంతటి మహత్తు ఉన్నట్టు! పాండురంగ మాహాత్మ్యంలో ఇలాంటి వాడే మరొకడు కనిపిస్తాడు, నిగమశర్మ అని. ఇద్దరివీ నేతిబీరకాయ పేర్లే!
అనగనగా కాంపిల్యమనే పురం. అందులో యజ్ఞదత్తుడనే పరమ నైష్ఠిక బ్రాహ్మణుడు. అతని కొడుకు గుణనిధి. ఎంతో కాలానికి గొడ్డువీగి పుట్టిన బిడ్డడు. అంచేత తల్లికి ఆ కొడుకంటే విపరీతమైన ప్రేమ. తండ్రి తన యజ్ఞ యాగాది కార్యకలాపాలలో మునిగి కొడుకుపై శ్రద్ధ చూపించడు. బాధ్యతంతా భార్యకే వదిలివేస్తాడు. దీనితో ఆ గుణనిధి కాస్తా చదువు సంధ్యలూ, ఆచారవ్యవహారాలూ పూర్తిగా మానేసి, జూదగాళ్ళతోనూ విటులతోనూ చెడు తిరుగుళ్ళు పడతాడు. కొడుకు వ్యవహారం తల్లికి తెలిసినా ఆమె యేమీ అనదు. కనీసం భర్తకు చెప్పదు. పైగా కొడుకు గురించి యజ్ఞదత్తుడు ఎప్పుడడిగినా, అబద్ధాలు చెప్పి వాడి తప్పులన్నీ దాచిపెడుతుంది. సరే, ఒక రోజు అసలు సంగతి బయటపడనే పడుతుంది.
ఆ రోజు యజ్ఞదత్తుడు బజారులో పోతూ ఉంటే ఒక జూదగాడి చేతికి, నవరత్నాలు పొదిగిన తన ఉంగరం కనిపిస్తుంది. అది తనకి రాజుగారు బహూకరించిన ఉంగరం. ఎప్పుడో భార్యకి యిస్తాడు దాన్ని. అది ఒక జూదగాడి చేతికి కనిపించేసరికి ఆశ్చర్యపోయి, వాణ్ణి ఆపి, ఆ ఉంగరం ఎక్కణ్ణుంచి వచ్చిందని నిలదీస్తాడు. అతను జంకూ గొంకూ లేకుండా విషయమంతా చెపుతాడు; గుణనిధి జూదంలో ఓడిపోయిన పణానికి గానూ ఆ ఉంగరం ఇచ్చాడని. పైగా, “యాగదీక్షితులలో నువ్వెంత ఘనుడివో, అక్షధూర్తులలో (అంటే జూదగాళ్ళలో) నీ అనుగు కుమారుడు అంత ఘనుడు!” అని ఎగతాళి కూడా చేస్తాడు. దానితో దీక్షితుల వారికి పట్టరాని కోపం వస్తుంది. తల్లీ కొడుకూ ఏకమై అంత కాలం తనని మోసం చేసారని కుతకుతలాడిపోతాడు. ఇంటికి వచ్చి, తల్లీకొడుకుల బండారం బయటపెట్టడానికి ఉంగరం గురించి అడిగే పద్యమిది.
అయితే, అప్పుడు కూడా సోమిదేవమ్మగారు బొంకి, మాటమార్చే ప్రయత్నం చేస్తారు. దానితో ఆగ్రహోదగ్రుడైన యజ్ఞదత్తుడు, తల్లీ కొడుకులను ఇంటినుండి గెంటి, వేరే వివాహం చేసుకుంటాడు. పాపం, ఆ సోమిదేవమ్మగారి గతి ఏమయిందో తెలియదు కాని, మన కథానాయకుడైన గుణనిధి మాత్రం, చదువు రాక, ఏ పనీ తెలియక, తిండీతిప్పలు లేక, ఊళ్ళు పట్టిపోతాడు. ఒక శివరాత్రినాడు ఒక ఊళ్ళో ఉదయం నుంచీ తిండి లేక రాత్రి ఒక శివాలయానికి చేరతాడు. దేవుడి ముందు పెట్టిన ప్రసాదాన్ని చూసి ఆశపడతాడు. అక్కడి భక్తులతో పాటు తాను భజన చేసి, జాగారం ఉండి, తెల్లవారుతుందనగా, అందరూ నిద్రలోకి జోగుతున్న సమయంలో, ప్రసాదాలను దొంగిలించడానికి గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ చీకటిగా ఉండడంతో, తన ఉత్తరీయాన్ని చింపి దీపం వెలిగిస్తాడు. ప్రసాదాలను తీసుకొని, తినడానికి బయటకి వస్తూ ఉంటే ఎవరో భక్తుడి కాలికి తగులుకోవడంతో అతను లేచి, దొంగ దొంగ అని అరుస్తాడు. అప్పుడు అందరూ అతడిని తరుముతారు. కాపలా ఉన్న రక్షకభటులు, పారిపోతున్న గుణనిధిపై బాణాలు వెయ్యడంతో, ఆ శివాలయ ప్రాంగణంలోనే అతడు మరణిస్తాడు.
అలా చనిపోయిన గుణనిధిని తీసుకువెళ్ళడానికి ఒకవైపు నుండి యమదూతలూ మరో వైపు నుండి శివగణాలు వస్తారు. శివగణాలను చూసిన యమభటులు ఆశ్చర్యపడి, ఇటువంటి గుణహీనుణ్ణి, భ్రష్టుడిని శివలోకం ఎలా తీసుకువెళతారని వినయంగా ప్రశ్నిస్తారు. అప్పుడా శివగణాలు శివభక్తి తత్త్వంలోని సూక్ష్మాలను తెలియజెప్పి, గుణనిధి తెలిసో తెలియకో శివరాత్రి నాడు పగలూ రాత్రీ ఉపవాసముండి, జాగరణ చేసి, శివుని ముందు దీపం వెలిగించి, శివాలయ ప్రాంగణంలో మరణించడం వల్ల అతనికి పుణ్యం లభించిందని చెపుతారు. గుణనిధి శివలోకంలో కొన్నాళ్ళుండి మళ్ళీ కళింగదేశానికి రాజుగా పుడతాడు. అప్పుడతను పరమశివభక్తుడై, అనేక శివలింగాలను దేశమంతటా ప్రతిష్ఠ చేస్తాడు. కాశీనగరంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. శివుని గూర్చి తపస్సు చేసి, కుబేరుడై, శివుని సాన్నిహిత్యాన్ని కూడా పొందుతాడు. ఇదీ క్లుప్తంగా గుణనిధి కథ!
మళ్ళీ మన ప్రస్తుత పద్యంలోకి వస్తే – ఈ పద్యంలోని సొగసూ శ్రీనాథుని కవిత్వంలో ప్రత్యేకతా తెలియాలంటే, మూలంలో యీ సన్నివేశం ఎలా ఉందో చూడాలి. కాశీఖండం స్కంధ పురాణంలో ఒక భాగం. మూలంలో యజ్ఞదత్తుడు రుసరుసలాడుతూ ఇంటికి వస్తూనే, “దీక్షితాయని కుత్రాస్తి ధూర్తే గుణనిధి స్సుతః” అంటాడు. మొదలుపెట్టడంతోనే “ఓ ధూర్తురాలా!” అని తిడతాడు.
“అథ తిష్ఠతు కిం తేన క్వ సా మమ శుభోర్మికా
అంగోద్వర్తన కాలే యా త్వయా మేంగులీ హృతా
సా త్వం రత్నమయీం శీఘ్రం తామానీయ ప్రయచ్ఛమే”
అని అంటాడు. “ఎక్కడ నీ కొడుకు? అయినా వాడి సంగతి ఎందుకులే. శుభకరమైన నా ఉంగరం ఎక్కడ? అంగోద్వర్తన వేళ నువ్వు తీసుకున్న ఆ రత్నపుటుంగరాన్ని వెంటనే తెచ్చి నాకివ్వు” అని గద్దిస్తాడన్న మాట. సంస్కృతంలో యజ్ఞదత్తుడు, భార్య తననుండి ఉంగరం కాజేసిన సందర్భం మాత్రం చెప్పి ఊరుకున్నాడు, “అంగోద్వర్తన కాలే” అని. అంగోద్వర్తనం అంటే ఒంటికి నలుగుపెట్టడం. కానీ మన శ్రీనాథునికి అంతటితో ఆపేస్తే తృప్తి ఎక్కడిది! ఆ సరసమైన సన్నివేశాన్ని తాను ఊహించి, పాఠకులకి చూపిస్తే కాని అతనికి మనసొప్పదు! ఇదే సన్నివేశంలో శ్రీనాథుని యజ్ఞదత్తుడు, తనకున్న ఆవేశాన్నంతటినీ వెంటనే వెళ్ళగక్కడు. భార్యతో వ్యంగ్యంగా మొదలుపెడతాడు. ఇంటికి వచ్చి, “సోమిదమ్మ! ఏమి చేయుచున్నావు? ఇటు రమ్మ! నీ కొడుకెక్కడం బోయె? బోవగా కేమి? విను మిట్లనియె”, అని పై పద్యం చెపుతాడు. ఎక్కడా తిట్టుపదం లేదు. కానీ పలికే తీరులో ఒలికే వ్యంగ్యమంతా సహృదయులైన పాఠకులు ఊహించుకోవలసిందే! “దరహాసాంకూరముల్ లోచనాపాంగ ప్రాంతమునం దిగుర్ప, ఒక సయ్యాటంబు గల్పించి, నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా!” అని అనిపించాడు. ఇదీ యీ పద్యంలోని ఆయువుపట్టు! దరహాస అంకూరముల్ – చిరునవ్వుల చిగురులు. లోచన అపాంగ ప్రాంతము – కంటి తుదలు, ఇగురుచు – చిగురించు.
ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఊహించండి. సోమయాజులుగారి ఒంటికి సోమిదేవమ్మగారు నలుగు పెడుతున్నారు. అలా పెడుతూ పెడుతూ, చిరునవ్వు మొలకలు తన కడకంట చిగురింపజేస్తూ, అతన్ని మురిపిస్తూ, ఒక సయ్యాట కల్పించి, అలా అలా, ఆ చేతినున్న ఉంగరాన్ని లాఘవంగా లాగేశారు సోమిదమ్మగారు! ఎంత సొగసైన సన్నివేశమో! ఇలాంటి సన్నివేశ చిత్రణ అంటే శ్రీనాథునికి ప్రాణం. పురాణాన్ని కవిత్వంగా మలిచే విద్య యిది. “సయ్యాటంబు” అన్న పదంలో “య్యా” అక్షరం యతిస్థానంలో ఉంది. సంస్కృతంలో లాగా తెలుగులో యతి విరామం కాదు. అంటే, యతిస్థానంలో కొత్త పదం మొదలవ్వాలని లేదు. కాని పద్యం చదివేటప్పుడు యతి అక్షరం మీద కొంచెం ఊనిక యివ్వడం ఆనవాయితీ. “సయ్యాటంబు” అన్న పదాన్ని అలా, కాస్త సాగదీసి పలికినప్పుడు, ఆ గొంతులో మరింత వెటకారం ధ్వనిస్తుంది. సంస్కృత దీక్షితులవారు ఉంగరాన్ని ఎందుకు అడుగుతున్నారో చెప్పలేదు. అంటే అప్పటికే అతనికి ఉంగరం సంగతి తెలిసిపోయిందన్న విషయం సోమిదమ్మగారికి తెలిసిపోతుంది. మన తెలుగు దీక్షితులవారు మరి కాస్త గడసరి. ఆ విషయం వెంటనే తన భార్యకు తెలియకుండా ఉండాలని, తాను ఉంగరాన్ని ఎందుకు అడుగుతున్నారో కారణం చెపుతున్నారు. ఆ ఉంగరం తొడగని చేతితో అగ్నిహోత్రం చెయ్యరట. పద్యమంతా సమాసాలతో ధారగా సాగి, చివరికి వచ్చేటప్పటికి, “పావకునకున్ చేయన్ హవిర్దానమున్” అని, ముక్కా ముక్కా తెగిపోతోంది. అతను పుల్ల విరిచినట్టు, ఖరాఖండీగా మాట్లాడడం ఇందులో ధ్వనిస్తుంది. ఈ ‘ధ్వనించ’డాలన్నీ పద్యాన్ని ‘సరిగ్గా’ చదవగలిగే వాళ్ళు చదివినప్పుడు మాత్రమే బోధపడే విషయాలు. మాటల్లో వ్రాసి చెప్పడం కష్టం!
కడకంటి చూపుల్లో చిరునవ్వులు చిగురించడం అనేది శ్రీనాథునికి బాగా యిష్టమైన ఒక సున్నిత శృంగారలీల. ఇది శృంగారనైషధంలో కూడా కనిపిస్తుంది. శ్రీనాథుని పద్యాలలో, ఆ మాటకొస్తే మొత్తం పద్యసాహిత్యం అంతటిలోనూ, నాకు బాగా యిష్టమైన పద్యాలలో ఒకటైన పద్యం అది. పనిలో పని, ఆ పద్యాన్ని కూడా ఇప్పుడిక్కడ మీతో పంచుకోక పోతే నాకు మనసాగదు!
మంకెనపూవు మీది యళి మాడ్కి నృపాధరపల్లవోదరా
లంకృతయైన దంతపదలాంఛనముం గని కన్నుగోనలం
దంకురితంబులైన దరహాసలవంబులు పద్మనేత్ర యి
ఱ్ఱింకులు సేసె బక్ష్మముల యీఱమి గాటుక చిమ్మచీకటిన్
(దీని అర్థం మరో చోట యిప్పటికే వివరించి ఉన్నాను కాబట్టి మళ్ళీ యిక్కడ వివరించను. ఆసక్తి ఉన్నవాళ్ళు గూగులిస్తే దొరుకుతుంది.:))