రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నాకు నచ్చిన పద్యం: పల్లవడోలలో పసిబాలుడు

రచన: భైరవభట్ల కామేశ్వరరావు
మార్చి 2014

ఈ నెల తెలుగువాళ్ళ తొలిపండగ ఉగాది వస్తోంది. వసంతశోభతో కొత్త సంవత్సరం అరుదెంచే సమయం.

పేరంటమునకేగు పిన్నబాలిక వాలుజడ మల్లెమొగ్గ కన్పడినయంత
వంగిన వేపకొమ్మం గావిచిగురీన పజ్జ యీనెకుఁ బూఁత పట్టినంత
ఒక దినాన హఠాత్తుగా జికిలి కూహుకుహువు ప్రొద్దెక్కి దూరపు గోననుండి
సాగి వినవచ్చినంత వసంత మరుగుదెంచెనను మధురోహ స్ఫురించె లోన

అంటారు విశ్వనాథ. పిన్నబాలిక వాలుజడలో మల్లెమొగ్గ, వేపకొమ్మకు పట్టిన కొత్తపూత, గాలిలో సాగివచ్చే కోకిల కుహుకుహు గానం – ఇవేవీ నాకంతగా అనుభవంలో ఉన్న విషయాలు కావు. ఇలా కావ్యాలలో చదవడం తప్ప, వసంత ఋతువంటే ఎలా ఉంటుందో నాకు తెలీదు. వసంతం అనే ఏముంది, ఏ ఋతువైనా అంతే! ఇతర దేశాల సంగతి నాకు తెలియదు కాని, భారతదేశపు నవనాగరికులకు నెలలు మారడమంటే కేలండర్లో పేజీలు తిప్పడమే. ప్రకృతిలో తెలిసే మార్పులు మహా అయితే మూడు – ఎండ, వాన, చలి. అందుకే కావ్యాలలో ఋతువర్ణనలు, ఏవో తెలియని లోకాలకు తలుపులు తెరుస్తాయి. స్వప్నప్రపంచంలో ఓలలాడిస్తాయి. అలా మనసుని ఉయ్యాలలూపే పద్యంతో కొత్తయేటికి స్వాగతం పలుకుదాం:

మ. అలరుంగైదువుజోదు కూర్మిసయిదోడై మాధవశ్రీతపః
       ఫలమై యాడు మరుత్కుమారు బ్రియమొప్పం దేనె నీరార్చి లే
       దెలిపూజొంపపు బొత్తులన్ బొదిగి ధాత్రీజాతముల్ జోల వా
       డె లసత్పల్లవడోల నుంచి కలకంఠీనాదగీతంబులన్

ఇది రామరాజభూషణుడు రచించిన వసుచరిత్రలోని ఒక అందమైన పద్యం. కొన్ని కావ్యాలను కథ కోసమో, ఉత్కంఠగా సాగే కథనం కోసమో, సంక్లిష్ట పాత్రచిత్రణ కోసమో, మనసుని పట్టి కుదిపే రసభావాల కోసమో చదవకూడదు. వాటిలోని భాషాసౌందర్యాన్ని, వర్ణనావైభవాన్ని, కల్పనాచాతుర్యాన్ని ఆస్వాదించడం కోసం మాత్రమే చదవాలి. అలాంటి కావ్యాలలో ప్రథమస్థానంలో నిలిచేది వసుచరిత్ర. గిరికా వసురాజుల పరిచయం, ప్రణయం, పరిణయం అనే మూడే మూడు అంశాలతో ఆరు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించి, అందులో తన సంగీత సాహిత్య పరిజ్ఞానమంతటినీ నిబంధించాడు భట్టుమూర్తి. ప్రబంధోచితమైన వర్ణనలను శ్లేషబంధుర సుందరంగా అందించాడు. అందులో భాగమే వసంతకాల వర్ణన. వసుచరిత్రలో వసంతవర్ణన అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది ఆపాతమధురమైన ‘లలనా జనాపాంగ వలనావసదనంగ’ అనే పద్యం. అలాగే మరొకటి, సంగీతజ్ఞులకు ఆలోచనామృతమైన అరిగా పంచమ మేవగించి’ అనే పద్యం. నాకు మాత్రం ఆ రెంటికన్నా కూడా పై పద్యమే యిష్టం. వసంతమనగానే మనకు కావ్యాలలో కనిపించే సామగ్రి – మన్మథుడు, చిగురాకులు, మల్లెపూలు, పిల్లగాలులు, కోకిల కలకూజితాలూ మొదలైనవి. ఈ పద్యంలో కూడా అవే కనిపిస్తాయి. అయితే, మరెక్కడా కనిపించని ఒక సుకుమార పదచిత్రంలో ఒదిగిపోయి కొత్తగా కనిపిస్తాయి. అదీ దీని ప్రత్యేకత. పాండిత్యప్రభతో మిరిమిట్లు గొలిపే యీ కవిలో దాగిన సున్నితహృదయం ఈ పద్యంలో దర్శనమిచ్చింది నాకు.

అలరు కైదువు జోదు – పూలు ఆయుధంగా కలిగిన యోధుడు, అంటే మన్మథుడు. కూర్మిసయిదోడు – చెలిమికాడు. మాధవశ్రీ తపః ఫలము – వసంతలక్ష్మి నోములపంట.

హేమంతశిశిరాలలో వణికించిన చలిగాడ్పు వసంతం రాగానే హాయిగా సుతిమెత్తగా తాకేసరికి మనసులు జల్లుమనక మానవు. అందుకే మధుమాస మలయమారుతం మన్మథునికి సయిదోడు. సయిదోడు అంటే స్నేహితుడనే కాక తోడబుట్టినవాడు అనే అర్థం కూడా ఉంది. ఇద్దరూ కనిపించకుండా మెల్లమెల్లగా అల్లరి చేసేవారే కదా మరి! అతనిలానే ఇతను కూడా ‘అతనుడే’. ఇద్దరూ మధుమాసంలోనే చెట్టాపట్టాలు వేసుకు తమ విహారాన్ని సాగిస్తారు. అందుకే ఈ మరుత్కుమారుడు (అంటే చిరుగాలి అనే పిల్లవాడు) వసంతలక్ష్మి నోములపంట అంటున్నాడీ కవి. మాధవశ్రీ తపఃఫలమై – దీన్ని మరొకలా కూడా అర్థం చేసుకోవచ్చు. మాధవుడు అంటే విష్ణుమూర్తి. శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీనారాయణుల నోములపంట – మన్మథుడు. అందుకే మన్మథునికీ మధుమాస సమీరానికీ అంతటి దోస్తీ!

ఆ పిల్లవాడేమో అల్లరివాడు, ఎప్పుడూ ఇటూ అటూ ఆడుతూనే ఉంటాడు. కానీ వసంతానికి అతడు ముద్దులబాలుడు. అందుకే వాడిని మురిపెంగా జోలపాడి బజ్జో పెట్టాలన్న తాపత్రయం. ఆ సన్నివేశాన్ని చాలా అందంగా మన ముందుంచాడు భట్టుమూర్తి. వసంతశోభ అంతా పచ్చదనంతో మిసమిసలాడే చెట్లలోనే కనిపిస్తుంది. అందుకే వాటి రూపంలోనే తన బాబుకి అన్ని సపర్యలూ చేస్తోంది వసంతం. ఏమిటా సపర్యలు అంటే:

ప్రియము ఒప్పన్ – ఎంతో ప్రేమగా. తేనె నీరార్చి – పూదేనెతో స్నానమాడించి. లే తెలి పూ జొంపపు పొత్తులన్ పొదిగి – లేత తెలతెల్లని పూపొదల పొత్తిళ్ళతో కప్పి. ధాత్రీజాతముల్ – భూమినుండి పుట్టినవి, చెట్లు. లసత్ పల్లవ డోలన్ ఉంచి – సొంపైన చిగురాకుల ఊయలలో పడుకోబెట్టి. కలకంఠీనాద గీతమ్ములన్ – కోయిలలు పాడే పాటలతో. జోల పాడె – జోల పాడాయి.

చిరుగాలి అనే ఆ చిన్నవాడిని చెట్లు పూలతేనెలతో జలకమాడించాయి. తెల్లని మల్లెపూపొదలు అనే పొత్తిళ్ళతో కప్పి, సొంపైన చిగురాకుల ఊయలలో పడుకోబెట్టి ఊపుతున్నాయి. కోకిలగానాలతో జోలలు పాడుతున్నాయి.

అదీ కవి గీసిన దృశ్యం! కవిత్వంలో ప్రధానాంశాలు రెండు. ఒకటి దర్శనం, మరొకటి వర్ణనం. అందరికీ కనిపించని దానిని భావనానేత్రంతో చూడగలడటం దర్శనశక్తి. ఈ పద్యంలో ప్రస్ఫుటంగా ద్యోతకమయ్యేది అదే. కనిపించని గాలిని ఒక పసిబాలుని రూపంలో దర్శించాడు కవి. మలయానిలానికి మూర్తిమత్వాన్ని కల్పించిన కవులు చాలామందే ఉన్నారు. మన్మథుని పేర అచ్చువేసి వదిలిన ఆంబోతులా విహరిస్తోంది కోడెగాడ్పు అని వర్ణిస్తాడు కవికర్ణరసాయన కర్త. తెలతెలవారుతూ ఉంటే వచ్చి, సెజ్జలపై పడి ఉన్న వాడినపూలని చిమ్మిపోయే పరిచారిక ఆకృతిలో ప్రభాతవాయువులని దర్శించాడు రామకృష్ణకవి. శేషేంద్ర తన ఋతుఘోషలో, ‘శిశిర వ్రతాచార జీర్ణ మారుతమూర్తి అలరుగిన్నెల గందమలదుకొనియె’ అని వసంతంలో గాలి గ్రంథసాంగునిగా మారిన వైనాన్ని చిత్రించారు. ఇలా ప్రాచీనాధునిక కవిత్వంలో అనేక రకాల వర్ణనలు కనిపిస్తాయి. అయితే యివన్నీ చాలా వరకూ శృంగారభావనా సంబంధమైనవే. గాలిని పసిబాలుని రూపంలో దర్శించి అతన్ని చెట్లు మాతృప్రేమతో సాకినట్లు చిత్రించిన వర్ణన మరింకెక్కడా నాకు కనిపించలేదు. గాలికి ఊగే చిగురాకులను, ఆ గాలినే ఊపే ఊయలలుగా ఊహించడం భలే ముచ్చటైన భావన కదూ!

    
   

11అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    చంద్ర మోహన్ March 4, 2014 9:26 am

    హృద్యంగా ఉంది!

    ఇది చదువుతుంటే ఒక తమిళ సినీ గీతం గుర్తొచ్చింది. “నదియిల్ విళైయాడి, కొడియిన్ తలై శీవి నడంద ఇళన్ తెండ్రలే” అని ఓ తల్లి తన బిడ్డను వర్ణిస్తూ పాడుతుంది. “నదిలో జలకాలాడి, పూలతీగల తలలుదువ్వి నడచిన పిల్లతెమ్మెరవే” అని.

  2. 2
    lyla yerneni March 13, 2014 1:09 pm

    I am sorry! But, the poem is misinterpreted.

    మరుత్కుమారుని పసిబాలుడిగా ఊహించారేమి? సువర్ణ శ్రీ కుమారుడు, అభిమన్య కుమారుడు, లక్ష్మణ కుమారుడు – అన్నప్పుడు, వారు బుజ్జి పాపాయిలు కారు.

    They are youth. So is the wind in this poem.
    It is a springtime romantic poem. A beautiful poem indeed.

    Lyla.

  3. 3
    కామేశ్వరరావు March 14, 2014 2:18 pm

    అయ్యో ఈమాత్రం దానికి sorry ఎందుకండీ! చరిత్రలకే alternatives ఉన్నప్పుడు పద్యాలకు alternative interpretations ఉండడంలో ఆశ్చర్యమేవుంది! మనది కాని interpretation ఎప్పుడైనా ఎలానూ misinterpretation అయ్యే తీరుతుంది. ఎవరి interpretationకి వాళ్ళవాళ్ళ reasoning ఉండనే ఉంటుంది. ఉదాహరణకు నా interpretation వెనక నాకున్న reasoning ఇది – “పొత్తి” “పొత్తిలి” అనేది చిన్నపిల్లలకు వేసే గుడ్డ. అందుకే పసిపాపలను “పొత్తిళ్ళలో బిడ్డ” అని కూడా అంటారు.

    ఎవరి మనోభావాలూ దెబ్బతిననంత వరకూ ఇందులో ఇబ్బందేమీ లేదు! 🙂

  4. 4
    lyla yerneni March 15, 2014 1:09 pm

    అయ్యో ఈమాత్రం దానికి sorry ఎందుకండీ!

    My English sentence is misinterpreted.:-)

    I have not said sorry to you. Why would ‘I’ say sorry to ‘you,’ when it is you have misinterpreted Bhattumurthi’s poem. Generally people say sorry for their own mistakes.:-)

    Your generic philosophy aside, the specific poem is misinterpreted.

    I don’t buy the పొత్తుల reason you gave, Kamesh! Too flimsy.

    There is inherent difficulty in interpreting poets who want to exhibit the art of శ్లేష in their poetry. They tend to make themselves ambiguous.

    Also;
    Some poets are in the habit of writing poems any time any place, and inserting them later on in different texts to suit their multi purposes. Their credibility value is questionable.:-)

    Look at the poetry in కుంతీకుమారి. ఇందులో పాపయ్య శాస్త్రి ,వేర్వేరు చోట్ల — మరులు రేకెత్త, కాంక్ష లల్లాడ, ఆకులోనుండి ముద్దు మూతిపై,లాటి phrases వాడారు. ఐనా ప్రతి పద్యము లోను, తల్లి, ఒక పసి పిల్లవాడు స్పష్టము. భావములు స్పష్టములు. There is never any ambiguity created by the words.

    For me such a poetry is best poetry.

    కామేశ్వరరావు గారూ! your interpretation of పొత్తులు in this poem is wrong.

    So is your understanding of Word కలకంఠి. I am sorry! ఈ పద్యంలో కోయిలలు లేవు.

    లైలా

  5. 5
    ఆర్.దమయంతి. March 18, 2014 12:21 pm

    చంద్ర మోహన్ గారు,
    మీరు చెప్పిన పాట సాహిత్యం అద్భుతం గా అనిపించింది.
    కవి ఇంకాఏం రాసాడా అని తెలుసుకోవాలని వుంది.
    దయ చేసి ఆ పాట ని పూర్తిగా తెలుగులో కి అనువదిస్తూ.. ఆ పాట లింక్ ని ఈమాట పాఠకుల కోసం ఇక్కడ అందచేయగలరా ప్లీజ్?
    నమస్సులతో ..

  6. 6
    చంద్ర మోహన్ March 22, 2014 4:03 am

    లైలా గారి ’ఇంటర్ ప్రెటేషన్’ఉచితంగా లేదు. తపఃఫలమై ’ఆడు’ కుమారుని స్నానం చేయించి పొత్తులు తొడిగి, ఊయలలో ఉంచి ’జోల’ కూడా పాడిన తరువాత కూడా మరుత్కుమారుని పసివాడుగా కాక యువకునిగా ఊహించుకోవడం నాకు సాధ్యం కావడం లేదు.

    తెలుగు సాహిత్యంలో ఎక్కడ ఒక యువకుడు ఆడుకొంటూ ఉంటే పిల్చి స్నానం చేయించి పడుకోబెట్టి జోలపాడారో నాకు తెలియదు.

  7. 7
    చంద్ర మోహన్ March 22, 2014 5:11 am

    “ఈ పద్యంలో కోయిలలు లేవు” అని లైలాగారు ఎలా తేల్చేశారో కూడా నాకు అంతుబట్టలేదు. కలకంఠీనాదగీతాలతో జోలపాడింది మరెవరు? ధాత్రీజాతములే స్వయంగా పాడాయని అనుకోవాలా!

  8. 8
    చంద్ర మోహన్ March 22, 2014 6:05 am

    దమయంతి గారు:

    పాట యొక్క పల్లవి అనువాదం ఇస్తున్నాను (మిగిలిన చరణాలు అంత గొప్పగా ఏమీ లేవు):

    “మలర్దుం మలరాద పాది మలర్ పోల మలరుం విழிవణ్ణమే
    వందు విడిందుం విడియాద కాలైప్పొழுదాగ విడింద కలైయన్నమే

    నదియిల్ విళైయాడి కొడియిల్ తలైశీవి నడంద ఇళం తెండ్రలే
    వళర్ పొదిగై మలై తోండ్రి మదురై నగర్ కండు పొలింద తమిழ் మండ్రమే”

    విరిసీ విరియని అరవిచ్చిన పువ్వులాంటి కన్నులున్నవాడా/దానా
    పొడిచీ పొడవని తొలిపొద్దులా వచ్చిన కలహంసవే
    నదిలో జలకాలాడి, పూదీవెల తలలుదువ్వి నడచిన పిల్లతెమ్మెరవే
    పొదిగై పర్వతంపై ఉదయించి, మదురై నగరంలో వికసించిన తమిళ పండితసభవే

    ఒక తల్లి తన బిడ్డను లాలిస్తూ పాడిన పాట. కణ్ణదాసన్ మధురమైన కలంనుండి జాలువారిన పాట. నదిలో జలకాల వలన చల్లదనం, తీగలతో తలదువ్వుకోవడం వలన పూల పరిమళం సంతరించుకొన్న పిల్ల తెమ్మెర అని కవి భావన!

    తన బిడ్డను తమిళ అకాడమీ అని పిలవడంలో గల భాషాప్రియత్వంకూడా నాకు చాలా ఇష్టం. తన శిశువును ప్రేమించినంతగా తన భాషను ప్రేమిస్తే ఏ భాష వృద్ధి చెందదు!

    ఆ పాట లంకె ఇక్కడ: http://goo.gl/9LFSRw

  9. 9
    lyla yerneni March 22, 2014 10:49 am

    “ధాత్రీజాతములే స్వయంగా పాడాయని అనుకోవాలా!”

    అవునండీ చంద్రమోహన్! The songs are their rustling sounds.

    Have a nice spring day!

    Lyla

  10. 10
    మోహన April 3, 2016 3:11 pm

    కలకంఠీ అంటే N. of sev. birds. అని ఆంధ్రభారతి సంస్కృత నిఘంటువులో ఉన్నది. కలకంఠీనాదగీతంబులన్ అనగా ఎన్నో విధములైన పక్షులు చేసే నాదముల గీతములు అని అర్థము చేసికొనవచ్చును.

    అలరుంగైదువుజోదు కూర్మిసయిదోడై మాధవశ్రీతపః
    ఫలమై యాడు మరుత్కుమారు బ్రియమొప్పం దేనె నీరార్చి లే
    దెలిపూజొంపపు బొత్తులన్ బొదిగి ధాత్రీజాతముల్ జోల వా
    డె లసత్పల్లవడోల నుంచి కలకంఠీనాదగీతంబులన్

    ధాత్రీజాతములు ప్రియ మొప్పన్ (ప్రియముతో) అలరుంగైదువుజోదు కూర్మిసయిదోడై మాధవశ్రీతపఃఫలమై యాడు మరుత్కుమారుని తేనె నీరు ఆర్చి (తడియజేసి) లేదెలి పూజొంపంపు బొత్తులన్ (పొత్తులలో) బొదిగి (కప్పి) లసత్పల్లవడోల నుంచి (ఉనిచి, ఉండబెట్టి) కలకంఠీ నాద గీతంబులన్ (పక్షుల పాటలతో) జోల వాడె (లాలిపాటలు పాడాయి).

    ఇందులో మరుత్కుమారుడు అంటే పిల్లగాలి అని నేను అర్థము చేసికొన్నాను. కుమారుడు అనగా కౌమార దశలో ఉండే వాడు లేక తనయుడు అని అర్థము కాదని నా అభిప్రాయము.

    Have a nice spring day!

    విధేయుడు – మోహన

  11. 11
    lyla yerneni April 10, 2016 1:34 pm

    “కలకంఠీ అంటే N. of sev. birds. అని ఆంధ్రభారతి సంస్కృత నిఘంటువులో ఉన్నది.”
    “ఇందులో మరుత్కుమారుడు అంటే పిల్లగాలి అని నేను అర్థము చేసికొన్నాను.” – మోహన

    I guess ‘పిల్లగాలి’లో పిల్ల does not mean girl. I guess, పిల్లగాలి simply means breeze as opposed to a tornado, or typhoon. అలాటి విసురుగాలి ఐతే అక్కడ ఆ వసురాజు తోటలో పూలూ, ఆకులూ, చెట్లు, మహా వృక్షాలు కూడా ఉండవు.

    కలకంఠి అంటే కల నాదములు చేయునది. మధుర స్వనములు చేయునది. అవ్యక్త మధుర స్వరము కలిగినది – ఇలాటి అర్ధములు చెప్పబడినవి. అని. స్త్రీ పరంగా ఎక్కువ వాడినా అందరు ఆడవాళ్ళూ కలకంఠులు కారు. కఠోర కంఠులుంటారు. కవి కలకంఠీ! అని వాడితే ఆ ఆడుది మృదుమధురంగా మాట్లాడుతుందని. అట్టి కలకంఠులను మీరు ఏ తోటలోనూ, వసంత సమయంలో కలిసి యుండలేదా? 

    అలాగే పక్షులన్నీ కలకంఠులు కావు. Singing birds ను సేకరించే వ్యాపారస్తులున్నారు. వారి వద్ద కొనుక్కుని, తమ తోటల్లో పెంచుకునే వారున్నారు. వెదురు గొట్టాలు, వీణలు, గంటలు ఇవి అన్నీ కలకంఠులుగా మారొచ్చు, గాలి తాకులకైనా, సంగీతకారుడు వాడినా.

    ఇక్కడ చర్చిస్తున్న పద్యంలో -అది వసురాజు తోట. అది వసంత వర్ణనం. వసుచరిత్రలోని అక్కడి పద్యాలలో, కవి వసంతుడికీ, గాలికీ ఉండే సంబంధాలు మారుస్తూనే ఉన్నాడు. కలకంఠి ప్రయోగం లోని అర్థాలు కూడా మారుస్తున్నాడు.
    నేనూ ఆంధ్ర భారతి చదువుతున్నాను. ‘చంద్రికా పరిణయము’ ఒక పీఠిక అక్కడ చదువుతున్నాను. అందులో చంద్రికా పరిణయం నుండి కొన్ని పద్యాలు, వసుచరిత్ర లో పద్యాలు కొన్ని, చాలా దగ్గర పోలికలున్నవి ఇచ్చారు. ఎవరు బాగా రాసారు అనేది పాఠకులనే తేల్చుకోమని. ఇచ్చిన పద్యాల వరకే చూసినా, నాకు ‘వసుచరిత్ర’ గెలిచినట్టనిపించింది. ఇక, ఈ మాట గ్రంథాలయంలో – దేశికాచారి గారుంచిన మరో పీఠిక, ‘చంద్రికా పరిణయం’ చదవాలి. అప్పుడు వసుచరిత్ర నాకింకొంచెం అర్థమవుతుంది.

    ఆంధ్ర భారతికి వెళ్లినా, ఈ పద్యం కోసం, మరుత్తులు ఏడుగురు, అందులో ఏడు లోకాల్లో విహరించే మరుత్తుల లో ఏ మరుత్తు ఇక్కడ విహరిస్తున్నాడని ఏ పురాణ కథ లోకో వెళ్లి నేను వెదకలేదు. చర్చలోని ఈ పద్యంలో, కవి పిల్లగాలి, మంద మారుతం అని ఉండొచ్చు. అనలేదు. అని ఉంటే మనం పువ్వులు, ఆకులు, గాలి – అంటూ gender-less, age non-specific interaction చూస్తాము. కాని కవి అలా అనలేదు. The poet attributes masculinity to the wind here. మరుత్కుమారుడు అన్నాడు.

    ఆ పవన కుమారు డొస్తే (హనుమంతుడు కాదు), వసంతుడితో పాటు తోటల్లో ఆడే స్నేహితుడు, పవనుడొస్తే –ఉయ్యాలూపుతున్నారు ఆ స్త్రీలంతా అని, కవి భావన. తేనెలు తాపినా, తేనెల్లో ముంచినా, పువ్వుల్లో పొదిగినా, ఆకుల్లో ఊపినా, ఉయ్యాల పాటలు పాడినా అన్నీ -చెట్లు, మొక్కలు, తీవెలు, పొదల సొంత మర్యాదలే, సయ్యాటలే. రసం శృంగారం. సలిపేవి వసంత సమయపు శృంగార క్రీడలు.

    అడివి బాపిరాజు ‘అడివి శాంతి శ్రీ’ లో వసంత సమయం వేడుకలు ఎంత చక్కగా రచించాడు! అందులో, రాజకుమారుడిని, వసంతుడుగా (సంగీతం పోటీ పరీక్షలో గెలిచినందుకు) అక్కడివారు ఎన్నుకుంటే, అతడు మలయ పవన దేవుడిని, భృంగ దేవుడిని ఎన్నుకుంటాడు. ‘వనరమ’ గా ఒక రాకుమారిని ఎన్నుకుంటాడు.

    జోల అంటే ఉయ్యాల. ఉయ్యాల పాటలన్నీ పసిపిల్లలకూ, వారిని నిద్ర పుచ్చటానికీ కాదు. Individual gardens లోనూ, పూర్వీకుల/ ఇప్పటి వారి ఇళ్ల లోనూ, బల్ల ఉయ్యాలలు adults కోసం ఉండవూ? What about those nice big hammocks in country houses and beach resorts? వసంత సమయంలో ఉయ్యాలలలో కృష్ణుడు, ఇతర వనితలు వర్ణ చిత్రాలెన్నో ఉన్నాయి. రాముడి కోసం బాలుడిగా ఉన్నప్పుడు పాడే జోలపాటలూ, రాజయ్యాక పాడే మేలుకొలుపు, శయనింపు పాటలు ఒకే లాగా ఉండవు కదా.’ జో! అచ్యుతానంద’ చిన్న పిల్లలకు పాడటం తెలుగు వాళ్లకు అలవాటై, అది పరమాత్ముడికి ఒక కవి రాసిన పాట అనే తలపు మరుపున పడి పోయి ఉండొచ్చు.

    ఇంతకు ముందు నేనీ పద్యం గురించి రాసినప్పుడు, పాఠకులు ఒకరిద్దరు జోలపాటలని ఇక్కడా ఏవో సినిమా పాటలు వినిపించినట్టున్నారు. అన్నా చెల్లెళ్ల ఏడుప్పాటలు, పిల్లల జోల పాటలట!

    ఆ సినిమా పాటల్లో సావిత్రులు, న్. టి. రామారావులు -ఇద్దరూ తెలుగులో, తమిళులో, అక్కడొకరూ ఇక్కడొకరూ చెరో చంటి పిల్లని భుజాన్ని వేసుకుని దబిడీ దిబిడీ చిచ్చి కొడుతూ, ‘చందురుని మించి అందమొలికించు చిట్టిపాపాయివే’ అని ఏడుపు పాటలు పాడితే, అవి జోలపాటలవుతాయా? How Sad! ఆ ఏడుపు స్వరం పిల్లలకు ఎంత వేదన కలిగిస్తుంది. ఆ అమ్మా నాన్నల కన్నీళ్లు పిల్లల మీదే కారి పడుతున్నయి. ఆ ఏడుపేదో అవతలికి పోయి ఏడ్చుకుని, ఆ పిల్లలకు ఆనందపు స్వరంతో, పిల్లల పాటలు పాడి, వారితో ఆటలాడే వారిని ఏర్పాటు చెయ్యటం మంచిది అనిపించింది.

    తెలుగు సినిమాల్లో ఒక ఆనంద సమయంలో పాటనే, మరో విషాద సమయంలో టెంపో స్లో చేసి, ఏడుపు గొంతులతో పాడారు. అసహ్యకరమైన పని. పాటలకేదో కరువొచ్చినట్టు. Emotions, events, mess up చెయ్యటం. ఒక్క పాటనీ హాయిగా పాడుకోనివ్వరు. I really didn’t want to get in there. I don’t want to end my note on that kind of note. Leaves a bad taste in my mouth. అందుకని మధురంగా థ్వనించే పద్యాలున్న వసుచరిత్ర లోకే మళ్లీ వెళ్లి, ఇంకొన్ని పేజీలు తిప్పి వసురాజు వచ్చినపుడు ఆ తోట చేసిన మర్యాద ఎంత రమణీయంగా ఉన్నదో, ఇంకోసారి చదువుకుంటాను. ఎన్నో తెలివైన, అందమైన రచవలున్నయ్యి. ప్రపంచంలో ఇంకా చూడని సుందరత ఎంతైనా ఉంది. I am so eager to go get it.

    A beautiful year to all!

    Lyla

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నాకు నచ్చిన పద్యం: నన్నయ్య తీర్చిన గడసరి సొగసరి
  • గడి నుడి – 17
  • గడి నుడి – 11
  • నాకు నచ్చిన పద్యం: చూపులు కలిసిన శుభవేళ
  • శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన

ఇటువంటివే…

  1. నాకు నచ్చిన పద్యం: వసంత కుసుమ వికాసం
  2. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ!
  3. నాకు నచ్చిన పద్యం: ఆముక్తమాల్యదలో ఒక ఉదయం
  4. నాకు నచ్చిన పద్యం: తొలికోడి కూత
  5. నాకు నచ్చిన పద్యం: అలముకొన్న అదృశ్యాంజనం

మార్చి 2014 సంచికలో ...

  • Mrs. Bird’s House
  • అనగా అనగా ఒకరాత్రి
  • అనాథ
  • అరుణాచల పతి
  • ఈమాట మార్చ్ 2014 సంచికకు స్వాగతం!
  • ఉగాది పాటలు
  • ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్‌ మీద
  • ఒగి నీ దయార్ద్ర దృక్కదే చాలు
  • కంద పద్యగాథ – 1
  • కోనసీమ కథలు: శిరోముండనం
  • గౌతమి
  • దేవకన్య
  • ధనుర్దాసు
  • నన్నెచోడుని కళావిలాసము: కొన్ని చర్చనీయాంశాలు
  • నాకు నచ్చిన పద్యం: పల్లవడోలలో పసిబాలుడు
  • నీలి తలపాగా
  • బల్లి ఫలితం
  • మాటలు
  • ముగ్గురు సాధువులు
  • శ్రీమాన్ పుట్టపర్తి : శివతాండవ కవితాగానం
  • శ్రీమాన్ పుట్టపర్తి: నా జ్ఞాపకాలు
  • సైగల్…
  • హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా?
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ధనుర్దాసు
నీలి తలపాగా

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.