ఉ. శ్రీయన గౌరినా బరగు చెల్వకు జిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూ
పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్త్వము గొల్చెద నిష్టసిద్ధికిన్
పద్యసమాధి అని ఇస్మాయిల్ కవిత ఒకటుంది. పద్యాన్ని సమాధి చెయ్యడం గురించి కాదండోయ్, అది పద్యాన్ని తవ్వడం గురించిన కవిత. కవి తనని తాను తవ్వుకోడాన్ని గూర్చిన కవిత. కవి తన మనసు లోతుల్లో కప్పబడిన పద్యాన్ని తవ్వి తీసిన ప్రతిసారీ పద్యానికీ తనకీ ఒక క్రొత్త బ్రతుకు వస్తుందంటారా కవితలో. ఇది కవికే కాదు, సహృదయుడైన పాఠకునికి కూడా వర్తిస్తుందని నే ననుకుంటాను. ఆధునిక కవిత్వానికే కాదు, ప్రాచీనకావ్యాలలో కొన్ని పద్యాలకు కూడా ఇది వర్తిస్తుందన్నది నా అనుభవం. ఇది అలాంటి పద్యం! అయితే, ఆ అనుభవం వైయక్తికమూ వ్యక్తిగతమూ కాబట్టి దాన్ని మాటల్లో వ్యాఖ్యానించి చెప్పడం అసాధ్యం. కేవలం తవ్వుకొనే మార్గాన్ని, అందులోని లోతుల్నీ పైనుంచి చూపించడం మాత్రమే చేయగలసిన పని. ఆ లోతులని స్పృశించే ముందు, ఈ పద్యంలో పైపైన కనిపించే విశేషాలు కొన్ని చూద్దాం. ఈ పద్యం ఎక్కడిదో ఎవరిదో చాలామందికి తెలిసే ఉంటుంది. అరణ్యపర్వం మధ్యలో ఆగిపోయిన భారతాన్ని విరాటపర్వంతో తిరిగి మొదలు పెట్టాడు తిక్కన. అలా మొదలు పెడుతూ అతను రచించిన నాందీ పద్యమిది.
మహాభారత ఆశ్వాసాంత గద్యలో తనని తాను ‘శ్రీమదుభయకవిమిత్రు’నిగా పేర్కొన్నాడు తిక్కన. ఉత్తరరామాయణంలో మరింత ఘనంగా ‘నే నుభయకావ్యప్రౌఢి పాటించు శిల్పమునన్ బారగుడన్’ అని చెప్పుకున్నాడు. మార్కండేయపురాణం తెలుగులో రచించిన మారన కూడా ‘ఉభయ కవిత్వతత్త్వ విభవోజ్వ’లునిగా తిక్కనను కీర్తించాడు. ఇంతకీ యీ ‘ఉభయకవి మిత్రుడు’ అనే పదానికి అర్థమేమిటి?
అభినుతుడు మనుమభూవిభు
సభ దెనుగున సంస్కృతమున జతురుండై తా
నుభయకవిమిత్ర నామము
త్రిభువనమున నెగడ మంత్రి తిక్కడు దాల్చెన్
అని కేతన తన దశకుమారచరిత్రలో స్పష్టంగా చెప్పినా కూడా విమర్శకులు దీని గురించి రకరకాల ఊహలు చేశారు! తిక్కన హరిహర తత్త్వాన్ని దృష్టిలో ఉంచుకొని, శైవ వైష్ణవ మతాలకు చెందిన కవులను సమానంగా ఆదరించడం వలన అతను ఉభయకవి మిత్రుడయ్యాడని అన్నవారు కూడా ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే సంపత్కుమారాచార్యగారు, “తిక్కన ఉభయకవిమిత్రుడే కాదు ఉభయతత్త్వ మిత్రుడు కూడా,” అని అన్నారు.
ఈ ఉభయతత్త్వ మిత్రత్వం, పై పద్యంలో చాలా అపూర్వంగా నిర్వహింపబడినట్లుగా నాకు అనిపించింది. సంస్కృతాంధ్ర భాషలకే కాదు, శైవవైష్ణవ మతాలకే కాదు, మరిన్ని ద్వంద్వాలకు కూడా చక్కని సమన్వయం ఇందులో కనిపిస్తుంది. ఈ పద్యంలోని సంస్కృతాంధ్ర భాషల పోహళింపు అందరికీ సుపరిచితమే. అలానే తిక్కన హరిహర తత్త్వమూ సువిదితమే. హరిహరులు ద్వంద్వాలయినప్పుడు, శ్రీగౌరులు కూడా ద్వంద్వాలే. వారిద్దరినీ ఒకే చెలువగా దర్శించాడు తిక్కన. శ్రీగౌరీ స్వరూపం స్త్రీశక్తికి చిహ్నమైతే, హరిహర రూపం పురుషశక్తికి చిహ్నం. ఈ రెండూ కూడా ద్వంద్వాలే కదా! అలాగే అటు వేదాంత తత్త్వమూ, యిటు చిత్తము పల్లవించే కవిత్వమూ, ఇందులో కనిపించే మరి రెండు ద్వంద్వాలు. ఒకవైపు వైదిక మార్గమూ, మరొక వైపు భక్తిమార్గమూ – ఇవి రెండూ కూడా ద్వంద్వాలే. వేదాలలో కర్మానుష్ఠానము, స్తోత్రపాఠాలు, ఉపాసనలే తప్ప, ‘భక్తి’ ఎక్కడా గోచరించదని వేదాలను మాత్రమే పరమప్రమాణంగా భావించేవారు చెప్పే మాట. భక్తి తత్త్వం అనేది అనంతర కాలంలో వచ్చినదని, ముఖ్యంగా పురాణ కాలంలో వ్యాప్తిచెందిందని అంటారు. భక్తి ప్రధానమైన శైవ వైష్ణవ మతాలలో అవైదికమైన సంప్రదాయాలు చాలానే ఉన్నాయి. ఆ దృష్టితో ఆలోచిస్తే – వైదికధ్యాయిత, భక్తి – ఈ రెండూ ద్వంద్వ తత్త్వాలే! ఇన్ని ద్వంద్వాలను ఒకే పద్యంలో గుదిగూర్చడమే కాక వాటి మధ్య చక్కని సంయోజనాన్ని కూడా సాధించాడు తిక్కన.
తిక్కన భారతంలో మొదటిదయిన యీ పద్యాన్ని, నన్నయ్య భారతానికి శ్రీకారం చుట్టిన పద్యంతో పోలిస్తే మరికొన్ని విశేషాలు కనిపిస్తాయి.
శ్రీవాణీగిరిజాశ్చిరాయదధతో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితిమావహంత్యవిహితాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయస్త్రిపురుషాస్సంపూజితావస్సురైః
భూయాసుః పురుషోత్తమాంబుజభవశ్రీకంధరాశ్రేయసే
శ్రీవాణీ గిరిజలను చిరకాలం నుండీ తమ వక్షస్థల, ముఖ, దేహములందు ధరిస్తూ, స్త్రీపురుష సంయోగం వలన పుట్టిన సర్వలోకాలకూ సుస్థిరత్వాన్ని కల్పిస్తున్న వేదత్రయ మూర్తులు, దేవతల చేత పూజింపబడే పురుషత్రయం, పురుషోత్తమ (విష్ణువు), అంబుజభవ (బ్రహ్మ), శ్రీకంధరులు మీకు శ్రేయస్సును గూర్చెదరు గాక! – అని అర్థం. ఇందులో కూడా మనకి శ్రీగిరిజలు, హరిహరులు కనిపిస్తారు. వారితో పాటు, ముగురమ్మలలో మరొక అమ్మ సరస్వతి, త్రిమూర్తులలో మరొక మూర్తి బ్రహ్మ కూడా ఉన్నారిందులో. వారు ముగ్గురూ వేదత్రయ మూర్తులు. నన్నయ్యది కేవల వైదిక దృష్టి. అదే తిక్కన కాలానికి వచ్చేటప్పటికి బ్రహ్మకు ప్రాధాన్యం తగ్గింది. హరిహరులను పరమాత్మగా పూజించే మతాలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ పరిస్థితి తిక్కన పద్యంలో ప్రతిఫలిస్తుంది. తిక్కన పద్యంలో వైదికదృష్టితో పాటు ఒక వైపు భక్తీ, మరో వైపు వేదాంతమూ కూడా గోచరిస్తాయి. ఈ మూడింటికీ సంపూర్ణ సమన్వయం కనిపించేది, నాకు తెలిసినంత వరకూ, అద్వైతంలో మాత్రమే. కాబట్టి యీ పద్యం ద్వారా తిక్కన అద్వైతి అని నిర్ణయించ వచ్చుననుకుంటా (కనీసం ఈ పద్యం వరకూ.) నన్నయ్య తన నాందీ శ్లోకంతో ఒక పురోహితునిలా ఆశీర్వచనమిస్తే, తిక్కన ఒక భక్తునిగా యిష్టసిద్ధికై అంజలి ఘటించాడు. నన్నయ్య పద్యం పూర్తి సంస్కృతంలో ఉండడం, ఆ కాలానికి కావ్యసారస్వత జగత్తులో సంస్కృతానికున్న ప్రాముఖ్యాన్ని చాటిచెపుతూంటే, తిక్కన కాలానికి దైవప్రార్థనలకు మాత్రమే ఆ భాష పరిమితం కావడాన్ని ఈయన పద్యం పట్టి చూపుతోంది.
ఇక పద్యం లోని కవిత్వపు లోతుల వైపు దృష్టి సారిస్తే, తిక్కన కవిత్వంలో ప్రధానంగా కనిపించే గుణం ధ్వని. కవిత్వంలో ధ్వనిని రకరకాల మార్గాల ద్వారా వ్యక్తం చేయవచ్చు. శబ్దం ద్వారా, అలంకారాల ద్వారా, వర్ణనల ద్వారా, కథాకథనం ద్వారా, యిలా అనేక మార్గాలు. ఒకో కవిది ఒకొక్క ప్రత్యేక మార్గం. ధ్వని నిర్వహణలో తిక్కన పలుమార్గాలు త్రొక్కినా, ప్రధానంగా రెండంశాలు ఆయన ప్రత్యేకత. ఒకటి సాభిప్రాయ పద ప్రయోగం. రెండు వాక్య, పద్య నిర్మాణం. తరచి చూసిన కొద్దీ, యీ చిన్న పద్యంలో కూడా అలాంటి శిల్పవిశేషాలు అనల్పంగా దర్శనమిస్తాయి. వాటిని విప్పి చెబితే సారస్యం చెడుతుంది. ముందుగానే చెప్పినట్టు, ఎవరికి వారు పద్యాన్ని తవ్వుకుంటూ వెళ్ళవలసినదే! అందుకు వీలుగా కొన్ని ప్రశ్నలు మాత్రం సంధించి వదిలేస్తాను.
తిక్కన ‘కొలిచినది’ ఎవరిని? పరతత్త్వాన్నా? హరిహర రూపాన్నా? పరతత్త్వాన్ని ‘కొలవడ’మేమిటి? హరిహర రూపాన్నే అయితే, ‘పరతత్త్వము గొల్చెద’ అని ఎందుకన్నాడు? ‘శ్రీయన గౌరినా బరగు చెల్వ’ – ఇక్కడ, ఒకే మూర్తి శ్రీ గౌరులనే రెండు రూపాలుగా గుర్తింపబడిందా, లేక శ్రీ గౌరులిద్దరు ఒక రూపంగా ఏర్పడ్డారా? ఒకరు ఇద్దరయ్యారా, ఇద్దరు ఒకరయ్యారా? ‘హరిహరంబగు రూపము దాల్చి’ – హరిహరంబగు రూపమంటే, హరి, హరుడు అనే రెండు రూపాలా? హరిహరనాథుని ఏక రూపమా? హరి, హరుడు అనే యిద్దరు హరిహరంబగు రూపాన్ని దాల్చారా? లేక ఒకే తత్త్వమైన హరిహరనాథుడు హరి హరులనే రెండు రూపాలను ధరించారా? మళ్ళీ అదే ప్రశ్న. ఒకరు ఇద్దరయ్యారా, ఇద్దరు ఒకరయ్యారా? ‘చెల్వ’ అనే పదాన్నే ఎందుకు ప్రయోగించాడు? ‘భక్త జనాని’కీ, ‘వైదికధ్యాయిత’కూ మధ్య లంకె ఏమిటి?
పద్యాన్ని జాగ్రత్తగా మళ్ళా మళ్ళా చదువుతూ పోతే వీటికి జవాబులు సులువుగానే స్ఫురిస్తాయి. ఆ జవాబుల వెనుక కొత్త అర్థాలు ధ్వనిస్తాయి. చివరగా, తిక్కన గడుసుదనాన్ని మాత్రం చెప్పకుండా ఉండలేను. శైవవైష్ణవ మతాల మధ్య సమభావం కోసం తిక్కన హరిహరనాథుని ఆరాధన ప్రచారం చేశాడని పండితులు అభిప్రాయపడ్డారు. ఇది నిజమే కావచ్చు. కాని తిక్కన మత ప్రచారకుడు కాదు, కవి. తిక్కన గడుసుదనమంతా, తాను ప్రచారం చేయాలనుకున్న హరిహరనాథ స్వరూపాన్ని, ఆ హరిహరులే స్వయంగా ధరించారనట్టుగా చెప్పడంలో ఉంది! పైగా దానికి చెప్పిన కారణం అప్పీలు లేనిది. తన చెలువ చిత్తాన్ని పల్లవింప జేయడానికట! అదీ తిక్కనగారి master stroke! ఈ పద్యం చదివి (చదివిన ప్రతిసారీ) నా చిత్తం పల్లవించడానికి అసలు కారణం ఇదే!