ఇంచుమించుగా గురజాడ వారు, గుత్తునా ముత్యాల సరములంటూ నూత్నకవితా ద్వారానికి తోరణాలు కడుతున్న కాలంలో శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారి వల్ల వెలుగులోకి వచ్చిన పురాతన కృతి నన్నెచోడుని కుమారసంభవం. ఈ కవి నన్నయకు పూర్వపు వాడని, కాదు తరువాతి వాడని, సాహిత్యప్రపంచంలో వాదోపవాదాలు జరిగాయి. పొంగులు చల్లారేక, నన్నయకు తరువాతి వాడన్నవాదం ప్రస్తుతానికి నిలిచింది. భవిష్యత్తులో మరి కొన్ని పరిశోధనలు జరిగి, రుజువులు, ఆధారాలు దొరికి, కొత్త సిద్దాంతం వచ్చే వరకు ఇదే ప్రస్తుతానికి ప్రామాణికం అనుకోవాలి. నిజానికి, కవి ఏకాలం వాడు? అన్నది అతని కావ్యాన్ని మరింత బాగా అర్ధం చేసుకోవడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది గాని, కవితామాధుర్యాన్ని ఆస్వాదించడానికి కవికాలం అంత ముఖ్యం కాదు అనే చెప్పాలి.
నన్నెచోడునికి వర్ణనలంటే వల్లమాలిన అభిమానం. తెలుగులో అష్టాదశ వర్ణనలు ఇమిడిగ్గా పొందుపరుచుకున్న ఏకైక కావ్యం అని కుమారసంభవం పేరు తెచ్చుకుంది. దీనిని మించిన విశేషం ఏమిటంటే సాధారణంగా, వర్ణన అన్న మాటకి ‘వివరించి చెప్పే విషయం’ అనే అర్థం లోక ప్రసిద్ధం అయినా, చాలా సందర్భాలలో నన్నెచోడుని వర్ణనలు మాత్రం క్లుప్తత, రమణీయ భావనాశ్రయత అనే మరో రెండు ప్రత్యేక లక్షణాలకి లక్ష్యాలుగా నిలిచి పోయాయి. ‘వర్ణనలెల్లచో వర్ణనకెక్కంగ’ వ్రాస్తానని చెప్పుకున్న ఈ కవి కావ్యంలో ఉన్న వర్ణనల గురించి మనం మాట్లాడుకోవాలంటే… ఎక్కడ మొదలు పెట్టాలి? పర్వత వర్ణనా? పురవర్ణనా? ఋతువర్ణనా? ప్రకృతి వర్ణనా? యుద్ధవర్ణనా? విరహవర్ణనా? సిరిగల వారింటి విందుభోజనంలా ఉన్న వీటిని అన్నిటినీ ఒక్కసారి ఆస్వాదించి, అరిగించుకునే శక్తి మనకి లేదు కనుక, ప్రస్తుతానికి పార్వతి తపోవర్ణనని మాత్రం ఆకళింపు చేసుకుని, ఆస్వాదించేందుకు ప్రయత్నం చేద్దాం.
ప్రబంధయుగానికి కొన్ని వందల ఏళ్ళు ముందుగా పుట్టిన సలక్షణమైన ప్రబంధం కుమారసంభవం. కవితామార్గంలో కొత్తపుంతలను తొక్కడమే ఆధునికతకు నిర్వచనం అయితే అప్పటి సాహితీ ప్రపంచానికి కొత్తవైన ప్రబంధ లక్షణాలనే ముత్యాలతో కుమారసంభవకావ్యమాలను ఆనాడే గుచ్చాడు నన్నెచోడుడు.
ఇందులో కథావస్తువు హిమవంతుని కూతురుగా జన్మించిన పార్వతి పరమేశ్వరుని సేవించడం, మన్మథదహనం, పార్వతి తపస్సు, శివపార్వతుల కల్యాణం, కుమారస్వామి జననం, తారకాసుర సంహారం. దీనికి పూర్వరంగంగా సతీపరమశివుల ప్రణయం, గణపతి జననం ఆదిగా గల కథలు. తరతరాల కవులను ప్రభావితం చేసిన మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత కుమారసంభవ కావ్యంలోని పార్వతిజననం మొదలుగా గల కధావృత్తాంతం తన కావ్యంలో వస్తువైనా, దీన్ని తనదైన రచనగా రచించడమే కాదు, కొన్ని కొన్ని చోట్ల కాళిదాసు చేతనే ‘శెభాస్’ అనిపించుకునేటట్లు వ్రాశాడని మహామహులెందరో అభిప్రాయపడ్డారు.
పార్వతి తపోవర్ణన ఘట్టం కుమారసంభవంలోని ఆరవ ఆశ్వాసంలో ఉంది. జంగమ మల్లికార్జునుని వద్ద పాశుపతదీక్ష పొందిన దగ్గరనుండి ఇంచుమించు 75 గద్యపద్యాలలో ఋతువర్ణనతో కలిపి పార్వతి తపోవర్ణన కొనసాగింది. సంస్కృత కుమారసంభవంలో ఐదవ సర్గలో ఈ తపోవర్ణన దాదాపు ఇరవై శ్లోకాలలో జరిగింది. ప్రకృతే అమ్మ వారు. అమ్మవారే ప్రకృతి – ఇలా ఆ జగజ్జనని కంటే అభేద్యమైన ప్రకృతిని వర్ణించడంలో ఆమె తపోవర్ణనని పొందుపరచడం ఎంతో సమంజసం. మహాకవి కాళిదాసు పరిచిన ఈ దారిని ఎంతో ఠీవిగా నడిచాడు రాచకవి నన్నెచోడుడు.
తపఃకాంక్ష
మన్మథ దహనానంతంరం విరహాగ్నిలో వేసారిన గౌరి, తపోమహిమతో పరమేశ్వరుని పతిగా పొందుతాను అనే నిశ్చయానికి వచ్చింది. ఇది విన్న తల్లిదండ్రులు, హితవుకోరిన వృద్దాంగనలు పరిపరివిధాల నచ్చచెప్పినా వినక, “నాకు ఈ భవమున ఈశ్వరుండ పతి. ప్రాణము, దేహము, చిత్తవృత్తులున్ శివపదపంకజార్పణము సేసితి” అని బదులు ఇచ్చింది. గతంలో నారదుడు, ‘ఈ దేవి లోకజనని, మహాదేవునకు అగ్రమహిషియై, పేర్మి సురేంద్రాదులకు అర్చితయగును,’ అని చెప్పిన మాటలను స్మరించిన హిమవంతుడు కుసుమకోమలి యైన తన కుమార్తె తపోదీక్ష వహించడానికి అనుమతించాడు.
తపోవన ప్రవేశం
ఈ తపస్సుకు నాంది ఆ దేవి అడవిలో అడుగుపెట్టడం. అరుణాంఘ్రితలదీప్తిన్ అవనీతలంబెల్ల పద్మరాగస్థల భాతిన్ ఒనర… అన్న పద్యంలో ఇలా వర్ణిస్తాడు నన్నెచోడుడు:
అడవిలో అడుగు పెట్టిన అగజాత ఎర్రని పాదాల కాంతి వల్ల భూమి అంతా పద్మరాగాలతో నిండినట్టు ఉందట. దిక్కులనే కలువలు ఆమె ముఖచంద్రికలతో అకాలంలో (పట్టపగలు) వెన్నెల వెలుగులను పొందాయాట. ఆమె పెదవుల కాంతితో అడవిలో ఉన్న తీగెలన్నీ చిగురించినట్టు ఉందట. ఆమె శరీరం మీద ఉన్న పరిమళాలను గ్రహించడం వల్లే గాలి గంధవాహనుడనే పేరు తెచ్చుకున్నాడట. అక్కడ తిరుగుతున్న నెమళ్ళు, మెరుపు తీగెల్లాంటి ఆమె కన్నుల కాంతులను చూసి, వర్షం రాబోతోందని ఉత్సాహ పడుతున్నాయిట.
ఇలా తన ‘ప్రకృతి’ అంటే తన సహజ స్వభావం లాంటి ప్రకృతి (వనప్రదేశం)లోకి పార్వతిని ప్రవేశపెట్టడం అన్నది ఎంత ఉదాత్తమైన భావం?
ఇలా అరణ్యాన ప్రవేశించిన ఉమ శబరులు, ఎఱుకలు, భిల్లులు ఆదిగా గల ఆటవీకుల్ని చూసింది. అటుపై వెదురుబియ్యాన్ని దంచుతూ, చుట్టూ చేరిన లేళ్ళను పరవశింప జేస్తూ, మనుష్యరూపాన ఉన్న శివుని వంటి జంగమ మల్లికార్జునుని స్తుతిస్తూ, పెక్కు రాగాల్లో ఎంతో అతిశయంగా పాటలు పాడుతున్న శబర వనితలను చూసింది. అటుపై ముని పల్లెను చేరుకుంది. అక్కడ వేదజ్ఞాన సంపన్నుడు, ఆత్మజ్ఞాని, మోక్షాసక్తుడు అయిన మల్లికార్జునుని దర్శించింది.
నన్నెచోడుడు సప్తసంతానాలలో ఉత్కృష్టమైన ఈ కావ్యకన్యకకు తన గురువు జంగమ మల్లికార్జునుని కృతిభర్తగా నిర్ణయించుకున్నాడు.
నింగి ముట్టియున్న జంగమ మల్లయ
వరమునందుఁ గనిన వస్తుకవితఁ
దగిలి వారియంద నెగడింతు రవికి దీ
పమున నర్చ లిచ్చు పగిది వోలె.
మహోన్నతుడైన మల్లికార్జునుని దయ వల్ల ప్రాప్తించిన తన వస్తుకవితను, దీపంతో సూర్యుడికి అర్చనలు చేసిన విధంగా తిరిగి ఆయనకే సమర్పించుకుంటాను, అంటూ తన గురుభక్తిని ప్రకటించాడు. గురువు, ప్రభువు, ఇష్టదైవము అయిన జంగమ మల్లికార్జునుని స్తుతించి ఉన్నతస్థానంలో ఉంచి, అంతటితో ఆగకుండా, ఈ కథాసందర్భంలో తన గురువును సాక్షాత్తూ మహేశ్వరియైన ఆ పార్వతీదేవికే దీక్షా గురువును చేశాడు.
జంగమ మల్లికార్జునుని సమీపించిన ఆ ఈశ్వరి అతని వద్ద శైవాగమనియతి ప్రకారం శివదీక్షను పొంది, పరమశివుని శీఘ్రంగా ప్రసన్నం చేసుకునే మంత్ర ధ్యాన వ్రతాచారాలను ఉపదేశాలుగా పొంది, ఆయన అనుమతితో తపశ్చర్యకు సంసిద్ధురాలయింది.
తపోవేష ధారణ
ముందుగా, విభూతి పూత, నారచీరలు, రుద్రాక్షలు, జటలు మొదలైన వాటితో తపోదీక్షకు తగిన వేషధారణ చేయవలసి వుంది. ఈ సందర్భంలో పార్వతి వర్ణన:
పవడంపులత మీదఁ బ్రాలేయపటలంబు
పర్వె నా మెయి నిండ భస్మమలఁది,
లాలితంబగు కల్పలత పల్లవించె నాఁ
గమనీయ ధాతువస్త్రములు గట్టి,
మాధవీలత కలిమాలికల్ ముసరె నా
రమణ రుద్రాక్షహారములు వెట్టి,
వర హేమలతికపైఁ బురినమ్మి యూఁగె నా
సన్నుతంబగు నెఱిజడలు పూని,
హరుఁడు మాహేశ్వరీరూపమైన చెలువ
మభినయించెనొ యని మును లర్థిఁ జూడ
గురుతపశ్శక్తి మూర్తి సేకొనిన కరణిఁ
దగిలి యుమ తపోవేషంబుఁ దాల్చి పొల్చె. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 82)
పగడపు తీగె మీద మంచు కప్పుకుందా అన్నట్లు శరీరమంతా తెల్లని విభూతిని పూసుకుని, చిగురించిన అందమైన కల్పవృక్షపులత అనిపించేటట్లు చక్కని కావిరంగు నారచీరలను కట్టుకుని, మాధవీలత మీద నల్లని తుమ్మెదలు ముసురుకున్నాయా అన్నట్లు రుద్రాక్షమాలలు ధరించి, శరీరమనే బంగారు తీగెపై నెమలి పురి విప్పి ఆడుతోందా అన్నట్టు చక్కని జడలు ధరించి, మహత్తరమైన తపశ్శక్తే ఈ ఆకారంతో వచ్చిందేమో అనిపించే విధంగా ఆ గిరిజ తపోచితమైన వేషధారణ చేసింది. ఆ రూపాన్ని, సాక్షాత్తూ పరమేశ్వరుడే మనోహరమైన స్త్రీరూపాన్ని ధరించి వచ్చాడేమోనని మునులందరూ కోరికతో ముచ్చట పడి మరీ చూస్తున్నారు.
ఇక్కడ పార్వతి సౌకుమార్యాన్ని సూచిస్తూ పగడపు తీగె, కల్పవృక్షపు తీగె , మాధవీలత, హేమలత వంటి ఉపమలతో వర్ణించడం, ముందుముందు ఈ లతాంగి, ఈ కుసుమకోమలి చెయ్యబోయే ఘోరమైన తపస్సును కన్నవారిలో, విన్నవారిలో — ఆ పార్వతా? ఈ తపస్సు చేస్తోంది! అనే అబ్బురపాటుకు — పూర్వరంగాన్ని అమరుస్తున్నట్టు ఉంది. అంతేకాదు, పరమేశ్వరుడే స్త్రీ రూపం ధరించాడా? అనడంలో ఆమె మనసంతా నిండి అంతర్గతమైన ఉన్న శివుని రూపం ప్రత్యక్షంగా చూసే వారికి కనబడుతూ, శివసాక్షాత్కారం తథ్యం అని చెప్పుతున్నట్టుంది.
తపోదీక్ష పూనిన వారు వీతరాగులు కావాలి. అంటే అన్నిటి మీద మమకారాన్ని లేదా అనురాగాన్ని వదలిపెట్టాలి. రాగ శబ్దానికి ఉన్న రంగు, అనురాగము, అనే రెండర్థాలతో దీని సమర్ధన ఎలా ఉందో చూడండి.
మేని కుంకుమరాగంబు, మెలత తోఁపు
మోవి తాంబూలరాగంబు మొగిన పాసి,
చారుతర మయ్యెఁ జూడ నా శైలతనయ
వీతరాగంబు ప్రకటించు విధము వోలె. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 84)
పర్వత రాజపుత్రి తాపసియై శరీర లేపనాలు, తాంబూల సేవనం విడిచిపెట్టటం వల్ల శరీరంపై ఉండే కుంకుమరాగము, పెదవిన ఉన్న ఎఱ్ఱని తాంబూలపు రంగు, రెండు ఆమెని వీడి పోయాయి. అలంకరణలకు దూరం అయినా, తపోదీక్ష పూనిన గౌరి, దానికి అనుగుణంగా, అనురాగము లేదా మమకారాన్ని వదిలి వేసిన దాని వలె మరింత శోభాయమానంగా కనబడుతున్నది.
పార్వతి తపస్సు
గౌరివనంలో గౌరీదేవి స్నానార్చన హోమాదినిత్యకర్మలతోను, శాకాహార, ఫలాహార, పర్ణాహార, జలాహారాది మహాతపోవ్రతాలతోను, బొటనవేలిపై నిలబడి, బాహువులను పైకెత్తి, నాలుగగ్నుల మధ్యన నిలుచుండి, మార్తాండుని కేసి చూస్తూ, ప్రాణాయామాది నియమాలను పాటిస్తూ, ఇంకా ఎన్నెన్నో నిష్ఠలను ఆచరిస్తూ, నిరంతరం పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఘోరతపోదీక్షలో ఉంది. ఇలా తపోదీక్షలో ఉన్న ఆ నారీమణి శరీరం నుంచి ఆమె సహజసౌందర్యం తొలగిపోతోంది. ఇది ఎలా ఉందంటే — ముంగురుల అందాన్ని తుమ్మెదలలోను, మందగమనాన్ని హంసలలోను, ముఖకాంతిని తామరలలోను, శరీరకోమలత్వాన్ని తీగెలలోను, చంచలమైన చూపులను లేళ్ళలోను, దాచి పెట్టిందా అన్నట్టుగా ఇవన్నీ తపస్సు చేస్తున్న కారణంగా ఆమెలో కనబడటంలేదు.
కఠోరతపోదీక్షలో శాంభవి శరీరం నానాటికి కృశించడాన్ని నన్నెచోడుడు ఈ క్రింది పద్యంలో అత్యద్భుతంగా వర్ణించాడు.
ఉగ్రతపమునఁ దోడ్తోన విగ్రహంబు
చాల శోషించెఁ బ్రాలేయశైల తనయ
యర్ధనారిగాఁ దన దేహ మభవు మేన
నల్ప మల్పము నంటించునట్ల వోలె. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 92)
ఆమె శరీరం శుష్కించిపోవడం ఎలా ఉంది? హిమవత్పుత్రి ఆ పరమేశ్వరుడి శరీరంలో సగభాగం కావడానికి గాను తన దేహాన్ని కొద్దికొద్దిగా ఆ శివుని శరీరానికి అంటిస్తోందా, అన్నట్టుగా ఉగ్ర తపస్సు వల్ల క్రమక్రమంగా తన శరీరాన్ని శుష్కింప జేస్తున్నది. ఇలా మహోన్నతమై, అత్యద్భుతమై, మనసుని స్పందింప జేసే భావాన్ని వ్యక్తం చెయ్యడానికి కందాన్నో, గీతాన్నో ఎంచుకోవడం నన్నెచోడుని ప్రత్యేకత.
ఇలా పార్వతి తపస్సు చేస్తుండగా, వర్షాకాలం వచ్చిందంటూ మొదలు పెట్టి 15 పద్యాలలో నింగి నున్న ఇంద్రధనుస్సు నుంచి నేలనున్న ఇంద్రగోపాల (ఆరుద్ర పురుగులు) దాకా అత్యద్భుతంగా వర్ణన సాగుతుంది. వాటిలో…
పరమస్నేహము హృత్సరోరుహమునం బాత్రంబు గావించి, సు
స్థిరతం బుణ్యదశం దపోగ్ని మది నుద్దీపించి, బ్రహ్మాండ క
ర్పరఖండంబున, మంత్రకజ్జలమొగిన్ ఫాలాక్షుఁ గూర్పింప, న
గ్గిరి రాజాత్మజ వట్టె నా నమరి, నింగిం బర్వె నీలాభ్రముల్. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 96)
అన్న పద్యంలో పార్వతి తపస్సు యొక్క ప్రస్తావన వస్తుంది. శివుని మీద ప్రేమతో అతనిని పొందాలని తపస్సు చేస్తున్న పార్వతి, తన హృదయాన్ని పాత్ర చేసి, అందులో తన ప్రేమనే చమురును పోసి, చలించని పుణ్యమనే వత్తిని ఉంచి, తన తపోగ్నితో వెలిగించి, ఆకాశం అనే కుండపెంకు మీద ఆ దీపపు వత్తి నుండి వచ్చే పొగతో, ఫాలాక్షుని వశం చేసుకోవడానికి ‘మంత్రపు కాటుకను’ పట్టుకుంటోందా అన్నట్టు ఆకాశంలో నల్లటి మేఘాలు వ్యాపించాయి. ఇది కూడా ఆకాశం దాకా ఎదిగిన మరో అద్భుతమైన ఊహ.
అమరె నెఱిజడలపై ను
త్తమరుచి నవజలకణములు దగిలి బెడంగై
యుమ తపమున కెదమెచ్చి త
దమరులు ముత్యముల సేస లలికిన భంగిన్. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 108)
ఇక ఇటువంటి వర్షఋతువులో నీట నిలబడి తపోదీక్షలో ఉన్న పార్వతి అందమైన జటల మీద పడ్డ తొలకరి వాన చినుకులు ఆమె తపస్సుకు మెచ్చి దేవతలు ముత్యాలసేసలు జల్లారా అన్నట్టు కనబడుతున్నాయట. తరువాత శరదృతువు వచ్చింది. అలా వచ్చిన ఆ శరత్కాలం తన కుమార్తెకు పరితాపాన్ని కలిగిస్తోందని హిమవంతుడు దానిపై దండెత్తి వెళ్ళాడా అన్నట్టు భూమి అంతా మంచుపొరలు కమ్ముకోవడంతో హేమంతఋతువు మొదలైంది. ఆ వెనుకనే శిశిరఋతువు ప్రవేశించింది.
ఇక్కడ మరో చక్కని వర్ణన: హేమంతశిశిరాల్లో ఆ ఉమ నిరాహారిణి అయి, నిత్యమూ నీటిలో నిలబడి తపస్సు కొనసాగించింది. హేమంతఋతువులో కప్పుకున్న మంచువల్ల చెట్లను, తీగెలను ఉన్న పువ్వులన్నీ నశించిపోవడం సహజం. కొలనులలో ఉండే కలువలు, కమలాలు కూడా ఋతుధర్మాన్ని అనుసరించి కనుమరుగవుతాయి. మరి తిరిగి రాబోయే వసంతంలో నాటడానికి విత్తనాలు దాచుకోవడం కూడా లోకసహజమైన విషయమే. పార్వతిని వర్ణించడానికి నన్నెచోడుడు ఈ విషయాన్ని వాడుకున్న విధానం మెచ్చదగింది.
తనరి హేమంతమగుడుఁ బద్మంబు లడఁగి
పోవఁ బోయినఁ గొల నొక్క పువ్వు తనకు
విత్తుగా డాఁచికొనియున్న విధము పోలె
శైలసుతముఖ ముదకవాసమున నొప్పె. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 126)
శిశిరంలో మెడలోతున ఉన్న నీళ్ళలో నిలబడి తపస్సు చేస్తున్నది పార్వతి. అప్పుడు ఆమె ముఖం, ముందుగా వచ్చిన హేమంతఋతువులో తనలో ఉన్న పద్మాలన్నీ నశించి పోగా ఒక్క పూవును మాత్రం ఆ కొలను విత్తనంగా దాచుకుందా అన్నట్టు ఉన్నది.
శిశిరం దాటి వసంతము, దానివెనుక, పేరు తలుచుకుంటేనే చాలు హృదయం కందిపోయే విధంగా ఉన్న గ్రీష్మం వచ్చేయి. మరి ఈ గ్రీష్మఋతువులో పార్వతి పట్టపగలు మండుటెండలో పంచాగ్నుల మధ్య నిలిచి, ఆకాశంలో మండుతున్న సూర్యబింబం కేసి దృష్టి కేంద్రీకరించి తపస్సు చేస్తోంది. అదికూడా వట్టినేల మీద కాదు మండుతున్న బండ రాతిపై నిలబడి ఉంది. కవి దీన్ని ఎలా చూస్తున్నాడో చూడండి.
పరితాపోగ్ర నిదాఘవేళ శిలపైఁ బంచాగ్ని మధ్యంబునన్
బరమధ్యాన సమేతయై నిలిచి విభ్రాజిల్లె నుద్యత్తప
శ్చరణాలంకృత శైలనందన కనత్సంధ్యారుణాంభోధరో
త్కరమధ్య స్థితకాంతకాంతియుతశీతద్యోతి లేఖాకృతిన్ — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 142)
ఉద్యత్ తపశ్చరణాలంకృత, శైలనందన, పరితాపోగ్ర నిదాఘవేళ, శిలపైఁ బంచాగ్ని మధ్యంబునన్, బరమధ్యాన సమేతయై నిలిచి, కనత్సంధ్యారుణాంభోధరోత్కరమధ్య స్థితకాంతకాంతియుతశీతద్యోతి లేఖాకృతిన్ విభ్రాజిల్లెన్. – అన్నది అన్వయం.
మహాతాపాన్ని కలిగిస్తున్న ఎండవేళ (పరితాపోగ్ర నిదాఘవేళ) చుట్టూ నాలుగు అగ్నులు, ఆకాశంలో మండుతున్న సూర్యగోళం, ఆ వేడికి ఎర్రబడి మండుతున్న బండరాయి -– ఇవన్నీ నిలువ సాధ్యం కాని పరితాపాన్ని కలిగించే పరిస్థితులు. మనకి ఊహించుకుంటేనే భయం వేసే ఈ సన్నివేశంలో ఆ హైమవతి ఎలావుందో చూడండి. తాను పూనుకున్న తపోదీక్షే ఆమెకో అలంకారం. మండుతున్న అగ్నిగుండాలు సంధ్యాకాలంలో ఆకాశంలో మెరిసే మేఘాల వలె ఉన్నాయి. వాటి మధ్య నిలబడ్డ ఆ గిరిజ మనోజ్ఞమైన కాంతితో మెరుస్తున్న చంద్రరేఖలా ఉందట. చల్లని కొండరాజు హిమవంతుని కూతురు, రేపు లోకాలని చల్లగా చూడబోయే తల్లి, మరి ఆమె చల్లని చంద్రలేఖలా మెరవడంలో వింత ఏముంది?
అది మండువేసవి కాలం. మిట్టమధ్యాహ్నం వేళ సమయంలో ఆమె చుట్టూ ఉన్న అగ్నులు ఎండవేడికి ఊరుకుంటాయా మరింత చిటపటలాడుతాయి, సెగలు కక్కుతూ పైకి లేస్తాయి. అయినా పార్వతి మాత్రం కాలిబొటన వేలిని స్థిరంగా నెలకు నొక్కి పట్టి, తల పైకెత్తి, మండుతున్న సూర్యబింబాన్ని కన్నార్పకుండా చూస్తోంది. ఆమె ముఖమేమో పద్మం. ఆమె కనులేమో కలువలు. వీటి సాయంతో కవి ఇంద్రజాలం చేస్తున్నాడు.
ఖరకర కరహతి ముఖసర
సిరుహము కడువంది కాంతి సెడ నయనేందీ
వరము లలరె గిరిజ తప
స్స్థిరశక్తిని బగలు రేయి సేసెనొ యనగాన్. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 144)
ఉన్నది పట్టపగలు మిట్ట మధ్యాహ్నం. సూర్యకిరణాల దెబ్బకు ఆమె ముఖం సూర్యుడు అస్తమించిన రాత్రి వేళలో ముడుచుకు పోయిన పద్మంలా వాడిపోయింది. కాని చల్లని చంద్రకిరణాలతో వికసించే కలువల్లాంటి ఆమె కళ్ళు మాత్రం మిల మిలా మెరుస్తున్నాయి. ఇది ఎలా కనబడుతోంది అంటే ఆ పార్వతి తన తపశ్శక్తితో పగటిని రాత్రిగా మార్చేసిందేమో అన్నట్టుగా ఉందట. పగలు పద్మం వాడిపోవడం ఏమిటి? కలువలు కళకళలాడడం ఏమిటి? ఇంద్రజాలం కాకపోతే?
తపఃప్రభావం
ఇంత ఘోరమైన తపస్సు చేసినా ఆ శివుడు ప్రసన్నుడు కాలేదు, అయినా పట్టు విడువకుండా అగజ తన తపస్సును కొనసాగించింది. చివరకు చర్మము, బొమికలు తప్ప వేరేమీ మిగులనట్టుగా చిక్కి, ఎండు కర్రలా మారింది. శైలకన్యక చేసే ఈ తపస్సు చూసి దేవతలు ఇది లోకములలో అరుదు అని ఆశ్చర్యపడి, మెప్పుకోలుగా ముత్యాలు జల్లారు. ఇంతకుముందు ఎవరూ ఎరుగని విధంగా దీక్ష పూని తపస్సు చేస్తున్నది గౌరి. దాని ప్రభావం ప్రత్యక్షంగా కనబడసాగింది.
చిర సద్బ్రహ్మతపోధనావలి తపస్తేజంబులుం బేర్మితోఁ
దిరమై పొల్పగు దేవ తాపస తపస్తేజంబులుం గౌరి సు
స్థిర భావోగ్రతపోగ్ర తేజమున నిస్తేజంబులై యుండె న
త్యురు చండాంశుకకర ప్రభా ప్రతిహత ద్యోతిః ప్రభాభాసమై. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 151)
చిర సద్బ్రహ్మతపోధనావలి తపస్తేజంబులున్, పేర్మితోన్ తిరమై పొల్పగు దేవ తాపస తపస్తేజంబులున్, గౌరి సుస్థిర భావోగ్ర తపోగ్ర తేజమున, అత్యురు చండాంశుకకర ప్రభా ప్రతిహత ద్యోతిః ప్రభాభాసమై, నిస్తేజంబులై యుండెన్ -– అన్నది అన్వయం.
చాలా కాలంగా తపస్సు చేస్తున్న బ్రాహ్మణ ముని సంఘాల తపోవికాసాలు, సుస్థిరమైన దేవతాసమూహాల తపస్సుల ప్రకాశం, గౌరి అచంచలదీక్షతో చేస్తున్న ఈ ఘోరమైన తపస్సు యొక్క తేజస్సు వల్ల, చండకిరణుడైన సూర్యుని తీక్షణమైన కిరణాల దెబ్బతో కాంతి విహీనాలైన నక్షత్ర కాంతుల వలె ఉన్నాయి. బ్రాహ్మణుల,ఋషుల తపస్సు మహాతేజోవంతమైంది. అలాగే దేవతల తపఃప్రభావం తేజస్సులో దానికి తీసిపోయేది కాదు. మరి ఈ రెండు ప్రకాశవంతమైన వెలుగులు, చండకిరణుడైన సూర్యప్రభలతో సమానమైన శైలజ తపఃప్రభల ధాటికి ఆగలేక నిస్తేజాలయ్యాయి.
మరి ఈ తపశ్శక్తి సకలలోకాలలో ఎలాంటి కల్లోలం కలిగించిందంటే — భూమి కంపించిపోయింది, సూర్యచంద్రులు గతులు తప్పారు, నక్షత్రాలు రాలి నేలన పడ్డాయి, పర్వతాలు బద్దలయ్యాయి, సముద్రాలు ఇంకిపోయాయి. బ్రహ్మ తల్లడిల్లాడు. ఇంద్రుడు భయపడ్డాడు. వాసుకి విషం కక్కుకున్నాడు. చివరికి విష్ణుమూర్తి కూడా మనసులో కలత పడ్డాడు. ఆమె తపోభారాన్ని భరించలేక కూర్మం కూడా కూలబడింది. భూలోకంలో ఉన్న సప్త సముద్రాలు వేడిపెనం మీద పడ్డ నీరు లాగ చప్పున ఇంకి పోయాయి. ఆ వేడికి బంగారుకొండ మేరు పర్వతం సహితం మూసలో పోసిన బంగారం లాగ కరిగి ద్రవంగా మారింది.
తారకము లెల్ల రుచిరాం
గారంబుల కరణి వెలిఁగెఁ గమలారి తమో
హారులు క్రాగిన రజత మ
హారజతాదర్శనంబు లనఁ దనరి రెడన్. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 156)
ఆ ఉగ్రతకి ఆకాశాన్న ఉన్న తారలన్నీ నిప్పుకణికలయ్యాయి. కాలి మండుతున్న బంగారపు అద్దం లాగ సూర్యుడు, వెండి అద్దం లాగ చంద్రుడు కనబడ్డారు. అగ్నిస్వభావం మండించడం, వ్యాపించడం. అందుకనే ముల్లోకాలకు ఎగబ్రాకిన తపోగ్నిని ఇలా వర్ణిస్తున్నాడు కవి.
పోండిగ నగజ తపశ్శిఖి
మూండు జగంబులను దీవ్రముగఁ బర్వినఁ బ్ర
హ్మాండము గాఁచిన కాంచన
భాండము క్రియఁ దాల్చెఁ దత్ప్రభాభాసితమై. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 157)
తేజోభరితమైన పార్వతి తపోగ్ని మూడులోకాల్లో వ్యాపించింది. దాని కాంతితో బ్రహ్మాండమంతా కాల్చిన బంగారు కుండలా మెరిసిపోతోంది. ఇంక ముల్లోకాల్లోనూ భయపడనిది, చలించనిది, కాలనిది, కూలనిది ఏదైనా ఉందా? ఉంది మరి. అదే ఆ వెండికొండ (రజతాచలము) దాని మీద ధ్యానమగ్నుడైన ఆదిదేవుడు.
గిరిసుత తపః ప్రభాతికి
తరతరమ చలించి రజత ధరణీధర మ
చ్చెరువుగ జిర్రునఁ దిరిగెం
బురహరుతోఁ గూడ వెండి బొమ్మరము క్రియన్. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 158)
పైన చెప్పిన విధంగా అంతటా పరుచుకుంటూ వెళ్ళిన ఆ గౌరి తపోగ్ని యొక్క తేజస్సు క్రమంగా ఆ కొండను కూడా కదల్చివేసింది. అంతటితో ఆగలేదు. అందరూ ముక్కున వేలేసుకునే విధంగా, ఆ కొండ తన మీద కూర్చున్న త్రిపురారితో కూడా కలిసి వెండి బొంగరంలా గిర్రుమని తిరిగిపోయింది.
ఇలా కొండతో కదిలినది శివుడే కాదు అతని మనసు కూడా కదిలింది. మునుపు తనను దరిజేరిన ఆ గౌరిని చేబట్టక, కోపంతో మన్మధుని దహించి, హిమగిరిని వదలి తపసి అయ్యాడు. తన ఈ పొరపాటును తానే నిందించుకుని, విరహవేదనకు లోనవుతాడు. చివరకు శంకరుడు కర్తవ్యాన్ని ఆలోచించి, కపట వటువుగా ఆ పార్వతి వద్దకు వెళ్ళి, తన నిజస్వరూపాన్ని ప్రదర్శించి ప్రత్యక్షమవుతాడు. తరువాత అరుంధతి సమేతంగా సప్తఋషులను రావించి, వివాహప్రయత్నం మొదలుపెట్టి, పార్వతిని పరిణయమాడటం జరుగుతుంది.
అది పార్వతి తపానికి ఫలం. స్థాణువును సహితం బొంగరంలా తిప్పిన చైతన్యమే ఆమె తపశ్శక్తి. ఆ అరుదైన తపస్సుకు త్రినేత్రుడు లొంగి పోయాడు. ఆమె పాణిని గ్రహించడమే కాదు తన మేనిలో సగం ఆమెకు ధారపోసి అర్ధనారీశ్వరుడయ్యాడు.
కావ్యపీఠికలో వర్ణనలు, అలంకారాలు, ఉదాత్తమైన భావాలు మొదలైనవి వస్తుకవితా లక్షణాలుగా చెప్పుకున్నాడు నన్నెచోడుడు. ప్రకృతిశోభని వర్ణించడం వస్తుకవిత అయితే, కుమారసంభవం కావ్యంలో ప్రకృతిని, ప్రకృతిస్వరూపం అయిన పార్వతిని, జోడించి వర్ణించిన ఈ ఘట్టం దానికి చక్కని ఉదాహరణ. అడుగడుగున సహజసుందరమైన ఉపమలు, మనసును అబ్బురపరిచే ఉత్ప్రేక్షలు, ఈ వర్ణనలను ‘వర్ణనాచిత్రాలు’గా, ‘వర్ణచిత్రాలు’గా చూపిస్తాయి. అంతే కాదు నన్నెచోడుడు తన కవిత్వాన్ని గురించి, వర్ణనలెల్ల చో వర్ణన కెక్కంగ… అలంకారముల తాన్ అలంకరింపన్, ఆదరించి విని సదర్థాతిశయమున, బుధులు నెమ్మనమున నిధులు నిలుప… అని కావ్యారంభంలో చెప్పినట్టుగానే ఈ కవిరాజశిఖామణి వర్ణనలు చదువరుల హృదయాల్లో పదిలంగా నిలిచిపోతాయనడంలో అతిశయోక్తి లేదు.