కాలుష్యాష్టకం

కం.
కలుషితము మెసవు మెతుకులు
కలుషితములు త్రావు నీళ్ళు గరళసదృశముల్
కలుషితము పీల్చు గాలియు
కలుషిత మనరాని దేది కలికాలమునన్
కం.
కలుషితములు మనబుద్ధులు
కలుషితములు మనముచేయు ఘనకార్యంబుల్
కలుషితములు మనరూకలు
కలుషితములు జీవితములు కలికాలమునన్
కం.
కలుషితములు శాస్త్రంబులు
కలుషితములు బడులు గుడులు ఘనపీఠంబుల్
కలుషితములు గురుబోధలు
కలుషితములు కాని వేవి కలికాలమునన్
కం.
కలుషితములు చుట్టరికం
బులు నెల్లరి సంప్రదాయములు కలుషితముల్
కలుషితములు స్నేహంబులు
కలుషితములు కాని వేవి కలికాలమునన్
కం.
కలుషితములు రాగంబులు
కలుషితములు నృత్యగానకవితారీతుల్
కలుషితములు కావ్యంబులు
కలుషితములు సకలకళలు కలికాలమునన్
కం.
మనవాక్కులు కలుషితములు
మనచూడ్కులు కలుషితములు మాటికి రేగే
మన కోర్కెలు కలుషితములు
మన బ్రతుకులె కలుషితములు మహి నీకలిలో
కం.
కలుషితములు మన శ్రద్ధలు
కలుషితములు మనము చేయ గడగెడు పూజల్
కలుషితములు మన మ్రొక్కులు
కలుషితములె సకలదైవకార్యములు కలిన్
కం.
కలుషితమైనది కాలము
కలుషమతులు పెచ్చుమీఱ కలికాలమునన్
కలుషరహితమగు దైవమె
కలుషంబుల బాపి జనుల గాపాడవలెన్