ఈ చౌరాష్టకం బిల్వమంగళులు చెప్పినది. ఆయనే శ్రీకృష్ణకర్ణామృతకర్త. ఆయనే లీలాశుకుడు. వీరి గురించి పంగులూరి వీరరాఘవుడుగారి శ్రీమదాంద్ర మహాభక్తవిజయము పుస్తకం ఉత్తరభాగంలో ఒక వ్యాసం ఉంది. అంతర్జాలంలో కూడా ఈయన చరిత్ర కనిపిస్తోంది.
లీలాశుకుడు 17వ శతాబ్దపు కవి. అసలు పేరు బిల్వమంగళుడు. యౌవనోద్రేకంలో వేశ్య చింతామణిని తగులుకొని దారి తప్పాడు. ఒక భయంకరమైన తుఫాను రాత్రి నానా అగచాట్లూ పడి ఆమె ఇంటికి పోతే ఆమె కాస్తా ఈ మాంసపుముద్దకోసం మనసుపడి యింత తుఫానునూ లెక్కచేయకుండా వచ్చావే, ఈ మనసుని ఆ భగవంతునిపై నిలుపరాదా అన్నది. అంతే ఆయన తక్షణం విరాగియై భగవన్నామస్మరణలో పడ్డాడు. ఆయనకు గోపాలమంత్రం లభించింది. ఎంతో మధురమైన చిక్కని భక్తితో కూడిన కవిత్వం చెప్పాడు. ఆయన చెప్పిన ఈ చౌరాష్టకం అంతా నిందాస్తుతిపూర్వకంగా ఉంది. బహుచమత్కారంగా ‘ఓరి దొంగా కృష్ణా నీకు నమస్కారం’ అంటూ ఎనిమిది శ్లోకాలు ఉన్నాయిందులో. నువ్వు దొంగతనం చేయనిది ఏమీ లేదు ప్రపంచంలో. చివరికి నా సర్వస్వాన్నీ దొంగిలించావు. అందుకే నిన్ను నామనస్సనే చీకటికొట్టులో పడవేశాను. ఇంక ఎక్కడికీ పోలేవు సుమా అంటాడు.
శ్రీకృష్ణాష్టమినాడు అనుకోకుండా ఈ అష్టకంలోని మొదటి శ్లోకాన్ని తెలుగుచేసి ఒక మిత్రునకు పంపితే ఆయన మొత్తం తెలుగుచేయమని ప్రోత్సహించారు. ఈ శ్లోకాలలోని చమత్కారం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అలాగే తెలుగులోనూ రావాలని ఆశిస్తూ ఆంధ్రీకరణం చేశాను.
- వ్రజే ప్రసిద్ధం నవనీతచౌరం
గోపాంగనానాం చ దుకూలచౌరం
అనేకజన్మార్జితపాపచౌరం
చౌరాగ్రగణ్యం పురుషం నమామిఉ.
దొంగిలె పాలువెన్నలను తొల్లిట నీతడు గొల్లపల్లెలన్
దొంగిలె గొల్లకన్నియలు తోయములాడెడు వేళ చీరలన్
దొంగతనంబుచేసె బహుధూర్తత నావగు పాపసంపదల్
దొంగల రాజువీ డనుచు దోయిలి యొగ్గెద వీని కెప్పుడున్ - శ్రీరాధికాయా హృదయస్య చౌరం
నవాంబుదశ్యామలకాంతిచౌరం
పదాశ్రితానాం చ సమస్తచౌరం
చౌరాగ్రగణ్యం పురుషం నమామిఉ.
దొంగిలె నీలపద్మరుచి తొల్తగ వీడు నిజాంగకాంతులన్
దొంగిలె రాధికాహృదయతోయజ మంతట చిన్నినవ్వులన్
దొంగిలువేళలన్ నిలువుదోపిడి చేయు నిజాశ్రితాళి నీ
దొంగల రాజరాజనుచు దోయిలి యొగ్గెద వీని కెప్పుడున్ - అకించనీకృత్య పదాశ్రితం యః
కరోతి భిక్షుం పథి గేహహీనం
కేనాప్యహో భీషణచౌర ఈదృగ్
దృష్టః శృతోవా న జగత్రయేపిఉ.
పాదములంటి మ్రొక్కులిడు వారల సర్వము కొల్లగొట్టుచున్
బీదల జేసి కేవలము భిక్షుకవృత్తికి ద్రోసి కొంపగో
డేదియు లేని దుస్థితికి నీడ్చక మానని యిట్టి దొంగ యీ
యాదవబాలుడే జగములన్నిట వీనికి మ్రొక్కెదన్ సదా - యదీయ నామాపి హరత్యశేషం
గిరిప్రసారాన్ అపి పాపరాశీన్
ఆశ్చర్యరూపో నను చౌర ఈదృగ్
దృష్టః శృతోవా న మయా కదాపిఉ.
ఇంతటి దొంగ వీడనుచు నెవ్వరి యూహకు రాదు సు
మ్మెంతకు నైన వీడు దగు నించుక పేరు దలంచినంతనే
వింతగ నాదు పాపగిరి వీడు హరించుకపోయె నెన్నడున్
చింతల దీర్చుచోరుని విచిత్రము విన్నది కన్నదున్నదే - ధనం చ మానం చ తథేంద్రియాణి
ప్రాణాంచ హృత్వా మమ సర్వమేవ
పలాయసే కుత్ర ధృతోద్య చౌర
త్వం భక్తిదామ్నాసి మయా నిరుద్ధఃసీ.
నాధనంబుల నెల్ల నయముగా నీపాలు చేసికొన్నావుగా చిన్నిదొంగ
నా మానధనమును శ్యామసుందర నీవు కొల్లగొట్టితివిగా గోపబాల
అరయ నా సర్వేంద్రియముల సత్వంబుల నీవ గైకొంటివి నీటుకాడ
నాప్రాణములు కూడ నావి కావాయెనే నీయందు నిలచెనే నీలవపుషఆ.
ఇన్ని యపహరించి యెందు బోయెదవయ్య
వెన్నదొంగ నిన్ను విడుచు టెట్లు
భక్తిరజ్జువులను బంధించినాను నా
హృదయమందిరమున నింపు మీఱ - ఛినత్సి ఘోరం యమపాశబంధం
భినత్సి భీమం భవపాశబంధం
ఛినత్సి సర్వస్య సమస్తబంధం
నైవాత్మనో భక్తకృతం తు బంధంతే.
త్రెంచెదవు ఘోరయమపాశ మంచితముగ
త్రెంచెదవు భవపాశ ముదీర్ణశక్తి
త్రెంచెద వఖిలబంధముల్ దీనుల గని
భక్తిపాశంబులను ద్రెంచ వశమె నీకు - మన్మానసే తామసరాశిఘోరే
కారాగృహే దుఃఖమయే నిబద్ధః
లభస్వ హే చౌర! హరే! చిరాయ
స్వచౌర్యదోషోచితమేవ దండంచం.
అరయగ నామనోకుహర మంతటి చీకటి కొట్టులేదు శ్రీ
హరి పదునాల్గులోకముల నట్లగుటన్ నిను పట్టి దెచ్చి చె
చ్చెర నట కార బెట్టితిని చేసిన చిత్రము లిన్ని యన్నియా
మురహర నీవొనర్చినవి ముట్టిన శిక్షప్రశస్తమైనదే - కారాగృహే వస సదా హృదయే మదీయే
మద్భక్తిపాశదృఢబంధననిశ్చలః సన్
త్వాం కృష్ణ హే! ప్రలయకోటిశతాంత రేపి
సర్వస్వచౌర! హృదయాన్ న హి మోచయామిచం.
హరి నిను నామనోకుహర మందున నూరక నుంచినానుబో
యురికెద వంతలోనె నను యూహను నిన్ను బిగించి కట్టితిన్
మురహర భక్తిరజ్జువుల మోదము మీఱగ దొంగవాడ యీ
చెరబడి యుండవోయి యిక చెల్లవు టక్కులు పారిపోవగన్
ఇతి శ్రీబిల్వమంగళ విరచిత చౌరాష్టకం సంపూర్ణం
శ్రీబిల్వమంగళులు రచించిన చౌరాష్టకానికి స్వేచ్ఛానువాదం సంపూర్ణం.