అప్రకటిత యక్షగానం: రామదాసు చరిత్రం

ముందుమాట

రామదాసు చరిత్రం అన్న శీర్షికతో ఉన్న ఈ రచన (Government Oriental Manuscripts Library, Chennai – R-2592A) తాళపత్ర ప్రతి నుండి నేను ఎత్తివ్రాసి తయారు చేసిన ఒక యక్షగానాన్ని పోలిన రచన. నేను చూడగలిగినంతలో శోధించి చూసిన తరువాత, ఇది ఇప్పటి వరకు ఎక్కడా ప్రకటింపబడని రచనగా నాకు తోచగా, తాళపత్ర ప్రతి నుండి ఎత్తివ్రాసి ఈ రూపానికి తెచ్చాను. ఇందులో కొంత మంచి కవిత్వం ఉన్నదనే నమ్మకం నన్ను ఈ పనికి పురికొల్పగా ఈ ప్రయత్నం నేను చేశాను. మొత్తం 19 ఆకులలో (అనగా 37 తాళపత్ర పుటలలో) ఈ రచన ఉండగా అందులో 13వ ఆకు లేదు. తాళపత్రప్రతి నుండి రచనను ఎత్తి వ్రాయడంలో ఆ పుట దాకా చేరుకున్నాక గాని ఆ సంగతి నాకు తెలియకపోవడం నాకు బాధ కలిగించిన విషయం. అయినా సాహిత్యంతో పరిచయం ఉన్నవారికే గాక, సామాన్య ప్రజానీకానికి కూడా రామదాసు కథ స్థూలంగా తెలిసిన కథే కాబట్టి (పది, పదిహేను వాక్యాల రచన పోయినప్పటికీ) ఎత్తి వ్రాయడం కొనసాగించి పూర్తి చేశాను. ఇందులో ‘పాఛాయి’ అనే ఒక పదం ‘పాదుషాహి’ అనే మాటకు అపభ్రంశ రూపం. యక్షగానం అనగానే కొంత సామాన్యజనులు నిత్యవ్యవహారంలో ఉపయోగించే పదజాలం రచనలో చేరడం సహజం అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేని సంగతి. రచనలో ఎక్కడా పేర్కొనబడకపోవడం వలన ఈ రచనకు కర్త ఎవరో తెలియదు. భాషను బట్టి, తాళపత్రప్రతిలోని వ్రాతను బట్టి కనీసం రెండు వందల సంవత్సరాల మునుపటి రచనగా దీనిని నేను భావిస్తున్నాను. ఈ రచనను చదివిన మీదట అప్రకటితంగా నిలిచిపోదగ్గ రచనగా ఇది అనిపించదని ప్రగాఢంగా నమ్ముతూ, ఈ రచనను ఇప్పుడు మీ ముందుంచుతున్నాను.


రామదాసు చరిత్రం

ద్విపద.
శ్రీరమారమణుండు-చిద్విలాసుండు
కరిరాజు వేల్పు శ్రీ-ఖగవైరి తలపు
పాకశాసన వినుతు-పావన చరిత్రు
కమనీయ శుభగాత్రు-కంజాత నేత్రు
జలధర దేహుండు-జగదీశ్వరుండు
జగతి సృష్టించను-సెలవిచ్చినపుడు
సెలవు దీసుక బ్రహ్మ-జగతి నిర్మించె
అందున నాల్గువా-రాశి మధ్యమున
పురములకె ల్లను-పొలుపొంది యుండు
హైదరాబహదురు-ననెడి పట్ణంబు
గలదు యీభువిమీన-కడురమ్యముగను
శ్రీకరమైనట్టి-చిత్ర గృహములను
ప్రాకార గోపుర-ప్రాసాద ములును
కనక శిఖరరత్న-ఖచితహర్మ్యంబులు
మహనీయ దేవతా-మందిరంబులును
వినుతికెక్కిన రమ్య-విఫణి వీధులును
శృంగార తోటలు-చిత్రశాలలును
వారాశి కెనయైన-వనతటాకములు
వేదశాస్త్రపురాణ-విద్యలన్నిటను
ఆదియై వర్తింతు-రఖిల భూసురులు
రాజులు రణపరా-క్రములు రవుతులును
ధనము మిక్కుటమగు-తగవైశ్య తతులు
అగ్రజాతులయందు-నతిభక్తి తోను
గొలిచియుండెడిశూద్ర-కూటజాతులును
మదనుని మించిన-మనుజ సంఘములు
పాఠక గాయక-బహుకవీశ్వరులు
పురుహూతుడేలేటి-పురమును బోలె
విలసిల్లియుండును-విఖ్యాతి గాను
తన ప్రతాపంబున-తానేష పాఛా
మంత్రి సామాజిక-మనుజ వర్గముల
సమ్మతిగా తాను-సంతోషముగను
ధర్మంబు తప్పక-తగరాజ్య మేల
తన మంత్రియగు-రామదాసుని బిలిచి
పుడమి పాలింపను-బూన్చెను రాజు.
నంతట కొన్నాళ్ళు-నరిగె నాపైని
హరిభక్తి గురుభక్తి-యధికంబుగాను
భద్రాచలేశ్వరు-పాదముల్ దలచి
రామదాసులవారు-రాముని భజన
సేయుచు నుండిరి-చెలువు మీరగను.

వ. అది యెటువలె నంటేను.

(యెదుకులకాంభోజి రాగం-చాపు తాళం)

రామ నీ నామమె దొరికెను మన-పాలిట సీతా ॥ప॥

రామ నీ నామమె దొరికె-మేము జేసిన భాగ్యమునను ॥అను॥

హరిహరబ్రహ్మేంద్రాదులకు-ఆదిమూలమై-వరుసతొ ఓంకారమైనది
యెరుకబడని యోగానంద భరితమై వెలుగుచున్నది ॥1॥

పిండాండ బ్రహ్మాండమైనది-శతకోటి సూర్యమండలాకారమై యున్నది
దండి తేజమున నుండి తారకబ్రహ్మమైనది ॥2॥

నామరూప సూత్రమైనది-నక్షత్రభాను సోమునితో మెలగుచున్నది
కామాది దోషములెల్ల ఖండించి వెలిగ వేసినది ॥3॥

ప్రేమ బుధులెల్ల తెలిసేది యీ-రామనామము క్షేమముతో వెలుగుచున్నది
యేమరక రామదాసుకు స్వామియాజ్ఞాపించినది ॥4॥

వ. భద్రాచలేశ్వరుని మందిరంబెటువలెనంటేను.

(శంకరాభరణము రాగం – చాపు తాళం)

యెంతో బాగై యున్నది-భద్రాచలమెంతో వింతై యున్నది ॥ప॥

యెంతో బాగై యున్నదింతంత యనరాదు
మంతుకెక్కిన భగవంతుని పురములో
వింతలు సేయువారంతలాపరబలవంతులు చెలంగున
గంతులు సురలోక శాంతులు ధరపుణ్య
వంతులు నరులు శ్రీమంతులు నవరత్న కాంతుల చాతను॥అను.ప॥

మేలుజేసి మమ్మేలు జానకీరాములు
చేతుల ముత్యాలు బోసేటి తలప్రాలు
దేశికవైష్ణవులు పూసేటి చందనాలు
రాశెడి రంగమూలు కాచెడి వనములు
కూశెడి బకములు కుచ్చుల పల్లకీలు
పచ్చల అందలాలు వచ్చిరిపుణ్య స్త్రీలు
తెచ్చిరి నివ్వటెలు యిచ్చిరి కానుకలు
మచ్చిగ చేనకులు పచ్చ కర్పూరాలు
నిత్య ధూపములు రచ్చల కోవిదులు
అచ్చుగ కిరీటాలు వరహాలు-మోహరీలు-సరాలు దొరలచె ॥1॥

యేళ్ళు కుందేటి వేటగాళ్ళు చేతుల తెగరాళ్ళు రాచకొమాళ్ళు
పొందుగ శిఖముళ్ళు జీలుగు రుమాళ్ళు కట్టిరి వన్యకాండ్లు
చెవులకు ముత్యపు జోళ్ళు చేతుల జెముదాళ్ళు
యీటెలు పదిమూళ్ళు మాటలు ముద్దు నోళ్ళు
గీటెలు కొనగోళ్ళు దీటుగ సన్నవేళ్ళు
దట్టిన మాకురోళ్ళు కట్టిన రాతిగుళ్ళు
పట్టిన మొలతాళ్ళు బెట్టుగ పాళ్యగాండ్లు
మట్టగ నడవళ్ళు నీరెళ్ళు మామిళ్ళు
పనసలు నారికేళాల ॥2॥

రాజరాజుల నగరము భూజనుల సుందరము భక్తుల వాసము
ధ్యానముసేయు తపము పూజల సందరము
మందిరము సంభ్రమము తీరుగ ఇంద్రపురము
అశ్వాల సంగద(ర)ము ఘాలి గోపురము చూచితే చోద్యకరము –
ముత్యాల తోరణము యిండ్లిండ్ల సంభరము
సంపదలక్షీకరము రాముల మనోహరము
భక్తుల వాసకరము గానము సేయు రవము
పూజల సుందరము ధ్యానము నవసరము
మందిరము సంభ్రమము రామదాసుల వరదివ్యపదముచే ॥3॥

ద్విపద:
అట్ట రాములయందు-నారామదాసు
పట్టుగా చిత్తంబు-పదమున నిలిపి
ధరణీసు నగరిలో-ధనమెల్ల తాను
సర్కారు ఖర్చులకు-సకలంబు పోగ
బాకి పైకములెల్ల-బహువిధములైన
దాన ధర్మంబులు-తగజేసె తానై
భద్రాచలేశుకు- బహువిధంబులను
నవరత్న భూషణ-నవ్య దుకూల
వస్త్రమాల్యాదులు-వరుసతో నిచ్చి
ప్రాకార గోపుర-ప్రాసాదములను
వొనరగ కట్టించి-వాసికినెక్కి
రాజ్యమేలుచునుండె – నారామదాసు.
నంతట కొన్నాళ్ళు-నరిగె నాపైని
పగవారు నేతెంచి-పాచ్ఛాయితోను
వినతిగావించిరి -వినయంబుతోడ.

(నాదనామక్రియ రాగం – చాపుతాళం)

వినవయ్య పాఛాయిగారు
మామనవి చేకొనవయ్య మహరాజు మీరు ॥ప॥

హదరతు బహదరు గారు మీ తాహతుకు చేరిన
రాయ సంస్థానంబు యేలె రామదాసుగారు
వారు జేసె రాచకార్యము వినుపించెదము, మీరు ॥1॥

బొక్కసములన్ని పాడాయ, ఆహ
మోదముతో విప్రవరుల పాలయ
దేవాలయము చక్కనాయ, యింక
తక్తుకు రూకలు రాక బాక్యాయ ॥2॥

దండికాపులు బలిశిరిందు, రామ
దాసు జేసిన కౌలేమనుకొందు
ఆరింట కొఖటిమ్మనందు, స
ర్కారు పైకము చెల్లకపాయయందు ॥3॥

దినదినమున వారియింట సేయు
విప్రవరుల సంతర్పణములు నెంత
పైకము జేసెది తంట
అవల్ దారుని యిపుడు పంపుడి మావెంట ॥4॥

రామదాసు యెరుగపొయ్యేరు
భద్రాచలమున మేము కాపురముండెవారు
రాపు శాయకు పాచ్ఛాయిగారు
మాపేరు వెలదిరాక కాపాడేరు మీరు ॥5॥

ద్విపద:
యాగతుల మాటలు విని-యా పాచ్ఛాయ…

(తోడి రాగం-ఆది తాళం)

వెడలిరి జవానులు-వేగమె భద్రాద్రికిని ॥ప॥
ధీరుడు భద్రాద్రిరామ దాసు కడకు ॥అను.ప॥

రంగుమీరిన దుస్తుపాగలన్నియు బెట్టి
తీరుగ డాల్ కత్తి మొదలుగ చాతబట్టి
హొయలుగ కుంపిని పురజనులు జూడ
వహవారె వహవాయని వాదులు జేయుచు
కరుకైన మీసముపై ఖండించి చెయివేయుచు
అదరగ బెదరగ పాచ్ఛాయి జూడగ ॥2॥

దురుసుగ భద్రాచలమున వారేతెంచి
మెరయుచునున్న రామదాసువద్దికి పోయి
బాకి పైకముగాను కాకితము చేతికిచ్చి ॥3॥

(యమునాకల్యాణి – ఆది తాళం)

ఆవ్ మ్యా మా పాచ్ఛాకడకు చల్ మ్యా ॥ప॥
నిమిషము నిను నిలువ నీయము
నిలువ లన్నియు ఝాడా పైకము
చేకొనుము వేగమె యిపుడు
జెర్బందు చేకొందుము జూడు ॥అను.ప॥

అవరంగా తక్తుకులోన నీవంటి సరదారులున్న
వారిపై బాకీలు సున్న నీపై బాకీలు శాన ॥1॥

తివాసు దిండు హొయలు తోడు బహదిరిగారి హుకుము జూడు
అట్టిట్ట విడువము నీదు మానమె కాపాడుకొ నేడు ॥2॥

జాగు శాయకు నీవు మరియాద జూచేము లేవు
కాని నిన్ను గుమ్మేము పైకము తెప్పించు వేగమె ॥3॥

అతులిత వైభోగమున గతులచే తెలియకున్న
వెలయు భద్రాచలమున రాముడె దైవమనియున్న ॥4॥

(మోహనం – చాపుతాళం)

సామాన్యుల చెంత జేరము- రామ
నామామృతము మాకు నేమము ॥ప॥

సామగానలోలు సన్నుతించితె మా
కేమి కొదువ సీతా రాముడె యున్నాడు ॥అను.ప॥

మూలకారణమున నీలీల తెలియలేని మూఢులైనవారి నొల్లము
వాలాయముగా వారిజాక్షుని కథా మేలెరుగనివారి నొల్లము
వాలలాడుచు రామ నామామృతమె జిహ్వ గీలుగొల్పనివారి నొల్లము
యాల యితరమైన పాలుమాలి జాలి రామమూర్తి పాదపద్మములె చాలు ॥1॥

కర్మాదులు జేసి గర్వమందియున్న కష్టులైనవారి నొల్లము
నిర్మలమైన నిగమగోచరు నామము మదిలేని వారి నొల్లము
ధర్మ శూన్యులైన ధారుణి లోపల వంక జొరక మేమొల్లము
మర్మ మెరిగినట్టి మదనజనకుడైన ధర్మమూర్తి రామతారకమె చాలు ॥2॥

కామాదుల చాత కలసిమెలసియున్న పామరజనుల మే మొల్లము
తామసంబు చేత తామె పెద్దలమని తత్వమెరగని వారి నొల్లము
రామరామయని రవికులాగ్రజునీ నామమననివారి నొల్లము
రామదాసు నేలు రవికులతిలకుడు ప్రేమతొ భద్రాద్రిధాము గొల్చితె జాలు ॥3॥

(రీతిగౌళ రాగం – చాపు తాళం)

రేపుమాపని నన్ను జాగుశాయకుర రామయ్య ॥ప॥
నీ దాపున నను జేర్చుకోర రంగయ్యా ॥అను.ప॥

కరిని గాచితివె రంగయ్య నా
కర్మ బంధము కోసి కడ తేర్చవయ్యా ॥1॥

భవ సంసారములో రంగయ్యా బడ్డ
పాటు యెంతని జెప్ప తరము కాదయ్యా ॥2॥

ధరలోన దాతవు నీవెనన్ను
దరిజేర్చి రక్షించు దైవము నీవె ॥3॥

పాతకముల ద్రుంచవేర భద్ర
గిరిరాఘవ నన్ను దరిజేర్చుకోరా ॥4॥

(శంకరాభరణం రాగం -చాపు తాళం)

నాతప్పులన్ని క్షమించుమీ జగ
న్నాథ నీవాడ రక్షించుమీ ॥ప॥

పాతకుడని యెంచపనిలేదు పోషించు
నాతప్పు లెన్నకు నిన్నె నమ్మితి సుమీ ॥అను.ప॥

యీయెడ నేరములెంచకు నే
నితరుల గొలిచే దెందుకు
కాయమెందుకు వేరె గాచు నీకు మ్రొక్కె
కాయమించగ కడతేర్చురా నాసామి ॥1॥

కడుపున బుట్టిన తనయునీ యెంతో
గెడుసుతనము లేనివానినీ
కొడుక రమ్మని యెత్తుకొని ముద్దులాడుచు
బడగ నూతిలోన బడదొబ్బ న్యాయమా ॥2॥

దాసుని మనవిదే సుమ్ము చక్ర
ధరుడవై మమ్మేలుకొమ్ము
భాసురముగ రామ దాసునేలిన తండ్రి
దాసభద్రాద్రినివాస నాదు సామీ ॥3॥

(ఆనందభైరవి – ఆది తాళం)

కోదండరాముడె మమ్ముగన్నవాడు మ
మ్మాదరించి పెంచి విడనాడ లేడు ॥ప॥

మోదముతో గూడుక తమ్ముని జూడు
యముడు బాధించు వేళల
మనకు వచ్చు తోడు ॥అను. ప॥

శ్రీరామ నామమె నా జిహ్వ యందు
యమదూతల పారదోలేటి పెద్ద మందు ॥1॥

పట్టాభిరాముని పట్టుబట్టినాము ఇకను
ఘట్టిగ యమునికి నామము బెట్టినాము ॥2॥

రమ్మని బిలిచితె నీవు రావదేమి
రామదాసుని రక్షించు విజయరామ స్వామి ॥3॥

(మధ్యమావతి రాగం – చాపు తాళం)

యేమయ్యా రామదాసు మీపై బాకి
పైకము దెచ్చినారా
ల్యాకనె మీరు వ్యర్థులై వచ్చినారా ॥ప॥

మాపై బాకిపైకము దేవబ్రాహ్మణపూజా దేవా
లయము పాలాయ మీ జన్మము
వాలాయముగ బాగాయ ॥1॥

దండితనము చాత మాతో జెప్పేటి మాట
యెంతకు దరతౌర నీ ధైర్యము
చాలా కూలనువేతురా ॥2॥

దండితనము యేమి దండించ పొయ్యేరు
తలకు మించి నాజ్ఞలు మీపేరెంతో
నుతులు జేతురు మనుజులు ॥3॥

మర్మమెరుగకనె మాటలాడేవు
మా బాకిపైకము విడుతుమా
చూడుము నీ ధైర్యము గనుగొందుమా ॥4॥

మర్మమెరిగినట్టి మదనజనకుని పై
బాకిపైకము లున్నదా
నా ధైర్యము జూడడమేమున్నది ॥5॥

భూమండలపతియైన నాపై గణ్యముల్యాక
మీరి మాటలాడేవుగా
నీ మర్మము ఛేదించెదము నల్కుగా ॥6॥

భూమండలపతియైన పురుషోత్తముని నమ్మి
నరులందు వెరుపేలరా
నీవల్లను భయము లెక్కడిది పోరా ॥7॥

అంధకారము వంటి బందికానలో నిన్ను
నేలగూలను వేతురా
చూడుము నీ గుండెలు తెగగోతురా ॥8॥

బందీకానలొనున్న మరి యే ఖైదులోనున్న
బాకి పైకము చెల్లునా
నా గుండెలు తెగకోయ నీకిమ్మునా ॥9॥

నరపతియన నాతోనె వాదులు శాయ
యెట ధైర్యమువల్లరా
అవురా వోరి యెవరి సహాయమౌరా ॥10॥

శ్రీపతియన శ్రీపురుషోత్తముని నమ్మి
చింతలేమియున్నవిరా
వారిని వినా యెవరి సహాయమౌరా ॥11॥

నీపాలి దైవము నిన్ను రక్షించక
నిన్నిబాధలు బెట్టునా
ఆ దైవము నన్ను బ్రోవకయుండునా ॥12॥

గతినీవెయని యుండి నెరనమ్మినవాని
బ్రోవను కరువేమి
నమ్మిన భక్తజనులకు భయమేమి ॥13॥

భద్రేశుడైన శ్రీ భద్రగిరీశుడు
నాకు ధనములీయ
రామదాసుని బ్రోవ నెలకొన్నారయ్యా ॥14॥

వ. పిమ్మట…

(యమునాకకళ్యాణి – ఆది తాళం)

అబ్బబ్బ యీ దెబ్బలకు నోర్వలేరా
వోరబ్బబ్బ యీ దెబ్బలకు నోర్వలేరా ॥ప॥

అబ్బ గొబ్బున రారా దెబ్బలెల్ల నోర్వలేరా
యెబ్బుశాయక లేర తబ్బిబ్బులాయ రావో ॥అను.ప॥

యెంతని తాళుదురన్న చెంతనె రాకనె యున్న
చింతలు నాకింతకన్న పంతము లేలర విన్న ॥1॥

అట్టె యాలర నాపై దృష్టి లేకనె పాయ
కటకటా కొట్టేరు యెట్టు తాళుదునయ్య ॥2॥

నిన్ను నమ్మినవాడు యిన్నిగాసి కోర్వలేడు
నన్ను నీవె కాపాడు వెన్నుడెవరు నీ జోడు ॥3॥

వందనములు రఘునందన బంధనమెందుకు వీడ్చవు
దండనమేల జేసేవు సింధుశయనుడవూ ॥4॥

బాయన నిన్నెడ నెంతో మాయను చాలించవయ్య
కూయను నీ మనసెంతో రాయా రామయ్యా వో ॥5॥

రార రామదాసున చేకోర యేర రఘువీరా
మారజనక శ్రీభద్రాద్రి రామ రామ యేలుకోరా ॥6॥

(పంతువరాళీ – చాపు తాళం)

యెందుకు యీ బందీఖానలొ బెట్టను
నేమి యపరాధము జేస్తిరా ॥ప॥
ముందుజన్మములందు తల్లితండ్రిగురువు లందు
ద్రోహములు నే నెందు జేసుంటినా ॥అను.ప॥

భృగుభౌమవారముల బృందావనమున
తగ తొళశి యెత్తి పూజిస్తినా
వగనాదివారమందు అశ్వత్థమునకును
ప్రదక్షిణ మొనరిస్తినా – రామయ్య ॥1॥

యిందువారమందు బిల్వమెత్తి నేను
యీశ్వరునకర్పిస్తినా
అందు భానుద్వాదశికూడిన నాడు
ఆమలకము తింటినా – రామయ్య ॥2॥

సురగృహమింగలము బెట్టెటప్పుడు
తోడుక నేనుంటినా
పరజీవనముల బాధశాయవలెనని
బిరుసున దలచుంటినా – రామయ్య ॥3॥

పరుల సంపద జూచి మనకు లేదే యని
బాధపడుచు నుంటినా
పరమాత్మ నే నిన్ను మనసున దలచితె
పాపమెల్ల నంటునా – రామయ్య ॥4॥

హరికీర్తనలు జేసే మహాత్ముల జూచి
ఆయాసబడు చుంటినా
చరమ కాలమునందు తల్లితండ్ర్యాదులకు అ
పరాధములు జేస్తినా – రామయ్య ॥5॥

వినయముతో నిన్ను మనసుననేవేళ
దలచక నేనుంటినా
అనవరతము భద్రగిరి రామదాసుని
నెనరున నేలుకోరా – రామయ్య ॥6॥

(బృందావన సారంగ – చాపు తాళం)

యింత కోపము లేలరా రామయ్య ॥ప॥
యింత కోపము లేల కోదండపాణీ
యిందిరారమణ నాపై
అంతరంగమందైన దయాలేదా ॥ప॥॥అను.ప॥

పరమ పావన రామ భాగవతప్రియ
నరరూపావతార నన్ను రక్షింతువౌరా ॥1॥

పనియేమిలేదు నీ పాదమె గతియన్న
వినలేదా భజనము నెనరున జూడుము ॥2॥

క్షీరాబ్ది శయన నీ చిత్తానదయయుంచి
రారా శ్రీ భద్రాద్రి రామదాసునేలుకోరా ॥3॥

(కాంభోజి రాగం – చాపు తాళం)

రక్షించు యిదియేమి రంతు వింతలు బుట్టె
రామచంద్ర- నీవు
రక్షించకుంటెను రక్షకు లెవ్వరు – రామచంద్ర ॥1॥

కుక్షిలో నీ మీది కోరికె బుట్టెను
రామచంద్రా – సామి
అక్షయఫలద యభిమానముంచుము – రామచంద్ర॥2॥

అప్పులవారొచ్చి అరిగట్టుకొన్నారు
రామచంద్రా – యేమి
జెప్ప శక్యముగాదు చెల్లుబడి బోయె రామచంద్ర ॥3॥

నగరి పైకములెత్తి తగనీకె యర్పిస్తి
రామచంద్ర – నన్ను
నగరివారు వీపు విరగగొట్టిరి శ్రీ రామచంద్ర ॥4॥

దయలేదా నే రామదాసుడ నను
గొంట రామచంద్రా – యికను
భయము బాపు భద్రాచలవాస శ్రీ రామచంద్ర…

(పునాగవరాళి రాగం – చాపు తాళం)

రక్షించు దీనుని రామరామ శ్రీరమణి తోడు – నను
రక్షించకుంటెను మీ తండ్రి దశరథరాజు తోడు ॥1॥

అరుదు మీరగ విభీషణుని గావలేదా నీ వల్లనాడు – అటు
కరుణించకుంటేను మీ తల్లి కౌసల్య దేవి తోడు ॥2॥

అలికులవేణి యహల్య శాపము దీర్చితివల్లనాడు, నా
కలుషములన్నియు గడపకుండిన లక్ష్మణుని తోడు ॥3॥

గిరికందరము నేలు సుగ్రీవునకు కిష్కింధ నాడు, అల
సిరులొసగలేదా మీ కులగురువు వసిష్ఠు తోడు ॥4॥

పవనాత్మజునకు చిరము దీవించవా బ్రహ్మ వీడు, ఆ
వివరముగా కృపజూడకుండిన మీ యింట తోడు ॥5॥

వోడక మీమీద యెడానలుబెట్ట వలశె నేడు – వింత
జూడకు భద్రాచల రామ నేలు నీ పదము తోడు ॥6॥

(ధనాసరి రాగం – ఆది తాళం)

యెటుబోతివో రామ యెటుబోతివో ॥ప॥
యెటుబోతివో రామ యేల నీ దయారాదు
కటకటలనైన కనిపించకున్నావేమో ॥అను.ప॥

పాపములన్ని యెడ బాపిన దొరనీవు
ఆపద వచ్చిన నన్నాదరించమంటె నీవు ॥1॥

అపరాధి నేనిచ్చట నతి మొరబెట్టలేను
నెపములనుకొన్న నేరము నే నెన్నలేను ॥2॥

అంధకారము వంటి బంధనముల నేను
నింద్యలు కొనియున్నాను ముందెడబాపు మొక్కేను ॥3॥

తానెష దొరగారు తన్కి చాలా జేస్తారు
కాసు ధనము జెల్లి బందీ కానా వీడుమన్నారు ॥4॥

నీవు శ్రీభద్రాచల నిలయుడవైతేను
బ్రోవవయ్య రామదాసుని నీవాడ నీవాడ నేను ॥5॥

(ఫరాజు రాగం – ఆది తాళం)

రామ ననుజూచితె దయరాదా, నా
సామి మీ సీతాదేవికైన జాలిగాదా ॥ప॥

నామొరాలకించి వేగనన్ను బ్రోచే భారము లేదా
నామము నీ బిరుదుగాదా
ప్రేమ లేదా యిది మరియాదా ॥అను.ప॥

నీ లోన జగములుండు….

(13వ నంబరు తాళపత్రం లేని కారణంగా ఇక్కడ రచనలోని పాఠం లోపించినది)

…. రాదాయ ॥2॥

దాసమానసపద్మ భృంగ గోపాలా చిద్వి
లాస పక్షిరాజ తురంగ శ్రీ సీతామనో
ల్లాస యింద్రనీల శుభాంగ
భద్రశైలని వాస యోగిహృదయాంతరంగ – యీ వేళరామ
దాసుని పోషించురా దయాసాగర రామ ॥3॥

(అసావేరి రాగం – మిశ్రచాపు తాళం)

రామ నీ చేతేమి గాదురా, సీతా
రామ దేవికైన దెల్పరా ॥ప॥

సామాన్యులవలె సకల బాధలు బెట్టి
నా మొరాలగించి మోము జూపవేరా ॥అను.ప॥

తల్లి తండ్రి నీవనుకొంటినా
వుల్లమున నిని నమ్ముకొంటిని
కల్లరి జనులెల్ల గావరములు శాయ
చల్లని నీ కృప చెల్లవైతివి కావ ॥1॥

శరచాపముల శక్తి దప్పెనో రామ
శౌర్యము జలధిలో జొచ్చెనో
కరుణమాలి పైకము కొరకు భక్త
వరులు జాలి జెంద మరియాదెటు బోయె ॥2॥

రావె భద్రాచల నాయకా మము
కావవె సీతానాయకా నీవెనా
పాలిటి పెన్నిధివై నీ పద సేవ జూపి
రామదాసుని నన్నేల ॥3॥

(అసావేరి రాగం – మిశ్రచాపు తాళం)

యేమో జానకి రాముని బంపవొ వో జానకి ॥ప॥
వేమారునేనెంతో వెతిగాను నీవు రాముని
యిందాక రానీయ్యవా ॥అను.ప॥

అరసి బ్రోతుననుచు ఆర్తజనులు వచ్చి
అరిగట్టాదురని యతని రానియ్యవా
కరగి చెలులు నీదు కాంతుని కనికని
కరమున నొక్కుదురని రానియ్యవా ॥1॥

మితములేని జీతమివ్వనున్నాడని
పతినిరానియ్యావా అతని సొమ్ములెల్ల
అపహరింతురని గతియని విడువరని రానియ్యవా ॥2॥

వరభద్రగిరి వెడలివచ్చె దారిలో త
స్కరుల భయమటంచు వెరచి రానియ్యవా
బరగు రామదాసు బట్టబెట్టితె మదిని
స్థిరముగ నుండునని రానియ్యవా ॥3॥

(కాంభోజి రాగం – ఆది తాళం)

అనిశము భక్తవత్సలరామచంద్ర నే
మనవి జేసెద వినుము ॥ప॥

వినుము నేను నీకు విన్నవించెద నొక
ఘనకార్య మీ వేళ అనువొందు లోకమెల్ల
కరిమొరలిడునాడు దురుసుగనేగి మ
కరి ద్రుంచితివి గదా పరమపురుష యీ
బంధమున నుండే భూసురుని రక్షింపరాదా- శ్రీరామ॥1॥

దాసపోషణ బిరు దాంకసజ్జనులను
గాసి నొందక జేయరా
యేసీమనైన దినేశ వంశజాతులు
మోసము చేకొందురా – శ్రీరామ ॥2॥

అతిపాపియైన అజామిళుగాచితివి
అతడేమి నీ చుట్టమా
పతితపావన భద్రగిరి రామదాసుని
వెతలెల్ల పోగొట్టుమా – శ్రీరామ ॥3॥

(ద్విపద – సావేరి)

ద్విపద:
భానుకులేశ్వర పరమాత్మ వినుడీ
నీ దాసుడనని నినుకోరి గొలిచి
పండ్రెండు నేండ్లాయ బందికానాలో
చెరయుండి మొరబెట్ట చెవులవినదేమి

(శ్రీరాగం – మిశ్రం)

విని వేగ జవానుల వేషము దాల్చి
వెడలిరి రామ లక్ష్మణులు ॥ప॥

మనవి చేకొని చాలా ధనము గైకొని
నెనరున దాసుని బ్రోవమనిన దేవి బల్కుల ॥అను.ప॥

తిరుమణి తిరుచూర్ణంబులు దిద్దిరి
దివ్యతరములైన తొడుగులు తొడిగిరి
శరముల విండ్లంబులెల్లను బట్టిరి
కత్తి డాల్ పైఠాని పాగలె గట్టిరి
బరగు నవరతనాల సొమ్ములు
పతకములు హారములు మెరయగ
గరిమ మీరగ బ్రహ్మాది సురులు
పొగడగ బెట్టు మొరలను ॥1॥

శృంగారముగను నంగీలు తొడిగిరి
రంగగు దట్టనిజారులు గట్టిరి
పొంగుచు జరదారి పాగలె బెట్టిరి
బంగారు దస్తురుమాల్ పైజుట్టిరి
ఉంగరమ్ములు వేళ్ళను నొనరంగ
చెవుల వజ్రాల పోగులు
ముంగురులు నసియాడగను దివ్య
మంగళ మూర్తులై మొరలను ॥2॥

ధనము చేకొని సాధారణ మానవులన
గను కన్నులు మూసిన మాత్రము లోన
జనగ తానెష యున్న యవరంగా నగరమున
వొనరు నంతఃపురమున వొనగ జొచ్చిరి తన
పనిగలదు తలుపుతీయంచు భద్రగిరి నిలయులంతెంతంని
ధనమిదుగో గైకొనుమని రామదాసు బెట్టు మొరలెల్ల ॥3॥

ద్విపద:
వెడలినరామలక్ష్మణులు వెలుగంగ
ముడిగొన్న పాఛాయి ముందుగా నిలువ
దిగ్గన తానేష దిగులుబడి లేచి
గుండెలు ఝల్లన గురుతుగా జూచి
యెవరు మీరిరువురు నిందు వచ్చితిరి

(శంకరాభరణము – చాపు)

యెవరి జెవానులు మీరు మి
మ్మెవరు బంపగ వచ్చినారు ॥ప॥

ప్రవిమల మతులార పరమపావనులార
వివరించి మాకు మీ వివరము దెల్పుడీ ॥అను.ప॥

వినవయ్య పాఛాయగారు మీకు
ధన మియ్యమని బంపినారు
ధనము కొరకు రామదాసుగారుని మీరు
పనులెరుగకనె యీ బందికముల నుంచినారు ॥1॥

యెవరైతె మీరేమి పాఛా మ
మ్మెవరంపితేనేమి పాఛా ॥ప॥

యెందుకు బంపించినారు మీ
రెందుకు యిటువచ్చి నారు
అందుమీరేమి పనులు శేయుచుందురు
యిందు యీరాత్రి రావచ్చునా మీరు ॥2॥-॥యెవరి జవానులు॥

ధనము జాళెలు నిచ్చినారు మీకు
ధనము చెల్లించమన్నారు
పని యేమి తర్కింప పైకము లెక్కబెట్టు
కొని గ్రక్కున నిపుడు మముబంపుడీ ॥3॥-॥యెవరైతె మీకేమి॥

యేమి కులము వారు మీరు మీ
రిద్దరు యెవరు సదారు
యేమి నామముగల వారయ్య మీరు
యేమి నేమమునుండెవారలు దెల్పుడీ ॥4॥-॥యెవరి జవానులు॥

అర్కకులజులము మేము మే
మన్నదమ్ముల మిద్దరము నిక్కము
రామోజి లక్ష్మోజి నామము
మక్కువ రామానుజ మతము గలవారము ॥5॥-॥యెవరైతె మీకేమి॥

యెన్ని దినములాయ మీరు వారి
కే కొల్వుగారై యున్నారు
యెన్ని జీవనములు మీకిచ్చి నారు
యేమి జీతములిస్తునారయ్య దెల్పుడీ ॥6॥-॥యెవరి జవానులు॥

తాతమా తండ్రియు మేము మూడు
తరములుగ గొల్చి నాము
పాత సందము కొని బ్రతికి కుదిరి
భేటికి వచ్చియున్నాము మము
పాటించి పరీక్షింప రాము
యేటికి మాగుట్టు నెరుగవలయు మీరు
మేటిగ నెవరైతె మీకేమి కార్యము ॥7॥

యేమని జెప్పుదుమయా మీ
రెవరని తెలియలేదాయ
శామించి పైకము లెల్లను తెస్తిరి
యేమో అతిశయము యీ రాత్రిగన్నామయా…. ॥8॥

(సమాప్తము)