గృహ ప్రవేశం

చిన్నప్పుడు మా ఇంట్లో
పెరిగిన
రెక్కల్లో బొక్కల్లో
ఎదిగిన
మా నడిపి మనుమరాలు
ఐదో తరగతి చదువుకుంటోంది

ఇప్పుడు మా దగ్గర కాకుండా
ఉదయం సకాలంలో తయారై
స్కూల్‌కు పోవడం
సాయంత్రం హోవర్క్
చేసుకోవడం

మూడు నాలుగు నెలలుగా
వాళ్ళ అమ్మ ఇంట్లోనే
ఉంటుంది

ఎవరూ పిల్లలు రాని
సందడి లేని ఇంట్లో
నేనూ వాళ్ళ అమ్మమ్మ
పిల్లి పట్టిన కోడిపిల్లలా
బుగులు దిగులుగా…

శనివారం సాయంత్రం
చుట్టపు చూపుగా వచ్చింది

రావడం రావడంతోనే
గారాబం మాటలతో
పాత ఇంటికి సున్నం జాజూ
పూసినట్టయింది

తన చిట్టి చిట్టి చేతలతో
ముద్దు ముద్దు మాటలతో
ఆమె అడుగు పెట్టగానే పెద్ద
దర్వాజకు
పచ్చని మామిడాకు తోరణం
కట్టి
పెద్ద కడపను
పూదిచ్చినట్టయింది
ఇల్లు సరికొత్త కళతో
ఒక్కసారి
తొణకిసలాడిపోతున్నది

చాలా రోజుల తర్వాత
మనమరాలు రాకతో
మళ్ళీ కొత్త ఇంట్లోకి
మేము కొత్తగా
పోయినట్టయింది