తిరుగుతున్ననంటే తిరుగుతున్న
తింటున్ననంటే తింటున్న
మనసుల మనసులేదు
మంచిగున్నవంటే ఉంటున్న
మాట్లాడుతున్ననంటే మాట్లాడుతున్న
ఎంత చెప్పుకున్నా మనసు నిండుతలేదు
ఇవతలకు కనబడిన దెబ్బలు
తాకిన పెయ్యంతా పునికితే
ఎండిన ఊరుకాలువ చెయ్యితోని
దగ్గరకు తీసుకున్నట్టయింది
కనుగుడ్లల్ల నీళ్ళు తీసుకు
గుండెల్ల దాసుకున్నట్టయింది
చేపిన పొదుగు నుంచి ఎడబాపిన
తల్లీ పిల్లల పుల్లందల
అవ్వా! నన్ను మోసి కనిపెంచిన ఊరూ!!
ఏడ పిల్లబాటల కూడ కలిత్తిమి
ఎట్ల జాడపడకుండా కాటగలిత్తిమి
మంచి సోపతి అనుకున్న – తొవ్వ కడుపుల
ఇంత ఇషముందనుకోలేదు
మంచి మనిషనుకున్న – మనిషి మదిల
ఇంత కపటముందనుకోలేదు
‘గడి’ పాడు పడి
పట్నంల అగ్గిపెట్టెల ఇండ్లైపాయె
ఆస్తి అమ్ముడుపోయి
పట్నంల తీరొక్క కంపిండ్లైపాయె
కొనపానంతో ఉన్న ఊరు
పట్నంల లేబర్ అడ్డై
పనికోసం పబ్బతి పట్టె
తొంగి చూసినోడు లేడు
నొప్పి ఏందని ఇషారిచ్చినోడులేడు
గడియ ఇరాం లేదు గవ్వ రాకడలేదు
ఉరిమి చూడకుండానే ఉసురుపోతుంది
తెలుగు తెలుగంతా పాలిషు భాషయ్యింది
తెలంగాణ తెలంగాణంతా పోలిసు ఠాణా అయ్యింది
మనోడు లేదు మందోడు లేడు
అందరూ అందినకాడికి నిండా ముంచిండ్రు
ఆయోడు కాదు భాయోడుకాదు
అందర్ని నమ్మిన పాపానికి
ఎర్రటి ఎండల నిలబెట్టిండ్రు
ఎవలు బరిపూర్తిగ కమాయించిరి
ఎవలు మస్తుగ గుమాయించిరి
తెలిసినోనికి తెలుకపిండి
తెలువనోనికి గానుగపిండి
ఇన్ని వేలమంది వీరుల
నెత్తుటి సాకపోసినంక గూడా
మల్ల దొరలే ఏదో ఒక కొత్త ఏశంల
ఎందుకు చలాయిస్తుండ్రో అర్థం గాదు
ఎప్పుడు ఎట్లా జరిగిందో తెలువదు
ఎక్కడ ఏమో ఎరుకలేదు
మొత్తానికి టక్కరయ్యింది
నిండు అన్నంగిన్నె మోసే చెరువు నెర్రగీల పదింది
ఏడ్సినప్పుడు ఊకుంచే ఉయ్యాల తెగిపోయింది
గోరుముద్దలు తినిపించే చందమామలు
బతుకునుండి బొత్తిలకు మాయమయ్యాయి
జో అచ్చితానంద రారా పరమానంద
పాటలు జీవితాల నుండి కానరాకుంట ఎగిరిపోయాయి
మనిషిని సర్కార్ టక్కరిచ్చింది
ఇంటిని టీ.వీ. టక్కరిచ్చింది
ఊరును డాంబర్ రోడ్డు టక్కరిచ్చింది
తెల్లారి లేత్తే చక్కర్లే చక్కర్లు
ఇయ్యాల పండుపుండోలున్న
ఎడ్డి నా నేలనూ నా గాలినీ నా నీరునూ
భుజం మీద చెయ్యేసి
బుదరకిచ్చిన మారు మోసం
టక్కరిచ్చింది! టక్కరిచ్చింది!!
లోకాన్ని బొంకిచ్చి బోర్లేసే అమెరికానే
భూమి భూమినంతా
ఆగం చేసింది! ఆగంచేసింది!!