ఒక వర్షం కావాలి

దిగాలుగా ఉన్న
మొక్కల వేర్లకు
ప్రేమగా చనుబాలు పట్టి
తలనిమిరే వర్షం

పగిలిన పుడమి పెదవులపై
తొలకరి పన్నీటిని
చిలకరించే వర్షం

గొంతెండిపోయిన బోర్లను
నిలువెల్లా ముంచెత్తుతూ
ధారలుధారలుగా కురిసే వర్షం

తలవాల్చిన పైర్లకు
ఆకుపచ్చ రంగునద్ది
ఆరోగ్యంగా నిలబెట్టే వర్షం

ఒక వర్షం కావాలి


అక్కడ ఉత్తర దిక్కును చుట్టుకుని
పీక నులిమేస్తోంది వర్షం
రహదారులతో పాటు ప్రాణాలను మింగి
భీభత్సనృత్యం చేస్తోంది వర్షం
పగ పట్టిన పాములా
బుసలు కొడుతోంది వర్షం


కన్నెత్తి ఇటు చూడని వర్షం

నలుపు మేఘాలు ముఠాలుగా
సూర్యుడితో యుద్ధం ప్రకటిస్తున్నా
ఒక్క చినుకు బహుమతిని
ఇక్కడి నేలకు ఇవ్వని వర్షం

ఒక వర్షం తప్పక కావాలి

అలిగిన చెలిలా
ఆమడదూరాన నిలబడ్డ వర్షమా!
నువ్వు రావాలి
నింగి నుండి పూలజల్లులా
నువ్వు రాలాలి
చూర్ల నుండి
చిటపటల సంగీతాన్ని
నువ్వు పాడి తీరాలి

దోబూచులాడుతూ
ఆశలు పెడుతున్న
నువ్వు రావెందుకు
దివారాత్రాలు
వానకలను మోస్తూ తిరిగే
నా దాహం ఎప్పటికి తీరేను?