ఇందాక అలమర అరలో
చేయి పెడితే
కళ్ళలో పడిందొక కాగితం
ముఖమంతా మాపుతో
నలిగిన పువ్వులా ఉంది
అంత భద్రంగా
లోపల దాచుకున్నానంటే
బహుశా కోహినూర్ వజ్రంకన్నా
విలువైనదే అయ్యుంటుంది
నాలుగైదు ఏళ్ళకు పైగా
మూలబడిందేమో
నా స్పర్శకు
దాని పెళుసుబారిన దేహం
కాస్తంత కలవరపడిన మాట
నిజం
అంతటి సంపదను
అపురూపంగా ఎత్తుకుని
మురిపెంగా చూపులతో
మృదువుగానే తడిమాను
అక్షరాల వెంట
ఆత్రంగా పరుగులు తీస్తూ
వాక్యాల నదిలో
మునకలేస్తుంటే
కాలం కర్పూరమై కరిగింది
బాగా మాగిన పండులాంటి
పాత కవిత్వం కదూ
ఆనాటి జ్ఞాపకాలు
అంతటా ఒలికి
గుండెగదిలో పరిమళం
ఒక్కసారిగా గుప్పుమంది!