నిన్ను ఎవరైనా పలకరిస్తే

నిన్ను ఎవరైనా పలకరిస్తే

రాతి అరుగుపై కురిసిన రాత్రి వర్షాన్ని
పుల్లల చీపురుతో
ఊడ్చావు. పాత గుడ్డతో తుడిచావు –

తడిచిన తెల్లని కాగితం లాంటి కాంతి –
చెట్లనీ, నిన్నూ
బ్రతికించే చల్లని గాలి. నీ ఎదురుగా

చినుకులని నిలుపుకున్న గులాబీలు
నిన్ను ఎందుకో
మరి అస్థిమితానికి గురి చేస్తే, నువ్వే

అక్కడ! వెలసిపోయినా పాత చీరలో
కళ్ళు చికిలించి
పగుళ్ళిచ్చిన అరిపాదంపై పెగిలిన

చర్మాన్ని, నీ వొణికే వేళ్ళతో లాగుతూ
గేటు వంకా, ఆపై
వీధి వంకా, మాటి మాటికీ చూస్తూ –


రాతి అరుగుపై, వర్షం వెలసిన రాత్రై
తడిచిపోయి
ఉన్నావు. ఒక్కదానివే మిగిలావు

ఎవరైనా వచ్చి పలకరిస్తారా అని…

ఎవరైనా వస్తారా అని

ఎవరైనా వస్తారా అని, ఎదురు చూస్తున్నావు –
నీ ఎదురుగా, ఎన్నో
ముడుతల ఖాళీ చేతుల సాయంత్రం!

దప్పికతో సన్నటి గాలి. ఇక నువ్వు కూర్చునే
రాతి అరుగుపై, ఒక
కప్పూ, ఫోన్, స్క్రూ వదులైన కళ్ళజోడు –

తేమ పట్టినట్టుగా అద్దాలూ ఇంకా నీ కళ్ళూ –
చీర కొంగుతో మరి
ఎన్నిసార్లు తుడిచినా ఏదీ స్పష్టం కాదు

నువ్వు ప్రేమించిన వాళ్ళూ, ఆ ఇంద్రజాల
కాలమూ, నీ హృదయం
ఇప్పుడిక, పగుళ్ళిచ్చిన నీ కళ్ళజోడులాగా

వదులుగా, అస్పష్టంగా, ఎన్నో మరకలతోనే
వణికే నీ చేతుల్లోకీ
సాయంకాలం రాత్రిలోకీ, దిగులుతోనే…


ఎవరైనా వస్తారా అని, ఎదురు చూస్తున్నావు –
నీ ఎదురుగా, ఎన్నో
గాయాల, నీడలు అల్లాడే ఖాళీ రాత్రి –

నీ వెనుక, బూజుగా వెలుతురు వేలాడే ఇల్లు –
నీతో చివరికి ఇక
తోడుగా, శుక్లాల కళ్ళతో, వొణికే వేళ్ళతో

నువ్వు వెదికి వేసుకునే, నిద్రమాత్రలు!

(from upcoming Madre: Revised Edition)