ఎవరైనా అడిగితే…

ఎవరైనా అడిగితే
చెవి కోసి ఇద్దామనుకుంటా
ఇంకా అడిగితే
తొడకోసి.

అయినా
నేనేమైనా వాన్ గోనా?
డేగలే కనపడని
నియంతలకాలం
అంతా అసంయుక్త హల్లులమయం

చట్రాల్లో బతికే మనుషులకి
చట్టాలు తెలుస్తాయేమో గాని
చిత్తాలు తెలియవు

ఇవ్వడానికి తలనీలాలా?
లాభనష్టాల బేరీజు వేసుకుని
దేవుడితో బేరాలాడుకొని
ఇచ్చిపుచ్చుకోవడాలు
సర్దుబాటు చేసుకొని

ఇంతకీ, ప్రేమ
దాపరికాలు, అంతరాలు
దాటిన అలౌకిక చర్యేనా?
మనం మనల్ని మరిచే
కాలంలోనే ఉన్నామా?


ఇంద్రప్రసాద్

రచయిత ఇంద్రప్రసాద్ గురించి:

ఆవంత్స సోమసుందర్ అంతేవాసిగా సాహిత్యంతో ప్రారంభమయిన ఇంద్రప్రసాద్ గారి సాహిత్య ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నడిచి వచ్చిన దారి (కవిత్వం 1993), కాలం సైకత తీరం (కవిత్వం 2023), మూడు పడవలు (కవిత్వం 2024) అనే సంకలనాలను ప్రచురించారు.

 ...