వీధి అరుగుపై…

ఆమె వీధి అరుగుపై కూర్చుని
దారిన పోయే అందరినీ పలకరిస్తుంది
ఎలా ఉన్నారనో
ఏం చేస్తున్నారనో అడుగుతుంది
తోచిన మాటలేవో
వడపోత లేకుండా మాట్లాడుతుంది

ఊరికే మాటల కోసం ఆమె
మనుషుల్ని కదిలించటం కోసం ఆమె
బ్రతికి ఉన్న స్పృహ ఏదో
తనలో, మనలో మేల్కొలపటం కోసం ఆమె

మనుషులు
కాలువలో నీటిలా వెళ్ళిపోతూ వుంటారు
ఆమె ఒడ్డున నిలబడి
నీటిలోకి నీడని పరిచిన చెట్టులా పలకరిస్తుంది

ఇప్పుడేమీ అనిపించకపోవచ్చు
వినేవాళ్ళకి కాస్త విసుగు పుట్టవచ్చు
ఆమె అరుగుపై కనిపించని రోజుల్లో
అక్కడి వెలితి కాళబిలంలా
జీవనకాంతిని పీల్చుకొన్నపుడు తెలుస్తుంది

ఇన్నాళ్ళూ అక్కడ కూర్చుని మాట్లాడింది
ఆమె కాదని, జీవితమని.


బివివి ప్రసాద్

రచయిత బివివి ప్రసాద్ గురించి: హైకూకవిగా, తాత్విక కవిగా సుపరిచితులు. మూడు హైకూ సంపుటాలు: దృశ్యాదృశ్యం, హైకూ, పూలు రాలాయి; నాలుగు వచన కవితా సంపుటాలు: ఆరాధన, నేనే ఈ క్షణం, ఆకాశం, నీలో కొన్నిసార్లు ప్రచురిత రచనలు. హైకూ సాహిత్యానికి గాను మచిలీపట్నం సాహితీసమితి అవార్డు, ఆకాశం సంపుటికి ఇస్మాయిల్ అవార్డుతో సహా మూడు అవార్డులూ వచ్చాయి. సంపుటాలన్నీ బ్లాగులో ఈ-పుస్తకాల రూపంలో చదవవచ్చును. ...