ఎవరో ఎందుకో నిన్ను

ఎవరో ఎందుకో మరి నిన్ను ప్రేమిస్తారు
నీ చుట్టూ ఒక గూడు
అల్లుకుంటారు. ఒక పిచ్చుకలాగా

రెక్కలు కొట్టుకుంటూ, నీ పరిసరాల్లోనే
‘కీ కీ’ మని మరిక
తిరుగుతూ ఉంటారు. నువ్వు మరి

ఎక్కడికి వెళ్ళినా, తల్లి వెనుక వడివడిగా
అంబాడే శిశువులా
నిన్ను చూస్తో, నీ వెంటే ఉంటారు –

వాళ్ళ శరీరాల్లో, పిల్లల వాసన అప్పుడు!
వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళలో
గాలికి, లీలగా ఊగే పూలు అప్పుడు –

“ఒక పిల్లిలాగా, ఊరికే నిన్ను రాసుకుని
తిరగాలని ఉంది”
అని నీతో అంటారు వాళ్ళు అప్పుడు –

వాళ్ళ పెదాలపై నవ్వు, సూర్యరశ్మిలాగా
వేపపూతలాగా మరి
మెరుస్తుంది అప్పుడు! ఎవరో మరి

నిన్ను ప్రేమించినప్పుడు, నీ ఒడిలోకలా
జారి, నిశ్చింతగా
వాళ్ళు నిద్రలోకి జారిపోయినప్పుడు

మధ్యలో ఎందుకో ఆ కనురెప్పలు తెరచి
ఎరుపు మొగ్గల్లోంచి
నిను చూస్తో, చిన్నగా నవ్వినప్పుడు

నీ చేతిని తమ చేతిలోకి తీసుకుని, తిరిగి
కళ్ళు మూసుకుని
ఆ భద్రతలో ఎటో తేలిపోయినప్పుడు!


ఎవరో ఎందుకో మరి, నిన్ను ప్రేమిస్తారు
తమ శరీర స్పృహ
లింగ స్పృహ లేకుండా, ‘ఉంటారు’ –

ఊరికే నిన్ను ముద్దులు పెట్టుకుంటారు
ఒక కుక్కపిల్లలాగా
నిన్ను చూడగానే ఎగిరెగిరి నవ్వుతారు

ఎందుకో చెప్పకుండా కళ్ళ వెంబడి ఇక
నీళ్ళు పెట్టుకుంటారు
మాట్లాడకుండా అట్లా కూర్చుంటారు!


ఎవరో ఎందుకో మరి, నిన్ను ప్రేమిస్తారు
బ్రతికున్నావని
గుర్తు చేసి, నీకు నీడ లేకుండా చేసి

జాడ లేకుండా, చెట్టుకు వేలాడే ఒక ఖాళీ
ఊయలగా నిన్ను
మార్చి, నిన్నొదిలి ఎటో వెళ్ళిపోతారు!