వంద కుర్చీలు

అమ్మ చావుబ్రతుకుల్లో ఉందన్న సంగతి కుంజన్ నాయర్ వచ్చి చెప్పాడు. సాయంత్రం ఆఫీసునుండి బయలుదేరే సమయం. మిగిలిపోయిన కొన్ని ఫైల్స్ చూసి సంతకాలు చేస్తున్నాను. నా ఎదురుగా రమణి నిల్చుని ఉంది. చివరి ఫైల్‌లో సంతకం చేసి “ఒకసారి సరిచూసి పంపించమని రామన్ పిళ్ళైకి చెప్పు. ఈరోజే వెళ్ళిపోతే మంచిది” అని పెన్ను కింద పెడుతూ సలూన్ డోర్ రెక్కల బయట అతను నిల్చుని ఉండటం చూశాను. “ఏంటి విషయం కుంజన్ నాయర్?” అని అడిగాను.

బైటనుంచే అతను రమణి ఉందన్నట్టు కళ్ళతో సైగ చేశాడు. నేను రమణిని వెళ్ళమన్నట్టు తల ఊపి అతణ్ణి లోపలికి రమ్మన్నాను. కుంజన్ నాయర్ రమణి వెళ్ళేంతవరకూ మాట్లాడకుండా, రహస్యం చెప్పే ధోరణిలో ముందుకు వంగి “సార్, మీకు ఒక కబురు చెప్పాలి. ఎలా చెప్పాలో తెలీడం లేదు… నేను పొద్దునే విన్నాను. మధ్యాహ్నం ఎండలో సైకిలేసుకుని కోట్టాఱుకు వెళ్ళి చూసి వచ్చాను. విషయం ఏంటంటే నేనే స్వయంగా చూశాను. బాగా వయసు మళ్ళి అస్తవ్యస్తంగా ఉన్న ఒక ఆడామె…” అన్నాడు.

నేను ఊహించగలిగినా అప్రయత్నంగా “ఎవరు?” అని అడిగాను.

“సార్, మీ అమ్మగారండి. కోట్టాఱు షెడ్లో బిచ్చగాళ్ళకు మధ్య పడుకోబెట్టి ఉన్నారు. కనీసం చాప కూడా లేదు. కటికనేలమీద పడుకోబెట్టి ఉన్నారు. చిరిగిపోయిన చీర. తుంగగడ్డి చాప కొని పడుకోబెట్టమని ఒక అటెండర్‌కు చెప్పి వచ్చాను. చేతిలో డబ్బు ఉండి ఉంటే వాడికిచ్చి మంచి చీర కొని…”

నేను “ఎక్కడ?” అని లేచాను.

“సార్, కోట్టాఱు పెద్ద ఆస్పత్రి. ఆస్పత్రి అంటే అదేం ఆస్పత్రి కాదు. అక్కడ గాడిదల సంత పక్కన ఒక ఆస్పత్రి ఉంది కదా, పాడుపడిన షెడ్లు నాలుగైదుంటాయి. మూడో షెడ్ వరండాలో చివరి స్తంభం పక్కన పడేసున్నారు. మా బామ్మర్ది ఒకడు అక్కడే టీ కొట్టు నడుపుతున్నాడు. వాడు చెప్తేనే తెలిసింది.”

నేను పెన్ను జేబులో పెట్టుకుని కళ్ళజోడు, కొన్ని కాగితాలు బ్రీఫ్‌కేసులో సర్దుకొని బయలుదేరాను.

కుంజన్ నాయర్ నా వెనకే పరిగెట్టుకుంటూ వచ్చి అన్నాడు. “సార్ సార్, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే… వద్దు సార్, బాగుండదు. ఇప్పటికే జనం తోచింది తోచినట్టు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీరు వెళితే మురుగు మీద రాయేసినట్టవుతుంది సార్. ఇప్పటివరకు నేను ఎవరితోనూ ఒక మాటైనా చెప్పలేదు. జనాల నాలుకలకి నరాలుండవు. వాళ్ళ నోళ్ళల్లో మీరు నానొద్దు. నేను చూసుకుంటాను. విషయం మూడో మనిషికి తెలియకుండా అన్నీ చేసుకోవచ్చు. ఖర్చులకు మాత్రం ఇవ్వండి చాలు. మీరు ఇంటికి వెళ్ళండి సార్. ఇది మీకు తెలియనే తెలీదనుకోండి.”

“నాయర్, మీరు ఇంటికెళ్ళండి… నేను చూసుకుంటాను” అని చెప్పి నేను బయటకు నడిచాను.

నేను ఆఫీసులోనుంచి నడిచి బయటకి వెళ్తుంటే అందరి చూపులూ నా వీపున వాలాయి. ఇదేమీ కొత్త కాదు! నేను ఎప్పుడైతే తెల్లచొక్కా వేసుకోవడం మొదలుపెట్టానో అప్పటినుండి నన్ను పొడుస్తున్న చూపులే అవి. అక్కడ ఉన్న అందరూ చులకన దాచని నవ్వుతో నాకేసి చూసి వెంటనే ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పెదవులు మాత్రం కదుపుతూ, మాటలు వినబడకుండా మాట్లాడుకున్నారు. నా వెనకే వచ్చిన నాయర్, చేతులతో సైగచేస్తూ ఏదో చెప్పబోతే రమణి తలవంచుకుని నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని కిసుక్కుమని నవ్వింది.

నేను కారెక్కాను. కుంజన్ నాయర్ కార్ వైపుకు వంగి “నేను కావాలంటే సైకిలేసుకుని వెనకే వస్తాను సార్” అన్నాడు. వద్దనేసి కార్ స్టార్ట్ చేశాను. అతను కనుమరుగయ్యి, కారు ఆఫీసు దరిదాపులు దాటి రోడ్డు రద్దీలో కలిసిపోయేంతవరకూ నేను బిగుసుకుపోయున్నాను అన్న విషయం స్టీరింగ్ పట్టుకున్న చేతుల పట్టు సడలినప్పుడు మాత్రమే గ్రహించాను. దీర్ఘంగా నిట్టూర్చి తేలికబడ్డాను. సిగరెట్ వెలిగించుకోవాలనిపించింది. అయితే జేబులో గానీ, కార్లో గానీ సిగరెట్లుండవు. సిగరెట్లు ఎక్కువ కాలుస్తున్నానని శుభ విధించిన కట్టుబాటు చర్యలలో ఇదొక భాగం.

చెట్టికులం జంక్షన్‌లో బడ్డీ కొట్టు పక్కనే ఆగి కార్లోనుండే ఒక పేకెట్ విల్స్‌ కొనుక్నున్నాను. పొగ విడిచినప్పుడు నాలో ఉన్న కంగారు పొగతోబాటు బయటకు వెళ్ళిపోతున్నట్టు తోచింది. ఆ జంక్షన్‌లో నిలుచున్న పోలీసు నన్ను చూడగానే గాభరాపడుతూ సర్దుకుని సెల్యూట్ చేశాడు. కారు డౌన్‌లోకి దిగి కోట్టాఱు కూడలి చేరుకుంది. ఆ మలుపులోనే హాస్పిటల్. దాన్ని దాటాక గాడిదల సంత అని విన్నాను. ఎప్పుడూ అక్కడకి వెళ్ళింది లేదు.

హాస్పిటల్ వాకిట నా కార్ ఆగగానే అక్కడున్న సిబ్బంది హడావిడిగా లోపలికి పరుగుతీశారు. జనాలను క్రమపద్ధతిలో పెడుతున్న చప్పుళ్ళు. గద్దింపులు. కొందరు పరుగులు తీస్తున్న చప్పుడు. లోపలనుండి ఇద్దరు డాక్టర్‌లు నా కారు వైపుకు పరిగెట్టుకుని వచ్చారు. నేను దిగగానే “గుడ్ ఈవెనింగ్” అన్నాడు వారిలో మధ్యవయస్కుడు.

“నేను ఇక్కడికి ఒక పేషంట్‌ను చూడటానికి వచ్చాను” అన్నాను.

“ఇక్కడా సార్!” అని ఆశ్చర్యపోతూ అడిగిన డాక్టర్ “ఇక్కడ అయుండదు సార్, ఇక్కడంతా…” అనబోయాడు.

“ఇక్కడే” అన్నాను.

“సార్, ఇక్కడందరూ మునిసిపాలిటీ నుండి తీసుకొచ్చి పడేసినవాళ్ళు. బిచ్చగాళ్ళు, యానాదులు, ఇలాంటివాళ్ళే ఉంటారు.”

“ఉహుఁ” అని “ఇక్కడ మూడో షెడ్ ఎక్కడ?” అని అడిగాను.

“నేను చూపిస్తాను సార్” అంటూ డాక్టర్ నాతోబాటే వచ్చాడు. మొహమాటంగా “అందరూ దిక్కూదివాణం లేని కేసులు సార్. ట్రీట్‌మెంట్లేం పెద్దగా ఇవ్వం. కొంచం ఆహారం, జెనరల్ ఆంటీబయాటిక్‍లూ ఇచ్చి చూస్తాం. కొన్నిసార్లు తేరుకుంటారు. కొందరు ఒకటి రెండు రోజుల్లో పోతారు. ఫండ్స్ చాలా తక్కువ సార్. స్టాఫ్ కూడా లేరు. వీళ్ళని పాకీపనోళ్ళు తప్ప మరో స్టాఫ్ ముట్టుకోలేరు” అన్నాడు.

నేను మాట్లాడకుండా నడిచాను.

“చాలా ఎక్కువ క్రౌడ్ సార్. వర్షాకాలం కదా, చెమ్మలో పడుండటంతో జ్వరం, జలుబు, సన్నిపాతం వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు. వీళ్ళందరూ యానిమల్స్ లాగే సార్. ఒకరు పోతే ఇంకొకరు పట్టించుకోరు. అలానే వదిలేసి వెళ్ళిపోతారు. జబ్బుచేసి రోడ్లమీద పడివున్న వాళ్ళను పాకీవాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంటారు…” ఆ ఆవరణంతా ఊరకుక్కలు రకరకాలుగా పడుకుని ఉన్నాయి. ఒళ్ళంతా పిడుదులు నిండిన ఒక కుక్క నన్ను చూసి గుర్రుమంది. షెడ్ల వరండాల్లో కూడా కుక్కలు తిరుగుతూ ఉన్నాయి.

ఆ షెడ్లలో ఎక్కడా చెక్కసామాను లేదు. ఎప్పుడో దేనికోసమో నిర్మించిన పెంకుల షెడ్లు. పెంకులు పాతపడి, పైకప్పు వాసాల సందులలోంచి లోపలికి ఎండ పడుతోంది. కింద వేసిన ఎర్రటి గచ్చు పెచ్చులు రేగిపోయి కొరుకుడు పడిపోయి ఉంది. ఆ గచ్చుమీద అక్కడక్కడా తాటిబెల్లం ఆరబెట్టడానికి వాడి పడేసిన మొరటు తాటాకు చాపలు, ఎరువు గోతాల సంచులు, వాటిమీద చెత్తలా మనుషులు పడున్నారు. వారి మధ్య కూడా కుక్కలు తిరుగుతున్నాయి.

వయసుడిగిపోయిన మగవాళ్ళు, ఆడవాళ్ళు. చిక్కి, ఎముకలకు అతుక్కుపోయిన చర్మంతో, ముడతలుపడి తడారిపోయిన ముఖాలు. చాలామంది స్పృహ లేకో, నిద్రపోతూనో ఉంటే, మేలుకుని ఉన్న కొందరు గట్టిగా కేకలు పెడుతూ, మూలుగుతూ, చేతులూ కాళ్ళూ కదుపుతున్నారు. అక్కడంతా దుర్వాసన, కడుపులో తిప్పుతూ వాంతి అయేటంతగా. కుళ్ళిపోతున్న మనుషుల కండలు, మగ్గిన గుడ్డలు, మలమూత్రాలు… అన్నీ కలగలిసిన దుర్వాసన అది. గియ్‍మంటూ వాలుతూ ఎగురుతూ గుంపులు గుంపులుగా ఈగలు. నేను చేతిరుమాలుతో ముక్కు మూసుకున్నాను.

“అందరూ ముసలీ ముతకా సార్. చాలామందికి ఒళ్ళు కూడా అదుపులో ఉండదు. పడుకున్న చోటే మలమూత్రాలూ అంతా… ఏం చెయ్యలేం సార్” అన్నాడు డాక్టర్.

దరిదాపుల్లో సిబ్బంది ఎవరూ లేరు. నా కళ్ళు వెతకడం గమనించి “పాకీపనులు చేసేవాళ్ళు పొద్దున్నే వచ్చి శుభ్రం చేసి మందులిచ్చి వెళ్ళిపోతారు. సాయంత్రంపూట రారు సార్. వాళ్ళు మందుకొట్టి నిద్రపోతారు” అని తన జవాబును సమర్థించుకోడానికి ప్రయత్నించాడు.

మూడో షెడ్డు చివరి స్తంభం పక్కన అమ్మ పడి ఉండటం చూశాను. ఒక తాటాకు చాప మీద వెల్లకిలా పడుకుని ఉంది. దాదాపు అచేతనంగా… నల్లటి పొట్ట బాగా ఉబ్బి ఒక పక్కకి ఒరిగిపోయుంది. చేతులు, కాళ్ళు వాచిపోయి ముడతలు మెరుస్తున్నాయి. స్తనాలు మాసిన సంచుల్లా చెరో పక్కకు వేలాడుతున్నాయి. నోరు తెరచుకుని నలుపెక్కిన ఒకటే పన్ను, పాలిపోయిన చిగుళ్ళూ కనిపించాయి. తలలో జుట్టు చిక్కుపట్టి, జడలు కట్టేసి, ఎండిన పిడకలా అంటుకుపోయుంది.

“ఈమెకు ఏమైంది?” అడిగాను.

“ఏమైందంటే… యాక్చువల్లీ ఏంటో చూడలేదు సార్. వచ్చి నాలుగైదు రోజులైంది. గుర్తులేదు. వయసు అరవైయ్యో డెబ్భయ్యో ఉండచ్చు. స్పృహ ఉండేవాళ్ళకు మాత్రమే మందులేవైనా ఇస్తాం.”

నేను అమ్మని చూశాను. అమ్మ ఆరడుగుల ఎత్తు. చిన్నతనంలో నల్లని గుండ్రటి ముఖం, పెద్ద పళ్ళతో, పొడవాటి చేతులు, కాళ్ళతో, తాటికాయల్లాంటి స్తనాలతో ఉండేది. గంటలాంటి బలమైన గొంతు. ఆమెను వీధిలో చూస్తే చిన్నపిల్లలు జడుసుకుని ఇంటి లోపలికి పారిపోయేవాళ్ళు.

ఒకరోజు సాయంత్రం అమ్మోరు గుడి వెనకనున్న ఏటి దగ్గర నుంచి నన్ను చంకన వేసుకుని పైట లేకుండా అడ్డదారిలో వస్తుంటే ఎదర ఒంటరిగా వచ్చిన వైద్యుడు కృష్ణన్‌కుట్టి మారార్ నిశ్చేష్టుడై రెండు చేతులెత్తి మొక్కి “అమ్మా! దేవీ!” అని అలా వణికిపోతూ కదలకుండా నిల్చున్న దృశ్యాన్ని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా గుర్తు తెచ్చుకునేవాణ్ణి. ఆ రోజు అమ్మ ఏదో ఆలోచనల్లో మునిగిపోయి ఉండటం వల్లనేమో అతన్ని లెక్కచెయ్యకుండా నేల అదిరేలా అడుగులేసుకుంటూ నడిచిపోయింది.

“ఏదైనా కేసు విషయమా సార్?” అడిగాడు డాక్టర్.

నా పెదవులు కదలకుండా బిగుసుకుపోయి రాళ్ళలా అయ్యాయి. నా ప్రాణం వాటిని కదిలించలేకపోయింది. కొన్ని క్షణాలు ప్రయత్నించి పెదవుల్ని నాలుకతో తడిచేసుకుంటూ తలూపాను.

“కావాలంటే పెద్ద హాస్పిటల్‌కు తీసుకెళ్ళొచ్చు సార్. బస్‌స్టాండ్ నుండి తీసుకొచ్చారు. ఆ పొట్ట చూడండి. నాలుగైదు రోజులుగా యూరిన్ పాస్ చేసినట్టు లేదు. ఇన్నర్ ఆర్గన్స్ ఒక్కోటి ఫెయిల్ అవుతున్నట్టున్నాయి. చెయ్యడానికి పెద్దగా ఏం లేకపోయినా యూరిన్ మాత్రం బయటకు తెప్పించి, అమోనియా కొంచం తగ్గిస్తే కాస్త తెలివివచ్చే ఛాన్స్ ఉంది. ఏదైనా వివరాలు కావాలంటే చెప్పించుకోవచ్చు” అన్నాడు డాక్టర్.

నేను “మిస్టర్…” అన్నాను.

“మాణిక్యం సార్” అన్నాడు.

“మిస్టర్ మాణిక్యం, ఇది…” నేనే నా రొమ్ముమీద పొడుచుకొని, తుప్పు పట్టిన ఇనుపరేకుతో గుండెను కోసుకుంటున్నంత బాధగా “ఈమె మా అమ్మ” అని చెప్పాను.

డాక్టర్ అర్థంకాక “సార్!” అన్నాడు.

నేను “ఈమె మా అమ్మ… ఇంటినుండి వెళ్ళిపోయింది. కొంచం మెంటల్ ప్రాబ్లమ్ ఉంది” అన్నాను.

కాసేపు నిశ్చేష్టుడై ఉండిపోయి నన్నూ అమ్మనూ మార్చి మార్చి చూశాడు. తేరుకుని “ఐయామ్ సారీ సార్. యాక్చువల్లీ…”

“పరవాలేదు. ఇప్పుడు నాకోసం ఒక పని చెయ్యండి. వెంటనే ఈమెకు బట్టలు మార్చి అవసరమైన ట్రీట్‌మెంట్ ఇచ్చి రెడీ చెయ్యండి. నేను ఈమెను ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకుని వెళ్తాను. ఆంబులెన్స్ కూడా రప్పించండి” అన్నాను.

“ష్యూర్ సార్!”

నేను నా పర్స్ బయటకు తీశాను.

“సార్, ప్లీజ్! మేం చూసుకుంటాం. ఇట్ ఈజ్ ఏన్ ఆనర్. సారీ సార్. మా పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి. నేను ఈ సిస్టమ్‌లో ఏం చెయ్యగలనో అది చేస్తాను” అన్నాడు డాక్టర్.

సరేనని నేను వెళ్ళి కార్లో కూర్చున్నాను.

పది నిముషాల్లో డాక్టర్ నా దగ్గరకు పరిగెట్టుకుంటూ వచ్చి “క్లీన్ చేస్తున్నారు సార్. వెంటనే యూరిన్ బయటకు తీసి ఇంజెక్షన్ ఇచ్చేయొచ్చు. అయితే హోప్ ఏమీ లేదు సార్” అన్నాడు.

“ఓకే” అని నేను సిగరెట్ వెలిగించుకున్నాను. కారు బయట నిల్చున్న డాక్టర్ కాస్త వంగి మెత్తని స్వరంతో “సార్” అన్నాడు.

“యెస్?”

“నా వల్ల అయినది చేస్తూనే ఉన్నాను సార్. ఇందులో నా దోషం ఏమీ లేదు అని అనను సార్. అయితే ఏమీ చెయ్యలేం సార్. మునిసిపల్ చెత్త కేంద్రానికి చెత్త తీసుకొచ్చినట్టు ఇక్కడికి ఈ బిచ్చగాళ్ళని తీసుకొస్తారు…”

“ఓకే. వెళ్ళి జరగాల్సిన పని చూడండి” అన్నాను. నా గొంతులో అనవసరమైన కటువు ఎలా వచ్చిందో తెలీలేదు. బహుశా నా మీద నాకే కలిగిన అసహ్యం వల్ల కాబోలు.

డాక్టర్ గద్గద స్వరంతో “సార్, నేను యస్‌. సి. కోటాలో వచ్చాను సార్. నాలాంటి వాళ్ళకు ఇక్కడ చోటే లేదు సార్. అసహ్యంగా పురుగును చూసినట్టు చూస్తారు. నేను సర్వీస్‌లోకి వచ్చి పద్దెనిమిదేళ్ళయింది… సీనియర్‌ని సార్. అయితే ఇప్పటి వరకు గౌరవంగా కూర్చుని పేషంట్లను చూసేలాంటి పని ఇవ్వనేలేదు. సర్వీసంతా పోస్ట్‌మార్టమ్ చెయ్యనిచ్చారు. లేదంటే ఇది. ఇక్కడ అగ్రకులస్తులు ఎవరూ లేరు. ఇందాక నాతో ఉన్న జూనియర్ కూడా మావాడే. మా ఇద్దర్నీ…” ఇక మాటలు రాక అతని గొంతు పూడుకుపోయింది.

కారు దిగి అతన్ని కింద పడేసి పూనకం వచ్చినవాడిలా కాలితో తన్ని తన్ని గుజ్జుగుజ్జుగా చేసి మట్టిలో కలిపేయాలన్నంత ఆవేశం ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్టు అయి నా చేతులు, కాళ్ళు వణికాయి. సిగరెట్ చివరి బూడిద తొడ మీద పడింది.

అతను కళ్ళు తుడుచుకుంటూ “పాడు జీవితం సార్! క్లినిక్ పెట్టుకుంటే మా దగ్గరకు అగ్రకులస్తులు రారు. మా వాళ్ళలో కూడా కలిగినోళ్ళు రారు. నాకు మా ఊళ్ళో పాకీ డాక్టర్ అనే పేరు. డాక్టర్ కావాలన్న కలను నిజం చేసుకోవాలని రాత్రనక పగలనక చదివాను సార్. ఇప్పుడు ఇక్కడ పాకీవాళ్ళతో మరో పాకీవాడిగా కూర్చోబెట్టేశారు.”

నేను నిట్టూర్చి కళ్ళను చేతులతో అదుముకున్నాను. తర్వాత “మాణిక్యం” అన్నాను. నా గొంతు బొంగురుబోయి వింతగా వినిపించింది. “మాణిక్యం” అని మళ్ళీ అన్నాను. “‌వేరే పనికి వెళ్ళినా పరిస్థితి ఇలానే ఉంటుంది. సివిల్ సర్వీసెస్ రాసి నాలాగా అయితే మాత్రం ఏంటి! నేనూ మా డిపార్ట్‌మెంట్‌లో పాకీవాణ్ణే.”

డాక్టర్ నోరు తెరచుకుంది. నేను మాటలు అక్కడితో ఆపుకోవాలన్నట్టు సిగరెట్ పడేశాను. అయితే నన్ను దాటుకుని మాటలు పుండు నుండి చీములా బయటకు వచ్చాయి.

“చూశారా ఈ ఒంటిని? ఇందులో ప్రవహించే రక్తం అంతా తిరిపెపుకూటితో వచ్చినదే. అది నేనూ మరిచిపోలేను. నాకు భిక్షం పెట్టిన ఎవడూ కూడా మరిచిపోడు. మరిచిపోవాలంటే నన్ను కోసి రక్తమంతా బయటకు తీసేసి వేరే రక్తం ఎక్కించాలి. సింహం, పులి, తోడేలు- అలా ఏదైనా మంచి రక్తం… అది…” ఆపైన మాటలు రాక ఆగిపోయి “వెళ్ళండి! వెళ్ళి అమ్మను రెడీ చెయ్యండి!” అని గట్టిగా అరిచాను. నా కేక నాకే వికృతంగా వినబడి ఏదో ఒక పశ్చాత్తాపం కలిగి సిగ్గుపడి తలను తడుముకున్నాను.

మతి చలించినవాడిలా డీలాపడిన నడకతో డాక్టర్ వెళ్ళడం చూస్తూ మరో సిగరెట్ వెలిగించుకున్నాను. నేను భిక్షమెత్తిన సంగతి ఈ మనిషికెందుకు చెప్పాను! ఇతని మనసులో నా గురించి ఉన్న గౌరవం ఏమయ్యుంటుంది? కచ్చితంగా ఈ పాటికి అది పగిలి ముక్కలై పడిపోయుంటుంది. అతనికి అతని మీదే ఎలాంటి గౌరవమూ లేదు. ఇప్పుడు నన్ను కూడా తనలాంటి ఒకడిగా అనుకుంటూ ఉంటాడు. కాబట్టి నా గురించి ఎలాంటి గౌరవభావమూ ఉండదు. సిగరెట్ ఉన్నట్టుండి చేదుగా అనిపించింది. నా అలవాటుకు విరుద్ధంగా నేను ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా సిగరెట్లు కాల్చేస్తున్నాను.


సివిల్ సర్వీసెస్ ఇంటర్‌వ్యూలో ఎనిమిది మంది ఉన్న పేనల్ ముందు నేను కూర్చున్నప్పుడు నేను మొట్టమొదటగా ఎదురుచూసిన ప్రశ్న నా కులం గురించినదే. చెమటలో తడిసిన నా వేళ్ళు గ్లాస్ టేబుల్ మీద జారిపోతుండగా, నా గుండె చప్పుడును వింటూ కూర్చున్నాను. గదిలో రయ్యిమని ఎ.సి. చప్పుడు. కాగితాలు తిప్పే చప్పుడు. పేనల్ మెంబర్స్ కదిలినప్పడు రివాల్వింగ్ చెయిర్ల చప్పుడు. వారిలో ఒకాయన నా తాలూకు డాక్యుమెంట్స్ ఒకమారు చూసి “మీదే కులం?” అని, మరోమారు వాటిని చూస్తూ “షెడ్యూల్డ్ ట్రైబ్… నాయాడి…” అని చదివి తల పైకెత్తి “వెల్!” అన్నాడు.

నేను చంటిపిల్లాడిగా ఉన్నప్పట్నుండీ ఒక్క రోజు, ఒక్క నిముషం కూడా నేను నా కులాన్ని మరిచిపోనివ్వకుండా నా చుట్టూ ఉన్నవాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు. సివిల్ సర్వీసెస్‌కు చదవడం మొదలుపెట్టినప్పుడు దివాన్ బహదూర్ వి. నాగం అయ్య రాసిన తిరువిదాంగూర్ స్టేట్ మేన్యువల్‌ని కంఠోపాఠంగా వల్లెవేసిన రోజుల్లోనే నా కులం గురించి నేను తెలుసుకున్నాను. తిరువిదాంగూర్ స్టేట్‌లో తొలి జనాభా లెక్కల ప్రధాన అధికారిగా ఉద్యోగాన్ని మొదలుపెట్టిన తెలుగువాడైన వి. నాగం అయ్య తన నలభై ఏళ్ళ విస్తృత అనుభవంతో 1906లో రాసిన మేన్యువల్ అది. అంతకు పూర్వం బ్రిటీష్‌వాళ్ళు, వాళ్ళు పరిపాలించిన ప్రాంతాలకు సంబంధించి మేన్యువల్‌లు రాసుకున్నారు. మదురై గురించి జె. హెచ్. నెల్సన్ రాసిన మేన్యువల్ క్లాసిక్‌గా కీర్తించబడింది. దానికి ఏమాత్రం తీసిపోదు నాగం అయ్య రాసిన తిరువిదాంగూర్ మేన్యువల్. ఇది పూర్తి వివరాలతో, విస్తారంగా, చక్కని భాషలో రాయబడిన క్లాసిక్ మేన్యువల్.

తిరువిదాంగూర్ స్టేట్‌లోని అన్ని కులాల గురించీ నాగం అయ్య విస్తారంగానే రాశారు. కులాల మూలాల గురించిన గాథలు, ప్రవాసకులాలైతే వాటి వివరాలు, కులాలవారీగా ఆచారాలు, అలవాట్లు, వారి సామాజిక అంతస్తులు అన్నీ వివరించారు. కులాల పరిణామక్రమం గురించి వివరించారు. ఎడ్గర్ థర్స్‌టన్ చెప్పినట్టే ముఖాకారం, ముక్కు పరిమాణాలతో కులాలను నిర్వచించే ప్రయత్నం కూడా చేశారు. నెల్సన్‌కు లాగానే ఒక్కో కులానికీ ప్రత్యేకమైన గుణాలున్నాయి అన్న అభిప్రాయం ఆయనకూ ఉన్నట్టే ఉంది. గాంభీర్యమూ అడ్డు-అదుపు లేనితనమూ కలవాళ్ళు నాయర్లు; బద్దకమూ తెలివితేటలూ కలిగినవాళ్ళు వెళ్ళార్లు; కష్టజీవులూ పొగరుబోతులూ అయినవాళ్ళు నాడార్లు; తాగుబోతులూ కలహప్రియులూ అయినవాళ్ళు ఈళవర్లు అంటూ ఆయన, నేటి సభ్యసమాజంలోని ఇబ్బందులేవీ ఆనాడు లేకపోవడంతో, బహిరంగంగా రాశారు. ఒక్కో కులం గురించి ఆనాటి పాలకవర్గం లేదా బ్రాహ్మణులు ఏం అనుకునేవాళ్ళు అన్నదానికి లిఖితపూర్వమైన ఋజువు అది.

ఆ మేన్యువల్‌లో అతి తక్కువగా వివరించబడిన కులం నా కులం: నాయాడులు. దేశదిమ్మరులుగా తిరిగే యానాదుల్లో ఒక తెగ. వీళ్ళను చూస్తేనే మైల వస్తుంది అన్న ఒక నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి వీళ్ళు పగటి పూట తిరగరు. వీళ్ళను ప్రత్యక్షంగా చూస్తే వెంటనే కేకలు పెట్టి జనాలను పోగుచేసుకుని రాళ్ళు విసిరి అక్కడే చంపేసి కాల్చేసే అలవాటు కూడా ఉండేది. కాబట్టి వీళ్ళు పగలంతా అడవిలో పొదల్లోనూ, గుంతలు తవ్వుకుని వాటిల్లోనూ తమ పిల్లాపాపలతో తలదాచుకుని పందుల్లా ముడుక్కుని నిద్రపోయేవాళ్ళు. రాత్రివేళ బయటకు వచ్చి వేటకు వెళ్ళేవాళ్ళు. వీళ్ళు దరిద్ర దేవత అంశ అన్న నమ్మిక కూడా ఉండటం వల్ల వీళ్ళకోసం అంటు, తవుడు, మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఇంటి బయట ముష్టిలా పెట్టే ఆచారం ప్రజల్లో ఉంది. వీళ్ళుకు ఏది దొరికినా తింటారు. ఎలుకలు, కుక్కలు, రకరకాల పురుగులు, చచ్చిన జంతువులు. అన్ని దుంపజాతుల్నీ పచ్చిగా తింటారు. పోకచెట్టు పాళను నడుముకు కట్టుకుని తమ జననావయవాలను దాచుకుంటారు. వీళ్ళు బాగా పొడవుగా నల్లగా ఉంటారు. పొడవైన కోరపళ్ళు. వీళ్ళ భాష అరవ భాషకు దగ్గరగా ఉంటుంది. వీళ్ళకు ఎలాంటి చేతివృత్తులూ రావు. వీళ్ళదగ్గర దాదాపుగా సొమ్ములంటూ ఏవీ ఉండవు. తిరువిదాంగూరు స్టేట్‌లో సుమారు యాభైవేల మంది ఉన్నారు. వీ‌‌ళ్ళవల్ల ప్రభుత్వానికి ఎలాంటి రాబడీ లేదు.

నేను నాగం అయ్య తన మేన్యువల్‍లో ఏం చెప్పారు అన్నది అప్పజెప్పినట్టు పేనల్‌కు చెప్పాను. ఇంకొకాయన నన్ను తదేకంగా చూసి “ఇప్పుడు మీ కులం ఎలా ఉంది? అభివృద్ధి చెందిందా?” అని అడిగాడు.

“లేదు. ఇవాళ్టికీ అందరూ భిక్షమెత్తి, దొరికింది తిని, ఆరుబయటే జీవిస్తున్నారు” అని ఆయన్ని చూస్తూ జవాబిచ్చాను.

“మరి మీరు సివిల్ సర్వీసెస్ దాకా వచ్చారే!”

“నాకు ఒక పెద్దాయన సాయం అందింది.”

“అంబేద్కర్‌లా అన్నమాట!” అన్నాడు ఇంకొకాయన.

నేను ఆయన కళ్ళల్లోకి చూస్తూ “అవును. అంబేద్కర్‌ లాంటివాడే” అన్నాను. కొన్ని క్షణాలు మౌనం.

మూడో ఆయన “ఇప్పుడొక క్లిష్టప్రశ్న. మీరు అధికారంలో ఉండే ప్రాంతంలో మీరు తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి. ఒక వైపు న్యాయం ఉంది, మరో వైపు మీ కులస్తులు ఉన్నారు. ఎవరి వైపు మొగ్గుతారు?” అని అడిగాడు.

మిగిలిన పేనల్ మెంబర్స్ కూడా నా జవాబు వినడానికి ఆసక్తిగా ఉన్నారన్నది వాళ్ళ కుర్చీల కిరకిరలు చెప్పాయి. నా వేళ్ళు, చెవితమ్మెలు, కనురెప్పలంతా మరుగుతున్న రక్త ప్రవాహం. నేను చెప్పవలసిన జవాబేంటో నాకు తెలుసు. అయితే ఆ క్షణం నేను స్వామి ప్రజానందులవారిని తలచుకున్నాను.

దృఢమైన గొంతుకతో “సార్, న్యాయం అంటే ఏంటి?” అని ప్రశ్నించి కొనసాగించాను. “కేవలం చట్టాలూ సంప్రదాయాలా న్యాయాన్ని నిర్ణయించేవి? న్యాయం అంటే దానికి ప్రాథమికంగా ఒక విలువ ఉండాలి కదా! సమానత్వమే విలువలన్నింటిలో మహత్తరమైనది, గొప్పది. ఒక నాయాడిని, మరో మామూలు మనిషిని, చెరోపక్కన నిలబెట్టడం అన్నదే సమానత్వం అనే ధర్మం ప్రకారం చూస్తే, నాయాడికి పెద్ద అన్యాయం జరిగిపోయినట్టే. వాడు చేసింది ఏదైనా కానీ అది న్యాయంగా మారిపోతుంది.”

దేహాలు మెల్లగా సడలి కుర్చీలు మళ్ళీ చప్పుడు చేశాయి. కొందరు చేతులు ముడుచున్నారు. ప్రశ్న అడిగిన వ్యక్తే “మిస్టర్ ధర్మపాలన్, హత్య! హత్య చేసి ఉంటే?!” అని అడిగాడు. ఈ జవాబును చెప్పకుండా నన్ను నేను ఆపుకోలేకపోయాను “సార్, హత్య చేసినా సరే నాయాడే బాధితుడు” అన్నాను.

కొన్ని నిముషాలు ఆ గదిలో మౌనం. కాగితాలు తిప్పే చప్పుడు. పెద్ద నిట్టూర్పు తర్వాత తొలి వ్యక్తి కొన్ని ప్రశ్నలు అడిగాడు. మామూలు లోకం పోకడ గూర్చిన ప్రశ్నలు. ఇంటర్‌వ్యూ అయిపోయింది. నా విధి నిర్ణయించబడింది, వచ్చినదారినే వెనక్కెళ్ళాలి అని అనుకున్నాను. అయితే మనసులో మాత్రం ఎంతో సంతృప్తి. నేరుగా వెళ్ళి లఘుశంక తీర్చుకుంటుంటే ఒంటిలో మఱిగిన ఆమ్లం అంతా కారిపోతున్నట్టు అనిపించింది. చేతులు కాళ్ళు మెల్లగా చల్లబడ్డాయి. ముఖం కడుక్కున్నాను. అద్దంలో చూస్తూ తల దువ్వుకుంటుంటే నా ముఖంలోని అలజడి చూసి నాకు చిన్నగా నవ్వొచ్చింది.

నేరుగా కేంటీన్‌కు వెళ్ళి ఒక కాఫీ తీసుకుని గాజు గోడ పక్కనున్న టేబుల్ దగ్గర కూర్చుని తాగసాగాను. కిందెక్కడో పాతాళంలో కార్ల పైకప్పులు, బొద్దింకల్లా కనిపించాయి. మనుషులు గుండుసూదుల్లా కనిపించారు. పచ్చని చెండ్లలా నాలుగైదు చెట్లు గాలికి ఊగుతున్నాయి. రోడ్ మీద పోతున్న కార్ మీద పడిన ఎండ తళుక్కున తిరిగి నామీద పడి నన్ను దాటిపోయింది. ఇంతలో నా పక్కన ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. వెంటనే పోల్చుకోలేకపోయాను. ఇందాక ఇంటర్‍వ్యూ పేనల్‍వారిలో ఒకతను. ఆ తీర్పు గురించిన ప్రశ్న అడిగిన వ్యక్తి.

“ఐ యామ్ నవీన్ సేన్ గుప్తా” అన్నాడు.

“హలో సర్” అని చేయి చాచాను. కరచాలనం చేస్తూ కప్పులో ఉన్న టీని జుర్రుకున్నాడు.

“ఇంటర్‌వ్యూ సాయంత్రం కూడా ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం” అన్నాడు.

నేను ఆయన్నే చూస్తూ ఉండిపోయాను.

“మీరు సెలక్ట్ అయిపోయారు. ఒకరు తప్ప మిగిలిన అందరూ ఎక్కువ మార్కులే ఇచ్చారు.”

నేనది ఊహించలేదు. ఆయన్ని నమ్మలేనట్టు చూశాను.

“ప్రస్తుతానికి ఇది ప్రభుత్వ రహస్యం. మీ కంగారు చూసి చెప్పానంతే.”

“థేంక్యూ సర్!”

“పరవాలేదు. నేను ఆ ప్రశ్నను మామూలుగానే అడిగాను. ఇలాంటి ప్రశ్నలు అందర్నీ అడుగుతుంటాం. ఒకే రకమైన జవాబునే కోరుకుంటాం కూడా. మీరు చెప్పిన జవాబు నిర్వహణపరంగా తీసుకుంటే చాలా చాలా తప్పు. అయితే మీరు మీ మనోభావాన్ని ఆత్మస్థైర్యంతో వ్యక్తపరిచారు…” టీ జుర్రుకుంటూ “నేను తప్ప ఇంకెవరూ మంచి మార్కులు ఇవ్వరు అనుకున్నాను. అయితే ఒకరు తప్ప అందరూ మంచి మార్కులే ఇచ్చారు” అని నవ్వి “నేను ఏ కారణం చేతనైతే మంచి మార్కులిచ్చానో ఆ కారణమే అయుండాలి” అని అన్నాడు.

నేను ఏంటి అన్నట్టు చూశాను.

“నన్ను ఒక మానవతావాది, అభ్యుదయ భావాలు కలిగినవాడు, ఒక నవనాగరీకుడు అని వాళ్ళంతా అనుకోవాలని నా కోరిక. అందుకే నా ఒంటిమీద మతపరమైన చిహ్నాలు ఉంచుకోను. గొడ్డు మాంసం తింటాను, ఆల్కహాల్ కూడా అందుకే తాగుతాను. బెంగాలీ, పంజాబీ అగ్రకులస్థులకు తామలా అందరికీ కనిపించాలన్న తపననుంచి బయటకు రావడం చాలా కష్టం.” మిగిలిన టీ తాగేశాడు. “అయితే యాదవ్‌కు అలాంటి ఇబ్బందేం లేదు. ఆయన ఎవరేమనుకుంటారో పట్టించుకోడు. సంప్రదాయవాది, కులాభిమానం ఉన్నవాడని అనిపించుకోగలడు. అలా కనిపించగలడు కూడా.”

“ఓకే” అని ఆయన లేస్తూ “మీరు నన్ను ఎలాంటి వ్యక్తిగతమైన సాయానికైనా సంప్రదించవచ్చు. నేను నావల్ల అయినంతవరకు అభ్యుదయవాదిగా ఉండే ప్రయత్నం చేస్తాను” అని గట్టిగా నవ్వి “అంటే మీరు నా కూతుర్ని పెళ్ళి చేసుకోడానికి ప్రయత్నించనంత వరకు!” ఇంకా గట్టిగా నవ్వుని కొనసాగించాడు. నేనూ నవ్వేశాను. డబల్ చిన్, చిన్న కళ్ళు, బొద్దుగా ఉన్న ముఖం. కొంచం మంగోలియన్ ముఖాకారం. నా వీపు మీద తట్టి “యంగ్‌మేన్, నువ్వు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలవికానన్నిసార్లు మనసు విరిగిపోయి, విరక్తి కలగొచ్చు. ఈ ఉద్యోగానికి వచ్చినందుకు విచారించే సందర్భాలే ఎక్కువ ఉంటాయి. ఏదేమైనప్పటికీ నీకు అభినందనలు” అన్నాడు.

మళ్ళీ కూర్చుని “నిన్ను చదివించింది ఎవరు?” అని అడిగాడు.

“స్వామి ప్రజానంద. నారాయణగురు శిష్యులైన ఎర్నెస్ట్ క్లార్క్‌కు శిష్యులు” అన్నాను.

“ఎర్నెస్ట్ క్లార్కా? బ్రిటీష్‌వారా?”

“అవును బ్రిటీష్‌వారే. థియొసాఫికల్ సొసైటీకి వచ్చిన ఆయన నారాయణగురుకు శిష్యుడయ్యారు. గురువు పోయాక నారాయణమందిరం అని ఒక ఆశ్రమం స్థాపించారు. 1942లో కోయంబత్తూరు చేరి అక్కడ ఒక గురుకులం స్థాపించారు. నారాయణగురు వేదాంతాన్ని చర్చించడం కోసం లైఫ్ అన్న పత్రిక నడిపారు. అన్నీ నేను చదివి తెలుసుకున్నవే. ప్రజానందులవారు ఎర్నెస్ట్ క్లార్క్‌తో తిరువనంతపురం గురుకులంలో ఉండేవారు. ఆయన తర్వాత ప్రజానందులవారు కొంతకాలం ఆ గురుకులాన్ని నడిపించారు.”

“ప్రజానంద ఇప్పుడు ఉన్నారా?”

“లేరు. చనిపోయారు.”

“ఓ!”

“ఆయన పేరు కేశవ పణిక్కర్. ఎర్నెస్ట్ క్లార్క్ ఆయనకు కాషాయమిచ్చి ప్రజానందగా నామకరణం చేశారు.”

“ఎర్నెస్ట్ క్లార్క్ స్వామీజీనా?”

“అవును. నారాయణగురుగారి ఏకైక విదేశీ శిష్యుడు ఆయనే. అయితే నారాయణగురు ఎర్నెస్ట్ క్లార్క్ పేరును మార్చలేదు!”

“ఆశ్చర్యమే! నారాయణగురు గురించి నేను విన్నాను” అంటూ లేచిన సేన్ గుప్తా “రామకృష్ణ పరమహంస లాంటివారు కదా?” అని అడిగాడు.

“అవును.” అన్నాను.

“వెల్! బట్…” అని ఆపి “ఓకే” అన్నాడు.

“చెప్పండి సార్” అన్నాను.

“లేదు, నిన్ను నిరుత్సాహపరచాలని లేదు…”

“పరవాలేదు చెప్పండి సర్.”

“లేదు… నువ్వు ఇంకేదైనా చేసుండచ్చు. మంచి అధ్యాపకుడివి అయుండచ్చు. డాక్టర్ అయుండచ్చు. సామాజిక సేవ కూడా చేసుండచ్చు. ఇది సరైన శాఖ కాదేమోనని అనుమానంగా ఉంది. ఇది నువ్వనుకున్నట్టు కాదు. ఎనీవే, వెల్” అని కరచాలనం చేసి లిఫ్ట్ వైపుకు నడిచాడు.

ఆయన ఆ రోజు ఏం చెప్పాడో అది నేను ప్రతిరోజూ అనుభవించాను. అన్ని వేళలా, అన్ని చోట్లా నన్ను బయటే నిల్చోబెట్టారు. పాలక నిర్వాహణ శిక్షణ అన్నది ‘నేను ఆజ్ఞాపించడానికి పుట్టాను’ అని నమ్మించడానికి చేసే నేలబారు వశీకరణ విద్య తప్ప మరొకటి కాదు. అయితే నాకు మాత్రం అలా చెప్పలేదు. నావైపుకు వచ్చిన మాటలు అన్నీ ‘నువ్వు వేరే’ అన్న అర్థాన్నే మోసుకొచ్చి నాకు చెప్పాయి: ‘మా దయ వల్ల, మా కరుణ వల్ల, మాకున్న సమతాధర్మంవల్ల మాత్రమే నీకు ఇక్కడ కూర్చునే అవకాశం కలిగింది. కాబట్టి ఆ కృతజ్ఞతతో మాకు విశ్వాసబద్ధుడిగా ఉండు.’

తమిళనాడు సర్కిల్‌లో నేను నియమించబడి తొలిసారి మద్రాస్‌లో చేరినరోజే నేను ఎవరన్నది నాకు గుర్తుచేశారు. ముందురోజు నా పై అధికారికి రిపోర్ట్ చేసి నేను బాధ్యతలు తీసుకోవలసిన పోస్టునుండి వెళ్ళిపోతున్న అధికారిని ఉద్యోగధర్మం కోసం వెళ్ళి కలిసి కొన్ని నిముషాలు మాట్లాడి వచ్చాను. మరుసటి రోజు అదే గదిలోకి వెళ్ళినప్పుడు నిన్న ఉన్న పొడవైన సింహాసనం లాంటి కుర్చీ ఉన్నచోట ఒక మామూలు కుర్చీ వేసి ఉంది. ఎందరో కూర్చునీ కూర్చునీ చిరుగులుపడ్డ పాత కుర్చీ. ఏ గుమాస్తాదో అయుంటుంది. నేను దాన్ని చూస్తూ కొన్ని క్షణాలు నిల్చుండిపోయాను. నా వెనక నిలబడ్డ ప్రధాన గుమాస్తాని ఆ కుర్చీ ఎక్కడ అని అడగాలని నా పెదవులదాకా వచ్చిన మాటలను పెద్ద ప్రయాసతో ఆపుకుని అందులోనే కూర్చున్నాను.

కాసేపటి తర్వాత లోపలికి వచ్చి నమస్కారం చెప్పిన ప్రతి ఒక్కరి చూపులోను నేను అదే గ్రహించాను, ఇక్కడనుండి తీసేయబడ్డ ఆ కుర్చీ. వాళ్ళ అతి వినయం, తెచ్చి పెట్టుకున్న సహజత్వం, నిర్లక్ష్యపు భావన – అన్ని చర్యల్లోనూ ప్రధానంగా ఉన్నది అదే. నా మాటలలో కూడా ఉన్నది అదే. నిష్కర్షగా ఉంటూనే ఒక మృదువైన అధికార ధోరణికి నన్ను నేను అలవాటు చేసుకున్నాను. అయితే లోపల నా మనసు మాత్రం అక్కసుగానే ఉంది. నేనేం చెయ్యాలి?

నా కుర్చీ కోసం నేను ఎదురుతిరగొచ్చు. దాన్ని వాళ్ళు నా అల్పత్వానికి చిహ్నంగా చూపి ప్రచారం చెయ్యవచ్చు. అదే నా సహజగుణం అన్నట్టు చేసి చెరగని ముద్ర వేసేయొచ్చు. ఇక జీవితకాలం నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ముద్ర నాతోనే వస్తుంది. అధికార వరండాల్లో ఉద్భవించి పాతుకుపోయే ప్రాచీన కథల్లో ఒకటిగా మిగిలిపోతుంది. పోనీలే అని నేను వదిలేయొచ్చు. అయితే అది ఇంకా ఇంకా నన్ను అవమానించడానికి నేను వీరికి ఇచ్చే అనుమతి లాంటిది అవుతుంది.

కొన్ని గంటలు గడిచాక దాని గురించి అడగడానికి ప్రధాన గుమాస్తాని లోపలికి పిలిచాను. అతని కళ్ళల్లో కనిపించిన స్థిరత్వం చూడగానే అర్థం అయింది, అది అతను తీసుకున్న నిర్ణయం కాదని. అతని వెనక ఒక వ్యవస్థ ఉంది. దానితో నేను పోరాడలేను. నేను ఒంటరివాడిని. పోరాడి ఇంకా ఇంకా చిన్నబోతే నేను ఎప్పటికీ లేవలేను. అతణ్ణి ఇంకేదో అడిగాను. అతని చిన్న కళ్ళల్లో నవ్వొకటి మెరిసి కనుమరుగైందా అనుకున్నాను.


ఆంబులెన్స్‌లో అమ్మను ఎక్కించుకుని గోపాల్ పిళ్ళై హాస్పిటల్‌కు వెళ్ళాను. కుర్ర డాక్టర్ కూడా ఆంబులెన్స్‌లో ఎక్కాడు నేను మాణిక్యంతో “రైట్, చూద్దాం” అన్నాను.

“నేనూ వస్తాను సార్. అక్కడ ఒక రిపోర్ట్ ఇస్తాను” అన్నాడు.

“రండి” అని కార్ ఎక్కించుకున్నాను.

“యూరిన్ బయటకు తీసేశాం సార్. డ్రిప్ ఎక్కుతోంది. కిడ్నీ పనిచేస్తున్నట్టు లేదు. నాలుగైదు రోజులుగా జ్వరం వచ్చి ఎక్కడో పడి ఉన్నట్టున్నారు” అన్నాడు.

నేనేమీ మాట్లాడకుండా ఇంకో సిగరెట్ కాల్చుకున్నాను.

హాస్పిటల్ లోపలకి అమ్మని తీసుకుని వెళ్తున్నప్పుడు చూశాను, ఇందాక ఉబ్బిపోయున్న పొట్ట ఇప్పుడు మామూలుగా ఉంది. తెల్ల బట్టలు వేసున్నారు. పైన కప్పిన తెల్ల దుప్పటిలో పసుపు పచ్చగా చీమో రక్తమో కారి పెద్దదవుతున్న మరక కనబడింది. డాక్టరే దిగివెళ్ళి మాట్లాడి అమ్మను లోపలికి తీసుకెళ్ళాడు. నేను రిసెప్షన్‌లో కూర్చున్నాను. గంటసేపటికి డాక్టర్ ఇందిర నన్ను తను గదిలోకి పిలిచింది. నేను కూర్చోగానే “సీ, నేను చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. మాణిక్యం అంతా చెప్పేసుంటాడు. షీ ఈజ్ సింకింగ్…” అని అన్నది.

నేను తలూపాను.

“చూద్దాం. తెలివి వస్తే అదృష్టం అనుకోవాలి. ఈజ్ షీ అవుట్ ఆఫ్ హర్ మైండ్?”

నేను మళ్ళీ అవునన్నట్టు తలూపాను.

“వెల్, కొన్నిసార్లు చివరి దశలో తెలివి వస్తే బాగా స్పష్టంగా ఉంటారు. చూద్దాం.”

రాత్రయిపోయింది. నేను లేచాను. డాక్టర్ ఇందిర “ఇక్కడ ఎవరూ ఉండాల్సిన అవసరంలేదు. ఏదైనా అవసరం అయితే నేను ఫోన్ చేస్తాను” అని అన్నది.

మాణిక్యం బయటే ఉన్నాడు. “నేను జూనియర్ డాక్టర్ స్టీఫెన్‌ని ఇక్కడే ఉండమన్నాను సార్. అతను చూసుకుంటాడు” అన్నాడు.

“వద్దు మాణిక్యం. పరవాలేదు. అతన్ని వెళ్ళనివ్వు. ఇక్కడివాళ్ళే చూసుకుంటారు” అని ఇద్దర్ని పంపించేశాను.

కార్ స్టార్ట్ చేసినప్పుడు గుర్తొచ్చింది దాదాపు మూడు గంటలసేపు నేను టీ అయినా తాగలేదని. వెంటనే ఆకలి కూడా గుర్తొచ్చింది.

కారు ఆపి గారేజ్ నుండి నేరుగా ఇంటి లోపలికి వెళ్ళగానే శుభ వచ్చి “ఆలస్యం అవుతుందని చెప్పలేదూ?” అంది.

నేను మాట్లాడకుండా సోఫాలో కూర్చుని షూస్ తీశాను.

“భోజనం చేస్తారా?”

“లేదు. స్నానం చేసి వస్తాను.” ఆమెతో ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు. బట్టలు తీసి మాసిన బట్టల బుట్టలో వేసి నేరుగా షవర్ కింద నిల్చున్నాను. స్నానం చేసి తుడుచుకుంటున్నప్పుడు మనసు కొంచెం కుదుట పడ్డదనిపించింది.

డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు పెట్టి ఉన్నాయి.

“నువ్వు ఇంకా తినలేదా?”

“లేదు. ఇప్పటిదాకా కుట్టి మేలుకునే ఉన్నాడు. ఇప్పడే నిద్ర పోయాడు.”

నేను కూర్చోగానే ఆమె నా ఎదురుగా కూర్చుంది. నాగమ్మ వేడివేడిగా చపాతీలు వేసుకుని తెచ్చి నా ప్లేట్‌లో వేసింది.

“శుభా…” అని క్షణం ఆగి “అమ్మను చూశాను” అన్నాను.

శుభ కళ్ళు నాకేసి చూస్తూ ఉండిపోయాయి.

“గవర్నమెంట్ హాస్పిటల్‌లో… భిక్షగాళ్ళ షెడ్‌లో.”

ఆమె ఏమీ మాట్లాడకుండా పెదవులు మాత్రం కదిపింది.

“చాలా దారుణమైన పరిస్థితిలో! చాలా రోజులుగా జ్వరంతో ఎక్కడో పడి అల్లాడినట్టుంది. అన్ని ఆర్గన్సూ డెడ్ అయిపోయాయి. ఇవాళో రేపో అన్నారు…”

“ఎక్కడుంది తను ఇప్పుడు?”

“గోపాల్ పిళ్ళైలో చేర్చాను.”

ఆమె తన కంచంలోకే చూస్తూ ఉంది. నేను రెండో చపాతీ సగంలో లేచేశాను.

“నాగమ్మా! అయ్యగారికి పాలు తీసుకురా” అని కేకేసింది శుభ.

“వద్దు” అన్నాను.

“తాగండి. లేదంటే పొద్దునకల్లా పొట్టలో మంట పుడుతుంది.”

నేను మారు మాట్లాడకుండా గదిలోకి వెళ్ళాను. సగం కప్పిన దుప్పటి కింద ప్రేమ్ నిద్రపోతున్నాడు. నేను వాడి పక్కన పడుకుని వాడి కాళ్ళని మెల్లగా నిమురుతూ ఫేన్‌కేసి చూస్తున్నాను.

శుభ నైట్ డ్రెస్ వేసుకుని పాలు తీసుకుని వచ్చింది. నా పక్కన టేబుల్ మీద పెట్టి “తాగండి” అని చెప్పి అద్దం ముందుకు వెళ్ళి పెద్ద దువ్వెనతో దువ్వి కొప్పు కట్టుకుంది. నేను తెల్లటి ఆమె మెడవెనక భాగాన్నే చూస్తూ ఉన్నాను. వెనక్కి తిరిగి “ఏంటి?” అని అడిగింది. ఏంలేదన్నట్టు తల ఊపి పాలు తాగాను. లేచి బాత్రూమ్‌కు వెళ్ళి పళ్ళు తోముకుని వచ్చాను. తను మంచం మీదకు చేరింది అప్పటికే.

“నేను కూడా రావాలా?”

నేను సమాధానం చెప్పలేదు. తననే చూస్తూ నిలబడ్డాను.

“నేను కచ్చితంగా రావాలంటే వస్తానండీ. అయితే రావడానికి నాకైతే ఇష్టం లేదు” అంది. ఎప్పుడూ అంతే. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. నేను ఏం మాట్లాడలేదు.

“నాకు రెండు మీటింగులున్నాయి… ఒకటి మినిస్టర్ ప్రోగ్రామ్. దాన్ని ఏం చెయ్యలేం. సాయంత్రం కావాలంటే వస్తాను.”

నేనేం మాట్లాడలేదు.

“అలా నిశ్శబ్దంగా ఉంటే ఏమని అర్థం?” అని అడిగింది.

“నాకేం తోచలేదు” అన్నాను.

“ఇలా చూడండి, దీన్ని మనం పెద్ద ఇష్యూ చేసుకోవద్దు. ఎలాగూ ఆమె ఈరోజో రేపో పోతారు. గౌరవంగా మనం చెయ్యాల్సింది చేసేద్దాం. నేను అక్కడికి వచ్చి అదో పెద్ద షోగా మారిందంటే అందరికీ ఇబ్బందే. పరామర్శించడానికి జనాలు వచ్చిపడిపోతారు. గతాన్నంతా కెలుకుతారు. మీకు సంకటంగా మారిపోతుంది.”

“సరే.”

“ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి. ఫోన్ వస్తే లేపుతాను. మీరు మాత్ర వేసుకోండి.”

నేను నిట్టూరుస్తూ మాత్ర వేసుకున్నాను.

“గుడ్ నైట్.”

“ఒక వేళ అమ్మకు తెలివి వచ్చి ప్రేమ్‌ను చూడాలంటే?”

శుభ కోపంగా లేచి కూర్చుంది. “నాన్సెన్స్! లుక్, హి ఈజ్ మై సన్. వాడు నా కొడుకు. ఆ పిచ్చిభిక్షగత్తె వాడి బామ్మ అని వాడి మనసులోకి ఎక్కించడానికి నేను చచ్చినా ఒప్పుకోను!” తెగింపుగా అంది.

నేనూ కోపంగా “ఏం మాట్లాడుతున్నావు? వాడు నాకూ కొడుకే. ఆ పిచ్చిభిక్షగత్తె కన్న కొడుకుని నేను” అన్నాను.

నేను కోప్పడితే వెంటనే చల్లబడటం ఆమె లక్షణం. ఆమె కళ్ళల్లో తీక్షణత మాత్రం తగ్గలేదు. “చూడండీ, ఇప్పుడు అన్నారే, అదే… అదే మీ సమస్య. ఎప్పుడూ మీ పుట్టుక, పెంపకం గురించిన బరువుని మనసులోనే మోసుకుని తిరుగుతారు. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో మీ జీవితాన్ని మీరే నరకంగా మార్చుకుంటున్నారు. మీ కెరియర్‌ని కూడా స్పాయిల్ చేసుకున్నారు. ఆ కాంప్లెక్స్‌లోకి ప్రేమ్‌ని కూడా నెట్టేయాలనుకున్నట్టయితే మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి.”

నేను అలా సడలిపోయి వెనక్కి వాలాను.

“లుక్, స్టిల్ యూ కాంట్ సిట్ ఫర్మ్‌లీ ఇన్ ఎ చేర్. మీరు ఇప్పటికీ మేనేజర్ కుర్చీలో కూడా గుమస్తాలా కూర్చుంటారు” అంది శుభ. “మీ చదువు, మీ తెలివితేటలు వేటికీ ప్రయోజనం లేదు. ఒక్కరినీ ఆర్డర్ వెయ్యడానికి మీకు నోరు రాదు. ఎవరితోనూ కళ్ళల్లోకి చూస్తూ సూటిగా మాట్లాడలేరు. అందరూ మీ వెనక ఏదో మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు అని ఎప్పుడూ ఆ కాంప్లెక్స్‌లోనే ఉంటారు. నా కొడుకునైనా వాడి జెనరేషన్‌లో దీన్నుండి బయటకు రానివ్వండి. ప్లీజ్! సెంటిమెంటల్‌గా మాట్లాడి వాడి జీవితాన్ని నాశనం చెయ్యకండి. మీరు అనుభవిస్తున్న హింస వాడు అనుభవించకూడదు అనిపిస్తే లీవ్ హిమ్ అలోన్…”

ఆమె మాటలను ఆపాలన్నట్టు “ఓకే” అన్నాను.

శుభ వెంటనే తగ్గి నా నుదుట చేయి పెట్టి “సీ, నేను మిమ్ముల్ని నొప్పించాలని చెప్పడంలేదు. ఇట్ ఈజ్ ఎ ఫేక్ట్. ప్లీజ్!” అంది.

“తెలుసు.”

“మీ అమ్మ నాకు తెచ్చిపెట్టాల్సిన చెడ్డపేరంతా తెచ్చిపెట్టేసింది. నవ్వాల్సిన వాళ్ళందరూ నవ్వడం అయిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ అవమానాలను మరిచిపోతున్నాను.”

నా తల నిద్రతో భారంగా తోచింది “సరే… ఓకే” అని కళ్ళు మూసుకున్నాను.

పొద్దున లేచినప్పుడు నా మనసు కుదుటపడినట్టుగా అనిపించింది. అయితే అది ఎక్కువసేపు కొనసాగలేదు. హాస్పిటల్‌కు ఫోన్ చేశాను. అమ్మ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదట. తొమ్మిది గంటలకు బయల్దేరాను. హాస్పిటల్ దగ్గరపడుతున్న కొద్దీ నాలో అలజడి మొదలైంది. స్టీరింగ్ నుండి చేతులు జారుతున్నాయి. ఫ్రముఖ రచయిత సుందర రామసామి ఇల్లు దాటుతునప్పుడు కారు ఆపి లోపలికి వెళ్ళి కాసేపు అతనితో మాట్లాడితే బాగుండనిపించింది. అతను తన స్నేహితులతో కూర్చుని చర్చాగోష్టి చేసే సమయం ఇప్పుడు. ఇతరుల మాటలను శ్రద్ధగా వినడం విషయంలో అతనికి సాటి ఎవరూ ఉండరు. ఎంతమందితో మాట్లాడినా, ఎంతసేపు మాట్లాడినా, అతని శ్రద్ధ కొంచం కూడా తగ్గదు.

అతని ఇంటినుండి అతని శిష్యడైన ఒక యువరచయిత లుంగీ మడిచి కట్టుకుని గేట్ తెరచి లోపలికివెళ్ళి, తిరిగి గేట్ మూసి వెళ్తుండటం చూశాను. ఉత్తర కేరళలో కాసర్కోడులో ఏదో ఉద్యోగం చేస్తుంటాడతను. ఇక్కడికి వచ్చినప్పుడు సుందర రామసామి ఇంటి మేడమీద ఉంటాడు. నేను సుందర రామసామితో మాట్లాడుతుంటే కొన్నిసార్లు అతనూ వచ్చి మా మాటల్లో కలిసేవాడు. అతని పేరు జెయమోహన్ అని గుర్తు. అప్పుడతను నన్ను గుర్తించకూడదు అని అనుకునేవాడిని. ఒకసారి లోపలికి వెళ్ళి పెద్దాయన్ని కలిసి రావాలనిపించినా నా కారు తానుగానే ఆ ఇల్లు దాటుకుని గోపాల్ పిళ్ళై హాస్పిటల్ ముందు ఆగింది.

డాక్టర్ ఇందిర ఇంకా రాలేదు. ట్రైనీ డాక్టర్ నా దగ్గరకొచ్చి వినయంగా నమస్కారం చేశాడు.

“ఎలా ఉన్నారు?” అని అడిగాను.

“అలానే ఉన్నారు సార్” అన్నాడు.

అమ్మ గదిలోనుండి కుంజన్ నాయర్ పందికొక్కులా ఒళ్ళు వంచుకుని నా దగ్గరకు పరిగెట్టుకుంటూ వచ్చాడు.

“నేను పొద్దునే వచ్చేశాను సర్. అమ్మకు ఇప్పుడు పరవాలేదు. యూరిన్ తీసేశాక ముఖంలో ఒక కళ వచ్చింది” అన్నాడు.

నేను అతనితో “మీరు ఆఫీసుకు వెళ్ళి నేను ట్రేలో పెట్టిన పేపర్లు అన్నీ కనకరాజ్‌కు ఇవ్వండి” అన్నాను.

“నేనిక్కడే ఉంటాను సార్?” అన్నాడు.

“నేను ఉన్నానుగా చాల్లే” అన్నాను.

“అది కాదు సార్. నేను మీకు తోడుగా…”

“వద్దు.”

“సరే సార్” అని పక్కకి వెళ్ళాడు.

నేను లోపలికి వెళ్ళాను. అమ్మ అలానే కదలికలు లేకుండా పడుకుని ఉంది, ఇంచుమించు శవంలా. సెలైన్ ఎక్కుతోంది. మరో పక్క బొట్లు బొట్లుగా యూరిన్. పక్కన వేసున్న కుర్చీలో కూర్చుని అమ్మని చూశాను. నుదుటిమీద, చెంపలమీద, భుజాలమీద, చేతులమీదంతా ఎన్నో పుళ్ళ, గాయాల మచ్చలు. కొన్ని మచ్చలు పెద్ద గాయాల వల్ల వచ్చినవే. నుదుటి మీదున్న ఒక మచ్చ పుర్రె చీలిపోయినట్టు చాలా పొడవుగా ఉంది. జీవతంలో ఎప్పుడూ హాస్పిటల్‌కు వెళ్ళి ఎరగదు. అన్ని పుళ్ళూ బాగా పండి చీముపట్టి కొన్నిసార్లు పురుగులు కూడా పట్టి వాటంతట అవే ఆరిపోయేవి. కుక్కలతో, తోటి మనుషులతో చేసిన పోట్లాటలవల్ల వచ్చిన గాయాలు. ఎవరెవరో రాళ్ళతో కొట్టినవి, కర్రలతో కొట్టినవి, పొడిచినవి, టీ షాపుల్లో వేడినీళ్ళు పోసినవి…

నేను శుభని ప్రేమించిన రోజుల్లో ఒక దగ్గరిక్షణంలో నా చొక్కా తీసినప్పుడు ఆమె “మై గుడ్‍నెస్! ఇదేంటి ఇన్నేసి గాయాలు?” అని విస్తుపోయింది.

నేను చిన్న నవ్వు నవ్వి “చిన్నతనంలో నేను గాయాలు, పుళ్ళు లేకుండా ఉన్నట్టే నాకు గుర్తులేదు…” అన్నాను.

నా వీపు మీదున్న పొడవైన గాయపు మచ్చను వేలితో తడిమింది.

“వెన్ను చూపిన గాయం అది. ఎదురు రొమ్ము మీద ఒక వీరగాయం కూడా ఉంది” అని అన్నాను.

హఠాత్తుగా నన్ను హత్తుకొని వెక్కివెక్కి ఏడ్చింది. నా భుజాల మీద, వీపు మీదా ఉన్న మచ్చలకు ముద్దులు పెట్టింది.

ఏడేళ్ళ వయసులో అమ్మ చేయి పట్టుకుని నగ్నంగా వీధుల్లో తిరిగినప్పుడు నా ఒళ్ళంతా మచ్చలు మచ్చలుగా గజ్జితో నిండిపోయుండేది. వేళ్ళు ఒకదానికొకటి అంటుకుపోయి, రెప్పలు అంటుకుపోయి చర్మమే కనిపించనంతగా ఉండేది. ఎప్పుడూ ఆకలితో అలమటిస్తూ, మూలుగుతూ కంటికి ఏది కనిపించినా తీసి నోట్లో పెట్టుకుని తినడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ఎక్కడో ఒక గడ్డపాయన వీధి పిల్లలకు భోజనం పెడతాడని విని, అక్క చేయి పట్టుకుని వెళ్ళాను.

(రెండవ భాగం వచ్చేసంచికలో.)