నాన్న చనిపోయిన ఆరేళ్ళ తర్వాత నేను పెళ్ళి చేసుకున్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఇది. ‘లంజ, బజారుదానా’ – ఎలాంటి పరిస్థితుల్లోనూ నా భార్యను ఈ రెండు మాటలతో తిట్టకూడదు. దానికి కారణం ఉంది. నాన్నకు కోపం వచ్చినప్పుడల్లా ఆ రెండు మాటలతోనే అమ్మను తిట్టేవాడు. అమ్మ దాన్ని నిరసిస్తున్నట్టు ఒక చిన్న నవ్వు నవ్వేది. అయితే ఆ రెండు మాటలు అమ్మను ఎంత బాధపెట్టేవో నాకు తెలుసు. నాన్న ఎప్పుడూ తిట్టడం మామూలే అయినా ఆ మాటలతో తిట్టినప్పుడు మాత్రం అమ్మ లైట్ ఆపేసి కొట్టంలో పడుకుని ఉన్న ఆవు కేసి చూస్తూ చాలాసేపు నిలుచుని ఉండిపోయేది. నేను వెళ్ళి చూస్తే అమ్మ కళ్ళ నుండి నీళ్ళు కారుతూ ఉండేవి.
నాన్న చనిపోయే ముందు చివరిగా మాట్లాడిన మాటలు కూడా అవే. బయటకు వెళ్ళి మిట్టమధ్యాహ్నం ఒంటిగంటప్పుడు ఆకలితో గబగబా ఇంటికి వచ్చిన ఆయనకు, అమ్మ కోళ్ళగూడుకు అడ్డంగా పెట్టే కర్ర కాలికి అడ్డంపడి వెల్లకిలా పడ్డాడు. తల వెనుక భాగం నేలకు గుద్దుకుంది. ఆ చప్పుడు విని అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేటప్పటికే ఆయన కళ్ళు తేలవేశాడు. ఆ స్థితిలోకూడా ముఖం అంతా కోపం నింపుకొని తిట్టాడు.
“ఏం పీకడానికి ఈ కర్రను ఇక్కడ పెట్టి చచ్చావే బజారులంజా!” నాన్న కళ్ళు మెల్లగా మూసుకుపోయాయి. అమ్మ గుండెలు బాదుకుంటూ గట్టిగా ఏడ్చింది.
నాన్న ఉద్యోగంలో ఉన్నప్పుడే చనిపోవడం వల్ల ఆయన ఉద్యోగం నాకు వచ్చింది. ఆయన నాగర్‌కోవిల్ తాశీల్దారు ఆఫీసులో ఉద్యోగం చేసేవాడు.
అమ్మ ఎక్కడెక్కడో వెతికి తిక్కణంగోడులో ఒక అమ్మాయిని చూసి నాకు పెళ్ళి చేసింది. సుందరి, నేను నాగర్‌కోవిల్ శెట్టివీధిలో అద్దె ఇల్లు తీసుకుని ఉండేవాళ్ళం. నీటిలో పడ్డ మట్టిపెళ్ళలా కామం కరిగిపోయినప్పుడే సుందరికీ నాకూ గొడవలు మొదలయ్యాయి. నాన్న చేసిపోయిన అప్పులు తీర్చడానికి తన నగలను అడిగినప్పుడు మొండిగా ఇవ్వననేసింది. నేను తనను బతిమలాడాను. రెండేళ్ళలో వాటిని తిరిగి ఇచ్చేస్తానని ప్రమాణం కూడా చేశాను. ఏ మాత్రమూ కదలలేదు. ప్రతిసారీ తను చెప్పే సమాధానం ఒక్కటే.
‘ఇది మా నాన్న సంపాదన.’
నేను ఇక అనటానికి ఏమీలేక ఊరుకునేవాణ్ణి.
‘తెల్లారేలోపు లక్ష రూపాయలు ఇస్తా’నని రామచంద్రానికి మాటిచ్చాను. ఎవరి దగ్గర అడిగినా డబ్బులు దొరకలేదు. ఊరంతా తిరిగి తిరిగి ఇంటికి వచ్చాను. సుందరి వంట గదిలో నిల్చుని ఉండడం కనిపించింది. మెల్లగా లోనికి వెళ్ళాను. నగలు ఇమ్మని అడిగాను. తననుండి ఎప్పటిలాగే అదే సమాధానం వచ్చింది. నాకు కోపం వచ్చింది. నాకే తెలియకుండా నా నాలుక మీదకు ఆ మాట వచ్చేసింది. ‘లంజా!’ కానీ ఆ మాటను పలకడానికి నాలుక వణికింది. నేను గబగబా పక్కనున్న చెంబుతో నీళ్ళు నింపుకొని గటగటా తాగాను. తాగుతున్నప్పుడు ఎన్నో ఆలోచనలు. తనను కొట్టి నగలు లాక్కోవచ్చు. లేదా తనకు తెలియకుండా నగలను తీసేసుకోవచ్చు. లేదా తలను బండరాయితో మోదచ్చు. ‘లంజా!’ నాలుక వణికింది. నేను నా శక్తినంతా కూడగట్టుకుని అదుపులోకి తెచ్చుకున్నాను. పక్కనున్న ప్లాస్టిక్ బిందెను కాలితో ఒక్క తన్ను తన్నాను. అది నేలమీద పడి దొర్లి వంటగదంతా నీళ్ళు చిమ్మింది. సుందరి తలవంచుకుని గోడకు ఆనుకుని నిల్చుని ఉంది. నేను చేతిలో ఉన్న చెంబును నేలకు విసిరి కొట్టేసి బయటకు వచ్చేశాను. ముందుగదిలో ఉన్న కుర్చీలో కూర్చున్నప్పుడు, నా బుద్ధికి ఏదో తట్టింది. తల పైకెత్తి చూశాను. ఎదురుగా ఉన్న కుర్చీలో నాన్న కూర్చుని ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు వేసుకున్న అదే చొక్కా, కట్టుకున్న అదే పంచ. నా గుండె ఒక క్షణం ఆగి మళ్ళీ కొట్టుకోసాగింది.
సుందరి దగ్గరికి వచ్చి నిల్చుంది. అరవడం మొదలుపెట్టింది. నేను నాన్న కళ్ళనే చూస్తూ ఉండిపోయాను. ఆయన కళ్ళు క్రూరత్వాన్ని, కోపాన్ని, పశ్చాత్తాపాన్ని ఏకకాలంలో చూపిస్తున్నాయి. నేను మాట్లాడకుండా ఉండడం గమనించిన సుందరి ఇంకా కోపంగా అరిచింది. నాన్న ఇప్పుడు ఉరిమి చూశాడు. ఆయన కళ్ళను చూసే ధైర్యంలేక నేను తలవంచుకున్నాను. ఒళ్ళంతా కరెంటు పాకుతున్నట్టు అనిపించింది. ఉన్నట్టుండి నాన్న గొంతు వినిపించింది.
‘ఒరేయ్ విజయ్, తిట్టరా! దాన్ని లంజా అని తిట్టు. అప్పుడుగాని మూసుకోదు.’
నేను భయంతో నాన్నకేసి చూశాను. నాన్న కోపంగా లేచి నిల్చుని అరుస్తున్నాడు. సుందరి ఎడమవైపు నిలుచుని అరుస్తుంది.
“మీరేమైనా మూగవారా?”
నాన్న కుడివైపు నుండి అరుస్తూ ఉన్నాడు. ‘ఒరేయ్, లంజా అని తిట్టరా.’
నేను పూర్తిగా అలసిపోయాను. ఏమీ చేయలేనివాడిలా నాన్నకేసి చూశాను. నాన్న అరుపులు ఇప్పుడు తగ్గిపోయాయి. ఆయన ఛాతీ మాత్రం పైకీ కిందకీ ఎగిరిపడుతోంది. సుందరి కూడా ఆపేసింది. నా ప్రవర్తన ఆమెకు విచిత్రంగా అనిపించి ఉండొచ్చు. చివరిగా చెప్పింది.
“ఏం చేసినా సరే! నేను ఇవ్వనుగాక ఇవ్వను!”
‘తిట్టరా!’
చుట్టూ గొంతులు వినిపిస్తుండగా నేను లోతైన బావిలో ఉన్నట్టు అనిపించింది. నాన్న కోపంతో తలుపును గట్టిగా బాది బయటకు వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదనిపించి నేను ఇంటి నుంచి బయటపడ్డాను. నా పాత యమహా ఆర్ఎక్స్ బండిని తొక్కి దాన్ని ఎగరనిచ్చాను. నేరుగా ఎస్ఎల్‌బి హైయర్ సెకండరీ స్కూలు ఫుట్‌బాల్ మైదానంలో బండి ఆపి, ఎడ్యుకేషన్ ఆఫీసు అరుగుమీద కూర్చున్నాను. రెండు నిముషాలకంటే ఎక్కువసేపు అక్కడ కూర్చోలేకపోయాను. ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసు రోడ్డు మీదుగా వెళ్ళి గోపాలపిళ్ళై హాస్పిటల్ పక్కన ఉన్న రచయిత ఇంటిముందు బండి ఆపాను. సెల్వాన్ని తలచుకుంటే కోపం పొంగుకొచ్చింది. నాలుగేళ్ళకు ముందు అనుకోకుండా ఈ ఇంటి ముందుకు వచ్చినప్పుడు వాడే నాకు ఈ రచయిత గురించి చెప్పాడు.
“ఒరేయ్, తెలుసా. మహా పెద్ద రచయిత. అయితే ఇక్కడి వాళ్ళెవరికీ ఈయన గురించి తెలియదు.”
నాకు ఆసక్తిగా అనిపించి ఆయన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. తర్వాత మరొకరు, ఆ తర్వాత ఇంకొకరు అంటూ ఇలా సాగింది సాహిత్యం.
ఎందుకో అనిపించింది. ‘దీనెమ్మ! ఈ సాహిత్యం బొంగు, బోషాణం! ఇవేవీ చదవకపోయింటే ఆ లంజని నాలుగు తన్ని, నోటికొచ్చినట్టు తిట్టేసి హాయిగా ఉందునుగదా!’
తలను గట్టిగా ఊపుకుంటూ అక్కడున్న ఒక చెట్టుకింద కాసేపు నిల్చున్నాను. అమ్మ ఎప్పుడో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ‘మీ నాయన ఏనాడూ ప్రేమగా ఒక్క మాట అని ఎరగడు. ఇంక దేనీకీ తక్కువ లేదు. ఆయితే ఆడదానికి కావలసింది ఆ నాలుగు మాటలే!’
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. పక్కనే ఉన్న వేట్టాళి అమ్మోరు గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాను. బైకుని శెట్టికుళం వైపుకు తిప్పుతుండగా అక్కడ కనిపించిన పూల అంగట్లో కొన్ని జాజిపూలు తీసుకున్నాను. మనసు కొంచం తేలికపడినట్టు అనిపించింది. ఇంటి ముందు బండి ఆపాను.
ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చినవాడిలా చూట్టూ కలియజూశాను. నాన్న ఎక్కడా అగుపించలేదు. రెండో అంతస్తు ఎక్కి ఇంటి గుమ్మం దగ్గరకు చేరుకున్నప్పుడు వెనకాల ఎవరో నిల్చుని ఉన్నట్టు అనిపించింది. ధైర్యం చేసుకుని తిరిగి చూశాను. ఎదిరింటి పసిపాప వేళ్ళు చప్పరిస్తూ నిల్చుని ఉంది. నిట్టూర్చి ఆ పాప బుగ్గ నిమిరి తలుపు తట్టాను. ఎంతసేపటికీ తలుపు తెరవలేదు. మళ్ళీ గట్టిగా తట్టాను. సుందరి వచ్చి తలుపు తెరిచింది. తన ముఖం వాచిపోయి ఉంది. నేను చేతిలో ఉన్న జాజులను ఆమెకు ఇచ్చాను. మాట్లాడకుండా తీసుకుంది. అప్రయత్నంగా జారవేసిన పడక గది తలుపుగుండా చూశాను. నాన్న కాళ్ళు మెల్లగా ఊగుతున్నాయి. నాకు ఒళ్ళు వణకసాగింది. పొత్తికడుపులో ఏదో మెలికలు తిరుగుతున్నట్టు అనిపించింది. వెంటనే బాత్రూముకు వెళ్తే బాగుంటుంది అనుకున్నాను. సుందరి మెల్లగా అంది.
“ఈ పూలు తీసుకొచ్చి ఇచ్చి రేపు తెల్లారగానే నగలిమ్మని అడిగితే ఇవ్వను.”
“అవతలికి పోవే లంజా!”
నన్ను నేనే నమ్మలేకపోయాను. ఒక క్షణం జారిపోయాను. నాన్న కాళ్ళను చూస్తూ ఉండటంవల్ల ఇలా జరిగిపోయింది. సుందరి చుబుకం వణుకుతోంది. ఎప్పుడెప్పుడు ఏడ్చేస్తుందా అని అనిపించింది. వేగంగా వంటగదిలోకి వెళ్ళింది. ఉండి ఉండి ఏడుపు శబ్దం. పడక గది తలుపు తీసుకుని నాన్న బయటకు వచ్చాడు. క్రూరమైన నవ్వు, ప్రశాంతతా నిండినట్టు ఉంది ఆయన ముఖం.
‘దానిని తిట్టినందుకు బాధపడకు. ఎప్పటికప్పుడు వాళ్ళ పొగరు అణచిపెడుతూ ఉంచాలి. లేదంటే ఇలానే చెప్పిన మాట వినకుండా ఇష్టమొచ్చినట్టు ఆడతారు. ఆ రెండో మాట కూడా అనేయ్.’
నేను ఇప్పుడు మనసులో మరింత గట్టిగా నిర్ణయించుకున్నాను. ఈయన దగ్గర ఓడిపోకూడదు. ఆ మాటను ఎప్పుడూ వాడకూడదు అని.
సుందరి ఏడుస్తున్న శబ్దం మెల్లగా వినిపిస్తోంది. నేను వంటగదిలోకి తొంగి చూశాను. ఆమె తలవంచుకుని ఏడుస్తోంది. నేను వెళ్ళి పడుకున్నాను.
మొద్దులా నిద్రపోయాను. తెల్లవారాక లేచి చూస్తే బాగా వర్షం పడి వెలిసినట్టుంది. ఏదైనా ఎండ ప్రాంతానికి వెళ్ళొస్తే బాగుండనిపించింది. సుందరితో చెప్పకుండా బండి తీసుకుని వడక్కన్కుళం దాకా వెళ్దాం అనుకుని బయలుదేరాను. నాకే తెలియకుండా శెట్టికుళం వెళ్ళి గోపాలపిళ్ళై హాస్పిటల్ పక్కన బండి ఆపాను. కాసేపు ఆ రచయిత ఇంటినే చూస్తూ కూర్చున్నాను. మెల్లగా చినుకులు మొదలయ్యాయి. ఫోన్ ఆఫ్ చేసేసుకుని వడక్కన్కుళం వైపుకు బండిని నడిపాను. ఆరల్వాయ్‌మొళి దాటుకున్నప్పుడు వర్షం లేదు. ఆకాశం తేటగా ఉంది. పడమటి దిక్కున నల్లటి మేఘాలు కొండ శిఖరాన్ని కప్పేసి ఉన్నాయి. ముప్పందల్ గుడికి వెళ్ళి కాసేపు కూర్చుని మళ్ళీ బండి ఎక్కినప్పుడు నాన్న నవ్వుతూ రోడ్డు పక్కన ఎదురుగా నిల్చుని ఉన్నాడు. నేను వేగాన్ని పెంచాను. బండి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. నాన్న వెనక సీటు కమ్మీని పట్టుకుని వేగంగా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు.
రాత్రి ఇంటికి వచ్చాక సుందరి అడిగింది.
“ఇవాళ పనికి పోలేదా?”
“పోలేదు.”
“ఇట్టా లీవు పెట్టి తిరక్కుంటేనేం?”
నాన్న మొరటు గొంతు వెనకనుండి కటువుగా వినిపించింది. ‘బజారుదానా అని తిట్టరా!’
నేను వెనక్కి తిరిగి నాన్నను చూసి కోపంగా అరిచాను.
“ముందు నువ్వు బయటకు పో!”
‘నువ్వు ఆమెను తిట్టందే నేను పోను!’
నేను కోపంతో ఆయన్ని కాలితో తన్నాను. కిటికీకి నా కాలు తగిలి రక్తం కారసాగింది. నాన్న ఇప్పుడు టీవీ ఉన్న టేబుల్ మీద కూర్చుని ఉన్నాడు. నేను పక్కనున్న కుర్చీ తీసి ఆయన మీదకు విసిరాను.
టీవీ పగిలిపోయింది. సుందరి అరవసాగింది.
“మీకేఁవైనా పిచ్చి పట్టిందా?”
నాన్న ఇప్పుడు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. నేను కుర్చీ అందుకుని విసిరికొట్టాను. కుర్చీ బోర్లా పడింది. పడకగదిలో శబ్దం విని నేను పరుగెట్టాను. సుందరికి ఇప్పుడు పరిస్థితి కొంత అర్థం అయింది. ఇంటినుండి బయటకు వెళ్ళి తలుపుకు బైట గడియపెట్టేసి, కిటికీ నుండి లోపలికి చూస్తూ ఉంది. నాన్న గబగబా తాడు తీసుకుని వేలాడుతున్న ఫ్యానుకు కట్టాడు.
‘ఒరేయ్, నువ్వు తిట్టలేదంటే నేను ఉరేసుకుని చచ్చిపోతాను!’
“పరవాలేదు చావు!”
‘ఒరేయ్, నేను వేళాకోళానికి చెప్పడం లేదు. నిజంగానే చచ్చిపోతాను!’
నాన్న కళ్ళల్లో కన్నీళ్ళు. ఇలా కన్నీళ్ళు కారుస్తూ ఆయన్ని ఎప్పుడూ చూడలేదు. నాన్ను ఏడుపు గొంతుతో ‘నువ్వు మగాడివిరా… నా కొడుకువి!’ అన్నాడు.
“నాన్నా, నువ్వు ఇక్కణ్ణుంచి వెళ్ళిపో. దయచేసి వెళ్ళిపో!”
నేను ఆయన కాళ్ళను గట్టిగా పట్టుకుని బతిమలాడాను.
‘నువ్వు దానిని తిడితేనే వెళ్ళిపోతాను!’
“నా వల్ల కాదు!”
నాన్న కాళ్ళను పట్టుకుని ఉన్న నా చేతులను గబగబా విదిలించుకున్నాడు. తాడును మెడలో తగిలించుకున్నాడు. ‘తిట్టవా? నా మాట వినవా?’ అంటూ ఆయన పెదవులు కదులుతూనే ఉన్నాయి.
నేను గబగబా లేచి ‘నేను నీ దగ్గర ఓడిపోను’ అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి కత్తి తీసుకుని పడకగదిలోకి వెళ్ళాను. కత్తిని చూడగానే నాన్న కళ్ళు భయంతో నిలిచిపోయాయి. నేను కత్తిని కుడిచేతి పిడికిట్లో బిగించి పట్టుకొని నా నాలుకను ఎడమ చేత్తో లాగి పట్టుకుని చకచకా కోసేశాను. రక్తం బొటబొటా కారుతోంది. నాన్న గట్టిగా ఏడ్చి మౌనమయ్యాడు.
నేను సగం మత్తులో ఉన్నాను. నాన్న తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు.
(మూలం: నిండ్ఱెరియుమ్ చుడర్ (2023) అనే కథల సంపుటిలోని ‘అప్పావిన్ కురల్’ అనే కథ)