చాలామందికి చరిత్ర నుంచి పురాణాన్ని తీసి నగ్నంగా చూపిస్తే నచ్చదు. ముఖ్యంగా మహావీరుల, నేతల చరిత్ర రంగురంగుల సినిమా సెంటిమెంట్లు కలిపి జిగట జీడిపాకంలా సాగదీస్తేనే మహా నచ్చుతుంది. పబ్లిషర్లకు గిట్టుబాటవుతుంది. దీనికి ఉదాహరణలు మొదలుపెడితే కిలోమీటర్ల కొద్దీ సాగుతుంది. ప్రస్తుతం అధికార రాజకీయవర్గాల ప్రధాన కార్యక్రమం చరిత్రను పరమ రొమేంటిక్ చలనచిత్రంగా చూపడమే గదా! అది పాఠ్యపుస్తకాలకు పాకేవరకు కృషి జరుగుతోంది. ఈ ప్రమాదం పసిగట్టి, గట్టి పరిశోధన జరిపి సత్ఫలితం రాబట్టిన చరిత్ర పుస్తకాలు, వాటి సమగ్ర వివరాలున్న నవలా సాహిత్యం ఇవాళ అత్యవసరమయింది. నిజమేదో, నిజం వంటిది, నిజంలా కనిపించేదీ ఏమిటో నికరంగా తేలాలి. ఇలా వాస్తవ వెలుగురేఖలు స్పష్టం కావలసిన ఆధునిక దశలో కదా మనమంతా వుంటున్నది. అందుకే ఆ మధ్య అచ్చయిన ఝాన్సీ (‘పరాయి పాలనను ఎదిరించిన’ అనే అనవసరపు ట్యాగ్ గల) నవల కొని చదవటం అవసరం. రచయిత్రి మహాశ్వేతాదేవి తమ సాహితీ జీవితపు తొలి దశలో ఎంతో శ్రమించి పరిశోధన జరిపిన మీదట రాబట్టిన వాస్తవ కథ, రూపం ఈ నవల.
ఫేస్‌బుక్కిష్, వాట్సప్ విశ్వవిద్యాలయాల కాషాయ పాండిత్యం, జ్ఞానం స్కీము లేని డ్రైనేజీ గొట్టాలు పగిలి ప్రవహిస్తోన్న ఈ రోజుల్లో ఝాన్సీ నవల చదవడం మనకి ఎంతో ప్రయోజనకరం అని పాఠకుడిగా నాకనిపించింది. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి మీద ఏర్పడ్డ సందేహాలకు, ప్రశ్నలకు మంచి సమాధానం ఈ నవల.
నవల చివరిభాగంలో మహాశ్వేత తాము పడిన సర్వసకల తిప్పలు, ఎదురయిన ప్రమాదాలను సవివరంగా రాసేరు. శ్రమ పడకుండా పడక కుర్చీలో కునికిపాట్లు పడుతూ చారిత్రక నవల రాసే ప్రక్రియకు ఆమె విరుద్ధం గనుక ఝాన్సీ రాణి మునిమనవలను, బంధువులను; కాల్పి, గ్వాలియర్ ప్రాంతాల్లో తిరిగి వృద్ధుల జ్ఞాపకాల మూటల్లోంచి వివరాలను సేకరించారు. వాటిలో కల్పనలను, ఊహలనూ విడదీసి, వెదికిన డాక్యుమెంట్లలోని వివరాలు సరిపోల్చుకుని నోట్సు రాసుకున్నారు. పురావస్తు శాఖ, చరిత్ర విభాగాల ఆర్కైవ్స్‌లో పత్రాలను, గెజిట్లను పరిశీలించడమే గాక గతంలో ఆమె చదివిన గ్రంథాలు, నవలలు అధికశాతం వట్టి రొమేంటిక్ వర్ణనలేనని, హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ సెమినార్లలో అంశాలవారీగా చర్చించి ఖాయం చేసుకున్నారు మహాశ్వేత. అలా వాస్తవాన్వేషణలో సి.ఐ.డి.లాగ ఆమె పడిన శ్రమ, కృషి, ప్రతి చిన్న వివరం తెరతీసి కనిపిస్తుంది. 1956 నాటికే ఈ నవలకు అవసరమయిన పరిశోధన పూర్తయి నవల రాయడం ఆరంభించారు మహాశ్వేత. అసలీ నవల పూర్తి పరిశోధన కాకముందు ఒక మార్గంలో రాసేసి, తరవాత చదువుకుంటే తనకే బాగులేదనిపించి ఆ నవలని చింపేసి తిరగరాసేరు! (నమస్కారం తల్లీ!) ఇప్పుడు ఎవరూ అలాంటి సాహసం చేయరనుకుంటా!
ఒక పాఠకుడిగా ఝాన్సీ రాణి ప్రతి కదలికకు చలించిపోయాను. ఆవిడ ప్రేమలో పడ్డట్టే లెక్క (అసలే చక్కదనం గాక, అంత పెద్ద జుత్తు!) ఆపై, తెలివయిన గుర్రాన్ని అధీనంలో వుంచుకోడం, సకాలంలో గొప్ప వ్యూహరచన చేయడం, స్వదేశీ విదేశీ వీరులకు ధీటుగా ధైర్య ప్రదర్శన! అసలు ‘సాటి’ అనే పదమే అవసరం లేనంత గట్టి పట్టుదలతో తనని మోసం చేసినవారిని సైతం ఆశ్చర్యంలో పడేసే ఎత్తుగడలు! భలే మనిషి- పోనీ, భలే రాణి! చూస్తే బాగుండుననిపిస్తూంది. రాణి తన చివరి దశలో వున్న నిస్సహాయ పరిస్థితికి అధైర్యపడలేదు గాని, నవల చదివే మనం మాత్రం కనుకొసల తడిని నిలువరించలేమనే చెప్పాలి. పరిచారికలు, మిత్రులేగాక చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలు రాణి మీద గొప్ప ప్రేమాభిమానగౌరవాలు ప్రదర్శించి ఆంగ్ల సైనికాధికారుల పగకు సకల నాశనం అయ్యారు, మంటల్లో కాలిపోయారన్న వివరాలకు ఆధారాలు చెప్పారు రచయిత్రి. తలిదండ్రులు, భర్త, కన్నబిడ్డ, దగ్గరి బంధుజనం దూరం అయి, వంటరిగా నిలిచి, చుట్టుముట్టిన ద్రోహుల నీడల్లో నిలదొక్కుకోవడం, రివాల్వర్ బదులు కత్తినే నమ్ముకున్న తెగింపును, అందుకు తగ్గ సైనిక శిక్షణలో మెలకువలు రాబట్టి పోరాడటం – దేనినీ అభినందించకుండా వుండలేం అనిపిస్తుంది పేజీలు తిరిగేస్తుంటే. రచయిత్రి రాసినవి వట్టి వర్ణనలు కావు, అన్నీ పరిశోధన ఫలితాలే అని చెప్పటం నా ఉద్దేశం.
ఆ మధ్య ఝాన్సీ రాణి సన్నిహితుల్లో ఒకరయిన వీరనారి ఝల్కారీ బాయి గురించిన చర్చ చదివాను గానీ వచ్చిన పుస్తకం చదవలేదు. ఇక్కడ నవలలో మహాశ్వేతాదేవి తమ పరిశోధనలో వెలుగుపట్టిన చోట ఝల్కారీ ఘట్టం చిన్నదిగానే ఉంది. ఐతే అది అతి సాహస దృశ్యం, అసమాన ప్రేమాభిమానాల ఫలితం… మరి మహాశ్వేత కంటే కొత్తగా ఎన్ని వివరాలపై ఎంత పరిశోధలను ఎవరు ఎలా సాధించారో నాకు తెలియదు. ఇక ఝాన్సీరాణి వయసెంత ఆనాటికి… కాలేజీలో చదువు అయిన అమ్మాయి వయసే! ఎక్కడా ఆమె నాటి కుల, మత, ఆచార వ్యవహారాలు, రీతిరివాజులపై శ్రద్ధాసక్తులు కనబరచి, వాటి కోసం పట్టుబట్టిన దాఖలాలు లేవు. వాటికి విలువ ఇచ్చి నెత్తికి రాసుకుంటే రాణి ముందే పతనమై ఝాన్సీ సులువుగా ఈస్ట్ ఇండియా కంపెనీకి చిన్న గుడారమయివుండేదే. అన్ని రకాల ఘోరాలకూ వంటరిగా ఎదురెళ్ళి గొడవపడటం ఆ అమ్మాయికి ఎంత కష్టం?! రాచరిక వ్యవస్థ, ఫ్యూడల్ వాసనల అధికార బలదర్పాల నీడల కాలమన్నది నిజమే. కానీ మణికర్ణిక అనే అమ్మాయి వీటితో చెలరేగి శుద్ధ తెలివితక్కువ పని చేసిన వైనం కనబడలేదు రచయిత్రి జరిపిన అన్వేషణ, పరిశోధనలో. ఆమె చుట్టూ వున్నవారిలో ఎక్కువమంది వర్ణవిభేదాలు లేనివారనిపించదు. శ్వేతపత్రంలాంటి పరిశోధనాసారం గల ఈ నవల పుటలు తిరగేస్తే చరిత్ర వివరాల్లో రచయిత్రి ఎక్కడా, దేనికీ బద్ధకించిన తీరు కనిపించదు.
ఈ నవలను తెలుగు చేసినది రివేరా, కృష్ణకాంత్. ఈ ఇద్దరు రచయితలయిన అనువాదకుల శ్రమను అభినందించాలి. వీరితో కరచాలనం చేసి తీరవలసిందేను. సరే, కొన్ని లోపాలు అక్కడక్కడా పేజీల్లో కనపడకపోలేదు. ఆంగ్లవాక్యాల్లాంటి తెలుగు వ్యాక్యాలు, అనువాదానికి సరిపడని తెలుగు పదాలు, డబ్బింగు సినిమా సంభాషణ వంటి వాక్యాలు కొన్ని అగుపడగా, ఓ చేత్తో డెస్క్‌లో కూర్చొని గబగబా వార్తలు అనువదించిన చేత్తో, అదేదో ధోరణిలో చేసిన తర్జుమా వాక్యాలు, తెలుగు వార్తల్లో నలిగే పదాలూ కనిపించాయి. అయితే ఇవేవీ ముఖ్యమైన ఇబ్బందులుగా నవల చదువుతోంటే అనిపించలేదు.
మహాశ్వేత ఏనాడో రాసిన నవలను ఆ మధ్య ఎప్పుడో అనువదించి అచ్చువేస్తే కొందరికి ఈ నవల మీద కళ్ళుపడ్డాయి! నాకు మాత్రం మనసు పడింది. మీరు చదివి చెప్పండి.