కళకాలమ్: 1. కళగని…

కంటికి బుర్ర వున్నా, బుర్రకి కన్ను వున్నా ఎంతో బాగుండేది కదూ! ఎందుకంటే ఇప్పుడు మనకి వున్న రెండు కళ్ళూ, రెండు చేతుల్లాగ ఎన్నిటినో అందుకోడానికి, ఎంతెంతో తెలుసుకోడానికి గొప్ప తిప్పలు పడుతుంటాయి. అందుకే, జానపద గిరిజన కథల్లో, వాళ్ళ బొమ్మల్లో, మనుషుల నెత్తి మీద లేదా అరచేతి మీద ఓ కన్ను చిత్రించి వుంటుంది. ప్రతీకలూ ప్రతీకవాదాలూ పక్కనబెడితే సకల జాతుల పురాణాల కథల్లోకన్నా గిరిజన చిత్రకళలో ప్రతిదీ సరళంగానే వుంటుంది. ఐతే వారి బొమ్మలు చూడటం మనకి అంతగా అలవాటు లేకపోతే ఆ బొమ్మల్లో లేనిపోని అంతరార్థాలు వెదకటం మొదలుపెడతాం. ఇక్కడే కంటికి ‘చూపు’ అవసరం. కంటికి ‘చూపు’ అవసరం అన్న దృష్టి వుంటే కళ అనే పదార్థం తికమకలు పెట్టదు- లేదా, మనం తికమక పెట్టం. అందుకే పాల్‌ సిజాన్ (Paul Cezanne) అనే ఆసామి గురించి మరో చిత్రకారుడు ఇలా అన్నాడు: He has an eye, but what an eye! కంటికి కాస్త నదురుగా ఉన్న ఆడకూతురు కనిపిస్తే చాలు… ఎక్కడ వున్నా అతిసులువుగా కన్ను పట్టేస్తుంది. అందుకు బుద్ధి సహకరిస్తుంది ఆ ముహూర్తంలో! అలాగే, అంతే సులువుగా, బొమ్మల్ని, చిత్రకళని, శిల్పకళని ‘గుర్తించ’గలిగితే ఆ కళ్ళను చాలా మెచ్చుకోవచ్చు. ఐతే ఇక్కడొక చిక్కుంది. నాకు తోచిందే అందం, కానిది కాదు- అని మొండికేస్తే మనం ఏం చెప్పగలం? అందుకే మనకీ అడ్డగాడిదకూ కనీసం ‘కళ’ను పసిగట్టే విషయంలో కచ్చితమైన తేడా వుండి తీరాలిగదా!

అసలు ‘చూడటం’ మొదలుపెడితే ‘కనబడటం’ మొదలై అది అనంతంగా మనం చచ్చేదాకా సాగుతుంది. ఒక పక్క ప్రకృతి అందచందాలు, మరో పక్క మనిషి తయారుచేసిన, చేస్తోన్న కళ, దాని సౌందర్యం, వెరసి కంటికి కునుకు లేకుండా చేస్తుంటాయి. ముందస్తుగా కళాత్మకమైనవాటిని, కళాఖండాలని, తరచుగా విరివిగా చూడటం అలవాటయితే మన కన్నే మనకు బోలెడు చెబుతుంది. అసలు టూకీగా కళ అనగానేమి అని కొంపముంచే ప్రశ్న వేసేవారికి గడుసు సమాధానం లేకపోలేదు; ‘ఒక రాతిని తీస్కో. దానిమీద గుర్రం కానిదంతా చెక్కిపడెయ్యి… అదే ఆర్ట్!’ అని. ఇలాగని అతిసులువుగా చెప్పటం ధర్మంగాదని శుక్రనీతిసారం, విష్ణు ధర్మోత్తరం వంటి గ్రంథాల్లో కళ గురించి విస్తారంగా మనవాళ్ళు చెప్పిపడేసేరు అని కొందరు పెద్దలన్నారు.

డవిన్చీ, జార్జో వెసారి (Giorgio Vasari), వాల్టెయిర్, ఆన్రి రూసో (Henri Rousseau), హర్బర్ట్ రీడ్ (Herbert Reed), వైల్డ్, గియామ్ ఎపొలినేర్ (Guillaume Apollinaire), పికాసో, టాల్‌స్టాయ్, బొదొవ్- ఇంత పెద్ద జాబితా లాటిన్, ఫ్రెంచి, రష్యన్, ఇంగ్లిష్ భాషల్లో చెప్పిపడేస్తే; మనకి అరవిందులు, ఆనంద కూమారస్వామి (Ananda Coomaraswamy), మార్క్ కజిన్స్, టాగూర్, అవనీంద్రనాథ్, నందలాల్ బోస్ వంటి పెద్ద జాబితాలోని మహనీయులు ఆర్ట్ గురించి వొళ్ళు గుల్ల చేసుకుని చెప్పారు. స్టెల్లా క్రమ్‌రిష్ (Stella Kramrisch), ఒ. సి. గంగూలీ, జగదీశ్ మిత్తల్ (Jagdish Mittal) వరకూ ఇంకొందరు పెద్దలూ ఇంకొంచం వివరించి చెబుతూవచ్చారు. రూపం, మార్గ్ వంటి అనేక పత్రికలు, లలిత కళా అకాడెమీ వంటి పెద్ద సంస్థలూ అనేకానేక ఆర్ట్ పుస్తకాలు- అంటే భారతీయ చిత్ర శిల్ప కళలకు సంబంధించి వివిధ శైలీసంపదల గురించి మధ్యయుగాల నుంచి నేటివరకూ వచ్చిన కళను అచ్చువేసి వదిలిపెట్టాయి. ఇక కొంత అసమగ్రంగానైనా నెట్‌లో బోలెడు రాత, బొమ్మ, కళ విభాగంలో దర్శనమిస్తుంటాయి. ఇంగ్లీషులో మోడర్న్ ఆర్ట్ పత్రికలుగాక వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కాస్తో కూస్తో టూరిజం, కల్చర్ విభాగాల ద్వారా వివిధ చిత్ర శిల్ప కళాకేంద్రాల గురించి పుస్తకాలు వెలయించాయి. తెలుగులో పూర్వం ఆమంచర్లవారి నుంచి ఎస్వీ రామారావుగారి వరకు పెద్దలు చిత్ర శిల్ప కళపై సద్విమర్శ, విశ్లేషణలు చేశారు. వి. ఆర్. చిత్ర ఆంగ్లంలో శిల్పి పత్రిక తెస్తే, తెలుగులో చలసాని ప్రసాదరావు కళ అనే పత్రిక ప్రత్యేక సంచికలుగా తెచ్చారు. ఇక హైదరాబాద్‌తో సహా దాదాపు ప్రతి జిల్లా కేంద్రంలో చిన్నో చితకో మ్యూజియమ్‌ లున్నాయి. ఇలా ఎన్ని పత్రికలున్నా మ్యూజియమ్‌లున్నా గ్రంథాలున్నా నెట్ వసతి వున్నా, మన రెండు కళ్ళలో రెండేసి పువ్వులుంటే ఏం చేయగలం?

మనుషులుగా మనం సంగీతం వినటం, చిత్రశిల్పాలు చూడటం, మంచి పుస్తకాలు చదవటం – ఒక సంస్కారం, సంస్కృతి అని మనకు మనమే చెప్పుకోనిదే కళ గురించి మాట్లాడుకోవటం నిరర్థకం. ఇందుకే నోటికి వేమన, సుమతీ శతకాలు గడగడా వచ్చినట్టే కంటికి చిత్ర శిల్ప కళాఖండాలను చకచకా అప్పగించేట్టు చూడటం, చూపించటం అత్యవసర ప్రాథమిక చర్య, చికిత్స. అడ్డమైన నేలబారు సినిమాలు, వాటి పోస్టర్లూ కంటికి అలవాటు కాగా లేనిది కళాఖండాలు రెండో ఎక్కం లాగ గుర్తుండేట్టు చూడటానికి కొంత సాధన చేయలేమా! ఐతే కళని మన కంటికీ ఇంటికీ దగ్గరగా తీసుకొచ్చే పని జరగాలి. ఇందుకు ప్రభుత్వం, ఆపై ప్రైవేటు సంస్థలూ పూనుకుంటే సామాన్యులనే అసమాన్యులకి ‘కళ’ వీలయినంత దగ్గరవుతుంది. ఇవన్నీ ఎలాగనేది ముందుముందు చర్చిద్దాం.

(సశేషం)

తల్లావజ్ఝుల శివాజీ

రచయిత తల్లావజ్ఝుల శివాజీ గురించి: జననం విద్యాభ్యాసం ఒంగోలులో. కళాసాహిత్య విషయాలలో పితామహులు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రిగారి ప్రభావం బాల్యం నుంచీ. బొమ్మలు గీయడం చిన్నప్పటినుంచే స్వయంకృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగవిరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అడవులలో తిరిగి వారి జీవితాన్ని దగ్గరనుండి పరిశీలించారు. ఆ ప్రకృతి, ఆ జీవనవిధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరతలు భారతీయ సంస్కృతి, ఇతిహాసాలలో వేళ్ళూనుకున్న వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చక్కటి రచయిత, కళావిమర్శకుడు అయిన శివాజీ ఎన్నో చిత్రప్రదర్శనలు చేశారు. ...