వాడ్రేవు వీరలక్ష్మీదేవి “ఆకులో ఆకునై”

“ఆకులోఆకునై” కాలమ్‌ గా “ఆంధ్రప్రభ దినపత్రిక” లో వచ్చిన వ్యాసాలను సంకలించి అందమైన పుస్తకంగా తీసుకువచ్చారు వీరలక్ష్మీదేవిగారు. ఇందులోని వ్యాసాలు మల్లెపూవుల మీద నిలిచిన వాన చినుకుల్లా సుగంధభరితాలు. సంప్రదాయ ప్రియత్వం, అరుదైన భావుకత్వం, అమాయకత్వం ముప్పేటా కలిసిపోయి పుస్తకమంతా కనిపిస్తాయి. ఆత్మీయానుభవాలు, భాషపట్ల ప్రేమ, మారుతున్న విలువలు ఒకటేమిటి సకలవిషయాలను ,అనునయ స్వరంతో వ్యక్తం చేశారు. కృష్ణ శాస్త్రి,కాళిదాసు,శ్రీ శ్రీ,మధురాంతకం,ఇస్మాయిల్‌ ఇలా తన హృదయాన్ని తాకిన సాహితీమూర్తులను సాదరంగా తలుచుకొన్నారు. భావుకత నిండిన అలనాటి సినీ గీతాలగురించి స్వయాన గాయని అయిన రచయిత్రి మక్కువతో ప్రస్తావించారు.

వ్యాసాలన్నీ రచయిత్రి కోమల మనస్తత్వానికి దర్పణాలు. మనం మరచిపోయిన సంగతులను మాతృవివేకంతో మనసుకు పట్టేలా చేయడంలో ఉంది వీరి గొప్పతనమంతా. ఒక్కమాటలో చెప్పాలంటే “పూలబాస” తెలియాలంటే ఈ పుస్తకం తెరవండి.

పోతే “ప్రమాదో ధీమతామపి”, కొన్ని స్ఖాలిత్యాలు. బియ్యపు గింజల్లో వడ్లగింజలు. “ప్రాచీనంలో నవీనత, నవీనంలోని ప్రాచ్యం తెలుసు” అని రాస్తారు ఒకచోట. ప్రాచ్యం దిశా సూచి గాని, కాలసూచి కాదు.వాక్యోద్దేశానికి ఈ పదం పొసగదు. ఇంకొకచోట “సైకాలజీలో మానవుని మనసుని నాలుగుభాగాలు చేసి, నాలుగో భాగాన్ని unknown అంటారు” అని పేర్కొన్నారు. కానీ Freudan Psychology లో మనసు id, ego, superego గా భాగించబడినదన్న విషయం సర్వవిదితం.

“పోస్ట్‌ మాడర్నిజం” గురించి పుస్తకంలో ఒకటి రెండు చోట్ల ప్రస్తావన వుంది. త్రికాలాబాధితమైన ఈ పదానికి కొంత వివరణ అవసరం. 1926 నాటి నుండి విమర్శకులు ఈ పదాన్ని ప్రయోగిస్తూ వచ్చారు.ఆకాలం నాటి Impersonal Poetry కి భిన్నంగా వచ్చిన కవిత్వపాయను postmodern గా వ్యవహరిస్తారు. సదరు కవిత్వాన్ని ఉత్తరాధునికం (postmodern)అన్నారు.

ఇప్పటికింతే.

ప్రతులకు.రచయిత్రి పేర, 70-1/c-2, N.F.C.L ROAD, KAKINADA-3 .లేదా thammineni@lycos.com ను సంప్రదించండి.


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...