త్రిపథ: …మనవి ఆలకించరాదటే

మళ్ళీ రామాయణ భారత భాగవతాలా? ఎందుకు? ఉన్నవి చాలదా నాయనా?

నేను రామాయణ భారత భాగవతాలు మళ్ళీ రాయలేదు. ఈ పుస్తకం ఈ మహాకావ్యాల్లోని ప్రత్యేక విశేషాలతో కూర్చిన ఒక దండ. అంతే. ఇందులో నా సొంత తాత్పర్యాలు, మార్పుచేర్పులూ, బోధలవంటివేమీ లేవు.

వాల్మీకి సంస్కృత రామాయణం నుంచి, వ్యాస సంస్కృత భారతం నుంచి, తెలుగులో కవిత్రయం చేసిన మహాభారతం నుంచి, వ్యాసుని సంస్కృత భాగవతం నుంచి, అలాగే పోతన రాసిన భాగవతం నుంచి యథాతథంగా శ్లోకాల నుంచి, పద్యాల నుంచి, వచనాల నుంచి కూర్చిన సకల విశేషాల సమాహారం ఈ పుస్తకం. ఇలా చేర్చిన ముచ్చట్లలో అత్యవసరం అని నేను భావించిన చోట మూలగ్రంథాల్లోని సర్గ, పర్వం, స్కంధం, పద్యం, వచనాల సంఖ్యను బ్రాకెట్లలో చేర్చాను.

తీరికగా ఇలా మాల కట్టడానికి కారణం… అరవై సంవత్సరాల క్రితం వరకు రామాయణ భారత భాగవతాలు (ఇకపై ‘రా. భా. భా.’లు) టీకా తాత్పర్యాలు లేకుండా అచ్చయి వచ్చినవే. అత్యధికశాతం తెలుగువారు వాటిని యథాతథంగా చదివి అర్థం చేసుకోలేరని గ్రహించి, చదువరుల హితం కోరి దాదాపు నలభయి సంవత్సరాల క్రితమే ‘రా.భా.భా.’లకు ప్రముఖ పండితులు సంపాదకవర్గంగా, కమిటీగా ఏర్పడి ప్రతిపదార్థం, తాత్పర్యం కూర్చి చక్కగా అచ్చువేసి మన ముందుకు తెచ్చారు. సంస్కృతాంధ్రభాషలు కొంతమాత్రంగా కూడా తెలీని నావంటి వారికి ఇది గొప్ప సహాయమే గదా. ఐనప్పటికి ఎక్కువమంది రాసినవీ, చెప్పినవీ చూడగా వారంతా ఈ తెలుగు, సంస్కృత మూలగ్రంథాలను, ఆదికవుల రా.భా.భా.లతో సహా అటక మీద భద్రం చేశారని అనిపించింది. అందువల్ల ఎలాగూ ప్రతిపదార్థం, తాత్పర్యాలు కూర్చిన రా.భా.భా.లు వున్నవి గదా అని అసలు వాల్మీకి వ్యాసాదులు, కవిత్రయం, పోతన ఏమి రాశారో, వాటిలో ఉన్నవీ, లేనిపోనివీ ఏమున్నాయో చూద్దామనిపించి శ్రద్ధగా చదివాను. ఆది మహాకవులు ఊహించి, దర్శించిన పాత్రలు, వాటి తాత్త్వికాంశాలు, పోలికలు, సమస్తం నేలమీద వున్నవే. నేలవిడిచి సాము చేసేవి కావనిపించింది. అవి మనిషికి, అతన్ని విడదీసి చూడని సమాజానికి హితవు చెప్పినవే. క్రమ పరిణామంగా ఎదిగి పలకరించేవే, ఆ పాత్రల బలహీనతలతో సహా వికాసాన్ని కోరేవే. వీటిని చదవడం ఆధునిక రచయితలకు అవసరమైనదేననిపించింది. వాటి ఆధ్యాత్మిక భూమిక, నేపథ్యం కొందర్ని ఆకర్షించడం, కొందర్ని వికర్షించడంతో నాకు నిమిత్తం లేదు. సాధారణ పాఠకులకు, యువరచయితలకు, గతంలో ఇవి చదవనివారికీ, వట్టి శ్రోతలకూ ఉపకరిస్తుందని ఈ మూడు కావ్యాలలోని సకల విషయాలను ఆరు భాగాలుగా విడదీసి ఒక విశేషాలమాల కట్టేందుకు సూదీ, దారం పుచ్చుకున్నాను.

నిజమే, రా.భా.భా.లకు అనువాదాలు మనకు అందుబాటులో లేకపోలేదు. ఐతే వాటిలో కొన్ని యథాతథంగా లేవు. కొన్ని యథాతథంగా ఉన్నవేమో సంక్షిప్తంగా ఉన్నాయి. ఇంకెలా?! గతంలో రా.భా.భా.లపై రెండు వర్గాల పండితులను గమనించాను. ఒక వర్గంవారు వీటి నుంచి ధార్మిక, తాత్త్విక విషయాలు మాత్రమే రాసేవారు, ప్రసంగించేవారు; రెండవ వర్గం పెద్దలు వీటిలోని కావ్య సౌందర్యం, భాష, విశిష్ట వ్యాఖ్యలు మాత్రమే చెప్పేవారు, రాసేవారూనూ. వాటికి విభిన్నంగా ఇవాళ మరో రెండువర్గాలు వేరే వున్నాయి. వీరిలో ఒక వర్గం రా.భా.భా.లపై అంతూ దరీ లేని ‘అతి’ వ్యాఖ్యలతో చాదస్తపు సరిహద్దులు దాటినవారు. మరో వర్గంవారు ఈ ఆది మహాకావ్యాలను తిట్టిపోస్తూ మితిమీరిన విమర్శలు దట్టించేవారు. మొత్తంమీద వీరి ధోరణి ఒకటే: ఐతే కల్పవృక్షం, కాకుంటే విషవృక్షం. మధ్యలో మరేమీ లేనట్టే! ఈ అతివాద వివాదాలకూ అపార్థాలకూ కారణం ఈ ఆదిగ్రంథాల ప్రాచీనతేననిపించింది. వేదాలవలె ఈ ‘రా.భా.భా.’లూ ప్రాథమికంగా మౌఖిక వాఙ్మయ కాలానికి చెందినవి కదా. ఆ కాలపు శ్లోకాలు తీగలు మీటుతూ గానం చేయడానికి, కొంత అభియించటానికీ అనువయిన గాథలు, పాటలు. అసలు మన ప్రాచీన సాహిత్యం గానంచేసినదేగదా. ఇలాంటి కావ్యాలూ, బోధలూ, తాత్త్విక ప్రసంగాలూ కేవలం మౌఖికంగా కాక, రాతి మీదనో, ఆకుల మీదనో, రాగిరేకుల మీదనో రాసి వుంచనంత కాలం ఇవన్నీ అందరి సొత్తు. సుదూరదేశాల నావికులు, ఎడారి, కొండకోనలు దాటి నడచివచ్చిన యాత్రికులు, ప్రాంతీయ, స్థానిక, ఆదివాసి, గిరిజనులు, పల్లెకారులు, చక్కని గొంతు కలవారు, గొప్ప జ్ఞాపకశక్తిగలవారు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు ఎవరు ఎక్కడివారయినా వారికి ముచ్చటకలిగిన స్వీయ, పర, పరస్పర కథలూ, గాథలూ వీటికి జోడించి, లేదా నచ్చనిదో, ‘ప్రయోజనం’ లేదనిపించినదో ఆయాభాగాలు తొలగించి, కొంత చేర్చి గాథలను కొనసాగించారు. అలా కాల మహాప్రవాహగతిలో మనకి దక్కిన ప్రాచీన కావ్యాలివి. తెలుగువారిలో ‘సిద్దాంతం’, ‘భాష్యం’, ‘పురాణం’, ‘రామాయణం’ వంటి ఇంటి పేరుగల కొన్ని కుటుంబాలు పూర్వం ఇలా గానం చేస్తూ వచ్చిన వారున్నారు. వ్యాసవాల్మీకి వంటి ప్రాచీనులు ఎక్కడివారో, ఎప్పటివారో – కనీసం వారి పేరయినా మనకి మిగిలింది. అదీ పట్టింపులేని ఇతర కాలాల్లో ఎవరో ప్రాంతీయ రాజుల, రాణుల కథలు కలిపి కుట్టినవి, ఆయా రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాలు సహజంగానో, అసహజంగానో కలగలిపి, తదనుగుణంగా పండితులో, తెలివిగల గానగంధర్వులో ఏమేమో కూర్పుచేర్పులూ చేసినవీ, వారెవరో మన గుమ్మం ముందు పడేసి చక్కాపోయారు. ఇంక వాటిలో అతిపూర్వపు రాతశైలిని బట్టి తాళపత్రాల కట్టలను వేటికవి విడదీసి పరిశీలించగా, అందునుంచి అచ్చుకు నోచుకున్న గ్రంథాల గంధం సంప్రదాయంగా మిగలగా సాలవృక్షాలు తాళవృక్షాలుగానయినా (రామాయణంలో రాముడు బాణమేసి కూల్చింది ‘ఏడు తాళవృక్షాలు’ కావు, సాలవృక్షాలట) నేడు చూడగలుగుతున్నాం మనం.

ప్రాచీన సాహిత్యంలో ప్రక్షిప్తాలు సహజం. వాల్మీకి రామాయణాన్ని మహాభారతంలో ప్రసక్తి వచ్చిన చోట వ్యాసుడు కొద్దిగా మార్చిన దృశ్యాలున్నాయి. కవిత్రయం, పోతనలు ఇంకొంచెం మార్చారు. ‘జయం’ అనే భారతం ఎనిమిదివేల నుంచి లక్ష శ్లోకాల ‘మహాభారతం’ రాగా, తులసీదాసు ఒకటి రాస్తే, దక్షిణాదిన ఎందరో మరొక, ఇంకొక, వేరొక రామాయణాలు మరెన్నో రాసేరు. మూడువందల రామాయణాలే వున్నాయి, భారతం కాక. ఎవరికి నచ్చింది వారు తరాలుగా దాచుకున్నారు. ఇక మార్పుచేర్పులు, ప్రక్షిప్తాలు అన్నాకా అంతా మన మనసుకి నచ్చినవే వుండాలని లేదు. క్షమార్హం కానివి, వింత విచిత్ర కషాయాలు, కాషాయాలూ కూడా చేరి వున్నాయి. ఈ ప్రాచీన ఇతిహాస, కావ్యాల్లో నచ్చినవి గ్రహించి నచ్చనివి విడిచిపెట్టక తప్పని స్థితి క్షుణ్ణంగా చదివితేనే తెలుస్తుందనిపించింది. మొదటితరం మహనీయులేగాక, ఆమధ్య, మొన్న, నిన్న పెద్దలు ఇంగువ కార్తికేయశర్మ, నిడదవోలు వెంకటరావు, కృష్ణశాస్త్రి, తిరుమల రామచంద్ర, గడియారంవారు, బూదరాజు రాధాకృష్ణ, చీమకుర్తి, పరబ్రహ్మశాస్త్రి మొదలయిన వారి వరకూ ఎందరో చారిత్రక పరిశోధకులు, పండితులు, పరిశీలించినదాని ప్రకారం శిలాశాసనాల్లో, రాగిరేకుల్లో ఆయా పాఠాల్లో పదాలు, అక్షరాలు కొన్ని శిథిలం కాగా, కావాలని కొందరు దొలిచివేశారన్న విషయాలు చెప్పారు. చెదలు తినిపోయినదిగాక చదువొచ్చిన రాయసగాళ్ళ తాళపత్రాల్లో స్వీయ కల్పనలు చేర్చిన వైనమూ వుంది. కాలగతిలో ఎవరికి తోచింది వారు ఈ కావ్యాల్లో చేర్చారు, మార్చారు.

ఇక మన బుర్రలోగల చట్రంలో మన ఇష్టాయిష్టాలను బట్టి ప్రాచీన సంస్కృతిని, సాహిత్యాన్ని ఎంచుకోవచ్చుగాని, ఎంచుకున్న దానినే నిర్ధారించేసి, భీష్మించుకుని అవే ఆనాట వాస్తవరూపాలని మొండికెత్తడాన్ని ఏమనగలం? పూర్వకాలంలోనే మూలగ్రంథాల విషయంలో కాళిదాస మహాకవి చెప్పినట్టు ‘పురాణమిత్యేవ న సాధు సర్వం’ అనే స్థితి వుండగా కాలగతిలో కుల, మత, ప్రాంతీయ, రాజకీయ, తాత్త్విక గంధకం వీటిలోకి చేరడంలో ఆశ్చర్యంలేదు – ఆ కాలుష్యంతో సహా మొత్తం ప్రతి అక్షరం పరమపవిత్రం అనుకోవడం, కాదు, మొత్తం అంతా చెత్త అని నేలకేసి కొట్టడమూ ఒకే రకపు జ్ఞానం. వేమన రాసినవి వంద పద్యాలే అని తేల్చడానికి నూట యాభై సంవత్సరాలు పట్టిందిగదా! మరి అతి ప్రాచీన కావ్యాల మాటా?! అలా అద్భుతం, అనర్థం, సుజ్ఞానం, అజ్ఞానం పడుగుపేకల్లా, చీరలో దారంలా కలగలిపిన సాహిత్యాన్ని, ముఖ్యంగా పూర్తిగా నిర్ధారణగాని, పరిశోధన పరిపూర్ణంగాని ప్రాచీన కావ్యాలని పట్టుకుని ‘అతిగా’ ఎటు ఊగినా ఫలితం ఒకటేననిపించింది. చెరువు నీటిలో తాగే ముందు కాలుష్యం తొలగించటం, పుస్తకాలు అచ్చు అయ్యే ముందు అందులో అక్షరదోషాలు తీసివేయడం, ఉడికించే ముందు బియ్యంలో రాళ్ళు ఏరి వేయటం సహజం. ప్రాచీన రా.భా.భా.ల పరిస్థితి ఇంతే. వాటిని అసలు మొట్టమొదట కాగితంపై అచ్చులోకి వచ్చేనాడు – అనగా తాళపత్రం నుంచి అచ్చులోకి వచ్చే దశలోనే ఆనాటికి గురజాడవారో, పంతులుగారో, ఆదిభట్లవారో, మానవల్లివారో, వేటూరివారో, కట్టమంచివారో, జంటకవులో, ఆంధ్ర వాల్మీకులో వెర్రిప్రక్షిప్తాలను, స్త్రీ, బలహీన వర్గాలను నీచంగా చెప్పే దృశ్యాలను, పదాలతో సహా తొలగించడానికి పండిత, చారిత్రక, పరిశోధక బృందాలతో పరిషత్తు ఏర్పరచి చర్చించి సమగ్రంగా శోధించి, కనీసం ‘ఆనాటికి తుది ప్రతి’గా, సంస్కృతాంధ్ర కవులు రాసింది ఇంతే కావచ్చని అచ్చు వేయించినట్టయితే సమగ్రమైన రా.భా.భా.లు మనకి దక్కేవి… నిరర్థకపు వాదోపవాదాలు చాలావరకూ తగ్గేవి అని అనిపిస్తుంది. నిజానికి ప్రపంచ దేశాల్లో, విప్లవాల పురిటిగడ్డలయిన దేశాలతోసహా ఎక్కడా తమ ప్రాచీన సారస్వతంపై ఎవరూ ఇంత (పరిశోధన లేకుండా, మూల గ్రంథాలు చదవకుండా ఉభయవర్గాలవారూ) ‘అతి’గా వ్యవహరించడం మీరుగాని విన్నారా?!

పెండ్యాల, సురవరంవంటి మహామహులు భారతం, రామాయణం గురించి పూర్వమే శోధించినట్టుగా కాక నేను కేవలం ప్రతిపదార్థం, (అక్కడక్కడ కొన్ని తప్పులున్నా) తాత్పర్యంగల రా.భా.భా.ల నుంచి సేకరించిన విశేషాలన్నిటిని కుప్పలుగా పోగేసాను. వీటిలోంచి ప్రకృతిని మనిషిని అతి సహజంగా పోల్చినవన్నీ ఒక భాగం చేశాను. భాష, పదప్రయోగం, దృశ్యం, సంభాషణల్లోని సౌందర్యం, సహజత్వం, ఆధునికత వుండి ముచ్చటగా వున్నవన్నీ ఒక భాగంగా కూర్చాను. అలాగే మనిషికి, సమాజానికి హితం పలికేవి, వాటికి స్పృహగలవీ ఏరి ఒక భాగం చేశాను. ఇంక కొంత భిన్నంగా, కొంచెం తేలికగా చెప్పిన అనేక తాత్త్వికమైనవి, ధార్మికమైనవి, విశేషాంశాలు ఒక భాగంగా చేర్చాను. అతి చిన్న చిన్న విశేషాలు, ఎక్కువమంది గమనించనివన్ని ఒక భాగంగా పేర్చాను. ఆపై కథకి, సంఘటనలకు, పాత్రలకూ సంబంధించిన అనేక చిత్రాలు, విచిత్రాలు, వైరుధ్యాలు, తేడాలూ ఒక భాగంగా వరుసన కూర్చాను. ఐతే ఈ విభాగంలో పాత్రలకు, కథనానికి ప్రత్యక్షంగా అడ్డుతగలని ప్రక్షిప్తాల గందరగోళం, సర్వత్ర వర్జించాల్సిన ‘అతి’ని పూర్తిగా మినహాయించాను. ఇవే చేర్చుతూ పోతే అవే పెద్ద గ్రంథమై కూర్చుంటాయని భావించి అలా వదిలిపెట్టాను. ఆ విధంగా ప్రకృతి, సౌందర్యం, తత్వం, సామాజికం, ఇతర స్వల్పవిషయాలవంటి విభాగాలతోపాటు సరళంగా పోయే కథకు, పాత్రలకు ప్రత్యక్షంగా అడ్డొచ్చే విచిత్రాలను కొంతవరకు ఈ మాలికలో చేర్చాను. యథాతథంగా సేకరించిన అంశాల్లోని నా వాక్యాల్లో, నేను ఆర్థం చేసుకోవడంలోనూ పొరబాట్లు, తప్పులూ వుంటే అది పూర్తిగా నా బాధ్యతేను. వాటిని మన్నించి ఆ పొరబాట్లు ఎక్కడ జరిగాయో వాటిని అందుబాటులోనే వున్న రా.భా.భా. (తెలుగులోనివి) సంపుటాలను మీరూ ఒకసారి చూస్తే మరీ మంచిదేకదా. ఇక, కొన్ని విశేషాలకు వివరణ, సందర్భం అవసరమనిపించలేదు గనుక అలా ఉంచేశాను. అలాగే పద్యపాదాలను విడదీశాను. ఇలా ఈ మొత్తం అంతా పండితుల కోసం తయారుచేసింది కాదు.

పరిశోధన ప్రకారం నేటికి తేలిన ‘మూలగ్రంథాల’ పాఠంగాని, ప్రాచీనమే అయిన ప్రక్షిప్తాల పాఠంగానీండి, వాటిలో ఔన్నత్యాన్ని, జ్ఞానాన్ని మాత్రమే మనం తీసుకోదలచితే అదే ఆవశ్యకం. దీనికి విరుద్ధంగా స్వీకరించేది ఏదయినా లేనిపోని వివాదాలకే దారి తీస్తుందనడంలో ఆశ్చర్యంలేదు. అలాగే ఈ కావ్యాల్లోని ఆదర్శనీయమని భావిస్తూన్న పాత్రలు ఆయా కాలాలను బట్టి ప్రవర్తించే తీరు, వైఖరి మనం ఇప్పుడు అనౌచిత్యంగా భావించి వ్యాఖ్యానించే ముందు తగిన పరిశోధన చేయటం అత్యవసరంగదా. అసలు ఆదికవులకు తాము సృష్టించిన పాత్రల నడవడి, అలవాట్లూ ఎలా వుండాలో తెలియకనే రాస్తారా?! ఆ పాత్రల వైఖరి, తీరుతెన్నులు, నడవడి ‘సరిదిద్దడానికి’, ‘కప్పిపెట్టి’ వుంచడానికి, మార్చడానికి ఒకనాడుగాని, నేడుగాని మనమెవరం?

వాల్మీకి, వ్యాసుడు, కవిత్రయం, పోతన్నలు ఎందుకు ఏది రాయాలో, రాయరాదో నా బోటి వేలాదిమంది నిర్ధారించటం ఎంత అజ్ఞానమో, ఆది మహాకవుల పేరిట చేరిన తడి, పొడి చెత్త యావత్తు ఆదికవులదేనని వాదించుకోవటం అంతే వ్యర్థం అని వేరే చెప్పనవసరం లేదని ఇందుమూలముగా సమస్తమైన వారికి తెలియజేయడమైనది. నమస్కారం.


తల్లావజ్ఝుల శివాజీ

రచయిత తల్లావజ్ఝుల శివాజీ గురించి: జననం విద్యాభ్యాసం ఒంగోలులో. కళాసాహిత్య విషయాలలో పితామహులు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రిగారి ప్రభావం బాల్యం నుంచీ. బొమ్మలు గీయడం చిన్నప్పటినుంచే స్వయంకృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగవిరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అడవులలో తిరిగి వారి జీవితాన్ని దగ్గరనుండి పరిశీలించారు. ఆ ప్రకృతి, ఆ జీవనవిధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరతలు భారతీయ సంస్కృతి, ఇతిహాసాలలో వేళ్ళూనుకున్న వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చక్కటి రచయిత, కళావిమర్శకుడు అయిన శివాజీ ఎన్నో చిత్రప్రదర్శనలు చేశారు. ...