కళకాలమ్: 3. రేఖ – స్ట్రోకు


షావె గుహ (Chauvet) – ఫ్రాన్స్

దాదాపు ఓ వంద సంవత్సరాల క్రితం వరకు రేఖ, రంగు ఒకటి చేసుకుని చిత్రకళకు వెలుగునిచ్చినది ఆసియా దేశాలే. సుదూర ప్రాచీన కాలం నుంచీ భారత, చైనా, జపాన్ చిత్రకారులు కళ్ళు మెరిసిపోయేట్టూ వొళ్ళుకాస్తా తేలిపోయేట్టూ మహత్తరంగా ‘రంగు అన్నా రేఖ అన్నా ఒకటేనన్నా’ అన్నట్టు గోడలమీద, వస్త్రాలమీద, తాటాకులమీద చిత్ర విచిత్రాలు రాసి/గీసి మోక్షాన్ని మించిందేదో పొందారు. వారి పట్టు, వొడుపు, తీరు నేటికీ ఆసియా ఆర్టిస్టులకు వారసత్వంలా వచ్చి విజృంభిస్తోంది. కొంత ఆలస్యంగా రష్యా, పశ్చిమాసియా, యూరప్ దేశాలకు ఈ రేఖా వైభవం విస్తరించింది… అనగా అక్కడి కళాకారులు ఆధునిక శైలిలో రేఖల/గీతల పనిబట్టారు. ఇక ఫ్రాన్స్, ఈజిప్టు, ఆఫ్రికా దేశాలు, ఆస్ట్రేలియా దేశాల్లోని ప్రాచీన గుహల్లో, కొండలమీది బండరాళ్ళమీద, ప్రాచీన ఆదిమానవుల చిత్రకళ చూస్తే మతిపోయే అత్యాధునికత కనిపిస్తుంది ఆ రేఖల్లో. అవి లావుపాటివయినా, సనసన్నటివైనా సరే వాటిలో ధార కవితల్లో అంతర్లయలాగ వుంటుందిగదా! ఇక ప్రాచీన రాతి, సుద్ద, మట్టి శిల్పాల్లోనైతే ఆధునిక శైలి సంక్షిప్తంగా, సరళంగా రేఖా సౌందర్యాన్ని మించి వుంటుంది- ఆ కథ వేరు.


బ్రాడ్‌షా గుహ– ఆస్ట్రేలియా

మొత్తం ప్రపంచ దేశాల ప్రాచీన గుహా చిత్రాల్లోని రేఖలు పలికే తీరులో లేడి, జింక, ఎడ్లు, వేటకాడు బాణం వేసే కదలిక, కొమ్ములున్న జంతువుల గుంపులు దాదాపు ఒకలాగే గడగడా పద్యం అప్పగించినట్టు వుంటాయి. అయితే న్యూజీలాండ్, ఆస్ట్రేలియాల్లోని ఆదిమ జాతుల్లోని మోరియాలు తదితరుల చిత్రాలు, హస్తకళలు – తమ పూర్వీకులూ వారి ఊహలూ కలగలిసిన డ్రీమ్‌టైమ్‌కు సంబంధించినవి – అత్యాధునిక సృష్టిలా ఉంటాయి. మరీ ముఖ్యంగా జంతువుల అంతర్భాగాలతో సహా చిత్రించే స్కెలిటిల్ ఇమేజ్ బహువిచిత్రంగా వారి రేఖా చిత్రాల్లో కనిపిస్తుంది. ఇది ఎంతో భిన్నంగా వుంటుంది. ప్రపంచ దేశాల్లో ఆదిమ, గిరిజనులు పండగపబ్బాల్లో ధరించే వింత దుస్తులు, మేకప్, ఈకలు వగైరాలు, మాస్కులు, రంగులు పులుముకోడాలూ ఎంత వైవిధ్యంతో భిన్నంగా వుంటాయో, వారి చిత్రకళ – గుహల్లో గీసిన బొమ్మలు – అంత క్లుప్తంగా సరళంగా వుంటాయి. సున్నం, బొగ్గు, మసితో గీసే బొమ్మలు, వాటిలో రేఖలు ఒక రకంవి; క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుంచీ క్రీస్తుశకం 8వ శతాబ్దం వరకూ భారత, చైనా, జపాన్, టిబెట్‌ల కుడ్య చిత్రాల్లో రేఖల కథ మరో రకంవి.


డ్రీమ్‌టైమ్‌ చిత్రం – ఆస్ట్రేలియా

మత, పౌరాణిక, జానపద గాథల మీద, ప్రవక్తలు తదితర జ్ఞానులు, ఋషులు, మునులు, సంత్‌లు చెప్పిన ప్రవచనాలమీద, ఆధారపడి వేసిన బొమ్మల్లో ఆనాటి రేఖలు ఒకవిధంగా ఆధునిక రేఖాశైలికి దారి చూపెట్టాయి. బౌద్ధ జాతక కథలు, బుద్ధుని బోధలు, వాకాటిక రోజుల జీవన శైలి, జైన సంప్రదాయ, ఇతిహాసాల కథలు, తాళ పత్రాల మీద కూడా రేఖల వేగాన్నీ స్ట్రోక్‌లో శైలినీ చూపెట్టాయి. అజంతా గుహాచిత్రాలూ డిజైన్ల మొదలు రాష్ట్రకూట, చోళ, పల్లవ, విజయనగర, కాకతీయ చిత్ర కళ వరకూ ఆలయాల్లో గోడలమీద, దూలాల మీద వున్న చిత్రాల్లోని రేఖలు సంగీతంలా సౌందర్యం పలికాయి. శరీర ఆకారాల్లో సన్నని రేఖలు, ఆభరణాలు, డిజైన్ల దగ్గరకొచ్చేసరికి మందంగా, సన్నంగా, ఒడుపుగా బ్రెష్ తిరిగిన దారిన వెలుగునీడలు చూపెట్టటంలో, నేటి ఆధునిక బ్రెష్ స్ట్రోక్, పెన్ స్ట్రోక్ శైలికి తోవ చూపెట్టాయి. రేఖలని పొదుపుగా, విస్త్రుతంగా, ఎక్కువగా వాడటం శైలినిబట్టి ఉంటుంది. అది ఒక అలంకారం. అజంతా, తంజావూరు, త్రివేంద్రం, సిగిరియ, సిత్తన్నవాసిల్ కుడ్య చిత్రాల ఆర్టిస్టులు బ్రెష్‌లు ఎలా తయారుచేసుకున్నార్రా బాబూ అని ఆ రేఖల తీరు సంభ్రమంలో పడేస్తాయి మనల్ని. చిత్రమేమంటే, ఈ మొత్తం బొమ్మల్లోని రేఖలని ఓపికగా చూస్తే, దక్షిణాది ఆలయాల్లో చిత్రాలు తప్ప అసలు రంగూ రేఖా రెండూ భిన్నంగా లేవనీ వుండాల్సిన అవసరం లేదనీ అనిపిస్తుంది.

కియరాస్కూరో (Chiaroscuro) అనే వెలుగునీడల పొందిక, కూర్పూ కేవలం త్రీ డైమన్షనల్ పెయింటింగ్‌లోనే సాధ్యమవుతుందనే వారికోసం అన్నట్టు రేఖల్లో టూ డైమన్షనల్ పనితనంలో త్రీ డైమన్షనల్ వాస్తవాన్ని చూపెట్టగలిగారు మొగల్ మినియేచర్‌ కళాకారులు. 14-17వ శతాబ్దాల్లో మినియేచర్ల ప్రభావం మనదేశం దాటి ప్రపంచ దేశాలన్నిటికీ పొక్కింది. జపాన్, చైనా కళాకారుల సత్తా కూడా ఇదే. ఈ మొత్తం సంప్రదాయం ఆనాటి శాంతినికేతన్ నుంచీ నేటి మద్రాసు ఫైన్ఆర్ట్ కళాశాల వరకూ కొనసాగింది. వెలుగు నీడలను ఉద్దేశిస్తూ జానపద చిత్రకారులు, ఆ ప్రాంత గిరిజన కళాకారులు తమ కుంచె అంచు సన్నగా సాగి చివరన కొంచం వొంపు తిరిగి వుండేట్టు కూడా తయారు చేసుకోగలిగారు. వెదురుబద్ద కోసిన అంచులతో పాళీ చేసుకోవడం సరేసరి. ఆపై ఈత ఆకుల్లో సగం పండినది ఎంచుకుని దానిలోగల నిలకడని బట్టి అతి సన్నని రేఖలూ, కొంచం మందంగా వుండే రేఖలూ అవసరార్థం వినియోగించేవారు. మధ్యయుగాల తాళపత్రాల మీద సాహిత్యంతోపాటు అవసరమైన చోట ఇలాంటి వెలుగునీడల రేఖలతో బొమ్మలు వేసేరు! పట చిత్రాలూ ఇదే దారి పట్టాయి. ఒక ‘ఘంటం’ను నేటి ‘స్టయిలస్’ను వినియోగించినట్టు తాటాకు మీద రాతకేగాక బొమ్మలు చిత్రించడానికీ వాడారు గ్రామీణ జానపద, గిరిజన చిత్రకారులు.


సిత్తన్నవాసల్ గుహ – తమిళనాడు

మొగల్, రాజస్థానీ, పహాడీ, కాంగ్రా, బసోలీ మినియేచర్ చిత్రాలు, వాటి ఘనసౌందర్యం మీరు చూసే ఉంటారు. ప్రాంతం ఏదయినా ఆ కాలంలోని ఆ చిత్రాల్లో రేఖలన్నీ సంగీత స్వరాల్లాగా ధారగా సాగి మన దేశ చిత్రకారులను ఆకాశం ఎత్తులో నిలబెట్టాయి. స్థిరంగా వున్నట్టుండే నిరంతర కదలికల సౌందర్యం ఆ మినియేచర్ రేఖల్లో కనిపిస్తుంది. రాధాకృష్ణులు, శివపార్వతుల నాట్యం, బృందగానం, ప్రయాణాలు, సందర్శనలు, యుద్ధాలు, గుహలు, వనవాటికలు, జంతు, పక్షుల పెంపకాలు… వోహ్! దృశ్యం ఏదయినా కలలాగా కదలిపోయే ఆ చిత్రాల తీరు రంగుల్లో ఉన్నా, ప్రధానంగా స్పష్టంగా కనిపించేది మాత్రం ఆ రేఖల/గీతల లతల్లోనే! కాదూ?! గీతల్లో తేడా, వాటిలో నేర్పు ఇమిడిన ధారను పసిగట్టడం సౌందర్యాన్వేషణలో భాగమే. జహంగీర్ చక్రవర్తి ఎన్ని వందల చిత్రాలు ఎంత గబగబా చూస్తున్నా, ఏ రేఖ మన్సూర్ (Ustad Mansur) అనే చిత్రకారుడిదో, ఎవరు ఎవర్ని అనుకరిస్తున్నారో సులువుగా చెప్పగలిగేవాడట. షాజహాన్ పోర్ట్రయిట్‌ని కాబోలు చూసి, “వట్టి రేఖల్లో ఆయిల్ పెయింటింగ్ అంత నిండుదనం తేగలిగాడు, ఈ చిత్రకారుడెవరో!” అని రెంబ్రాన్ట్ (Rembrandt Van Rijn), భారతీయ మొగల్ చిత్రకారుడిని సుదూరంనుంచే పరోక్షంగా అభినందించాడు. గిరిజన, సంప్రదాయ చిత్రాల్లో రేఖలన్నీ ఒక ఎత్తయితే మధుబని జానపద, గ్రామీణ ప్రాంత చిత్రాల్లో రేఖలు భిన్నంగా మరో పై ఎత్తులో వుంటాయి. దూరపు కొండల్లా రేఖలు అన్నీ ఓలాగే ఉండవు- శ్రద్ధగా చూస్తే పనితనంలో నేర్పు స్పష్టంగా కనిపించక మానదు.

చాలామందికి పెయింటింగ్ అంటే కేన్వాస్ మీద ఆయిల్ కలర్స్‌తోనో ఆక్రిలిక్ రంగులతోనో వెలుగునీడలు చూపెట్టడంతోనే చిత్రంలోని ఆకారంలో చైతన్యం వస్తుంది. ఇది రేఖలతో సాధ్యం కాదనుకుంటారు; లేదా రంగులతో నిండిన ఫోటో వంటి పెయింటింగ్ మాత్రమే కళ స్థాయిలో వుంటుందనీ రేఖలు జలజల పారే బొమ్మలు ‘కళ’ కిందికి రావనీ అనుకుంటారు. గీతలు, రేఖలనే స్ట్రోక్‌లతో నిండిన ఆకారాలను వట్టి ‘ఇలస్ట్రేషన్’ అనుకుంటారు. నిజానికి చిత్రకళకి అలాటి నియమం ఏదీ లేదు. ఇలస్ట్రేషన్ అనేది కేవలం కథలకో నవలలకో వేసే నల్ల గీతలు లేదా రంగు గీతల బొమ్మ అనుకోడం కేవలం పరిమితమైన దృష్టి మాత్రమే. పత్రికల్లోనో ఇతర గ్రంథాల్లోనో వాటి అవసరాన్నిబట్టి, సందర్భాన్నిబట్టి వేసే బొమ్మను ఇలస్ట్రేషన్ అన్నారు కానీ చిత్రకళ, పెయింటింగ్ అనే పదాలకు అవి సరితూగవు అని అనుకోడానికి లేదు. అజంతా గుహల్లో బుద్ధ జాతక కథలకూ సంఘటనలకూ నాటి కళాకారులు వేసినవి ఇలస్ట్రేషన్‌లే, అది చిత్రకళే! లైన్, స్ట్రోక్ గల పెయింటింగ్‌లే! వర్లీ బొమ్మలు, సవర, మధుబని బొమ్మలు, పట చిత్రాలు, జపాన్, చైనాల్లో హోకుసాయ్ (Katsushika Hokusai) వంటి ఎందరో కళాకారుల బొమ్మలూ పెయింటింగ్‌లే, ఇలస్ట్రేషన్‌లే… రంగులు మారవచ్చు! ఏకవర్ణంలా అనిపించే అనేక రంగుల చిత్రం పెయింటింగే!


టిబెట్ బౌద్ధచిత్రకళ

చైనా, జపాన్, కొరియా దేశాల కళాకారులు ప్రాచీన కాలం నుంచీ నేటివరకూ లేత రంగులూ సన్నసన్నటి రేఖలూ సాధన చేస్తూ వచ్చి మన మతులు పోగొట్టారు, పోగొడుతున్నారు! ఇక టిబెట్ కొండలమీది ఆరామాల్లో, గంఫాల్లో, ఇతర భవనాల్లోనూ కనిపించే బౌద్ధ చిత్రకళ నిండా కళాకారులు ఎంత ముదురు రంగులు వాడతారో అంత బలమైన రేఖలూ వాడగలరు. చిత్రమేమంటే ఎంతో బరువుగా వుండి, తుఫానుకి సిద్ధమైన నల్లని మేఘాలూ మెరుపులూ సైతం లావుపాటి రేఖలతో అడవితీగలేవో ఆకాశాన్ని అల్లుకున్నట్టు గీసిపడేస్తారు. టిబెట్ మేఘాలను చిత్రించే శైలికి మూలం అజంతా చిత్రాలు కావచ్చుగాక, బ్రెష్ స్ట్రోక్ మేఘాల సృష్టి టిబెట్ గుహల్లోనే జరిగిందననిపిస్తుంది! కొంచం అటూయిటూగా అజర్‌బైజాన్, జార్జియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో గీతప్రధానంగా చిత్రకారులు చిత్రాలు చిత్రించి భగవత్’గీత’లను రాబట్టారు. ఇక యూరప్ దేశాలు బాగా ఆలస్యంగా సాధన చేశాయి. ఈజిప్టు, పర్షియాల ఒకనాటి చిత్రకళలో రేఖలు, ఆసియా దేశాల్లో దీవుల్లోని మెరుపు వెలుగులాంటి రేఖల దివ్యతేజస్సు పసిగట్టి, ఆధునిక కాలంలో యూరప్ చిత్రకారులు సరికొత్తదనపు రేఖల చరిత్రని గీస్తున్నారు… గమనించారు కదూ?!

యూరప్ దేశాల ఆధునిక రేఖల గురించి మొత్తంమీద ఒక సారాంశంలాగా చెప్పాలనుకుంటే… 18వ శతాబ్దంలో యూరప్- ముఖ్యంగా అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాలు తమ పారిశ్రామిక ప్రగతికి అవసరమైన ప్రచారం, ప్రకటనల నిమిత్తం పోస్టర్, ఇలస్ట్రేషన్, కార్టూన్, కేరికేచర్‌లతో గుక్కతిప్పుకోలేనంత వేగంతో పత్రికల ద్వారా, పుస్తకాలద్వారా, ఇతర ప్రచార సరంజామా ద్వారా ప్రపంచాన్ని గడగడలాడించడం మొదలెట్టాయి. 18వ శతాబ్దం నుంచీ వస్తు ఉత్పత్తులు, ఫ్యాక్టరీలు, వాటి ఉద్యమాలు, విప్లవాలతో బాటు (తిరుగుబాటు యుద్ధాలతో సహా) ‘లైన్’ అనే రేఖలు, హార్డ్’స్ట్రోక్’లాంటి గీతల ఉద్యమాన్ని, ఆధునిక దృశ్యాన్ని, దృష్టికోణాన్ని మొత్తం ప్రపంచంలోకి ఎగబాకేలాగ చేస్తూవచ్చారు.


జవాద్ మీర్జావదోవ్ – అజర్‌బైజాన్

టార్జాన్, మాండ్రేక్, నుంచీ మొదలుపెట్టి వందల కామిక్ స్టొరీలు, కార్టూన్ కథలు, స్ట్రిప్ కార్టూన్లు యూరప్ పత్రికల్లో పోస్టర్‌లలో నిండిపోయాయి. 19వ శతాబ్దంలో యూరప్ నిండా పత్రికలు విస్తరించిన కొద్దీ ఇలస్ట్రేషన్ పని పెరిగి ఆర్టిస్టులు ఆధునిక శైలిలో కుంచె, పాళీ, పెన్, చార్‌కోల్‌లు పట్టి శైలితో తమ స్వేచ్ఛాయుద్ధంలాగా ప్రకటించారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల రాజకీయ అవకతవక పరిస్థితులు, అమెరికాలో జాతి సంఘర్షణ, ఫ్రెంచి విప్లవం పత్రికలకు, కళాకారులకు ప్రాణం ఇచ్చాయి. కామిక్, కార్టూన్, ఇలస్ట్రేషన్, కేరికేచర్‌లనేవాటి మధ్య వున్న సరిహద్దులని చెరిపెయ్యటం, తులూస్ లాత్రెక్ (Toulouse Lautrec) అనే ఫ్రెంచి చిత్రకారుడి బొమ్మలతో చెరిపెయ్యటం మొదలయి అది వేగం పుంజుకుంది. చైనా, జపాన్, రష్యా కళాకారులయితే 16వ శతాబ్దికి ముందే ఈ రేఖల తేడాలు లేవని నిరూపిస్తూ వట్టి డిజైన్‌ని ఆధునికీకరించారు- తమ వెదురు బ్రెష్‌లతో! మనదేశంలో పత్రికలు, మరీముఖ్యంగా వాటిలో ఇలస్ట్రేషన్‌లు ఆలస్యంగా ఆరంభమయ్యాయి. ఇక కార్టూన్లయితే మరీ ఆలస్యంగా మొదలయ్యాయి. నిజానికి ఒకనాటి ‘పాంపే’ కుడ్య చిత్రాల్లో, అజంతా కుడ్య చిత్రాల్లో కార్టూన్ ఆలోచన, వ్యంగ్య చిత్రణ మొదలయినా ఎందుకో అది కొనసాగలేదు. లైన్, రేఖ, స్ట్రోక్ గురించి చెప్పుకోవటంలో అర్థం, లైన్ లేని రంగుల, కండల, వెలుగునీడల ఆయిల్ పెయింటింగ్‌లు అల్పమైనవని కాదు- రేఖల వెలుగునీడలూ పైన చెప్పుకొన్న ఆయిల్ పెయింటింగూ ఒకటేననీ కళాత్మకమైన శైలిలో తేడాలు అంతగా వుండవనీ చెప్పడం మాత్రమే ఇక్కడ నా ఉద్దేశం.


అన్వర్ – హైదరాబాద్

యూరప్ దేశాల్లో ఆయిల్, ఆక్రిలిక్ రంగుల బొమ్మలతో సమానంగా రేఖల, పెన్‌స్ట్రోక్‌ల ఇలస్ట్రేషన్ అనే బొమ్మల చిత్రవిచిత్ర శక్తి విస్తరిస్తుండగా; చైనాలో జపాన్‌లో ‘పెయింటింగ్’ల కంటే రేఖల శైలి ‘పెయింటింగ్’ స్థాయి దాటి విజృంభిస్తుండగా; మనదేశంలో మాత్రం ఆయిల్, ఆక్రిలిక్ ‘పెయింటింగ్’ పెరిగి పెరిగి ఇలస్ట్రేషన్, రేఖల బొమ్మలూ కామిక్‌లూ యూరప్ దేశాలతో పోల్చితే బాగా తరిగిపోయాయనే చెప్పాలి. చిత్తప్రసాద్, గోపులు, బాపు, మేరియో, చంద్ర, ఆర్కే లక్ష్మణ్ వంటి ‘అల్పసంఖ్యాకు’లు/’మైనారిటీ’ల దగ్గర ఆరంభమయినప్పటినుంచీ ఇప్పుడు కొత్తగా విజృంభించింది తక్కువే కదా! అయితే దేశంలో మొత్తంమీద గోపీ, రాజు, అన్వర్ వంటి ‘బాహుబలి’ కేడర్ అక్కడక్కడ లేకపోలేదు(బాలమురుగన్ వంటి ఎందరో)… ఐనా యూరప్ ఆసియా దేశాలతో బేరీజు వేస్తే మన ఈ సంఖ్య తక్కువేనని నా బాధ. ఇందుకు కారణం లేకపోలేదు. గోపులు, బాపు, చంద్ర, బాలి, గోపీ, మోహన్ వంటి పెద్ద కళాకారుల చేత డబుల్‌స్ప్రెడ్ బొమ్మలతో పత్రికలు నింపిన తెలుగు పత్రికా సంపాదకుల అభిరుచి, ఎంపిక, పోయిపోయి హృదయవిదారక స్థాయిలో క్రమంగా నేటికి తగ్గిపోయింది కదా! ఇందులో అడ్వర్టయిజ్‌మెంట్లు పత్రికలకు సంపాదించిపెట్టే ఆదాయం ఒక పెద్ద కారణం కాకపోదు. అందులోనూ ఉన్నంత ఖాళీలోనే, ఇచ్చినంత అవకాశంలోనే ఇప్పుడు వాసు, రాజు, శంకర్, అన్వర్, సురేన్ద్ర వంటి పేర్లు ఎన్నిసార్లు లెక్కించినా తక్కువే. దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టుంది. మీరెప్పుడేనా సురేన్ద్ర, అన్వర్, రాజు, శంకర్‌లతో కబుర్లు పెట్టుకుని ఈ మొత్తం దృశ్యం గురించి వింటే వందలాది యూరప్ ఇలస్ట్రేటర్‌లు, పత్రికలు, పాళీలు, కుంచెలు, రంగులు, ఇంకుల స్థితి గురించి భారీగా, సెట్టింగులు లైటింగుల స్థాయి మహాకథనం వివరించగలరని హామీ ఇవ్వగలను. ఆపై, ప్రాచీనకాలం నుంచీ నేటి వరకూ వున్న చిత్రకళ – మరీ ముఖ్యం రేఖావైభవం – సందర్శించాలని నెట్ వెదుక్కుంటే వేలాది ఆర్టిస్టుల పేర్లు, వారి పనితనం చూడవచ్చని నేనుగాని మరొకరుగాని చెప్పవలసిన పనిలేదు.

చివరికి పాఠక, ప్రేక్షక, వీక్షక, సందర్శకులనే మహాజనానికి ఏనాటికయినా పెయింటింగులు, వివిధ సొగసులు పోయే రేఖల గొప్పదనం, చిత్రకారుల గొప్పదనం వగైరాలన్నీ సకల వివరంగా తెలిసి ఆనందించగలగాలీ అంటే ఇంప్రెషనిస్టు (Impressionism) చిత్రకారుల కాలంలో, అలాగే ప్రి రాఫెలైట్ (Pre Raphaelite) చిత్ర మిత్ర బృందాల కాలంలోవలే కవులు, రచయితలు, కళాకారులు, సద్విమర్శక సమీక్షకులూ(క్రిటిక్కులు) ఒక మిత్ర సంఘంలా, చేతులు కలిపిన ఉద్యమకారుల్లా, చర్చించుకోవడాలు, వాటిని పత్రికలు అచ్చువేయటం, ‘ముఖగ్రంథాలు’ విపరీతంగా ప్రదర్శించటం, మొదలవ్వాలి. లేకపోతే ఎప్పటివలే నాటకాలవారు వేరు, రచయితలూ కవులూ వేరు, సంగీతకారులు వేరు, నీవు వేరు, నేను వేరు, వారు వేరు, వీరు మరీ వేరు అనుకుంటూ, ఎవరి బావిలో వారు వుంటూ, వారివారి బావులను వారు మోసుకుంటూ ప్రతి సాయంత్రం నగర, పట్టణ సన్మాన వేదికలపైన నోటివాద్యగోష్ఠిలో మునిగితేలుతుండవచ్చు, ఫేసుబుక్కులో ప్రగల్భిస్తూ వుండవచ్చు ఎంచక్కా.


[మనవి: మొన్న నేను రాసిన కళకాలమ్ రెండవభాగం చదివిన ఒకరి (బహుశా చాలామందీ కావచ్చు) విమర్శ చదివాను. ఆ విమర్శ, సూచన, సమీక్ష బాగుంది. వారు అలా రాసిందంతా పూర్తిగా సబబు, నిజం అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. వారిని అభినందిస్తున్నాను. ఐతే నాదో చిన్న మనవి. ఇప్పటికిది ‘మూడవభాగం’ వచ్చినది కేవలం ఒక ‘కాలమ్’ వంటిదే. పరిశోధనకు సంబంధించిన వ్యాసం కాదు. కాలమ్ కావటం మూలాని పాఠకుల్లో సాధారణంగా మనం చూసే జనంలో ఎక్కువమందిని ఉద్దేశించి కళ, కళాఖండాలను చూసి ఆనందించి, ఆస్వాదించే విషయమై రాసినది. ఎక్కువమంది ప్రజలకు అతి తరచుగా, ఎక్కువగా మన తెలుగు, జాతీయ కళలు- మరీ ప్రత్యేకించి ‘చిత్రకళ’ (పోనీ విదేశీ చిత్రకళతో సహా) బాగా పరిచయం కావటానికి వలసిన, వీలయే మార్గాలు, మార్గాంతరాల గురించి పైపైన టూకీగా సూచించడం వరకే నా ఉద్దేశం. ఇందుకు వాడిన ఉదాహరణలే ‘పాలపేకెట్’ గానీ ‘అగ్గిపెట్టె’ గానీ… అంతే.

కొత్త సినీతారలూ తారడులూ ఇట్టే పరిచయం అయినంత సులువుగా మన ప్రాచీన చిత్ర శిల్ప కళలు, అలాగే ఆధునిక, సమకాలీన చిత్ర శిల్ప కళలూ పరిచయం కావటం మంచిది; వేమన, సుమతీ శతకాల వలె, సినీ సాహిత్యంవలె చెవికి, కంటికి చప్పున అలవాటుపడాలనే దురుద్దేశంతో రాసిన ఉదాహరణలే ఈ ‘పాలపేకెట్’ వగైరాలు. నిజానికి క్షణంలో చింపి అవతల పడేసే మరేదయినా సరే, చిన్న ‘ఎంబ్లమ్’, ‘లోగో’- ‘ఐఎస్ఐ’ మార్కు సైజయినా సరే అంచక్కని కళాఖండంలోని ‘డిటైల్’గానీ చిన్న డిజైన్‌గానీ వాడితే బాగుండునని నా బాధ. అంతే. ప్రచారం అన్నది అన్ని స్థాయిల్లో జరగాలని నా తపన. ఇదంతా సాధారణంగా కళాఖండాలు చూసి అంచక్కగా ఆనందించే ముచ్చటగల వారి కోసం కాదు- అంతగా ఇదంతా పట్టించుకోనివారి గురించి (వారు సర్వత్రా లేరని నా భావం కాదు). సూచనమాత్రమైన కోరిక మాత్రమే. ఇందులో తప్పేమీ లేదేమోనని అలా రాస్తూ వచ్చాను. నా సూచనలవంటి అభ్యర్థనలు అభ్యంతరకరమైనవయితే క్షంతవ్యుణ్ణి. – శివాజీ.]


తల్లావజ్ఝుల శివాజీ

రచయిత తల్లావజ్ఝుల శివాజీ గురించి: జననం విద్యాభ్యాసం ఒంగోలులో. కళాసాహిత్య విషయాలలో పితామహులు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రిగారి ప్రభావం బాల్యం నుంచీ. బొమ్మలు గీయడం చిన్నప్పటినుంచే స్వయంకృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగవిరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అడవులలో తిరిగి వారి జీవితాన్ని దగ్గరనుండి పరిశీలించారు. ఆ ప్రకృతి, ఆ జీవనవిధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరతలు భారతీయ సంస్కృతి, ఇతిహాసాలలో వేళ్ళూనుకున్న వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చక్కటి రచయిత, కళావిమర్శకుడు అయిన శివాజీ ఎన్నో చిత్రప్రదర్శనలు చేశారు. ...