ఒక్కోసారి పొద్దున్నే
రెప్పలచూరు పట్టుకుని
ఒక ఊహ
చినుకులా వేళ్ళాడుతుంటుంది
కిందకు జారేలోగా
ఏదో పనిశరం తగిలి
పగిలిపోతుంది
మరోసారి
వాక్యం గాయమౌతుంది
గాయమే వాక్యమౌతుంది
ఆనందం ఆకాశమై
పురి విప్పుతుంది
ఆకాశం ఆనందమై కురుస్తుంది
అన్ని సందర్భాలూ
వాక్యాలను తొడుక్కోవచ్చు
ఏమో ఎవరికి తెలుసు
ఒక దినం
ఎన్ని వేల రంగుల పిల్లల్ని పెడుతుందో
అవి పద్యాలై
ఎప్పుడు రెక్కవిప్పి ఎగురుతాయో
భూగోళమంత నిశ్శబ్దం
ఏ పాటను రహస్యంగా ప్రసవిస్తుందో
తీరం చేరేవరకూ
ఎదురు చూడాల్సిందే.