ఊహల ఊట 10

“పిల్లలకి జొరాలు రావా దొడ్డా! నే ఘోషాస్పటలుకి వెళ్ళి అరుకుమందు తెచ్చిపెడ్తాగా. అన్నయ్య ఊళ్ళో లేకపోతేనేం, నే రెండు పూటలా వొచ్చి చూస్తాగా. కంగారు పడకండి.”

పొద్దున్నే ‘ఏఁవన్నా తేవాలా దొడ్డా? బొంకుల దిబ్బకు కూరలు తేడానికి వెళ్తున్నా’నంటూ వొచ్చిన లింగంగారు అన్నారు. 

“నాకు కాళ్ళూ చేతులూ ఆడ్డం లేదురా లింగా! రాత్రి ఒళ్ళు కాస్త వెచ్చగా ఉంది. పొద్దున్నకి ఊష్టంతో ఒళ్ళు పొక్కిపోతోంది. గెంతుతూ బంతిలా తుళ్ళుతూ తిరిగే పిల్ల! ఏ దిష్టి కళ్ళు తగిలేయో!” అన్నాది బామ్మ.

వాళ్ళ మాటలు వినబడగానే కళ్ళు తెరిచి చూద్దామనుకున్నా. కళ్ళు రెండూ బరువెక్కి పోయాయేంటో? తెరిచానో లేదో ఆ వెంటనే రెప్పలు వాలి మూతబడిపోయేయి. వాళ్ళ మాటలు వింటూ ‘అమ్మా, అమ్మా’ అని మూలుగుతూ, ఆ పక్కనుంచి ఈ పక్కకీ ఈ పక్కనుంచి ఆ పక్కకీ ఒత్తిగిలుతూ ‘అబ్బా నెప్పీ’ అంటూ కణతలు నొక్కుకున్నా.

“తల నొప్పెడుతోందా తల్లీ?” అంటూ లింగంగారు నా నుదుటి మీద చెయ్యేసి చూశారు. “జొరం ఎంతుందో చూశారా? ధర్మామీటరు ఉందా?” అని అడిగేరు.

“ఒసేయి! ధర్మామీటరు పట్టుకురా. ఊష్టం ఎంతుందో చూస్తాట్ట లింగం!” బామ్మ గట్టిగా కేకేసింది. 

“వొస్తున్నా! వొస్తున్నా! ఉండరా బాబూ, నా తండ్రివి కదూ. అక్కకి ఊష్టం ఎంతుందో చూసేక నీకు పాలు చల్లార్చి ఇస్తా. తాగుదూ గాని” అని మాటాడుతూ ఓ చేత్తో తమ్ముణ్ణి పట్టుకుని రెండో చేత్తో థర్మామీటర్ని తెచ్చి “ఇదిగోనండీ. దులపలేదు. వీడు నన్ను దులపనియ్యలేదు. దులిపి పెట్టండి” అన్నాది అమ్మ.

లింగంగారు థర్మామీటరును ఎత్తిపట్టి చూసి ‘దులిపే ఉందమ్మా’ అంటూ – “ఏది తల్లీ, నోరు తెరువు. నాలిక కింద ధర్మామీటరు పెడతా. జొరం ఎంతుందో చూసుకుందాం.” నా నాలిక కింద థర్మామీటరు పెట్టి “పెదిమలు రెండూ గట్టిగా బిగించి పట్టుకోవాలి. లేపోతే జారిపోతుంది మరి” అన్నారు.

పెదిమలు బిగించినా జారిపోతున్నట్టనిపించి చెయ్యెత్తి పట్టుకుందామనుకొని కణతల మీది చెయ్యి తీశా.

“ఉండుండు. నే పట్టుకుంటాలే. నే పట్టుకుంటాలే” అని బామ్మే పట్టుకుంది.

“ఇవాళా వంటపని నువ్వే చూడు. నే మడి కట్టుకోను. పిల్ల దగ్గర కూచుంటా.” అమ్మకి చెప్పింది బామ్మ.

“వీడు నన్ను వొదిల్తే కద నే మడి కట్టుకోడానికి. సీసానూ కడగనియ్యలేదు. కొంగు పట్టుకు లాగుతూ ఉంటే ఏం కడుగుతానూ?”

“కాక తగిలిందా చిట్టితల్లికి?” ముత్తమ్మ పడగ్గది లోకి వచ్చింది.

“అంట్ల గిన్నెలు పామడం అయిపోయిందా?”

“అయిపోనాది.”

“అయితే పెరటి గూట్లో సీసా పెట్టే. అరుకుమందు తేవడం కోసం. బాగా కడిగి పట్రా. జాగ్రత్త. చెయ్యి జారి పగిలిపోగలదు. వీడు నన్ను వొదలటం లేదు.”

“ఊష్టం ఎంతుందండీ?”

లింగంగారు థర్మామీటరు పైకెత్తి పట్టుకుని ఓసారి 101, ఊహూఁ కాదు కాదు 100.1, 100.5 అంటూ పాదరసం గీత ఎక్కడుందో మళ్ళీ మళ్ళీ చూసేరు.

“సరిగ్గా కనబడ్డం లేదా లింగా? అలా చూస్తున్నావూ?”

‘అబ్బే, అబ్బే’ అంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళి వెలుతురు లోకి తన కళ్ళకెదురుగా ఎత్తి పట్టుకుని మళ్ళీ చూసి ‘నూరూ, నూరూ పాయింటు అయిదూ’ అన్నారు లింగంగారు.

“అరుకు తెస్తా. రెండు మోతాదులు తాగితే తగ్గిపోతుంది. గాభరా ఏం లేదు” అంటూ ధైర్యం చెప్పేరు.

“అరుకుతో పాటూ ఓ బన్నూ ఓ బ్రెడ్డూ కూడా తీసుకురా. హోరం ఏవిటి పెట్టాలో ఏఁవిటో అదీ కనుక్కునిరా” అని చెప్పింది బామ్మ.

“అలాగే. ఇలా వెళ్ళి అలా రానూ! సైకిలు మీద ఎంతసేపు!”

“ఇదిగో అమ్మా సీసా. బాగా కడిగే. సూడండి.” ముత్తమ్మ సీసా ఇచ్చింది.

“నే బయల్దేరతా మరి” అంటూ లింగంగారు సీసా తీసుకుని వెళ్ళేరు.

“ముత్తమ్మా, బాలాజీని నీతో మీ గూడేనికి తీసికెళ్ళవే. మీ అప్పిగాడితో ఆడుకుంటాడు.”

“అనాగే.”

“నూటొకటీ పాయింటు ఎనిమిది ఉంది. నూట రెండన్నమాటే! రెండు పాయింట్లకేమి? చెపితే గాభరా పడతామని చెప్పలేదో, ఆయనకి చూడ్డమే రాలేదో” అంటూ “పదరా, పాలు తాగుదూ గాని” అని తమ్ముణ్ణి తీసికెళ్ళింది అమ్మ.

“తెలుస్తూనే ఉంది. ఒళ్ళు పేలిపోతోంది. లేపోతే కళ్ళు మూసుకుని పడుకునే పిల్లా ఇది! మాటామంతీ లేకుండా పడి ఉండే పిల్లా ఇది!”

“బయం నేదమ్మా! తగ్గిపోతాది. మందు తేడానికెల్లేరుగా ఆ బాబుగోరు. మన బాబుగోరూరెల్లి శానా రోజులై పోనాది ఈ పాలి!”

“ఈసారి ఎక్కువ రోజులు పడుతుంది తిరిగి రావడానికని చెప్పే వెళ్ళేడు. ఆడవాళ్ళలా ఇంటిపట్టున కూచుని ఉండడానికి మొగాళ్ళకి కుదురుతుందా? వాళ్ళ నెత్తి మీద ఎన్నెన్ని పనులో! నాలుగు పనులు చక్కబెట్టుకు రాడానికెళ్ళినవాడు పనులవకుండా ఎలా వొచ్చేస్తాడూ?”

“చిట్టితల్లికి కాక తగిలినాదని కారుడు ముక్క రాయింపించీయండమ్మా.”

“ఎక్కడున్నాడో? ఏ ఊళ్ళో ఉన్నాడో!”

మూలుగుతూ కణతలు నొక్కుకుంటూ వాళ్ళ మాటలు వింటూ అయితే ‘ఇవాళా నాన్న రాడా? నాన్నా వొచ్చీ! వొచ్చీ నాన్నా! నాన్నా నాన్నా, వొచ్చీ నాన్నా’ గొణుక్కోడం మొదలెట్టే.

“ఏఁవిటే తల్లీ? ఏఁవిటంటున్నావమ్మా! కాళ్ళు లాగుతున్నాయా? పట్టమన్నావా? పడతానుండు.” బామ్మ నా కాళ్ళు నొక్కుతూ పట్టడం మొదలు పెట్టింది.

బాలాజీని తీసుకుని ముత్తమ్మ వెళ్ళిపోయినట్టుంది. ఊష్టం సరంజామా పెట్టడానికి వీలుగా పెద్ద స్టూలుబల్ల నా మంచం దగ్గర పెట్టింది అమ్మ.

“ఔన్సు గళాసూ ధర్మామీటరూ మంచినీళ్ళూ అన్నీ బల్ల మీద పెట్టేసి వెళ్ళు. దీనికా ఊష్టం, వాడా లేడు. నువ్వూ నేనేగా తినేవాళ్ళం. మరీ సింగినాదాలు పోక, అన్నం ఇంత పప్పు ఉడకెయ్యి చాలు. పచ్చడేదో నంచుకు తినొచ్చు. పాలూ పంచదారా అరటిపండుతో మాలష్మి నైవేద్యం పెట్టీసేయి. ఏకంగా భోంచేసి ఇవతల పడు.”

“అలాగే. అలాగే. ఆయన అరుకు తెస్తే ఎన్ని సార్లు పట్టాలో అన్నీ కనుక్కోండి. అన్నట్టు, నే ఊష్టం ఎక్కువగా ఉన్నట్టు చూసేనని చెప్పకండి. ఏమన్నా అనుకుంటాడు.”

“అబ్బే, ఎందుకు చెప్తానూ? సమయానికి వొచ్చిందే చాలు. మందు తెచ్చిపెట్టిందే చాలు. నువ్వొచ్చి పిల్ల దగ్గర కూచుంటే నే దబ్బుదబ్బున ఓ చెంబుడు నీళ్ళు ఒంటిమీద పోసుకొని ఓ ముద్ద తిని బయటపడతా.”

“సరే, సరే!”

అమ్మా బామ్మా ఒకళ్ళకొకళ్ళు పనులు ఎలా చెయ్యాలో ఏం చేసుకోవాలో చెప్పుకుంటున్నారు. తల బరువుగా, కళ్ళు మండుతూ, కాళ్ళు పీకుతూ, ఊపిరి వేడిగా మొహం మీద పెట్టుకున్న అరచేతికి తగులుతూ, వాళ్ళ మాటలు వింటూ ‘నాన్నొచ్చేయాలి, నాన్నొచ్చేయాలి. వొచ్చెయ్యాలి నాన్న, వొచ్చెయ్యాలి నాన్న’ గొణుక్కుంటూ మూలుగుతున్నా.

అమ్మ వెళ్ళిపోయినట్టుంది. ఓ పక్క నా కాళ్ళు పడుతూ బామ్మ రుద్రాక్ష తావళం తిప్పుతూ గొంతుకలో గొంతుకలో ‘ఓం నమశ్శివాయ, ఓం నమశ్శివాయ’ అంటోంది.

ఆయాసపడుతూ లింగంగారు వొచ్చారు. “ఇదిగో దొడ్డా అరుకు. ఇప్పుడో మోతాదు సాయంత్రం ఓ మోతాదు పట్టమన్నారు. తినగలిగితే బన్ను ముక్క, కాసిన్ని పాలో కాఫీయో తాగించొచ్చు. సాయంత్రం వొస్తా. నువ్వు తాగిస్తావుగా. మరి నే వెళ్ళనా?”

“అలాగే లింగా, వెళ్ళిరా. ఊష్టం దిగజారుతుందేమోలే” అన్నాది బామ్మ.

సాయంత్రానికి కాస్త తగ్గిందనిపించింది. ” ఆ అరుకు అసయ్యం. ఆ బన్ను చేదు. తాగను గాక తాగను. తిన్నుగాక తిన్ను” అన్నా.

“పొద్దున్న ఊష్టపు తీవ్రతలో మాటాడకండా తాగీసింది. ఇప్పుడు కాస్త తగ్గగానే చూడు దీని వాలకం!” అంటూ బామ్మ బతిమాలి బతిమాలి అలిసిపోయింది.

“ఎందుకండీ దాన్ని అంతలా బతిమాలతారూ? ఊష్టంతో మూలుగుతూ పడుకుంటుంది. పడుకోనివ్వండి.” అమ్మకి మా చెడ్డ కోపం వొచ్చింది.

“తండ్రి ఉంటే నీకూ నాకూ ఈ తిప్పలు ఉండేవి కావు. వాడెప్పుడు వొస్తాడో! రేపు వొస్తాడంటావా?”

ఇంతలో లింగంగారు పొద్దున్నలా నా ప్రాణం మీదకి వొచ్చి పడ్డారు, ‘ఏం తల్లీ ఎలా ఉన్నావూ’ అంటూ.

“వొచ్చావా లింగా! ఇదో మంకుగుంట. ఊష్టం కాస్త దిగజారింది. అమ్మయ్య అనుకోడానికి లేదు. అరుకు అసహ్యంట. బన్ను చేదుట. కాఫీ వొద్దుట. పాలు తాగదట!”

లింగంగారు నా మంచం మీద కూచున్నారు. బలవంతంగా నన్ను కూచోపెట్టి నా రెండు చేతులూ గట్టిగా పట్టుకుంటే అమ్మ ఔన్సు గ్లాసు మందు నా నోట్లో పోసింది. ఎంత గింజుకున్నా వెధవమందు మింగక తప్పలేదు.

“చూడు తల్లీ, అమ్మా బామ్మా ఎంత కంగారు పడుతున్నారోను. నాన్న ఇంకా రాలేదు కదా! మందు తాక్కపోతే ఎలా? తాగితే కదా జొరం తగ్గుతుందీ? నువ్వు బళ్ళోకెళ్ళి చదూకోవద్దూ? ఆడుకోవద్దూ? చెప్పూ” అంటూ బోధపరచడం మొదలెట్టేరు.

నే మాటాడకండా వెల్లకితలా పడుకుని దూలాల్నీ వాసాల్నీ చూస్తూ ఉండిపోయే.

నాకూ తెల్సు. ఊష్టం తగ్గాలంటే మందు తాగాలని. ఆ అరుకుమందు అసయ్యంగా ఉంది మరి. ఎలా తాగుతా? నాన్నొచ్చేస్తే బావుణ్ణు. అడగాలి. అసయ్యం మందులు బదులు బావున్నవి ఎందుకు కనిపెట్టలేదూ, అని! పెద్దై నువ్వే కనిపెట్టు, అంటాడేమో నాన్న! కనిపెడతా, కనిపెడతా! తప్పకుండా కనిపెడతా!

మళ్ళా పొద్దున్నకి ఊష్టం పెరిగిపోయింది. నుదుటి మీద ఎవరిదో చెయ్యి. మాటలు వినబడుతున్నాయి. బలవంతాన కళ్ళు తెరిచా. కొండమావయ్య నా మంచం మీద కూచుని ఉన్నాడు.

“పిల్లకి నిద్ర పట్టింది. పొద్దున్నకి పిల్ల లేచి కూచుంటుంది. ఫర్వాలేదనుకున్నాం. నాకు కునుకు పట్టిందప్పుడే. బామ్మా! బామ్మా! అంటూ ఉంటే తెలివొచ్చింది. ‘బామ్మా, బామ్మా, దూలాలు రెండూ వాసాలు ఎన్నీ?’ అని అడుగుతోంది. దూలాలేఁవిటీ? వాసాలు ఏఁవిటి అని హడిలి చచ్చే. దాన్నేమో పిల్లాడితో ఇక్కడ పడుకోకే. ఏం ఊష్టమో ఏఁవిటో అని నేనే వొద్దన్నాను. ఒసేయి! ఒసేయి! అని గట్టిగా కేకేస్తూ గది గుమ్మం దగ్గరికి వెళ్ళే. ‘ఏమైంది, ఏమైంది?’ అని అది కంగారు పడుతూ లేచి వొచ్చింది. ఏమోనే దూలాలూ వాసాలూ అంటోందే! అన్నా.

తగ్గించిన లాంతరు ఒత్తిని హెచ్చు చేసిందిది. వెల్లకిలా పడుకుని కళ్ళింతింత చేసుకుని బుర్రని అటూ ఇటూ తిప్పుతూ దూలాల వేపూ వాసాల వేపూ చూస్తోంది గుండెల మీద రెండు చేతులూ కట్టుకుని! అద్గదీ, కనపడుతున్నాయి. ఒకటీ, రెండూ, మూడూ అంటూ చూపుడు వేలును తిప్పుతోంది. నా గాభరా బుర్రకి అర్థం కాలేదు. కాని – బెంబేలు పడకండి అత్తయ్యా! దూలాలూ వాసాలూ లెక్క పెడ్తోందిది, అన్నాది.”

కొండమావయ్య నవ్వుతున్నాడు.

“నవ్వుతావేంట్రా? ఇప్పుడు చూడు. మళ్ళీ ఒళ్ళు పేలిపోతూ ఊష్టం. దేవుడు నాతో ఉండి కబురు తెలిసినట్టు నువ్వొచ్చేవ్! ఓకు పెట్టి చూస్తేనే గానీ ఏం తెలుస్తుందీ? ఏదో అరుకు పోస్తారు ఆ ఆస్పత్రివాళ్ళు. సుసర్ల డాక్టరుగారు చూడాలి. ఇండీషను సూదిమందో ఏదో పడాలి. తగ్గాలి” అన్నాది బామ్మ.

“కొండడు డాక్టర్‍గారిని తీసుకు వస్తాడు లేండి అత్తయ్యా! కొండడూ, బావొచ్చేవరకూ, దీని ఊష్టం తగ్గేంతవరకూ నువ్వుండాల్సిందే! ” అన్నాది అమ్మ.

“పెంకిపిల్లా! జ్వరం తెచ్చుకున్నావా?” వస్తూనే పలకరించారు డాక్టర్‍గారు.

“నే తెచ్చుకోలేదు. అదే వొచ్చింది.”

“నువ్వు పిలిచే ఉంటావ్. పిలవందే ఎందుకు వొస్తుందీ?” అంటూ డాక్టరుగారు ఓకు గొట్టాల్ని చెవుల్లో పెట్టుకుంటూ నవ్వేరు.

“దాని పైవిలాసం నాకు తెలీదుగా, పిలవడానికీ.”

“పైవిలాసం ఏఁవిటీ?”

“చిరునామా. బామ్మ పైవిలాసం అనే అంటుంది.”

“ఓహో! ఎడ్రస్సా!”

“డాక్టరుగారూ, మీకు తెలుగు రాదా అండీ?”

డాక్టరుగారు గట్టిగా నవ్వి, “అంత బాగా రాదు” అంటూ “ఏదీ, ఆఁ అని నాలుక చాపు, చూస్తా” అన్నారు.

“అయితే ఇంగ్లీషు బాగా వొచ్చా అండీ?”

“నాలిక చాపవే ముందు. డాక్టరుగారు చూస్తారు. ఓ పక్క ఊష్టంతో వొళ్ళు కాలిపోతోంది. మాటకి మాటా – ఏఁవిటా మాటలు!” అన్నాది అమ్మ.

“మాటాడనియ్యండమ్మా. ఫర్వాలేదు” అన్నాడు డాక్టరుగారు. “అవునూ, రాత్రేవిటీ దూలాలూ వాసాలూ లెక్క పెట్టేవుటా? మీ మావయ్య చెప్పేరు” అనీ అడిగేరు.

“ఏం చెయ్యనూ? తెలివొచ్చీసింది. పైకి చూస్తే దూలాలూ వాసాలూ కనిపించేయి. లెక్క పెట్టే. వాసాలు ఎన్నో తెలీలేదు. బామ్మని లేపే.”

నన్ను మాటాడిస్తూనే ఆయన కంటి రెప్పని కిందికి లాగి రెండు కళ్ళనీ చూసేరు. నాలికా చూసేరు. తర్వాత ఓకు పెట్టి గుండెనీ ఒత్తిగిలించి వీపునూ చూసేరు. “కొంచెం వేణ్ణీళ్ళు తేండమ్మా. ఇంజక్షన్ ఇస్తాను” అన్నారు.

“అమ్మో! ఇంజీక్షను నే పుచ్చుకోను.”

“పిరికి పిల్లలా ఉన్నావే!”

“నే పిరికి పిల్లను కాను. నెప్పెడుతుందీ!”

“నెప్పెట్టకుండా నే ఇస్తాగా! జ్వరం తొందరగా తగ్గిపోవాలా, వొద్దా?”

“తగ్గిపోవాలి.”

“మరి యుద్ధం చెయ్యడానికి సాయం చెయ్యడానికి యోధుల్ని పంపొద్దా?”

“యుద్ధం ఏఁవిటీ?”

“అయ్యో, నీకు తెలీదా! నీ ఒంట్లో ఇప్పుడు యుద్ధం జరుగుతోంది.”

ఆయన నాన్నలా నా ఒంట్లో ఎలా యుద్ధం జరుగుతోందో చెపుతూ ఇంజీక్షన్ ఇచ్చీసేరు. ‘అయిపోయిందీ!’ అన్నారు. ఇచ్చినట్టే నాకు తెలీలేదు. ‘భలే ఉన్నాడే ఈ డాక్టరూ’ అనుకున్నా.

మరో ఐదారు రోజుల వరకూ అలా ఊష్టం తగ్గుతూ హెచ్చుతూ, డాక్టరు వస్తూ వెళ్తూ, మందులూ ఇంజీక్షనులూ, పాలూ బ్రెడ్డూలతో అయింది.

నార్మలుకు వొచ్చింది. నాన్నా వొచ్చేడు.

ఇహ చూడాలి! వినాలి!

నా ఊష్టం గురించీ, నా గురించీ కథలు కథలుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా చెప్పడం, ఓ పక్క ఎంతో కష్టపడ్డామంటూ మళ్ళా ఓ పక్క నవ్వుతూ ‘ఇలా చేసింది, అలా చేసింది’ అంటూ చిలవలూ పలవలూ చేరుస్తూ చెప్పిందే మళ్ళా చెప్పడం! నాన్న నా మంచం మీద కదలకండా కూచుని ఎవరు చెపుతూ ఉంటే వాళ్ళ వేపు తిరిగి విండం!

” ఓ పాటలా! ఓ గోలా! హడలగొట్టేసిందిరా” అన్నాది బామ్మ.

“జోరుజోరుగా జొరం. జోరుజోరుగా పాటలూ. ఊష్టం లోనూ ఊహలే” అన్నారు లింగంగారు.

అమ్మయితే నే పాడినట్టూ పాడుతూ మరీ చెప్పింది.

బుర్రనిండా బుర్రలో వేడి వేడీ ఆవిరులు
పుట్టుకొస్తున్నాయి పాటలు
పుట్టుకొస్తున్నాయి పాటలు
అయ్యో అయ్యో ఏవీ ఏవీ
వచ్చిన మాటలు వచ్చిన మాటలు
ఎగిరిపోతున్నాయి ఎగిరిపోతున్నాయి
ఎలా ఎలా ఎలా!
పట్టుకోవే బుర్రా పట్టుకోవే!
గభాలున పట్టుకోవే!

నాన్నకు నవ్వాగలేదు. నాన్నతోపాటు కొండమావయ్యా శ్రుతి కలిపేడు.

“ఓరోజు ఎంత గోల చేసిందనుకున్నావ్! గదీ ఒళ్ళూ ఊష్టం కంపు కొడుతోందనీ! దుప్పటీ తీసిపారెయ్యి. తలగడా గలీబూ పీకి పారెయ్యి. కంపు! కంపు! కంపు! నీలగిరి తైలం మందు కంపు. ఊష్టం కంపు. వెలిగించండి ఊదొత్తులూ కర్పూరం. దేవుడి గది వాసనలు బాగుంటాయి, అంటూ గొడవ! ఇంకా ఏం విన్నావ్? చివరికి పళ్ళసంపెంగ పువ్వులు తెచ్చిపెట్టండి. ఈ కంపు పోయి గది గడీకొక పండు వాసన వేస్తుంది, అన్నాది!”

ముత్తమ్మా తక్కువ తిన్లేదు. “ఎన్నెన్ని సెప్పమంటావ్ బాబూ. నానూ ఇన్నా. ఓ పాలి పాడిందీ –

ఊస్టం ఊస్టం
నా ఊసుకు రాకే
నీ మొహం మండా!
బామ్మలా తిడతా!
నీ మొహం మండా!

తిట్లే తిట్లతో పాటండీ!”

“పెద్దాయన లేట్ట. కుర్ర డాక్టరుని పిల్చుకు వొచ్చేడు కొండ. దీంతో నీలా అతగాడూ ఒకటే కబుర్లు అనుకో. ఓ మూల ఊష్టంతో వొళ్ళు కాలిపోతోందా. అయినా ఆయనతో మాటకి మాటా అడ్డూ ఆపూ లేకుండా మాటాడింది.”

“మీరుండండి అత్తయ్యా! నన్ను చెప్పనివ్వండి” అని అమ్మ బామ్మకి అడ్డు తగిలింది. ” ఓ రెండ్రోజులు యుద్ధం గోల. ఒకటే యుద్ధం గోల!”

“యుద్ధం ఏఁవిటీ?” అడిగేడు నాన్న.

“దాని ఒంట్లో యుద్ధం జరుగుతోందట. ఆ కుర్ర డాక్టరు యుద్ధాలు మంచివీ చెడ్డవీ ఉంటాయని, దీని ఒంట్లో ఇప్పుడు యుద్ధం జరుగుతోందనీ చెప్పేడు. ఆవేళా మర్నాడూ యుద్ధం గోలే!

ఢీ కొట్టండి ఢీ ఢీ కొట్టండి
తెల్ల యోధుల్లారా
చంపండి చంపండి చంపేయండి!
తప్పవు తప్పవు యుద్ధాలు తప్పవు
మంచి యుద్ధాలు చెడ్డ యుద్ధాలు
నెత్తురు పెంచే యుద్ధం
నెత్తురు పారించే యుద్ధం
తెల్ల యోధుల్లారా! ఎర్ర యోధుల్ని పెంచండీ!
మంచి యుద్ధం చెయ్యండీ!

కాస్త ఊష్టం దిగజారితే చాలు – గెలుపే గెలుపు. శభాష్ శభాష్ అండం!”

“అన్నిటికన్నా నువ్వు వినాల్సింది మరో గొప్ప సంగతుంది బావా!” అన్నాడు కొండమావయ్య.

“ఏఁవిటేఁవిటి?”

“నా మేనగోడలు ఇంక పెరగమన్నా పెరగదు. ఇలా చిన్నపిల్లగానే ఎప్పటికీ ఉండిపోతుంది!”

ఏఁవిటేఁవిటీ? అని అందరూ కొండమావయ్య వేపు తిరిగేరు.

“నేనెవరికీ ఇప్పటివరకూ చెప్పలేదు. నువ్వొచ్చేక ఏకంగా చెప్దామని. ఓ రోజు రాత్రి నాకూ చెప్పిందీ అది ఇలా చిన్నపిల్లగా ఎప్పటికీ ఉండిపోతుందట. పెరగమన్నా పెరగదట! అదేంటీ అని అడిగితే ‘నే చందమామ దగ్గరికి వెళ్ళే మావయ్యా’ అన్నాది.

‘ఎప్పుడూ?’

‘నీకూ నిద్ర పట్టీసింది.’

‘మందు తాగి నువ్వూ పడుకున్నావు. ఆ తర్వాతే నే పడుకున్నా కదా!’

‘నువ్వనుకున్నావ్ కొండమావయ్యా నే పడుకున్నాననీ! వెన్నెలగా ఉంది కదూ ఇవాళ! పెద్దకిటికీ తీసివుందిగా! ఆకాశం మాంఛి తెల్లగా వెన్నలా మెత్తగా భలే బావుంది. అలా చూస్తూ ఉంటే కాస్సేపటికి చందమామ కిటికీకి ఎదురుగ్గా దగ్గరగా వొచ్చీసీడు. కళ్ళు మూసుకుని తెరిచీసరికి నేను ఆకాశంలో ఉన్నా. ఎంత మెత్తగా ఉందో ఆకాశం!

చందమామ చుట్టూ ‘హాయి హాయి’ అంటూ గెంతుతూ, అవునూ నేనెలా వొచ్చేనిక్కడికీ? కొండమావయ్య భుజాల మీద ఎక్కి నిల్చుని చేతులు చాపినా ఆకాశమూ నువ్వూ అందరనీ, ఇంకా ఇంకా పైకిపైకి మీదకిమీదకి వెళ్ళిపోతారనీ చెప్పేడు కదా! అని ఆమాట చందమామనే అడిగే.

‘పెద్దవాళ్ళు అందుకోలేరు. వాళ్ళకి అందం. నీలాంటి పిల్లలకి అందుతాం’ అన్నాడు.

‘మరయితే నేనూ పెద్దయిపోతాగా! అప్పుడు అందరా?’

‘ఊహూఁ, అప్పుడూ అందం’ అన్నాడు.

‘చందమామా, చందమామా! నేను పెద్దై పోకుండా ఎప్పటికీ ఇలా చిన్నపిల్లగా ఉండిపోడానికి ఏదన్నా పసరు ఇవ్వవా? రాసుకుంటా’ అని అడుగుతూ చుట్టూ చూశా. ఆకాశం నిండా వెన్నెలే. ఆకాశంలో చెట్లుండవుగా! ఆకులూ పసరూ ఎలా వొస్తాయీ? తెలివితక్కువగా అడిగేను.

చందమామ మాటాడలేదు. కాసేపు చుట్టూ చూస్తూ ఆలోచిస్తూ ఉంటే నాకే భలేగా ఊహొచ్చింది. వెన్నెల ఉందిగా! చందమామది! దాన్ని పట్టించుకుంటే పెద్దవకుండా ఉంటానా?! అయినా ఎలా పట్టించుకోడం? తెల్లగా ఉంది కాని నా మొహానికి అమ్మ రాసే స్నో లా లేదు. పోనీ అని పవుడరు లాగా లేదు. చందమామనే అడిగే.

‘వెన్నెలని దోసిట్లోకి తీసుకుని రెండు చేతులతో రుద్దితే పవుడరు అవుతుందీ – దాన్ని రాసుకుంటే చిన్నపిల్లగా ఎప్పటికీ ఉండిపోతావు, పెద్దవవు’ అనీ చెప్పేడు.

ఎగిరి గంతేసే!

దోసిట్లోకి వెన్నెలని తీసుకుని రెండు చేతుల్తో రుద్ది, ఆ పవుడరును మొహానికీ మెడకీ చేతులకీ రాసుకున్నా. అచ్చు క్యూటీకోరా పవుడరు లాగే ఉంది. చందమామ నవ్వుతూ ‘కాళ్ళకీ పొట్టకీ కూడా రాసుకో మరీ’ అన్నాడు.

వెన్నెల తగ్గిపోతూ మసక మసక అయిపోతోంది. నేను నా మంచం మీదికొచ్చీసే.

‘నే వెన్నెల పవుడరు రాసుకున్నా. ఎప్పటికీ పెద్దవను! అన్నాది. అదీ సంగతి” అని చెప్పేడు కొండమావయ్య.

నాన్న నవ్వుతూ ఎప్పట్లాగానే చిక్కులు పడ్డ నా తుప్పజుట్టు తలని చేత్తో నిమురుతూ “బావుంది. మనమూ మన చిన్నప్పుడు వెన్నెల పవుడరు రాసుకొని ఉంటే ఎంత బాగుండేది! మన మనసులు చిన్నపిల్లల మనసుల్లా ఉండేవి కదా కొండయ్యా” అన్నాడు.

“నిజఁవే బావా!” అన్నాడు కొండమావయ్య.

‘బావుందే భలే కథ’ అన్నారంతా.

“నువ్వు ఏ ఊరన్నా ఎక్కువ రోజులకి వెళ్తే దీన్ని నీతోపాటు తీసికెళ్తూ ఉండు. ఇలా ఏ ఊష్టమన్నా వొస్తే మేం బెంగెట్టుకోవాలి. వెయ్యి దేవుళ్ళకి మొక్కుకోవాలి” అన్నాది బామ్మ.

“నాన్న తీసుకెళ్తానన్నా నే వెళ్ళను. చదూకోవద్దేంటి? బడో? ఈ ఊష్టంతో ఇప్పటికే ఎన్ని పాఠాలు అయిపోయాయో ఏఁవిటో! ఎంత చదువుకోవాలీ ఏఁవిటో” అన్నా.

“నే చెప్తాలే అన్నీ” అన్నాడు నాన్న.