I
మూఢనమ్మకం అంటే ఏమిటి?
-ఋజువులు లేకున్నా, మన నమ్మకానికి వ్యతిరేకంగా ఋజువులున్నా, మనం నమ్మదలుచుకున్నదాన్ని నమ్మడం.
-ఒక అద్భుతాన్ని మరొక అద్భుతంతో సమర్థించడం.
-ఈ సృష్టిని యాదృచ్ఛికత లేదా ఒక వ్యక్తి చాపల్యము నడిపిస్తుందని నమ్మడం.
-కార్యకారణాల మధ్యనున్న అనుబంధాన్ని త్రోసిపుచ్చడం.
-ప్రకృతికి ఆలోచనలూ, ఉద్దేశ్యాలూ, ఒక ప్రణాళికనూ అంటగట్టడం.
-మనసు పదార్థాన్ని సృష్టించగలదనీ, దాన్ని నియంత్రించగలదనీ నమ్మడం.
-పదార్థము లేకుండా శక్తి ఉనికినీ, శక్తి లేకుండా పదార్థపు ఉనికినీ విశ్వసించడం.
-అద్భుతాలనీ, వశీకరణశక్తులనీ, సమ్మోహశక్తినీ (లేదా మంత్రాలనీ), కలల్నీ, భవిష్యవాణినీ నమ్మడం.
-ప్రకృతికి అతీతమైన శక్తిని నమ్మడం.
అజ్ఞానం మూఢనమ్మకానికి పునాది, నమ్మకం దానిమీద కట్టిన భవనం, నిష్ప్రయోజనమైన ఆశ దాని శిఖరం. మూఢనమ్మకం అజ్ఞానానికి బిడ్డ, దుఃఖానికి కన్నతల్లీ. ప్రతి మెదడులోనూ ఏదో కొంతమేరకు మూఢనమ్మకపు పొరలు కమ్ముకునే ఉంటాయి.
ఒక స్త్రీ పొరపాటున తాను గిన్నెలు తుడుస్తున్న గుడ్డ చేతిలోంచి జారిపోగానే, ‘అంటే ఇంటికి చుట్టాలొస్తారన్నమాట’ అంటుంది.
చాలామంది ఇంటికి చుట్టాలు రావడానికి, చేతిలోంచి గుడ్డ జారిపోవడానికీ సంబంధం లేకపోవడాన్ని ఒప్పుకుంటారు. ఇక్కడ లేని వ్యక్తుల మెదడులో రావాలన్న ఆలోచన పడిపోయిన గుడ్డ కలిగించలేదు. ఆ గుడ్డ దానిని పడేసినవాళ్ళ ఇంటికే రావాలని బంధువుల మనసులో ఎలా తోచేలా చేయగలదు? చేతిలోని గుడ్డని జారవిడవడానికి, ఇంటికి చుట్టాలు రావడానికీ ఏ విధమైన సంబంధమూ ఉండకపోవచ్చు.
ఒక వ్యక్తి తన ఎడమ భుజమ్మీద నుండి నెలబాలుడిని చూసినపుడు, ‘ఏదో నష్టం జరగబోతోంది’ అనుకుంటాడు.
నెలబాలుడిని కుడి భుజం మీద నుండో ఎడమ భుజం మీద నుండో చూడడం, చూడకపోవడం, చంద్రుడి మీద గాని, లేదా చంద్రుడి ప్రభావం భూమి మీద ఏ ప్రాణి మీద గాని మార్పు తీసుకురాలేదు. ఎడం భుజం మీద నుండి చూడడమన్నది ఖచ్చితంగా అప్పుడున్న పరిస్థితులమీద ఏ విధమైన ప్రభావాన్నీ కలుగజెయ్యలేదన్నది వాస్తవం. పరిస్థితులు కుడిభుజం మీద నుండి చూస్తే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. కనుక ఒక వ్యక్తి ఎడమభుజం మీంచి చంద్రుడిని చూడడానికి, అతనికి రాగలిగిన నష్టం రావడానికీ మధ్య ఏ విధమైన అనుబంధాన్నీ ఊహించలేము.
ఒక పడుచు పిల్ల పువ్వును కోసి, దాని రేకలను ఒకటొకటిగా త్రుంచుతూ ఇలా ఊహించుకుంటుంది: ‘ఒకటి… అతను వంచిస్తాడు; రెండు… అతను నిరీక్షిస్తాడు; మూడు… ప్రేమిస్తాడు; నాలుగు… పెళ్ళి చేసుకుంటాడు; ఐదు… విడిచిపెడతాడు…’
నిజానికి ఈ అమ్మాయి ప్రేమలో పడడానికి, పెళ్ళి జరగడానికీ ఆ పువ్వు పూయనూ లేదు, దాని రేకలు మొలవనూ లేదు. ఆ అమ్మాయి చెయ్యి వెతికి వెతికి ఫలానా పువ్వును ఎంచుకోవడం వెనుక ఏ రహస్యమైన ఆలోచన, ఏ విశేషమూ లేవు. అలాగే, ఒక వ్యక్తి భవిష్యత్తు ఆహ్లాదకరంగా గడుస్తుందా, దుఃఖభరితంగా గడుస్తుందా అన్నది, ఏ రకంగా ఆలోచించినా, ఆపిలు పండులోని విత్తనాల సంఖ్య ప్రభావితం చెయ్యలేదు.
వేలమంది మనుషులకి శుభ అశుభ దినాలమీద, అదృష్ట దురదృష్ట సంఖ్యల మీద, శకునాలు, గుర్తులు, రత్నాలు, మొదలైన వాటి మీద నమ్మకం ఎక్కువ. చాలామంది ప్రయాణం చెయ్యడానికి, పెళ్ళి చేసుకుందుకు, పెట్టుబడులు పెట్టడానికీ శుక్రవారం చెడురోజుగా పరిగణిస్తారు. దానికి వాళ్ళు చెప్పే ఒకే ఒక్క కారణం ‘శుక్రవారం మంచిరోజు కా’దని. తక్కిన రోజులు ప్రయాణానికి ఎంచుకోవడం కంటే సముద్ర ప్రయాణానికి శుక్రవారం ఎంచుకోవడం గాలివాటు మీద, కెరటాల మీద, అలల మీద, ఎక్కువ ప్రభావం చూపించడానికి అవకాశంలేదు. శుక్రవారం ప్రయాణానికి మంచిరోజు కాదని అనుకోవడానికి కారణం బహుశా అందరూ అలా అనుకోవడమే అయి ఉంటుంది.
అలాంటిదే 13మంది కలిసి భోజనం చెయ్యడం ప్రమాదకరం అన్న నమ్మకం. 13 దురదృష్ట సంఖ్య అయితే 26 రెండు రెట్లు దురదృష్టకారి, 52 నాలుగురెట్లు దురదృష్టకారీ అవాలి మరి! 13మంది కలిసి భోజనం చేస్తే, అందులో ఒకరు ఏడాది తిరక్కుండా చనిపోతారట. ఆ అంకెకి, కలిసి భోజనం చేసిన మనుషుల ఒక్కొక్కరి జీర్ణ వ్యవస్థకి, ఒక్కొక్కరికీ ఉన్న వ్యక్తిగత అనారోగ్యాలకీ ఎలాంటి సంబంధాన్నైనా ఊహించడం కష్టం. అంకె ఆధారంగా నిర్ణయించవలసి వస్తే, 13మంది కంటే 14మంది కలిసి ఒకే టేబిలు దగ్గర తింటే ఏడాది తిరక్కుండా అందులో ఒకరు చనిపోడానికి సంభావ్యత ఎక్కువ.
అలాగే, భోజనాల బల్ల దగ్గర ఉప్పు సీసా తిరగబడటం దురదృష్టాన్ని సూచిస్తుంది కాని వినెగర్ అయితే మాత్రం ఏమీ తేడా ఉండదట. ఉప్పు ఎందుకు ప్రతీకారం కోరుకుంటుందో, వినెగర్ ఎందుకు కోరుకోదో ఎవరూ చెప్పరు.
థియేటర్ లోకి ముందుగా కాలుపెట్టిన వ్యక్తికి మెల్ల ఉంటే, ఆ నాటకానికి ప్రేక్షకులు హాజరు తక్కువై ప్రదర్శన నష్టం మూటగట్టుకుంటుందిట. థియేటరులో మొట్టమొదటగా కాలుపెట్టిన ఒక వ్యక్తి కళ్ళ అమరికలోని ప్రత్యేకత, ఆ ప్రాంత ప్రజల నాటక ప్రదర్శనను చూసే ఉత్సాహాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, లేదా, నాటక ప్రదర్శన చూడడానికి ఒక ప్రాంతపు ప్రజల అయిష్టత ఆ మెల్లకన్ను వ్యక్తి అందరికంటే ముందు హాలులో అడుగుపెట్టడానికి ఎలా ప్రేరేపిస్తుందో సంతృప్తికరంగా ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇక్కడ చూపిస్తున్న కారణానికి, అక్కడ జరిగే కార్యానికి, మనం గమనించగలిగినంత మట్టుకు ఏ సంబంధమూ లేదు.
రంగురాళ్ళు ధరించడం అశుభం. కాని, కెంపురాయి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఈ రాళ్ళు భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో, కారణాన్ని నిర్మూలించి భవిష్యత్తుని ఎలా నిర్ణయిస్తాయో, ఎవరికీ తెలియదు కనుకే వేలకొద్దీ అదృష్టాన్ని/ దురదృష్టాన్ని తెచ్చే వస్తువులు, హెచ్చరికలు, శకునాలు, భవిష్యవాణులూ ఉన్నాయి. బుద్ధి, వివేకమూ కలిగిన ఆలోచనాపరులందరూ వీటిలో ప్రతి ఒక్కటీ అర్థం పర్థం లేని తెలివితక్కువ నమ్మకాలని తెలిసినవారే.
మనం మరో అడుగు ముందుకి వెళ్దాం.
కొన్ని శతాబ్దాలపాటు మనుషులు సూర్య, చంద్ర గ్రహణాలు వచ్చినపుడు అవి రాబోయే కరువు కాటకాలకు సూచికలని, తోకచుక్కలు మహారాజుల మరణానికి, సామ్రాజ్యాల పతనానికి, రానున్న యుద్ధాలకి, మహమ్మారులకీ సంకేతాలనీ నమ్మేరు. ఉత్తరధృవం దగ్గర ఆకాశంలో కనిపించే వింత కాంతులు, చంద్రుడి చుట్టూ కనిపించే వలయాలు, సూర్యుడి చుట్టూ వచ్చే ఛాయలు, ఉల్కాపాతాలు, తెలివైన మన పూర్వీకుల్ని భయకంపితులని చేసేయి. వాళ్ళు తమ మోకాళ్ళమీద పడి రానున్న ప్రమాదాలని నివారించడానికి ప్రార్థనలు, బలులతో వాళ్ళకు చాతనయిన పని వారు చేసేవారు. భయంతో పాలిపోయిన ముఖాలతో వాళ్ళు కళ్ళు మూసుకుని భగవంతుడిని సహాయాన్ని అర్థిస్తూ ప్రార్థించేవారు. ఇప్పటి సంప్రదాయ బోధకుల్లాగే, అప్పటి చర్చి అధికారులు కూడా భగవంతునితో సన్నిహితంగా మెలిగినవారు గనుక, గ్రహణాలు, సూర్యఛాయలు, ధృవకాంతులకు సరియైన అర్థం ఏమిటో ఎరిగినవారు; భగవంతుడికి మనుషుల మీద ఓపిక నశించిపోయిందని తెలుసు; అతను కోపపు కత్తికి పదును పెడుతున్నాడని, ప్రజలు కేవలం చర్చిపురోహితులు చెప్పినట్టు నడుచుకోవడం ద్వారాను, పూర్వంకంటే ఎక్కువసార్లు జపమాలలు త్రిప్పటం ద్వారాను, మునపటికంటే అధికంగా చర్చికి చందాలు చెల్లించడం ద్వారానూ తమని తాము రక్షించుకోగలరని చెప్తారు.
భూకంపాలు, తుఫానులూ చర్చి కోశాగారాన్ని నింపేవి. విపత్తులలో లోభి వణుకుతున్న చేతులతో తన ముల్లె విప్పేవాడు. గ్రహణాల చీకటిలో దొంగలు, దోపిడీదారులూ భగవంతుడితో లూటీ సొమ్ముని పంచుకునేవారు. పాపం అమాయక, నిరుపేద, అక్షరజ్ఞానం లేని బాలికలు భగవంతుడి హృదయాన్ని కరిగించడానికి, తాము ప్రార్థించడం మరిచిపోయామని గుర్తుకువచ్చి అపరాధభావనతో, బొట్టుబొట్టుగా అపురూపంగా దాచుకున్న చిన్నచిన్న మొత్తాల్ని చర్చికి సమర్పించుకునేవారు.
ఇప్పుడు మనకందరికీ ఆకాశంలో కనిపించే ఈ వింతలకి, రాజుల, దేశాల, లేదా వ్యక్తుల భవితవ్యానికీ ఏ విధమైన సంబంధమూ లేదని తెలుసు. అందులో చీమల పుట్టలకి, తేనెటీగల గుంపులకి, క్రిమికీటకాల గుడ్లకీ ఎలా సంబంధం లేదో మనుషులకీ అటువంటి సంబంధం ఏదీ లేదని తెలుసు. మనకి ఇప్పుడు గ్రహణాలు, తోకచుక్కలు, ఉల్కాపాతాలు మనిషి భూమి మీద లేనప్పుడెంతో, భూమి మీద ఉన్నప్పుడూ అంతే అని తెలుసు; గ్రహణాలు ఎప్పుడెప్పుడు వస్తాయో ఖచ్చితంగా తెలుసు; వాటిని ముందుగానే లెక్కకట్టగలం కూడా.
కొన్నాళ్ళ క్రిందటి వరకూ కొన్ని జడపదార్థాల్లో, సిద్ధి పొందిన కొందరు స్త్రీ/పురుషుల ఎముకల్లో, ఆత్మార్పణ చేసినవారి కేశాల్లో, తపోధనుల వస్త్రాలనుండి తీసిన మురికి నూలుపోగుల్లో, పవిత్రమైన శిలువ నుంచి పెళ్ళగించిన కర్రముక్కల్లో, తుప్పుపట్టిన ఇనపమేకుల్లో, పవిత్ర వ్యక్తుల దంతాల్లో, చేతి గోళ్ళలో, ఇంకా అనేకానేక వస్తువుల్లో రోగాలను నయం చెయ్యగల మహాత్మ్యం ఉందని అందరూ నమ్మేవారు. రోగగ్రస్తులు పైన చెప్పిన వ్యక్తుల ఎముకలో, దంతాలో, గుడ్డ పీలికలో, కర్రముక్కలో, పవిత్రకేశాలో, భద్రపరిచిన పెట్టెను ముద్దుపెట్టుకోగానే వాళ్ళ రోగాలు తగ్గిపోయేవి. కానీ ఒక్కటే షరతు, అలా ముద్దుపెట్టుకోడానికి ముందు గాని, తర్వాత గాని చర్చికి కొంత ధనాన్ని బహుమతిగా సమర్పించుకోవాలి. అప్పుడు, ఆ ఎముకలో, దంతంలో, గుడ్డ పీలికలో, కర్రముక్కలో నిక్షిప్తమైన అజ్ఞాతశక్తి అద్భుతమైన రీతిలో, విశ్వాసి అయిన ఆ రోగిని ఆవహించి, భగవంతునికి మారుగా అతని రోగానికి కారణమైన పీడను వదిలించి స్వస్థత చేకూరుస్తుంది.
ఈ ఎముకలు, గుడ్డ పీలికలు, పవిత్రకేశాలూ రోగాలను నయంచేస్తాయని నమ్మడం వెనుక మరో నమ్మకం ఉంది. అది, ఈ రోగాలకు కారణం దుష్టశక్తులని. పిచ్చివాళ్ళని భూతశక్తులు ఆవహిస్తాయని ఒక నమ్మకం. మూర్ఛరోగం, అపస్మారకం సైతాను దగ్గర ఉన్న పిశాచాలు కలుగజేస్తాయని ఒక నమ్మకం. క్లుప్తంగా చెప్పాలంటే, మనిషికి వచ్చే అన్ని రోగాలకీ కారణం నరకాధీశ్వరుని దూతలు. ఈ రకమైన నమ్మకం, ప్రపంచంలో అన్ని జాతుల, మతాల, సంస్కృతులలోనూ ఉంది. ఈనాటికీ సిద్ధపురుషుల ఎముకల్లో అటువంటి మహాత్మ్యము ఉందని నమ్మేవారు లక్షలమంది ఉన్నారు.
అయితే, వివేకవంతులైన వ్యక్తులెవరూ ఈ రోజు దయ్యాలూ భూతాలూ ఉన్నాయంటే నమ్మరు; తెలివైన వారెవ్వరూ రోగాలకి కారణం దయ్యాలూ భూతాలూ అంటే నమ్మరు; వివేకవంతులెవరూ, పవిత్రమైన ఎముకలు, గుడ్డ పీలికలు, పవిత్ర కేశాలు, కర్రముక్కల వల్ల రోగాలు నయమవుతాయన్నా, రక్తవిహీనమై పాలిపోయిన బుగ్గలలోకి ఏదో రకంగా జీవకళ తీసుకువస్తాయన్నా నమ్మరు.
ఈ రోజు వివేకవంతులందరికీ తక్కిన ఏ జంతువు ఎముకల్లోకంటే, సిద్ధపురుషుల ఎముకల్లో ప్రత్యేకమైన విశేషం ఏదీ ఉండదని తెలుసు; దేశదిమ్మరిగా తిరుగుతూ అడుక్కునే వ్యక్తి ఒంటి మీది చిరుగులుపడ్డ గుడ్డకీ సిద్ధపురుషుడి ఒంటిమీది బట్టకీ మధ్య తేడా ఏమీ ఉండదని తెలుసు; గుర్రపు వెంట్రుక త్యాగమూర్తి శరీరం మీది కేశాలకంటే మిన్నగా రోగం నయం చెయ్యగలదు; ఇప్పుడు మనకు పవిత్ర అవశేషాలని చెప్పేవన్నీ మతసంబంధమయిన చెత్త అని అందరికీ తెలుసు. వాటిని ఎక్కువగా ఉపయోగించేది నిజాయితీ లేని వాళ్ళని, వాటిమీద ఆధారపడేవాళ్ళు దాదాపు మూర్ఖులనీ చెప్పవచ్చు.
తావీదులమీద, మంత్రాల మహిమ మీద, దయ్యాలూ భూతాల మీద, నమ్మకమన్నది- క్లుప్తంగా, నిర్మొహమాటంగా చెప్పాలంటే, ఒక మూఢనమ్మకం.
ఈ పవిత్ర అవశేషాలకి రోగాలను నయంచేసే శక్తి ఉందని గాని, వాటిని ఔషధాలుగా గాని మన పూర్వీకులు భావించలేదు. వాళ్ళ ఉద్దేశ్యం ఈ క్షుద్రశక్తులు పవిత్ర వస్తువులైన ఎముకలని, శిలువనుండి తీసిన కర్రముక్కను చూసి భయపడి పారిపోతాయని; పవిత్రజలం మనిషిమీద జల్లినపుడు ఆ ప్రాంతం విడిచిపోతాయనీ. ఈ క్షుద్రశక్తులకి పవిత్రమైన ఘంటానాదం అన్నా భయం, పవిత్రమైన దీపాలన్నా/ కొవ్వొత్తులన్నా భయం. అన్నిటికన్నా పవిత్రమైన శిలువ అంటే భయం అన్నదీ అటువంటిదే.
II
మరొక విషయం.
ఈ దయ్యాలూ భూతాలమీద క్షుద్రశక్తులమీద నమ్మకం మరొక నమ్మకానికి పునాది వేసింది: అదే క్షుద్రవిద్య.
క్షుద్రశక్తి, తనకి ఆత్మని కుదువబెట్టినందుకు ప్రతిఫలంగా కొన్ని లాభాలు కలుగజేస్తుందన్నది ఒక నమ్మకం. బాగా ముసలివాడై, నడుము వంగి, శక్తి సన్నగిల్లిన మనిషి, తన యవ్వనాన్ని అన్ని హంగులతో… నిగనిగలాడుతున్న గోధుమరంగు జుత్తు, జీవితం మీద ఆశ, తిరిగి పొందవచ్చు క్షుద్రశక్తికి అతని ఆత్మని దఖలు పరిస్తే. దుర్బుద్ధి గలవారు మత్సరంతో, మంత్రతంత్రాలు ప్రయోగించి, పేదలని ధనవంతులు చేసి, అత్యాశాపరులని అధికారపీఠాలను ఎక్కించీ ఆ విధంగా ప్రతీకారం తీర్చుకుంటారని నమ్మకం. అటువంటి ప్రలోభాలకి లొంగనివాళ్ళకి ఉత్తరలోకాల్లో సుఖాలు కాచుకుకూచుంటాయని, కానీ వాటిని ఈ సైతాను భూలోకంలో ఆశపెడతాడనీ నమ్మకం. ఈ క్షుద్రశక్తులమీద నమ్మకంతో కొందరు ఎన్ని రకాల బాధల్ని అనుభవిస్తారో ఊహకు కూడా అందదు. తల్లిదండ్రులు జైలుపాలయి, హింసకు గురయి, సజీవంగా దహించబడి, వాతలకు లోనయి, పిల్లలు హత్యకు గురయీ పాపం అమాయకులు యంత్రాలమీద నరాలు చిట్లేలా సాగదీయబడి, కొరడాదెబ్బలు తిని, చితక్కొట్టబడీ ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయో!
ప్రతి ఇంటిలో, ప్రతి గుండెలో, భయం, మూఢనమ్మకం గూడుకట్టుకున్న రోజులు ఊహించండి. ఒకరిని నిందించడమే శిక్ష ఖరారు చెయ్యడం అయినప్పుడు, ‘నాకేమీ తెలియదని’ చెప్పడమే నేరాన్ని అంగీకరించడంగా భావించినపుడు క్రైస్తవం ఎంత ఉన్మాదంగా ప్రవర్తించేదో!
మనకి ఇప్పుడు ఈ ఘోరాలన్నిటికీ కారణం మూఢనమ్మకం అని తెలుసు. బాధలనన్నిటినీ సహించడానికి కారణం అజ్ఞానమనీ తెలుసు. మంత్రగత్తెలు, మంత్రగాళ్ళూ ఎవరూ లేరని, మనుషులు తమ ఆత్మలని భూతాలకి తనఖా పెట్టలేరని, మన పవిత్ర మూలపురుషులు ఈ విషయంలో పొరపడ్డారనీ తెలుసు.
మరొకమాట.
మన పూర్వీకులు వింతలను, అద్భుతాలనూ నమ్మేవారు. శకునాలు, సంకేతాలని – గ్రహణాలని, తోకచుక్కలని, పుణ్యపురుషుల ఎముకల మహత్వాన్ని, క్షుద్రత్వానికి అంటగట్టిన అన్ని శక్తులనీ నమ్మేవారు. ఈ విషయాలన్నీ అద్భుత శక్తుల్లో భాగాలు. ఈ ప్రపంచం నిండా ఈ అద్భుతశక్తులు నిండివున్నాయి. ఈ దుష్టశక్తులన్నీ మాయామశ్చీంద్రలు. ఏ చర్య వెనుకా ప్రకృతిసిద్ధమైన కారణాలు ఏవీ ఉండవు. ఒక భూతం మనసులో తలుచుకుంటుంది. అది వెంటనే జరిగిపోతుంది. సైతానుకు తన ఆత్మని తనఖా పెట్టిన వ్యక్తి, ఏ పనీ చెయ్యడు. కొన్ని వింత వింత మంత్రాలు చదువుతాడు. అంతే! అడిగినది ఎదుట ప్రత్యక్షమవుతుంది. ప్రకృతి సహజమైన కారణాల మీద అసలు నమ్మకమే లేదు. మాయలు, భ్రమలు, అద్భుతాలే ఈ ప్రపంచాన్ని శాసించేవి. పునాదులు కూలి వివేకం తన పదవి కోల్పోయింది. విశ్వాసం అసత్యాలకి భాషని, రెక్కలనీ తొడిగింది. పాపం సత్యాలు మౌనంగా, కుంటుకుంటూ, ఏ గుర్తింపుకీ నోచుకోకుండా, ఎవరికీ తెలియకుండా వెనకడుగు వేశాయి.
అద్భుతం అంటే ఏమిటి?
ప్రకృతిసిద్ధంగా ప్రవర్తించే వ్యక్తి, ప్రకృతిలోని నియమాలకు లోబడకుండా జరిపే ఒక చర్య. అద్భుతాన్ని ఇంతకంటే నిజాయితీగా నిర్వచించడం కుదరదు.
ఒక వ్యక్తి, వ్యాసం దాని చుట్టుకొలతలో సరిగ్గా సగం ఉండేలా వృత్తం గీయగలిగితే, అది జ్యామితిలో ఒక అద్భుతం. రెండు నాలుగులు తొమ్మిది చేయగలిగితే లెక్కలలో అది అద్భుతం. ఒక వ్యక్తి గాలిలోకి విసరిన రాయిని మొదటి క్షణంలో పదడుగులు, రెండవ క్షణంలో ఇరవై అడుగులు, మూడవ క్షణంలో ఐదడుగులు పడేలా చెయ్యగలిగితే అది భౌతికశాస్త్రంలో అద్భుతం. ఒక వ్యక్తి హైడ్రొజన్, ఆక్సిజన్, నైట్రోజనూ కలిపి బంగారం తయారుజెయ్యగలిగితే అది రసాయనశాస్త్రంలో అద్భుతం. ఒక మతబోధకుడు తన నమ్మకాన్ని ఋజువు చెయ్యగలిగితే అది వేదాంత విషయంలో అద్భుతం. అమెరికను కాంగ్రెసు చట్టం ద్వారా 20సెంట్ల విలువైన వెండిని ఒక డాలరు విలువగలిగిన దానిగా చెయ్యగలిగితే అది ఆర్థిక రంగంలో అద్భుతం. ఒక అద్దం దాని ముందున్న మనుషుల ముఖాలకు బదులు దాని వెనుక వున్న వ్యక్తుల ముఖాలు ప్రతిబింబించేలా చెయ్యగలిగితే అది అద్భుతం. ఒక ప్రశ్నకి ప్రతిధ్వని సమాధానం చెప్పగలిగితే అది అద్భుతం. మరొకమాటలో చెప్పాలంటే, ప్రకృతిలో కనిపించే వాటికి భిన్నంగా, లేదా ప్రకృతి సత్యాలకి అతీతంగా చేసేవన్నీ అద్భుతాలే.
మనకి ఇప్పుడు ‘ప్రకృతి ఏకత’ పట్ల విశ్వాసం కుదురుకుంది. ప్రకృతిలోని ప్రతి పదార్థమూ దాని అంతర్గత లక్షణాలను బట్టి పనిచెయ్యడం గాని, చర్యలో పాల్గొనడం గాని చేస్తాయని నమ్ముతున్నాం. అంటే, అన్ని నైసర్గిక పరిస్థితులు సమానంగా ఉన్నప్పుడు, ఫలితాలు చాలవరకు ఒకేవిధంగా వస్తాయని మన విశ్వాసం. అలాగే, సమాన వస్తువులు సమాన ధర్మాలు, లక్షణాలు కలిగి ఉంటాయని, సమాన ప్రతిక్రియల్ని కలిగిస్తాయనీ నమ్మకం. ప్రతి చర్యకీ వెనుక ప్రకృతిసిద్ధమైన మూలకారణం ఉంటుందని, ప్రతిచర్య లేకుండా ఏ చర్యా ఆగిపోదనీ మనకిపుడు తెలుసు.
అద్భుతాలు అసంగతాలే కాదు, ఆలోచనాపరుడైన ఏ వ్యక్తి ఆలోచనకీ అందనివి. అద్భుతాలు ఒకప్పుడు జరిగేవి అన్నా, ఇక ముందు జరుగబోతాయి అన్నా వివేకవంతుడైన మనిషి ఇప్పుడు నమ్మడు.
అద్భుతాలమీద నమ్మకం, అజ్ఞానం అన్న మట్టిలో పెరిగి పెద్దదవుతుంది.
III
మరొక విషయం.
మన పూర్వీకులు చీకటిని భూతాలతో, దయ్యాలతో, మానవజాతి వ్యతిరేక శక్తులతో నింపినప్పటికీ వాళ్ళు మంచి చేసే ఆత్మలనీ విశ్వసించేరు. దుష్టశక్తులకీ సైతానుకీ ఎటువంటి అనుబంధం ఉందో, ఈ సదాత్మలకీ దేమునికీ మధ్య అదే సంబంధం ఉంది వాళ్ళ దృష్టిలో. ఈ సదాత్మలు నమ్మికగలిగినవారిని ఈ దుష్టశక్తుల ప్రలోభాలనుండి, ఉచ్చులనుండీ రక్షిస్తాయి. తావీదులు, రక్షరేకలూ కట్టుకున్నవారిని, నిత్యం ప్రార్థనలు చేసి జపమాల త్రిప్పేవారిని, ఉపవాసాలు చేసి, మత విధులను నిర్వర్తించేవారినీ అవి సంరక్షిస్తాయి. ఈ మంచి ఆత్మలు విశ్వాసం కలిగి ఉన్నవారి గుండెలకి కత్తి, బాణం తగలకుండా చూస్తాయి. విషాన్నయినా, ప్రమాదం లేనిదిగా మార్చి నమ్మకస్తులని రక్షిస్తూ, విశ్వాసులని ఇంకా ఎన్నో విధాల పరిరక్షించి, సహాయం చేస్తాయి. పవిత్ర జీవితం గడిపేవారి మనసులోంచి సందేహాలను పారద్రోలి, ఋషిపుంగవులను స్త్రీల కుతంత్రాలనుండి రక్షించి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారి గొప్పదనాన్ని నలుగురికీ తెలియబరచి, నిజంగా మంచివాళ్ళు ఇంద్రియసుఖాలను త్యజించి సైతానుని ద్వేషించేలా చేస్తాయి. ఈ ఆత్మలు మతస్నానం చేయించిన బిడ్డలని, మతదీక్ష తీసుకున్నవారిని, బోధకులు, సన్యాసినులు, తీర్థయాత్రలు చేసే సన్యాసులనూ ఎప్పుడూ కనిపెట్టి ఉంటాయి.
ఈ ఆత్మల్లో చాలా రకాలున్నాయి. అందులో కొన్ని ఒకప్పుడు స్త్రీ గాని, పురుషుడు గాని అయినవి, కొన్ని ఈ లోకంలో ఎన్నడూ జీవించి ఉండనివి, మరికొన్ని ఆదినుండీ దేవతలుగా ఉన్నవి. అవి ఏమిటని గాని, చూడడానికి ఎలా ఉంటాయని గాని, ఒక చోటునుండి మరొకచోటుకి ఎలా ప్రయాణిస్తాయని గాని, మనుషుల మనసుని ఎలా ప్రభావితం చేసి, నియంత్రిస్తాయని గాని ఎవరికీ తెలియదు. ఈ దుష్టాత్మలన్నిటికీ సైతాను ప్రభువు. సదాత్మలన్నిటికీ దేముడు ప్రభువు. నిజానికి ఈ సర్వంసహా సృష్టికంతటికీ ప్రభువు దేముడేనని, ఆ భూతరాజు కూడా దేముని సంతానమేననీ నమ్మకం. ఈ దేముడు, దయ్యాలరాజు సైతానూ ఎప్పుడూ పోరాడుతుంటారు ఎక్కువమంది మనుషుల ఆత్మలను తమ అధీనంలోకి తెచ్చుకోడానికి. భగవంతుడు మరణానంతరం అంతులేని సుఖాన్ని బహుమానంగా, మితిలేని దుఃఖాన్ని శిక్షగా ప్రకటిస్తే; స్వర్గంలోని ఆనందాలని, నరకంలోని బాధలనీ అవహేళన చేసేలా, సైతాను ఇప్పటి జీవితంలోనే ఇంద్రియ సుఖాలు, ఆనందాలు కల్పిస్తాడు. సైతాను దుర్బుద్ధితో, మనుషుల మనసుల్లో సందేహాలు నాటి, సత్యాన్ని శోధించేలా, హేతుబద్ధంగా ఆలోచించేలా, సాక్ష్యాలు చూపించమనేలా, వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడేలా చేస్తాడు. వాళ్ళ మనసుల్లో స్వేచ్ఛ పట్ల ప్రేమని నాటి, వాళ్ళ శృంఖలాలు బద్దలుగొట్టడానికి సహాయం చేసి, భావదాస్యం నుండి విముక్తుల్ని చేసి ఆలోచింపజేస్తాడు. ఈ విధంగా భగవంతుని బిడ్డలను అతను భ్రష్టుల్ని చేస్తాడు.
మన పూర్వీకులు ప్రార్థన ద్వారా, బలులు సమర్పించడం ద్వారా, ఉపవాసం ఉండడం ద్వారా, కొన్ని మతవిధులు నిర్వర్తించడం ద్వారా, భగవంతుని, మంచి ఆత్మల సహకారాన్ని పొందవచ్చునని నమ్మారు. వాళ్ళు తార్కికంగా ఆలోచించలేదు. వాళ్ళు అన్ని పాపాలకీ కారణం సైతానే అని నమ్మలేదు. వరదలు, కరువు కాటకాలు, తుఫానులు, మహమ్మారులు, భూకంపాలు, యుధ్ధాల వంటివి కొన్ని కొన్ని సందర్భాల్లో భగవంతుడు తన ఉనికి మీద అపనమ్మకానికి శిక్షగా పంపిస్తాడని నమ్మేరు. మోకాళ్ళపై పడిపోయి, పాలిపోయిన పెదవులతో, ఆపన్నహస్తాన్ని అందించమని దయగల దేముడిని వేడుకున్నారు. వినయంతో ఒంగి, తమ పాపాలు అంగీకరించి, తమ కేకలతో, వాగ్దానాలతో ఆకాశం హోరెత్తేలా అరిచేరు. పూజారుల సహకారంతో ప్రార్థనలతో రోగాలు దరిజేరకుండా ఉంచడానికి ప్రయత్నించేరు. మహాత్ముల భౌతిక అవశేషాలని చుంబించి, మందిరాలముందు ప్రణమిల్లి, మేరీ కన్యని, సెయింట్లనీ రక్షించమని వేడుకున్నారు. కానీ ప్రార్థనలన్నీ నిర్దయగా గాలిలో కలిసిపోయాయి. మహమ్మారులు వచ్చి కొంతమందిని తుడిచిపెట్టి పోయాయి. మన పూర్వీకులకి సైన్సు గురించి ఏమాత్రమూ తెలియదు. ప్రకృతి సిద్ధమైన కారణం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. ప్రతీదీ వాళ్ళ దృష్టిలో ఈ ఆత్మల కలాపనే. అన్నీ అభౌతిక శక్తుల వల్లనే జరుగుతాయి. అన్ని చెడ్డపనులూ దుష్టశక్తులే చేస్తాయి: మనుషుల్ని నాశనం చేసి, శిక్షించి, దారి తప్పించి, మనుషుల పిల్లల్ని పతితుల్ని చేస్తాయి. ఈ ప్రపంచం ఒక యుద్ధరంగం. ఇక్కడ స్వర్గనరకాధిపతులు పోరాడుకుంటూనే ఉంటారు.
IV
ఎవరైతే వివేచన కలిగివుంటారో, ఎవరు సత్యాన్ని పరిశోధన చేస్తారో, ఎవరు నిజంగా ఆలోచిస్తారో, ఎదుటనున్న సాక్ష్యాన్ని ఎవరు తులనాత్మకంగా పరిశీలిస్తారో, వాళ్ళు శకునాలని, మంచి చెడు రోజులని, అదృష్ట /దురదృష్ట సంఖ్యలనీ నమ్మరు. వాళ్ళకి శుక్రవారమూ గురువారమూ ఒక్కలాంటివేనని తెలుసు; 13 అంకె 12 కంటే ప్రమాదకారి కాదని తెలుసు; కెంపులు, వజ్రాలు, మామూలు అద్దాలూ మనిషికి ఏయే మంచి చెడ్దలు చేస్తాయో, తక్కిన రత్నాలు కూడా అవే చేస్తాయని తెలుసు. ఒక యువతి పెళ్ళి అవకాశాలు ఒక పువ్వుకి ఉన్న రేకల్ని బట్టో, ఆపిలుపండులోని గింజలను బట్టో మారవని తెలుసు. థియేటర్లో ముందుగా అడుగుపెట్టిన వ్యక్తి మెల్లకన్నువాడా, గూనివాడా లేదా మన్మథుడిలా అన్ని అవయవాలూ తీర్చిదిద్దినట్టు ఉన్నాడా అన్నవి పట్టించుకోడు. ఒక నల్లపిల్లికి ఆశ్రయం ఇచ్చినందుకే కుటుంబంలో ఏ విపత్తూ రాదని అతనికి తెలుసు. ఒక గొప్ప వ్యక్తి మరణ సూచికగా గుడ్లగూబ పున్నమి రాత్రి ఊళపెట్టదని అతను గ్రహించి ఉంటాడు. భూమి మీద మనుషులందరూ గతించిన తర్వాత కూడా ఉల్కలూ తోకచుక్కలూ రాలుతూనే ఉంటాయని తెలుసు. అతను సూర్యగ్రహణాలకు, ధృవకాంతులకూ భయపడడు.
మానవాళి ఉనికితో ఏ ప్రమేయం లేకుండా ఇవన్నీ జరుగుతుంటాయని అతనికి తెలుసు. మానవజాతి అంతరించి భూమి మీద ప్రాణి అన్నది మిగలనప్పుడు కూడా వరదలు వినాశాన్ని తీసుకొస్తాయని, తుఫానులు భీభత్సాన్ని సృష్టిస్తాయని, భూకంపాలు మింగేస్తాయని, నక్షత్రాలు మెరుస్తాయని, రాత్రింబవళ్ళు ఒకదాని వెంట ఒకటి తరుముతూ వస్తుంటాయని, పువ్వులు తమ సుగంధాన్ని గాలికి ఎరువిస్తాయని, కాంతి తన ఏడురంగుల హరివిల్లుని నల్లని మేఘపుతునక గుండెమీద ముద్రిస్తుందనీ అతనికి తెలుసు.
ఆలోచనాపరుడు, వివేకవంతుడైన మనిషి దయ్యాలని నమ్మడు. అజ్ఞానులు, భయకంపితులైన వారి మనసుల్లోనే ఈ దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు, పిశాచాలూ ఉంటాయని తెలుసు. వీటి గురించి కల్పించిన కథల వెనుక ఆంతర్యం అతనికి తెలుసు. అన్ని మతాలలోనూ అవి పోషించిన పాత్రా తెలుసు. కొన్ని శతాబ్దాల క్రిందటి వరకూ ఏ మినహాయింపూ లేకుండా దయ్యాలు, భూతాలు, పిశాచాల గురించి దాదాపు అన్ని మతాలలోనూ నమ్మకం ప్రబలంగా ఉండేదని తెలుసు. వాటిని ఒక సామాన్య రైతు ఎంత గాఢంగా నమ్మేవాడో, పురోహితుడు కూడా అంతేగా నమ్మేవాడనీ తెలుసు. ఆ రోజుల్లో బాగా చదువుకున్నవాడూ ఏ చదువూ లేనివాడూ ఇద్దరూ సమాన వంచితులేనని తెలుసు. రాజులు, సభికులు, స్త్రీలు, సైనికులు, కళాకారులు, బానిసలు, నేరస్థులు, అందరూ దేముణ్ణి ఎంత గాఢంగా నమ్మేవారో, సైతానునీ అంత గాఢంగానే నమ్మేవారు.
ఈ నమ్మకాల వెనుక ఏ ఋజువూ లేదు, ఇప్పుడే కాదు ఎప్పుడూ లేదు. ఈ నమ్మకం ఏ సత్యాన్నీ ఆశ్రయించినది కాదు. దాని వెనుక ఉన్నవి పొరపాట్లు, అతిశయోక్తులు, అబద్ధాలు. పొరపాట్లు సహజం, అతిశయోక్తులు అసంకల్పితంగా చేసేవి, అబద్ధాలు చాలవరకు నిజాయితీగా చేసేవి. ఈ పొరపాట్లకు, అతిశయోక్తులకు, అబద్ధాలకీ కారణం అద్భుతమైన విషయాలపట్ల మనకుండే సహజమైన మక్కువ. అద్భుతమైన విషయాల గురించి చెవులు రిక్కించి, కళ్ళు పెద్దవి చేసుకుని, నోరు వెళ్ళబెట్టుకుని మరీ వింటాం.
యుక్తాయుక్త వివేచన చేసే వ్యక్తికి ఈ నమ్మకం వెనుక వున్న కథ తెలుసు; కొన్ని శతాబ్దాల పాటు ఈ సత్యాన్ని పవిత్రమైన బైబిలు నిర్థారించిందనీ తెలుసు. పాత నిబంధనల గ్రంథం నిండా సైతాను, దుష్ట శక్తులు, ప్రేతాత్మల గురించి ఉంటే, కొత్త నిబంధనల గ్రంథంలోనూ అదే ఉందని, క్రీస్తు స్వయంగా దయ్యాలని, ప్రేతాత్మలని, దుష్టశక్తులని నమ్మేవాడని, మనుషుల శరీరాలనుండి వాటిని పారద్రోలడమే అతని ముఖ్య వ్యవహారమనీ తెలుసు. కొత్త నిబంధనల గ్రంథం ప్రకారం, చివరకి క్రీస్తు కూడా సైతాను ప్రలోభానికి లోనవడమే కాక, గుడి శిఖరం మీదకు తీసుకుపోబడ్డాడనీ తెలుసు. కొత్త నిబంధనల గ్రంథం నిజంగా భగవత్ప్రేరితమే అయితే, అప్పుడు నేను ఈ దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు, సైతానూ ఉన్నాయనీ అవి మనుషుల్ని వశపరచుకుంటాయనీ నమ్ముతాను.
ఈ దుష్టశక్తులు లేవనడం, సైతాను లేడనడం అంటే కొత్త నిబంధనల గ్రంథం సత్యం కాదని అనడమే. చీకటిలో దాక్కొని దయ్యాలు ఉండవనడం ఏసుక్రీస్తు మాటలని కాదనడం క్రింద లెక్క. ఈ దయ్యాలు నిజంగా లేకపోతే, అవి రోగాలు కలుగచెయ్యకపోతే, తమకి లోబడినవాళ్ళని దారి తప్పించి, అవి ప్రలోభపరచడం నిజం కాకపోతే, క్రీస్తు ఒక అజ్ఞాని, మూఢవిశ్వాసి, పిచ్చివాడు, వంచకుడు, అయి ఉండాలి; లేదా, కొత్త నిబంధనల గ్రంథం అతను చెప్పిన విషయాలను సరిగ్గా ప్రస్తావించక, అతని చర్యలు నమోదు చెయ్యనిదై ఉండాలి. దయ్యాల మీదా భూతాలమీదా నమ్మకాల్ని విడిచిపెట్టినపుడు, పాత, కొత్త నిబంధనల గ్రంథాలు ఇచ్చే ప్రేరణమీద నమ్మకాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. మనం క్రీస్తు దైవత్వాన్నీ విడిచిపెట్టాలి. ఈ దయ్యాల ఉనికి అంగీకరించకపోవడం అంటే క్రైస్తవమతం పునాదుల్ని పూర్తిగా నిర్మూలించినట్టే. మధ్యేమార్గం అంటూ లేదు. రాజీ కుదరదు. కొత్త నిబంధనల గ్రంథంలోని దయ్యాలూ భూతాలూ నిజం కానప్పుడు, ఆ పవిత్ర గ్రంథంలో ఏ భాగం నిజం అవగలదు?
నిజానికి, ఈడెన్ తోటలో సైతాను సాధించిన విజయం, క్రీస్తు రాకను అనివార్యం చేసి, పాపానికి ప్రాయశ్చిత్తం అన్న విషయానికి పునాది వేసి, రక్షకుడికి శిలువ వేసి–క్రీస్తు, పవిత్ర ఆత్మ, భగవంతుడు, అన్న త్రిమూర్తుల్ని మనకి అందిస్తుంది.
అసలు దయ్యాలు, సైతానూ అన్నవే లేకపోతే, క్రీస్తుమతం పొడిపొడిగా రాలిపోతుంది; ఏళ్ళబట్టి అబద్ధాలూ పొరపాట్లతో, అసత్యాలతో, అద్భుతాలూ వింతలతో, రక్తపాతంతో, అగ్నిజ్వాలలతో, అనాగరిక ప్రపంచం నుండి ఎరువు తెచ్చుకున్న కల్పిత కథలతో మన పూర్వీకులు, పోపులు, ఫాదరీలు, వేదాంతులు, క్రైస్తవం పేరుతో నిర్మించిన భవనం నామరూపాలు లేకుండా కుప్పకూలిపోతుంది.
ఈ భూతాలూ దయ్యాల మీద, ప్రేతాత్మల మీదా నమ్మకం విడిచిపెట్టినపుడు, మంత్రగత్తెలు, మాంత్రికులూ కూడా ఎన్నడూ లేరని అంగీకరించవలసి వస్తుంది. వివేకవంతుడు క్షుద్రవిద్యల్ని (మంత్రశక్తిని) నమ్మడు. అది ఒక భ్రాంతి. కొన్ని వేలమంది అమాయకులు, స్త్రీలు, పురుషులు, పిల్లలూ తాము చెయ్యని నేరానికి హింసించబడి, సజీవంగా దహించబడ్డారని మనకు తెలుసు. విశ్వాసంతో మన మనసులు కుంచించుకు పోకపోతే, ఈ దయ్యాల, భూతాల ఉనికిని గురించి చెప్పే పుస్తకాలని వ్రాసిన వారు అజ్ఞానులు, మూఢనమ్మకం గలవారని అంగీకరించవలసి వస్తుంది. పాత నిబంధనల గ్రంథం మాంత్రికుల (క్షుద్రశక్తుల) గురించి పేర్కొంది. పవిత్ర గ్రంథం ప్రకారం, యెహోవాకి ఈ మంత్రశక్తులమీద నమ్మకం ఉంది. అందుకనే ఎంపికచేసిన కొద్దిమంది వ్యక్తులతో అతను, ‘జీవించి ఉండగా మిమ్మల్ని ఏ మంత్రశక్తీ బాధించనివ్వను’ అన్నాడు.
ఈ ఒక్క సాధారణ వాక్యం, యెహోవా దేముడు కాదనడమే గాక, అతనొక అమాయకుడు, మూఢనమ్మకాలు గల వ్యక్తి, ఒక అజ్ఞాని, అనాగరికుడని తెలుపుతుంది. ఈ ఒక్క వాక్యమూ నిస్సందేహంగా పాత నిబంధనల గ్రంథం ఎవరో అనాగరికులు వ్రాసేరని స్పష్టం చేస్తుంది.
జాన్ వెస్లీ ‘మంత్రశక్తులని నిరాకరించడం బైబిలును నిరాకరించడమే’ అని సరిగ్గానే చెప్పాడు.
సైతానుని నిరాకరించిన తర్వాత బుక్ ఆఫ్ జోబ్‌తో మనకి పనేముంది? అప్పుడు అహాబ్‌ను తప్పుత్రోవ పట్టించడానికి యెహోవా దయ్యాలను పంపేడన్న కథనంతో పనేముంది?
దేవదూతలు ఆకాశంలో విహరిస్తుంటారని అనుకోవడం మనసుకు బాగుంటుంది. వాళ్ళు అమాయకులను కాపాడతారని, మంచిని పరిరక్షిస్తారని, ఉయ్యాలలోకి తొంగి చూచి అందులోని వివర్ణులై నిద్రిస్తున్న పసికందులకు ఆరోగ్యాన్నిస్తారని, తీయని కలలందిస్తారనీ; చీకటి కుహరాలను వారి ఉజ్జ్వలమైన కాంతులతో నింపుతారని; ఖైదీలకు ఆశలు రగులుస్తారని; పతితులను, దారితప్పినవారిని, బహిష్కృతులని, స్నేహహస్తం దొరకనివారిని, అనుసరించి వారిని సన్మార్గంలో నడిపించి ఆనందాన్ని, ప్రేమని, సుగుణాలనీ అందిస్తారనీ చదవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ దుష్టశక్తుల ఉనికిలాగే, దేవదూతల ఉనికికీ మనకి ఎక్కడా దాఖలాలు లేవు. అబ్రహామును, శాంసన్ తల్లినీ కలిసిన దేవదూతలు, మధ్యయుగాలనాటి దయ్యాలూ భూతాలలా నిజాలు కావు. బలామ్ గాడిదను ఆపిన దేవదూత, మెషాక్, షాడ్రాక్, అబెడ్నెగోలతో పాటు మంటలలోంచి బయటకి వచ్చిన దేవదూత, అస్సీరియనులను వధించి నిద్రలో జోసెఫ్ సందేహాలు నివృత్తి చేసిన దేవదూత, వీరందరూ–మతవిశ్వాసులు తమ ఊహలతో సృష్టించినవారు; అద్భుతాలపట్ల అమితమైన ఆసక్తి గలవారు. అమాయకత్వంతో, వార్థక్యపు భ్రాంతితో, ఒక అజ్ఞాని నుండి మరొక అజ్ఞాని తరాల తరబడి పెంచి పోషించిన అభూతకల్పనలు ఇవి. కేథలిక్ దేశాలలో తప్ప, ఈ వంద సంవత్సరాల్లో రెక్కలు తొడిగిన ఏ దేవతాస్వరూపమూ ఈ ప్రపంచంలోని ఏ దేశాన్నీ దర్శించలేదు. సత్యాన్ని చూడలేనివారికి మాత్రమే ఈ అద్భుతమైన జీవరాశులు కనిపిస్తాయి, ఋజువులతో నిమిత్తం లేకుండా నిర్ణయాలకు రాగలిగినవారు మాత్రమే వాటి ఉనికిని నమ్మగలరు. ఎక్కడో గొప్ప చిత్రకారుడు మైకెలాంజెలో ఒక చర్చిని అందంగా చిత్రాలతో అలంకరిస్తూ దేవదూతల పాదాలకు చెప్పులు వేశాడట. ఒక కార్డినల్ ఆ చిత్రాన్ని చూసి చిత్రకారుడితో, ‘దేవదూతలకి చెప్పులున్నట్టు ఎవరు చూశారు?’ అని అడిగితే చిత్రకారుడు, ‘దేవదూతలు వట్టికాళ్ళతో తిరుగుతున్నట్టు ఎవరు చూశారు?’ అన్నాట్ట.
ఈ దేవదూతల ఉనికి ఎన్నడూ నిర్థారణ కాలేదు. కానీ, లక్షలమంది మేల చేసే దేవదూతలలోని వర్గాలని నమ్ముతారని తెలుసు; మోజెస్ శరీరం కోసం గేబ్రియల్ సైతానుతో వాదించడం; డేనియల్‌ను రక్షించడానికి దేవదూతలు సింహాల నోళ్ళు మూయడం, క్రీస్తుకి సలహా ఇవ్వడం, ఈ ప్రపంచాన్ని శాసించడానికి రక్షకుడు వచ్చినపుడు అతని వెనుక ఎందరో అనుసరించి వస్తారన్నదీ నమ్ముతారని తెలుసు. అంతేకాదు, లక్షలమంది వివేచన అనేదే లేక, కేవలం నమ్మకంతో, వేదాంతపరమైన తిరస్కార భావనతో కనిపించిన సాక్ష్యాలన్నిటినీ నిరాకరించి, గుడ్డిగా విశ్వసిస్తారని తెలుసు.
కానీ, ఈ దేవదూతలు మరి రారు గాక రారు. గాయపడిన హృదయానికి ఏ లేపనమూ తీసుకురారు. ఏనాడో తమ రెక్కలను ముడిచి, భూమినీ గాలినీ విడిచి ఎగిరిపోయారు. ఈ రెక్కల సంరక్షకులు అమాయకులను సంరక్షించరు, బాధితులని పరామర్శించరు, నిస్సహాయులకు సాంత్వన వచనాలు పలుకరు. వాళ్ళు కలవలె కరిగి, మాయమైపోయారు.
V
మతవిశ్వాసాలు బలంగా వ్యాప్తిలో ఉన్న రోజుల్లో, భూమి బల్లపరుపుగా ఉండేదని నమ్మేవారు; కాస్త సరదాగా చెప్పాలంటే అదొక భవంతి, యెహోవా పైన ఉండేవాడు, క్రిందని సైతాను నివసించేవాడు. దేముడూ అతని దూతలూ మూడో అంతస్తులో నివసించేవారు. సైతానూ అతని పిశాచగణం బేస్‌మెంట్‌లో ఉండేవాళ్ళు. మానవాళి రెండో అంతస్తులో ఉండేది అనుకోవచ్చు. మతాధికారులకి స్వర్గం ఎక్కడుందో తెలుసు. వాళ్ళకి హలెలూయలు, సంగీతమూ వినిపిస్తూంటాయి కూడా. అలాగే వాళ్ళకి నరకం ఎక్కడుందో కూడా తెలుసు. అక్కడి గంధకపు పొగల వాసనలు, బాధలు అనుభవిస్తున్నవారి ఆర్తనాదాలు కూడా వాళ్ళకి వినిపిస్తూంటాయి. అగ్నిపర్వతాలు వాళ్ళ దృష్టిలో నరకంలోంచి పొగల్ని బయటకి చిమ్మే చిమ్నీ గొట్టాలు. వాళ్ళకి స్వర్గం, నరకం, భూమి గురించి క్షుణ్ణమైన అవగాహన ఉంది. యెరూషలేంతోను, దాని బంగారు రాజమార్గాలు, అక్కడి ముత్యాల వాకిళ్ళతోనూ పరిచయమే. బుక్ ఆఫ్ ఈనోక్ అనువాదం వాళ్ళకి సబబుగా కనిపించడమే కాదు, జలప్రళయానికి ముందు దేముని కుమారులు వచ్చి మానవ కన్యలతో రమించడం విషయంలో ఏ సందేహాలూ రాలేదు. భగవంతుడు స్వయంగా దిగి వచ్చి, ఒకరి భాష వేరొకరికి అర్థం కాకుండా ఉండేట్టు శపించి ఉండకపోతే, టవర్ ఆఫ్ బాబెల్ ఇప్పటికీ నిలిచి ఉండేదని ఈ వేదాంతుల భావన.
ఆ గొప్ప రోజుల్లో, పురోహితులకి స్వర్గనరకాల గురించి అంతా తెలిసి ఉండేది. భగవంతుడు ఆశలూ-భయాలూ, వాగ్దానాలూ-బెదిరింపులూ, బహుమానాలూ-శిక్షలతో ప్రపంచాన్ని పరిపాలించేవాడని తెలుసు. పరిశీలన ద్వారా మంచిని గ్రహించి, చెడుని విడిచిపెట్టగలిగేలా మనిషి మెదడుని వికసింపచెయ్యడం భగవంతుని ప్రణాళికలో లేదు. అతను అజ్ఞానం అంటే అవిధేయత తప్ప మరేమీ కాదని, విధేయతకి ప్రతిఫలంగా అవధిలేని ఆనందాన్ని బహూకరించాడు. అతను మోకాళ్ళపై పడి ప్రార్థించినవాళ్ళని, సాష్టాంగపడినవారినీ ప్రేమించాడు. అవిశ్వాసులని, పరిశోధకులని, ఆలోచనాపరులని, తాత్త్వికులనీ ద్వేషించాడు. తన ద్వేషాన్ని చవిచూచేలా వాళ్ళ కోసం శాశ్వతమైన ఒక ఖైదుని నిర్మించాడు. ఏ ఋజువులూ అక్కరలేకుండా నమ్మేవాళ్ళని ప్రేమించి వాళ్ళ కోసం వెలుగులు సమసిపోని ప్రదేశంలో ఒక గృహాన్ని నిర్మించాడు. ప్రశ్నలు లేవనెత్తని సదస్యుల సమక్షంలో ఆనందించేడు.
కానీ, ఈ స్వర్గం ఎక్కడుంది? ఈ నరకం ఎక్కడుంది? మనకిప్పుడు స్వర్గం మేఘాలకావల లేదని, నరకం భూమి లోపలిపొరల్లో లేదనీ తెలుసు. దూరదర్శిని పురాతన స్వర్గాన్ని దూరం చేసింది; పరిభ్రమిస్తున్న భూమి పురాతన నరకజ్వాలలని ఆర్పివేసింది. వేదాంతులు సృష్టించిన ఈ రెండు ఊహా ప్రపంచాలూ మాయమైపోయాయి. స్వర్గం ఎక్కడుందో ఇప్పుడెవరికీ తెలియదు, తెలుసునని నటించరు; నరకం చిరునామా తెలియదు, తెలుసునని ప్రగల్భాలు పలుకరు. ఇప్పుడు వేదాంతులు స్వర్గ నరకాలు నిజమైన ప్రదేశాలు కావని, మానసికస్థితులనీ శలవిస్తున్నారు.
దేముడూ దయ్యాలమీద నమ్మకం దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే. మంచికి వెనక మనిషి భగవంతుడిని నిలబెట్టేడు; చెడు వెనక సైతానుని నిలబెట్టేడు. సూర్యరశ్మి, మంచి పంట దిగుబడి, దేవుని మంచితనం క్రింద లెక్క; రోగాలు, దురదృష్టం, మృత్యువు వెనుక ఒక దుష్టబుద్ధిగల దయ్యము/ రాక్షసుడు ఉన్నట్టు లెక్క.
దేముడు గాని, దయ్యాలూ-రాక్షసులూ గాని ఉన్నట్టు ఏమైనా ఋజువు ఉందా? దేముడూ దయ్యమూ రెండింటి ఉనికి గురించీ ఉన్న ఋజువు దాదాపు ఒక్కలాటివే. ఈ రెండూ అనుమానాలు, బహుశా ఉండిఉండొచ్చు-లు. వాటిని ఎవరూ చూడలేదు, అవి అగోచరాలు. అవి ఈ పంచేంద్రియాల పరిధిలోకి ఎన్నడూ అడుగుపెట్టలేదు. ‘దయ్యం ఉండే ఉండాలి, లేకపోతే అచ్చం అలాగే ఉన్నట్లు బొమ్మలు ఎలా చూపించగలరు?’ అనే ముదుసలి, శిక్షణ గరపి పట్టా తీసుకున్న వేదాంతిలా, (ఊహని ఋజువుగా చూపించే) ప్రయత్నం చేస్తోంది.
ఇప్పుడు తెలివైనవాడెవ్వడూ దయ్యాల ఉనికిని నమ్మడు–వాటి ఓర చూపులకి, కోర చూపులకీ భయపడడు. ఆరాధ్యదైవాన్ని, సృష్టికర్తని ఆలోచనాపరులు విడిచిపెట్టారు. కానీ, ఇప్పుడు కొందరు, ‘అదృశ్యశక్తి’, ‘అనంత శక్తి’ గురించి మాటాడుతూ, యెహోవాని గురుగ్రహంలా ఆకాశంలోకి చూపిస్తుంటారు. వాళ్ళ దృష్టిలో గతమనే పిల్లల బడిలో విరిగిపోయిన బొమ్మల్లాంటివి ఆ రెండూ.
సత్యాన్ని తెలుసుకోవాలని ఆధారాలు, ఋజువులూ కోరే స్త్రీ పురుషులు, శకునాలని నమ్మరు; వింతలని నమ్మరు; నగలు, రోజులు, వారాలు, అంకెలూ అదృష్ట దురదృష్టాల్ని తీసుకొస్తాయని నమ్మరు; తావీజులని, రక్షరేకులని, మంత్రాలనీ నమ్మరు; మంచి దయ్యాలని, చెడు దయ్యాలని, దేముడిని, సైతానునీ నమ్మరు. మంచివాళ్ళని కాపాడి రక్షించి, చెడ్డవారినీ దుర్మార్గుల్నీ శిక్షిస్తాయనీ చెప్పే ఏ ప్రత్యేకమైన, లేదా ప్రకృతికి అతీతంగా ఉందన్న ఏ శక్తినీ నమ్మరు. మానవజీవిత చరిత్రలో ఎన్నడూ ఏ ప్రార్థనకీ సమాధానం దొరికిందని నమ్మరు. ఇప్పటివరకూ జరిపిన బలులన్నీ నిరుపయోగమని, అన్ని సుగంధద్రవ్యాలూ వృధా అయ్యాయనీ నమ్ముతారు. క్రిమికీటకాలకోసం ఈ సృష్టి ఉన్నట్టే మనిషికి కూడా ఉంది తప్ప అతనికోసం ప్రత్యేకంగా ఈ సృష్టి జరిగిందన్నది నమ్మరు. ఎస్కిమోలకి కొవ్వుపొరలు అందించడానికి తిమింగలాలు, కీటకాలను నాశనం చెయ్యడానికి మంటలూ సృష్టించబడ్డాయంటే నమ్మరు. ప్రతి చేతిలోనూ మంచిని సాధించడానికి, చెడును సృష్టించడానికీ ప్రణాళికలు కనిపిస్తాయని నమ్ముతారు. ప్రతి పక్షంలోనూ మంచివాళ్ళూ చెడ్డవాళ్ళూ, జాగ్రత్తగా దాచాలనుకునేవారూ ప్రతీదీ ధ్వంసం చెయ్యాలనుకునేవాళ్ళూ ఉంటారు. ప్రతి వస్తువు చుట్టూ దాన్ని ప్రేమించి పరిరక్షించేవాళ్ళూ ద్వేషించి నాశనం చేసేవాళ్ళూ ఆవరించి ఉంటారు. ఎదుగులలో ఎంత ప్రణాళిక కనిపిస్తుందో నాశనం చెయ్యడం వెనుకా అంత ప్రణాళికా కనిపిస్తుంది; విజయం వెనుక ఎంతో, పరాజయం వెనుకా అంతే; దుఃఖం వెనుక ఎంతో, ఆనందం వెనుకా అంతే. ఒక చేత్తో సృష్టిస్తూ మరొక చేత్తో నశింపజేసే ఈ ప్రకృతి, కత్తీ డాలూ పట్టుకుని మృత్యువునుండి రక్షిస్తూనే, తిరిగి మృత్యువుకు అప్పగించడానికే రక్షిస్తుంది. ప్రతి జీవితమూ మృత్యువువైపు చేసే ప్రయాణం. ప్రతి మృత్యువు పునర్జీవననానికి తొందరపడుతుంది. పొదుపు, వృధా, శ్రద్ధ, అజాగ్రత్త అన్ని చోట్లా ఉంటాయి.
జీవితమూ మృత్యువుల ఆటుపోట్లతో, మన ఎదురుగా నడిచే రసవత్తరమైన నాటకాన్ని మనం చూస్తుంటాము. పాత్రధారులు తమ తమ పాత్రలను పోషించి తెరమరుగవుతుంటారు; మూర్ఖుడైనా, పిచ్చివాడైనా, మహాజ్ఞాని అయినా, ఏ విధమైన పూర్వ అభ్యాసం లేకున్నా, తమ పాత్ర గురించి ఏ అవగాహనా లేకపోయినా, లేక ఈ నాటకపు అంతిమ లక్ష్యం, దాని వెనుక ఉన్న ప్రణాళికా తెలిసినా, తెలియకున్నా ఈ నాటకంలో అందరూ- నటించవలసిందే. నిత్యం రంగం మారుతూ ఉంటుంది; పాత నటులు తెరమరుగవుతుంటారు, కొత్తవాళ్ళు వస్తుంటారు; మరొకసారి రంగం మారుతుంది. అంతా మార్మికత నిండి ఉంటుంది. మనం ఒక దాన్ని విడమరచి చెప్పడానికి ప్రయత్నిస్తుంటాం. మనం ఇచ్చే ప్రతి సమాధానం మరొక వాస్తవాన్ని ఖండిస్తుంది. తొలగించిన ప్రతి తెర వెనుకా మరొక తెర కనిపిస్తుంటుంది. ప్రతి వస్తువూ మనలని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూనే ఉంటుంది. అన్ని సముద్రాలూ ఎంత ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయో, ఒక్క నీటి బిందువూ అంతే ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది; ఈ విశాల సృష్టి ఎంత ఆశ్చర్యకరమో, ఒక ఇసుక రేణువూ అంతే; సమస్త జీవరాశీ ఎంతో, రెక్కలమీద రంగులవలయాలున్న కీటకమూ అంతే; ఆకాశంలో నిరంతరాయంగా పరిభ్రమించే నక్షత్ర తతులెంతో, కేవలం ఒక చిన్న గుడ్డు, చీకటిలో తగిన ఉష్ణోగ్రత వద్ద ప్రాణం పోసుకుని, అందులోంచి ఊపిరి పీల్చగలిగిన, నరాలు, కండరాలు, ఎముకలు, మెదడు, క్రమంగా ఆలోచనలు, ఆవేశము, స్వభావము, కోరికలతో రూపుదిద్దుకున్న ప్రాణీ అంతే!
మట్టిలో తలదాచుకున్న అతి చిన్న బీజం, ఏప్రిల్ వర్షాల గురించి, జూన్ నెల గురించీ కలలుగంటూ తన రహస్యాలని మేధావియైన మనిషికి అంతుచిక్కకుండా దాచుతుంది. మానవ విజ్ఞాన సర్వస్వం అంతా కలిపినా, ఒక గడ్డి పరక గురించి పూర్తిగా చెప్పలేదు, ఒక చిన్న ఆకు కదలికని పూర్తిగా వివరించలేదు. అయినప్పటికీ, ప్రకృతిలో విభ్రమానికి గురిచేసే ఒక చిన్న సత్యం ముందు నోరు వెళ్ళబెట్టుకుని చూసే ఈ వేదాంతులు, పోపులు, పూజారులు, పురోహితులు ఈ సృష్టి ఆవిర్భావం గురించి–ఎప్పుడు ఏ క్షణంలో జరిగిందో, ఎప్పుడు పరిసమాప్తమవుతుందో, తన కోరిక ద్వారా దీనిని సృష్టించిన భగవంతుడి గురించి, అతని ప్రణాళిక గురించి, అతని లక్ష్యం గురించి, అతను ఉపయోగించే పరికరాల గురించి, అతను చివరికి ఆశించేదాని గురించి–అనర్గళంగా చెబుతారు. అన్ని అద్భుతాల వెనుకనున్న మర్మాలూ వాళ్ళకు విశదమే… సజీవుడైన మనిషి పంచేంద్రియాలనూ ప్రభావితం చేసే వస్తువుల మర్మం తప్ప.
నిజాయితీగల మనిషి ఎవరూ తమకి తెలియనివి తెలుసునని నటించరు. వాళ్ళు నిజాయితీగా, స్పష్టంగా, ఏ సందేహాలకూ తావులేకుండా మాటాడతారు. వాళ్ళు సత్యాన్ని ప్రేమిస్తారు. తమ అజ్ఞానాన్ని అంగీకరించి, ‘నాకు తెలియదు’ అని ఒప్పుకుంటారు.
మనం అజ్ఞానాన్ని ఎందుకు ఆరాధించాలి? తెలియని వ్యక్తి ముందర ఎందుకు మోకరిల్లాలి? ఒక ఊహకు ఎందుకు సాష్టాంగప్రణామం చెయ్యాలి?
భగవంతుడు ఉంటే, అతను మంచివాడని, మనలని లక్ష్యపెడతాడనీ మనకి ఋజువేమిటి? క్రిస్టియన్లు తమ దేవుడు అనాది నుండీ ఉన్నాడని చెప్తారు. అతనికి ఆదీ అంతం లేదని, అతను మంచివాడని, విజ్ఞుడనీ. అతడు తను దైవం కాకుండా నిగ్రహించుకోగలడా? అతను మంచిగా ఉండకుండా ఉండగలడా? అతని సంకల్పము, ఆలోచనా లేకుండా మంచిగా, విజ్ఞుడిగా ఉండగలడా?
అతను అనాదిగా ఉన్నాడంటే, అతను సృష్టించబడలేదు. అతను అన్నిటికీ వెనుకనున్న కారణం. అతను ఇప్పుడేమిటో పూర్వమూ అదే, భవిష్యత్తు లోనూ అదే. అతను మారడు. మార్చబడడు. తన వ్యక్తిత్వంలో, వ్యక్తిత్వపు ఎదుగుదలలో అతని పాత్ర లేదు. అతని మనోవికసనతో కూడా అతనికి సంబంధం లేదు. ఆతను పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడంటే అతను ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. అలాంటప్పుడు అతన్ని కీర్తించడమెందుకని ప్రశ్నిస్తున్నాను. ప్రార్థనకు ముందు, ప్రార్థన తర్వాతా ఒక్కలాగే ఉన్నప్పుడు, ప్రార్థించడం ఎందుకు? ఎందుకంటే, అతనిలో ఏ మార్పూ ఉండబోదు.
అయినప్పటికీ, క్రిస్టియన్లు దేవుడిని తమను శిక్షించవద్దని వేడుకుంటారు.
సైతాను మీద చేసే అతి పెద్ద నేరారోపణ అతను మనుషులను ప్రలోభాలకి గురిచేస్తాడని. కానీ, చిత్రంగా, దైవప్రార్థనలో ‘మా మనసులు ప్రలోభాలవైపు మళ్ళించకు’ అంటూ, దేముడు సైతానుని అనుసరిస్తున్నట్టు, అవమానకరంగా ప్రార్థిస్తారు.
దేముడెందుకు తనని పొగడమని కోరాలి? అతను అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. అతను ఎన్నడూ ఏదీ కొత్తగా తెలుసుకున్నది లేదు. తనని తాను లేనని ప్రకటించింది లేదు. ఏ ప్రలోభాలకూ లొంగలేదు. ఆశకు గాని, భయానికి గాని లొంగలేదు. అతనికి కోరికలే లేవు. అలాంటపుడు అతను మన పొగడ్తలెందుకు కోరుకోవాలి?
ఎవరికైనా ఇటువంటి దేవుడున్నట్టు తెలుసా? అతనెప్పుడైనా ఏ ప్రార్థననైనా విన్నాడా? స్పందించాడా? అతను ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడని తెలుసా? మనుషుల వ్యవహారాల్లో జోక్యం కలిగించుకుంటాడని తెలుసా? మంచివాళ్ళను రక్షించి చెడుని శిక్షిస్తాడా? మానవజాతి చరిత్రలో దీనికి ఋజువు ఎక్కడన్నా దొరుకుతుందా? భగవంతుడే ఈ సృష్టిని పరిపాలిస్తుంటే మంచికి అతనిని కీర్తిస్తున్నపుడు, చెడుకు ఎందుకు ఆక్షేపించకూడదు? ఈ దేవుడిని సమర్థించడానికి మంచినీ మంచే అంటూ చెడునికూడా మంచే అనాలా? అన్నీ ఈ దేముడే చేస్తే, అతని చేసిన పనుల మధ్య–అమిత విజ్ఞానవంతుడు, శక్తిమంతుడు, కరుణాళువూ అయిన అతని పనుల మధ్య–వ్యత్యాసం చూపించకూడదు. సూర్యరశ్మికీ మంచి పంట దిగుబడికీ అతన్ని ప్రార్థిస్తే, కరువుకాటకాలకీ అంటురోగాలకీ కూడా అతన్ని ప్రస్తుతించాలి. స్వేచ్ఛకి అతన్ని స్తుతిస్తే, ఒక బానిస అతని సంకెళ్ళు పడిన చేతులను ఆరాధనతో పైకెత్తి ప్రతిఫలం లేకుండా శ్రమిస్తున్నందుకూ, ఆచ్ఛాదనలేని తన వీపుమీద పడిన కొరడా దెబ్బలకూ కృతజ్ఞతలు పలకాలి. అతన్ని మనం విజయంలో కీర్తిస్తే, ఓటమిలో కూడా కృతజ్ఞత చెప్పాలి.
కొద్ది రోజుల క్రితమే మన దేశాధ్యక్షుడు శాంటియాగోలో మనకి విజయాన్ని అందించినందుకు భగవంతునికి కృతజ్ఞతలు బాహాటంగా తెలియపరచాడు. కానీ, పచ్చకామెర్లకి కృతజ్ఞతలు చెప్పలేదు. నిలకడ కోసం రెండింటికీ అతను కృతజ్ఞతలు చెప్పి ఉండాల్సింది.
సత్యం ఏమిటంటే, మంచి, చెడు ఆత్మలూ, దేవుళ్ళూ, దయ్యాలూ అన్నవి మనిషి అనుభవపు పరిధిలో లేనివి; ఇంద్రియాల అనుభూతికి అందనివి; మన ఆలోచనల సరిహద్దుల కావల ఉండేవి; అతి విశృంఖలమైన ఆలోచనలకూ అందనివి.
మనిషి ఆలోచనాపరుడై ఉండాలి; అతని ఇంద్రియాలన్నిటినీ వినియోగించి విషయాలను గ్రహించాలి; నిశితంగా పరీక్షించాలి; హేతుబద్ధంగా విశ్లేషించాలి. ఆలోచించలేని మనిషి, మనిషి అనిపించుకోలేడు. ఆలోచించలేని మనిషి తనకి తాను ద్రోహం చేసుకుంటున్నాడు. ఆలోచించడానికి భయపడే మనిషి- మూఢనమ్మకానికి బానిస.
(మూలం: Superstition)