కళలు – నైతికత

[అమెరికాకు చెందిన రాజకీయవేత్త, న్యాయవాది, రచయిత, మహోపన్యాసకుడు అయిన రాబర్ట్ ఇన్గర్‌సాల్ (Robert G Ingersoll, 1833-99) స్వేచ్ఛాలోచనకు స్వర్ణయుగం అని పిలవబడిన 19వ శతాబ్ది మధ్యకాలంలో మతాన్ని, మతాచారాలను ప్రశ్నిస్తూ ఎన్నో వ్యాసాలు రాశాడు, ఎన్నో ప్రసంగాలిచ్చాడు. అజ్ఞేయవాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి ‘ది గ్రేట్ అగ్నాస్టిక్’గా పేరు పొందాడు. ఈతని వ్యాసాలు, ఆలోచనలు ఇప్పటికీ పాతపడలేదు సరికదా ఇప్పటి సమాజానికి మరింతగా వర్తిస్తాయి. నౌడూరి మూర్తి తెలుగులోకి అనువదించిన కొన్ని ఇన్గర్‌సాల్ వ్యాసాలు ఈమాటలో ప్రచురిస్తున్నాం. వాటిలో ఇది మొదటిది. – సం.]


భావ ప్రకటనలో అత్యున్నతమైన విధానం కళ. కళలున్నవి భావప్రకటన కోసమే. కళద్వారా మనిషి ఆలోచనలు ప్రస్ఫుటమౌతాయి. కళాస్వరూపాల సృష్టి వెనుక గాఢమైన కోరిక, తీవ్రమైన తపన, సహజమైన కల్పనా ప్రతిభ, ఆలోచనలకి రూపురేఖల్ని కల్పించి నిలబెట్టి, రంగుల్ని అద్ది ప్రవర్ధమానం చేయగలిగిన మానసిక ఉద్వేగమూ ఉంటాయి.

నిజానికి సర్వోత్కృష్టమైన సౌందర్యం, సర్వోత్కృష్టమైన నైతికవర్తన అన్నవి లేవు. సౌందర్యము, సత్ప్రవర్తన–ఈ రెండూ సాపేక్షమని మనం స్పష్టంగా గ్రహించవచ్చు. ఊహలకి ఆధారభూతమైన వస్తువుల కంటే ముందే ఆలోచనలున్నాయన్న ప్లేటో వాదనలోని అసంబద్ధతను, ప్రతి వస్తువు అస్తిత్వం వెనుక ఆలోచన ఉందన్న సంకుచిత భావననూ దాటి మనం చాలా ముందుకు వచ్చాము. కనీసం మానవాళికి సంబంధించినంతవరకు, అతని ఆలోచనలు అతని చుట్టుప్రక్కలనున్న వాతావరణం నుండి కలుగుతాయి, అతని మనసుమీద దాని ప్రభావానికి అతని స్పందన, ప్రతిస్పందనల రూపంలో వ్యక్తమౌతాయి. మనిషికి సంబంధించినంతవరకు, ఆలోచనలకన్నా ముందే వస్తువు ఉంది. అవి మనమీద కలిగించే ప్రభావాన్ని బట్టే వాటి ఉనికి మనం తెలుసుకోగలుగుతాం. పరమాత్మ స్థితి (భగవంతుడు) మనిషి మనసు ఆలోచనా పరిధికి మించినది. మనకి తెలిసిన జ్ఞానమంతా సృష్టి అని పిలిచే ఈ విశ్వంలోని సమస్త వస్తువుల సమాహారానికి, వాటి మధ్యనున్న సంబంధాలకు, అవి మనపై చూపించే ప్రభావానికీ మాత్రమే పరిమితమై ఉంది.

మన అనుభవాన్నిబట్టీ, తర్కబద్ధంగా రాబట్టిన తీర్మానాలనుబట్టీ మనం చేసే పనులని తప్పనిగాని ఒప్పనిగాని నిర్ణయిస్తాము. కొన్ని ఆకారాలు, రంగులు, పదాల పొందికల వల్ల, వాటిపట్ల మనకున్న ఇష్టాయిష్టాలవల్ల వస్తువులు మనకి అందంగా, సొంపుగా కనిపిస్తాయి. ఈ సౌందర్య భావనకు ఐంద్రియసంతృప్తి, మేధోవివేచన, దాని ద్వారా వినూత్న ఆవిష్కరణల వల్ల వచ్చే ఆనందం పునాది అని మనం గుర్తించవచ్చు. ఆలోచనలు, జ్ఞాపకాలు, అనుభవాల కారణంగా మనలో సౌందర్యం గురించి కొన్ని మౌలిక భావనలు ఏర్పడతాయి. ఆ భావనలు నిజమైనప్పుడు సౌందర్యం మన జీవితంలోకి నడిచివచ్చిందని మనం గ్రహిస్తాం.

కళ మనలో ఆలోచనలను రగిలించి, వృద్ధిచేస్తుంది; మన చైతన్యాన్ని వేగిరపరుస్తుంది. ఈ ఊహాశక్తి వల్లనే మనల్ని ఇతరుల స్థానంలో ఊహించుకోగలం. ఆ ఊహాశక్తే లేనపుడు, యజమాని తనను సేవకుడి స్థానంలో ఉంచుకుని ఆలోచించలేడు; నియంత తను బంధించిన వారితోడుగా తనూ చెరసాలను అనుభవించలేడు. ప్రాణత్యాగం చేసిన వ్యక్తిని చుట్టుముట్టిన అగ్నికీలలు మతాధికారిని తాకవు. ఆలోచనాపరుడైన వ్యక్తి బిచ్చగాడికి ఇవ్వడం ద్వారా తనకి తాను ఇచ్చుకుంటాడు. ఒక దుష్కార్యం జరగడం చూస్తూ ధర్మాగ్రహం తెచ్చుకున్నవారు, బాధితుడిలో తమని చూసుకుంటారు; ఆక్రమణదారుని ఎదిరిస్తున్నపుడు, తమని తాము రక్షించుకుంటున్నట్టు భావిస్తారు. ప్రేమ, అనుకంప ఆలోచనల సంతానం.

మన పూర్వీకులు మిల్టన్, యంగ్, పొలాక్ రాసిన ఛందోబద్ధమైన ప్రార్థనా గీతాలని ఎంతో సమ్మోదంతో చదివేరు. ఆ ఆధ్యాత్మిక కవులు మనిషి మనసు కలుషితము, రోగగ్రస్తం అయిపోయిందని, జీర్ణమైన మానవజాతి నైతిక ప్రవర్తనని ఈ కవిత్వపు ఔషధాలు శుద్ధి చేస్తాయనీ చదువరులని నమ్మించడమే లక్ష్యంగా రాసేరు. ఒక నిజమైన కళాకారుడికి, ఒక ప్రతిభావంతుడికి, కళారూపాలకు ఈ ఔషధీయ తత్వాన్ని ఆపాదించడం అంతటి ఏహ్యమైన భావన మరొకటి ఉండదు.

కపటగాంభీర్యంతోటి, బాధాపరితప్తతతోటి అలరారే కవితలు రాసిన ఈ కవులు, మరోలోకంలో ఒనగూడే సౌఖ్యాలకు ఈ లోకంలో పెట్టుబడి మన నైతికవర్తన అనీ; తమ కవితలలో సందేశాన్ని పాటించిన ప్రతివారూ ఈ లోకంలో ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ పై లోకంలో నిస్సందేహంగా ప్రతిఫలం అనుభవిస్తారనీ తమ కవితలద్వారా నమ్మించజూశారు. తాము కవితలు రాయగలగడానికి తమ ధార్మికత ప్రేరణ అని, తమ కళ తమకు ఔన్నత్యాన్ని ఆపాదించిందనీ వీరు అనుకున్నారు. ఆ ఔన్నత్యభావనతో ప్రపంచానికి ప్రవచించడం వారి బాధ్యతగా భావించారు. సుఖలాలసలోని ఉచ్చులూ, ప్రమాదాలగురించి ప్రపంచాన్ని హెచ్చరించడం తమ కర్తవ్యంగా వారు ఒక లక్ష్యం, స్పష్టమైన నైతికదృష్టి, ప్రణాళికతో రచనలు చేశారు. ఒక రకంగా వాళ్ళు మతబోధకులు. వాళ్ళ లక్ష్యం ఈ ప్రపంచం ఎంత దుర్మార్గంగా ఉందో, తాము ఎంత మంచివారో తెలియజెప్పడమే. మనిషి ఆనందానుభూతిలో ప్రకృతి సర్వస్వమూ భాగస్వామ్యము కావడాన్ని వారు ఎప్పుడూ అనుభవించలేదు, అర్థంచేసుకోలేదు. పక్షులు కిలకిలమన్నా, ప్రకృతి పరవశించి పాటలు పాడినా అది మానవుని మనసులోని ఆనందానికి ప్రతీకలని, ఆ మనసు పాడే పాటకు ఆడే ఆటకు అవి ప్రతిబింబాలనీ వారు గ్రహించలేదు. వాళ్ళకు ఈ అనుభూతి లేశమాత్రమైనా అవగాహన కాలేదు. ఆ ఆనందమే కళాకారుడి చేతిని నడిపిస్తుందని, రంగురంగుల రూపాల్లో తనను తాను ప్రకటించుకుంటుందని వీరికి అర్థంకాలేదు. కవిత్వాన్నీ, చిత్రాలేఖనాన్నీ, శిల్పాల్నీ ఆ ఆనందాన్వేషణ ఫలితాలుగా, సంద్రమూ ఆకాశమూ, పూలూ నక్షత్రాలూ, ప్రేమా వెలుగూ, అతని మేధస్సుని జాగ్రత్తగా పెంచిపోషించిన ఫలాలుగా చూడలేదు. ఆనందానుభూతి వాళ్ళని కదిలించలేదు. నిరంతరం బాధ్యతలని గుర్తుచెయ్యడం వాళ్ళ కర్తవ్యంగా భావించేరు. వారి ఏకైక ఆశయం ఇతరులకు ప్రబోధించడం, వారిని సన్మార్గంలో పెట్టడం తమ బాధ్యతగా భావించడం. అందుకని ఇతరులలో లోపాలు వెదకడం, తమను తాము గొప్పగా చూపుకోవడం, కేవలం ఇదే వారు చేయగలిగింది. వాళ్ళ దృష్టిలో కళ అనేది వీధివీధీ తిరిగి మతగ్రంథాలు అమ్ముకుంటూ, పరలోకంలోని సుఖసంతోషాల గురించి ప్రస్తావిస్తూ, ఇహలోకంలోని ఆనందాన్ని అన్ని విధాలుగా అణగదొక్కడమే ధ్యేయంగా బ్రతికే ఒక మతబోధకుడి వంటి సాధనం.

ఆనందంగా జీవితం గడిపేవారంతా ఒకానొక నిర్లక్ష్యమైన క్షణంలో తమ బాధ్యతలూ, కర్తవ్యాలూ మరిచిపోయేవారని వారి భావన. అచ్చమైన కవిత్వం వాళ్ళ నీచత్వాన్ని, దౌర్భాగ్యాన్నీ గుర్తుచేసి కనువిప్పు కలిగించి, సరియైన దారికి మళ్ళిస్తుందని వారి ఊహ; విందులో ఆనందంతో వేసే కేరింతలకు అదొక హెచ్చరిక; నవ్వుల హేలకు రానున్న ప్రమాదాన్ని సూచించి హెచ్చరించే చూపుడువేలు.

ఈ నైతిక కవులు ‘అప్రియమైన సత్యాలు’ బోధించారు, జీవనమార్గంలో సమాధులవంక దారిచూపే చేతిగుర్తులుంచారు. యువత చెక్కిళ్ళపై వివర్ణాన్ని ఆశించేరు, ఎప్పుడు మాటాడినా గంభీరమైన స్వరంలో వార్ధక్యం, దౌర్బల్యం, నిర్జీవమైన మట్టిగురించే మాటాడేరు. ప్రేమనిండి జీవం తొణికిసలాడే కనులముందు వాళ్ళు బలవంతంగా మృత్యుసంకేతమైన కపాలాలను నిలిపేరు. విరబూచిన కుసుమాలను పాదాలక్రింద నలిపి, ప్రతి శిరస్సుమీదా ముళ్ళ కిరీటాలు ఉంచారు.

ఈ కవుల దృష్టిలో ఆనందానికీ సత్ప్రవర్తనకీ పొసగదు. ఆనందం అనైతికవర్తన వల్ల కలిగే పాపఫలం. అంతులేని కర్తవ్యం ఎప్పుడూ మనకళ్ళముందు కదలాడాలి. వాళ్ళు తమని ఆధికులుగా ఊహించుకున్నారు. పాఠకుడిని నిరసించి దూషించేరు. పాపాల ప్రస్తావన చేసి, దానివలన పాఠకుడిలో కలిగిన గందరగోళానికి ఆనందించేరు. దారితప్పిన వారు పడే కష్టాలు, విలువలేని మానవ జీవితం, మనిషిలోని అల్పత్వం, ఎవరికీ తెలియని మరోప్రపంచంలోని అందాలను వర్ణించడం వాళ్ళకి ఇష్టం. వాళ్ళకి హృదయం గురించి బొత్తిగా తెలియదు. ప్రేమ మొలకెత్తకుండా మనిషిలో ఏ సుగుణమూ పాదుకోదని, గుండెనిండా ప్రేమ ఉన్నవారే సద్వర్తనులనీ వారికి తెలియదు.

కళకు ప్రచ్చన్నంగా నైతికత, అనైతికత అనే మీమాంసతో ఏ సంబంధమూ లేదు. కళ అస్తిత్వానికి కారణం తానే. కళ కేవలం తనకోసమే తాను ఉంటుంది. ఎప్పుడైతే కళాకారుడు ఈ సత్యాన్ని విస్మరించి, తన కళ ద్వారా మానవాళికి సందేశం ఇవ్వాలని ఉబలాటపడతాడో అప్పుడతను కేవలం ఒక ప్రబోధకుడు మాత్రమే. తన కళ ద్వారా సామాజిక నైతికతను నిర్దేశించి, అమలుచేయాలని తపనపడతాడో అప్పుడతను కేవలం ఒక తార్పుడుగాడు మాత్రమే.

ప్రకృతి సహజమైన నగ్నతకు కృత్రిమమైన దిగంబరత్వానికి మధ్య ప్రాక్పశ్చిమాల భేదం ఉంది. అత్యంత స్వచ్ఛంగా, బాహ్యస్పృహ అనే మలినం అంటకుండా చిత్తశుద్ధితో నిలిచిన నగ్నత్వం ముందు, ప్రతీకాత్మకమైన ఆచ్ఛాదనలు ధరింపజూపేవి, ప్రయత్నపూర్వకంగా తమ దిగంబరత్వాన్ని సూచింపజూపేవి, తమ నిజతత్వాన్ని దాచుకోలేనివి అయిన కళారూపాలను మించిన జుగుప్సాకరమైనవి లేవు. దిగంబరత మలినం, అశ్లీలం, నీచం. నగ్నత పరిశుద్ధం, పవిత్రం, ఉచ్చం.

అపవిత్రమైన ఆచ్ఛాదన నెన్నడూ ఎరుగక, ఏ దాపరికమూ లేకుండా, గర్వంగా, తీర్చిదిద్దిన అవయవాలతో నగ్నంగా కనిపించే ఆ ప్రాచీన గ్రీకు శిల్పకళాఖండాలు అప్పటికీ, ఇప్పటికీ, ఒక్కలాగే స్వచ్ఛంగా, నిర్మలినంగానే కనిపిస్తాయి, ప్రాతఃకాలపు మంచుబిందువులో తొణికిసలాడే వేగుచుక్క ప్రతిబింబంలా.

నైతికత అనేది ఒక సందర్భంలో మనిషి ప్రవర్తనకు ప్రతిబింబం. ఒక సందర్భానికి, ఆ సందర్భంలో అతని నడతకు మధ్య ఉన్న అంతరాన్ని, లేదా అది లేకపోవడాన్ని అది సూచిస్తుంది. నైతికత మనిషి నడతలోని పొందిక. ఒక అద్భుతమైన శిల్పం ఎప్పుడూ సమతౌల్యంలోని పొందిక. ఒక అద్భుతమైన చిత్రం ఎప్పుడూ రంగు-రూపుల రసజ్ఞ సమ్మేళన. గొప్ప చిత్రం ఎప్పుడూ అలసటనీ, శ్రమనీ ప్రతిబింబించదు. అది ఎంత గొప్పదైతే, అంత సులభంగా గీయగలిగినట్టు కనిపిస్తుంది. ఒక పరిపూర్ణమైన జీవితం ఎటువంటి శ్రమనూ ఎరగనట్టు, ఎంతో సులభంగా సాధించుకోబడినట్టూ కనిపిస్తుంది. అటువంటి జీవితం వెనుక ఒక నిర్బంధం, బాధ్యతలు, కర్తవ్యనిర్వహణ ఏవీ ఉన్నట్టు కనిపించవు. అవి అలవోకగా కలగలిసిపోతాయి. కానీ, జీవితంలో బాధ్యతలు, కర్తవ్యాలూ అన్న ఆలోచన, ఆనందానికి ఉదాహరణగా కనిపించవలసిన జీవితాన్ని ఒక్కసారిగా వెట్టిచాకిరీలా మారుస్తుంది.

నీతిని బోధించే ప్రయత్నం చేసినపుడు కళాకారుడు కేవలం కూలివాడుగా మారుతున్నాడు. అతని ప్రతిభకున్న స్వేచ్ఛ నశించి, కళాకారుడు సామాన్యుడిగా మిగిలిపోతాడు. అద్భుతమైన సంగీతాన్ని వినగానే అసంకల్పితంగా శరీరం ఎలా నృత్యం చేస్తుందో అలాగే, ఒక నిజమైన కళాకారుడి ఆత్మ కళలోని సమతౌల్యానికి, స్వరమేళనకి, రంగు-రూపుల రసజ్ఞ సమ్మేళనకు స్పందించాలి. అద్భుతమైన ఆ ప్రాచీన శిల్పాలని చెక్కిన మేటి కళాకారులను నాటి యువతకి తల్లిదండ్రులకు విధేయులుగా ఉండమని బోధించేవారిగా మనం ఊహించలేము. కొంచెం విపరీతంగా, కొంత అశ్లీలంగా కనిపించే డే ఆఫ్ ది జడ్జ్‌మెంట్ చిత్రాన్ని మికెలాంజెలో ఇటలీలోని దొంగలని సంస్కరించడం కోసం అలా చిత్రించేడని ఊహించలేము. బహుశా అతన్ని ఆ చిత్రం గీయడానికి నిర్దేశించిన వ్యక్తి ఏమి చిత్రించాలన్నది మాత్రమే సూచించి ఉంటాడు. దాన్ని ఎలా చిత్రించాలన్నది కళకి, కళాకారుడికీ చెందిన విషయం. అందులో ప్రజల నైతికవర్తన మీద దాని ప్రభావం గూర్చి ఏ సూచనలూ, చివరకి మతాధికారులపై కూడా ఉండి ఉండకపోవచ్చు. ఎన్నో రెట్లు కవితాత్మకంగా చిత్రించిన కొరోట్ ప్రకృతి చిత్రాల్లో కుటీరాలు, విషాదంలో మునిగినట్టు కనిపించే పోప్లార్ చెట్లు, ఎండకి ఎండి వానకి తడిసి వివర్ణమైన గోడలమీద పాకుతున్న ఆకులులేని లతలు, ప్రశాంతమైన సరస్సులు, సంతృప్తిగా కనిపించే ఆలమందలు, అక్కడక్కడ వెలుతురద్దినట్టున్న విశాలమైన పచ్చికబయళ్ళు, తల్లి రొమ్ములా సుతిమెత్తగా వాటిమీదకి వొంగిన ఆకాశం… వీటన్నిటిలో టెన్ కమాండ్‌మెంట్స్ గూర్చిన ఛాయామాత్రమైన ఆలోచనకూడా ఉంటుందని అనుకోను. ప్రతిభావంతుడైన కళాకారుడి సృష్టికీ, నైతిక కళాఖండానికీ మధ్య నంగనాచితనానికీ, సచ్ఛీలానికీ మధ్య ఉన్నంత తేడా ఉంటుంది.

‘నైతిక సత్యాలు’ అని తాము పిలిచే నియమాలని ప్రపంచంపై రుద్దడానికి ప్రయత్నించే నవలాకారులు నిజమైన కళాకారులు ఎన్నటికీ కారు. వాళ్ళు రెండు రకాలైన పాత్రల్ని సృష్టిస్తారు: మూస వ్యక్తిత్వాలు, వాటి అపభ్రంశాలూ. మొదటివి గతంలో చూసి ఉండము, రెండవవి భవిష్యత్తులో చూడబోము. నిజమైన కళాకారుడు ఈ రెంటిలో ఏదీ సృష్టించడు. అతని రచనలలో మీకు నిజమైన వ్యక్తులు కనిపిస్తారు; తమలోని బలాలూ బలహీనతలతో, ఎవరికి వారు విభిన్నంగా ఉంటూనే, మానవీయతనుంచి విడదీయలేని వైరుధ్యాలతో, మనకు నిత్యజీవితంలో ఎదురయే వ్యక్తులలా నిజమైన మనుషులుగా ఉంటారు. నిజమైన కళాకారుడు ప్రకృతికి అద్దం పడతాడు. ఆ అద్దంలో అన్నీ ఉన్నవి ఉన్నట్టుగా ఖచ్చితంగా కనిపిస్తాయి. నైతిక రచయితలు-అంటే, కళకి అతీతంగా వేరే లక్ష్యాన్ని ఆశించిన రచయితలు తమ రచనలలో విషమతల దర్పణాలని ఉపయోగిస్తారు. ఫలితంగా అందులో ప్రతిబింబాలు అందవికారంగా, అష్టావక్రతతో భీకరాకారాలతో కనిపిస్తాయి. సంకుచితదృష్టి ఉన్న రచయిత గాని, కళాకారుడు గాని, ఎప్పుడూ అసంభవమైనవి, అసాధారణమైనవీ మాత్రమే అర్హమైనవిగా అనుకుంటారు. ప్రతిభావంతులైన రచయితలెప్పుడూ విశ్వజనీనమైన విషయాలు స్పృశిస్తారు. అవి వస్తువులలో ప్రకృతిసహజంగా వచ్చే మార్పు, చేర్పులకి అనుగుణంగా ఉంటాయి. వాళ్ళ సృష్టి ఎప్పుడూ సార్వజనీనమూ, సార్వకాలికమూ అయివుంటుంది.

వేలమంది మతసంస్కర్తల లక్ష్యం మనిషిలోని కోరికలని, ఆవేశాలనీ నశింపజెయ్యడం; అది సాధించగలిగిననాడు, ఒకే ఒక్క కోరిక మిగిలి జీవితం దుర్భరమౌతుంది; ఆ ఉన్న ఒక్క కోరికా ఆత్మహననమే. సర్వోత్కృష్టమైన కళ మనిషిలో ఆవేశాలని రగుల్కొల్పుతుంది, జీవితంమీద ఆశని రేకెత్తించి, దానికి ఒక లక్ష్యాన్ని, శోభనీ కలిగిస్తుంది. ఆవేశాల్ని రగిలించినప్పటికీ వాటికి మెరుగుపెడుతుంది. మనిషి దృక్పథాన్ని విశాలం చేస్తుంది. మనిషికి కనీస అవసరాలనేవి చీకటి చెరసాల గది వంటివి. కళ ప్రభావం వల్ల దాని గోడలు వెడల్పుగా, పైకప్పు ఎత్తుగా, ఎదిగి అది ఒక దేవాలయమౌతుంది.

కళ అంటే ప్రబోధగీతం కాదు; కళాకారుడు మతబోధకుడంతకన్నా కాదు. కళ తన లక్ష్యాన్ని పరోక్షంగా సాధిస్తుంది. సౌందర్యారాధన మనల్ని ఉదాత్తుల్ని చేస్తుంది. కళలోని ఔన్నత్యం, ప్రవర్తనలోని ఔన్నత్యాన్ని ప్రతిఫలిస్తుంది. సంగీతంలోని మాధుర్యం జీవితంలో అన్ని విషయాలమధ్య ఉండవలసిన ఆదర్శవంతమైన నిష్పత్తిని అసంకల్పితంగా బోధిస్తుంది. పిట్ట పాటకి ఏ నైతిక లక్ష్యమూ లేనప్పటికీ దాని ప్రభావం మనుషులను మనీషులుగా చేస్తుంది. ప్రకృతిలోని సౌందర్యం దాన్ని అనుభూతి, అవగాహనల రూపంలో మనమీద పనిచేస్తుంది. అది మన అల్పత్వాన్ని చూసి హేళన చెయ్యదు, కోపగించుకోదు. మన ఉనికి, అనుభూతి, మొదలైనవాటితో సంబంధం లేకుండా అందంగా ఉంటుంది. సువాసనలు వెదజల్లే ఎర్రని అందమైన గులాబీపూల హృదయాలలో ‘చెడ్డ పిల్లల్ని ఎలుగుబంట్లు తింటా’యనీ, ‘నిజాయితీ అన్నిటిలో ఉత్తమమైన విధానమనీ’ నీతిసూత్రాలు రాసి ఉంటే వాటిని మనం భరించలేము.

మనిషిలో ఉచితానుచిత విచక్షణ, మానవీయ లక్షణాలు, విలువలు అప్రయత్నంగా, అబోధకంగా ఏర్పడి అభివృద్ధి చెందడానికి కావలసిన వాతావారణాన్ని కళ సృష్టిస్తుంది. వర్షం విత్తనానికి ఎలా ఎదగాలో పాఠం చెప్పదు. లతలకూ, పూలకూ వెలుగు నియమావళి రాయదు.

ఉదాత్తమైన కరుణరస ప్రభావం వలన మనసు మనసవుతుంది.

ఈ ప్రపంచం మనిషి మది అనే నిఘంటువు; వస్తురూపకమైన ఈ నిఘంటువులో, భిన్నత్వాలలో ఏకత్వాన్ని; వైరూప్యాల మధ్య సారూప్యాలను; వైరుధ్యాల మధ్య సామ్యాలను, ప్రతీకలనూ పోలికలనూ కళాకారుడి మేధ గుర్తిస్తుంది. భాష కొన్నివేల పదచిత్రాల సమాహారం. అందులో ప్రతి పదమూ ఒక గొప్ప కళాఖండం; ప్రతి చిత్రమూ ఒక ధ్వని రూపకం; ప్రతిధ్వనికీ ఒక సంకేతం; ఈ సంకేతం కేవలం ధ్వనినిగాక, బాహ్యప్రపంచంలోని ఒకానొక దృశ్యాన్ని, కళాకారుడి మనసులోని చిత్రాన్నీ సూచిస్తూ, ఒకప్పుడు చిత్రాలరూపంలో ఉన్న ఈ పదాలే, మరికొన్ని పదచిత్రాలు సృష్టించడానికి దారితీస్తాయి.

ఉత్తమోత్తమమైన ఏ చిత్రమైనా, ఉదాత్తమైన శిల్పమైనా, అద్భుతమైన సమూహమైనా… ఆ కళకి చెందిన పరిభాషలోనే చిత్రించబడతాయి, చెక్కబడతాయి. అవి ఆనాడు ఆ కళాకారుడి పెదాలనుండి వెలువడినప్పుడు ఎంత వినూత్నంగా ఉన్నాయో, ఈనాటికీ అంతే వినూత్నంగా ఉంటాయి. పెనెలొపీ ఇప్పటికీ రోజల్లా ప్రేతవస్త్రం అల్లుతూ ఒడీసియస్ రాకకై నిరీక్షిస్తూనే ఉంది; యులిసెస్ విల్లు ఎక్కుపెట్టి విడిచిన బాణం ఒకే తలంలో దూరంగా ఉన్న ఏడు వలయాలల్లోంచి దూసుకుపోతూనే ఉంది; కర్డీలియా కంటివెంట కన్నీళ్ళు ఇప్పటికీ కారుతూనే ఉన్నాయి; ప్రపంచంలోని అపురూపమైన నాటకరంగం షేక్స్‌పియర్ పుస్తకాల్లో కనిపిస్తుంది. పొందికైన ఆకృతులతో, తొణికిసలాడే జీవకళతో, మానవోచిత ఆవేశపుశోభతో నిండిన ఉత్కృష్టమైన ఆ జీవితాకృతుల ముందు వాటికన్ లోని రంగులు, లూవ్ర్ మ్యూజియంలోని పాలరాళ్ళూ కళావిహీనమైన శిథిలశిల్పాలు మాత్రమే.

సత్యం ఒక్కటే అనాఛ్చాదితంగా మనగలదు. ఈ ప్రపంచంలో తతిమ్మా అన్నీ కపటవేషం ధరించి ఉండాలి, ఉంటాయి. అల్పమనుషులకి ప్రకృతి అంటే లజ్జ. నంగనాచితనం ఎప్పుడూ తాను అనుభూతి చెందలేని భావాలనే నటిస్తుంది. సందేశాత్మకమైన నైతికకవిత్వం గట్లు పొంగి ప్రవహించని కాలువ లాంటిది. ఆవేశం మీరినప్పుడు, అది ఏ ప్రమాదమూ కలిగించకుండా రహస్యంగా విడుదల కావడం కోసం దానికి కొన్ని పగుళ్ళుంటాయి. వాటినుండి అది నిదానంగా హద్దులు మీరిన ఆవేశాన్ని, అనుభూతులను కారిపోనిస్తుంటుంది. ప్రకృతిధర్మాన్ని వివరించడానికి తప్పుడు సంజాయిషీలు వెతుక్కుంటుంది. ప్రేమని ఎప్పుడూ దోషిగానే చూస్తుంది. నైతికకళ శరీరాన్ని అశ్లీలమైనదిగా భావిస్తుంది. వేటినైతే సహజంగా నగ్నంగా స్పష్టంగా రూపు దిద్దడానికి తన ప్రతిభ చాలదో వాటన్నిటినీ అది తెరలమాటున మరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. కళాత్మకత లోపించినదాన్ని సిగ్గువిడిచి, నీతిగా ప్రచారం చేసుకుంటుంది. అజ్ఞానం పవిత్రతకి పునాది అని, సద్వర్తన ఆ అంధత్వం నుంచే పుడుతుందని వాదిస్తుంది.

ఆలోచనాశక్తికి, ఆవేశాలకు, ప్రేమకు, అంతర్దృష్టికీ కళ పరాకాష్ఠ. వాటిని కళ సృజిస్తుంది, సమ్మిళితం చేస్తుంది, స్పష్టంగా బహిర్గతం చేస్తుంది. అది అత్యున్నతమైన మార్గం. గతాన్ని స్పష్టం చేయడానికి, భవిష్యత్తును అంతే స్పష్టంగా సూచించడానికీ కళాభివ్యక్తి అత్యున్నతమూ అతిశ్రేష్టమూ అయిన మార్గం. ఏ ఆచ్ఛాదనలూ లేని ఒక మనసు ఆవేశాల లోతులను, ప్రేమలోని నిమ్నోన్నతాలనూ అంచనావెయ్యడానికి, అవగాహన చేసుకుందుకు నిజమైన కళ అవకాశం కల్పిస్తుంది.

మనిషి మనోప్రపంచంతో పోల్చిచూస్తే బాహ్యప్రపంచం, అక్కడి వస్తువులూ మనకి అంతగా ప్రేరణ కల్పించవు. రిఛర్డ్ వాగ్నర్ సంగీతంతో పోల్చినపుడు మహాపర్వతాలు, మహాసముద్రాలు, నక్షత్రాలవంటివి మనలో అంత ఆశ్చర్యాన్ని రేకెత్తించవు. ట్రాయిలస్ అండ్ క్రెసీడా, హామ్లెట్, కింగ్ లియర్ చదివిన తర్వాత గొప్ప గొప్ప నక్షత్రమండలాలు సైతం చిన్నవిగా కనిపిస్తాయి. బాధనీ, మృత్యువునీ ఎంతమాత్రం లక్ష్యపెట్టని వీరత్వం ముందు సముద్రాలూ, నక్షత్రాలూ ఏం నిలబడతాయి? మనుషుల హృదయాలతో పోలిస్తే అవెంత? ఒక్క శిల్పం ముందు ఆ రాయిని తీసిన గని విలువ ఎంత?

కళ ఎందుకు గొప్పదీ అంటే అది జ్ఞానోదయాన్నీ, అభ్యున్నతినీ కలిగించి, మనిషిని ఉదాత్తుడిగా, మానసికంగా శక్తిమంతుడిగా చేసి, నాగరికుణ్ణి చేస్తుంది కాబట్టే. సౌందర్యం, ఉద్వేగాలూ, ఆదర్శాలూ దాని కార్యక్షేత్రం. అది మనిషి మానసపుత్రిక. అది ఉదాత్తమైనదిగా ఉండాలంటే అది మానవీయగుణాలనే ప్రతిబింబించాలి. మనిషి అనుభవాలకు, ఆశలకు, భయాలకు, అతని సాధ్యాసాధ్యాలకీ అనుగుణంగా ఉండాలి. ఏ చిత్రకారుడూ ఒక రాజభవనాన్ని చిత్రించడానికి మొగ్గు చూపడు, ఎందుకంటే మనసుని రంజింపజెయ్యడానికి అందులో ఏమీ ఉండదు గనుక. అది సంప్రదాయాలకు, బాధ్యతలకు, చెరసాలవంటి జీవితానికి ప్రతీక. అది నిరాసక్తతను, నిరాశా నిస్పృహలను సూచించే గుదిబండ. ప్రతిగా, ఒక చిన్న కుటీరం, దానిమీద పాకుతూ పూలతీగెలు, సంతృప్తి నిండిన చిన్న ఇల్లు, ఇంటిపై సహజంగా పడే వెలుగు నీడలు, పళ్ళబరువుతో క్రిందకి వాలిన చెట్లు, వాటిని ఆవరించి ఉన్న రంగురంగుల పూలచెట్లు, వాటిపై తుమ్మెదల రొద, నవ్వుతూ కేరింతలాడే బాల్యం, తన చుట్టూ ఉన్న ప్రకృతిలో మమేకమైన నిరాడంబర జీవితం… ఒక కవిత, ఎడారివంటి ప్రపంచంలో ఒయాసిసు వంటి ఒక చిరునవ్వు.

పట్టు బట్టలలో, ఒంటినిండా నగలతో ఉండే ఎంత అందంగా చిత్రించిన స్త్రీ అయినా గొప్ప చిత్రం కాలేదు. ఆమె జీవితంలో ఉండవలసిన స్వేచ్ఛ లేదు. ఆమె ఆశక్త. చిన్న చిన్న ఆనందాలకు ఆమె జీవితంలో చోటు లేదు. ఆమె బొమ్మ ఎంతో ఆలోచనతో, గణితంలాగా కచ్చితమైన ఆలోచనలతో గీసినది. అందులో స్వేచ్ఛ లేదు. ప్రతి కళాత్మక వస్తువులోనూ ఎంతోకొంత అవ్యవస్థ, అస్తవ్యస్తత ఉంటాయి. అవి స్వేచ్ఛవల్ల మాత్రమే జనించేవి. అందరు కళాకారుల్లోనూ కొంతమేరకు ఈ పోకిరితనం, ఈ అరాచకత్వం కనిపిస్తుంది. దాన్నే మనం ప్రతిభ అంటాం.

కళలోని నగ్నత్వం స్త్రీ సౌందర్యాన్ని పూజనీయం చేస్తుంది. ప్రతి గ్రీకు శిల్పమూ మన తల్లులకీ, అప్పచెల్లెళ్ళకీ ప్రతినిధులు. ఈ పాలరాతి బొమ్మలనుండే సంగీతస్వరాలు పుట్టుకొస్తాయి. అవి మనిషి మనసుని కోమలం చేసి, ఆరాధనాభావనతో నింపుతాయి. వాటిపట్ల గౌరవం, ఆశ్చర్యం, మక్కువ మనలో కలుగుతాయి. అంగవిహీనమైనప్పటికీ వీనస్ శిల్పసౌందర్యం ఏమాత్రం తగ్గలేదు సరికదా, మనజాతి సంస్కృతి ఔన్నత్యానికి సహకరించింది. అది పాలరాతిలో సంగీతఝరి. ఆ మూర్తిలోని రేఖలూ ఒక విధమైన సంతృప్తి నిండిన విషయాసక్తిలో కలిసిపోతాయి. ఆ భంగిమలో ప్రశాంతత ఉంది. కనులలో ప్రేమైక భావనలు తొణికిసలాడుతున్నాయి. ఆ రొమ్ము సంతానానికై కలలు కంటున్నట్టుంది.

జాగరూకతలో కవితాత్మ లేదు; అందులో లాభనష్టాల బేరీజులుంటాయి. ప్రతిభ అంటేనే దేనినీ లెక్కచేయనితనం. అది ఒక్కోసారి బాధ్యతారహితంగా ఉన్నా ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అది ఎగసిపడుతున్న ఉత్తుంగతరంగాల వంపులలో సంచరిస్తుంది. దాని నడత గురించిగాని, రాబోయే పర్యవసానం గురించిగాని ఎంత మాత్రమూ లక్ష్యపెట్టదు. క్షణకాలం కార్యకారణ సంబంధం తెగినట్టు కనిపిస్తుంది. ఆత్మ అంత స్వేచ్ఛగా విహరిస్తుంది. అది ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోదు, చివరకి తనకికూడా. తన పరిమితులగురించి పూర్తిగా మరిచిపోతుంది. ఆ క్షణంలో ప్రకృతి తన అభీష్టానికి తలొగ్గినట్టు కనిపిస్తుంది. ఆదర్శం ఒక్కటే మిగులుతుంది. విశ్వం ఒక బృందగానమవుతుంది.

ప్రతి మెదడూ ఒక కళాప్రదర్శనశాల, ఏదో ఒక మేరకు ప్రతి మనిషీ ఒక కళాకారుడు. ఈరోజు ప్రపంచప్రఖ్యాత ప్రదేశాల్లో గోడలని అలంకరించిన చిత్రాలు, ప్రత్యేక స్థానాలను అలంకరించిన శిల్పాలు, సాహిత్య పుటలను తేజోవంతం చేసిన కవిత్వమూ, ఇవన్నీ ముందుగా కొందరు వ్యక్తుల మెదళ్ళనే చిత్రశాలలనుండి సేకరించినవే!

ఈ కళాత్మ, అంటే కళాకారుడు, తన మెదడులో సృష్టించుకున్న చిత్రాలను, తక్కిన చిత్రశాలలనుండి తీసుకున్నవాటితోనూ, తనకు ఎదురుగా కనిపించేవాటితోనూ సరిపోల్చుకుంటాడు. కళాకారుడు వీటన్నిటిలోనూ పరిపూర్ణతకి దగ్గరగా ఏది వస్తుందన్నది వివేచించి, నిర్ణయం చేసి, అలా దగ్గరగా వస్తాయని అనుకున్న వాటినన్నిటినీ ఒకచోట చేర్చి, మరొక ఆదర్శవంతమైన కొత్త చిత్రాన్నీ, కొత్త శిల్పాన్నీ సృష్టిస్తాడు.

కోరికలను, ఆరాటాలను, పారవశ్యాలను, భవిష్యత్తుకై కంటున్న కలలను, ఉద్రేకాలనూ రంగులలో, సాకారంగా చిత్రించడమూ; ప్రేమను, ఆశను, శౌర్యాన్ని, విజయాన్నీ పాలరాతిలోనూ; కలలను, జ్ఞాపకాలనూ అక్షరాలలోనూ; ప్రభాతసమయంలోని నైర్మల్యాన్ని, మధ్యాహ్నంలోని తీవ్రత ప్రకాశతలను, సాయంసంధ్యలోని సౌకుమార్యాన్ని, రజనీ వైభవపు మార్మికతలను, శబ్దాలతో సహా నిబద్ధం చేస్తూ, చూపులేనివారికి చూపును, స్పర్శనూ ప్రసాదించి, లౌకిక ప్రపంచంలోని సామాన్య వస్తువులనన్నిటినీ ఊహలో అమూల్యరత్నాలతో, మణులతో అలంకరించి, శోభాయమానం చెయ్యడమే…కళ.

(ప్రచురణ: నార్త్ అమెరికన్ రివ్యూ, మార్చ్ 1888.)