‘నేను ఇంతకాలం నీకు దక్కలేదు కాబట్టి నామీద నీ ప్రేమ స్థిరంగా ఉంది. దక్కిన తర్వాత అలాగే ఉంటుందని నాకేం నమ్మకం? ఎంతోమంది స్త్రీలతో ప్రణయకలాపాలుండేవి నీకు. నన్ను చూశాక అది మారిందంటున్నావు. నన్ను పెళ్ళి చేసుకుంటే మళ్ళీ అవి మొదలవ్వవని ఎలా అనుకోగలను? ప్రియుడిగా నీమీద అసంతృప్తి కలిగితే వ్యక్తం చెయ్యగలను గాని, భర్తగా అలా వ్యక్తంచేసే స్వేచ్ఛ నాకుంటుందా?’
ఈ మాటలు ఏ 20వ శతాబ్ది నవలలోని చదువుకున్న ఏ చైతన్యవంతమైన స్త్రీపాత్రవో కావు. 1678లో ఒక మహిళ రాసిన ఫ్రెంచి నవలలోవి.
ప్రపంచభాషల్లో తొలి త్రికోణ ప్రణయ నవల ఏది అంటే మదామ్ దె లాఫయట్ (Madame de La Fayette) రాసిన ల ప్రిన్సెస్ దె క్లేవ్ (La Princesse de Clèves, The princess of Cleves) అన్న ఫ్రెంచ్ నవల అని చెప్పవచ్చేమో. 1672లో రాసి 1678లో ప్రచురింపబడిన ఈ నవలను చదవగానే, ఇంత లోతైన అవగాహనతో, గాఢతతో ఆ రోజుల్లోనే ఇంత మంచి ప్రేమకథ వచ్చిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ప్రేమలో ఉండే గాఢత, అనిశ్చితి, అనుమానం, అసూయ, ఆవేశం, దాపరికం, అమాయకత్వం, ఆత్మార్పణ, ఆత్మాహుతి, విచక్షణ, వివేకం… ఇలా అన్నీ కలబోసిన అసాధారణ నవల ఇది. గెన్జి మొనొగతరి తొలి నవల అని ఖచ్చితంగా అంగీకరించినా, అందులో కంటే ఈ నవలలో నిబిడబంధం, క్లుప్తత, ఏకసూత్రత మరింత స్పష్టంగా కనిపిస్తాయి. పాత్రచిత్రణ, కథనం, సంభాషణలు మొదలైన వాటిలో అది పూర్తిగా ఆధునిక నవలే అయినా, ఇతివృత్తనిర్మాణం విషయంలో ఈ ఫ్రెంచి నవల మరింత ఆధునికంగానూ, నిర్మాణసౌష్టవంతోనూ కనిపిస్తుంది.
కథాకథనం, శిల్పం దృష్ట్యా చూసినపుడు ల ప్రిన్సెస్ దె క్లేవ్ అన్ని రకాలుగానూ సమగ్రమైన నవల అని చెప్పవచ్చు. కేవలం ఫ్రెంచిలోనే కాదు. మొత్తం యూరప్‌లోనే తొలి చారిత్రక నవల ఇది. ఫ్రెంచిలో ఇది రెండో నవల. 1605లో ఒనొరె దె యుర్ఫె (Honoré d’Urfé) రాసిన లా స్త్రె (L’Astrée) ఫ్రెంచి భాషలో తొలి నవల. ఈ నవల నిడివి 5515 పుటలు! దాన్ని 1599లో మొదలుపెట్టి 1630లో చివరిభాగం ప్రకటించాడని ఆ రచయిత గురించి చెప్పుకుంటారు. ఈ నవలను పూర్తిగా ఎవరూ చదివినట్టు కూడ దాఖలాలు లేవు. అందువల్లే ఈ రచయిత్రిని ఫ్రాన్స్‌లో తొలి నవలాకారిణిగా గుర్తించే విమర్శకులు చాలామందే ఉన్నారు. సుప్రసిద్ధ ఫ్రెంచి నవలా రచయిత స్టెంధాల్ (Stendhal, 19వ శతాబ్ది) ఫ్రెంచి భాషలో ఇదే తొలి నవల అంటూ ఈ నవలను ‘దివ్యమైన రచన’గా అభివర్ణించాడు.
నేను రాయలేదన్న మదామ్ దె లాఫయట్
రచయిత పేరు లేకుండా ల ప్రిన్సెస్ దె క్లేవ్ 1678లో ప్రచురితమైంది. అంతకుముందు, అంటే షుమారు 16వ శతాబ్ది వరకు ఫ్రెంచిలో రొమాన్సులు, కావ్యాలే తప్ప వచన రచనలేవీ రాలేదు. వాస్తవికతతో ఏ సంబంధమూ లేకుండా అతిమానుష నాయకులు, అద్భుత చర్యలతో నిండినవి, మరీ ముఖ్యంగా గ్రీకు, లాటిన్ మానవాతీత గాథల అనుకరణలుగా వచ్చిన రచనలే ఎక్కువ. మొదటిసారి స్త్రీపురుష సంబంధాలపై, ప్రేమకథలలోని విషాదంపై, వాస్తవికతకు దగ్గరగా ఉన్న రచన ఇదే. రచయిత్రి తన పేరు ఈ నవలలో చెప్పలేదు. కానీ అప్పటి పండితులు, కవులు, పాఠకులు కూడ దాన్ని రచించింది మదామ్ దె లాఫయట్ అని నిర్ణయించారు. ఆమె అప్పటికే కొన్ని రచనలతో పేరు తెచ్చుకుంది కనక ఆమె ప్రతిభ అందరికీ పరిచితమే. అయితే, ఆ నవల తను రాయలేదని ఆమె పనిగట్టుకుని చెప్పేదని కూడ అంటారు. ఎందుకు? వివాహేతర ప్రణయం వస్తువుగా తను రాయడం సమాజంలో తన పట్ల విముఖత కలిగిస్తుందని ఆమె భావించి వుండవచ్చు. లేదా తన వ్యక్తిగతజీవితాన్ని నవలగా రాసిందని పాఠకులు అపోహపడతారని కూడ భయపడి వుండవచ్చు. ఎందుకంటే దె లాఫయట్ తనకంటే వయసులో బాగా పెద్దవాడిని వివాహం చేసుకుంది. అదీగాక, ఫ్రెంచి రచయితల్లో కొందరితో ఆమెకు మంచి స్నేహం ఉండేది. తర్వాత ఆమె అనారోగ్యం వల్ల పల్లెలో ఉండాల్సి వచ్చినపుడు, ఆమె భర్త అక్కడ ఉండలేక పారిస్ వెళ్ళిపోయాడు. అలా 1661 నుంచి ఆమె ఒక్కతే విడిగా ఉండిపోయింది. అందువల్ల తనగురించి పాఠకులు మరోలా అనుకునే అవకాశం ఉందనేమో ఆమె తన పేరు నవలలపై రాయడానికి అంగీకరించలేదు. భర్త తనని పల్లెలో వదిలి వెళ్ళిపోయిన తర్వాతే ఆమె రచనలు కూడ ప్రారంభమయ్యాయి. 1661లో ఒక నవల, 1672లో మరో నవల రాసింది. అయితే వాటిలో వాస్తవిక చిత్రణ అంతగాలేదు. అంతకుముందు ఫ్రెంచిలో వచ్చిన రొమాన్సుల ధోరణిలోనే ఇవి ఉన్నాయి. వీటిలో మొదటి దానిలో రచయిత పేరే లేదు. రెండో దానిలో కలంపేరు పెట్టింది. తర్వాతి రోజుల్లో లాఫయట్టే వీటి రచయిత్రి కూడా అన్నది తేలింది.
మదామ్ దె లాఫయట్ జీవితం
రచయిత్రి వివాహానికి ముందు పేరు మరీ-మాడలీన్ దె ల వెర్న్ (Marie-Madeleine Pioche de La Vergne). 1634లో వెర్న్, ఇసబెల్ దంపతులకు పెద్ద కూతురిగా జన్మించింది. ఆమెకు ఇద్దరు చెల్లెళ్ళు. తొలి నుంచీ ఆమెది సంపన్న కుటుంబం. సమాజంలో హోదాకు లోటు లేని కుటుంబం. ఆమెకు పదిహేనేళ్ళప్పుడు తండ్రి మరణించాడు. 1650లో తల్లి పునర్వివాహం చేసుకుంది. నిజానికి తన భర్తకు మిత్రుడైన రెనో దె సెవెన్యె (Renaud de Sévigné) పెళ్ళి చేసుకోవలసింది మరీ-మాడలీన్‌నే. కానీ తన కూతురికి భర్త కావలసిన వ్యక్తిని తనే పెళ్ళాడింది మరీ తల్లి. అయినా సవతి తండ్రితో మరీకి చక్కని స్నేహం ఉండేది. ఆమెను ఆనాటి సమాజంలో సుప్రసిద్ధులైన కవులు, రచయితలు, చిత్రకారులకు అతనే పరిచయం చేసి, ఆమె విద్యాబుద్ధులుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు.
తండ్రి, తల్లికి ఎంత ఆస్తి ఇచ్చినా, విడిగా కూతుళ్ళకు కూడ కొంత రాసే వెళ్ళాడు కనక ముగ్గురు కూతుళ్ళకు ఎంతో కొంత ఆస్తి లభించింది. అయితే మరీ చెల్లెళ్ళిద్దరూ ఐహిక జీవితానికి వీడ్కోలు చెప్పి, క్రైస్తవ సన్యాసినులుగా మారారు. దానితో వారిద్దరి ఆస్తి వాటా కూడ మరీకే దక్కింది. ఆ రకంగా తను ఆస్తిపరురాలే అయింది. సవతి తండ్రి రెనో ఆ కాలపు రాజకీయ వ్యవహారాల్లో ఆరితేరినవాడు. రాజాస్థానం గురించి ఆమెతో చర్చించేవాడు. అతను ఫ్రెంచి రాజు 14వ లూయీకి వ్యతిరేకకూటమిలో పనిచేసేవాడు. రాజకీయాలకు సంబంధించినవన్నీ అతని ద్వారానే ఆమె ఒంటబట్టించుకుంది. రాజులు, వారి మంత్రులు, వారి వ్యక్తిగత జీవితాల్లో తీసుకునే రాజకీయ నిర్ణయాల వంటివన్నీ ఆకళింపు చేసుకుంది. అందుకే తన నవలలో వందేళ్ళ కిందటి చరిత్రను రాస్తున్నా ఆ రాజకీయాలను ప్రస్తావించగలిగింది. ఈలోగా కుటుంబం ప్రోద్బలంతో తన కంటే 18 ఏళ్ళు పెద్దవాడైన కోమ్ట్ దె లాఫయెట్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు మగపిల్లలు.
సవతి తండ్రి ఆనాటి ప్రముఖ కవి జ్యీల్ దె మెనాజ్‌ని (Gilles de Ménage) ఆమెకు పరిచయం చేయడం ఆమె జీవితంలో పెద్దమలుపు. అతనితో సాహిత్య, సామాజిక, రాజకీయ చర్చలు చేసేది. అనంతర కాలంలో అతని స్థానాన్ని ఫ్రెంచి మేధావుల్లో ఒకడిగా పరిగణించే ఫ్రాఁస్‌వా దె ల రాష్‌ఫుకో (François de La Rochefoucauld) ఆక్రమించాడు. సంసార జీవితంలో పెద్దగా ఆనందం లభించని మరీ తన సామాజిక జీవితంలో సాఫల్యాన్ని వెదుక్కుంది. మెనాజ్, ల రాష్‌ఫుకోల స్నేహంతో ఆమె భావాలు మరింత పదునెక్కాయి. వీరిలో మెనాజ్‌తో ఆమెకు సన్నిహిత సంబంధం ఉండేదని కూడ చరిత్రకారుల అభిప్రాయం. సభలు, సమావేశాల్లో తరచుగా పాల్గొనడం, రచయితలతో చర్చలు జరపడం వీటివల్ల ఆమె రచనాప్రతిభ అందరికీ సుపరిచితమే. అందుకే తను రాసినట్టు చెప్పుకోకపోయినా ఆమె రచనలను అందరూ గుర్తించారు. ఆమె రాసిన ప్రిన్సెస్ దె క్లేవ్ నవల వెలువడిన వెంటనే విపరీతంగా పాఠకాదరణ పొందడమే కాక, మరుసటి సంవత్సరమే, అంటే 1679 లోనే దానికి ఆంగ్లానువాదం కూడ వెలువడింది.
తండ్రి చిన్నతనంలోనే మరణించడం, తల్లి తనకోసం నిర్ణయించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం, తన వైవాహక జీవితం కూడా అసంతృప్తినే మిగిలించడం లాఫయట్‌ను రచనారంగం వైపుకు నెట్టిన వేదనలని ఫ్రెంచి విమర్శకుల అభిప్రాయం. బహుశా ఈ అనుభవాల వల్లే ఆమె తన నవలలో సఫల ప్రేమను రాయలేకపోయింది. ఈ నవలలోని అన్ని ప్రేమకథల్లోనూ విషాదమే ప్రధానంగా ఉంటుంది. నవల వెలువడగానే ఒక ఫ్రెంచి విమర్శకుడు దాన్ని సమీక్షిస్తూ ‘నవలావస్తువు పట్ల నాకంత గౌరవం కలగలేదు. జీవితంలో అలా జరగవు. కానీ ఆమె రచనావిధానానికి జోహార్లు. పాఠకుడిని తనతోపాటు కథలోకి లాగుకొని వెళ్ళే కథాకథనం, కళ్ళకు కట్టినట్టుగా పాత్రల్ని మలచిన తీరు అమోఘం’ అని ప్రశంసించాడు. ఫ్రెంచి నవలల్లోనే కాక, యూరోపియన్ నవలలకే ఒక చక్కని ప్రణయనవలను, ఇప్పటికీ చర్చించదగిన రచనను అందించిన మదామ్ దె లాఫయట్ 1693లో మరణించింది.
ల ప్రిన్సెస్ దె క్లేవ్
ఫ్రెంచి భాషలో తొలి చారిత్రక నవలగా, మనస్తత్వ ప్రధాన నవలగా ఈ నవల పేరు పొందింది. ఇందులో కథానాయిక తప్ప తక్కిన అందరూ చారిత్రక వ్యక్తులే. ఏ భాషలోని చారిత్రక నవలల్లోనైనా చారిత్రక వ్యక్తులు అతి తక్కువగా, కల్పిత పాత్రలు ఎక్కువగా ఉండడం సహజం. కానీ ఈ తొలి ఫ్రెంచి చారిత్రక నవలలో అన్నీ చారిత్రక పాత్రలే. కథానాయిక మాత్రమే కల్పితం. నవల రచనాకాలం 17వ శతాబ్ది అయినా, కథాకాలం 16వ శతాబ్ది. రెండో హెన్రీ ఫ్రాన్స్‌ను పరిపాలించిన రోజులవి. కథాకాలం రెండు సంవత్సరాలు. 1558-59 సంవత్సరాల్లో జరిగిన ఒక ముక్కోణపు ప్రణయగాథ.
రెండో హెన్రీ 1547 నుంచి 1559 వరకు ఫ్రాన్స్ రాజుగా ఉన్నాడు. అతని సహధర్మచారిణి కాథరిన్ దె మెడిసి. హెన్రీ చిన్నప్పటినుంచి తనకంటే 20ఏళ్ళు పెద్దదైన డచెస్ ఆఫ్ వాలంటిన్వాను ప్రేమించాడు. ఆ ప్రేమ అతని 14వ యేట ప్రారంభమై, మరణించేవరకూ కొనసాగింది. భార్య కాథరిన్ దె మెడిసి భర్తగారి ప్రియురాలి పట్ల ఎలాంటి ఈర్ష్య లేనట్టే ప్రవర్తిస్తూంటుంది. కానీ అది కేవలం నటనే. మహారాణికి మానసిక దౌర్బల్యం చూపించుకునే హక్కు లేదు కనక అలా నిబ్బరంగా కనిపిస్తుందని ప్రజలు అనుకుంటారు. దానికితోడు డచెస్ ఆఫ్ వాలంటిన్వా కేవలం ప్రియురాలు కాదు. హెన్రీ రాజకీయాల్లోనూ భాగస్వామి. ఆమె రాజకీయ కుట్రల్లో ఎంత ఆరితేరిన మనిషంటే, రాణిగారి వల్ల పనులు కావని, సామాన్యులు కూడా రాజుగారిని మంచి చేసుకోడానికి ప్రియురాలినే ఆశ్రయించేవారు. యథారాజా తథాప్రజ కనక, రాజుగారిలాగే ఆ రాజమందిరంలోని స్త్రీపురుష సంబంధాల్లో నీతి, అవినీతి, వివాహం, వివాహేతరం అనే శషభిషలు లేకుండా, అందరూ రకరకాల సంబంధాల్లో మునిగితేలేవారు. రాజుగారి ప్రియురాలికి సన్నిహితులైన వాళ్ళకు రాజకీయాల్లోనూ పెద్ద స్థానం. రాజుకు తనపై ప్రేమలేదని తెలిసిన రాణికి, కథానాయిక ప్రిన్సెస్ దె క్లేవ్ బాబాయి డ్యూక్ దె విదేమ్ పట్ల ప్రేమ ఉంటుంది. కానీ అది బయటకు చెప్పుకోలేని భావన. ఒక రాణిగా తను మనసులో పెట్టుకోవాల్సిందే తప్ప బయటపడలేదు. రాజుగారి విషయం వేరు. అతనికి ఎన్ని సంబంధాలున్నా అన్నిటినీ బాహాటంగానే నిర్వహించుకోవచ్చు. ఇదే ధోరణి ఇతర స్త్రీలకు కూడ వర్తిస్తుంది.
వివాహేతర బంధాలు, భర్త మరణించాక మరో పెళ్ళి చేసుకోకుండా నచ్చిన వ్యక్తితో ప్రణయం సాగించేవాళ్ళు రాణివాసపు స్త్రీలలో చాలామందే ఉన్నారు. కానీ వారి ప్రణయగాథలన్నీ రహస్యాలే. ఎవరికీ తెలియకుండా దాచుకోవడం, ఎక్కడ తెలుస్తుందోనని నిత్యం భయంలో జీవించడం ఆ స్త్రీల జీవితాల్లో సుఖసంతోషాలు లేకుండా చేసే విషయాలు. ఇలా వైవాహిక బంధం తాలూకు పవిత్రతను కాపాడేవాళ్ళే కరువయ్యారన్న భావన కొందరి స్త్రీలలో కలవరం కలిగిస్తుంది. వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసింది కథానాయిక తల్లి మదామ్ దె షార్త్ (Madame de Chartres). తల్లి లోని ఈ కలవరమే, సమకాలీన సమాజంలో స్త్రీపురుష సంబంధాల పట్ల ఆమెకున్న అభ్యంతరాలే, ఈ నవలలో కథానాయిక ఆలోచనా విధానానికి, స్వభావానికి, ప్రవర్తనకు కీలకం.
కథానాయిక పెళ్ళికి ముందు కుమారిగా మదెమ్వాసెల్ షార్త్‌గా (Mademoiselle Chartres) నవలలో పరిచయమౌతుంది. ఆమె అపురూపసౌందర్యవతి. రాజుగారి ఆస్థానంలో సహజంగానే అందరూ సౌందర్యవంతులు; స్త్రీలు, పురుషులు కూడా. అలాంటి వారి మధ్య కూడా మదెమ్వాసెల్ షార్త్ అందం వెలిగిపోతూంటుంది. తల్లి మదామ్ దె షార్త్ ప్రభావం కూతురి ఆలోచనలపై చాలా ఎక్కువ. రాజాస్థానంలో స్త్రీపురుష సంబంధాల్లోని విపరీత వైఖరులు చూసి భయపడిన తల్లి, అసలే అందగత్తె అయిన తన కూతురు ఎవరి ప్రలోభంలో పడిపోతుందో అని భయపడి ఒక బుద్ధిమంతుడైన యువకుడు లభించగానే పెళ్ళి చేస్తుంది. అతనే ప్రిన్స్ దె క్లేవ్. అతనికి రాజాస్థానంలో పరపతి ఉంది. సామాజిక హోదా ఉంది. సంపన్నుడు, మంచివాడు. అతన్ని చూసినపుడు మదెమ్వాసెల్ షార్త్‌కు ఏ రకమైన అభిప్రాయం కలగకపోయినా తల్లికి విధేయురాలు కనక వివాహానికి ఒప్పుకుంటుంది. వివాహమైన నాటి నుంచి ఆమె ప్రిన్సెస్ దె క్లేవ్‌గా మారుతుంది. ప్రిన్స్ దె క్లేవ్‌కి మాత్రం అపురూపసౌందర్యవతి అయిన భార్యంటే పిచ్చిప్రేమ. భర్తపట్ల ప్రేమ లేకపోయినా, గౌరవం ఉన్న ప్రిన్సెస్ దె క్లేవ్ ఒక విధమైన యాంత్రికతలోనే ఆనందం వెతుక్కుంటూ ఉంటుంది.
అలాంటి ఆమెకు డ్యూక్ దె నిమూర్ (Duke de Nemours) కనిపించడం ఒక అపురూపమైన సందర్భం. రాజాస్థానంలో పరపతి కలిగి, ఎందరో యువతుల మానసచోరుడైన డ్యూక్ నిమూర్‌ని చూడగానే మొదటి చూపులోనే ఆకర్షితురాలవుతుంది. ఎందరో స్త్రీల ప్రేమ చవిచూసిన అతను కూడ ఈమెను చూడగానే ప్రేమలో పడతాడు. అక్కడినుంచి వారిద్దరి మధ్య మూగప్రేమ ప్రారంభమవుతుంది. ఆమె వివాహిత కనక తమ ప్రేమను ప్రకటించకూడదని అతను, అదే కారణంగా ఆమె ప్రకటించుకోరు. అసలు నిజంగా తమకు పరస్పరం ఉన్నది ప్రేమేనా, కేవలం క్షణికమైన ఆకర్షణా అని కూడ సంశయిస్తూంటారు. అతను ఎలాగైనా ఆమెను చూసి ఆనందించాలని ప్రయత్నించడం, ఆమె అతన్ని తప్పించుకోడానికి ప్రయత్నించడం జరుగుతూంటాయి.
తొలి నుంచీ ఇద్దరూ తమ ప్రేమ అనైతికం అన్న భావనలో దాన్ని వదిలించుకోడానికే ప్రయత్నిస్తారు. ముఖ్యంగా రాకుమారి క్లేవ్. ఇద్దరూ ఎన్నిసార్లు విందులు, వినోదాలు, కళాప్రదర్శనల్లో తటస్థపడినా, పరమానందం పొందుతారు. కానీ ఒక్కసారి కూడ తమ మనసులో మాటలు చెప్పుకోవాలని అనుకోరు. ‘ఆమె నిజంగా నన్ను ప్రేమిస్తోందా?’ అని అతను, ‘అతను నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా?’ అని ఆమె సందేహిస్తూనే ఉంటారు. ఈ సంఘర్షణ పడేకంటే అతన్ని చూడకుండా ఉంటే ప్రేమ తగ్గిపోతుందని అనుకుని, రాకుమారి అతను వచ్చే ప్రదేశాలకు వెళ్ళడం మానేస్తుంది. భర్త ఎక్కడ కనిపెడతాడోనన్న సంఘర్షణకు గురవుతుంది. డ్యూక్ నిమూర్ సామాన్యుడు కాడు. ఇంగ్లండు రాణి ఎలిజబెత్‌తో అతని వివాహం గురించి సంప్రదింపులు అప్పటికే జరుగుతున్నాయి. ఇంగ్లండుకు రాజయ్యే అవకాశాన్ని వదులుకునేంత ప్రేమ తనమీద అతనికి ఉంటుందా అని రాకుమారి సందేహిస్తుంది. తన భర్త తన పట్ల ఎంత ప్రేమ, ఆరాధన ప్రదర్శిస్తాడో, అంత ప్రేమ తను నిమూర్ పట్ల చూపుతోందని గ్రహించి కలవరపడుతుంది. నాటి సమాజంలో వివాహేతర సంబంధాలు మామూలే కనక తను కూడ తనకు అతని పట్ల ప్రేమ ఉందని బయటపెట్టవచ్చా అని విచికిత్సలో పడుతుంది. ఈ సంఘర్షణ క్రమంలో ఆమెకు ఊరడింపు, వివేకం కలిగించినవి తల్లి మాటలు. తనను అందరు ఆడవాళ్ళలా ఉండవద్దంటుంది తల్లి. తనలా ఎంతో అందమైన యువతులు ఎడా పెడా ప్రేమలో పడపోవడాలు, తమని ఆరాధించిన పురుషులకు లొంగిపోవడాలు చెయ్యకూడదని తల్లి చేసిన బోధ ఆమెను ఎప్పటికీ వీడదు. భర్త పట్ల విశ్వాసం, గౌరవం, డ్యూక్ పట్ల అమితమైన ప్రేమ – ఈ రెండిటి మధ్యా నలిగిపోతుంది ఆమె మనసు.
డ్యూక్ కూడ వివాహితురాలైన తన ప్రియురాలిని ఎలా పలకరించాలో, ఆమె బాధపడకుండా, అవమానంగా భావించకుండా తను ఎలా ప్రేమను వ్యక్తపరచాలో సంఘర్షణ పడుతూంటాడు. చివరకు వాచ్యంగా ఆమెకు చెప్పే ధైర్యం లేక, ఆమె చూస్తూండగా ఒక చిత్రకళాప్రదర్శనలో ఆమె చిత్రపటాన్ని తస్కరించడం ద్వారా తన మనసును ఆమెకు చెప్పనే చెప్తాడు. ఎందరో స్త్రీలకు ఆరాధ్యుడైన తను ఈ వివాహితను ఎందుకు ఇంతలా ప్రేమిస్తున్నానా అని మథనపడతాడు. ఆమెకు తన ప్రేమను ఎలా వ్యక్తం చెయ్యాలో అర్ధం కాక తనలో తనే కుమిలిపోతాడు.
ఈలోగా తన భార్యకు మరో పురుషుడిపై ఆకర్షణ కలిగిందన్న అనుమానం ప్రిన్స్ దె క్లేవ్‌కు వస్తుంది. అది ఎవరై ఉంటారా అని తన అనుమానంతో చాలా సంఘర్షణకు గురవుతాడు. అందుకని తనకు అనుమానం ఉన్న కొందరు పురుషులను జాగ్రత్తగా గమనిస్తాడు. చివరికి డ్యూక్ మీద అనుమానం వస్తుంది. అది తీర్చుకోడానికి తను నగరంలో, భార్య పల్లెలో ఉన్న సమయంలో డ్యూక్ వెంట ఒక గూఢచారిని పంపుతాడు. అతను అనుకున్నట్టే డ్యూక్ పల్లెకు వెళ్ళి ప్రిన్సెస్‌తో మాట్లాడతాడు. నిజానికి ఆ సన్నివేశంలో వాళ్ళిద్దరి మధ్యా ఏమీ జరక్కపోయినా, తన పరిచారకుడు తిరిగి వచ్చి డ్యూక్ నిమూర్ యువరాణిని కలిశాడని చెప్పగానే అతని అనుమానం నిశ్చయంగా మారుతుంది. తిరిగి వచ్చిన భార్యతో విషయం తేల్చుకోవాలని సిద్ధపడతాడు. అతను ఇంకా డ్యూక్ పేరు చెప్పకముందే ప్రిన్సెస్ తను మరో వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు భర్తకు చెప్తుంది. అది విని భార్య నిజాయితీకి ఆనందించాలో, ఆమె సిగ్గులేనితనానికి అసహ్యించుకోవాలో అర్థంకాక హతాశుడవుతాడు. తను మరో పురుషుడిని ప్రేమిస్తున్నానని చెబుతూనే ఆమె తను భర్తను వదిలిపెట్టదలుచుకోలేదని కూడ చెప్తుంది. కానీ భార్యను అతను క్షమించలేకపోతాడు.
భార్య తన మనసును బయటపెట్టడంతో తీవ్రక్షోభకు గురైన అతను జబ్బుపడతాడు. భర్త అనారోగ్యం మానసికక్షోభ వల్ల కలిగినదని గ్రహించిన ప్రిన్సెస్ అపరాధభావంలో మునిగిపోతుంది. అతనికి అవిశ్రాంతంగా శుశ్రూష చేస్తుంది. చివరకి అతను మరణశయ్యపై ఉండగా, భార్యతో ‘నా మరణానికి డ్యూక్ ఆఫ్ నిమూర్ కారణం. అతని మీద నీకున్న ప్రేమ కారణం. నేను పోయాక అతన్ని పెళ్ళాడడానికి స్వేచ్ఛ లభిస్తుందనుకుంటున్నావు కదూ. నాకైతే నువ్వు అతన్ని చేసుకోవడం ఇష్టం లేదు.’ అన్న బెదిరింపుతో ప్రాణాలు విడుస్తాడు.
కొన్ని రోజుల తర్వాత, నిమూర్ ప్రిన్సెస్ వద్దకు వస్తాడు. సంతాపదినాలు ముగిసాయి కనక తన ప్రేమను ప్రకటించవచ్చునన్న ఆశతో అతనుంటాడు. అదే మొదటిసారి వాళ్ళిద్దరూ ముఖాముఖీ కలుసుకుని తమ ప్రేమను ప్రకటించుకోవడం. కానీ ఆ సంభాషణ పూర్తిగా వాళ్ళనుకున్నదానికంటే విరుద్ధంగా జరుగుతుంది. అతను ఆమెను వివాహం చేసుకుందామని బతిమాలుతాడు. ఆమె నిరాకరించి, తనకు అతనిపై ప్రేమ ఉన్నమాట నిజమేకానీ, వివాహం చేసుకోనని చెప్తుంది. అతన్ని భగ్నహృదయుడిగా వదిలేసి ఆమె సన్యాసినిగా వెళ్ళిపోతుంది. అలా నన్‌గా మారిపోయాక ఆమె ఎక్కువకాలం జీవించలేదన్న రచయిత్రి వాక్యంతో నవల ముగుస్తుంది. నవలలో ప్రధాన కథ ఇదే. కానీ ఉపాఖ్యానాలు చాలా ఉన్నాయి. కథానాయిక బాబాయి ప్రేమగాథలు, రాకుమారుడి భార్య పాత ప్రేమకథలు… ఇలా ఎన్నో ఉపకథలు వివరంగా చిత్రింపబడ్డాయి. అన్నీ ప్రేమ కథలే. దాదాపు అన్నీ త్రికోణపు ప్రేమలే. కొన్నిట్లో స్త్రీలు ఇద్దరు పురుషులతో ఏకకాలంలో ప్రణయం నడపగా, మరికొన్నిటిలో పురుషులు ఏకకాలంలో ఇద్దరితో ప్రేమాయణాలు నడుపుతారు. మొత్తంగా ‘ప్రేమ’ అనే పదం ఆ ఉన్నతవర్గాల్లో ఎలా నిజాయితీ రాహిత్యానికి, అవకాశవాదానికి, వివాహాలభగ్నతకూ సంకేతంగా నిలిచిందో సోదాహరణంగా వ్యాఖ్యానిస్తుంది రచయిత్రి.
చారిత్రక సత్యాలు పాక్షికమే
ఈ నవలను తొలి చారిత్రక నవల అని ఫ్రెంచి పండితులు ప్రకటించుకున్నారు. నవల రచనా కాలం 14వ లూయీ (Louis XIV) పరిపాలిస్తున్న 17వ శతాబ్ది (1678). నవలలో కథాకాలం రెండో హెన్రీ పరిపాలిస్తున్న 16వ శతాబ్ది (1558). నవలలో రాజు, అతని భార్య కాథరీన్ దె మెడిసి, ప్రియురాలు డచెస్ దె వాలంటిన్వా, అతని అనంతరం రాజయ్యే కొడుకు ఫ్రాఁస్‌వా I, అతని భార్య మరీ స్టువర్ట్, కథానాయకుడు డ్యూక్ ఆఫ్ నిమూర్, కథానాయిక బాబాయి విదేమ్ మొదలైన వారందరూ చారిత్రక పాత్రలే. వాళ్ళ స్వరూపస్వభావాలు కూడ రచయిత్రి నిర్దుష్టంగా, చరిత్ర ఆధారంగానే చిత్రించింది. రెండో హెన్రీ మరణ ఘట్టాన్ని విపులంగా, వాస్తవికంగా చిత్రించింది. ద్వంద్వయుద్ధక్రీడను అభిమానించిన రాజు, అందరూ వద్దంటున్నా వినకుండా ఒక సందర్భంలో కత్తియుద్ధం ‘ఆడి’ ఆ ఆటలో కత్తి కంటికి తగిలి, అది ఇన్‌ఫెక్షన్‌గా మారి 1559లో మరణించాడు. ఆ సన్నివేశాన్ని యథాతథంగా రచయిత్రి చిత్రించింది. ఫ్రెంచి, ఇంగ్లండ్, స్కాట్లండ్‌ల మధ్య జరిగిన రాజకీయ ‘వివాహాలు’ కూడ స్పష్టంగా ఈ నవలలో చిత్రింపబడ్డాయి.
రెండో హెన్రీ రాజభవనంలోని స్త్రీపురుషుల సంబంధాలే నవలలో ప్రధాన కథ. ఇక్కడ ఆ రాజ్యంలో ఉన్నంత అందమైన స్త్రీపురుషులు మరెక్కడా లేరని వర్ణించడం చరిత్రకు అతిశయోక్తిని జోడించడమే. అందరూ అద్భుతంగా మాట్లాడతారు, అతి సౌందర్యవంతులు. అలాంటి అందాల సభలోనూ తన సౌందర్యానికి ఎవ్వరూ సరితూగరన్నంత అందగత్తె కథానాయిక ప్రిన్సెస్ దె క్లేవ్. కథానాయిక, కథానాయకుడు – వీళ్ళిద్దరి వర్ణనలో రచయిత్రి అతిశయోక్తికి ఏ మాత్రం సందేహించలేదు. వైభవోపేతమైన యుగంగా దాన్ని అభివర్ణించే సమయంలో రాజుగారిలోని గొప్ప లక్షణాలు, అతని ఆస్థానంలోని రంగరంగ వైభవాలను చాలా వరకు యథార్థదృష్టితోనే చిత్రించినా, ఆ రోజుల్లో మతపరంగా తలెత్తిన సంఘర్షణలను రచయిత్రి పూర్తిగా వదిలిపెట్టింది. కేథలిక్ మతాధికారుల ‘అతి’ని వ్యతిరేకిస్తూ, ప్రొటెస్టెంటిజమ్ ఊపిరిలూదుతున్న కాలమది. దాన్ని దారుణంగా అణచివేసిన రాజుల్లో రెండో హెన్రీని కూడ ప్రముఖంగా చెప్పుకోవాలి. (ఫ్రాన్స్ ప్రొటెస్టెంటు మతం జాన్ కాల్విన్ ప్రారంభించిన కాల్వినిజమ్‌కు చెందుతుంది. దీన్ని అనుసరించేవారు హ్యూగెనాట్స్). చివరికి తన ఆస్ధానంలో ఉన్న మంత్రులైనా సరే నాలిక పీకించడం, సజీవదహనం వంటి శిక్షలు విధించేవాడు.
నిజానికి ప్రొటెస్టెంట్ల అణచివేత రచయిత్రి జీవించిన కాలంలోనూ (14వ లూయీ పాలన) కొనసాగి చివరకు వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కానీ ఈ మతపరమైన చరిత్ర నవలలో ఎక్కడా ప్రస్తావనకు రాదు. అంటే రచయిత్రి చరిత్రను కూడ తన కథావస్తువుకు అవసరమైనంత వరకే ప్రస్తావించింది కానీ, పూర్తి చారిత్రక వాస్తవికత నవలలో లేదు.
ఒకరకంగా చూస్తే, రెండో హెన్రీ పాలనలో రాజాస్థానాన్ని ‘అద్భుతంగా’ కనిపిస్తుందని చెప్పడంలో కొంత ఐరనీ ఉందేమో అనిపిస్తుంది. మదామ్ షార్త్ తన కూతురితో చెప్పే మాటల్లో ఈ నిజం ధ్వనిస్తుంది: ‘ఈ రాజ్యంలో పైకి కనబడేవన్నీ నిజాలనుకోకు. ఇక్కడ అంతా పైకి వైభోగం; లోపలంతా డొల్లే.’
మనస్తత్వ చిత్రణలో అసామాన్యప్రతిభ
ఈ నవలలోని ప్రత్యేకత మనస్తత్వ చిత్రణలో ఉంది. ప్రేమ, కోరిక అన్నవి స్త్రీపురుషులిద్దరిలోనూ సమానమైన తీవ్రతలో ఉంటాయనీ, దానికి వివాహంతో, సమాజనియమాలతో, నైతిక విలువలతో ప్రమేయం ఉండదనీ ప్రభావవంతంగా చిత్రించిన నవల ఇది. కానీ సామాజికనియమాలే స్త్రీపురుషుల ప్రణయానికి వేర్వేరు నిర్వచనాలు, నియమావళులూ ఏర్పరుస్తాయన్న వాస్తవాన్ని కూడ నిరూపిస్తుంది ఈ నవల.
ఇందులో ప్రధాన కథ ముక్కోణపు ప్రేమ. భార్యాభర్తల మధ్య అనురాగం కరువైనపుడు, అక్కడ ప్రేమ ఏకపక్షం అయినపుడు, రెండోవారి అన్వేషణ ఎలా ఉంటుంది? అది ఫలించినా, దాన్ని సంతృప్తిపరుచుకోలేని ఆవేదన ఎటువంటిది? అన్న ప్రశ్నలను ఈ నవల రేకెత్తిస్తుంది. వివాహేతర సంబంధాలు నిర్విఘ్నంగా, రహస్యంగానైనా కొనసాగుతున్న సమాజంలో, రాచరిక వ్యవస్థలో, ‘తను అందరిలా ఉండకూడదని’, భర్తను ప్రేమించలేకపోయినా అతని స్మృతికి కూడా అగౌరవం తీసుకురాకూడదని భావించిన కథానాయికకు మానసిక సంఘర్షణ మరింత ఎక్కువ ఉంటుంది. నాయిక లాగే, ఆమె ప్రేమించిన డ్యూక్ కూడా, వివాహిత అయిన స్త్రీని ‘ప్రేమించడం’ తప్పు కాకపోయినా, అది వ్యక్తం చేయడం తప్పని, ఆమెను ఆశించడం అనుచితమనీ భావించే సంస్కారం ఉన్నవాడు. అందువల్ల అతని మానసిక సంఘర్షణ కూడ తక్కువేమీ కాదు. అందుకే భర్త జీవించినంతకాలం ఆమెతో ప్రత్యక్షంగా, వాచ్యంగా తన ప్రేమను ప్రకటించడు. భర్త మరణానంతరం, సంతాపదినాలు ముగిశాకే ఆమెను కలిసి, తన ఆరాధనను వ్యక్తం చేస్తాడు. తన భార్యకు తన మీద ప్రేమ లేదని మొదటినుంచి తెలుస్తూనే ఉన్నా, ఇద్దరికీ సరిపడా తనలో ప్రేమ ఉందన్న ధీమాతో ఉన్న ప్రిన్స్, ఆమె మరొకరిని ప్రేమిస్తున్నదని తెలియగానే విపరీతంగా చలించిపోతాడు. అప్పుడు కూడ భార్యను పెద్దగా నిందించడు. మరణం ఆసన్నమైనపుడే తన మనోభావాలను వ్యక్తం చేస్తాడు. మొదటిసారిగ భార్యను తీవ్రపదజాలంతో నిందిస్తాడు.
ఈ ముగ్గురి మానసిక సంఘర్షణను రచయిత్రి చాలా నేర్పుతో చిత్రించింది. ఎవరూ కూడ సంస్కారపుపరిధిని దాటి ఆలోచించరు; మాట్లాడరు. ముగ్గురూ తమ కోరికలను, ఆవేదనను అణచుకోడానికే ప్రయత్నిస్తారు. ఇక అణచుకోలేని స్థితికి చేరుకున్నప్పుడు అది తీవ్రరూపంలో బయటపడుతుంది. అందరికీ విషాదాన్నే మిగిలిస్తుంది.
నవలలో చాలా ఆసక్తికరమైన సన్నివేశం, ప్రిన్సెస్ తన భర్తకు మరొకర్ని ప్రేమిస్తున్నానని, అతను అడక్కుండానే చెప్పిన సందర్భం. ఆమె వయసు స్త్రీలు (ఆమెకు అప్పటికింకా 20ఏళ్ళ లోపే) పారిస్‌లో విందువినోదాలకు, రకరకాల నాట్య, సంగీత, చిత్రకళా ప్రదర్శనలకు ఉత్సాహంగా వెళ్ళడం పరిపాటి. ఆమె కూడ ఒకప్పుడు అలా వెళ్ళిన మనిషే. అయితే డ్యూక్ పైన ప్రేమ మొదలైనప్పటినుంచీ, అలా వెళ్ళడం మానివేస్తుంది. ఎందుకంటే అతను అనివార్యంగా ఆ విందుల్లో ఉంటాడు. అతన్ని చూడగానే తనని తాను నిగ్రహించుకోవడం కష్టమవుతుంది. కనక వెళ్ళకపోవడమే మేలనుకుంటుంది. ఇలా అన్ని సరదాలనూ కాదని, ఒంటరిగా ఉండడమే బాగుంటుందనీ పదే పదే చెబుతున్న భార్యమీద ప్రిన్స్‌కి అనుమానం వస్తుంది. ‘ఎప్పుడూ ఒంటరిగా ఉండే వయసేనా నీది? ఎందుకింత విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? ఎవర్నో తప్పించుకుంటున్నదానిలా?’ అని ప్రశ్నిస్తాడు.
ఇక అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయమే ఆమె జీవితాన్ని మార్చేస్తుంది. ఇంకా సాకులు చెప్పడం ఇష్టం లేక ‘బహుశా ఏ భార్యా భర్తతో చెప్పని విషయం చెబుతున్నాను. నేను ఎక్కడికీ రాలేకపోవడం నామీద నాకు నియంత్రణ లేకపోవడం వల్లనే. నా మనసును నేను అరికట్టుకోలేకపోవడం వల్లనే. కానీ… ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నేను ఆలోచనల్లో తప్పిదం చేస్తున్నానేమో కాని, నా చర్యల్లో మాత్రం వేలెత్తి చూపేలా ప్రవర్తించనని హామీ ఇస్తున్నాను. నా భావనలను క్షమించి, ఇంకా మీరు నన్ను ప్రేమించగలిగితే అదే నాకు పదివేలు’ అంటుంది. దానితో నిర్ఘాంతపోయిన భర్త, ఆమె మనసును నిగ్రహించుకోలేని స్థితికి తెచ్చిన ఆ పురుషుడెవరో చెప్పమంటాడు. ఆమె చెప్పదు. ‘నా మనసు మరొకరిపై ఉందని చెప్పాను. మీకు అది తెలిస్తే చాలు. అతని పేరు చెప్పడం ఎందుకు? అయినా నా మనసు మాత్రమే దారి తప్పింది. నా చేతలు నా నియంత్రణలోనే ఉన్నాయి. అతనికి కూడ ఇంతవరకూ నా భావాలు చెప్పలేదు’ అని నిక్కచ్చిగా చెప్పి ఇక అంతటితో ఆ విషయాన్ని వదిలేయమంటుంది. అయితే అక్కడి నుంచీ పరిశోధన చేసి భర్త కనిపెడ్తాడు.
నవలలో సంభాషణలన్నీ ఇలాగే ఎంతో సహజంగా, మాట్లాడుతున్న వ్యక్తి అంతరంగాన్ని ఆవిష్కరించే విధంగా ఉంటాయి. ఈ నవల అంతరంగచిత్రణకు ప్రసిద్ధం కావడానికి మరో కారణం వ్యక్తుల మధ్య సంభాషణలను ఎంత వివరంగా, నిశితంగా చిత్రించిందో, వారి ఆలోచనలను కూడ అంతే సమర్థంగా చిత్రించడం. ఇందాకే చెప్పినట్టు నవలలో అనేక ఉపకథలు (ప్రేమాయణాలు) ఉన్నాయి. ఒక దశలో విదేమ్, మరో స్త్రీకి రాసిన లేఖ, డ్యూక్ తన గురించి రాసిన లేఖ అనుకుని ప్రిన్సెస్ పడిన మనోవ్యథ కూడ నవలలో గొప్ప సన్నివేశాల్లో ఒకటి. ఇలా వ్యక్తుల బాహ్య ప్రవర్తనను, వారి ఆంతరంగిక చిత్రణను అత్యంత స్వాభావికమైన శైలిలో రచించిన మదామ్ ది లఫాయెత్ ప్రేమకథలకు చక్కని ఒరవడిని చూపిందని అనిపిస్తుంది.
నైతికమా, కర్తవ్యమా, ఆత్మప్రబోధమా?
కథానాయిక నవలాంతంలో తను ప్రేమించిన డ్యూక్‌ని వివాహం చేసుకోవడానికి నిరాకరించడం అవివేకంగా అతనికే కాదు; పాఠకులకూ అనిపిస్తుంది. భర్త మరణించాక కూడ ఆమె తన ‘నైతిక ప్రవర్తన’ గురించి ఎందుకు ఆలోచిస్తోంది? ఇప్పుడది అనైతికం కాదు కదా అనే ప్రశ్న అందరికీ తలెత్తుతుంది. కొందరు ఫ్రెంచి విమర్శకులు మదామ్ దె లాఫయట్ ‘నైతిక విలువలు ప్రచారం చేయడానికి ఈ నవల రాసినట్లు’ కూడ భావించారు. కానీ లోతుగా చదివితే, నవలంతటా, కథానాయిక తనకు సరైనదని అనిపించిన పద్ధతిలోనే ఆలోచించింది కాని, కేవలం కొన్ని నియమాలకు లోబడి కాదని అనిపిస్తుంది. దీనివెనక తల్లి ఆలోచనలుండవచ్చు. కానీ అవే పనిచేసి వుంటే భర్తకు తను మరో పురుషుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పివుండేది కాదు. అలా చెప్పడం ద్వారా, అంతవరకూ తను కూడ ఆమోదించడానికి ఇష్టపడని భావనలను ఒప్పుకున్నట్టే అయింది. చివరి సన్నివేశంలో డ్యూక్‌తో మాట్లాడుతున్నప్పుడు ఆమె పదే పదే ‘కర్తవ్యం’ (డ్యూటీ) అన్న పదం వాడుతుంది. అతన్ని వివాహం చేసుకోకుండా ఉండడం, తన భర్త, తల్లి స్మృతులను గౌరవించే తన విధ్యుక్త ధర్మంలో భాగం అన్నట్టుగా మాట్లాడుతుంది.
ఈ విధ్యుక్త ధర్మం అన్న పదం వాడడం ఒకరకంగా తనని తాను మభ్యపెట్టుకోడానికే అనిపిస్తుంది. నిజానికి కాళిదాసు చెప్పిన ‘అంతఃకరణ’ ఆమె ప్రవర్తనకు ముఖ్య కారణంగా తోస్తుంది. తను డ్యూక్‌ని వివాహం చేసుకుంటే ఖండించడానికి తల్లి గాని, భర్తగానీ జీవించిలేరు. ఇంకా నిండా 20ఏళ్ళు కూడా దాటని తను భర్త మరణించాక మరో వివాహం చేసుకోవడాన్ని సమాజం కూడ అభ్యంతరపెట్టదు. ఇక్కడ ఆమెని ఆపుతున్నదెవరు? కేవలం తన అంతరాత్మ. ఆమెకు మనసొప్పడం లేదు అతన్ని వివాహం చేసుకోడానికి. మొదట్లో అతనికి తన ప్రేమను వ్యక్తీకరించడానికి ఎలా తన మనసు అంగీకరించలేదో, భర్తను ప్రేమించడానికి ఎంత ప్రయత్నించినా ఎలా తన మనసు అంగీకరించలేదో, అదే మనసు ఈరోజున తన ప్రియుడిని వివాహం చేసుకుని, సుఖంగా జీవించడానికి కూడ అంగీకరించడంలేదు. మొదటినుంచీ తన ఆత్మప్రబోధాన్నే నమ్ముకున్న ప్రిన్సెస్ దాని ప్రకారమే నడుచుకుంటుంది చివరి వరకూ.
ఇంకా తగ్గని స్పందన
నవల వచ్చిన వెంటనే 17వ శతాబ్దిలో సంచలనం సృష్టించడమే కాక, 19వ శతాబ్ది ఫ్రెంచి రచయితలను కూడ ప్రభావితం చేసింది. 20వ శతాబ్దిలో ప్రముఖ ఫ్రెంచి రచయిత ఆంద్రే జ్యిదెని (André Gide) పది అత్యుత్తమ ఫ్రెంచి నవలల పేర్లు చెప్పమన్నప్పుడు ఆయన మొదటి స్థానం స్టెంధాల్‌కు ఇచ్చి, తర్వాతి స్థానం మరీ-మాడలీన్ రాసిన ఈ నవలకు ఇచ్చాడు. అంటే అతని ఉద్దేశంలో 19వ శతాబ్దిలో గొప్ప నవలలు రాసిన బాల్జాక్ (Honoré de Balzac), గుస్తావ్ ఫ్లోబేలను (Gustave Flaubert) కూడ వెనక్కి నెట్టేసింది మదామ్ దె లాఫయట్!
ల ప్రిన్సెస్ దె క్లేవ్ మీద చర్చ 21వ శతాబ్దిలో కూడా ఆసక్తికరంగా కొనసాగింది. 2006లో ఫ్రెంచి అధ్యక్షుడిగా కాబోతున్న నికొలాస్ సర్కోజీ ఈ నవలను సివిల్స్ పరీక్షల్లో పాఠ్యాంశంగా పెట్టడం హాస్యాస్పదమని హేళన చేశాడు. వెంటనే ఫ్రెంచి సాహిత్యకారులు అతని మీద ధ్వజమెత్తారు. 2009లో విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో ఈ నవలమీద విస్తృతంగా చర్చలు, నవలలోని భాగాలను విద్యార్థులు బహిరంగ సభల్లో చదవడం వంటి నిరంతర కార్యక్రమాలను రచయితలు, సాహిత్య అధ్యాపకులు చేపట్టారు.
ఈ నవల చలనచిత్రంగా, రేడియో నాటికగా, రంగస్థల నాటికగా కూడ రూపాంతరం చెందింది. ప్రజాకళారూపాల్లో కంటే నవలగా పాఠకుల ప్రశంసలు ఈనాటికీ అందుకోవడం చెప్పుకోదగ్గ విషయం. ఇంగ్లీషులో కూడ ఈ నవలకు ఎప్పటికప్పుడు కొత్త అనువాదాలు వస్తూనే ఉన్నాయి.
మొత్తం మీద, పాత్ర చిత్రణలో, సన్నివేశకల్పనలో, కథనాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించడంలో, ప్రేమలో నైతికతపై, కర్తవ్యంపై ఆలోచనలు రేకెత్తించడంలోనూ మదామ్ దె లాఫయట్ సంపూర్ణంగా సఫలమై, అనంతర రచయితలకు ఒక మార్గాన్ని వేసిందని చెప్పవచ్చు.