ఆ వార్త కుదుపుకు
బాధ ముసురు పట్టింది
కాలం వెనక్కి నెట్టింది
‘అయ్యో’ అన్న క్షణకాలంలో
విషాదం మనసును కోసుకుపోయింది.
గొంతు విరిగి మాట రాలిపడి
మాటలో శ్వాసను ముడుచుకున్నా
అడుగు అటువైపు వేయడానికి
గాయం అడ్డుతగిలింది
మచ్చ తొంగిచూసి
మనసు నిలదీసింది.
ఒకనాడు ముఖం చీల్చుకొని
దూసుకొచ్చిన ఒకే ఒక్క మాట.
సహనాన్ని ఢీకొట్టి రాలిపడ్డ
శకలాలు ఇప్పటికీ సజీవాలే…
తనువు తగులపడిపోబోతున్నా
దేహం చాటిన అహం చూపిన ఫలితం
మాటల నిప్పుకణిక ఆరకపోవడం
పగ సెగ ఇంకా తగ్గకపోవడం.
మనసును వదలి అప్పుడు
ప్రాణం విడిచి ఇప్పుడు
తేడాను చూపలేని శత్రుత్వం
మరణసమయంలోనూ వెనక్కి తగ్గలేదు.
మనిషి చిత్రంలో
నిన్న జీవమై
నేడు శవమై
భీకర నిశ్శబ్దంలో అంతా శూన్యం.
వాలిన కన్నులు
తెరదించిన నాటకంలో
మిగిలిన కథలో మెదులుతూ
నడిచే కాలమూ జీవితమే.
గొంతు నడిచిన చప్పుడు
ఎప్పుడూ కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది
దారి పొడవునా వినిపిస్తూనే ఉంటుంది.
మనిషి మోసిన పాపమే
తనను మోసే శాపమై
వేకువలోనే తెల్లారిపోయింది.
ముఖం వాకిలి శాశ్వతంగా మూసేసి.