హేలగా… ఆనంద డోలగా…

హేలగా… ఆనంద డోలగా… అనే కథాసంపుటిలో సంప్రదాయ సిద్ధాంతాలు అనే బలమైన పునాదిరాళ్ళపై నిల్చుని ఆధునిక సమస్యలకు పరిష్కార మార్గాలను చూపిస్తారు శ్రీవల్లీరాధిక. సంప్రదాయం, ఆధ్యాత్మికం వంటి అంశాలపై అభిమానం ఉన్నవారు సైతం, ఆ అభిమానాన్ని బాహాటంగా ఒప్పుకోలేని రోజులివి. ఆధునిక దృక్పథం అంటే అయితే కమ్యూనిస్టు భావజాలమో లేదా ఏదో వాదానికి కొమ్ముకాయడమో! అటువంటి దృక్పథం ఉన్నప్పుడే రచయితకు/విమర్శకుడికి గౌరవం, ఆ పై అవార్డులుగా ఉన్న పరిస్థితులు. ఈ రోజుల్లో ఇలాంటి కథలను రాయడం, రాసి అందరి మెప్పు పొందడం కష్టసాధ్యమైన పనే అయినా ఈ విషయంలో సంపూర్ణంగా సఫలీకృతులయ్యారు రచయిత్రి.

ఎటువంటి కథలు రాయాలో, దేనిని కథావస్తువుగా ఎన్నుకోవాలో, ఎవరిని ప్రధానపాత్రగా నిలబెట్టి అగ్రతాంబూలమివ్వాలో అన్న విషయంలో రచయిత్రికి ఉన్న స్పష్టత అభినందనీయం. ఈ సంపుటిలో ఉన్న ధీర రచయిత్రి రచనాదృక్పథాన్ని తెలిపే కథ. శ్రీశ్రీ, తిలక్ వంటి వారు స్వయంగా తమ కవితల్లో ఏదో ఒక చోట తమ కవితాదృక్పథాన్ని చెప్పుకున్నారు. అయితే కవిత ఆత్మాశ్రయం కనుక ఆ వీలుంది. కథలో అటువంటి అవకాశం తక్కువ. ప్రత్యేకించి అలా చెప్పుకున్నా అది పాఠకులకు విసుగు తెప్పించే ప్రమాదమే ఉంది. కాని శ్రీవల్లీరాధిక తన రచనాదృక్పథాన్ని చెప్పుకుంటూ పాఠకాకర్షణీయంగా మలిచారు ఈ కథను. ఈ కథ రచయిత్రి రచనాదృక్పథంగా చెప్పుకోవడం సత్యదూరం కాబోదు. ఎందుకంటే ఇందులో ప్రస్తావించబడిన పాత్రలు సంధ్య, ప్రియ, నిత్య, అరుణ, సత్యం–ఇవన్నీ ఆవిడ ముందు కథా సంపుటాలలోని పాత్రలు. మాధవ్–ఈ కథా సంపుటిలో అహం కథలోని పాత్ర.

ఈ కథలో రచయిత్రి చెప్పినట్టుగా, ఆవిడ తన కథలలో సాధారణంగా బలహీనతలున్నవారిని నాయకులుగా/నాయికలుగా నిలబెట్టరు. ఆవిడ కథలలో నాయకులు/నాయికలు స్థిరగంభీరులు, ధీరులు. బలహీనులు, సామాన్యులు నాయకులుగా పనికిరారా? అంటే వాల్మీకి మహర్షి కావ్యరచనకు శ్రీకారం చుడుతూ, దొరికిన ఏదో ఒక ఇతివృత్తం తీసుకుని, కనిపించిన ఏదో ఒక వ్యక్తిని నాయకుడిగా ఎంచుకుని రాసేయాలనుకోలేదు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్– ఇపుడు లోకంలో గుణవంతుడు, ధీరవంతుడు ఎవడు? ఇలా ప్రశ్న వేసుకుని పదహారు కళ్యాణగుణాలన్నీ కలవాడైన వ్యక్తిని గూర్చి తెలుసుకుని ఆ వ్యక్తి కథను పదికాలాల పాటు ప్రజలందరూ చదువుకోదగ్గ రామాయణంగా రూపొందించాడు. ఎందుకని? ఆ కాలంలో బలహీనతలున్నవారు లేరా? ప్రతీ యుగంలోనూ వాళ్ళూ ఉన్నారు, వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాని ఆదర్శంగా తీసుకోవలసిన వాళ్ళెవరు? యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనాః అని గీతాచార్యుడి వాక్కు. ఉత్తముడు దేనిని ఆచరిస్తాడో లోకమంతా దానినే ఆచరిస్తుంది. కనుక ఉత్తముల కథలు ప్రజల మనసులో ముద్రపడితే వారేం చేశారో అదే ఆదర్శంగా తీసుకోవడానికి అది ప్రేరణనిస్తుంది. వారి కథలు చదవగా, చదవగా ఆ సంస్కారమేదో వాసనా రూపంలో పాఠకునిలో నిక్షిప్తమై, అంతస్సంస్కారమై తప్పు చేసే ముందు నిగ్రహిస్తుంది, మార్గనిర్దేశం చేస్తుంది.

ఈ కథలుకూడా ఊరికే చదివి వదిలేసేవి కావు. మళ్ళీమళ్ళీ చదవవలసినవి. చదివి నేర్చుకోవలసినవి. సంపుటిలో కొన్ని కథలు లౌకికమైన అంశాలను చర్చించేవైతే, కొన్ని సంప్రదాయబద్ధమైనవి, మరికొన్ని ఆధ్యాత్మికపరమైనవి.

ఈ కథా సంపుటిలో ప్రతీ కథ జీవితాన్ని ఒక కొత్తకోణంలో పరిచయం చేసేదే! ‘అరే! నేనిలా ఆలోచించలేదే!’ అని పాఠకులు అనుకునేలా చేసేదే! ఉదాహరణకు, ‘నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరగడమనేది చిన్నతనంలోనో, అవతలివాడు మరీ బలవంతుడయినపుడో ఉపయోగించాల్సిన ఉపాయం అయితే కావచ్చు కాని మన వ్యక్తిత్వంగా మార్చుకోవాల్సిన లక్షణం కాదు.’ అని చెబుతుంది, నొప్పించే నిజం అనే కథానిక. “నిజాయితీగా చేసినంతవరకూ ప్రశంసకీ, విమర్శకీ కూడా ప్రాముఖ్యతనివ్వాలి. అహంకారంతో రెండోదాన్ని పట్టించుకోకపోవడమూ కరెక్ట్ కాదు.. మొహమాటంతో మొదటిదాన్ని తేలికచేయడమూ సరికాదు” అనే అంశాన్ని చక్కగా చిత్రించింది ‘అతిశయం’ కథ. సమాజాన్ని నిశితంగా పరిశీలించి, సమస్యగా సాధారణంగా ఎవరూ గుర్తించని అంశాలను తీసుకొని, పాఠకుడితో భుజాలు తడుముకునేలా చేసే కథన చాతుర్యాన్ని కథలలో ప్రదర్శిస్తారు రచయిత్రి.

ఈ రోజుల్లో దూసుకుపోవడం, తెగించడం వంటి లక్షణాలకున్న గుర్తింపు సర్దుకుపోవడం, ఓపిక పట్టడం వంటి లక్షణాలకు రావడం లేదు. ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మొదటి సెట్‍తో ఎవరికి వారే సుఖపడతారు రెండవ సెట్‍తో చుట్టూ వారు సుఖపడతారు. సమాజంలో సమర్థత, ఆర్థిక స్థాయి పెరిగే కొద్దీ పక్కవాడి అసమర్థతను వెక్కిరించడం, తెలియనివాడి అజ్ఞానానికి నవ్వుకోవడం లాంటి ధోరణులు పెరుగుతున్నాయి కాని, ‘సమర్థత పెరిగే కొద్దీ తోటివారి అజ్ఞానాన్ని సహించే శక్తీ, అవినీతిని ఎదుర్కొనే శక్తీ పెరగాలేమో’ అన్న సూచన చేస్తుంది ‘సమర్థులు’.

సమాజంలో కొన్ని అంశాలపట్ల మన దృష్టి ఎప్పుడూ ఏకపక్షంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక స్త్రీ, ఒక మగవాడు ఘర్షణ పడితే, సానుభూతి స్త్రీవైపే ఉంటుంది. డబ్బున్నవాడు, పేదవాడు గొడవ పడితే, తప్పు డబ్బున్నవాడిదే. ఇంట్లో తండ్రీ కొడుకుల మధ్య మాటామాటా పెరిగితే కొడుకుదే అహంకారం. ఇలా సాధారణీకరిస్తాం. కాని ‘అహం’ కథ నాణానికి రెండో వైపును చూపుతుంది. ‘అహం’ కథలో మాధవ్ తన తండ్రి కట్టించిన ఇల్లును తన పేరు మీద రాయమని తండ్రితో గొడవపెట్టుకుంటాడు. ఆ రాయమనడం వెనుక మాధవ్ ఉదాత్తమైన ఉద్దేశమే అహం కథ.

‘మేలుకొలుపు’ ఈ కాలపు వ్యక్తిత్వ వికాస శిక్షణలలోని డొల్లతనాన్ని ఎత్తి చూపిస్తుంది. తనతో పాటు పదిమందిని ముందుకు తీసుకెళ్ళాలి అన్న స్పృహ కలిగించేదే వ్యక్తిత్వవికాసం కాని తానొక్కడనే దూసుకెళ్ళిపోవాలి అన్న స్పృహ కలిగించేది వికాసం కాదని, తిరోగమనమని, నిజమైన వ్యక్తిత్వ వికాసాన్ని అందించే వివేకానందుడిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఉద్బోధిస్తుంది.

కర్మణ్యే వాధికారస్తే… అన్న గీతాకారుడి బోధకు వ్యాఖ్యానప్రాయమైన కథ లక్ష్యం. నేటి రోజుల్లో పిల్లల్లో నెలకొన్న/పెద్దలు పాదుకొల్పుతున్న పోటీ తత్త్వాన్నిగురించి చర్చిస్తుందీ కథానిక. ఈ రోజుల్లో సర్వసాధారణమైన ఈ సమస్యకు ఆధ్యాత్మిక కోణంలో సమాధానం వెతికే ప్రయత్నం చేస్తుందీ కథ. ఆధ్యాత్మిక కోణం లౌకిక జీవితానికి ఎలా పరిపూర్ణత్వాన్ని ఇస్తుందో ఆలోచింపజేస్తుంది. ‘ఉన్న కర్తవ్యాన్ని నిర్వహించడం వేరు. లేని పోటీని నెత్తినేసుకోవడం వేరు’ అంటూనే ‘పోటీలో గెలవడం కాదు అసలు పోటీనే గెలవడమెలాగో’ చూపిస్తుందీ కథ.

‘హేలగా… ఆనంద డోలగా…’ ఈ కథా సంపుటికి పేరైన కథ. కళ తనకేమిస్తుందని ఒక కళాకారిణి ప్రశ్న వేసుకుంటుంది, దానికోసం ఆమె చేసిన ప్రయాణం, చివరగా తాను కనుగొన్న సమాధానం ఈ కథానిక ఇతివృత్తం. ‘అలౌకికానందాన్ని అందుకోవడం ఒక ఎత్తు. దానిని కళ ద్వారా మరొకరికి అందివ్వగలగడం ఒక ఎత్తు. కనుక కళతో సమాజోద్ధరణ చేయచ్చు. ఆత్మోద్ధరణ చేసుకోవచ్చు’ అని తెలుసుకుంటుందామె. ఆ తెలుసుకునే క్రమంలో ఆమె పొందిన గొప్ప అనుభూతి పాఠకుడికికూడా అనుభవైకవేద్యమవుతుంది. ఈ కథానికలో గోపికావస్త్రాపహరణ ఘట్టంలో గోపికల మానసిక స్థితిని అద్భుతంగా ఆవిష్కరించిన ఈ వాక్యాన్ని ప్రస్తావించకుండా ఉండలేను: ‘ఆనందమనే అయస్కాంతం అంత బలంగా లాగేస్తుంటే ఎందుకూ పనికిరాని అహాన్ని ఎంతసేపని మోస్తారు!’

కథలన్నిటిలో నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చినది ‘సాన్నిధ్యం’. ఈ కథ అనుభవించి పలవరించాల్సిందే కాని దీన్ని వ్యాఖ్యానించడానికి పూనుకోవడం సమంజసం కాదు. అనుభూతి ప్రధానమైన కథ అయినప్పటికీ ఆలోచన రేకెత్తించే అంశాలు కూడా ఎన్నో ఉన్నాయీ కథలో.

ఒక రచయిత సమాజంలో ఒకానొక పరిస్థితిని గమనిస్తాడు. అది అతనికి ఒక సమస్యగా తోస్తుంది. చేతిలో కథనసామర్థ్యం ఉండటం వలన దాన్ని కథావస్తువుగా మలచుకుని కథ రాసేస్తాడు. నిజానికి సమస్యగా కనిపించిన అంశాన్ని అన్ని కోణాలనుండి పరిశీలించడం, సమస్యో కాదో తేల్చుకోవడం జరగట్లేదు. దీనివల్ల బలాన్ని, బలహీనతగా, బలహీనతను బలంగా చిత్రించే పరిస్థితులు వస్తున్నాయి. రచయిత తన ఆలోచనలను ఒక కొలిక్కి తెచ్చేదాక ఇంకాస్త సంయమనం పాటించి రచన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది వివిక్తస్థ అనే కథానిక. ఒంటరితనాన్ని కోరి ఆశ్రయించడం అనేది ఒక రుగ్మతగా భావిస్తుంది ఈ కథానికలోని రచయిత పాత్ర. ప్రపంచంతో సంబంధం లేకుండా నిరంతరం తనలో తాను రమించే స్థితి ఒకటి ఉంటుందని, ఆ స్థితి సాధనద్వారా సాధించవలసిన స్థితే కాని బలహీనత కాదని తెలుసుకోవడం ఈ కథకు ఇతివృత్తం.

చీర కట్టుకుని సంప్రదాయబద్ధంగా కనిపించే ఆడవాళ్ళనే గౌరవించబుద్ధేస్తుంది. మోడర్న్ డ్రెస్సులు వేసుకునే వారిపట్ల గౌరవభావం కలగదు అనుకునేవాళ్ళకు చెంపపెట్టు సతీసావిత్రి అనే కథ. స్త్రీని గౌరవించడం మన సంస్కృతి కనుక గౌరవించాలి కాని వారి వస్త్రధారణ, వారి ప్రవర్తనను మనను ప్రభావితం చేయకూడదని సందేశమిస్తుంది. ఆధునిక కాలంలో అత్యంత హేళనకు గురయిన పతివ్రత అనే పదానికి ‘అవతలి వారి మంచి చెడులతోనూ, పరిస్థితులతోనూ సంబంధం లేకుండా తాము మాత్రం తమ ధర్మాన్ని నియమంతో నిర్వర్తించేవారు’గా చేసిన నిర్వచనం వారిని చూడాల్సిన కోణంలో చూపుతుంది. స్త్రీ సంఘాల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శించే వారికి కూడా సన్నగా చురకంటిస్తుంది ఈ కథ.

‘ఆలోచిస్తావా’ ఈ కాలపు అతి తెలివైన కోడళ్ళకు పాతకాలపు అమాయకపు అత్తగార్లు అంటించిన చురక. నాటకీయ దృష్టికోణంలో సాగిన ఈ కథ పాతకాలం పద్ధతులను నిరసిస్తూ తామే తెలివైనవాళ్ళమనుకునే ఆధునిక యువత చదవాల్సిన కథ. కాని పూర్తిగా ఏకపక్ష సంభాషణలతో కథ నడవడం వలన పాఠకునికి చదవడం కొంత విసుగు కలిగిస్తుంది.

గంభీరంగా సాగుతున్న కథల వరుసలో మనోహరుడు సరసంగా పలకరించే కథానిక. ‘అమ్మాయి వలచినపుడూ, వరించినపుడే అది శృంగార రసం లేదంటే వీరమో, భయానకమో, బీభత్సమో అవుతుంది కాని శృంగార రసం మాత్రం కాదు’ అని నేటి ప్రేమికులకు సందేశమిస్తుంది. ఓర్పు, సహనం వంటి లక్షణాలు ఎన్నటికైనా సత్ఫలితాన్ని ఇస్తాయని నొక్కి వక్కాణిస్తుంది. ఆటవిడుపు మంచి కాఫీ లాంటి కథానిక. సరదాగా సాగిపోతూనే, ప్రతి విషయాన్ని ప్లాన్ చేసుకుంటూ పోతే జీవితం ఎంతో నిస్సారంగా ఉంటుందనీ, ఒక్కోసారి మన ప్లానింగ్‌ను పక్కనపెట్టి ‘సంగతంతా దేవుడికి వదిలేస్తే ఆయన వేసే ప్రణాళిక మరింత బాగుంటుందనీ, దాన్ని అనుభవించడమే జీవితమనీ…’ చక్కటి సందేశమిస్తుంది.

రాసే ప్రతి ఒక్క వాక్యం మీద శ్రద్ధ పెట్టి, పాఠకులకు తెలియకుండానే రచయిత్రి తాను ఇవ్వదలచుకున్న సందేశాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు సరదా కథ అయిన ఈ ‘ఆటవిడుపు’లో నాయిక, కన్నెపిల్లల కలల రాకుమారుడు, తన సహోద్యోగి అయిన ప్రణవ్ తో పెళ్ళి కుదుర్చుకునే సందర్భంలో అతనిని అర్థం చేసుకోవడానికి మరుసటిరోజంతా అతడితో గడపడానికి ప్రోగ్రాం కుదుర్చుకుని తన సీటుకు తిరిగి వస్తుంది. ఈ సందర్భంలో మరో మామూలు నాయికైతే మరుసటిరోజును గురించిన తీపికలలలో మునిగిపోవడమో అలాంటిదే మరొకటో చేస్తుంది. కాని రాధికగారి నాయిక, ‘తన సీట్ దగ్గరకి వచ్చి ఉద్వేగం నిండిన మనసుతో పనికి’ ఉపక్రమిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ, భావోద్వేగాలమధ్య కూడా చేయవలసిన పనిమీద దృష్టి కోల్పోకూడదని అన్యాపదేశంగా చెప్తారు రచయిత్రి.

మతం ప్రజలకు మత్తు వంటిది అంటారు కొందరు. ఆధ్యాత్మికత పలాయనవాదాన్ని నేర్పుతుంది. ఉన్న సమస్యనుండి పారిపోయి ఒక భ్రాంతిలో బ్రతికేలా చేస్తుందన్నది వారి ప్రధాన విమర్శ. ఈ విమర్శకు సమాధానాలు రాధికగారి కథలలో కనిపిస్తాయి. నిజానికి ఆధ్యాత్మికత పలాయనవాదుల్ని తయారుచేయదు కర్తవ్యోన్ముఖుల్ని చేస్తుంది. ఆధ్యాత్మికత ఉన్నవారు, నిజంగా ఆధ్యాత్మికతను అనుష్ఠించేవారు కర్తవ్యోన్ముఖులుగా ఉంటారు. పనిని వందశాతం శ్రద్ధతో చేస్తారు కాని దాని ఫలితాన్ని గురించి ఆందోళన చెందరు. దీనివల్ల ఒత్తిడి ఉండదు. వారు ప్రశాంతంగా ఉంటారు. చుట్టూవారిని ప్రశాంతంగా ఉంచుతారు.

ఈ సంపుటిలోని కథలన్నిటిలో దాదాపుగా ఆధ్యాత్మిక కోణం కనిపిస్తుంది. లౌకిక కథలలో పనికట్టుకుని ఆధ్యాత్మికతను ఎందుకు చొప్పించడం అన్న సందేహం పాఠకులకు కలిగితే దానికి సమాధానం కూడా ఓ కథలోని పాత్ర చేత చెప్పిస్తారు. ‘ఆధ్యాత్మిక ఆలోచనలు లేనివారికి ఆధ్యాత్మికమూ, లౌకికమూ వేరు కావచ్చు కాని ఆధ్యాత్మికవాదులయినవారికి… రెండూ ఒకటే కావాలి కదా.’ అయితే, ఇంత చక్కటి కథా సంపుటిలో అక్షరదోషాలు ఎక్కువగానే ఉండడం ఇబ్బంది పెడుతుంది.

ఇవి నిస్సందేహంగా పాఠకుల స్థాయిని పెంచే కథలు.


పుస్తకం: హేలగా… ఆనందడోలగా…
రచయిత్రి: శ్రీవల్లీ రాధిక
ప్రచురణ: ప్రమధ ప్రచురణలు, 2016
వెల: రూ. 150.00
లభ్యత: కినిగె, నవోదయ ఇంకా అన్ని పుస్తకాలదుకాణాలలో.