ఐసోలేషన్

ఒంటరి పక్కమీద
కనిపించని దిగులు
తడుముకునే కొద్దీ తగిలే ఒంటరితనం
గొంతులో మాట నోటిలోనే విరిగిపోతుంది
వెన్నెల కురుస్తున్నప్పుడు వర్షాన్ని కోరుకోవడాన్ని చీకటి ఒప్పుకోదు.
ఆప్యాయతలన్ని అరచేతి తెరమీద కనబడతాయి
ఒక కంటితో మాట్లాడుతూ ఇంకోదాంతో
నవ్వడం సాధన చేస్తేనే జీవితం అలవాటు అవుతుంది!

సంధి కాలంలో మనం తినే బియ్యం గింజలు
ఎవరింట్లో ఉన్నాయో తెలుసుకుంటేనే
ఆకలి ఎదురుతిరగకుండా బుద్దిగా మాట వింటుంది.

సూర్యుడూ చంద్రుడు ఇద్దరు ఎల్ఇడి లైట్ల లాగా
మారిపోయి అసహనపు కాంతిని వెళ్ళగక్కుతుంటారు
గుమ్మాలు దిగులుగా నిలబడతాయి
కళ్ళు కురుస్తున్న తడికి తలుపులు కిర్రుమని శబ్దం చేస్తాయి
ఎక్కడనుండి కాల్ వచ్చినా వార్త
ఏమైవుంటుందో అని చిన్నపాటి వణుకు
సందేశం ఏదైనా పిల్లలు మాత్రం వాళ్ళు
చప్పరిస్తున్న లాలీపాప్‌లా దాన్ని ఆస్వాదిస్తుంటారు
కలిసి ఉండడం ఇప్పుడు అమానుషం
మాటలు తప్పి పోయి వాటి నీడలు మాత్రమే మిగుల్తాయి
నెమరేసుకోవడానికి!

కలలు పాతిపెట్టబడి
కల్లోలాలు మొలుస్తున్న వేళ
ఐసొలేషన్ గది కిటికీ బయట
రెక్క విరిగిన సీతాకోక చిలుకలో
నన్ను నేను చూసుకుంటున్నా.