భారత స్వాతంత్ర్య సమరములు: 1757-1857

(ఈ వ్యాసపు మొదటిభాగంఇక్కడ; రెండవభాగం ఇక్కడ చదవండి.)

ఆదివాసుల యుద్ధములు: 1785-1858

ఇంగ్లీషువారు మనదేశమునకు రాకపూర్వము అమూల్యములైన ఖనిజ వృక్ష జంతు పక్షి సంపద తోడు అపూర్వ వస్తుజాలముతోను వివిధ ఆచారములుగల ఆదివాసులైన కొండ అడవి జాతులతో నిండియున్న మహారణ్యములనేకములు మనదేశములోనుండెను.

ఆంగ్లేయులీయాటవిక సంపదను చేజిక్కించుకొని లాభమును పొందుటకై అనేక ఉపాయములనాలోచించి అందలి యాటవిక జనమును నయమునను భయమునను మారుమూలలకు తరిమి, మహావృక్షములను ఛేదించి వన్యమృగములను వధించి అడవులలోని దంతములు కొమ్ములు చర్మములు దారువులను గృహనిర్మాణమునకు గృహోపకరణములకు పరిశ్రమలకు వైద్యమునకు పనికివచ్చు వివిధ వస్తుజాలమును తరలించి వానిని విక్రయించి వ్యాపారమువలన లాభములను పొందుచు తుదకాయడవులను తమ స్వంత ఆస్తిగా చేసికొని అందెవ్వరును ప్రవేశించకుండా వానిని ‘రిజర్వు ఫారెస్టులు’గాను సంరక్షిత అరణ్యములుగాను ప్రత్యేకింపు చేసి అనేక కఠినశాసనవిధులను నిర్మించి అమితలాభములార్జించిరి.

ఆంగ్లేయులు తుపాకులతో వేటాడుటవలన మనదేశములోని అడవియేనుగులు ఖడ్గమృగములు మొదలైన జంతువులును పక్షిజాతులును కొన్ని రూపులేకుండాపోయినవి. సింహములు, పెద్దపులులు మొదలైన వన్యమృగముల సంఖ్య తగ్గిపోయినది. వారు తరలించిన దారువులకు దంతములకు కొమ్ములకు చర్మములకు లెక్కలేదు. ఇంగ్లీషువారు వర్తకము చేయుచున్న కాలమున నీదేశీయ రాజులను నవాబులను ఆశ్రయించి ఈ ఆటవిక వస్తువులను తరలించి సర్వమక్తా వ్యాపారము చేయుచు దేశీయులతో పోటీచేసి వారికి జీవనాధారము లేకుండా చేసిరి.

ఆంగ్లేయులు రాజ్యాధికారము వహించగానే ఈ ఆటవిక సంపదను తరలించుటకై కొన్ని పద్ధతులనవలంబించిరి. దుర్గమారణ్యములనుండి ఆటవికుల ద్వారా ఈ వస్తుజాలమును తెప్పించుటకై అరణ్యములనానుకొనియున్న మన్యప్రాంతపు కొండదొరలను, జమీందారులను లోబరచుకొని వారికి చౌకబారు పేష్కషులిచ్చి మన్యపు గ్రామములకు పట్టాలిచ్చి వారి కుటుంబ వివాదములందు కలిగించుకొనుచు మిత్రభేదము చేయుచు ఆ జమీందారుల బలమును తగ్గించుటకు ప్రయత్నించుచు వారు తమ కిస్తీలను చెల్లించక బాకీలు పెట్టినప్పుడు వారిని జైలులో పెట్టి జమీందారీలనమ్మించుచు తాము చెప్పినట్లు విను ప్రాతజమీందారు వంశీయులగు క్రొత్తవారికి ఆ భూవసతులిచ్చుచు కుటిల రాజ్యతంత్ర ప్రయోగముచే ఆ మన్యపు ప్రాంతములపైన అధికారము వహింపజూచిరి. అవి అనారోగ్య ప్రదేశములైనందున ఆంగ్లేయాధికారులక్కడ నుంచి స్థిరమైన క్రమపరిపాలనమును స్థాపించుటకుగాని పోలీసు సిబ్బందినుంచుటకుగాని ప్రయత్నింపలేదు.

ఇంగ్లీషు కుంపినీవారి దుష్పరిపాలనమునందు జరుగుచుండిన అన్యాయముల వలన మన్యములోని కొండరాజులు జమీందారులు తరచుగా తిరుగుబాటుచేయుచు తమ పరిసరారణ్యములోని ఆటవికజాతుల నాయకుల దగ్గర తలదాచుకొనుచుండిరి. ఆ మన్యప్రాంతములందు కల్లోలములు కలిగినప్పుడు ఆటవికజాతులును తిరుగుబాటు చేయుచుండెను. వారినణచుటకై ఆ ప్రాంతములందు కుంపినీవారు మార్షల్ లా అను సైనికశాసన ప్రభుత్వమును ప్రవేశపెట్టి సైనికదళములనంపి యుద్ధములు చేయవలసి వచ్చుచుండెను.

ఇంగ్లీషుకుంపినీవారీ దేశమున రాజ్యాధిపత్యము వహించిన కొలదికాలమునందె అనగా 1785 మొదలు 1857లో ఇంగ్లీషువారినీదేశము నుండి తరిమివేయుటకై భారతదేశీయులు స్వాతంత్ర్యయుద్ధముచేసి విఫలులై నిరంకుశమైన బ్రిటీషు ప్రభుత్వ విధానము స్థాపింపబడువరకును గల మధ్యకాలమునందు ఉత్తర సర్కారులలోని మన్యములలో అనగా గోదావరి విశాఖపట్టణము గంజాము ప్రాంతములలోని కొండలు అడవులు గల అనారోగ్యప్రాంతముల యందలి జమీందారులు మోటుజనమగు కోయలు ఖోండులు మొదలగు ఆటవికజనమును, మధ్యరాష్ట్రము బస్తరు మొదలగు ప్రాంతములందలి గోండులును, వింధ్యపర్వతముల నుండి అలహాబాదు వంగరాష్ట్రమువఱకుగల అడవులందలి కోలుజాతివారును, వంగదేశము ఒరిస్సా రాష్ట్రములందలి సంతాలులు, అస్సాము రాష్ట్రమువైపునగల నాగజాతివారు మొదలైనవారును బొంబాయి అరావళీప్రాంతములందు గల భిల్లులును ఆంగ్లేయులతో పోరాడుచునేయుండిరి.

సర్ తామస్ మన్రో, జాన్ రస్సెల్ మొదలైన అనుభవజ్ఞులైన ఆంగ్లేయోద్యోగులీ తిరుగుబాటుల కారణములను విచారించి వానిని అణచివేయుటకు అవలంబింపవలసిన పద్ధతులను గూర్చి 1822-1837 మధ్య కుంపినీ దొరతనమువారికి వివేదికలంపిరి. దీని ఫలితముగా ఆటవికజనము నివసించు మన్యప్రాంతములను కుంపినీవారి రాజ్యములోని ఇతర రాష్ట్రములందు అమలుజరుగు సామాన్య శాసనవిధులకు లోబడిన ప్రభుత్వ విధానమును న్యాయపరిపాలనావిధానమును అమలుజరుపుట మాని గవర్నరులయొక్క ఉత్తర్వులకు లోబడి అవసరములైన చర్యలను తక్షణమే తీసికొనుటకు నిరంకుశాధికారముగల కలెక్టరు అపరిపాలనము స్థాపింపబడెను.

ఈ ఆటవిక జనులపైన కఠిన శాసనవిధానము ప్రయోగింపబడి ఒకవిధమైన సైనిక శాసన ప్రభుత్వము స్థాపింపబడెను. దీనికి నాన్‌రెగ్యులేషన్ ప్రావిన్సులని పేరుపెట్టిరి.

ఆదివాసులు భారతీయులకు భిన్నమైన ప్రజలనియు అమాయకులైన ఆటవికజనమును పరిసరప్రాంతములందలి నాగరీకజనము మోసగించి అక్రమలాభము పొందకుండా వారిని రక్షించి వారి క్షేమలాభములనాలోచించి పాలించుటకే ఈ విధానమును తామచ్చట స్థాపించుచున్నామని ఇంగ్లీషువారు చెప్పసాగిరి. ఈ మన్యప్రాంత జనులను తక్కిన ప్రాంతముల జనులనుండి వేరుపరచుటయెగాక మన్యప్రాంతములలోని ఆటవిక జనులలోని వివిధజాతులవారిని కూడా ఒకరినుంచి ఇంకొకరిని వేరుపరచి చీలదీసి పరిపాలింపసాగిరి. వీరిని అనాగరికులుగాను నేరముచేయు జాతులుగాను పరిగణించిరి.

పాశ్చాత్యులీప్రాంతములకు పోయి లాభము పొందుటకుగాని క్రైస్తవులక్కడకుపోయి వారిని కిరస్తానీ మతమున గలుపుటకుగాని ఎట్టి ఆటంకములు లేకుండెను.

భారతదేశములోని వివిధప్రాంతములందు వసించువారందరు భారతదేశీయులైననూ పారతంత్ర్యమునందిట్లనేక విధములైన కష్టములకు లోనైరి. ఇంగ్లీషువారు దేశీయులను వేరుపరచి పాలింపసాగిరి.

ఆంగ్లేయ ప్రభువులు ఆటవికజనమును క్రమక్రమముగా మారుమూలలకు పారదోలి వారికదివరకు హక్కుగల అరణ్యములనాక్రమించి వారికి కాపలా మనుష్యులను పెట్టి అక్కడనెవ్వరును చెట్లు కొట్టకుండా ఆటవిక సంపదకు సంబంధించిన వస్తుజాలమును తీసికొనిపోకుండా తగు కట్టుబాటులు చేసిరి. అరణ్యములను పరిపాలించుటకు 1847లో నొక ప్రత్యేక ప్రభుత్వశాఖనేర్పరచిరి. గవర్నరుజనరలైన డల్‌హౌసీ ప్రభువు దానినిగూర్చి ప్రత్యేక శ్రద్ధవహించి అనేక శాసనములనుగావించి 1855లో బొంబాయి మద్రాసు బర్మాలకు ఆటవిక శాఖాధ్యక్షులను నియమించెను.

ఆంగ్లేయ ప్రభుత్వకాలమునందు వారు చేయు అన్యాయములను సహింపక వారికెదురుతిరిగిన ప్రజాయుద్యమములన్నిటిని ‘పితూరీ’లని తిరుగుబాటులని ఆంగ్లచరిత్రకారులనుచుండిరి. అట్లే ఈ అరణ్యముల విషయములో వారు చేసిన అన్యాయములు సహింపక ఆదివాసులు చేసిన యుద్ధములను కూడా వారు పితూరీలనిరి.

ఆంగ్లేయపరిపాలన కాలమునందు భారతదేశములోని వైశాల్యములో రమారమి అయిదవవంతు 26013,9520 యకరముల భూమి అరణ్యముగానున్నది. ఇందులో చాలా భాగము ఇంగ్లీషువారు రిజర్వు ఫారెస్టుగాను కొంతభాగమును సంరక్షిత అరణ్యముగాను మిగిలినదానిని వర్గీకరణము చేయని అడవిగానుంచిరి. ఆంగ్లేయ ప్రభుత్వమునందు ‘రెగ్యులేషన్ ప్రావిన్సెస్’ అనబడు వివిధరాష్ట్రములందు అమలుజరుగు శాసనబద్ధమైన ప్రభుత్వవిధానముగాక గవర్నరు జారీచేయు ఉత్తరువులకు లోబడి కలెక్టరులు పరిపాలించు నిరంకుశ ప్రభుత్వవిధానము, సైనిక శాసన విధులవంటి కఠిన శాసనముల ప్రకారము పరిపాలింపబడు ప్రాంతములనేకములుండెను. వీనిని నాన్‌రెగ్యులేషన్ ప్రావిన్సులనిరి. తరువాత చేయబడిన భారతదేశ రాజ్యాంగ చట్టములందీప్రాంతములను మినహాయింపబడిన ప్రదేశములనిరి. ఇట్టి ప్రాంతములు భారతదేశములో మొత్తము 207900 చదరపు మైళ్ళ వైశాల్యము కలిగి 1300000 జనసంఖ్య కలిగియుండెనని రాజ్యాంగసంస్కరణలను గూర్చి విచారణచేసిన సైమనుకమీషనువారు 1929లో వ్రాసిరి. అయితే ఈ ప్రాంతములందంతయు నొకేవిధమైన నిరంకుశపరిపాలనము అమలుజరుపబడలేదు. కొన్నికొన్ని ప్రాంతములను పూర్తిగాను మఱికొన్ని ప్రాంతములను కొంతమట్టుకును సామాన్యశాసనబద్ధ ప్రభుత్వమునుండి మినహాయింపబడెను. వానినిట్లు వివరించిరి (Simon Commission Report pp 159-160):

రాజ్యాంగమునుండి పూర్తిగా మినహాయింపు చేయబడిన ప్రాంతములు:

  1. మద్రాసులో లక్కదీవులు, మినికోయ్ దీవులు
  2. వంగరాష్ట్రమున చిటగాంగు కొండప్రాంతములు
  3. పంజాబులో స్పిటి ప్రాంతము
  4. బర్మాలోని అన్ని వెనుకబడిన ప్రాంతములు
  5. బీహారు ఒరిస్సా రాష్ట్రములలో అంగుళ్ జిల్లా>/li>

గవర్నరు జనరలు గవర్నరుల ఏజెంటుల క్రింద పరిపాలింపబడునవి:

  1. మద్రాసులో మన్యపు ఏజెన్సీ ప్రాంతములు
  2. బంగాళమున డార్జిలింగు
  3. పంజాబులో లాహౌలు ప్రాంతము
  4. బీహారు ఒరిస్సాలలో ఛోటానాగపూరు, సంతాలు పరగణాలు. సంబలపూరు
  5. అస్సాములోని అన్ని వెనుకబడిన ప్రాంతములు*

ఆటవికజనుల తిరుగుబాటులు II – 1785-1858

1769 నుండి ఇంగ్లీషుకుంపినీవారు ఉత్తర సర్కారు జిల్లాలను పరిపాలించుట ప్రారంభించినది మొదలు కొండలను అడవులను ఆనుకొనియున్న మన్య ప్రదేశములందు పితూరీలు జరుగుచునేయుండెను.

1785లో గూటాల పోలవరము జమీందారీ గ్రామములందును పరిసరములందుగల కొండలలోను తిరుగుబాటులు జరిగెను. ఇంగ్లీషు కుంపినీవారు తమ  సైనికదళమునంపి గూటాల పట్టుకొనుటకు యుద్ధము చేయగా కొందఱు సిపాయిలు మరణించిరి.

1786-87లో పోలవరము గూటాల జమీందారీలలో జరిగిన కల్లోలములను పురస్కరించుకొని కొండజాతి ప్రజలు కూడా తిరుగుబాటుచేసిరి. కొండదొరల నాయకుడైన లింగారెడ్డి మొదలైనవారు యుద్ధముచేసిరి. కుంపినీ సిపాయిలు చాలామంది చచ్చిరి. అంతట పోలవరము జమీందారీలోనూ దాని పరిసరపు జిల్లాలలోను సైనికశాసన ప్రభుత్వము (మార్షల్ లా) ప్రవేశపెట్టిరి. కొత్తసైన్యములనంపి నిలువయుంచిరి.

1800 ఆగస్టు 11వ తేదీన గణపవరములో కుంపినీయధికారులొక యుద్ధాలోచన సభను చేసిరి. తరువాత తమ సేనను చీరువాకకంపిరి. పోలవరమునుండివచ్చు సేనను కొండజమీందారుడైన లింగారెడ్డి మనుష్యులు ప్రతిఘటించిరి. కుంపినీ సైనికాధికారికిని, ఒక సిపాయికిని గాయములు తగిలెను. యంతట కుంపెనీ సేనలు లింగారెడ్డి గ్రామములను తగులబెట్టి నాశనముచేసిరి. రంప ప్రాంతములోని ప్రజలను అణచియుంచుటకు కుంపెనీవారు కొత్తపల్లిలోను ఇందిగపేటలోను సిపాయిల దళములనుంచిరి.

1800 ఆగస్టు 28వ తేదీన కొండజాతివారొక దళముపైనపడిరి. 31వ తేదీన పండుదొరయనునతడు మూడునాలుగువందలమంది ఆయుధపాణులతో పోలవరమునకెదురుగానున్న పురుషోత్తమపట్టణమునకు వచ్చు కుంపినీవారి పడవలను పట్టుకొనెను. రాకపోకమార్గములనడ్డెను. ప్రజలు కుంపినీవారికి వ్యతిరేకులుగానుండిరి.

గోదావరి మన్యముల్లోనేగాక ఉత్తర సర్కారులలోని జిల్లాలలోని మన్యప్రదేశములందు నిరంతరముగా తిరుగుబాటులు జరుగుచున్నందున దీనికి కారణములను విచారించుటకు మద్రాసు గవర్నరైన సర్ తామస్ మన్రోగారు 1822లో పర్యటనముచేసిరి.

కిమిడిరాజాగారి జమీందారీలోని చాలా గ్రామములు అడవులలోనుండెను. ఆ గ్రామములలో కొన్నిటిని కిమిడి రాజాగారు కొండలకవతలనుంచి ఆటవికులు మొదలైనవారు వచ్చి కొల్లగొనకుండా కాపాడుటకై కొందరు బంటుమానా జనమునకు చౌకబారు శిస్తులకు ఈనాములుగానిచ్చిరి. 1815లో పిండారీల దండు వచ్చి కొల్లపెట్టుచున్నప్పుడీ బంటుమానా జనమేమియు చేయలేకపోయిరి.

వారింత అసమర్థులుగానుండినను తామివ్వవలసిన శిస్తులను మాత్రము కుంపినీ కలెక్టరుకు చెల్లించక బాకీలుపెట్టిరి. దానిని వసూలు చేయుటకు కలెక్టరు దూరప్రదేశములందుననారోగ్య ప్రాంతములకు తనయుద్యోగులను నౌకరులను పంపవలసి వచ్చుచుండినందువలన దానిని వసూలు చేయలేకపోయెను. దేశీయుల శాంతిభద్రతలును కుంపినీవారు కాపాడలేకపోయిరి. ఆయాప్రాంతములందు కుంపినీవారికి పలుకుబడి లేకుండెను. పరిసర గ్రామములన్ని జమీందారులదేయైనందున వారికి పలుకుబడిలేదు. అందువలన నచ్చటివారిలో కుంపినీవారిపట్ల భక్తివిశ్వాసములు కలవారే లేకుండిరి.

విజయనగరము జమీందారుగారీప్రాంతములో బలవంతుడైయుండుట చూచి ఇంగ్లీషు కుంపినీవారు 1794లో జమీందారు విజయరామరాజుగారు చనిపోగానే ఆయన కుమారునకదివరకు గల అధికారములను తగ్గింపదలచి అదివరకు సీతారామరాజుగారివలన పదచ్యుతులుగా చేయబడిన పూర్వపు కొండ జమీందారులు కొందరికి వారి భూస్థితులు మఱలనొసగిరి. అంతటనీ జమీందారుల కుటుంబములోని మరికొందరు ఆ దేశములో కొంతభాగమునాక్రమించి తామెయధికారులైరి. వీరిని అణచుటకు కుంపినీవారు ప్రయత్నించగా ఒకప్పుడు జయము ఇంకొకప్పుడు పరాజయము కలుగుచుండెను. అందువలన కొందరు జమీందారులకు వీరిపైన గౌరవము తగ్గెను పితూరీలు చెలరేగెను. బందిపోటులు వృద్ధిచెందెను. పేష్కషు బాకీలు పెట్టినవారిపైన కుంపెనీవారు గట్టి చర్య తీసికొనక యుపేక్షించుటవలన కూడా కొంతమంది మూర్ఖమువహించిరి. అంతట 1822 నుండి 1832 వఱకును పితూరీలు క్రమక్రమముగా వృద్ధియయ్యెను. అప్పుడీ పితూరీల కారణములును చూపించి వానిని అణచి క్రొత్తవి పుట్టకుండా తీవ్రమైన చర్య తీసికొనుటకు 1832లో జార్జి రస్సెల్ దొరగారిని స్పెషల్ కమీషనరుగా నియమించి ఆయనకు సర్వాధికారములనిచ్చిపంపిరి (గోదావరి జిల్లా డిస్ట్రిక్ట్ మాన్యూలు Godavari District Manual: Henry Morris. pp. 88-91).

విశాఖపట్టణము జిల్లాలో 1831-32 మధ్య పాలకొండలోను, ఇతరప్రాంతములందు పితూరీలు జరిగెను. పితూరీదారులు కుంపెనీవారి సిపాయిలను చంపి గాయపరచిరి, తుపాకులెత్తుకొనిపోయిరి. 1833లో రస్సెలుగారు వచ్చిన తరువాత కూదా చాలా దౌర్జన్యములు జరిగెను. అంతట రస్సెలుగారా ప్రాంతమునందు సైనిక శాసనములను ప్రవేశపెట్టి పితూరీదారుల నాయకులను పట్టుకొని మిలిటరీ కోర్టులో విచారించి కొందరినురిదీసిరి. జిల్లా పరిస్థితులను గూర్చి రస్సెల్‌గారు 1834లోను 1836-37లోను నివేదికలంపిరి. గవర్నరైన ఆదముగారు 1835లో వచ్చి చూచిరి (విశాఖపట్టణము జిల్లా మాన్యూలు కార్మైకేలు (1868) pp 268-275, 418-423).

ఖాండేషులోను బొంబాయి రాష్ట్రములోను గల భిల్లులు 1825లో నింగ్లీషు కుంపినీ ప్రభుత్వమువారిపైన తిరుగుబాటు గావించిరి. ఇంగ్లీషువారీ భిల్లులపైన 23వ రెజిమెంటు అనబడు సైనికదళమునంపుటయె గాక నిజాముగారి ఖర్చుపైన హైదరాబాదులో నుంచబడిన ఇంగ్లీషు సైన్యమును కూడా వారికి సహాయముగాపంపిరి. అప్పుడీభిల్లులతో తీవ్రమైన యుద్ధములు జరిగెను. తరువాత ఖాండేషులోనొక భిల్లుల ఏజెన్సీప్రాంతమును స్థాపించిరి. తరువాత 1857లో ప్రఖ్యాతివహించిన జనరల్ ఔట్రాము అప్పటికిరువదిరెండు సంవత్సరములు నిండని యువకుడు. అతనిని ఖాండేషులో కమిషనరుగా నియమించిరి. అతని ధైర్యసాహసములు ఔదార్యమును వేటలో ఆసక్తియు భిల్లులనాకర్షించెను. ఆయనపైన వారికి గౌరవము కలిగెను. అంతట ఆయన కృషివలననే భిల్లులు క్రమక్రమముగా ఇంగ్లీషు ప్రభుభక్తులై సైనికదళమున చేరిరి. 1840-45 మధ్యనొక పెద్ద సైనికదళమును నిర్మించిరి. వీరు 1857లో ఇంగ్లీషువారికి సహాయముచేసిరి. 

కోల్ జాతివారు 1832లో ఇంగ్లీషు కుంపినీవారిపైన తిరుగుబాటుగావించిరి. వీరు చాలా తీవ్రంగా పోరాడిరి. ఇంగ్లీషుకుంపినీవారు తమ సిపాయిలను తెల్లసైనికులనంపి తుపాకులను ప్రయోగించి చాలామందిని వధించిరి. వారు చాలా మందుగుండు సామాను సొమ్ము ఖర్చుపెట్టవలసివచ్చెను. ఇంగ్లీషువారి గుండ్లవర్షము ముందు కోల్ జాతివారి బల్లెములు విల్లునంబులు పనిచేయలేకపోయి కోల్ జాతివారి గ్రామాలను ఇంగ్లీషు సైనికులు తగులబెట్టిరి. తుదకెంతో కష్టముపైననే కోల్ జాతివారు యుద్ధమును చేయుట విరమించిరి. ఈ తిరుగుబాటునకింగ్లీషువారెన్నో కారణములను చెప్పిరికాని నిజమైన కారణములను ప్రకటింపరైరి. ప్రభుత్వోద్యోగులు చేసిన అన్యాయమును ప్రజాపీడనమును దోపిడియు నీతిరుగుబాటునకు కారణములనియు ఈ యుద్యోగులు లంచములు పుచ్చుకొని తమ అధికారమును దుర్వినియోగము చేయుచుండిరనియు అక్రమములు చేయు వ్యక్తులకు వీరు తోడ్పడుచుండిరనియు ఆ కాలమున జిల్లా జడ్జిగానుండిన ఫ్రెడరిక్ జాన్‌ షోర్‌గారు వ్రాసియున్నారు (Notes on Indian Affairs, Frederick John Shore. 1838. Vol.I, pp 145-166).

ఇంగ్లీషు ప్రభుత్వకాలమునందు సంతాలు పరగణాయను ప్రాంతమున జీవించు సంతాలులను బంగాళీ బిహారీ భూస్వాములు పీడింపసాగిరి. వీరు ఇంగ్లీషు కుంపినీవారి వశవర్తులుగానుండి రుచిమరగి సంతాలులపట్ల అన్యాయములుచేసి బాధించుటవలన సంతాలులకు తీవ్రమైన అసంతృప్తి కలిగి 1835లో తిరుగుబాటు గావించిరి. ఇంగ్లీషుకుంపినీవారు స్థాపించిన న్యాయస్థానములలో తమకు న్యాయము కలుగునను ఆశ వారికి లేనందున వారు తమ బాధలనుగూర్చి అక్కడ ఫిర్యాదుచేయక తమ స్వశక్తి వలన వానిని నివారణ చేసికొనదలచిరి. వారు కనబడిన బంగాళీలనెల్ల హింసించి బాధించి చంపుట ప్రారంభించిరి. అపుడు కుంపినీవారు తమ రిగ్యులర్ సైన్యమునంపి వారిపైన తుపాకులు కాల్పించిరి. సంతాలు తిరుగుబాటును అణచి వారు వసించు ప్రాంతమును ప్రత్యేక పరగణాగా చేసిరి. దానితో నాన్ రెగ్యులేషన్ ప్రావిన్సులలో నిరంకుశ పరిపాలనము స్థాపించిరి. సంతాలుల బాధలు మితిమీరెను.

ఇంగ్లీషువారు తమకన్యాయము చేయుచున్నారని సంతాలులు తలచి కలకత్తాకు పోయి తమ బాధలు చెప్పుకొనదలచి 1855లో గుంపులుగా బయలుదేరిరి. వారికి ఆవేశము కలిగి దారిలోని గ్రామములను తగులబెట్టసాగిరి. అంతట కుంపినీవారు తమ సైన్యముచే తుపాకులు కాల్పించిరి. తరువాతయొక శిక్షార్హపు పోలీసుదళమును సమకూర్చి ఒక పెద్ద దళముతో సంతాలులనణచియుంచిరి. ఈ తిరుగుబాటు జరిగిన తరువాతనీ సంతాలు పరగణాలలో సామాన్య పరిపాలనమును పూర్తిగా రద్దుచేసి సైనిక శాసన పరిపాలనము వంటి ప్రభుత్వము నమలుజరిపిరి. వీరి నేరములను విచారించుటకు ప్రత్యేక న్యాయస్థానముల నేర్పరచిరి. భూమి హక్కుల నిర్ణయము పరిష్కారములను చేయుటకు ప్రత్యేక శాసనవిధులను గావించిరి. ఇంగ్లీషువారీ ప్రాంతములోనికి బంగాళీలు రాకుండా అనేక నిషేధములను గావించిరి. ఏమిచేసినను వారేదోవిధముగా ప్రవేశించి సంతాలులను పీడించుచునేయున్నారని ఆంగ్లేయులు చెప్పిరి. అయితే ఇంగ్లీషు వర్తకులును మిషనరీలును గావించు అన్యాయములను గూర్చి చెప్పరైరి.

జయపురము జమీందారుగారైన విక్రమదేవుగారు అసమర్థులుగా నుండినందున ఆయనక్రింది వ్యవహారస్తులు చాలా అక్రమములు చేయుచు ప్రజలను పీడింపసాగిరి. 1848లో రైతులు విశాఖపట్టణమునకు వచ్చి దేశములో నరహత్యలు దొంగతనములు బలవదాక్రమణలు జరుగుచున్నవని ఫిర్యాదుచేసిరి. రాజుగారి యుద్యోగులును జయపురం తాలూకా నుండి తరిమివేయుటతో పితూరీలు పుట్టెను. 1855-56 సంవత్సరములలో కూడా జయపురము జమీందారీలో పితూరీలు పుట్టెను.

1857లో ఉత్తర హిందుస్థానమునుండి మహారాష్ట్ర గోసాయిలును గోసాయి వేషధారులును మహమ్మదీయ వాహబీ ఫకీరులును దక్షిణదేశమునకు వచ్చి మొగలాయి చక్రవర్తి, నానాసాహెబు మొదలైన దేశనాయకులేకమై మనదేశమునాక్రమించిన విజాతీయులైన ఇంగ్లీషువారిని తరిమివేయుటకు యుద్ధము చేయుచున్నారను సంగతిని ప్రజలకు చెప్పి ఇక్కడివారిని కూడా తిరుగుబాటుచేయుడని ప్రోత్సహించుచుండిరి. అయినను హిందువులకీ మహారాష్ట్రుల మాటలుగాని ఫకీరులమాటలుగాని రుచించలేదు.

అంతకుపూర్వము కొంతకాలముక్రిందట మరాఠీ పిండారీ దండులవలన బాధలను మహమ్మదీయుల నిరంకుశాధికారులు పెట్టిన బాధలును వీరనుభవించియుండిరి. మహమ్మదీయులలో మాత్రము కొంచం సంచలనము కలిగెను. ఆ సంవత్సరం మొహరము పండుగలో కొంత అల్లరి జరుగవచ్చునని గోదావరి జిల్లా కలెక్టరు మొదలైనవారు అనుమానించిరి. ఆ సంవత్సరము మొహరము పండుగ ఆగస్టు నెలలో వచ్చెను. అప్పటికి ఇంగ్లీషువారి పరిస్థితు లుత్తరహిందుస్థానమున బాగాలేవు. అయితే అల్లరులు జరుగలేదు.

గోదావరి జిల్లాలో అప్పటి యెర్నగూడెము తాటిమళ్ళ తాలూకాలకుత్తరమున కొండల ప్రాంతములోని మన్యమునందు మాత్రము యొక చిన్న తిరుగుబాటు జరిగెను.

కొరటూరు గ్రామ మునసబు కోరుకొండ సుబ్బారెడ్డిగారి కుమారుడొక ధనవంతురాలైన వితంతువును వివాహమాడదలచెను. అయితే ఆమెను బుట్టాయిగూడెము గ్రామమునసబు దగ్గరకు తీసియుండెను. అంతట సుబ్బారెడ్డిగారి తాలూకు కోయజాతి పరిజనులు ఆ స్త్రీని బలవంతముగానెత్తుకొని పోవుటకు ప్రయత్నించిరి. ఆమె దొరకనందువలన వారికాగ్రహము కలిగి ఆమె భర్త గ్రామమును కొల్లుపెట్టిరి.

అప్పుడు హెడ్ అసిస్టెంటు మేజిస్ట్రేటు 60 మంది లేక 70 మంది పోలీసు జవానులును బయలుదేరి అల్లరి జరిగినచోటికి వెళ్ళి దోపిడీ ఆస్తితో కొందరు నేరస్తులను పట్టుకొని బుట్టాయిగూడెమునకు తిరిగివచ్చెను. అప్పుడక్కడ సుబ్బారెడ్డిగారి క్రిందికొండజాతివారు విల్లు అమ్ములతోను తుపాకులతోను ఆయుధపాణులై వచ్చి వీరిని ముట్టడించిరి. అప్పుడామేజిస్ట్రేటు చేయునదిలేక ఖైదీలను వదలిపెట్టెను.

అటుతరువాత గోదావరి జిల్లా కలెక్టరు ధవళేశ్వరములోనున్న కెప్తాను రోజ్ క్రింద రెండు కంపినీల శాపర్సు అండ్ మైనర్సు అను సైనికదళములతో బయలుదేరి తిరుగుబాటుదారులు నాగవరములో దాగికొన్నట్లు తెలిసి అక్కడికి వెళ్ళగా వారు రహస్యమార్గముల ద్వారా పారిపోయిరి. అంతట సిపాయిలు వారిని తరుముకొనిపోవుచు జీలుగుమిల్లి దగ్గరనొక కొండనెక్కుచుండగా తిరుగుబాటుదారులా కొండపైనుండి క్రిందకు తుపాకులను కాల్చుట ప్రారంభించిరి. కొండ రెండుప్రక్కలను అడవులుండెను. సిపాయిలు చుట్టు దిరిగి గ్రామములోనికి వెళ్ళగా తిరుగుబాటుదారులు వీరిపైన బాణములవర్షము కురిపించి తుపాకులతో కాల్చి అడవులలోనికి పారిపోయిరి. సిపాయిలు వారికొరకు వెదకినను దొరకలేదు. అపుడా సిపాయిలు చుట్టుపట్ల గ్రామములను తగులబెట్టుట ప్రారంభించిరి. గ్రామస్థులు భయపడి ఇండ్లను ఖాళీచేసి వెళ్ళిపోవసాగిరి. ఇట్లు పదునైదు దినములా మన్యములో నీసిపాయిలు చాలా అవస్థలుపడుచు తిరిగిరి. ఇంతలో వారికి మన్యపు జ్వరములు పట్టుకొనెను. కొందరు చచ్చిరి. తరువాత దీనినిమిత్తమొక రివిన్యూ సిబ్బందిని తయారుచేసి కెప్తాను అల్లెయిన్ బ్లూమ్‌ఫీల్డ్ క్రింద పంపించిరి. అప్పుడు సుబ్బారెడ్డిని పలువురు కుట్రదారులను పట్టుకొని స్పెషల్ కమిషనరుగా పనిచేయుచున్న జడ్జిగారి ఎదుట పెట్టి 1857వ సంవత్సరపు XIVవ నెంబరు చట్టము క్రింద విచారించి సుబ్బారెడ్డికిని కొర్ల సీతారామయ్యకును మరణశిక్ష విధించి 1858 అక్టోబరు 7వ తేదీన బుట్టాయిగూడెము గ్రామములో నురిదీసిరి.

సీతారామయ్య సవతి తమ్ముడు కొర్ల వెంకటసుబ్బారెడ్డిని గురుగుంట్ల కొమ్మిరెడ్డిని ఆదినముననే సుంకరస్వామిని హత్యచేసిన నేరమునకు మద్దతుచేసిరని పోలవరములో నురిదీసిరి. అప్పుడే కోరుకొండ సుబ్బారెడ్డి సోదరుడైన తమ్మిరెడ్డి తిరుగుబాటులో పాల్గొనినందుకు తూటిగుంటలో నురిదీసిరి. ఈ విచారణలో నొక ప్రధాన ముద్దాయి రెండుచేతులు జోడించి నానాసాహెబు జయముపొంది తన సైన్యముతో వచ్చుచున్నాడనియు ఇంగ్లీషువారికి వ్యతిరేకముగా పనిచేయువారందరికి తగుబహుమతులిచ్చుననియు తాను వింటిననియు అందువలన తానీ తిరుగుబాటులో పాల్గొంటిననియు చెప్పెను (Godavari District Manual Henry Morris (1878) pp 299-301).

యర్నగూడెము తాలూకా పూర్వము రాజమహేంద్రవరం గోదావరి జిల్లాయందు చేరియుండెను. దానికి ఉత్తరమున నిజాము రాజ్యమును దక్షిణమున తణుకు తూర్పున గోదావరి నది పడమర ఏలూరు తాలూకాయుండెను. దీని విస్తీర్ణము 1249 చదరపు మైళ్ళు. 1866లో జనసంఖ్య 145715. ఇందులో 203 గ్రామములున్నవి. 92 జమీందారీలవి. దీని క్రింద కొండముఠా గ్రామములునుండెను. యర్నగూడెము జడ్డంగి కొండ మన్యములు. నాగరీక ప్రజల తాలూకాలకు దగ్గరగానున్నందువలన తక్కిన మన్యప్రాంతములకన్నా కొంత తెలుగుమీరిన ప్రదేశములగానుండెను. ఇవి 385 చదరపు మైళ్ళ వైశాల్యముండెను. ఇందులో కోయవారుండిరి. కొన్ని భూములు మున్సబుదారులక్రింద కౌళ్ళకిచ్చుచుండిరి. ఇక్కడి అబ్కారీ నల్లమందు వ్యవహారములు తక్కిన గ్రామములకు భిన్నముగానుండెను. అప్పటి శాసనవిధులును వ్యత్యాసముగనేయుండెను. కలెక్టరులె గవర్నరు ఏజెంటుగా నిరంకుశపరిపాలనము జరుపుచుండెను.

ఈ యర్నగూడెము కొండల మన్యములో 1858లో నొక తిరుగుబాటు ప్రారంభమయ్యెను. చాలాచోట్ల కొండజాతివారు ఇతర ప్రజలు తిరుగబడిరి. ఇది 1862 వఱకును జరుగుచునేయుండెను. పితూరీదారులను పట్టుకొని ఉరిదీసిరి. ముఠాదారుల ముఠాలను ఇంగ్లీషు ప్రభుత్వమువారు రద్దుచేసి తీసుకొన్న గ్రామములను దగ్గరనున్న రెండు సర్కారు గ్రామ మునసబులక్రిందనుంచిరి. ఈ ప్రాంతములో కొంతభాగము పోలవరము గూటాల జమీందారీలో చేరియుండెను (Maclean’s Manual Vol. I pp 75).

(సశేషం)