అవధారు

మే నెలంతా సంతాపదినాల్లాగే గడిచేయి నాకు. మే 24 తెల్లవారు ఝామునే మేం దేశం విడిచి వెళిపోతున్నాము. హైదరాబాద్ చుట్టూ బండలు గుట్టలు పొలాలు చెరువులతో చాల అందమైన దేశం. అక్కడ మనుషులు చెట్లెక్కి కల్లుతీసుకునేవాళ్ళు, పెద్ద తలపాగాలతో మేకలు మేపుకునేవాళ్ళు, సైకిళ్ళమీద పచ్చళ్ళు ఫలహారాలు అమ్ముకునేవాళ్ళు, రకరకాల పనివాళ్ళు అనాది సాంస్కృతిక సౌందర్యంతో నిబ్బరంగా అవుపిస్తారు. ఏదో ఒకరోజు వాటన్నిటికీ దూరంగా వెళిపోతామని తెలుసు. ఆరేళ్ళుగా ప్రతి రాయి, రప్ప, గుట్ట, పిల్లలు, కుక్క, పంది, గేదె, గుడి, చెరువు అన్నీ కళ్ళతోనే ఫొటోలు తీసుకుని కడుపులో పెట్టుకుని అవి మళ్ళీ మళ్ళీ తల్చుకుంటాను. ఇంక వచ్చేసేముందు సంగారెడ్డి దాపుల్లో తిరుగుతూ దారితప్పిపోయి ఒకూళ్ళోకి వెళ్ళేము. దాన్ని అక్కడందరూ ఇస్మాఖంపేట్ అంటున్నారు. అది ఇస్మాయిల్‌ఖాన్ పేట. అక్కడి కోట, కోటలో దుర్గ గుడి ఎన్నో వందలేళ్ళనాటివి. ఒకసారి చూస్తే ఇంక అటు లాగుతూనే ఉంటాయి. ఓరోజు పొద్దున్న నగరం నుండి మురికి నీళ్ళు గోల్కొండ నాలాల్లో కలిసే చోట వ్యర్ధాలన్నీ పెద్ద పెద్ద సబ్బు నురగలుగా రయ్యిమని గాల్లోకి ఎగురుతున్నాయి, వెన్నముద్దల్లాగ. చివరికి ఇక్కడి కాలుష్యం కూడా నా కళ్ళకి అందంగానే కనిపిస్తుందని నవ్వుకున్నాను.

మే ఇరవైనాలుగు తెల్లవారుఝామునే మేము తట్టా బుట్టా అన్నీ సర్దుకుని దేశం విడిచి వెళిపోతున్నాము. మా అమ్మ మాతోనే వచ్చి విశాపట్నం వెళిపోతున్నాది. త్రిపురకి వేసంకాలంలో తొడుక్కునే పల్చని చొక్కాలంటే ఇష్టం. ఆర్నెల్ల కిందట వాళ్ళింటికెళ్ళి రెండ్రోజులున్నాను. నేను తొడుక్కోబోతున్న టీషర్ట్ ఇప్పించి తనకి కావాలని అడిగి తీసుకుని, అప్పటికప్పుడు తన చొక్కా ఇప్పీసి అది తొడుక్కున్నారు. మా అమ్మ చేతికిచ్చి మూడు చొక్కాలు పంపించేను – గచ్చపిక్క రంగుది, నల్లది, ఆకాశనీలంది. సరిగ్గా మేం దేశం నుండి శెలవు తీసుకుంటున్న ఘడియల్లోనే త్రిపుర లోకం నుంచి శలవు తీసుకున్నారు. మర్నాడు దిగి చూసుకుంటే తెలిసింది. పట్టుకెళ్ళిన చొక్కాలు ఏం చెయ్యమన్నావని మా అమ్మ అడుగుతున్నాది.

ఆరేళ్ళుగా త్రిపురతో చాల సంభాషణ నడిచింది. ఏణ్ణర్ధం కిందట ఆయన మా ఇంటికొచ్చి రెండ్రోజులున్నారు. చాలా కబుర్లు చెప్పేరు. ఏడాది కిందటి వరుకూ ఫోన్లో “హలో కనకా!” అని ఎస్వీరంగారావు లాగ అరిచేవారు, ఏ బెంగా లేకుండా. ఫోన్లో త్రిపురవి కిళ్ళీ లేకుండానే ముద్ద మాటలు – వ్యక్తావ్యక్త ప్రేలాపన అన్నట్టుగుంటాయి. చెవులు రిక్కించి జాగర్తగా వింటే తప్ప అర్ధం కావు. ఎదురుగా కూర్చున్నప్పుడు ఈ ఇబ్బంది లేదు. ఇలాగని మొత్తుకుంటే సెల్ ఆపు చేసి మళ్ళీ మాట్లాడేవారు. త్రిపురకి తన పన్లు తను చేసుకోవడమే సరిగ్గా తెలీదు. లక్ష్మి ఆంటీ అన్నీ తానే అయ్యి ఇంటి పన్లూ, త్రిపురకి కావల్సినవీ చూసుకునేవారు. త్రిపుర కిళ్ళీలు రప్పించుకుని, చూడ్డానికొచ్చిన వాళ్ళని సంబాళించుకుని, క్రాస్‌వర్డ్ పజిల్స్ విజయవంతంగా పూర్తి చేస్తే ఆ రోజుని జయించినట్టే లెక్క. ఆంటీకి నాలుగేళ్ళయ్యి చాల చికాకు చేసింది. ఆవిడ ఉత్తమ ఉపాధ్యాయినిగా రాష్ట్రపతి నుండి జాతీయ పురస్కారం పొందిన మనిషి, స్వయంగా రచయిత్రి. అంతటి పనిమంతురాలికీ చివరికి కనీసం తన పనులు తనే చేసుకొనే వీలైనా లేకపోయింది. పనివాళ్ళు, నర్సులు పెద్దవాళ్ళిద్దరి అనువు కనిపెట్టి ఓ రోజొచ్చీ ఓ రోజు రాకా, అందిన కాడికి డబ్బూ దస్కం పట్టుకుపోయీ ఇబ్బంది పెట్టేరు. త్రిపురకి ఇల్లు ఎలా సంబాళించుకోవాలని, లక్ష్మి ఆంటీని ఎలా కాచుకుంటాననీ బెంగగా ఉండేది. ఎక్కడికైనా బయటికి వెళ్ళినా “లక్ష్మిని చూసుకోవాలి…” అని మర్నాడే ఇంటికెళిపోయేవారు.

ఒక ఏడాదిగా మేం ఎప్పుడు మాటాడినా ముఖ్యంగా ఒక్క విషయం గురించే మాటాడుకున్నాము – పనిమనుషుల్ని గురించి. చాల వేరే వేరే కారణాల వల్ల నేనూ ఆయనా కూడాను పనిమనుషుల్ని గురించే బాగా ఆలోచించేము. త్రిపురకేమో పనిమనిషి చాల అవసరం. మా ఇంట్లోనేమో మాకు ఒక దేవదూత లాంటి పనమ్మాయి దొరికింది. ఆవిడ పేరు పద్మ. నాకు పనివాళ్ళు, వాళ్ళు మనకి పనులు చేసిపెట్టడం అంటే చాల ఇబ్బందిగా ఉంటుంది. ఎవరూ ఎవరికీ పనిమనుషులుగా ఉండకపోతే బావుంటుంది. పద్మ వాళ్ళూరు నల్గొండ దగ్గర. చదువు చిన్నప్పుడే ఆపీసింది గాని ఆవిడ చాల తెలివైన మనిషి, పనిమంతురాలు, నాయకురాలు. ప్రతి మాట, కదలికలోను, ప్రతి పనిలోను చాల స్థిరంగానూ, గొప్ప విశ్వాసంతో ఠీవిగానూ మసలుకునేది. తన పిల్లలు చదువుకోవాలని ఒక్కటి తప్ప ఇంక ఏమీ ఆశించేది కాదు. ‘అబ్బా! ఇలాటి మనుషులూ ఉంటారా?’ అని నేను రహస్యంగా నోరెళ్ళబెట్టుకుంటూ అవన్నీ త్రిపురకి ఫోన్లో వర్ణించి చెప్తుంటే ఆయన అన్నార్తుడికి విందు భోజనాన్ని వర్ణిస్తున్నట్టు మరింత ఇదైపోయేవారు. నేను చూసిన కొద్దిపాటి తెలంగాణ లోనే పద్మ లాంటి మనుషులు తారసపడుతూనే ఉన్నారు. వాళ్ళని దూరం నుండి చూసుకుంటూ, కొంచెం కదిపి మాటాడుకుంటుంటే నాకు త్రిపుర అరటిచెట్టు – ఆశాకిరణం లాగా చాలా బావుండేది. అవన్నీ ఒదిలి పోతున్నానని మే నెలల్లా గింజుకుంటున్నాను. పనిమనుషుల గురించి బెంగనీసి గట్టిగా ఎక్కడా బయటికి అననివ్వకుండా మా ఆవిడ నా గొడవంతా తనే విని ‘ఇలాటి సంగతులు ఇంకెక్కడా అనొద్దని ‘ చెప్పింది. ఎవరైనా వింటే నవ్విపోతారు. బహుశ పద్మా వాళ్ళే అర్ధం చేసుకోరు. త్రిపురకేమో పనిమనిషి కావాలి. పద్మలాంటి మనిషిని ఆయనయితేనే అర్ధం చేసుకుని, గౌరవించగలరు. ఆవిడలాంటి మనిషే కుదిరితే త్రిపుర రొట్టి విరిగి నేతిలో పడినట్టేను. పద్మకి ఇంగ్లిష్ అంటే, కొత్త పద్ధతులంటే ఉత్సాహం. త్రిపుర వాళ్ళింట్లో పన్లోకి కుదిరితే పద్మ తంతే బూర్లగంపలో పడినట్టే. పద్మని ఎలాగైనా త్రిపుర వాళ్ళింట్లో పనిమనిషిగా కుదిరించెద్దాం అని ఒక ప్రోజెక్ట్ లాగ పెట్టుకున్నాను. కాని ఆవిడుండేది నల్లగండ్ల. త్రిపురేమో వాల్తేర్ అప్‌లేండ్స్. ఎలా కుదురుతుంది? త్రిపురకి వెన్న రొట్టీ లేదు, పద్మకి పూర్ణం బూర్లూ లేవు గాని, పద్మతో త్రిపురతో ఈ ప్రోజెక్ట్ గురించే సంభాషణ చాలా దూరం నడిచింది.

త్రిపుర ఉత్తుత్తి పధకాలు వర్ణించినా అవి నిజమేననుకుని సంబరం పడిపోతారు. చాలా ఏళ్ళకిందట తనకి ఒక ఇల్లు కట్టించుకోవాల్నుందని అన్నారు. నేను లారీ బేకర్ హోం లాంటిది ఇల్లు డిజైన్లు గీసుకోనొచ్చి ‘ఇదిగో మీ కొత్తిల్లు. ఇది మీ గది, వంటిల్లు – ఇదేమో మీ అమ్మగారికి గది!’ అని బొమ్మలు చూపిస్తే ‘కనక ప్రసాద్ మాకు లారీ బేకర్ ఇల్లు కట్టించేస్తాడు!’ అని నిజంగానే గృహప్రవేశం చేసినట్టు సంబరం పడ్డారు. వాళ్ళమ్మగారు అప్పటికే చాల పెద్దావిడ. నేను త్రిపుర కోసం ఇంట్లోకెళ్తుండటం కనిపెట్టి అరిచేతిలో టక టకా రాస్తున్నట్టు చూపించి “కధ రాసీ! ఖధలు రాసీయండి!!” అని వేళాకోళం చేసి ఫక్కున నవ్వేవారు. ఆవిడ చాల తెలివైనావిడ అని, గొప్ప నవుతాలు మనిషనీ, ఆవిడకి కొసవెర్రి అనీ అదే తనకీనని ఇలాగ చెప్పి నవ్వేవారు. నిరుడు కధల పుస్తకం అచ్చవుతుందని హడావుడి జరుగుతున్నప్పుడు “మళ్ళీ వీటిని ఎవడు కొంటాడు? అంటే అలాక్కాదు చాలా మంది అభిమాన్లున్నారు, మీకే తెలీదు అంటున్నారు! నాకు రాయల్టీస్ ఇస్తార్ట! కాయితాల మీద సంతకాలు పెట్టించుకున్నారు. I am going to be rich!” అని ఇగటాలాడేరు.

రెండేళ్ళ కిందట మా ఇంటికొచ్చి రెండ్రోజులున్నారు. చిన్న పిల్లలు ఫ్రెండ్సింటికెళ్తున్నట్టు సరదా పడి సంచీ ఒకటీ, దాన్లో బట్టలూ కిళ్ళీలూ సర్దుకున్నారు. “అలా ఊరంతా తిరగాలనుందివై!” అన్నారు. ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ఊరల్లా తిరిగేము. మాటల్లో తనూసొస్తే అది ఎవరో వేరే మనిషి లాగ తృతీయ పురుషలో అనుకునేవాళ్ళం ‘త్రిపుర ఇలాగ ..’ అని. యూనివర్శిటీ కేంపస్‌లో తిరుగుతుంటే “Marx was right, you see?! He was right!” అన్నారు. “ఆయన చెప్పినట్టు అవ్వాలి, కాని అలాగ అవటం లేదు ” అన్నారు. కొత్త కొత్త రోడ్లూ దుకాణాలూ చూస్తూ ‘ఇదేంటి? అదేంటీ?’ అని అన్నీ అడిగేరు. అగర్తలాలో తనున్న పెద్ద కర్రబంగ్లా గురించీ రోజూ సాయంత్రం కురిసే జడివానల్ని గురించీ పూసగుచ్చినట్టు వివరించి చెప్పేరు. సంగీతం మేష్టారు పాఠం చెప్తుంటే సొఫాలో కూర్చుని బుర్ర ఊపుకుంటూ చేతులూపుకుంటూ విన్నారు. తనకి హిందుస్థానీ సంగీతమే ఇష్టం అనీ, అది వింటే ఏదో మీదికి మీదికి వెళ్తున్నట్టుంటుందనీ, కర్ణాటక సంగీతం వింటే ఇంకా కిందికి కిందికి దిగిపోతున్నట్టుంటుందనీ చేత్తో గాలినే మీదికీ కిందికీ తీగలు లాక్కుంటూ చెప్పేరు. త్రిపురలో తన స్నేహితుడొకడు, ఆయన పేరు చక్రవర్తి కావోలు – అతను అందరిముందూ ఉపన్యాసం ఇస్తానని వేదికనెక్కి తాగింది ‘ఫూ’ మని వాంతి చేసుకుని వేదిక దిగిపోయిన సంగతి చెప్పేరు. అతను నాలా ఉంటాడని చెప్పేరు.

షాన్‌బాగ్ హోటల్లోన దోశలు రప్పించు, పూరీలు రప్పించమని చాలా సరదా పడిపోయేరు. తీరామోసి తెప్పించేక కొంచెం దోశముక్క చిన్న పూరీ ముక్కా తిని ‘ఇంక చాలు! ఇంకొద్దు మనకి…’ అన్నట్టు సంజ్ఞలు చేసి. ఇంటికొచ్చేస్తుంటే అమీర్‌పేట్ చౌరస్తా దగ్గర ట్రాఫిక్ పోలీసులు మమ్మల్ని అటకాయించేరు. తప్పుగా రైట్ టర్న్ కోసేనని. అక్కడ ట్రాఫిక్ సైన్లేవీ లేవని, మా మానాన్న మమ్మల్ని ఒదిలీమని నేను, త్రిపుర ఇద్దరం వాళ్ళతో వాదించి అక్కణ్ణించి తుర్రుమన్నాం. ఆ సాహస కార్యంలో త్రిపుర నేనూ పోలీసుల్తో ఎలా బయట పడ్డామో తల్చుకుని నవ్వుకున్నాము. చాన్నాళ్ళ కిందట తను ఉద్యమాల కోసం సానుభూతి పన్లు చేస్తున్నాడని అనుమానంతో పోలీసులు మఫ్టీలో తను వెళ్ళే చోట్ల, రైల్వే స్టేషన్లలో ఎలా వెనకాలే తచ్చాడేవారో జ్ఞాపకం తెచ్చుకున్నారు. దార్లో ఇంద్ర నగర్‌లో కిళ్ళీల కోసం ఆగేము. కిళ్ళీ కొట్టతనితో కత్తు కలిపి అతని చరిత్రంతా కనుకున్నారు. “బయోగ్రఫీ అందరికీ ఉంటుంది. ఎవరి చరిత్ర రాసినా అది చదవడానికి చాల ఇంట్రష్టింగ్‌గానే ఉంటుంది.” అని చాలా చెప్పేరు. కొన్ని నమ్మేలా ఉంటాయి, కొన్నలా ఉండవు అని ఇలా ప్రస్తావనకొచ్చింది. “ఎలా ఉన్నది అలాగుంటుంది. ఎలా ఉన్నది అలాగే ఉంటుంది కాని అలాక్కాక మరింకెలా ఉంటుంది? ‘నీ ముక్కేంటి, అలాగుంది?’ అని అన్నామనుకో. బావుంది మరి, అది వాడి ముక్కు! అది అలాగే ఉన్నాది!! That’s how it is…!” అని చేతుల్తో ఎక్కువగా చేసి చెప్పేరు. “Hypocrisy is not a vice.” అని చెప్పేరు.

ఆ రెండ్రోజులూ రాయడం గురించీ చదవడం గురించీ నేనేవేవో అడుగుతూనే ఉన్నాను, ఆయన ఏవేవో చెప్తూనే ఉన్నారు. ఇంగ్లిష్ లిటరేచర్‌ని గురించి ఎక్కడెక్కడివో, ఎప్పటెప్పటివో మనుషులు, సంగతులన్నీ ఆయనకి జ్ఞాపకమే. సందర్భానికి తగిన సంగతి ఠక్కుమని ఎత్తి చెప్పేవారు. అంతర్లయ అని ప్రసక్తి తెస్తే ‘అంటే ఏంటి?’ అన్నారు. Musicality అంటే ”G. M. Hopkins పొయెట్రీ చదివేవా?” అని ఆయన కవిత్వం, దాన్లో అంతర్లయ, Longing for God ఇలాగ ఒకొక్కటీ. త్రిపురకి కొద్దిపాటి జటిలంగా ఉండే తెలుగు మాటలు వాడినా వెంటనే వాటి సమానార్ధకాల్ని ఇంగ్లిష్‌లో చెప్తే గాని తెలీదు. శేషము అంటే Remainder అని, పటుత్వం అంటే Strength అనీ ఇలాగ. త్రిపురతో సంభాషణంతా దాదాపు ఇంగ్లిష్‌లోనే నడుస్తుంది. నాకు రాయడానికి సదృశం వాంతి అనిపిస్తుంది అనంటే ‘అవును, అదొక పద్ధతి’ అని, ఎప్పటికి ఏది తోస్తే అప్పటికి అదీ కాయితం మీద కలం ఎత్తకుండా రాసుకుపోడాన్ని గురించి మంచం మీద పడుక్కుని వివరించి చెప్పేరు. ఆది Spontaneous Fiction. అది ఇంకొకరిని దృష్టిలో పెట్టుకుని రాసేది కాదు. ఎవర్నీ దేన్నీ దృష్టిలో పెట్టుకోకుండా వాంతైనట్టు రాసేది. “ఎవరైనా చదువుతారని దృష్టిలో పెట్టుకుని రాసేది అది – That is third-rate writing!!” అని పట్టుదలగా రెండుసార్లు నొక్కి చెప్పేరు. త్రిపుర యధాలాపంగా మాటల్లో విసిరేసే సంగతులు కూడా చాల అపురూపమైనవి, ఆ క్షణంలో ప్రస్తుతమైన విషయానికి చాల ఉపకరించేవి. ఏరి ఇక్కడా అక్కడా రాసుకున్నవి ఎక్కడో పడి, పోయేయి.

త్రిపుర ఏదైనా విషయాన్ని నొక్కి చెప్పటం అనేది చాల అరుదు. మామూలుగా త్రిపుర సంభాషణ నడిపే పద్ధతి విలక్షణంగా, చిత్రంగా ఉంటుంది. మామూలుగా వ్యవహారం కోసం, చుట్టపు చూపుగా వచ్చే మనుషుల్ని అయన తప్పించుకుని తప్పించుకుని తిరిగేవారు. వీధి తిన్న ఇంట్లోకి మనుషులొస్తున్నారంటే ఆయన గబ గబా చొక్కా తొడుక్కుని పెరటి తిన్న ఎలా జారుకునేవారో నాకు కధలు చెప్పేవారు. ఒక్క లౌక్యుల్నుండి మాత్రం ఇలా తప్పించుకునేవారు కాని మిగతా రకాల మనుషులు – భోలా మనుషులు, గయ్యాళి మనుషులు, గర్విష్టివాళ్ళు, కోపగిష్టి వాళ్ళు, చాదస్తులు, నసపెట్టేవాళ్ళు, కార్యకర్తలు, పండితులు ఇలాగ ఎవరు తారసపడినా ఆయనకి ఇబ్బంది లేదు. కూర్చుని మాట్లాడ్తారు. ముందుగా ఎదటి మనిషిని జాగర్తగా పరిశీలించి, వాళ్ళ బుర్రలో ఆ క్షణంలో ముఖ్యంగా ఏం సుళ్ళు తిరుగుతోందో దాన్నే బయటికి రప్పించి, అదే ప్రపంచంలో చాల ముఖ్యమైన విషయమన్నట్టు మాటాడేవారు. అవతలవాళ్ళు చెప్పిందాన్నే వేరే మాటల్లో వాళ్ళకి ఎత్తి చెప్పి, మధ్య మధ్యన వాళ్ళకి ఉపశమనంగా ఉండే పిట్ట కధలు జోడించి రంజింపచేసేవారు. ఇలాగ త్రిపుర నాకు చెప్పిన పిట్ట కధలన్నీ రాస్తే అదే ఓ గ్రంధం అవుతుంది. మామూలుగా పిచ్చాపాటీ అనుకునే సంభాషణంతా ఆయన ఇలా నడుపుకునేవారు. అంటే ఒకళ్ళొచ్చి పంటి నొప్పి గురించి చెప్పుకుని, దంతవైద్యుల్ని విమర్శించడం మొదలు పెడితే ‘అవును, పన్ను నొప్పి – అబ్బ, మహా కష్టంవై…’ అని అదంతా వర్ణిస్తూనే డెంటిస్ట్‌ల్లో మంచివాళ్ళుంటారనీ ఇలా ఉపశమనంగా ఏదో ఒక పిట్ట కధో, జ్ఞాపకమో చెప్పి మాటలు నడిపేవారు. చాడీలు, సంఘర్షణ మరీ కట్టు తప్పిపోతుంటే అదును చూసుకుని విషయం మార్చేసేవారు – ‘అయితే ఇప్పుడు మార్చిలో మళ్ళీ – you are up for your next promotion, then…?’ అని ఇలాగ. టైలరు ఎవరి చొక్కాలు వాళ్ళకి ప్రత్యేకం కుట్టిచ్చినట్టు త్రిపుర నలుగురు మనుషులున్న చోట ఏక కాలంలోనే నలుగురితో నాలుగు రకాలుగానూ మట్లాడ్డం పరిశీలిస్తే అబ్బురంగా ఉండేది.