ఇసక-1

” పొద్దుట లెగ్గానే…మొట్టమొదాట ఒకాలోచనొస్తుంది కదా! అదేంటి..? అది … It is an assumption! …..ఎసంప్షన్‌ … ” అని ఎడం చేత్తో రాజ్‌ దూత్‌ బేలన్స్‌ చేసుకుంటూ కుడి చేత్తోటి ఒక ఆలోచనని తన నెత్తిమీంచి జాగర్తగా గాల్లోకి మీదికి లాగి, ఆపి కిందకి లాగి మెలికలు తిప్పి ముడి వేసి మళ్ళీ విడగొట్టినట్టు మాట్లాడుతుంటే నందగోపాల్‌ భుజం మీద ఒక చెయ్యి వెనక సీటు మీద ఒక చెయ్యీ వేసుకుని అతని మొహఁమ్మీదికి, కళ్ళద్దాల మీదకి ఎగురుతున్న జులపాలే చూస్తున్నాడు భాస్కర కుమార్‌. అతను ఎప్పుడో తప్ప మాటే ఆడడు. గానీ మాటాడినప్పుడు ఏదో అందంగా ఉంటాడు. వెంకట్రఁవణమూర్తి కోవిల ముందు రాయి మండపంలో పల్లకి మీద అలా నవ్వు మొహంతో కూర్చుని కూర్చుని ఉన్న నల్లరాయి విగ్రహం ఒకసారి ఏదైనా అన్నట్టు. తనొచ్చేడని ఆకాశవాణికి శెలవు పెట్టి తిప్పుతున్నాడు సముద్రం ఒడ్డున అరటితోటల్లోకీ సరస్వతీ దగ్గిర ‘ ఇచ్చట ఉచ్చలు పోయరాదు ‘ గోడ నీడలోన గోనెల మీద పేర్చిన పచ్చరంగు అట్టల పుస్తకాల్లోంచి ముక్కు మూసుకుని తను ఆబగా ఏరుకుంటుంటే ‘ పుస్తకాలెందుకు? ‘ అని అర్ధం వచ్చే క్వశ్చన్‌ మార్కు లాగ చేతులు రెండూ తల వెనక ముడేసుకుని వాలి ఓపిగ్గా మోటర్‌ సైకిల్‌ మీద కూర్చునీ. ఇంకెప్పుడైనా అయితే బండారు బేకు గాడు సొట్ట కాలు ఎగరేసుకుంటూ టీలు మళ్ళీ మళ్ళీ రప్పిస్తుంటే అరటి తోటలోన నులక మంచాల మీద కూర్చుని సముద్రాన్ని చూస్తూ నందగోపాల్‌ లాగిన ఆలోచనని అందుకుని తీగల కింద లాగి రింగులు రింగులు చుట్టడాలు. కానీ భాస్కర కుమార్‌ కిప్పుడు పొద్దుట లెగ్గానే బక్క మొహఁమ్మీద గుబురు మీసాలు వేసుకుని ‘ నేను ఖాళీ చెయ్యఁన్నీ దిక్కున్నచోట చెప్పుకోవయ్యా! ‘ అని ధిక్కరిస్తూ ఆతీ ప్రకాషే జ్ఞాపకం వస్తున్నాడు.

తనకి పొద్దుట లెగ్గానే ఆతీ ప్రకాష్‌ అన్న నిజాన్ని తొక్కి పట్టి ‘ ఉఁ ఊఁ… assumption.. …అంటే ఒకదాన్ని ఏదో ఇది ఇలాగున్నాది అని అనుక్కోడం ‘ అంటే ‘ ఆఁ… అది! ‘ అన్నట్టు ఉత్సాహంగా ఎక్సలేటరు రైజ్‌ చేసీసి ” ఉన్నాదనుకోడం! అంటే..అది ఉన్నాదో లేదో మనకి ఏఁవీ బేసిస్‌ లేకపోయినా… ‘ ఉన్నాదీ ‘ అని ముందు… ” అని గోపాల్‌ కుడిచేత్తో గాల్లోకి మడత కుట్టు కుడుతుంటే ఊరు, బిల్‌ బోర్డ్‌లు, కుళ్ళు కాలువలు, ‘ బాబానాం కేవలం ఆనందమార్గం ‘ రాతలూ, ‘ జార్జిరెడ్డి జంపాల అమర్‌ రహే ‘ లూ అన్నీ ఒకసారి పలకరింపుగా చూసి వెనక్కెళిపోతునాయి. ఇవన్నీ ఇష్టంగా తాగుతుంటే రఫ్‌ రఫ్‌ మని జుట్లు వెనక్కి ఎగురుకుంటూ చెమట్లన్నీ ఆరిపోయి ఎండలన్నీ చల్ల పాటి వేళలకి దిగిపోయినట్టూ, బడుల్లోంచి పిల్లలు బైటికొస్తుండగా వాన లేని మెరుపులూ, ఇంక మణికండా బయట ఓఝా బండీ దగ్గిర ఆకుల్లో జిలేబీలు కట్టించుకోడానికీ రడీ అయిపోతుంటే పెంటకోట శ్రీరాములు నాయుడు సత్రం దగ్గిర బస్సు కోసం వెయిట్‌ చేస్తున్న వాళ్ళలోన మళ్ళీ ఆతీ ప్రకాష్‌ కనిపించేడు. ” ఆపండి గోపాల్‌ ఆపండాపీయండి.. ఆతీ ప్రకాష్‌ …. ” అని తను గాం గాభరా అయిపోతుంటే నందగోపాల్‌ మాత్రం నిబ్బరంగా ” మీరలాగ తొడలతోటి డ్రైవింగ్‌ చెయ్యాలేటి? ఆప్మంటే ఆపుతాను కదా.. ” అని సైడుకి తీసి ఆపీసేడు. ఆతీ ప్రకాష్‌ కూలింగ్లాసెస్‌ లోంచి ఎటో బస్సు కోసం చూసుకుంటున్నట్టు నించున్నాడు. ” ఏంటండీ మీ ఇంటికి ఫోన్‌ చేస్తే అనకాపిల్లెళ్ళేరన్నారు? ” అని భుజం మీద తడితే ఇటు తిరిగి ” ఓహో హలో సార్‌ ! ఎళ్దాఁవనుకున్న బస్సు మిస్సయిపోయేను ఏదో అర్జెంటు పన్ల మీద తిరుగుతునాఁవు…. ” అని మళ్ళీ అట్నుంచి 52ఇ మీదకే చూసుకుంటున్నాడు. బస్సు మీంచి చూపు తిప్పుకోకుండానే ” ఊఁ..ఇంకేంటి సార్‌ ? హాట్‌ సన్‌ లోన టూ వీలర్‌ మీద జర్నీ చేస్తునారు…? ” అని అంతా ‘ నార్మల్‌ ‘ గా ఉన్నట్టు మాటాడుతుంటే భాస్కర కుమార్‌కి కాలింది. భుజఁమ్మీది చెయ్యి బిగించి కూలింగ్‌ కళ్ళలోకే చూస్తూ ” మర్యాదగా చెప్పినప్పుడే వినాలి మీ అద్ది బాకీలు మీరే ఉంచుకోండి మా ఇల్లు మాకిచ్చీయండి! ” అని కటువుగానూ, ” చూడండాలోచించండి మా దొడ్డ తట్టుకోలేదు …హార్టు?! ” అని గుండెల మీద చెయ్యి వేసుకుని మృదువుగానూ చెప్పి చూసేడు. అతను చెయ్యి విదిలించుకుని, తననీ విదిలించుకుని గొంతు పెంచి ” వాడ్డూయూ నో యెబౌట్‌ రెస్పెక్ట్‌ ఐ సే? యువార్‌ ష్టాపింగ్‌ మీ ఇందీ మిడిలాఫ్దీ రోడ్‌ లైక్దిస్‌ యెండ్‌ యువార్‌ లెక్చరింగ్‌ మీ?? ” అని 52ఇ ఎక్కి వేలాడుతూ తన కళ్ళముందే దూరం జరిగిపోతూ ” దిసీజ్‌ నాట్‌ బ్లడీ యునైటడ్‌ స్టేట్స్‌ దిసీజ్‌ ఇండియా ఐ సే! ” అని వేళ్ళాడిస్తూ దుమ్ములో మాయం అయిపోయేడు. నందగోపాల్‌ జిలేబీల పొట్లం అందించి శిల లాగ నించున్నాడు. ఇంక మిగిలిన ఈ ఇన్ని రోజుల్లోనూ నందగోపాల్‌ మౌనం బండారు బేకు గాడి స్నేహం హైమవతి గారి దగ్గర నందగోపాల్‌ దగ్గరా యూనివర్శిటీల్లోనూ ప్రదర్శించే తన intellectual face ఇవేవైనా దొడ్డని ఆతీ ప్రకాష్‌ బారినుండి రక్షించగలవా అని బెదురుతున్నాడు భాస్కర కుమార్‌.

ఒచ్చిన మర్నాడే దొడ్డ చెప్పుకుని కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాది. ” ఆతీ వాడు ఏకు మేకై పోయేడు నాయినా చెప్తునాను భాస్కరా ఇదీగోటి! ” అని. ” ఇల్లు పడీసుకుంటాడు గావోలు రామం రామం రామం రామం రామం రామం వాడికి దుర్బుద్ధి పుట్టింది భాస్కరా ఇదీగోటి! ” అని. ఎర్రటెండలోన తనూ దొడ్డా వెళ్ళి తలుపు గడియా కొట్టగా కొట్టగా ఆతీ ప్రకాష్‌ కర్టెన్‌ తోసుకుని బయిటికొచ్చేడు. పట్టు లుంగీ కట్టుకుని, ఖద్దరు చొక్కా తొడుక్కుని, ఇమిటేషన్‌ రేబాన్‌ కూలింగ్లాసెస్‌ పెట్టుకుని, నొసలు రెండూ కలిసే చోట చిన్న కుంకం బొట్టు పెట్టుకుని మీసాలు సవరించుకుంటూ అయిష్టంగా వీధి జాబిరీ తలుపులు తియ్యకుండా అవతల్నుంచే ” ఖాళీ చేసెస్తాం లెండి! ఇంకో ఇల్లు దొరగ్గానే మీ ఇంటి తాళాలు పువ్వుల్లో పెట్టీసి వెళిపోతాఁవు. ఇలాగ ఇళ్ళమీదకొచ్చి డిష్టర్బెన్స్‌ చెయ్యటం ఏఁవీ మర్యాదగా లేదు. గాయత్రి పూజలో వున్నాను…. నో నో అయామిన్‌ గాయత్రీ వర్షిప్‌ యూ ప్లీజ్‌ కమ్‌ బేక్‌ సమదర్‌ టైం..! ” అని భక్తి మాటలు మాటాడుతూ విదిలించుకుంటున్నాడు. ” మీరే గనక మాట మీద నిలబడ వలిసిన మనుషులే అయితే ముందు కొళాయిగొట్టం రిపేర్‌ చేయించి ఆనక మాటాడండి! కాదుండండి మీరుండండీ ముందు!! ఆవిడి లేడీస్‌ని అలాగుండమనండి ముందు! కాదు లేడీస్‌ తోటి కాదు ముందు కొళాయి గొట్టం….. ” అని ‘ ఎటాక్‌ ‘ చేస్తున్నాడు. వెనకనుండి చిన్నమ్మలు ” ఇదుగో తమ్ముడు గారు! మా ఆయన వేదమాత పూజలో వున్నారు….! మీరు ఫారన్నుండొచ్చేవుట. ఇప్పుడు వీల్లేదు తరవాత రావయ్యా… ” అని పెద్ద పెద్ద కోపం కళ్ళు వేసుకుని దండుతనం చేస్తున్నాది. దొడ్డ కళ్ళంట నీళ్ళు కళ్ళలోనే అణుచుకుని ” ఖాళీ చెయ్యరా అయితే ఇల్లు పడీసుకుంటారా? పెళ్ళం పిల్లలూ రోడ్డు మీద నిలబడిపోయేరని బతిమాలితే ఇల్లిచ్చేఁవు మా అత్తగారు చెక్క సున్నాలు తట్టలు మోసి కట్టుకున్నారు మా పెద్దల కష్టార్జితం పడీసు కుంటావా ప్రెకాషూ ఇలాగేనా పోనీ గానీ ఇదీగోటి…? ” అని ప్రాధీనం పడుతున్నా.

పదమూడేళ్ళ కిందట ఆతీప్రకాష్‌ దొడ్డ చేతులు పట్టుకుని ఇలాగే ప్రాధీనం పడ్డాడు. ” ఫాదరు సడన్‌ గా పోయేరు బ్రదర్‌ హెల్తు బావులేదు సిష్టర్‌ మేరేజి చేయించవల్సిన బాధ్యతా నామీదే ఉన్నాది అత్తయ్‌ గారూ మా మదరు మొఖం చూసైనా సరే మీరివ్వకపోతే ఇల్లు మరెవళ్ళిస్తారు? ” అని. ” నేనూ మీ కూతురూ ఇల్లు పువ్వులు ఇదుగో పువ్వుల్లో పెట్టి చూసుకుంటాఁవు ముప్ఫయ్యో తారీకు రాత్తిరి ఏడోగంట కల్లా మీకు ఇదో నేనో ఎవళ్ళో ఒకళ్ళం సంతోషు నగరు మీ అద్ది డబ్బులు తెచ్చి మీ కాళ్ళ దెగ్గిర పెట్టెస్తాఁవు! ” అనీ. ” ఒద్దు చిన్నమ్మలూ నేను పడలేను ఇల్లమ్మి సొమ్ము చేసేకే మా భాస్కరుడు అమిరికా వెళిపోతాడు… ” అని దొడ్డ నసుగుతుంటే ఇప్పటి వరుకూ చెప్పినవాటి కంటే ముఖ్యమైంది ఇంకొకటి అన్నట్టు భాస్కర కుమార్‌ చెయ్యి పట్టుకుని ” మీకు ఎప్పటికైనా చెప్తునాను ఒక విషయం గుర్తు పెట్టుకోండి! మన వాడికి మన వాడే శతృవు! మన బ్రహ్మిగాడికి దీ వరష్టు ఎనిమీ ఎవరయ్యా అంటే మన బ్రహ్మిగాడే! ” అని తీర్మానించేడు. అప్పుడు భాస్కర కుమార్‌ ఈ ఇంటి మీద ‘ ఫోకస్‌ ‘ చెయ్యటం లేదు, పర్య్డూ యూనివర్శిటీ వోడు ట్యూషన్‌ వెయ్‌ వర్‌ ఇస్తాడా ఇవ్వడా అని. కూరెళ్ళ జోగారావు తువ్వాలు కప్పుకుని చేతులు కట్టుకుని ఇదంతా వింటూ ” ఆ ముక్క నిజం గురూ! నీకు వేరే ఎవరో అక్ఖల్లేదు! మనవాడికి మనవాడే శతృవు!! ” అని సమర్ధించేడు. ఇలాగనీసి తను మొట్టమొదట యూనివర్శిటీలో విన్నాడు అంటే తెలగావోడికి తెలగావోడే శతృవు. కమ్మావోడికి కమ్మావోడే శతృవు. గవర్లకి గవరావోడే కరణాలికి కరణపోడే బ్రేహ్మడికి బ్రేహ్మడే సాయిబులికి సాయిబే వరష్ట ఎనిమీ! మీకింక వేరే ఎవడో అక్ఖల్లేదు!! ఆతీప్రకాష్‌ ఈ యదార్ధం చెప్తుంటే చిన్నమ్మలు పనసతొనలు, WELCOME అని ఎరుపు ఆకుపచ్చ పట్టుదారంతో కుట్టిన గలేబూ తెచ్చి దొడ్డకిచ్చింది. దొడ్డ అక్కడ ఏం అనలేదుగాని ఇంటికొచ్చి ఆతీ చిన్నమ్మలు ఇచ్చిన పనసతొనలు ఒకొక్కటీ ఎత్తి నోట్లో వేసుకుంటూ ఈ దొడ్డే ఈ నోటితోటే ” ఆతీ చిన్నమ్మలు వంటి మనిషి లేదు! వెయ్యిమంది మనుషుల్లోన ఎంచిపెట్టవల్సిన పిల్ల. పని ముద్దా భాగ్యం ముద్దా? ” అని అడిగి తన జవాబు కోసం ఏం ఆగకుండా పనే ముద్దు, పనసతొనల్లాగ చిన్నమ్మలే ముద్దు, అద్ది ఏడువందలు, మూడ్నెల్లు ఎడ్వాన్సు, నీటికీ కరంటూ వేరే, చెప్తునాను భాస్కరా ఇదీగోటి అని నిర్ణయాలు తీసుకుంది. ఇలాగని కానుకోలేకపోయేను సుమీ అని, చిమ్మెటకేమి ఫలంబు భాస్కరా? అన్నట్టు శపిస్తూ తన అంగీకారం కోసం చూస్తుంది ఇప్పుడు. ‘ ఆతీవాడ్ని అనడం ఎందుకులేవే? ‘ అంటే విచిత్రంగా, అపనమ్మకంగా, వ్యాస పీఠం వంపులోంచి తిరస్కారంగానూ చూస్తూ.

శనివారం ఉదయాలు ఫోన్‌ చేసినప్పుడు ” నీకు ఏఁవీ బెంగ లేదురా! ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఎంతో…. హేపీగా ఎంతో…. నిమానుగా ఉన్నాను విన్నావా ఆతీవాడ్ని వెళ్ళి బతిమాలితే అద్దివ్వలేదు గాని వెళిపోతాను అత్తయ్య గారూ మీ ఇల్లు నాకెందుకన్నాడు మంచివాడేన్రా …. అయ్యొ బంగార్లా వుంది నీకు ఫోను బోళ్డు డబ్బు బెంగలేదు భాస్కరా ఇదీగోటి! ” అని భరోసాలు ఇస్తుంది కదా అని, ” అయ్యో ఈ ఇళ్ళూ ఈ వాకళ్ళూ నాకెందుకూ? ఇదుగో చూడూ…! పెన్షను కాయితం సుబ్బ పేరు మీద రాసీసి ఆ ఇల్లమ్మి పారీసి డబ్బు చేయీసి ఋషీకేశ్‌ వెళిపోతాను. అన్నీ చూయిసేను.. ఇదుగో?! ” అని చెయ్యి అటక వేపు చూపించి మళ్ళీ తన గుండెలవేపు చూపించి ‘ మనకి ‘ ఇది ‘ కాదు… ‘ అది ” అన్నట్టు అంటుంది కదా అని ఒక రోజు ఫలహారాలు అయిపోయేక కూర్చోబెట్టి ” పోనీ నీకు ఈ ఇల్లుంది కదా ఈ సంతోషు నగర్లోను. ఇక్కడుండు. ఆ ఇల్లు మర్చిపోవే! అందిమీద రావల్సినందేదో మేం నీకు … ” అని నసిగితే ” బిళ్ళ కుడుం లాటి ఇల్లు వాడు అప్పనంగా పడీసుకుంటూవుంటే చూస్తూ ఊరుకుంటావా? నీకేం నాయినా నువ్వు రాజువి నీకు మా ఇళ్ళూ మా బతుకులూ ఈకముక్కా బరాబర్‌! ఆ ఇల్లు సుబ్బకి! దానికీ పిల్లలకీ ఏ మొహం చూపించమన్నావు? మీ పెదనాన్న పోయినప్పుడొచ్చిందీ నేను మిషన్‌ తొక్కి తెచ్చుకున్నదీ డబ్బు పట్టికెళ్ళి మన్ను చేసేను. అదీ వాడూ నన్ను అన్ని మాటలన్నాకా … ” అని రామకోటి రాయడం ఆపీసి ఎప్పటెప్పటి అవమానాలు, వ్యధలు, ప్రణాళికలు అన్నీ తవ్వుకుని ఏడిచింది.

భాస్కర కుమార్‌ ఆతీవోడితో ఈ ఒక్క యుద్ధానికే ఇలా బేజారైపోతున్నాడు; కానీ దొడ్డ తన బతుకంతా ఒక యుద్ధమే చేసింది.
అంటే తనకి యుద్ధం ఎలాగో రాదని అనుకుంటాడు భాస్కర కుమార్‌, లేదా యుద్ధమంటే ఇష్టం లేదు, అవసరం రాలేదో ఆ తరవాత్తరవాత యుద్ధం చేసి గెలుచుకోవలిసినంతటివి ఏవీ కనిపించలేదు ఎప్పుడూ. ఎవడేనావచ్చి ” ఆయ్‌ టట్‌, అత్తిరికానా! అది నాది!! ” అంటే ” ఊఁ ఇదుగో.. అదీ, ఇదీ, ఇవీ … ఇవన్నీ ఇందా! ” అని ఇచ్చెస్తాడనీ, ” ఊరికి తూరుపెటుందో తెలీదు, రూపాయికి పైసలెన్నో తెలీవూ ” అని దొడ్డే తన గురించి సర్టిఫికెట్లు ఇచ్చింది. ఓంకారం పెదనాన్న అర్ధంతరంగా పోతే ఇరవైమూడేళ్ళ వయసు నుండి దొడ్డ బతుకే ఒక పానిపట్‌ యుద్ధం, దాని నోరే ఒక ఆయుధం. అద్దిలోడితోటి, అప్పులోడితోటి, ఆడబడుచుల తోటి, అమ్మగార్లతోటి, డియ్యీవో ఆఫీసు గుమస్తాల తోటి, అత్తగారూ మొగుడూ కలిసి కొట్టుగదిలో కాల్చీసి చంపీ బోతే అర్ధరాత్రి ‘ కుట్టు టీచరు గారూ! ‘ అని తలుపులు బాదుకుంటూ వొచ్చి పడిపోయిన తన స్టూడెంట్‌ మొగుడి తోటీ. అసూయలు టైఫాయిడ్‌ చుట్టాలు ఇల్లు కారిపోడాలు గొలుసు తెంచుకుపోబోయిన దొంగలు మొగ పెళ్ళివారు ఇటువంటి బాణాలుసూటిగా ‘ సర్ర్‌ ‘ మనొచ్చి గుద్దీబోతే ఎలాగ ఆచుకోవాలో, ఎప్పుడు ఊరుకోవాలో, ఎప్పుడు అసలు ఊరుకోకుండా ఎంత మాత్రం ఒప్పుకోకుండా ” నాతోటి పెట్టుకుంటావురా? కుట్టు టీచరు గారంటే ఎటువంటి మనిషో ఈ సంతోషు నగర్లో ఎవళ్నేనా అడిగిచూడు.. ” అని దాన్ని అందుకుని మళ్ళీ అవతలోడి గుండెల మీదికే తిప్పికొట్టాలో ఆ యుద్ధ విద్య దొడ్డకి ఒచ్చునని భాస్కర కుమార్‌కి తెలుసు. కొళాయి నీళ్ళు రానప్పుడు నీళ్ళ లారీ దగ్గర, పాల పేకట్ల దగ్గిరా, ఇంక బండి కదిలిపోతూ వుంటే జబర్దస్తీగా రైలెక్కి పోతూ, ‘ శాతవాహనా ‘ మెస్సులో O.C. లకీ B.C. లకీ టకాఫోర్‌ వచ్చినప్పుడు సోడాబుడ్డీలు విసురుకుని కిటికీలు కళ్ళద్దాలు పగలడాలు చూసినప్పుడూ యుద్ధాలు ఎందుకు చేసుకుంటారో భాస్కర కుమార్‌ నెమ్మదిమీద తెలుసుకున్నాడు. ‘ హలో అండీ! నమస్తే! ఊఁ… ఏంటి చెప్పండి…బాఁన్నారా? చెప్పాలీ…. ‘ అని, ‘David! Its been a lo….ng time!! How you been?! How’s Amy holdin’ up?’ అనీ మర్యాద మర్యాదగానే రహస్యంగా యుద్ధాలు చేసుకుంటారని బెంగగా ఉన్నాడనో నిందిస్తున్నట్టు ఉన్నాడనో తను చెప్పకుండానే ఎలాగో పసిగట్టి ప్రొఫెసర్‌ ఒక డిసెంబర్‌ రాత్రి Dunkin Donuts కి లాక్కెళ్ళేడు. అక్కడ రాత్రి మూడున్నర వరుకూ ఆయన గొప్ప తెలివితేటలైన మాటలతోటి యుద్ధాలని ప్రపంచాన్ని తన వృత్తినీ భాస్కర కుమార్‌ ‘ బాధ్యత ‘ ల్నీ కాయితం నేప్‌కిన్స్‌ మీద స్కెచ్‌ లు వేసి చూపిస్తూ చివరికి ప్రాణాలు విసిగి “Don’t you sit around looking so goddam naive at me! Grow up!!” అని అంటే ‘Yes, of course… I mean … I know, Sir! I mean …..I really do! And don’t think I don’t appreciate all your concern for me.’ అనీసి పేంట్‌ జేబుల్లో చేతులు పెట్టుకుని వెచ్చటి ఆవిర్లు పైకి ఊదుకుంటూ యూనివర్సిటీ అవెన్యూ పక్క సందులో చలిగా ఎవరూ లేకుండా ఉండే రాత్రిలోకి నడుస్తూ ఆ మాటలు, స్కెచ్‌ లు అన్నీ రద్దు చేసుకున్నాడు భాస్కర కుమార్‌.

కాని ఆతీవోడ్ని అలాగ రద్దు చేసుకోలేడు. యుద్ధాలు చేసి చేసి అలిసిపోయి రామకోటి రాసుకుంటున్న ఒంటరి దొడ్డని ముసిలికాలంలో ఆతీ ప్రకాష్‌కీ చిన్నమ్మలుకీ C.A.R.E. కార్డియాలజీకీ వదిలీసి పోలేడు. మూడున్నరకి తెలివొచ్చీసింది. అది పీడ కల కాదు, చీడ నిజం. ఈ నిజాన్ని తట్టుకోడానికి, దొడ్డని ఆతీవోడి బారినుండి దక్కించుకోడానికీ ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నాడు. ఇసక పంతులు గారు దానికి సర్వ సైన్యాధ్యక్షుడు. అక్కిరెడ్డిపాలెం కోరీ లారీ జట్లు అక్షౌహిణులు. ” ఛీ ఒకద్దిలోడిచేత ఒకిల్లూ ఖాళీ చేయించలేక ఎందుకమ్మా నీ లైఫ్‌ వేష్టు? ” అని విసుక్కునే క్రిష్ణబావ ఇసక లారీ వెనకాల మారుతీ జెన్‌కి రధ సారధి. హైమవతి గారు, నంద గోపాల్‌ , బండారి బేకు గాడు ఆంతరంగిక మిత్రులు. సన్యాసిరాజు గారు ఘటోత్కచుడు. కేశవ రాజు, నారాయణ తాతయ్య కృపాచార్యుడూ భీష్ముడూ ఇలాగ మంచం మీద చీకట్లో దెయ్యాల్లాగ బుర్రలు విరబూసుకుని ఊగుతున్న కొబ్బరి చెట్లని చూస్తూ యుద్ధ వ్యూహం రచించుకుంటుంటే ఇంక ఏదీ నిలకడగా లేదు చింత చెట్టు మీద కొంగలు లారీ సౌండుకి లేచిపోయి గోల గోలగా అరుస్తున్నాయి. దొడ్డ కాఫీ గ్లాసు లాంతరు చెరో చేతిలో పట్టుకుని ” నిద్దర తేలిపొయిందీ… ఆఁహాహ నిద్దర తేలిపోయింది ఇదీగోటి…? ” అనొచ్చింది. అన్నిటికీ ఇదీగోటి అంటుంది. చెప్తునాను భాస్కరా ఇదీగోటి అని. పొత్తి పంచ ఆరవేసుకుంటూ ” నాన్నా ఇసక పంతులుగారికి కబురుపెడతానన్నావురా కబురు పెట్టేకావూ ఇదీగోటి? ” అన్నాది. ” అబ్బా ఉండవే కబురు పెట్టేను ఎక్కడా ఐపు లేడు ఎక్కడ తాగీసి పడుకున్నాడో ఇదీగోటి ” అంటే ముక్కు నలుపుకుంటూ ఉక్రోషంగా రామకోటి పుస్తకంలో రాసుకుంటూ ” బావుంది నాయినా మాబావుంది నీ సాయం బావుంది మీ అమ్మ గుమ్మలక్షింపురం వెళిపోడం బావుంది కాదూ ఇసక పంతులు గారు మాబావున్నాడు ఆతీ వాడు ఫష్టు మార్కుగా వున్నాడు వాడి పెళ్ళం బంగార్లా వున్నాది నాయినా ఇదీగోటి ” అని Positive Thinking గా మాటాడుతున్నాది. దొడ్డకి ఎంతో కడుపు మండిపోతే తప్ప అలాగ పోజిటివ్‌ పోజిటివ్‌ గా మాటాడదు. ఆతీవోడు ఒద్దంటే కనిపిస్తాడు రోడ్ల మీదా, కలల్లోనూ. ఇసక పంతులు గారు ఎంత వెదికినా కనిపించడు. తను ఇక్కడ లారీ జట్లూ పోయి సన్యాసిరాజు గారూ లేక ఇసక పంతులూ రాక గంగిగోవు లాటి ఈ నందగోపాల్నీ పావురాయి లాటి ఆ హైమవతి గార్నీ బక్కెద్దు లాగ బేకుడ్నీ నమ్ముకుని ముళ్ళు పీకీసిన ముళ్ళ పంది లాగ ఈ ఇన్ని రోజులూ తనూ అనుకున్నాడు భాస్కర కుమార్‌. తనలో తనకి నవ్వు వస్తుంది ఊరికే, ఆతీవోడి మీద కోపం రావటానికి బదులు. ఆతీ ప్రకాష్‌కి ఇన్నేళ్ళకి కాబోలు దుర్బుద్ధి పుట్టింది కాబోలు! భాస్కర కుమార్‌కి తెల్లారి లెగిస్తే రోజూ ఎప్పుడో ఒక సందర్భంలో అంటే ఉపలహపష లో కనెక్షన్‌ ఫ్లైట్‌ ఎక్కడానికి సూట్‌కేస్‌ లాక్కుంటూ కంగారు కంగారుగా పరిగెడ్తున్నప్పుడో, బోర్డ్‌ రూంలో అందరి ముందూ హుందాగా లేని చెమట తుడుచుకుంటూ ఒక insight ని belabour చేసే సందర్భంలోనో, మృదులని Sun Shine Montessori లో దింపి తలుపు వేసి వస్తూ ఎదురుగా ఆలనషపళ వాళ్ళ అమ్మ కనిపించి You have a great day! అంటూ వెనక్కి నడిచేటప్పుడో దుర్బుద్ధి పుడుతూనే ఉంటుంది. అది అలా పుట్టి తన సందిళ్ళలో కూర్చుని ఏ13 మీద డ్రైవ్‌ చేస్తున్నంతసేపూ పెరిగి పెద్దదవుతూ తనతోనే ఉండి ఏ ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గరో మాట వరసకైనా చెప్పకుండా కారు దిగి పోతుంది కాబోలు. ” దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది గోపాల్‌…? అంటే అదికాదు అసలు ఒరిజినల్‌ గా ఎందుకు…. ? ” అని అడిగితే అడిగిన ఇరవై నిమిషాల తరవాత అదిగో తీగెలు లాగుతున్నాడు. ” దుర్బుద్ధి అని వేరే లేదు, బుద్ధులన్నీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి దుర్బుద్ధులే! ” అని ఒక తెలిసిన స్థైర్యంతో అన్నాడు. గన్నేరు చెట్ల కింద అతని మాటలు విని ఆశా కిరణం లాగ, అంతా సద్దీసినట్టు ఉంటుంది నిజమే కాని ఆతీవోడికి పుట్టిన బుద్ధికి పదకొండు రోజుల్లో సమాధానం ఇవ్వగలిగింది ఒక ఇసక పంతులో ఒక సన్యాసిరాజో.

కబుర్ల మీద కబుర్లు పెట్టినా రంగిరీజు వీధిలోనూ కోట వీధిలోనూ లేడు అల్లిపురం సున్నం బట్టీల దెగ్గిర లేడు కల్లు పాకల దెగ్గిరా నందమూరి తారక రామ సాగర తీర ఆరామం దెగ్గిరా కొత్త జాలారిపేట దెగ్గిరా ఎక్కడా ఐపు లేడు కలడు కలండనెడి ఇసకపంతులు గారు కలడో లేడో అనుకుని ఊరుకోబోతే తెల్లారి నాలుక్కి ఇసక లారీ బీచీలోంచి వీధిలోకి గర్రుమని ఎక్కుతున్న మంగళ ధ్వని వినిపించింది. లారీ ఇంటి ముందు ఆగితే లేచి వీధి జాబిరీలోకి వెళ్ళేడు. ఇసక పంతులు లారీ ఫుట్‌ రెస్ట్‌ మీద ఓ కాలూ ఇంటి గుమ్మం మీద ఓ కాలూ వేసి అసలే చిన్న చిన్న కళ్ళు మరీ చికిలించి ఇంట్లోకి చూస్తున్నాడు. వాళ్ళొచ్చేరని తెలిసినా కర్టెన్‌ తీసుకుని వెళ్ళకుండా లోపట్నుండే చూస్తున్నాడు భాస్కర కుమార్‌. పొట్టప్పారావు ఇసక లోడు మీంచి వీధిలోకి గెంతి “బాబుకి పిల్రాదా?” అన్నాడు. ఇసక పంతులు సిగరెట్టు పెదాల మధ్యనుండి కింద పడకుండానే ” వొస్తాడుండు అతనే ఒస్తాడు! ” అని తదేక దీక్షగా కర్టెన్‌ సందులోంచి ఇంట్లోకే చూస్తున్నాడు. లారీ జట్టులోన మిగితా ఇద్దరూ ఇద్దరాడమనుషులు ఒక మొగ్కూలి తల పాగాలు చుట్టుకుని లోడు మీదే కూర్చుని ఊదుకుంటూ టీలు తాగుతున్నారు. డ్రైవరు లైట్లార్పీసేడు. వీధిలోన కుక్కలు మొరుగుతుంటే. భాస్కర కుమార్‌ తాళం తెచ్చి జాబిరీ తలుపు తీసి “ఏటండీ ఇసక పంతులు గారు?” అన్నాడు. ఆయన సిగరెట్‌ ఆఖరి దమ్ము పీల్చి కాలవలోకిసిరీసి “ఊఁ ఏటండీ? ఏటెప్పుడొచ్చేరు?” అన్నాడు. భాస్కర కుమార్‌ అది పట్టించుకోకుండానే “డబల్లోడు తెమ్మన్నాను?” అని దబాయించేడు. సముద్రం మీది గాలి ప్రాణాలకి హాయిగా తగుల్తుంది. పొట్టప్పారావు లారీ జట్టు ముడుచుకుని కూచున్నారు. ఇసక పంతులు గారు బెరుకు లేకుండా భాస్కర కుమార్‌ మొహం లోకే చీనా కళ్ళు చికిలించి చూస్తున్నాడు. ఈ ధనుర్మాసం ఉదయాలు తనకీ చలిగా ఉండేవి. ఇప్పుడు St. Paul చలికి అలవాటైపోయి వెచ్చ వెచ్చగా ఉంటాయి. పొట్టప్పారావు డ్రైవరూ ఇసక జట్టూ అతన్నే పరీక్షగా చూస్తున్నారు. ఈ బాబు ఆ బాబేనా అని. భాస్కర కుమార్‌ పాత జాలారి పేట గొంతు ఏ మాత్రం చెదరకుండా “ఏటి సింగిల్లోడు తెచ్చీసేరేటి? డబల్లోడు చెప్మని చెప్పేనా?” అని దబాయించేడు. ఇసక పంతులు రెండు గుండీలు ఇప్పిన చొక్కాలోంచి బొజ్జ జవ జవా కదిలించుకుంటూ నవ్వీసి గొంతుకలో ఇసక గర గరలాడించుకుంటూ “డబల్లోడేను వయ్యా….సింగిలు కాదు డబలేనూ!” అని ఏక వచనంలోకి దిగిపోయేడు. భాస్కర కుమార్‌కి ఇదే కావాలి. పొట్టప్పారావు “డబలేనండీ….అటేపు కోరీసింది. ఇలాగొచ్చీస్సూడంది ఇదా….ఇదేటి! డబలేనీ! సింగిల్లోడైతె ఇంతిసకొస్తాది?!” అని వత్తాసు పలికేడు. భాస్కర కుమార్‌ మాత్రం “ఏటిలాగే చేస్తనారా యేపారాలు….” అని ఏమాత్రం కాంప్రమైజ్‌ కాకుండా అరుగు మీంచి ఇసక లోడు మీదికి ఎక్కి గెంతబోయి కిందికి తూలిపోయి ఇసకలో పడిపోతే ఇసక పంతులు జబర్దస్తీగా జబ్బ పట్టుకుని ఆపీసి “అలవాటు తప్పోయేరు!” అన్నాడు. లారీ రైలింగు పట్టుకుని లేచి ఒంటి నిండా ఇసకని దులుపుకుంటూనే చేత్తో ఇసక పట్టుకుని చూసి వొదిలేడు. యెర్రిసక! గంబీరం గెడ్డ కోరీసి ఇలాటి ఇసక లోళ్ళు ఎన్నో తెచ్చేడు ఇసక పంతులు తనకోసం ఇదివరుకు. పదమూడు సంవత్సరాల్లో ఈ ఇసక ఏమీ మార లేదు. ఇసక లారీ అలాగే ఉంది. ఇసకప్పారావు అలాగే ఉన్నాడు. ఇసక జట్టు అప్పటి వాళ్ళు కారు. వీళ్ళ పేర్లు తనకి తెలీవు. తన పేరు వీళ్ళకీ. తెలియక్కర్లేదు. విరసంగా కొంచెం కోపంగా బండి దిగిపోయి “పాలిసకన్నారు ఒండ్రు మన్నూ యెర్రిసకా తెచ్చీసేరు. ఇలాగయితే లాభాలు గూబాల్లోకి దిగిపోవాల!” అన్నాడు. ఈళ్ళతోటి తనకి ఒక ‘ ఇది ‘ లాగ ఉంటుంది. ఇలాగనీసి ఇసక పంతులుకి ఎప్పుడూ చెప్పలేదు. అంటే చెప్తే….నెత్తెక్కెస్తాడు! ఫ్లాస్కోలోంచి టీ ఒంపుకుని చెరుకో గ్లాసులోనూ పోసుకుని “అయితే ఏటంటారయితే? తెల్లిసకేనూ….డబల్లోడు నా కళ్ళారా నేనే ఏయించేను. మన కాడ అలాటి బితిరీల్లేవు….మీరే….ఆ ఫారన్లంటెళిపోయి మీకు అంచనా తప్పిపేయింది!” అని ఎదురెక్కి చదరంగం ఆడుతున్నాడు.

ఇసక జట్టు తోటి ఇసక పంతుల్తోటీ ఇసక లారీతోటి ఇలాగ తెల్లార్ఝాములు మూడున్నరకి లారీ డోర్లిప్పీసి ‘ చపక్‌ చపక్‌ ‘ అని పారలతోటి తడి ఇసక తవ్వి పోయించుకోడం వర్క్‌ కోసం అనీ లాభాల కోసం అనీ అప్పుడు అనుక్కునే వాడు భాస్కరకుమార్‌. Menneapolis వెళ్ళింతరవాత, అది ఒక అబద్ధం అని, అంటే పచ్చబద్ధం కాదు కాని అదే పూర్తి నిజం కాదూ అని ఇప్పుడు భాస్కర కుమార్‌కి తెలుసును. రాత్రి ఇసక లోడు చెప్పడానికి సున్నపు వీధి వెళ్తే ఇసక పంతులు గారి కూతుళ్ళు కవల పిల్లలిద్దరూ “మా నానగారు లేరండీ? ఏంటండీ? ఇసక లోడు వేయించుకుంటారా?” అనడిగేరు. ఉట్టినే. ఇసక పంతులు తాగీసి ఆ లోపల ఎర్ర బల్బు జ్వాలాదీపం లాగ వెలుగుతున్న గదిలోన ఉల్లిపాయలు వేగుతున్న వాసనల మధ్యన పక్క బట్టల కింద పడుకుని ఉంటాడు. ఆ గురకలు భాస్కరకుమార్‌కి తెలుసు. ఇలాగ కొళాయి గొట్టాలూ కుళ్ళు కాలవలూ దాటించుకుని రాజ్‌దూత్‌ ని లాఘవంగా నడుపుకుంటూ ఈ సందుల్లోంచి తెచ్చి ఇసక పంతులు జ్వాలా ద్వీప రహస్యాలు తెలుసు. బొట్టూ కాటికా పెట్టుకుని పొగడ్రు రాసుకుని ” గంగా తరంగ రమణీయ జటా కలాపమ్‌ ” అని రెండు గొంతుకలు ఒకటి లాగ ఉచ్ఛైస్వరంతోటి పాడుకుంటూ ఇసకల పద్దులోన రాసుకునే పాపలు సర్వ లక్ష్మి, సంతోష లక్ష్మి ఇప్పుడు కొత్త. సర్వ లక్ష్మితోటి డబల్లోడు చెప్పీసి “ఇవాళ మీ ఇంట్లో బంగళుంపల వేపుడా?” అని అన్నాడు. రోజూ వాళ్ళింట్లో బంగళుంపల వేపుడే! “హే..ఎళ్ళె!” అని నవ్వి చెయ్యి విడిపించుకున్నారు. “బంగళుంపళా? వేపడ ముక్కలా?” అని కేకేసేడు. లోపట్నుండి వాళ్ళమ్మ నవ్వుతున్నాది. “భోయనానికుండిపోండి?” అని. భాస్కరకుమార్‌ ‘ ప్రొటీన్‌ డైట్‌ ‘ మీద ఉన్నాడు. తినక్కర్లేదు. వాసనలు చాలు. ఇసక పద్దులు రాసే బల్ల మీద వాళ్ళ స్క్లూల్‌ బేగ్‌ లు రెండు గుర్రం బీడీ సంచీలు ఉన్నాయి. ఒక సంచీ మీద అట్టలు ఇంక చిరగడానికి సిద్ధంగా ఒక నోట్‌ బుక్‌ ఉంది. దాని మీద గుండ్రంగా, నీలి రంగు అక్షరాలతోటి ఒ. సర్వ లక్ష్మి, 6 వ తరగతి 6th B మునిసిపల్‌ ప్రాధమికోన్నత పాటశాల, పండా వీధి అని. మొదటి పేజీ మీద సామాన్య అని రాసి, పసుపు కోరు ఇంటూలు పెట్టున్నాయి. రెండవ పేజీ మీద ద్రవ పీడన సమాపక స్థితి అని పాఠం మాటకీ మాటకీ మధ్య అన్ని జాగాలూ సమానంగా ఖాళీలొదిలి. పద్దులో రాసుకుని మళ్ళీ వాళ్ళు గంగా తరంగ రమణీయ జటా అని మెడలు ఎత్తి భయం దుఃఖం ఏమీ లేకుండా పాడుతుంటే తట్టుకోలేక లేచి వేగంగా ఇంటికొచ్చి ఆ రాత్రి తలుపులు వేసున్న గదిలో ఆ ఇద్దరు పిల్లల మొఖాలు పెచ్చుళూడిన గది యూనివర్సిటీలు స్నేహితులు చీకటిగా ఉండే తోటలు తలచుకుంటూ దావానలమ్‌ మరణ శోక జరాటవీనామ్‌ అని వెక్కి వెక్కి ఏడ్చుకున్నాడు భాస్కర కుమార్‌. ఇవన్నీ ఇసక. ఇసక వేయించుకోడం ఇసక కోసమే.

బండి దిగిపోయి రెండు వంద నోట్లూ ఒక ఇరవై నోటూ తీసి ఇసక పంతులు చేతిలో పెట్టేడు. అతను నోట్లు నిర్లక్ష్యంగా లెక్క పెట్టి “ఇంకో వందొస్తాది!” అన్నాడు.
“ఎందుకలాగిచ్చీగల్రు…! రెండూ ఇరవై!” “ఏటి మాటాడతనారండీ?” అని రైజైపోతుంటే అరుగు మీద కూచోపెట్టి కూల్‌ డౌన్‌ చేసి ” పంతులు గారూ! ఇసక్కోసం కాదండీ! మీ ఇసక మీరు పట్టికెళిపోండి కావాలంటే.. ” అనంటే ఆయన ఆరిపోతున్న సిగరెట్టుకి కొత్త సిగరెట్టు ముట్టించి “ఇసక్కోసం కాదూ? డబల్లోడు? మరేటి మా మీద బెంగెట్టుకున్నారా?” అని బొజ్జ ఎగరేసుకుంటూ నవ్వుతున్నాడు. “మిమ్మల్ని చూడాలుందని! ఒట్టు తల్లితోడు” అంటే ” ఎల్లండీ పొద్దుగాల పొద్దుగాలి మాతోటిగటాలు. మా డబ్బులు మాకు పడీయండి మాకు రూట్లున్నాయి! ” అని లేచి లారీ ఎక్కీబోయేడు. ” మా దొడ్డ గారి పాతింట్లోన ఆతీవోడనీసి దిగేడు తెలుసు కదండీ? ” అంటే ” అవును బ్రైను కంపెనీ ఆల ఫాదరు రైల్వేలో గార్డు చేసి రిటారయిపోయేడు కదా? మనకెందుకు తెలీదు ఆడి జాతకం? ” అని మళ్ళీ కూర్చున్నాడు. ” మా దొడ్డ ఒక్కద్దాని అలుసు చూసుకుని ఇల్లు ఖాళీ చెయ్యకుండా అద్దివ్వకుండా ఏడిపిస్తనాడు. నాకు చూస్తే ఇంకా పదకొండ్రోజులే వున్నాయి. ఎవళకి చెప్పి కాళీ చేయించాలో తెలీక మీ కోసం మీ ఇంటి చుట్టూ తిరుగుతునాఁవు ” అంటే పొట్టప్పారావు ” ఇసక పంతులు గారు ఇంటికాడెందుకుంటాడు బాబూ? ” అని కలగజేసుకునాడు. ” సీరియస్‌ మేటర్లోన ఇగటాలేటివై? ” అని కసిరీసి ” ఈపాటి దానికి ఇంత వర్రీ ఐపోవాలా? ఆదివారం పొద్దుటే ఎక్కడికీ ఎల్లకుండా వెచ్చగా తొంగోనుంటాడు కాడా? రెండు జట్లు కట్టుకుని ఇంటి మీదకెళిపోయి తట్టా బుట్టా తీసిసిరీమన్నావా ఆలిల్లు ఆలకొగ్గీసెళిపోతావా? అంటే ఆడే పోతాడు మీరు బెంగ పెట్టుకోకండి ” అని అభయం ఇచ్చేడు. ‘ ఓసీపాటిదానికి సన్యాసిరాజు దాకా ఎందు ‘ కని దొడ్డ కాఫీ తెచ్చిస్తే తీసుకునే బదులు దండం పెట్టేడు. ‘ ఎల్లుండి పొద్దుటాదివారం ఈ పాటి వేళకల్లా రడీగా ఉండ ‘ మని. లారీ కేబిన్లో ఒక కాలూ మెట్టు మీద ఒక్కాలూ పెట్టి రివర్స్‌ చేయించుకుంటూ ‘ నీకెందుకు నీనున్నాను కదా ‘ అని అర్ధం వచ్చే లాగ అరమోడ్పు కళ్ళూ చూపుడు వేలూ తిప్పుతూ అక్కిరెడ్డి పాలెం జట్టు తోటి తెల తెలవారుతున్న బీచీలోకి దిగిపోయేడు.

(ఇంకా ఉంది)