నిరాద్ చంద్ర చౌదరి, రాజారావు ఇరవయ్యవ శతాబ్దపు భారతీయ ఆంగ్ల రచయితలు. ఇద్దరూ పాత తరం రచయితలు. నిరాద్ బాబు 1999లో, తన నూట రెండవ ఏట పోయేరు. నూరేళ్ళు నిండుతున్న రాజారావు ఆష్టిన్ లో సోషల్ సెక్యూరిటీ ఆదాయం మీద జీవిస్తున్నారు. నిరాద్ చౌదరి రచనలు నిశితమైన దృష్టికి, పాండిత్యానికి పేరు పడ్డాయి. రాజారావు రచనల్లో కనిపించేది ముఖ్యంగా తాత్విక చింతన. ఇద్దరూ భారతీయ సంస్కృతిని గురించి, హైందవ ధర్మాన్ని గురించీ విస్తృతంగా చదువుకుని, ఆలోచించిన వాళ్ళు. ఈ చింతన వాళ్ళ రచనల్లో ప్రతిఫలిస్తుంది. నిరాద్ చౌదరి రాసిన పుస్తకాలు Autobiography of an Unknown Indian, Hinduism: A Religion to Live By అనేవి, రాజారావు రచనలు The Meaning of India, The Great Indian Way, Serpent and The Rope ఇందుకు కొన్ని ఉదాహరణలు. ఇద్దరికీ భారత దేశం అంటే, భారతీయ సమాజం అంటే ప్రేమ. అయితే, భారతీయత పట్ల నిరాద్ చౌదరి వైఖరి బౌద్ధికమైనది. ఒక పండితుడు, విమర్శకుడు కర్కశంగా నిష్పాక్షికంగా చేసే విశ్లేషణ. రాజారావు కు భారతీయత మీద ఉండే దృష్టి తాత్వికమైనది. ఒక కవి, యోగి, లేదా ఋషి ( mystic or sage ) ధ్యాస వంటిది.
నిరాద్ చౌదరి తన నూరవ ఏట రాసిన పుస్తకం Three Horsemen of the New Apocalypse ప్రపంచంలోకెల్లా వృద్ధుడైన రచయిత రాసిన పుస్తకం అని చెప్పుకుంటారు. ఆయన జీవించి ఉండగా తన రచనల వల్ల చాలా వివాదానికి గురి కావలసి వచ్చింది. ఆయన రచనల్లో ఆంగ్లేయుల పాలనని సమర్ధిస్తున్న ధోరణి, భారత దేశాన్ని విమర్శించటం భారతీయులకి రుచించలేదు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ వాళ్ళు 1990 లో ఆయనకు గౌరవ డ్దాక్టరేట్ ఇచ్చి సత్కరించిన సందర్భంలో ఆయన గురించి : “ఈ బెంగాలీ మనిషికి బెంగాలీ కవిత్వం యూరోపియన్ కవిత్వమూ క్షుణ్ణంగా తెలుసు. తన నిశితమైన మేధస్సును ఉపయోగించి ఈయన భారతీయ సమాజాన్ని గురించి, సంస్కృతిని గురించీ మనకి అందించిన రచనలు మన సమాజాన్ని మనం అర్ధం చేసుకోడానికీ ఉపయోగపడ్డాయి. బ్రిటిష్ వాళ్ళు దేశాన్నొదిలి వెళ్ళిపోవడం, స్వతంత్ర భారత దేశం పుట్టుక ఈయన బేషరతుగా హర్షించలేకపోయేడు. భారతీయ సమాజాన్ని గురించి ఇతను వెలిబుచ్చిన అభిప్రాయాలు కఠినంగా, నిష్కర్షగా ఉండటం వల్ల ఈయన భారతీయులకు అభిమానపాత్రుడు కాలేక పోయేడు. కాని కాలం గడిచే కొద్దీ ఆ అపప్రధ పోతోంది” అన్నారు.
ఈ మధ్య Word As Mantra: The Art of Rajarao అనే పుస్తకం వచ్చింది. అంతకు ముందు రాజారావు రాసినవి The Meaning of India, The Great Indian Way వెలువడ్డాయి. ఈ పుస్తకాలు రాజారావును ఒక తాత్వికుడిగా, వేదాంతిగానూ ఆవిష్కరిస్తాయి. ఆయన తన కోసం తాను రాసుకుంటాడు, రాయటం ఒక సాధనగా రాసుకుంటాడు. “నేను పండితుణ్ణి కాను. సృజన చేసే రచయితని. చదరంగం బల్ల మీద ఏనుగులు, గుర్రాలు, శకటాలు, బంట్లతో ఆడి వినోదించినట్టు భావాలతో ఆడుకోవటం, అవి ఒకదాంతో మరొకటి పోటీలు పడి, ఓడీ గెలిచే క్రీడని చూసి ఆనందించటం నాకు ఇష్టం. ఈ ఆటకి నాతో రండి. ఆలోచనల చదరంగాన్ని బల్ల మీద చూసి, ఆ ఆటలోంచి వచ్చే రసాన్ని ఆస్వాదించడానికి, ఆనందించడానికీ.” అని పాఠకుల్ని హెచ్చరిస్తాడు.
ఏ పని చేసే వాళ్ళయినా ఏదో ఒక సందర్భంలో ఈ పని ఎందుకు చేస్తున్నామా అని ప్రశ్న వేసుకోవడం కద్దు. ఇలాటి ప్రశ్నలు కళా కారుల సంకల్పం ( motivation )తో ముడి పడి ఉంటాయి. సంకల్పం ఆంతరింగికం, చాలా వ్యక్తిగతమైన విషయం కాబట్టి, దీనికి సంబంధించిన ఇలాటి ప్రశ్నలు జటిలమైనవి. అర్జునుడు ఇదే ప్రశ్న అడిగితే శ్రీ కృష్ణుడు చెప్పిన జవాబే భగవద్గీత అంటారు. పాఠకులకి, విమర్శకులకీ ఈ ప్రశ్నకి జవాబు రాసే వాళ్ళ రచనల్లో, కళాకారుల కళా రూపాల్లోనూ కొంత వరకు గోచరిస్తుంది. అంటే, చదివితే చూస్తే వింటే తెలుస్తుంది. అయినా, రచయితలు, శాస్త్రవేత్తలు, కళా కారులు కొందరు ఈ ప్రశ్నకి తమకు తాముగా జవాబులు, సంజాయిషీలూ చెప్పుకోడం కూడా చూస్తాము. ఉదాహరణకి, A Mathematician’s Apology అని G. HL. Hardy (రామానుజం స్నేహితుడు)రాసిన పుస్తకం, ఇంకా “సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే” (త్యాగరాజు), “కవితా ఓ కవితా” (శ్రీ శ్రీ), “రోడ్లకు నమస్కారం” (అజంతా) వంటివి. ఈ ప్రశ్న తలెత్తిన తరువాత కూడా దాంతో సమాధాన పడలేకపోతే ఆ చేసే పని ఆగిపోవటం కూడా చూస్తాము. చలం రచనల్లో లాగ. రాజారావు, నిరాద్ చౌదరి కూడా ఎందుకు రాయాలీ అని తమల్ని తాము ప్రశ్నించుకున్నారు. ఏదో ఒక సందర్భంలో తమ రచనల్లోనో, ఇంటర్వ్యూల్లోనో ఆ ప్రశ్నకి జవాబు, సంజాయిషీ చెప్పుకున్నారు. ఈ వ్యాసంలో వాటి అనువాదాలున్నాయి.
మాట కాదు పాట: నిరాద్ చంద్ర చౌదరి
రచయితలు ఎందుకు రాస్తారు? రాయాలన్న బుద్ధి నీకెందుకు పుట్టింది అని తెలిసినవాళ్ళు అప్పుడప్పుడు అడుగుతుంటారు. “వెళ్ళి నీకు వేటాడలన్న బుద్ధి ఎందుకు పుట్టింది అని ఓ పులిని అడిగి చూడండి” అని ఒక తలతిక్క సమాధానం ఇస్తాను. సరదాకి కాదు, నిజంగానే. ఏ రచయితా రాయాలీ అని నిర్ణయించుకుని రాయడని నా నమ్మకం. ఒక అణుచుకోలేని తృష్ణ వల్ల, రాయకుండా ఉండలేడు కాబట్టి, తప్పనిసరై రాస్తాడు.
ఇది అందరు రచయితలకీ ఒక్కలాగే ఉండదు. కొందరు వృత్తికి రచయితలు. ప్రవృత్తి వల్ల రచయితలు కొందరుంటారు. రాయటం ప్రవృత్తి, అంటే స్వభావంగా ఉన్న వాళ్ళని పట్టి చూస్తే తెలిసేది ఏమిటంటే, వాళ్ళకి రాయటానికి ఒక కారణం అంటూ ఏమీ ఉండదు. డబ్బు, పేరు, కీర్తి, లేక గుర్తింపు కోసం అని కాకుండా, వాళ్ళకి రాయాలని బుద్ధి పుట్టినప్పుడు రాయాలని అనిపించింది రాస్తారు. వృత్తి రచయితలకి ఇవన్నీ, లేకపోతే వీటిలో ఏదో ఒకటి కావాలి. అది ఉంటే గాని రాయలేరు. తెలివి తేటలుగా దాన్ని సంపాదించుకుంటారు. ఈ రచయితల గురించి నా అభిప్రాయం చెప్పటానికి బెంగాలీ నవలా రచయిత బంకిం చంద్ర చటర్జీ చెప్పిన మాట సరిపోతుంది చూడండి. బంకిమ్ బాబు ఒక నవల్లో ఒక తిక్క శంకరయ్య పాత్రని సృష్టించేడు. ఇతను ఒక కోర్టు కేసులో సాక్ష్యం చెప్పటానికి వెళ్తాడు. వాది తరఫు వకీలు అతన్ని అడుగుతాడు : “ఏమండీ మీ వృత్తి ఏమిటి?” అని. అతను దానికి చాలా కోపగించుకుని “వృత్తా? వృత్తి పెట్టుకుని కూర్చోడానికి నేనేమన్నా సాందాన్నా ప్లీడర్నా?” అని కసురుకుంటాడు.
ఈ రెండు రకాలే కాదు. జంతు శాస్త్రంలో విభజించినట్టు రచయితల్ని సింహాలు, కుక్కలు, గుర్రాలు, గాడిదలూ ఇలాగ రక రకాలుగా విభజించుకోవచ్చు. నేను ఎలాటి జంతువునో నేను చెప్పను. నా పాఠకులకి విడిచి పెడుతున్నాను. కాని నేను ఎలాగ రాస్తానో, రచన అంటే నాకున్న అభిప్రాయం ఏమిటో మాత్రం చెప్పాలని ఉంది.
నేను ప్రవృత్తి రచయితని. రాయటం నా స్వభావం. నాకు బుద్ధి పుట్టినప్పుడు బుద్ధి పుట్టింది కాయితం మీద పెడతాను. అయితే ఇలా రాసిందాన్ని నేను, నా మేధస్సు సృష్టించిన సృజన అని మాత్రం ఎప్పుడూ అనుక్కోను. అంటే అవి నా ఆలోచనలు, అనుభూతుల ఫలితంగా సృష్టించినవని, అవి రాయటానికి కారణం నేననీ అనుక్కోను. రాయటం కోసం నా బుద్ధిని ఒక కెమేరా లాగ వాడతాను. దాన్ని ఫోకస్ చేసిన దృశ్యాల్ని అది ఫొటో నెగెటివ్ లాగ తీస్తుంది. ఆ నెగెటివ్ ని ఫొటో ప్రింటుగా డెవలప్ చెయ్యటం మాత్రమే నేను స్వయంగా చేసే పని. ఏదో ఫలితం ( effect) కోసం, ప్రయోజనం సాధించాలనీ నెగెటివ్ లో లేని వాటిని ఫొటోలోకి ఎంత మాత్రం చొరపడ నివ్వను.
మరి నేను రాసే పద్ధతిని గురించి. నా రాతలకి మూలమైన సూత్రం ఏమిటంటే, భాష అనేది ముఖ్యంగా వినడానికి ఉద్దేశించినది. చూసి చదవటానికి కాదు. అంచేత, రాయటం సంగీతాన్ని కూర్చటం వంటి పని అని నా నమ్మకం. రాసేటప్పుడు నేను ఒక వాగ్గేయ కారుడి లాగ ప్రవర్తిస్తాను. నేను రాసినదే మాట్లాడి చూస్తే ఎలా వినిపిస్తుందో చూసుకున్నాకే దాన్ని రాస్తాను.
ఇంగ్లీషు నేను ఆంగ్లేయుల దగ్గిర నేర్చుకోలేదు. ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో నాకు పెద్దవాణ్ణయ్యేక గాని తెలియ లేదు. నేను పుట్టింది కిషన్ గంజ్ అని ఓ పల్లెటూరు. అక్కడ బెంగాలీ టీచర్ల దగ్గిర నేర్చుకున్నాను ఇంగ్లీషు. తరవాత మెట్రిక్ చదువుతూ (19101914)మధ్య కలకత్తాలో నేర్చుకున్నాను. ఈ చదువుల వల్ల నాకు ఇంగ్లీష్ వాక్య నిర్మాణం, నుడికారం, మాటలు తగు మాత్రం తెలిసేయి. డిక్షనరీ చూసుకోకుండా చదివి విషయం అర్ధం చేసుకోవడం తెలిసింది. అయినా సరే, నా మొదటి పుస్తకం The Autobiography of an Unknown Indian రాస్తున్నప్పుడు (194748)చాలా ఆతృతగా ఉండేది. నేను రాసింది ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుకునే మాటల్లాగే ఉందా లేదా అని మధన పడేవాణ్ణి. అలా ఉంటే తప్ప నాకు నచ్చదు, ఇంగ్లీష్ పబ్లిషర్లు పుస్తకం వేసుకోరూ.
ఈ బెంగ పోవడానికి ఓ పద్ధతి కనిపెట్టేను. నేను రాసిన దాన్లోంచి ఒక పేరా గట్టిగా పైకి చదివటం. తరవాత ఇంగ్లీష్ లో ఏదైనా ఓ మంచి పుస్తకం లోంచి ఒక పేరా తీసి పైకే చదవటం. ఈ రెండు చదవటాలూ ఒక్క లాగే వినడానికి ఇంపుగా, ఎబ్బెట్టుగా లేకుండా ఉంటే నా రాత పరీక్ష గట్టెక్కినట్టే. ఇలాగ రక రకాల ఇంగ్లీష్ రచయితల వచనాన్ని పైకి చదివే వాణ్ణి. ఈ రచయితల వచనంలో లయ రక రకాలుగా ఉంటుంది. ఇంగ్లీష్ భాష ధ్వని ఇది అని ఒక్కటే ఏం లేదు. చదివితే అసలైన ఇంగ్లీష్ తూగు ఉందో లేదో నాకు తెలుస్తుంది.
ఈ పద్ధతి నాకు అచ్చొచ్చింది. ఇంగ్లండ్లో 1951 సెప్టెంబరు 8 న నా పుస్తకంలోంచి కొన్ని భాగాలు ఇఇఈ లో చదివి వినిపిస్తుంటే విని, “నేను రాస్తునప్పుడు నా మనస్సులో అనుకుని చదివినట్టే ఉంది” అని తృప్తి పడ్డాను. ఇలా వినికిడి ప్రకారం రాస్తూ ఉంటే వచనం రాయడం గురించి ఒక సంగతి బోధపడింది. రాసేటప్పుడు నా ఔద్వేగిక స్థితి ( mood) ని బట్టే నా రచన తూగు నడుస్తుంది. అంటే, రాసేటప్పుడు నేను మరీ ఉత్సాహంగానో, కోపంగానో ఉంటే నా రచన కూడా వడి వడిగా నడుస్తుంది, రౌద్రాన్ని చూపిస్తుంది. రాసేటప్పుడు నేను నెమ్మదిగా, సాత్వికంగా ఉంటే నా రచన నడక నింపాది గానూ, రసం సాత్వికంగానూ ఉంటాయి. అయితే ఈ పరిణామాలన్నీ అప్రయత్నంగా, అనుక్కోకుండా జరిగేవే. రంజింప చెయ్యాలి అనుకుని ప్రయత్న పూర్వకంగా చేసే రచనలు చదివితే తెలిసిపోతాయి, పాఠకుల్ని కదిలించలేవు.
నేను తెలుసుకున్న ఇంకో విషయం ఏమిటంటే, రచన వస్తువూ, రాసే శైలీ విడదీయలేనంతగా పెన వేసుకుని ఉంటాయి. ఇది వస్తువు, ఇది శైలి అని చెప్పడం అసాధ్యం. అందుకే సాహిత్యంలో మంచి శైలి వల్ల రాణించిన పనికిమాలిన వస్తువు అని కాని, శైలి బావుండక చెడిపోయిన మంచి వస్తువు అని కానీ ఏం ఉండవు. రూపాన్ని ఆస్వాదించే రస దృష్టి లేకపోవటం వల్లనో, వస్తువును అర్థం చేసుకునే శక్తి లేక పోవటం చేతో ఇలాటి సిద్ధాంతాల్ని ఆశ్రయిస్తాము. శైలే వస్తువు. రూపమే సారం.
ఈ వివరాలన్నీ నేను రాసే పద్ధతిని గురించి. కాని పద్ధతులన్నీ ఏదో ఒక గమ్యం కోసం వేసుకున్న తోవలు. నా పద్ధతులకి గమ్యం, నా రాతలకి పరమార్ధం ఏమిటి? ఈ చిక్కు ప్రశ్నకి సమాధానం చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా, రచయితగా నా జీవిత కాలం డబ్భై ఒక్క సంవత్సరాలు. చరిత్రలోనే మిక్కిలి పొడుగైన సాహితీ వ్యాసంగం నాది. ఈ డబ్భయ్యొక్క సంవత్సరాల్లోనూ పధ్నాలుగు పుస్తకాలు రాసేను, ఇంగ్లీష్ లోనూ, బెంగాలీ లోనూ. ఇంకా, వందలకొద్దీ వ్యాసాలు, రేడియో ప్రసంగాలూ రాసేను. రచయిత కంటే ఎక్కువగా పాత్రికేయుణ్ణా అనీ అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు? ఏ ప్రయోజనం కోసం? నా దేశ ప్రజలు ఈ ప్రశ్నకి వాళ్ళ సమాధానం ఏమిటో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పనే చెప్పేరు. వాళ్ళ దృష్టిలో నేను, జీవితంలో ఓడిపోయి, నిరాశ పడి, ఆ దేశం మీద కక్ష కట్టి, వాళ్ళనీ, వాళ్ళ జీవితాల్నీ, సంస్కృతినీ, నాగరికతనీ వెక్కిరించటం కోసమే రచనలు చేసేను. ఈ మాటే రక రకాలుగా అన్నారు. వాళ్ళు అన్న ముక్క నేనెప్పుడూ వాచా ఖండించలేదు.
నా మొదటి రచన మీద నా దేశ ప్రజలకి అంత ద్వేషం ఎందుకో నాకు మొదట్లో అర్ధం కాలేదు. Sir John Squire నా రాత ప్రతి చదివినప్పుడే ఇలా అవుతుందని జోస్యం చెప్పేడు. “ఈ పుస్తకం కనక అచ్చు వేస్తే ఇండియాలో పెద్ద గొడవై పోతుంది. నిరాద్ చౌదరి ఇంగ్లండ్ వెళ్ళి తల దాచుకోవాలి… ” అని. అలాగే జరిగింది. ఎంతో ఆలోచించేక భారతీయులు అంతలా ఎందుకు కోపగించుకున్నారో అర్ధం చేసుకున్నాను. పుస్తకాన్ని “భారతదేశంలో ఆంగ్లేయుల పాలన స్మృతికి” అని అంకితం ఇచ్చేనని చాలా మందికి కోపం. దాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేక. అది నిజానికి బ్రిటిష్ వాళ్ళ నిరంకుశత్వం మీద ప్రతిఘటన. నా తల్లితండ్రుల వ్యక్తిత్వాల్ని గురించి ఉన్నదున్నట్టు రాయడం నేను చేసిన రెండో తప్పు. భారత దేశంలో అమ్మా నాన్నల్ని గురించి, పెద్దవాళ్ళని గురించి పొగడ్తలే రాయాలి. చివరిగా, నేను రాసిన ఇంగ్లీషు అంత సులభంగా అర్ధం కాదు. నా మీద కోపానికి ఇది ఇంకో కారణం. అర్ధం కాని వాటిమీద చికాకే వేస్తుంది.
నన్ను విమర్శించే వాళ్ళకి నా చేతలతోనే జవాబు చెప్పేను. ఈ నాటికీ నా రాతల ద్వారా నా చుట్టూ జరిగే విషయాలతో మగ్నమౌతూనే ఉన్నాను. నా రచనే నేను చేసే పని. నేను రచనల పని వాణ్ణి. నేను చూసిన విషయాలు, అనుభవాలకి స్పందించి రాస్తూనే ఉన్నాను. ఈ మధ్య నా రచనల్లో సిద్ధాంత కర్తగా, ఛాందసునిగా మారుతున్నానని అన్నారు. ఈ మాట నేనే ఒప్పుకున్నాను. స్వభావో దురతిక్రమః అని అంగీకరిస్తున్నాను. నా చాదస్తానికీ పట్టింపుకీ ఏదో ఓ కారణం ఉంది. బైబిల్లో అన్నట్టు : “మీ దేహాల్ని నా ఆత్మతో స్పృశించి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాను. మీ పిల్లలు తరిస్తారు. మీ పెద్దలు కలలు కనటం నేర్చుకుంటారు. మీ యువకుల దృష్టి పదునెక్కుతుంది.”
అది. అంచేత నేను జర్నలిష్టుని కూడా కానని అనుకుంటాను. నేను ముఖ్యంగా ఒక బోధకుణ్ణి. “నా మేధస్సును జ్ఞానం కోసమే వాడుకున్నాను. జ్ఞానంతో తత్వానుభవంతో నా బుర్ర పండిపోయింది” అని అనుకున్నాను. నా అంచనాల్ని నా దేశ ప్రజలు నమ్మలేదు. ఇదంతా ఒట్టి వదరుడు లే అని కొట్టి పారేశారు. రూపంలో, స్థూల దృష్టికి అంతే కావచ్చు. కానీ, ఈ నా వాగుడులో నిజం లేకపోలేదు. ఆ ఉన్న నిజం తేటతెల్లం కాకపోలేదు. ధైర్యం మాట ఏమో గానీ నా రాతల్లో సాహసం లేకపోలేదు.
ఇక్కడితో నా రచనలకి నేనిచ్చుకుంటున్న సంజాయిషీ అయిపోయింది. ఈ నా నూరవ పుట్టినరోజు పూటా…..నవంబరు 23, 1996 న.
మాటే మంత్రము : రాజారావు ఇంటర్వ్యూ నుండి
మీరు ఎందుకు రాసేరు? రాయటం మీ వృత్తా, మీ ఆలోచనలూ అభిప్రాయాలూ పంచుకోడానికి ఒక త్రోవా, ధ్యానమా, లేక సమాజంలో మార్పు కోసం మీరు ఎంచుకున్న ఆయుధమా?
రాయటం నా ధర్మం. రచన ఒక సాధన. నేను రచయితని కావాలి అని ఆశించలేదు. దానంతట అదే వచ్చింది. అందుకే నేను చాలా తక్కువగా రాసేను. రాసిన పుస్తకాలు అనామకంగా ప్రచురించాలని అనుకున్నాను. కాని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఒప్పుకోలేదు. రాయటం నాకు ఒక రకమైన అర్చన (worship) వంటిది. అర్చకుడు అనామకంగా ఉండాలి.
మీరు ఇటీవల రాసిన పుస్తకం The Great Indian Way లో మీరు మళ్ళీ Kanthapuraలో ఆవిష్కరించిన నీతి, అంటే కర్మ ఆచరణ మార్గం వైపు మొగ్గినట్టు కనిపిస్తుంది.
Kanthapura కి వెనక్కి పోలేదు. The Great Indian Way కి వచ్చేను.
Kanthapura రాసిన ఇరవైఏళ్ళ తరవాత కదా Serpent and the Rope రాసేరు? ఈ ఇరవై ఏళ్ళల్లో మీలో కలిగిన మార్పులేమిటి?
ఎంతో కాలం ఎన్నో ప్రయాసలు పడ్డాక నా సద్గురువుని కలుసుకున్నాను. అక్కడితో నా స్వంత కధ ముగిసిపోయింది.
ఆ ఇరవై ఏళ్ళలోనే మన దేశంలో స్వాతంత్య్రం కోసం పోరాటం ప్తూౖరె, ప్రజాస్వామ్యం ఫలవంతం కావటం కోసం తపన మొదలయ్యింది. ఈ మార్పు ప్రభావం మీ రచనల మీద ఉందా?
నేను మొదటి నుంచీ గాంధేయ వాదిని. సేవాగ్రాం లో ఆయనతో కొంత కాలం ఉన్నాను. కాని నా అన్వేషణ తాత్వికము, ధార్మికమైనది, రాజకీయమైనది కాదు. ఆ తరవాత కొంత కాలం రమణ మహర్షి దగ్గర గడిపేను. ఆయన మహాత్ముడు, కాని నా గురువు కాదు. కేరళలో శ్రీ ఆత్మానందను కలియటంతో నా అన్వేషణ పూర్తయింది. నేను వెతుక్కున్నదీ అంతకు మించినదీ నాకు దొరికింది.
మీ రచనలు హైందవ ధర్మాన్ని గురించే అని అనుకుంటారు. మరి మీ రచనల్లో మార్క్సిజం గురించీ ఇతర మతాల్ని గురించీ చెప్పిన విషయాల సంగతి?
నాకు తారసిల్లిన, నేను దర్శించిన సత్యాన్నే అన్వేషించేను.
మీరు వివిధ మతాల మధ్య ఉన్న సంబంధాల్ని విస్మరించినట్టు అనిపిస్తుంది?
నా పని సత్యాన్ని కాంక్షించటం. పరమార్ధికమైన, నిరపేక్షమైన సత్యానికి తోవ వెదుక్కోవటం.
The Great Indian Way లో మళ్ళీ గాంధీజీ చెప్పిన మత పరమైన, ధర్మ బద్ధమైన ఆచరణ మార్గాన్ని, మతానికి ఉన్న సాంఘిక పార్శ్వాన్నీ నొక్కి చెప్తున్నారు. Kanthapura తర్వాత మళ్ళీ కొత్తగా ఆచరణ మార్గం మీద ఈ ఆపేక్ష ఏమిటి?
నాకు సాంఘిక సమస్యల మీద ఆసక్తి లేదు. రాయటం నాకు ఒక తపస్సు. నేను సత్యాన్ని అర్చించే ఒక మామూలు ఉపాసకుణ్ణి.
Salman Rushdie, Shashi Tharoor, Arundhati Roy వంటి రచయితలతో మీ సంబంధం గురించి చెప్తారా?
వాళ్ళ రచనలు ఎప్పుడూ చదవలేదు.
రాజకీయ ధర్మం (political correctness ) సాహిత్యంలో ఒక ముఖ్యమైన భాగం కాదా?
రాజకీయాలకి సాహిత్యంతో ఎలాటి సంబంధం ఉండకూడదు. శబ్ద బ్రహ్మను ఆరాధించటమే రచయిత, కవి విధి.
(మూలాలు : N.U. Abhilash, V.K. Shashikumar, Nirad Choudhuri, Rajarao, Sudhir Kumar, Kathleen Raine వెల్చేరు నారాయణ రావు గారికి కృతజ్ఞతలు.)