స్మృతి

“ఇప్పుడేం చెప్పమన్నావు. ఏభయ్యేళ్ళ కిందటి మాట. అప్పుడు లాహోర్‌ లో ఉన్నాను కదా Tribune కి సబెడిటర్‌ గిరీ. నాకు బాగా జ్ఞాపకఁవేను. మా ఎడిటరు ఆగష్ట్‌ ఏడునే ఊరొదిలి వెళిపోయేడు. మేం మెషిన్‌ మెన్‌, సబెడిటర్లఁవీ ఒక్క జూనియర్‌ స్టాఫ్‌ మాత్రం అక్కడే పేపరాఫీసు లోనే టిక్కిపోయేఁవు. పేపరాఫీసు లోనే కాపరాలు పెట్టుకుని రోజూ పేపరు మాత్రం ఆపీకుండా పబ్లిష్‌ చేసుకుంటూను. ఊళ్ళో ఎక్కడ చూడు ఎటేపు విను తుపాకీల మోతలు జనాల కేకలు కాల్చీసుకోడాలు. మా సెక్యూరిటీ గార్డ్‌ లు అప్పటికే ఊరొదిలీసి పారిపోయేరు విన్నావా?! నేనూ, మా స్పోర్స్ట్‌ కరస్పాండెంటూ వాళ్ళొదిలీసి పోయిన రైఫిల్సు చెరుకోటీ పుచ్చుకుని ఫ్రంటు పోర్చి మీద పెద్ద పైల్మేన్ల లాగ ఇటూ… అటూ…. ఇటూ… అటూ… మేఁవిద్దరం గస్తీలు! ఒరే నా జన్మలో ఎప్పుడూ తుపాకీ పట్టుకుని ఎరగను…. మీ తాత మేష్ట్రు! నేను… I am a bloody scribe ని. మా స్పోర్స్ట్‌ గాడా ఒట్టి చర్చి మౌస్‌ గాడు. ఉట్టినే ఎవడేనా చూసి లోపటికొచ్చీకుండాను. మొహాలు బిగదీసుకుని దొంగ గస్తీలు! ఆగష్టు పద్ధాలుగున మా బిల్డింగ్‌ ఎటాక్‌ చేసి నిప్పెట్టెస్తారని పుకారొచ్చింది. ఇంక లాభం లేదు ఇక్కడ్నించి తండా ఎత్తియ్యాలనుకున్నాఁవు. అవేళ్టి పేపరు మాత్రం గబ గబా రాత్తిరి తెల్లార్లూ గుద్దీసి ఆ పేపర్ల కట్టలు అక్కడే పడీసి తెల్లారి ఎనిమిదికి. పదిహేనో తారీకు తెల్లారి ఎనిమిదింటికి….ఒక పాత బొక్కి వన్నండాఫ్‌ టన్‌ పేపర్ల ట్రక్కుంటే అందరం అందులో రగ్గులు పరుచుకుని దాక్కున్నాఁవు. బాగా చీకటి పడీ దాకా ఆగి “జాయ్‌ భజరంగ భళీ!” అని బోర్డర్‌ వైపు. నేనూ, కర్మాకర్‌ గాడూ, హాతీ గాడూ…..మొత్తం పదకొండు మందిఁవి. మనం ట్రక్కు డ్రైవింగు! ‘ శర్మాజీ పే భరోసా రఖో ‘  అని వెర్రి వెధవలు నన్నే ఓ టార్జాన్న్ని చూసినట్టు చూసేరు. నా జన్మలో ఏనాడూ ట్రక్కు నడపలేదు. తుపాకీ పట్టుకోలేదు. అదెలాగో……దెయ్యం పట్టినట్టు! ”

“తోవ కడాకూ ‘ పాకిస్తాన్‌ జిందాబాద్‌! పాకిస్తాన్‌ జిందాబాద్‌ !!’   అనీసి కేకలు. ఇలాగ లాహోర్‌ బైట పడ్డాఁవో లేదో షాలిమార్‌ గార్డెన్సనీసి….అక్కడ లారీ ఆపీసేడు. లైసెన్స్‌ దిఖావ్‌ ! అన్నాడు. అప్పుడు ప్రొవిన్షియల్‌ గవర్నమెంటు పోలీస్‌ చీఫ్‌ కుర్బాన్‌ ఆలీ అనీసి. తురకాడేను. మా మీద్దయ తల్చిచ్చిన స్పెషల్‌ పెర్మిట్‌ ఉన్నాది. అది చూపిస్తే ఒదిలీసేడు. బతుకు జీవుడా మని ఇండియా పాకిస్తాన్‌ బోర్డర్‌ దెగ్గిర వాఘా అని… అక్కడ బోర్డర్‌ క్రాస్‌ చేస్సి అమృత్‌ సర్‌ వొచ్చి పడ్డాఁవు. అక్కడా….. సత్పాల్‌ పస్తాకియా అని కమ్యూనిష్టు లీడరు. అతను! మమ్మల్నీ, మా లాటి వాళ్ళే ఇంకెవళ్ళో మొత్తం ఏభయి మందిఁవి….ఒక ఫేక్టరీ డాబా మీద నులక మంచాలు వరాసగా వేయించేడు. అక్కడ పడి పడుకున్నాఁవు.”

“పొద్దుట్లేచి జలంధర్‌ వెళిపోయి టీ ఎల్‌ సోంధీ అనీసి మా జీఎమ్‌ వాడికి రిపోర్ట్‌ చేసేను. అక్కడా…జలంధర్‌ లోనా…. ఇరుకూ వాడనీసి ఎరుగుదువా? ఇరుకూ ఉమామేశం గారూ ఇరుకూ నరసప్ప గారనీసి…?”
“లేదు పెదనానా….నాకు తెలీదు!”

“ఇరుకూ వాడనీసి మనవాడే మా నాన్న స్నేహితుడి కొడుకు …. అక్కడ గార్మెంట్స్‌ దీన్లోను మంచి పొయిషన్లో ఉన్నాడు. వాళ్ళింట్లో నన్నుండమన్నారు. నాకు కట్టుకుందుకి బట్టల్లేకపోతే వాడివి రెండు చొక్కాలూ, ఫేంట్లూ, ఓ బొందు లాగులో రెండూ, రెండు పంచెలూ ఇచ్చేడు. శోషెత్తి పడిపోయేను. అక్కడ్నింఛి ఢిల్లీ వెళ్ళి…అక్కడ మా ట్రిబ్యూన్‌ వాడి గెష్టౌసు లోన ఒక నెల్లాళ్ళ పైనే ఉన్నాఁవు. ఒరే! ఆ బొక్కి ముష్టి వన్నండాఫ్‌ టన్‌ ట్రక్కులోనే ఇంత మందిఁవీను. ఎక్కడ లాహోరు? ఎక్కడి జలంధరు…. ఎక్కడ్ఢిల్లీ?! తోవ కడాకూ చూడూ…. ఉబ్బి పోయిన శవాలు. కాలవలంట పడవల్లాగ! ఇలాగ పంట కాలవలంట స్లోగా తేలుకుంటూను. వాట్నెవడూ పట్టించుకోలేదు.”

(మూలం :  జోగీందర్‌ బుటాలియా)