సంగీతం – సాహిత్యం
ఇంటినానుకొని ఉన్న చెట్టు
ఇంటితో గుసగుసగా
ఇలా చెప్పింది
“ఇద్దరు మనుషులు కలిసినప్పుడు
ఆత్మీయంగా మాట్లాడుకునే మాటల్లోంచి
నాకు సంగీతం వినిపిస్తుంది. మరి నీకు?”
“ఇద్దరు మనుషులు కలిసినప్పుడు కూడా
ఏమీ మాట్లాడుకోలేకపోవడం లోంచి
నాకు సాహిత్యం కనిపిస్తుంది”
ఇల్లు చెప్పింది
వెలుతురు
“ఈరోజు నీ ఆనందం
ఏ క్షణం వద్ద మొదలై ఉంటుంది”
అని అడిగింది
లేత సూర్య కిరణం పై కనురెప్పల మీద వాలి
“నిద్రలేచి కళ్ళు తెరుస్తూనే కనిపించిన
ప్రాణం లాంటి వెలుతురుని చూసిన క్షణంలో”
అని జవాబు ఇచ్చాను
….
“ఈరోజు నీ దుఃఖం ఏ క్షణం వద్ద
మొదలై ఉంటుంది”
అని అడిగింది మొదటి చంద్ర కిరణం
కింది కనురెప్పల మీద వాలి.
“ఇంత వెలుతురులో కూడా అప్పుడప్పుడూ
నేను కళ్ళు మూసుకొని ఎందుకు నడుస్తున్నాను
అన్న ఆలోచన కలిగిన క్షణంలో”
అని జవాబు ఇచ్చాను