పగలు ఒంటి గంట నుంచి రెండు దాకా మాకు లంచ్ టైం. మునుపు రెండున్నర దాకా ఉండేదని చెప్పుకుంటారు. అప్పట్లో పని మొదలయ్యే సమయం ఉదయం పదకొండుగా ఉండేది. పదకొండు గంటలకి ఆఫీసుకి రావాలంటే ఇంట్లో పదిన్నర, పావు తక్కువ పదకొండుకు భోజనం ముగించి, ఆఫీసుకి పదకొండున్నరకి వచ్చి చేరి, వెంటనే ఒంటి గంటకి టిఫినుకి బయలు దేరడం కాస్త అసాధ్యమైన విషయంగా ఉండి ఉంటుంది. అందు వల్లనే కాంటీన్లో రెండు గంటల ప్రాంతంలోనే అసలు రద్దీ ఉంటుంది. ఇప్పుడు ఉదయం పదకొండు గంటలని పదిన్నరగా మార్చి, పోయిన నెలనుంచి పది అని ఆర్డర్ వేసేశారు. లంచ్ బ్రేక్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు దాకా. సాయంత్రం ఐదు గంటలకి ముగిసే ఆఫీసును ఇప్పుడు ఆరు దాకా పొడిగించారు.
పని ఎప్పుడూ ఉండేదే. ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్లో వడ్రంగి పనులు చేసే వాళ్ళకి, ఎలెక్ట్రికల్, లాబొరేటరీ విభాగాలలో ఉండే వాళ్ళందరికీ ఎప్పుడూ రోజుకి ఎనిమిది గంటల పని. అలాగే అక్కౌంట్ డిపార్ట్మెంట్! వీళ్ళకి ఎక్కడ పని జరిగినా జరగక పోయినా సంవత్సరం పొడుగునా జమాఖర్చులు వ్రాస్తూనే ఉండాలి. ఆ తర్వాత టెలిఫోన్ ఆపరేటర్. టెలిఫోనుకి విరామం గానీ, సెలవు గానీ ఉండడానికి ఆస్కారం లేదు. అందువలన ఈ డిపార్ట్మెంటులకి చెందని వాళ్ళకి అప్పుడప్పుడూ ఆఫీసు సమయంలోనే విశ్రాంతి దొరుకుతుంది; రోజుల కొద్దీ, వారాల కొద్దీ, నెలల తరబడిగా. నాకు తెలిసి ఒకసారి మా స్టూడియోలో దాదాపు ఏడాదిన్నర దాకా సినిమా తీయలేదు. పద్దెనిమిది నెలలు పనేమీ చేయకుండా జీతం మాత్రం తీసుకుంటూ, ఆఫీసు సమయంలో బల్ల మీద కాళ్ళు ఎత్తి పెట్టుకొని నిద్ర పోతూ, జుట్టు తెల్లబడేటట్లు చేసుకుంటూ, బొజ్జని పెంచుతూ, మధుమేహం లాంటి రోగాలను ఆహ్వానిస్తూ, ఆలోచనలకు గమ్యం లేక చూపులు ఇష్టం వచ్చిన చోటికి వెళ్తూ, నోటికి హద్దూ పద్దూ లేనట్లు వాగుతూ…
ఏడాదిన్నర తర్వాత నిజంగానే పని దొరికినప్పుడు, నిర్భంద విరామానికి ఒక ముగింపు వచ్చినందుకు ఉత్సాహంతో పొంగిపోవాలి. అలా పొంగిపోయినా, పని చేసే అలవాటు తప్పి పోయినందువల్ల తడబాటు ఏర్పడవచ్చు. అటువంటి ఉత్సాహాన్నీ, తడబాటునీ ఈ రోజు, రేపు అంటూ మేము ఎదురు చూస్తున్న సమయంలో, ఒక పగటి పూట టిఫిన్, కాఫీలు ముగించి తాంబూలంతో పొగాకును ఆస్వాదిస్తున్న తరుణంలో అతను వచ్చి నిలబడ్డాడు.
“ఏం కావాలి?” శర్మ అడిగారు. శర్మ మునుపటి రోజుల్లో నిక్కర్లు వేసుకొన్న మనిషిలాగే కనబడతారు. పోలీసు సబ్ ఇనస్పెక్టరుగా పని చేసిన మనిషి. నాటకాలు, కథలు వ్రాసి కాస్త పేరు తెచ్చుకొని, మా స్టూడియోలో కథల విభాగంలో ముఖ్యమైన మనిషిగా ఎదిగారు. బంగారం లాంటి ఆ రోజుల్లో, మా యజమానిని తన మోటార్ సైకిల్ వెనకాల కూర్చోబెట్టుకొని, అవుట్ డోర్ లోకేషన్స్ సెలెక్ట్ చేసేవారు. ఇప్పుడు పంచెకట్టుతో పొగాకు నమలడానికి అలవాటు పడిపోయారు. ఆయన లేచి నిలబడితే మెడకి రెండు పక్కలా భుజాలు చెక్కినట్లుగా జారటం ఆయన ఒక కాలంలో వ్యాయామం చేసిన మనిషి అని తెలుస్తుంది.
చిన్న గది. అందులో చిన్నది, పెద్దవిగా పాత కాలపు బల్లలు మూడు. పెద్ద బల్లకి వెనకాల కూర్చున్న శర్మగారిని ఆ గదికి సభానాయకుడిగా పరిగణించాలి. మేము కూర్చుని ఉన్న కుర్చీలు కాకుండా ఇంకా ఒకటి ఎక్కువగా ఉంది. మావన్నీ వేరు వేరు రకాల కుర్చీలు. ఎక్కువ కుర్చీకి ఒక కాలు కాస్త పొట్టి. ఎవరు వచ్చి దాని మీద కూర్చున్నా, ఒక పక్కకి ఒరిగి కూర్చున్న మనిషిని ఒక క్షణం భయబ్రాంతులను చేస్తుంది. వచ్చినతను ఆ కుర్చీ యొక్క వెనక భాగాన్ని పట్టుకొని నిలబడ్డాడు.
“ఏం కావాలి?” శర్మ అడిగారు.
“శనివారం ఇంటికి వచ్చానండి,” అని అన్నాడతను.
“శనివారం నేను ఊళ్ళోనే లేనుగా?” అన్నారు శర్మ.
“ప్రొద్దున్నే వచ్చానండీ. మీరు కూడా ఒక గొడుగును రిపేరు చేస్తున్నారు.”
“ఓ! నీవా? వేలాయుదం కదూ?”
“కాదండీ. కాదర్. టగర్ పాయిట్ కాదర్.”
“నీవు మా ఇంటికి వచ్చావా ?”
“అవునండీ. నటరాజన్ చెప్పాడు, అయ్యగారిని ఇంటి దగ్గరపోయి చూడు అని.”
“ఏ నటరాజన్?”
“నటరాజన్ అండీ. ఏజెంట్ నటరాజన్.”
ఇప్పుడు శర్మగారికి కొంచెం అర్థం అయ్యింది. నటరాజన్ మా స్టుడియోలో పెద్ద పెద్ద గుంపులుగా సినిమా తీసేటట్లయితే వందల కొద్దీ ఆడవాళ్ళనీ, మగాళ్ళనీ పిలుచుకొని వస్తాడు. గుంపులో నిలబడడం తప్ప వాళ్ళ నుంచి నటన ఏదీ ఎదురు చూడక్కరలేదు. మనిషికి ఒక పూట భోజనం పెట్టి, నూరు రూపాయలు అని లెక్క. నటరాజన్ అందులో సగం తీసుకుంటాడు.
“ఇప్పుడు క్రౌడ్ సీన్ ఏమీ తీయడం లేదే?” అన్నారు శర్మ.
“తెలుసండీ. మిమ్మల్ని కలిస్తే ఏదైనా రోల్ ఇప్పిస్తారని ఆయన చెప్పారు.”
“ఎవరు చెప్పారు?”
“అదేనండీ. నటరాజన్ గారు.”
శర్మ మావైపు చూశారు. మేమిద్దరం అతని వైపు చూశాము. కాస్త పొట్టిగానే ఉన్నాడు. ఒక కాలంలో ఉక్కు మనిషిగా శరీరం ఉండి ఉంటుంది. ఇప్పుడు భుజాల దగ్గర ఎముకలు పొడుచుకొని వచ్చాయి. బాగా ఎత్తుగా ఉన్న చెంప ఎముకలు అతని చెంపలని మరింత లోతుగా కనిపించేటట్లు చేస్తున్నాయి. నటరాజన్ తీసుకొని వచ్చే మనుషులంతా దాదాపు ఇలాగే ఉంటారు. రామరాజ్యం గురించి తీసినా సరే సినిమాలో వచ్చే ప్రజలు ధాతు సంవత్సరానికి చెందిన వారి లాగానే ఉంటారు.
“నేను నటరాజన్ తో చెప్పి పంపిస్తాను,” అని అన్నారు శర్మ. మేము కుర్చీలో వెనకాలకి జారగిలబడి కూర్చున్నాము. ఇంటర్వ్యూ అయిపోయింది. అతను “సరేనండీ” అన్నాడు. తరువాత సన్న గొంతుతో, “వెంటనే ఏదైనా చూసి ఇప్పించారంటే బాగా ఉంటుంది సార్,” అన్నాడు.
“షూటింగ్ ఇంకా ప్రారంభించ లేదయ్యా. గుంపు సీనులన్నీ ఆఖర్నే కదా తీస్తారు.”
“అది కాదండీ. రోల్ ఏదైనా ఇప్పించండీ.”
“నీకు ఏ రోల్ ఇప్పించడం? అదిగో కాస్టింగ్ అసిస్టెంట్ ఉన్నారు. ఆయన దగ్గర నీ వివరాలన్నీ ఇచ్చి వెళ్ళు.”
నేనే కాస్టింగ్ అసిస్టెంట్. ఇప్పుడు వచ్చినతనిలాగా చాలా మంది పేరు, వయసు, ఎత్తు, చిరునామా లాంటి వివరాలను నోట్ చేసి పెట్టుకుంటాను. అవసరం వచ్చినప్పుడు, నలుగురికి ఉత్తరం రాస్తే మూడు తిరిగి వచ్చేస్తాయి, చిరునామాదారుడు ఇల్లు మారి పోయాడని. ఆ తర్వాత మళ్ళీ నటరాజన్ నిర్వాకమే. కానీ అతను నా వైపు తిరగలేదు. మా ముగ్గురిలో శర్మగారు చాల ముఖ్యమైన మనిషి అని అతను అభిప్రాయానికి వచ్చేసినట్లున్నాడు.
“మీరు చూసి ఒక మాట చెప్పారంటే పని జరుగుతుంది.” అన్నాడు.
“నీకు ఈత వచ్చా?” శర్మ అడిగారు.
“ఈతనా?” అని అతను మళ్ళీ అడిగాడు. తరువాత, “ఏదో కొంచెం వచ్చండి.” అన్నాడు.
“కొంచెం తెలిస్తే సరిపోదు. ఒక మనిషి పైనుంచి నదిలో దూకి ఈదుకుంటూ వెళ్తున్నట్లు ఒక సీన్ తీయాల్సి ఉంది. కానీ దానికి నువ్వు సరిపోవు.”
“నాకు టగర్ పాయిట్ వచ్చండి. నా పేరే టగర్ పాయిట్ కాదర్ అండీ.”
“టగర్ పాయిట్! అంటే ఏమిటీ?”
“టగర్ పాయిట్ అండీ. టగర్… టగర్ తెలుసు కదా?”
ఇప్పుడు మేమందరమూ శ్రద్ధగా చూశాము. ఎవరికీ అర్థం కాలేదు.
అతను అన్నాడు. “పులి అండీ. పులి… పులి పాయిట్.”
“ఓ! టైగర్ ఫైట్. టైగర్ ఫైట్! నువ్వు పులితో పోరాడుతావా?”
“లేదండీ. పులి వేషం వేస్తానండీ. దానినే టగర్ పాయిట్ అంటారు కదండీ.”
“పులి వేషగాడివా నువ్వు? పులివేషాలన్నీ సినిమాకు ఎందుకు? పులి వేషమా? సరే సరే. నటరాజన్ రానీ. ఏదైనా ఛాన్స్ ఉంటే తప్పకుండా కబురు పంపిస్తాను.”
“నేను బాగా టగర్ పాయిట్ చేస్తానండీ. నిజమైన పులిలాగే ఉంటుంది.”
“నిజమైన పులికి, నిజంగానే పులిని తీసుకొని రావచ్చు కదయ్యా.”
“అది కాదండీ. నేను చేసేది నిజమైన పులిలాగే ఉంటుంది. ఇప్పుడు చూస్తారా?”
“అబ్బే, వద్దు. వద్దు.”
“ఊరికే చూడండి సార్. మీరంతా పులి వేషాన్ని ఎక్కడ చూసి ఉంటారు?”
“మొహరం పండగకో, రంజాన్ పండగకో వీధి వెంట పులి వేషం వేసుకొని వెళ్తుంటారుగా?”
“మనది వేరే లాగా ఉంటుందండీ. నిజమైన పులిలాగే ఉంటుంది.”