మొన్న మూలప్పేట సెంటర్లో
నిన్న ప్రొద్దున డైకస్ రోడ్డు మీద
పొద్దెక్కింతర్వాత జండా ఈది మసీదు కాడా
సాయంత్రం రావిచెట్టు సెంటర్లో
ఆరడుగులుందంట, పచ్చటి వొంటిమీద
నల్లటి చారలతో నిగనిగలాడిపొతుందంట
యెర్రగా రక్తంవొడుతున్నట్టుందంట నోరు
ఇక తోకుందంట చూడు బారెడు పొడుగున యెటుపక్క తిరిగితే
అటుపక్క జనం యెగబడతా వుండారంట
శేతులు రెండూ ముందుకు పెట్టి, వూగతా అది అడుగులేస్తుంటే
పిలకాయలు జడుసుకోని చడ్డీల్లోనే ఉచ్చలుపోస్తుండారంట
ఇక జజ్జనక, జజ్జనక మని డప్పు కొడుతుంటే అది
నాలుక్కాళ్ళమీద ఊగిపోతా నిమ్మకాయని కసుక్కుమని
కొరకతుంటే మగోళ్ళక్కూడా గుండెలో కలుక్కుమంటుందంట
ఆడొళ్ళకైతే చవటకి జేకట్లు తడిసిపోతుండాయంట
ఈ పచ్చని రంగు పెయింటు మీద నిగనిగ లాడే నల్లని చారలు
చవట రంధ్రాలు మూసుకపోయి చిటమటలాడే ఈ చర్మం క్రింద
పొద్దనెప్పుదో తిన్న సద్ది రగలేసిన చితికుల మంటని
రగిలిస్తున్న నాలుగు పేకేట్ల కాపుసారా వేడికి తక్కువే ఐనా
జర జర పరిగెత్తుతున్న నాలుగు దోసిళ్ళ రక్తం
గుండె నిండకపోయినా మండుతుందికదా – అది చాలదా
బెబ్బుల్ని ఆవాహనచేసి మనసు నింపుకోడానికి
ఈ నవరాత్రుల రోజుల్లో పెద్దపులైపోడానికి
వో లీటర్ కిరోసిన్ తో పులి కరిగిపోతుంది
మెకం మేకై ఏ ఏనాది సుబ్బడుగానో, చాంద్‌భాషా గానో మిగిలిపోతుంది
నిన్నటి పులి కోరలు చాస్తూ కడుపుని రగిలిస్తూ
కడుపులోనో, కళ్ళలోనో, కట్టుకున్న దాని గుండెలోనో
కడుపున పుట్టిన బిడ్డల కంఠంలోనో
ఆకలిగా, ఆర్తిగా, కన్నీళ్ళాగా, కడుపుమంటగా మిగిలిపోతుంది
మరో అక్టోబరొస్తుంది, మళ్ళా పులి మనసుకెగబాకుతుంది